కళాంజలి

వస్త్రాలకు వనె్నలద్దిన నాగయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ భారతీయ నృత్యానికైనా ఆంగికం, వాచికం, సాత్త్వికం, ఆహార్యం అని నాలుగు అభినయాలు ఉంటాయి. నర్తకీమణులు, నర్తక రత్నాలు ఎంతో బాగా నృత్యం చేసి, హావభావాలతో ప్రేక్షకులను అలరించినా, ఆహార్యం అంటే మంచి వస్తధ్రారణ చాలా ముఖ్యం. ఆ విధంగా జీవితాన్ని నృత్య ఆహార్యానికి అంకితం చేసిన గొప్ప కళాకారుడు శ్రీ నాగయ్యగారు. 1949 ఫిబ్రవరి నాలుగున నెల్లూరు జిల్లా మైపాడు గ్రామంలో పుట్టి, బాల్యంలోనే దుస్తులు కుట్టడం నేర్చుకున్నారు. శ్రీ బొద్దుకూరు సీతారామయ్య, తస్కాని కృష్ణయ్యగార్ల వద్ద శిష్యరికం చేసి, తరువాత 1972లో చెన్నైలో నాటి సినీ యూనియన్ అధ్యక్షుడిగా ఉన్న శ్రీ ఎం.జి. నాయుడుగారి వద్ద అనేక చలన చిత్రాలకు వస్త్రాలంకరణలో అసిస్టంటుగా ప్రతిభ చూపారు. తరువాత పద్మభూషణ్ డా. వెంపటి చినసత్యంగారి వద్ద ఎన్నో సంవత్సరాలు పని చేశారు.
తరువాత శ్రీమతి బాలా కొండలరావుగారి ప్రోత్సాహంతో నర్తకీమణులకు వస్త్రాలు కుట్టేవారు. తరువాత హైదరాబాద్‌కు వచ్చారు. పద్మశ్రీ డా. శోభానాయుడుగారి ప్రోత్సాహంతో వారి కూచిపూడి ఆర్ట్ అకాడమీలో స్థిరపడి, వారు రూపొందించిన శ్రీ కృష్ణపారిజాతం, కళ్యాణ శ్రీనివాసం, మేనకా విశ్వామిత్ర, ఛండాలిక, విప్రనారాయణ, విజయోస్తు తేనారి, స్వామి వివేకానంద, సర్వం సాయిమయం, సంభవామి యుగేయుగే, జగదానంద కారకా, శ్రీకృష్ణశరణం మమ, క్షీరసాగర మథనం, నవరస నటభామిని.. మొదలైన ఎన్నో నృత్య రూపకాలకు ఇంద్రధనుస్సులోని రంగులన్నీ తీసుకుని కన్నుల పండువగా వస్త్రాలను కుట్టి సమకూర్చారు. ప్రదర్శనలు విజయవంతం కావడానికి, నాగయ్యగారి చేతితో కుట్టిన దుస్తులు ఎంతో ముఖ్యం. రంగస్థలంపై ప్రదర్శన చప్పట్లతో మోగాలంటే, శ్రీనాగయ్యగారే డాన్స్ కాస్ట్యూమ్ కుట్టాలి!
శ్రీనాగయ్యగారు ఎంతోమంది గొప్ప కళాకారులకు నృత్యానికి సంబంధించిన వస్త్రాలకు అలంకరణ చేశారు. అందులో కొంతమంది.. డాక్టర్ పద్మశ్రీ శోభానాయుడు, పద్మభూషణ్ స్వప్నసుందరి, పద్మభూషణ్ రాజా-రాధారెడ్డి, పద్మశ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మ, డా. పద్మజారెడ్డి, శ్రీకళాకృష్ణ.. ఇలా ఎంతోమంది నర్తకీమణులకు, నర్తకులకు, వారి శిష్యులకు శ్రీ నాగయ్యగారు డాన్స్ కాస్ట్యూమ్స్ కుట్టారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వీరిచే ఎం.ఎ. విద్యార్థులకు ఆహార్య రూపకల్పన అంశంపై సోదాహరణ ప్రసంగాన్ని ఏర్పాటుచేశారు. ఒక ఫొటో చూసి అంచనాతో కూడా చక్కగా కుట్టగలరు వీరు. ‘శ్రీ శివమానస సరోవరం’ అనే కళాసంస్థను ఊపిరి పోశారు శ్రీ నాగయ్యగారు. కపటం లేని మంచి మనస్సు, కృషి, పరోపకారం, నిరాడంబరత, ఉదార స్వభావం, అజాత శత్రుత్వం.. ఇలా వీరికి ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి. శ్రీ నాగయ్యగారికి ఎన్నో దేశాల్లో క్లయింట్లు, కస్టమర్లు ఉన్నారు. వీరిచే నృత్యానికి వస్త్రాలను కుట్టించుకున్నవారు యు.ఎస్.ఎ., లండన్, ఆస్ట్రేలియా, రష్యా, జపాన్, మారిషస్ మొదలగు ఎన్నో దేశాల్లో ఉన్నారు. అట్లాంటాలోని శశికళగారికి ఇంగ్లీషు బాలేకి అవసరమైన వస్త్రాలు కుట్టారు నాగయ్యగారు. తెరపై, రంగస్థలంపై కళాకారులకి ఎంతో గుర్తింపు వస్తుంది.. తెర వెనుక కళాకారులని కూడా ప్రభుత్వం గుర్తిస్తే బాగుంటుంది అంటారు వీరు. తెర వెనుక కళాసేవ చేసేవారికి కూడా ప్రభుత్వ పురస్కారాలు, సంగీత, నాటక అకాడమీ అవార్డులు వస్తే బాగుంటుంది అంటారు నాగయ్యగారు. వీరికి ముగ్గురు అమ్మాయిలు.. శోభారాణి, శోభాదేవి, సాయి మానస.. నాగయ్యగారు అన్ని దేవీ దేవతల పాత్రలకు వస్త్రాలు సమకూరుస్తారు. శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, శివుడు, రాక్షసులు, బ్రహ్మ, పార్వతి, ఆండాళ్, లక్ష్మీదేవి, సీత.. ఇలా అన్ని పాత్రలు వీరి చేతిలో జీవం పొందుతాయి. తన జీవితాన్ని కళాసేవకి అంకితం చేశారు నాగయ్యగారు. అలా చేస్తేనే కళ రాణిస్తుంది అంటారు వీరు. ప్రతిభ, వ్యుత్పత్తి, క్రమశిక్షణ, అన్నింటికంటే సహృదయత ఉండాలి అన్నారు నాగయ్యగారు. ఎందుకంటే ఆహార్యం ఇతర కళాకారులతో పనిచేసి, వారిపై ఆధారమైనది. అందరితో కలిసిపోయి టీం వర్కు ఉంటేనే రాణిస్తామని అంటారు ఆయన.

-డా. శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి