డైలీ సీరియల్

త్రిలింగ ధరిత్రి - 3

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జయతుంగుడు రాజకీయ వ్యవహారాలలోను, పాలనా వ్యవహారంలోను, దేశ పర్యటనలోను, అప్పుడప్పుడూ జరిగే యుద్ధాలలోను చెలరేగిన సామంతులను అణచి చక్కదిద్దుటలోను, అతనికి తీరుబడి లేదు.
రాజాంతఃపురం మహారాజు దర్శనానికి చెన్నాప్రగడ గణపయామాత్యులు వచ్చారు. ఆయన తరచు మహారాజు జయతుంగులవారిని కలుస్తూ ఉంటాడు. ఆయన రాకకు ఎటువంటి అడ్డు లేక నేరుగా ప్రభువుల దర్శనం చేయవచ్చు. అభ్యంతర మందిరం ఉంటే మాత్రం కబురంపుతాడు. సాధారణంగా ప్రభువు వెంటనే దర్శనమిస్తాడు.
గణపామాత్యులు ప్రభువుకు తన రాకను తెలియజేశారు.
ప్రభువు రావటం ఆలస్యమైంది. ఇంతలో జయతుంగలవారి పుత్రికా రత్నం సోమలదేవి లోపలి నుంచి బైటకు వచ్చి గణపయామాత్యులవారిని చూసి నమస్కారం చేసి తన గదిలోకి వెళ్లిపోయింది, చెలులతో. గణపమాత్యుడు ఎప్పుడూ రాకుమారిని సరిగా చూడలేదు. ఆమెకు మాత్రం ఆయన తెలుసు, అందుకే నమస్కరించింది. లోపలినుంచి మహారాణి తోడై జయతుంగులవారు విజయం చేశారు. గణపామాత్యుడికి హృదయపూర్వకంగా నమస్కరించాడు, సతీయుతుడై.
మహారాజు అమాత్యులవారికి ఆసనం చూపాడు.
ఆయన ఇంకా కూర్చోలేదు.
‘ఆశీనులుకండి’ అన్నాడు జయతుంగుడు.
‘‘మీ రాక మాకు చాలా ఆనందం కలిగించింది. నిన్ననే మీ ప్రస్తావన వచ్చింది’’.
‘‘ప్రభువుల దయ’’
‘‘మా మంత్రివర్గంలో మీకు స్థానం కల్పింపదలిచాం. మీ వంటి మేధావులు, యోధులు, సుస్థిర సామ్రాజ్య స్థాపనకు ఎంతో అవసరం’’.
‘‘మహారాజా! మీ అనుగ్రహం! మీ ఆజ్ఞ మాకు ఎప్పుడూ శిరోధార్యమే, నాదొక చిన్న మనవి’’.
‘‘చెప్పండి’’
‘‘మాకు అమాత్య పదవి ఇస్తామన్నారు. అంటే మా మీద ఎంతో సదభిప్రాయం వుండబట్టే కదా, మాకా అదృష్టం పట్టింది’’.
‘‘ఎంత మాట!’’
‘‘నాదొక విన్నపం’’
‘‘అమాత్యా! విన్నపాలెందుకు? మీరు మాకు మార్గదర్శకులు. మీ సామర్థ్యం మాకు తెలియంది కాదు. మీకు స్థానం కల్పించాం. ఆలస్యమైనందుకు చింతిస్తున్నాం’’.
‘‘ప్రభూ! గణపతి దేవులవారి గురించి మీ అభిప్రాయమేమిటి?’’
‘‘ఏముంది పసివాడితో మాకు పగేమిటి? అది మహాదేవుడితోనే తీరిపోయింది. శత్రు శేషమని ఒక కంట కనిపెడుతున్నాం. అంతే. మేమేమీ కారాగారవాసం విధించలేదు. సామాన్య గృహ నిర్బంధం. కాకతీయ భటులనే సైనికులుగా అతని వద్ద ఉంచాం. కాకపోతే బయటికి వెళ్ళనివ్వడంలేదు. ఆహార విహారాలకు ఏ లోపమూ చేయటంలేదు. పండితులెవరో జ్ఞానబోధ చేస్తున్నారని కూడా విన్నాం.
‘‘ప్రభూ! రుూమధ్య ఎపుడైనా గణపతిదేవుడిని చూశారా?’’
‘‘లేదు’’
‘‘యుక్తవయస్సు వచ్చింది’’.
‘‘దాని ధర్మం దానిది కదా!’’
‘‘గణపతి దేవుడు అత్యద్భుతమైన రాజకుమారుడుగా రూపుదిద్దుకొన్నాడు’’.
‘‘చిరంజీవులకు మా ఆశీర్వాదాలు తప్పకుండా ఉంటాయి’’.
‘‘ప్రభూ! తమరు ఒక తడవ వారిని చూస్తేమంచిది’’.
‘‘ఇనే్నళ్ళుగా ఎన్నడూ చూడలేదు. ఆ తలంపు రాలేదు. ఆ మాట అన్నవాళ్ళు ఎవరూ లేరు. తప్పదంటారా?’’’
‘‘ప్రభూ! నేను అపుడప్పుడూ వెళ్లి క్షేమ సమాచారాలు కనుక్కుంటూనే ఉన్నాను’’.
‘‘ఇకనేం’’
‘‘అది కాదు, మీరు చూడాలి’’.
‘‘మంచిది. ఇపుడే వెడదాం. చేయదలచుకున్నది వెంటనే చేయాలి. రేపు అన్నది మాకు నచ్చదు. ఉండండి వెళదాం’’.
మహారాజు లోపలికి వెళ్లాడు దుస్తులు మార్చుకుని బయటికి వచ్చారు.
గణపామాత్యులు తాము, ప్రభువులతో గణపతి దేవుని చూడటానికి వస్తున్టన్లు ముందుగా వార్తపంపాడు.
4
మహారాజు వస్తున్నారన్న సంగతి తెలిసి గణపతి దేవుడి దగ్గర వున్న వారందరూ అప్రమత్తులైనారు.
జయతుంగుడు గణపామాత్యులవారితో గణపతి దేవుడున్నచోటికి వచ్చాడు.
అందరూ ప్రభువులకు అమాత్యులకు అభివందనాలు అర్పించారు. వాళ్ళు వచ్చే సమయానికి గణపతి దేవుడు అర్థ నిమీలిత నేత్రుడై కూర్చుని ఉన్నాడు. వీళ్ళు వచ్చిన అలికిడికి కళ్ళు తెరిచి నిలబడి అభివాదం చేశాడు. గణపామాత్యులు ఎరిగినవారే. వారి వెంట వచ్చినవారెవరో తెలియలేదు గణపతి దేవుడికి.
జయతుంగుడికి గణపతి దేవుడిలో తేజస్సు గోచరించింది.
‘‘కుమారా! కుశలమా?’’ అన్నారు ప్రభువులు జయతుంగులు.
గణపతి దేవుడు చిరునవ్వుతో శిరఃకంపం చేశాడు చేతులు జోడించి.
గణపతిదేవుడు తలవంచి చేతులు జోడించి అభివాదం చేశాడు వినయ విధేయతలతో మళ్లీ.
గణపతి దేవుని మూర్తి మహారాజుకు బాగా నచ్చింది. ఆజానుబాహువైన దేహము, అంగవస్తమ్రు మాత్రమే ధరించిన కండలు తీరిన శరీరము, ఆ శిరోజాలు ఆ కోలముఖంమీద అప్పుడే వస్తున్న నూగురు ఆయనను ఎంతో ఆకర్షించాయి. మహారాజు మనసులో ఏదో మెదిలింది. గణపతి దేవుని స్థితికి చాలా నొచ్చుకున్నాడు. గణపామాత్యులవారి చెవుల ఏదో చెప్పాడు.
క్షణంలో మంచి బట్టలు వచ్చినాయి. అవి వేసుకోమని మహారాజు గణపతి దేవుడిని కోరారు. ఆయన అవి ధరించాడు.
‘‘వెడదాం! బయలుదేరండి’’
గణపయామాత్యులతో అన్నాడు ప్రభువు.
మహారాజు గణపతి దేవుడి భుజంపై చేయి వేసి దగ్గరకు తీసుకొని తనతో నడపించాడు.
***
అందరూ రాజప్రాసాదంలో అడుగుపెట్టారు.
ఇదంతా గమనించిన గణపయామాత్యులవారికి అంతా కలలా అనిపించింది. తాననుకున్న దానికి మహారాజు క్రియారూపకంగా చేసి చూపారు.
మహారాజు గణపతి దేవుడితో అన్నారు.
‘‘కుమారా! నేటి నుంచి మీరు మాతో ఉండవచ్చు. గతాన్ని మరిచిపోవాలి. మీరు మా కుటుంబ సభ్యులు. ఈ రాజ ప్రసాదంలో స్వేచ్ఛగా ఎక్కడికైనా తిరగవచ్చు. యధేచ్చగా మాట్లాడవచ్చు. మీ శ్రేయస్సు గోరే మేమీ నిర్ణయం తీసుకున్నాం. నేటినుంచి మీరు మాలో ఒకరు’’.
‘‘చిత్తం’’ అన్నాడు గణపతిదేవుడు.
‘‘అమాత్యవర్యా! నేటినుంచి మీరు విధులలో ప్రవేశించవచ్చు. మీరు మా అంతరంగిక సచివులు. ముఖ్యంగా గణపతి దేవుల వ్యవహారం మీ ఆధీనం’’ అన్నారు ప్రభువు.
‘‘కృతజ్ఞతలు. సెలవు’’
గణపయామాత్యులు వెళ్లిపోయారు.
(సశేషం)

-అయ్యదేవర పురుషోత్తమరావు