కళాంజలి

కళలోనే దైవత్వం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి మన తెలుగువారి మణిమయ కిరీటం. తరతరాలుగా ఈ నృత్యానికే అంకితమయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వీరు నటరాజస్వామి ముద్దుబిడ్డలు. ఎన్నో జన్మల పుణ్యం వల్ల నృత్యం నేర్చుకుంటాము, నేర్పిస్తాము. మన సంప్రదాయ నృత్యాలన్నీ భగవంతుని పాదాల నుండి పుట్టి, తిరిగి భగవంతుని పాదాలకే ‘నృత్యం సమర్పయామి’ అనే పూజావిధానంలో అర్పించబడతాయి. భారతీయ నృత్యాల పథం, గమ్యం భక్తియే!
ఇలాంటి సంప్రదాయ కూచిపూడిలో జన్మించిన వారు - యేలేశ్వరపు వేంకటేశ్వర్లు. వీరు గద్వాలలో ఉంటున్నారు.
ఈయన కీ.శే.వై.వి.జి. కృష్ణమూర్తి, బాలాత్రిపురసుందరి దంపతులకు 14, ఆగస్టు 1968న జన్మించారు. వీరు సోషియాలజీలో బి.ఏ. చేసి, తరువాత పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, లలిత కళాపీఠం, హైదరాబాద్‌లో 2015లో ఎంపిఎ కూచిపూడి చేశారు. గత ముప్పై సంవత్సరాలుగా నృత్యాన్ని నేర్పిస్తూ ఎంతో పేరు తెచ్చుకున్నారు.
నాట్యాచార్య, నాట్యమయూరి, నాట్య కళాప్రవీణ, నాట్య శిరోమణి, నాట్యవిజ్ఞాన్, నాట్య కళాసామ్రాట్ వంటి ఎన్నో బిరుదులు, సన్మానాలు లభించాయి. అన్నింటికంటే ముఖ్యమైన గౌరవం ప్రేక్షకుల మెచ్చుకోలు, నా శిష్యుల అభిమానం అంటారాయన.
వారితో ముఖాముఖి...
ఆయన మాటల్లోనే....
ఈ రోజులలో చదువు చాలా ముఖ్యం. చదువుతోపాటు నాట్యం కూడా నేర్చుకున్నాను. నృత్యంలో ఎం.ఏ. చేశాను. నాట్యంలో స్థిరపడ్డాను. చిన్నప్పుడు మా పెద్దలు మొదట ఆసనాలు, అడుగులు, జతులు, నృత్యాంశాలు అలా వరుస క్రమంలో నేర్పేవాళ్లు. ఈ కాలంలో ఇలా నేర్పటం లేదు. చాలామంది రెండు నెలల్లో రంగస్థలం ఎక్కిస్తున్నారు. అది పర్‌ఫెక్ట్‌గా ఉండటంలేదు.
ఇప్పుడు ఇంత పేరు వచ్చిందంటే గురువులు నేర్పిన క్రమశిక్షణ.
కళను కళగా చూడండి. అందులో దైవత్వాన్ని చూడండి. వ్యాపారం చేయవద్దు. అదే మంచి పేరు, భవిష్యత్తుని ఇస్తుంది.
మా గురువులు వేదాంతం సత్యన్నారాయణ శర్మగారు, వేదాంతం రత్తయ్యశర్మగారు, మహంకాళి శ్రీరాములు శర్మగారు. వీరు ముగ్గురితో నాటకాలను ప్రదర్శించటం నా అదృష్టం. అలాగే సినీనటుడు మోహన్‌బాబుగారి శ్రీ విద్యానికేతన్ (రంగంపేట, చిత్తూరు జిల్లా)లో నాట్య అధ్యాపకునిగా మూడు సంవత్సరాలు పని చేశాను. వారు ‘కలెక్టర్’ సినిమా ఫంక్షన్‌లో నటులందరి మధ్య శాలువాతో సత్కరించటం మరువలేనిది. ఆ సినిమాలో ఒక పాటకు క్లాసికల్ నృత్యానికి కొరియోగ్రఫీకి కూడా అవకాశం ఇచ్చారు. ‘గోదావరి పొంగింది’ సినిమాలో అసిస్టెంట్ డాన్స్ డైరెక్టర్‌గా చేశాను. ఇవన్నీ గుర్తుండే సంఘటనలు. 2016 జూన్‌లో లండన్, ఇటలీ, థాయ్‌లాండ్, ఐలాండ్, ఫ్రాన్స్ దేశాలలో తెలుగు అసోసియేషన్ ద్వారా అనేక నృత్య ప్రదర్శనలు ఇచ్చాము. కూచిపూడి నృత్యానికి ఎంతో ఆదరణ లభించింది. లండన్‌లో జరిగిన నృత్య ప్రదర్శనకు సినీ నటుడు పవన్‌కళ్యాణ్ వచ్చారు. ప్రదర్శనను మెచ్చుకొని అభినందించి సన్మానించటం జరిగింది.
నేను ఎంతో కష్టపడి పైకి వచ్చాను. నా తమ్ముడు డా.ఏలేశ్వరపు శ్రీనివాసులు, సోదరి దర్బా రమాదేవి సహకారం ఎంతో ఉంది.
ఎవరైనా సంప్రదాయానికి విలువ ఇవ్వవలసిందే. చివరికి మిగిలేది మన సంస్కృతి, సంప్రదాయాలైన నాట్యం, సంగీతాలే.

-డా. శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి