సాహితి

భాషా ప్రామాణికత నేటి ఆవశ్యకత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవిగా, పండితునిగా, పరిశోధకునిగా, అధ్యాపకునిగా సాహిత్యలోకంలో సుప్రసిద్ధులు. 87 ఏళ్ళ వయస్సులోనూ ఆయన రచనా దాహం తీరలేదు... రోజుకు ఐదారు పేజీలయినా చదువకుండా, రాయకుండా ఉండలేని ఆయన పట్టుదల యువతరానికి సదా స్ఫూర్తిదాయకం. పురాణేతిహాసాలు, ప్రబంధ కావ్యాలనుండి కాకుండా జానపద గ్రామీణ ఇతివృత్తాల్ని స్వీకరించి నవ్య ప్రబంధ రీతి కవిత్వం రాశారు. వీటిలో సమకాలీనతని ప్రతిబింబించారు. మూలమెరిగి గ్రంథ పరిష్కరణ చేసిన కొద్దివారిలో వీరొకరు. సృజనాత్మక పరిశోధనా పాండిత్యం జమిలి చిరునామా వీరు. ప్రాచీన గ్రంథ పరిష్కరణలో అందె వేసిన చేయి. ఓనాడు ‘్భరతి’ పత్రికలో వీరి రచన పడని సంచికలు తక్కువ. వార్ధక్యం వీరి వెంటే ఉన్నా అది ఆయన సాహిత్య సంకల్పం ముందు వాలిపోయిన నీడే.
విశ్వవిద్యాలయాల కావల, నగరాల ఛాయ పడని పాలమూరు జిల్లా నాగర్‌కర్నూలులో ఉంటూ తానే ఒక సాహిత్య కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ కవి, రచయిత డా. కపిలవాయి లింగమూర్తి గారితో ఒకరితో ఒకరు.
==================
మీరు కృషిచేసిన సాహిత్య ప్రక్రియల గురించి వివరించండి...
మా తాతగారి తండ్రి కాలంనుంచే మా ఇంట్లో పెద్ద గ్రంథాలయం ఉండేది. మా మేనమామ గారైన పెద్ద లచ్చయ్య గారికి సాహిత్యంలో ప్రవేశం ఉండేది. వారి సాహచర్యంవలన నాకు రచనా వ్యాసంగం, సాహిత్యం అబ్బింది. నాకు ఏ పద్యమైనా పాఠమైనా ఒకసారి కంఠతా చదవగానే వచ్చేది. నేను పదునాలుగవ యేట మొట్టమొదట పాటలు రాశాను. తర్వాత పద్యాలు వ్రాయడం మొదలు పెట్టాను. వ్రాసిన మొదట పద్యం మా మేనమామగారికి చూపించగా ఆయన బాగుందన్నాడు. దానితో నేను వ్రాయడం ప్రారంభించినాను. నేను సాహిత్యంలోని ఇంచుమించు అన్ని ప్రక్రియలలో కృషి చేశాను - పద్యం, గద్యం, గేయం, వచనాలు, శతకం, కథ, నవల, కావ్యం, ద్విపద, నాటకం, చరిత్ర, ఉదాహరణం బాలసాహిత్యం, సంకీర్తనం, బుర్రకథలు, హరికథలు, సంకలనం, అనువాదం, పీఠికలు రాసే అవకాశం లభించింది. వానిలో 80 ముద్రితాలు, 30 అముద్రితాలు ఉన్నాయి.
మీరు రాసిన శతకాల్లో ఇతరులు చెప్పని వినూత్నత ఏమిటి...?
నేను 13 శతకాలు వ్రాసినాను. ప్రతి శతకంలో ఓ కొత్తదనం ఉంది. పాండురంగ శతకం ఏకప్రాస, ఏకవృత్తాత్మకం. తిరుమలేశ శతకం ధ్వనిపూర్వకమైన అధిక్షేపశతకం. భర్గ శతకంలో అన్ని పాదాలలో ఒకే యతి ఉంటుంది. దుర్గ శతకం స్ర్తివాచకమైన ఆటవెలదిలో స్తుత్యాత్మకంగా అలంకారాలను వివరించాను. సాయి త్రిశతి అని మూడు గేయ శతకాలు. ఇవి మూడు మూడు రకాల ఛందస్సులతో - షిర్డి సాయి రామరామ శతకం, పర్తిసాయి శతకం, భజగోవిందం పద్ధతిలో, ప్రేమ సాయి శతకం తోహర పద్ధతిలో కూర్చినాను. సుందరీ సందేశం స్ర్తి వర్ణనాత్మకమైన నిర్మకుట శతకం. ప్రాచీన కావ్యాల్లో ఉండే స్ర్తి వర్ణనలన్నీ సీస పద్యాలుగా కూర్చినాను.
అన్నింటికంటే చెప్పదగింది ఆర్యా శతకం ఇది చిత్ర పది. ఇదో ప్రత్యేకమైంది. దీనిలోని శబ్ద చిత్రమే ఆ పదం చెప్పే అర్థాన్ని వ్యంజిస్తుంది. ఈ శతకాలలో వచ్చిన నూరు పద్యాలు వచ్చిన చిత్రం మళ్లీ రాకుండా ఉంటాయి. ఇట్టిది ఇంతవరకు తెలుగు సాహిత్యంలో రాలేదు. ప్రబంధాలలో వసుచరిత్ర శతకాలలో నా ఆర్యా శతకం ప్రత్యేకమైనవి.
మాంగల్య శాస్త్రం రాశారు. వాటి విశేషాలు వివరించండి..
స్వర్ణ శకలాలు తెలుగు సాహిత్యంలోని 90 కావ్యాలలో ఆయా కవులు ప్రస్తావించిన స్వర్ణ్భారణాలను విశ్వకర్మలను గురించిన పద్యాలను తీసుకొని వాటిని గుణ దోష పూర్వకంగా చెప్పాను. మాంగల్య శాస్త్రం వ్రాయడానికి పుణ్యక్షేత్రాలలో ఉండే శిల్ప భంగిమలు, వాటికున్న ఆభరణాలు, దేవతావిగ్రహాల ఆభరణాలు ఆయా ప్రాంతాల స్ర్తిలు ధరించే ఆభరణాలు, పురాణాలు కావ్యాల్లో ఉండే ఆభరణాలకు వ్యాఖ్యానాలు అన్నీ సేకరించి ఆభరణాలపై సమగ్ర గ్రంథం చేయడానికి ప్రయత్నించాను. ఇవన్నీ బొమ్మలతో ఉన్నాయి. ఇది భారతీయ ఆభరణాలపై వచ్చిన సమగ్రమైన గ్రంథం.
మూడు తరాల విద్యా పరిణామం ఎలా ఉంది?
చదవాలి. వ్రాయాలి. అర్థం చేసుకోవాలి. చదువంటే చదివే నాటికీ పుస్తకం చదువుతుంటే ధారాళంగా చదివేవారం. చదివింది అర్థం చేసుకొని చెప్పేవారం. అప్పటికి వారి పరిశీలనా శక్తి, విజ్ఞానతృష్ణ అద్భుతంగా ఉండేవి.
నేను కళాశాలలో చదువు చెప్పేనాటికి (1972-83) కూడా విద్యార్థులకు ఆసక్తి ఉండేది. వారు గురువులు చెప్పేది శ్రద్ధగా వినేవారు. వారు కూడా ఇప్పుడు మంచి రంగాలలో స్థిరపడ్డారు. ఆనాటి వాళ్లకు నిరంతరం చదవాలి, రాయాలి, రాసినదాన్ని దిద్దుకొందామన్న తపన, ఆరాటం ఉండేది. ఇపుడే మేం రాసిందే గొప్ప, అదే ప్రమాణం అనే అహంకారం, అజ్ఞానం ప్రబలింది. భావపరిణతి, భాషాప్రామాణ్యం లుప్తమయాయి. చదువుకు మూడు దశలు 1. శాస్తద్రృష్టం, 2. గురుర్వాక్యం, 3. ఆత్మనిశ్చయం. ఏ విషయమైనా మొదట గురువులతో వినవలె. ఆ తరువాత దాన్ని తన పాఠంలో అనగా శాస్త్రంలో చూచుకోవలె. గురువుగారు చెప్పింది, శాస్త్రంలో ఉన్నది ఒక్కటేనా కాదా అని తర్కించుకున్నాక అప్పుడు తాను ఒక నిశ్చయానికి రావలె. కాని ఈనాటివారికి శ్రుతపాండిత్యం అనగా వినికిడి జ్ఞానం తప్ప పఠనజ్ఞానం లేదు. చదువు అనేది వౌఖిక క్రియ - ఈనాడు ఎంతో గొప్ప డిగ్రీ కలవారైనా తెరచి గొంతెత్తి ధారాళంగా చదవలేకపోతున్నారు. దానికి కారణం - అది అభ్యాసంలో లేకపోవడమే. అట్లాగే ఉక్తలేఖనం (డిక్టేషన్) అంటే మనం చెప్పింది చెప్పినట్లు అక్షరదోషం లేకుండా రాయలేకపోతున్నారు. దీనికి కూడా కారణం అలవాటు లేకపోవడమే. కాబట్టి చదువు, వ్రాత, వినటం అనే మూడు సమానంగా సాగవలెను. విషయం అర్థం కావడంతోనే సరిపోదు. అది భావితరానికి అందించవలెనంటే అతనికి సరైన భాషలో నిర్దుష్టంగా కాగితం మీద పెట్టడం కూడా రావాలి గదా.
సాహిత్య లోకానికి అవసరమైన మీ పరిశోధనాత్మక రచనలేమిటి?
కావ్యగణపతి, కళ్యాణ తారావలి, స్వర్ణ శకలాలు, రుద్రాధ్యయం, హనుమత్సందేశం, పామర సంస్కృతం, మంగల్య శాస్త్రం, పాలమూరు జిల్లా దేవాలయాలు, భాగవత కథాతత్వం యయాతి చరిత్ర వ్యాఖ్యానం ముఖ్యమైనవి.
మహబూబ్‌నగర్ జిల్లా కవి పండిత వంశాల గురించి చాలా విస్తారంగా రాశారు కదా. వాటి వివరాలు చెప్పండి. మరి అది పుస్తక రూపంలోకి ఎందుకు రాలేదు. ఇది 1978-83 నాటి సంగతి. బహుశా కొన్నింటికి నేను లేఖకుడిని కూడా కావచ్చు. రాత ప్రతి ఉందా పోగొట్టుకున్నారా? సంస్థలు కానీ, వ్యక్తులు కానీ ముందుకు వస్తే ప్రచురించడానికి అవకాశమిస్తారా?
ఒకే వంశంలో ఎక్కువగా కవులున్న కుటుంబాలను తీసుకొని దాదాపు 230 పండిత వంశాలను గురించి వ్రాసినాను. వాటిలో వట్టె నంబివారు, పల్లావారు, తెల్కపల్లి రామచంద్రశాస్ర్తీ కుటుంబీకులు, సంబరాజు వంశస్థులు, వెల్లాలవారు మొదలైన వారెందరో ఉన్నారు. దీని మూలప్రతి పోయింది. కాని చాలావరకు వ్యాసాలు ‘పరిశీలన’ అనే స్థానిక పత్రికలో వచ్చినాయి. వాటన్నింటినీ సేకరించి ఎవరైనా పుస్తకంగా ప్రచురిస్తామంటే ఆనందంగా అంగీకరిస్తాను.
చరిత్ర పరిశోధనలో మీ ప్రత్యేకత ఏమిటి?
స్థానిక చరిత్రలు ఇంకా వెలుగులోనికి తీసుకురావాలి. ప్రముఖ రాజుల చరిత్రలు గాక సామంతుల చరిత్ర కూడా అధ్యయనం చేయాలి. రాజుల వంశాలు, శాసనాలు వివరాలు అన్ని చోట్ల లభిస్తాయి. ఎలాగూ అవి ప్రజలందరికీ తెలుస్తాయి.
నేను ఎక్కడికివెళ్లినా స్థానిక చరిత్రలు, ప్రజల నోళ్ళలో నానుతున్న చరిత్రలు, కథలు అన్ని సేకరించి గ్రంథస్థం చేసినాను. పాలమూరు జిల్లా దేవాలయాలు, ఇంకా చాలా వ్యాసాలో స్థానిక చరిత్ర వివరించాను. ఈ తరం దాటిపోతే గ్రామాల స్థానిక చరిత్ర కూడా మనకు లభించదు. ఈ చరిత్ర సేకరణలో కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి. కొంతమంది వ్యక్తులు వివరాలు చెప్పడానికిష్టపడేవారు కాదు. పాలమూరు జిల్లా దేవాలయాలు. మహాక్షేత్రం, మామిళ్ళపల్లి, సోమేశ్వర క్షేత్ర మహత్మ్యం, భైరవకోవ మహాత్మ్యం, ఉమామహేశ్వర కథ నేను రాసిన స్థానిక చరిత్రల్లో ముఖ్యమైనవి.
సామెతలు, మాండలిక పదాలు సేకరించారు కదా. ఇవి కేవలం పాలమూరు జిల్లాకు చెందినవేనా? మొత్తం తెలంగాణకు వస్తుందా? దీని స్ఫూర్తిగా ఇతర జిల్లాలవారు కృషి చేయవచ్చా?
నేను గోలకొండ పత్రిక చదివినపుడు ఆ భాష అంత శుద్ధ వ్యావహారికంగా ఉండేది. దానితో నాకు జానపదుల భాషలో రచనలు చేయవలెనని అభిలాష కలిగింది. అప్పటినుండి అంటే దాదాపు 50 సంవత్సరాల నుండి పదాలు, సామెతలు, జాతీయాలు సేకరించడం మొదలుపెట్టాను. ఇవి దాదాపు 6000 పదాలు. ఇవి ప్రధానంగా పాలమూరు జిల్లాకు చెందినవే కానీ, ఇతర జిల్లాలో కూడా ఉండవచ్చు. దీనిలోని పదాలన్ని శబ్దర్థచంద్రికలో లేని పదాలే. దానికి అనుబంధంగా ద్వంద్వాలు, ఊతపదాలు, జాతీయాలు, భాషీయాలు, న్యాయాలు కూడా ఉన్నాయి. జానపదులు గుర్తించిన పక్షులు, అంగవికారాలు, న్యాయాలు ఇలా ఎన్నో సేకరించినాను. వీటన్నింటిని ‘పామర సంస్కృతం’ పేరిట ముద్రణకు సిద్ధం చేసిపెట్టాను.
వ్యాపారధోరణి, యాంత్రిక నాగరికత, ఆధునికత్వం ప్రబలిన నేటి కాలంలో ప్రాచీన సాహిత్య అధ్యయనంవల్ల, చారిత్రక పరిశోధనలవల్ల కలిగే ప్రయోజనమేంటి?
తెలుగు భాష తీయనైనది. తెలంగాణ భాషకు ప్రామాణికత ఏర్పరచుకోవాలి. వ్యాకరణం ఏర్పరచుకోవాలి. భాషల ప్రామాణికత ఉండాలి. ఎవరు ఏది ఎట్లా వాసినా సక్రమమే అంటే భాష పాడవుతుంది. నా దగ్గరకు పీఠికల కోసం వచ్చిన వారికి ముందు పూర్తిగా చదివి వారికి నాకు తోచిన సవరణలు, వివరణలు చెప్పిన తర్వాతే పీఠికలు వ్రాసినాను. ఈ రోజు పుస్తకాలలో భాషాదోషాలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి.
భాషలో మాండలికలు ఉపయోగించాలి గాని భాషను ఖూనీ చేయరాదు. సూర్యనారాయణీయం అనే ఒక వ్యాకరణ గ్రంథం ఒకటి ఉంది. అది తెలంగాణ పద్యాల స్వరూప స్వభావాలను భాషా ప్రయోగాలను వివరించింది. ఇది నేటి తెలంగాణకు సరిపోతుంది. భాష విషయకంగా తెలంగాణ భాష చాలా స్వచ్ఛమైన భాష. మహబూబ్‌నగర్ జిల్లాలో సంస్థానాలు ఎక్కువగా ఉండటం చేత, పండితులు ఇక్కడ ఎక్కువగా వర్థిల్లడం చేత భాష రక్షించబడింది. ఈనాడు చాలామంది రచయితలకు ప్రూఫ్ రీడింగ్ చేత కావడంలేదు. అసలు శబ్ద స్వరూపం పట్ల దృష్టే లేదు.
అవశ్యం ఈ అంశాలను పరిశోధనకు స్వీకరిస్తే బాగుంటుంది అని మీరనుకొనేవి కొన్ని చెప్పండి...
తెలంగాణాలో జాగీర్లు, మక్తాలు చాలా వున్నాయి. వాటిపై పరిశోధనలు జరగాలి. వాటిని వెలుగులోనికి తెస్తే చాలా సాహిత్యం బయటకు వస్తుంది. చరిత్రకెక్కని గ్రామాలగూర్చి పరిశోధనలు జరగాలి. ప్రభుత్వం పనిచేపడితే బాగుంటుంది. గ్రామస్థుల సహకారంతో ఈ పని చేస్తే ఫలితాలు బాగుంటాయి.
మన డిండి (దింది)కీ చాలా పెద్ద చరిత్ర ఉంది. దాని కడుపునిండా ఎంతో చరిత్ర దాగివుంది. నేను చూడగానే దానిలో కలిసిపోయిన ఆలయాలు చాలా ఉన్నాయి. దాని వెంట కెయిరనలు (వీరగల్లులు)కు కూడా కొదువలేదు. దాని సమగ్రంగా బయటకు తీస్తే మన తెలంగాణ చరిత్రలో దుందుభీ తీర నాగరికత అని ఓ కొత్త అధ్యాయమే రాయవచ్చు. ఎన్నో కొత్త అంశాలు వెలుగులోకి రాగలవు. మహబూబ్‌నగర్ జిల్లా ఆవంచ, డిండి లాంటి ప్రాంతాల్లో చాలా గ్రామాలు పోయాయి. నాటి చరిత్ర బయటకు తీయగలగాలి.
మీ దృష్టిలో పరిశోధనలు ఎలా ఉండాలంటారు? ఎలా ఉన్నాయంటారు?
పరిశోధనలు అనేవి నాలుగు కాలాలకు నిలిచేవిగా ఉండాలి. పరిశోధన ఏదో పట్టా కోసం మొక్కుబడిగా కాకుండా ప్రామాణికంగా ఉండాలి. ప్రామాణికత అనేది నేడు పలుచనైపోయింది. ఈనాటి పరిశోధనలలో భాష, వస్తువు రెండు కూడా అపరిపక్వంగానే ఉంటున్నవి. ఇపుడు మనకు అలవాటు అయిన భాషను వాడుకుంటూనే దాన్ని పూర్తిగా తిరస్కరించకుండా తెలంగాణ భాష, పలుకుబళ్ళు, దేశ్య పదజాలాన్ని విరివిగా వాడుకుంటూ విస్తృతీకరించాలి. ఆంగ్లాది అన్యదేశ్యాలకు మాత్రం తెలుగు సమానార్థకాలు వాడడం మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ఈ విషయంలో కన్నడ, తమిళ వాళ్ళకు ఉన్న పట్టుదల మనకు కూడా రావాలి.

- ఆచార్య వెలుదండ నిత్యానందరావు 9441666881