కళాంజలి

త భాళా’.. పరంజ్యోతి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కె.పరంజ్యోతి గారు ప్రఖ్యాత తబలా విద్వాంసులు. దాదాపు 75 సంవత్సరాలు సంగీతానికే అంకితమై, ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలిచ్చారు. అమెరికాలో నలభై ఏళ్లు నివసించి, ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. పండిట్ రవిశంకర్, హరిప్రసాద్ చౌరాసియా, సంతూర్ శివకుమార శర్మ, లక్ష్మీశంకర్, జి.ఎస్.సచ్‌దేవ్, వసంతరాయ్, నిఖిల్ బెనర్జీ వంటి ఎంతో గొప్ప కళాకారుల ప్రదర్శనలలో తబలా వాయించారు. మొహమ్మద్ రఫీ, తలత్ మెహమూద్, మహేంద్రకపూర్ వంటి సినీ గాయకుల ప్రదర్శనల్లో పాల్గొన్నారు. వీరికి ప్రపంచవ్యాప్తంగా వందల మంది శిష్యులు, ప్రశిష్యులు ఉన్నారు. వీరి జీవిత భాగస్వామి నిర్మల మంచి గాయని. వీరి అబ్బాయి ప్రశాంత్ తబలా విద్వాంసుడు, గాయకుడు, రంగస్థల నటుడు. కోడలు కూచిపూడి నర్తకి. మనవరాలు మాయాదేవి సంగీతంలో, నృత్యంలో, రచనలో నిష్ణాతురాలు. కుటుంబం మొత్తం కళాసేవకే అంకితమైనారు. పరంజ్యోతి అమెరికాలో ఫేర్‌వౌంట్ కెమికల్స్ వైస్‌ప్రెసిడెంట్‌గా రిటైరయ్యారు. మంచి గాయకులు కూడా.
వారితో ముఖాముఖి ఇలా....
* * *
మా అమ్మానాన్నగార్లు కె.వి.రమణారావు, శ్రీమతి కృష్ణవేణి. నేను ఫిబ్రవరి 5, 1934న మద్రాస్‌లో జన్మించాను. భారత స్వాతంత్య్రం రాక మునుపు 1940 దాకా లాహోర్‌లో పెరిగాను. తరువాత నాగపూర్‌లో కొన్నాళ్లు ఉన్నాం. 1947లో వైజాగ్‌కు వచ్చాను. అప్పుడు నాన్నగారికి పరాలటిక్ స్ట్రోక్ వచ్చింది. మాది చాలా పెద్ద కుటుంబం. మేం అన్నదమ్ములం పెద్దక్కయ్య పిల్లలు అంతా కలిసి 11 మంది పిల్లలం కలిసి పెరిగాం. గాంధీగారు మరణించినప్పుడు నాన్నగారికి తీరని బాధ, వ్యధ కలిగింది. వారంలోనే ఫిబ్రవరి 7న నాన్నగారు ఆ బాధతోనే పోయారు. తరువాత కాకినాడ వెళ్లాం. అక్కడ తబలాతో పరిచయం ఏర్పడింది. మా అన్నయ్య స్నేహితుడు డా.ట్రాసీ మా ఇంటిలో తన తబలా ఉంచాడు. అప్పుడు అలా మొదలైన తబలాతో ప్రేమ ఇంతింతై వటుడింతై అని విశ్వరూపం దాల్చింది. తరవాత పెండ్యాల సూర్యనారాయణగారు, ఎ.ఎల్.ఎన్.శాస్ర్తీగారు, నిడమర్తి సత్యనారాయణ గారి వద్ద తబలా నేర్చుకున్నాను.
ఎ.వి.ఎన్. కాలేజీ, వైజాగ్‌లో బిఎస్సీ చేశాను. ఆంధ్రా యూనివర్సిటీలో కెమికల్ ఇంజనీరింగ్. అప్పుడే కళాకుంజ్ కళాసంస్థతో పరిచయం. అక్కడ 48 ప్రదర్శనలు చేశాను. తలత్ మెహమూద్, పర్వీన్ సుల్తానాలతో పాటు కచేరీల్లో పాల్గొన్నాను. ఆ రోజుల్లోనే ఆర్.బి.కౌశల్ - శ్రీ దీప్‌చంద్ గారితో పరిచయం ఏర్పడింది. వారు నేవీలో పనిచేసేవారు. వారి శిష్యుడినయ్యాను. ఇద్దరం రోజూ ఐదారు గంటలపాటు తబలాతో కూర్చునేవాళ్లం. వారు తరువాత మా చెల్లెలు సుమతిని పెళ్లి చేసుకున్నారు. సుమతీ కౌశల్, ఉమా రామారావు ప్రఖ్యాత నర్తకీమణులు, నా చెల్లెళ్లు. ఉమా రామారావు శిష్యురాలినే మా అబ్బాయి వివాహం చేసుకున్నాడు. ఆంధ్రా యూనివర్సిటీలో కెమికల్ ఇంజనీరింగ్, ఎం.టెక్ ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాను. తరువాత ఐఐఎస్‌సి బెంగుళూరు యుజిసి స్కాలర్‌షిప్‌తో పిహెచ్.డి. మొదలుపెట్టాను. ఆ రోజుల్లో 450 రూపాయలు నెలకి వేతనం ఇచ్చేవారు. అప్పుడే ఖరక్‌పూర్‌లో ఉద్యోగం రావడంతో పిహెచ్.డి వదిలేశాను. తర్వాత బొంబాయి వెళ్లాను. అసలు బొంబాయి వెళ్లిందే, నేను ఉస్తాద్ అమీర్ హుస్సేన్ ఖాన్ గారి వద్ద తబలా నేర్చుకోవడం కోసం. వీరు దీప్‌చంద్ గారి గురువు కూడా. నేను కూడా ఆయన వద్ద తబలా నేర్చుకోవడం మొదలుపెట్టాను.
1961-67 వారి వద్ద నేర్చుకున్నాను. నా వివాహం ఫిబ్రవరి 6, 1965లో జరిగింది. తరువాత హైదరాబాద్ వచ్చాం. ఐడిపిఎల్ సింథటిక్ డ్రగ్స్‌లో ఉద్యోగం మొదలుపెట్టాను. 1970లో యుఎస్‌ఏ వెళ్లాం. అక్కడ 40 ఏళ్లు ఉన్నాం. మొదట్లో ఉద్యోగం దొరకలేదు. వియత్నాం యుద్ధం నేపథ్యంలో, నిక్సన్ ఆ రోజుల్లో అమెరికా ప్రెసిడెంట్. చాలా బాధలు పడ్డాను. చిన్నచిన్న పనులు చేయాల్సి వచ్చింది. 1971లో తబలా ప్రదర్శనలివ్వడం, నేర్పించడం మొదలుపెట్టాను. అమ్మాయిలు కూడా నేర్చుకునేవారు. ముఖ్యంగా నాకు శిష్యులు అమెరికనే్ల. 1973లో ఫెయిర్‌వౌంట్ కెమికల్స్‌లో సూపర్‌వైజర్‌గా ఉద్యోగం మొదలుపెట్టాను. ఇది న్యూజెర్సీలో ఉంది. 1997లో వైస్‌ప్రెసిడెంట్ (మాన్యుఫాక్చరింగ్)గా రిటైరయ్యాను.
ఇక పూర్తిగా కళాసేవకే అంకితమయ్యాను.
2001లో ‘్థంకింగ్ తబలా’ సీడీ వెలువరించాను. ఇది తాళం, లయ, జ్ఞానంతో ఉన్న ఏకైక సీడీ. ప్రపంచంలో ఇలాంటిది మొట్టమొదటిసారిగా ఒక ఎన్‌సైక్లోపిడియా లాగా చేశాను. అందరూ మెచ్చుకున్నారు.
యుఎస్‌ఏ, యూరోప్, లండన్, జర్మనీ, ఫ్రాన్స్, బెహమాస్.. ఇలా ఎన్నో దేశాలు పర్యటించాను. నా వయసు 85 ఏళ్లు. ఇప్పటికీ రోజూ తబలా అభ్యాసం చేస్తాను. వార్థక్యం వల్ల ప్రదర్శనలు తగ్గించాను. మా అబ్బాయి ప్రశాంత్ యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో పది సంవత్సరాల పాటు తబలా నేర్పించాడు. ప్రశాంత్ కూడా మంచి గాయకుడు, రంగస్థల నటుడు.
మన కళలు నేర్చుకోవాలి. కాపాడుకోవాలి. ప్రతిరోజూ అభ్యాసం చేయాలి. కళలను నేర్చుకొని, కాపాడుకోవడంతో మన భారతీయ సంస్కృతి ముడిపడి ఉంది.

-డా. శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి