కళాంజలి

వెన్నె తగ్గని శరత్‌జ్యోత్స్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన భారతదేశం గర్వించే రచయిత శరత్‌చంద్ర. వీరు బెంగాలీ రచయిత అయినా, వీరి నవలలు, కథలు అన్ని భాషలలోకి అనువదింపబడ్డాయి. వీరు సెప్టెంబర్ 1876లో హగ్లీ దేవానందపూర్‌లో జన్మించారు. వీరి తల్లిదండ్రులు భువల మోహిని, మోతీలాల్. తోబుట్టువులు అనిలాదేవి, ప్రకాశ్, ప్రభాస్, సుశీల. వీరి జీవితం సారా, నల్లమందు, ప్రేమానే్వషణ సత్యానే్వషణలో గడిచిపోయింది. ఇతడే దేవదాసు కదా! మానవుడిలో కనిపించే భగవంతుడినే మానవుడు ఎందుకు తిరస్కరిస్తాడు? అని సత్యాన్ని అనే్వషించేవాడు శరత్‌బాబు. చిన్నప్పటి నుండి కూడా అతనికి వయసుకు మించిన అనుభవం, దుఃఖ నిర్వచనం, బహుశ కటిక దారిద్య్రంలో పెరగటం వల్ల వచ్చిందేమో!
చిన్నప్పుడు శరత్‌బాబుకి పొడవైన జుట్టు ఉండేది. ‘రవీంద్రుడు కావాలనుకుంటున్నాడు’ అని వెక్కిరించేవారు. కాని డబ్బులేక కేశ ఖంఢనం చేయించలేదని ఎందరు గుర్తించారు? నాటకాలలో వేయడం ఆ రోజుల్లో నిషిద్ధం. అందుకు ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవలసి వచ్చేది. శరత్ ఆడ, మగ పాత్రలు ఎంతో బాగా వేసేవాడు. అలీబాబాలో ముస్త్ఫాగా, బంకించంద్ ‘మృణాళిని’లో నాయికగా వేసేవాడు. తన జీవిత స్మృతులను ‘శ్రీకాంత్’లో రాసుకున్నాడు. తల్లి ప్రేమామయి, తండ్రి ఎందుకూ పనికిరాని ఇల్లరికపుటల్లుడు, పలాయనవాది. తండ్రి అస్థిరత శరత్‌కు వచ్చింది.
ఆ రోజుల్లో పాములు ఎక్కువగా ఉండేవి. ప్రతి ఇంట్లో ముంగిస ఉండేది. శరత్ కూడా ప్రాణప్రదంగా ఒక ముంగిసని పెంచేవాడు. ఒకరోజు అది ఒక పాముని చంపి, శరత్ ప్రాణరక్షణకు దోహదం చేసి రుణం తీర్చుకుంది. 1896లో పబ్లిక్ పరీక్షకు ఫీజు కట్టడానికి డబ్బుల్లేక చదువుకు దూరమయ్యాడు. ఎప్పుడూ చంచల స్వభావం, మనస్సులో అశాంతి, ప్రవర్తనలో అస్థిరత. ఇతను, సాహసి, దుస్సాహసి, నిరుపేద, నిరాశ్రయుడు, తాగుబోతు, తిరుగుబోతు. చిన్నప్పుడు అతని ప్రేమ ఫలించలేదు. దాని ఫలితమే దేవదాసు, బడదీదీ రచనలు. చిన్ననాడు అతని ప్రేమ ఫలించి ఉంటే వ్యక్తిగతంగా అతనికి సంతృప్తి మిగిలినా, ఇంతటి గొప్ప రచయిత అవలేక పోయేవాడేమో! ప్రేమ అనే క్షీర సాగర మథనంలో పుట్టిన హాలాహలం తను మింగి, రసామృతాన్ని ప్రపంచానికి పంచాడు శరత్. ఇతను మంచి చిత్రకారుడు, గాయకుడు. ఈయన గీసిన చిత్రాలు గృహ దహనంలో బూడిదయిపోయాయి. ‘మహాశే్వత’ మాత్రం మిగిలింది. ఎక్కడ ఉందో? తబలా, హార్మొనీ, వేణువు, తీయగా వాయించేవాడు. ఇతనికి ఆత్మవిశ్వాసం తక్కువ. అందుకని తెర వెనుక నుండి పాడి, ముఖ్య అతిథిని కూడా కలిసేవాడు కాదు. పాడటం కూడా అస్థిరత వల్ల మెల్లగా మానివేశాడు. తన కుక్క ‘ఖేలీ’ అంటే పిచ్చిప్రేమ. అది చనిపోయినప్పుడు, సొంత కొడుకు చనిపోయినట్లు ఏడ్చాడు. గృహ దహనంలో చరిత్రహీనులు, స్ర్తి జాతి చరిత్ర అనే దీర్ఘన్యాసం, వీరి పెయింటింగ్స్ దగ్ధమై పోయాయి. మళ్లీ చరిత్ర హీనులు రాశారు కాని, స్ర్తి జాతి చరిత్ర రాయలేదు. పెయింటింగ్ జోలికి వెళ్లలేదు. 1913లో బాల్యమిత్రుడు విభూతి భూషణ్‌కు బంగారు కలం చేయించి పంపాడు. తన స్నేహితులందరికీ ‘పెన్ను’ బహూకరించేవాడు.
ఆ రోజుల్లో శరత్‌కు నోబుల్ బహుమతి వస్తుందని వార్తలు వచ్చాయి. రవీంద్రుడు అప్పటికే నోబుల్ పురస్కారాన్ని గ్రహించాడు. కాని శరత్‌బాబుని మాత్రం రవీంద్రుడు నోబుల్‌కి సిఫారసు చేయలేదు. ఎందువల్లనో? రవీంద్రుని తన గురువుగా భావించేవాడు శరత్. ‘ఎలాంటి దురవస్థలో సైతం మనిషిని ద్వేషించరాదు. చెడుగా కనిపించేవారని సంస్కరించే ప్రయత్నం చేయాలి. ఇది చాలా పెద్ద పని’ అనేవాడు శరత్. యుక్త వయసులో శాంతితో వివాహం జరిగింది. ఒక శిశువు కూడా జన్మించింది. కానీ, ఆ దాంపత్య సుఖం రెండేళ్లు కూడా మిగలలేదు. ప్లేగు మహమ్మారి శాంతిని, బిడ్డను పొట్టన పెట్టుకుంది. ఈయన జీవితమంతా ఒక ఉద్దేశ రహితమైన, దిశాహీన యాత్ర. తరువాత వివాహం గాంధర్వ పద్ధతిలో హిరణ్మయితో జరిగింది. జీవితం మారాకు వేసింది. రోజూ 10 లేదా 12 గంటలు చదివి, రెండు గంటలు రాసేవాడు. కుక్క ఖేలీ అతని ఆరు నెలల కష్టం ‘మాలిని’ వ్రాతప్రతిని చింపేసింది. మళ్లీ దానిని రాయలేదు శరత్‌బాబు. ప్రమథుడికి రాసిన ఉత్తరంలో ‘ప్రమథా! ఒక అహంభావ విషయం. క్షమిస్తానంటే చెబుతాను. ఒక్క రవీంద్రుని మినహాయిస్తే నాలాగా మంచి కథను, నవలను ఎవరూ రాయలేరు.’
22 ఆగస్టు 1913 తన మామ ఉపేంద్రనాథుడికి ఇంకా స్పష్టంగా రాశాడు. ‘నాకంటే ఎక్కువ తెలిసిన మర్మజ్ఞుడు రవీంద్రుడు. అతడు తప్ప మరొకడు లేడు. నేను గర్వపడుతున్నానని అనుకోకు. కాని ఇది నా పరిపూర్ణత్వం కావచ్చు. గర్వమూ కావచ్చు. నా అభిప్రాయం మాత్రం ఇదే!’
ఆ రోజుల్లో రవీంద్రుని ఇంట్లో సమావేశాలు జరిగేవి. ఎందువల్లో ప్రతిసారి అక్కడ ఎవరివో బూట్లు మాయం అయ్యేవి. ఒకరోజు శరత్‌బాబు కొత్త జోళ్లు వేసుకువెళ్లాడు. కొత్త జోళ్లు పేపర్లో దాచి చంకలో జాగ్రత్త పరిచాడు. రవీంద్రుడు ‘శరత్ చేతిలో ఆ పేకెట్ ఏమిటి?’ ‘ఏదో పుస్తకం’ రవీంద్రుడు - ‘ఏ పుస్తకం? బహుశా పాదుకా పురాణమా?’ శరత్ అవాక్కయ్యాడు కాని, అందరూ నవ్వేశారు.
శరత్ ప్రమథునికి రాసిన లేఖలో ‘మర్మాంగాలను విప్పి ఎవ్వరికీ చూపరు నిజమే! కానీ గాయపడ్డ అంగాలని చూపరా? గాయాలని నయం చేసే డాక్టర్ ఇవన్నీ పట్టించుకుంటాడా? సౌందర్య సృష్టిని మినహాయించి రచయిత గాయాలను కూడా చూడాలి. అది నయం చేయడానికి గాని, భయభీతిని కలిగించడానికి’ రచయిత వ్యక్తిగత జీవితం, రచనా జీవితం రెండూ ఒకటికావు అనేవాడు.
16 జనవరి 1938, అద్వితీయ రచయిత శరత్‌బాబు చనిపోయారు. కవికి వ్యక్తిత్వం ముఖ్యం అని విమర్శకులు అంటారు. మహా కవుల విషయంలో అది నిజమే! ఐతే శరత్ పాత్రలు శ్రీరామచంద్రులు కాదు. ఆయన కథనంలో, మథనంలో సామాజిక స్పృహలో నుండి ఆవిర్భవించిన వాస్తవ కుసుమాలు. వాటికి కళారూపాన్ని సంతరింపచేశాడు. అంటే ఆదర్శవాదానికి, యధార్థ వాదానికి సిద్ధాంతకంగా జరిగే సంఘర్షణలో శరత్ పాత్రలు వాస్తవానికి, సహజత్వానికి సన్నిహితంగా ఉంటాయి. అదే ఆయన విజయం, పరాజయం కూడా!

-డా. శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి