కళాంజలి

పుస్తకాలే శరత్ ఆప్తమిత్రులు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శరత్‌చంద్ర ఒక యుగం, ఒక హిమపర్వతం, ఒక గంగానది. ఈయన రాసిన నవలలు దేశ, కాలములను అధిగమించి సర్వవ్యాప్తమైనాయి. అనగా త్రికాలా బాధితం. వీరు 15, సెప్టెంబర్ 1876 దేవానందపూర్, హుగ్లీలో జన్మించారు. వీరి బాల్యం నిరంతరం గర్భదారిద్య్రం, పరాశ్రయంలోనే గడిచిపోయింది. ఇతని తల్లిదండ్రులు భువనమోహిని, మోతీలాల్, అక్క అనిల, తమ్ముళ్లు ప్రకాశ్, ప్రభాస్, చెల్లెలు సుశీల (సుశీల పుట్టినప్పుడే తల్లి చనిపోయింది) వీరి నవలలో నాయికలు ఎంతో మనోధైర్యం కలిగి ఉంటే వీరి నాయకులు దుర్బలమై, చంచల స్వభావులు. వీరి జీవితం సత్యానే్వషణ, గోసాయిల మఠాలు, (సారా) మత్తుపానీయాలు, నల్లమందులో గడిచిపోయింది. వీరు బెంగాలీ రచయిత అయినా వీరి పుస్తకాలన్నీ వివిధ భాషల్లోకి అనువదింపబడ్డాయి. దేవదాసు, బాటసారి (బడదీదీ), తోటికోడళ్లు (నిష్కృతి) అందరి హృదయాలని దోచుకున్నాయి. దేవదాసు రాసినప్పుడు శరత్ వయస్సు కేవలం 17 ఏళ్లు. ఇతని బాల్యపు ముచ్చటలే ఇందులో రాసుకున్నాడు. చిన్ననాటి స్నేహితురాలు ధీరు దేవదాసులోని ‘పారు’ ‘కాళిదాసి’ అనే నర్తకి దేవదాసులో చంద్రముఖి.
‘దేవదాసు మంచి రచన కాదు. మంచిదే కాదు. నేను ఆ రచన అంటే సిగ్గుపడతాను’ అని 25.6.1913 రాసుకున్నాడు. తాగుబోతులూ, తిరుగుబోతులూ, అందరూ ప్రేమకు, క్షమకు అర్హులే!! వీరి ‘అభిమాన్’ నవల చదివి ఎవరో శరత్‌ని చంపడానికి వెళ్లాడు. బెంగాల్ నవజాగరణ వైతాళికుడు రాజా రామ్మోహన్‌రాయ్, మధ్యాహ్న మార్తాండుడు బంకించంద్రుడు, రవీంద్ర సాహిత్యంలో బెంగాల్ పరిణతి చెందింది. రవీంద్ర యుగంలో శరత్‌బాబు ఉజ్వల నక్షత్రం. బంకింలో దైవోపాసన రవీంద్రునిలోని అతీంద్రియ అనుభూతి ఉన్నాయి. కానీ శరత్ భూధూళినే మహిమాన్వితం చేశాడు. అతడు బెంగాలీ వాడుక భాషను సాహిత్య భాషగా స్వీకరించాడు. తద్వారా అతడు తన నిరంకుశ హృదయ పరిచయాన్ని ఇచ్చాడు. అతని యధార్థ వాదంలో యదార్థంతోపాటు, సంవేదన, కరుణా హృదయ స్పర్శ కూడా ఉన్నాయి.’ బంకిం, రవీంద్రుడు, శరత్ తమ తమ స్థానాల్లో అద్వితీయులు, అనివార్యులు. సాహిత్య సంప్రదాయాల గొలుసులలో వీరు ఒకరికొకరు కలిసే ఉన్నారు.
శరత్ ఒకే విషయాన్ని ఎన్నిసార్లు చెప్పేవాడో, అన్నిసార్లు దాని రూపం మార్చి చెప్పేవాడు. ‘అదేంటి? నిన్న ఇదే విషయం మరో రకంగా చెప్పావు కదా?’ అంటే, వెంటనే కోపం వచ్చి, ‘సంఘటన నాది, దాన్ని నా ఇష్టం వచ్చినట్టు చెప్పుకునే అధికారం నాకుంది’ అనేవాడు. మిత్రులు ప్రేమతో ‘న్యాడా’ అని పిలిచేవారు. రవీంద్రుని శరత్ ఎల్లప్పుడు తన గురువుగా భావించేవాడు. ఎన్నోసార్లు అభిప్రాయ భేదాలు వచ్చేవి. దూషణ భూషణ పరిస్థితీ వచ్చింది. కాని చివరకు ఉభయుల ప్రతిభను, వారు వారి స్థాయి ఔన్నత్యాల కనుగుణంగా గుర్తించాడు. శరత్ షష్ఠిపూర్తి స్వయంగా రవీంద్రుడు అక్టోబర్ 1936న ఏర్పాటు చేశాడు. రవీంద్రుడు ‘శరత్! నీవు నీ జీవిత చరిత్ర రాయి’ అంటే, అప్పుడు శరత్ ‘గురుదేవా! నేనిలా గొప్పవాణ్ణి అవుతానని తెలిసి వుంటే మరో రకంగా బతికేవాణ్ణి’ అన్నాడు. ‘శ్రీకాంత్ మీ జీవిత చరిత్ర అంటారు నిజమేనా?’ అని ఎవరో ప్రశ్నించారు. ‘నవల రాసేటప్పుడు ఎవరూ తన సొంత కథలు యధాతథంగా రాయరు. అలాగే తనని వదిలేసిన తర్వాత కూడా ఏదీ సార్థక సృష్టి కాదు’. శ్రీకాంత్‌లో ఇంద్రుడు ఇతని బాల్యమిత్రుడు రాజేంద్రనాథుడు. అన్నదా దీదీ సజీవ మూర్తియే! పాములు పట్టే మృత్యుంజయుడు ఇతని మిత్రుడు. శ్రీకాంత్‌లో లాగానే ఇతను తుపాకీతో పిట్టలు కొట్టేవాడు, స్మశానాలలో తిరిగేవాడు, పాట పాడే బాయి ఇతన్ని ఇంటికి వెళ్లిపొమ్మంది. రంగూన్‌కు ఓడలో వెళ్లడం, అంతా ఒక జర్నలుగా రాసుకున్నాడు. బర్మా జీవితం మీద ‘్భరతి’ ప్రత్యేకంగా రాశాడు.
ఒకటి రెండుసార్లు బందిపోటు ముఠాల్లో చేరినట్లు వార్తలు వచ్చాయి. అతని సాహసాన్ని బట్టి అది వాస్తవం కావచ్చు లేదా అతని సాహస గాథల్లో ఇది కల్పితం కావచ్చు. అతను రంగూన్‌లో ఉన్నప్పుడు భారతిలో ‘బడదీదీ’ (తెలుగులో బాటసారి ప్రఖ్యాతం) సీరియల్‌గా రచయిత పేరు లేకుండా వచ్చింది. అందరూ రవీంద్రుడిది అనుకున్నారు. తరువాత అసలు రచయిత శరత్‌బాబు అని తెలిసింది. ఇతను ప్రేమించిన నిరుపమ బాల్య వితంతువు. ఆమెయే బడదీది. మరొక విఫల ప్రేమ! మరొక కావ్యసృష్టి! చిన్నతనమంతా స్కూలు ఫీజు కట్టలేని బీదరికం, కేశ ఖండకు కూడా డబ్బుల్లేని గర్భదారిద్య్రం అనుభవించాడు. అతని కటిక దారిద్య్రం, పరాధీన దుస్థితి ‘శుభద’లో కనిపిస్తుంది. ఇతని తండ్రి మోతీలాల్ పనికి రానివాడు. శుభదలో హరాన్ బాబులా పలాయనవాది. 1895లో తల్లి చనిపోయింది. ఆమె కోమలత్వం, త్యాగం, వాత్సల్యానికి ప్రతీక. ఈమెయే నారాయణం, విశే్వశ్వరి, హేమాంగిని, బిందు, ఇతని తల్లి పాత్రలు ఈయన తల్లికి నివాళి. ఈ విధంగా తల్లి రుణం తీర్చుకున్నాడు. సంస్కరణలు సృష్టించిన జాతీయ భావాలు, దేశభక్తి, స్వాతంత్య్ర కాంక్ష, సాంఘిక సంస్కరణలు, మానసిక స్వేచ్ఛ, భావ విప్లవం, బెంగాల్ సాంఘిక జీవనాన్ని ఒక ఊపు ఊపుతున్న రోజుల్లో శరత్ యవ్వనంలోకి అడుగుపెట్టాడు. ఇతను తన ‘చరిత్రహీనులు’లో సతీశుడిలా వేణువు, సారంగము, హార్మోని, తబల వాయించడంలో నేర్పరి. ఇతనికి ఆత్మవిశ్వాసం తక్కువ, తెర వెనుకే నిలబడి పాడేవాడు. ఎప్పుడూ మనసులో అశాంతి, చివరికి ఇతని అస్థిర స్వభావం కారణంగా పాట కూడా బీడు అయింది. ఇంత బాగా పాడేవాడిని మిత్రులు, ప్రజలు మరచిపోయారు.
ఈయన నిరీశ్వరవాది. ప్లేగు బాధితులకు ఎంతో సేవ చేసేవాడు. తాగుబోతు, తిరుగుబోతు కాబట్టి అతను బహిష్కృతుడు, బంధువులు అతడిని స్వీకరించేవారు కాదు. శిష్టుల ముందు అతను చరిత్రహీనుడు. ఈ పెద్ద మనుషులంటే శరత్‌కి కోపం. అందువల్ల నిమ్నవర్గాల వైపు ఆకర్షితుడైనాడు. జంతు బలులు వ్యతిరేకించేవాడు. మైనా, కుక్క, మేక వంటి జంతువులను పెంచేవాడు.
లైబ్రరీయే అతని ఇల్లు, పుస్తకాలు అతని ఆప్తమిత్రులు. టాల్‌స్టాయ్ అతని అభిమాన రచయిత. ‘అనా కెరినీనా’ కనీసం 50సార్లు చదివాడు. డికెన్స్ అంటే ఇతనికి ప్రేమ. యజ్జేశ్వర మేస్ర్తి కూతురు శాంతిని పెళ్లి చేసుకున్నాడు. తాత్కాలికంగా అతని అశాంతిని దాంపత్య జీవితం కొంత మూలకు నెట్టింది.
-మిగతా వచ్చే సంచికలో

-డా. శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి