కళాంజలి

వనె తగ్గని ‘చింతామణి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంతో ప్రతిభావంతుడైన రచయిత కాళ్లకూరి నారాయణరావు. సంఘ సంస్కరణ, సామాజిక స్పృహ, భావోద్వేగం, చక్కని కథనం గలవారు వీరు. ఎన్నో కథలు, నవలలు, ప్రహసనాలు, విమర్శలు రాశారు. కాళ్లకూరి నారాయణరావుగారు 28.4.1871లో బంగారు రాజు, అన్నపూర్ణమ్మల పెద్ద కుమారుడిగా పశ్చిమగోదావరి మత్స్యపురిలో జన్మించారు. తెలుగు, ఆంగ్లం బాగా చదువుకున్నారు. ఈయనపై కందుకూరి వీరేశలింగం పంతులుగారి సంఘ సంస్కరణ ప్రభావం బాగా పడింది. ఈయన సోదరి గంటాలమ్మకు 7 సంవత్సరాల వయసులో వివాహం, బాల్యంలోనే వైధవ్యం అయ్యాయి. మళ్లీ ఆమెకు పెళ్లి చేయమని తండ్రిని కోరారు. తండ్రి నిరాకరణతో, ఈయన ఇల్లు విడిచి వెళ్లిపోయారు. ఆంజనేయుడి భక్తుడు కాబట్టి మొదటి కుమారుడికి ఆంజనేయుడని పేరు, దక్షిణామూర్తి మంత్రోపాసన చేసే వారు కాబట్టి రెండవ కుమారుడికి దక్షిణామూర్తి అని పేరు పెట్టారు. మంచి భోజన ప్రియుడు, నాట్య శాస్త్రంలో పాండిత్యం కలవారు వీరు. శ్రీకృష్ణ కర్ణామృతం శ్లోకాలు అభినయం చేసి, చూపేవారు.
నారాయణరావుగారి కుమార్తె కాంచనమాల. ఈమె కుమారుడు ప్రఖ్యాత చలనచిత్ర నిర్మాత వై.వి.రావు. నారాయణరావు గారి మూడవ కుమారుడు సదాశివరావు. ప్రఖ్యాత చలనచిత్ర దర్శకులు. చింతామణి నాటకాన్ని 1933లో పులిపాటి వేంకటేశ్వర్లు, దాసరి రామతిలకంతో అదే పేరుతో సినిమాగా తీశారు. తరువాతి కాలంలో ఎన్టీఆర్, భానుమతి, జమున తారాగణంగా మళ్లీ ‘చింతామణి’ సినిమా వచ్చింది.
సాంఘిక సమస్యలు: ఆ రోజుల్లో మధుసేవ- వరకట్నం - వరవిక్రయం - భోగంమేళాలు సాంఘిక సమస్యలుగా ఉండేవి. ఈ సమస్యలు ప్రతిబింబించేట్లు కాళ్లకూరి నారాయణరావు గారు రచించిన ‘చింతామణి’ నాటకం ఈనాటికీ ప్రదర్శిస్తూనే ఉన్నారు. సామాజిక స్పృహ ఉన్న నాటకం ఇది. వేశ్యాలోలుడైన బిల్వమంగళుడి గాథ. ఇతడు ఎలా శ్రీకృష్ణ సాక్షాత్కారం పొంది తరిస్తాడన్నది కథ. అయితే ఇది లీలాశుకుడి జీవిత గాథ. లీలాశుకుడే, బిల్వమంగళుడు. ఇతడే శ్రీకృష్ణ కర్ణామృతం రాసి తరించిన మహాభక్తుడు.
లీలాశుకుడు 11-14వ శతాబ్దాల మధ్య జీవించిన వాగ్గేయకారుడు. ఇతనే బిల్వమంగళుడు. చింతామణి అనే వేశ్య వ్యామోహంలో పడి, భార్య రాధను గురించి పట్టించుకోవడం మానేశాడు. చింతామణి వ్యామోహంలో ఇల్లూ వొళ్లు గుల్ల చేసుకుని సంపదలను హారతి కర్పూరంలా కరగబెట్టాడు. వరదలో శవాన్ని పట్టుకుని ఈదుకుంటూ నది దాటి, తాడనుకుని పాముని పట్టుకుని ఎక్కుతూ వెళ్లాడు. ఇది కబీర్‌దాసు కథకు చాలా దగ్గరగా ఉంది. గొప్పవారి కథలు ఎంతవరకు నిజమో, ఎంతవరకు కల్పితమో చెప్పడం కష్టం. వాస్తవికత- కల్పన కలగాపులగం అవుతాయి. కొన్ని వందల సంవత్సరాల క్రింద ఏం జరిగిందో ఎవరు చూసొచ్చారు? అయితే పాము అనగానే నాకు రజ్జు సర్పభ్రాంతి గుర్తుకు వస్తుంది. ఇది అతని అజ్ఞానానికి సంకేతం. కామక్రోధ లోభా మోహములు వదిలి, లీలాశుకుడు శ్రీకృష్ణుడి పాదపద్మములను ఆశ్రయించాడు. ఆ భావోద్వేగంలో శ్రీకృష్ణ కర్ణామృతం సంస్కృతంలో రచించాడు. అది అనేక భాషలలోకి అనువదింపబడింది. ఇతను ఏ దేశం వాడో నిర్దిష్టంగా, నిర్దుష్టంగా తెలియడం లేదు. తెలుగువాడే అని కొందరు, గౌడ దేశం వాడని కొందరు అంటున్నారు. ఇక్కడ భక్తుడు జీవాత్మ, శ్రీకృష్ణుడు పరమాత్మ. ఇది జీవేశ్వర అనుసంధానం. ఇదే శ్రీకృష్ణ కర్ణామృతం! శ్రీకృష్ణ కర్ణామృతంలో మొదటి ఆశ్వాసం.
చిన్తామణి ర్జయతి సోమగిరి ర్గురుర్మే
శిక్షాగురుశ్చ భగవాఙ్ఛఖిపింఛ వౌళిః
యత్పాద కల్పతరు పల్లవ శేఖరేషు
లీలా స్వయంవర రసం లభతే జయశ్రీ
అర్థం: ఓం నమః శ్రీ మల్లక్ష్మణాచార్యాదిభ్యో మహాద్భ్యో గురుభ్యః. భక్త్భీష్ట ఫలప్రదుడు, యోగీశ్వరుడు, ఆశ్రీత చింతామణికి జయము. నా గురుదేవుడైన సోమగిరికి జయము. నా ఇహపర శ్రేయమార్గ సంధాత శ్రీకృష్ణ స్వామికి జయము. ఈయన నెమలి పింఛాన్ని శిగలో పెట్టుకుని, కల్పవృక్షం లేత చిగురుటాకులు వంటి పాదపద్మములు కలవాడు. ఆయన పాదములు ఆశ్రయించిన వారిని మోక్షం వరిస్తుంది.
విశేష అర్థం: మంగళ అన్నా జయ అన్నా ఒకటే. బిల్వఫలం అన్నా శ్రీ్ఫలం అన్నా మారేడు ఫలం అన్నా ఒకటే. కాబట్టి జయశ్రీ అంటే ఇక్కడ బిల్వమంగళుడు అని అర్థం.
సినిమాగా: చింతామణి సినిమాగా యండమూరి భద్రాచార్యులు బిల్వమంగళుడి వేషంలో వచ్చింది. మళ్లీ ఎన్టీఆర్ బిల్వమంగళుడిగా, భానుమతి చింతామణి, జయమున రాధగా వచ్చింది. శ్రీకృష్ణుడుగా ఈలపాట రఘురామయ్యగారు బాగా పేరు తెచ్చుకున్నారు. ఇందులో ఎస్వీఆర్ కూడా నటించారు.
నాటకంగా: చింతామణి చాలా ప్రఖ్యాతమైన సాంఘిక స్పృహ ఉన్న నాటకం. దీనిని ఎంతోమంది గొప్ప కళాకారులు వేశారు. ఆ రోజుల్లో స్థానం నరసింహారావు ఇంకా బందా కనకలింగేశ్వరరావు బిల్వమంగళుడిగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. సిఎస్‌ఆర్ భవానీ శంకరం పాత్రలో వొదిగిపోయారు. రేబాల రమణ చాలా అందంగా ఉండేవారు. ఇది 1940 ప్రాంతం మాట. విజయవాడలో విజయలక్ష్మి కూడా బాగా పేరు తెచ్చుకుంది ఈ నాటకంలో. చింతామణిగా బుర్రా సుబ్రహ్మణ్య శాస్ర్తీ, ఇందిర, సుభాషిణి, రామలక్ష్మి ఎంతో ప్రఖ్యాతి చెందారు. బిల్వమంగళుడి భార్య రాధ పాత్రకి జమునా రాయలు పేరు తెచ్చుకున్న నటి. పులిపాటి వేంకటేశ్వర్వులు బిల్వమంగళుడు, భవానీ శంకరుడు రాయబారంలో అర్జునుడు పాత్రలకు ప్రసిద్ధి గాంచారు. వీరు తెనాలికి చెందినవారు. శ్రీహరి పాత్రకు సూరవరపు వేంకటేశ్వర్లు, పిఎల్‌ఎన్ శర్మ, ఆకుల వేంకటేశ్వర్లు ఎంతో పేరు తెచ్చుకున్నారు.
ఇప్పుడు హైదరాబాద్‌లో సుబ్బరాజుగారు శ్రీహరి పాత్రకు చాలా ప్రఖ్యాతి. సుబ్బిశెట్టి పాత్రలో 1940 ప్రాంతంలో గండికోట జోగినాథం, అరవపల్లి సుబ్బారావు - నరసరావుపేట చాలా ప్రఖ్యాతి గాంచారు. ఆధునికంగా బిల్వమంగళుడిగా అయ్యదేవర పురుషోత్తమరావు, అక్కిరాజు సుందర రామకృష్ణ ఎంతో పేరు పొందారు. చింతామణిగా రామలక్ష్మి, సుభాషిణి చాలా పేరు తెచ్చుకున్నారు. భవానీ శంకరుడిగా కొట్టే వేంకటాచార్యులు చాలా ప్రసిద్ధి. సుబ్బిశెట్టి పాత్ర ఒక కులాన్ని అవహేళన చేసినట్లుగా ఉందని, ఈ పాత్రని తీసివేయాలని ఆ మధ్య ఒక ఉద్యమం బయల్దేరింది. ఈ పాత్రను తీసేస్తే హాస్యరసం పోతుంది. ఈ పాత్రకి సుబ్బరాజు ఎంతో పేరు తెచ్చుకున్నారు.
ఒక విషయం గమనించాలి ఇక్కడ. లీలాశుకుడు (బిల్వమంగళుడు) కథ విప్రనారాయణ కథకి చాలా దగ్గరగా ఉంది. విప్రనారాయణ కూడా దేవదేవి అనే వేశ్య వలలో పడి, తపోభంగం చెందిన ఒక యోగివరశ్రేష్ఠుడు. తమిళ మహాగ్రంథం శిలప్పాదిగారం కూడా ఇదే బీజం. వేశ్య వలలో పడి భార్యను మరిచిపోయిన వాని కథ అది. మృచ్ఛకటికం కూడా వసంతసేన అనే వేశ్యను ప్రేమించిన చారుదత్తుడి గాథ. ఇది శూద్రకుడు రాసిన సంస్కృత నాటకం. ఆనాటి దేశ కాల పరిస్థితులను తన నాటకంలో ప్రతిబింబించాడు శూద్రకుడు. ఏది ఏమయినా వేశ్య ప్రధాన పాత్రగా ఎన్నో కథలు, నవలలు, నాటకాలు వచ్చాయి. సారంగపాణి అనే వాగ్గేయకారుడు సామాన్య వేశ్యను తిడుతూ, అవే పద్యములు కార్వేటినగర వేణుగోపాల స్వామికి అంకితమిచ్చాడు. శరత్‌చంద్ర ప్రఖ్యాత బెంగాలీ రచయిత. దేవదాసు (తన జీవితం నుండి స్ఫూర్తి చెందిన నవల)లో చంద్రముఖి అనే వేశ్యకు నివాళి అర్పించాడు. ఇది అతని ని జీవితంలో కాళీ అనే వేశ్యకు ప్రతిబింబం. గురుదత్ అనే హిందీ దర్శక నిర్మాత, నటుడు ‘ప్యాసా’ సినిమాలో వేశ్యకు నివాళి అర్పించాడు. కొంతమంది కళాకారులు వేశ్యలకు ఉత్తమ స్థానం కల్పించారు, కొందరు అణచివేశారు. కాదేదీ కథ కనర్హం.

-డాక్టర్ శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి