కథ

అరువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ
*
‘సందేహం లేదు, అతను సుష్మిత్!’ అన్నది నా మనసు. అతన్ని చూడగానే అప్రయత్నంగా ఉబికి వచ్చిన ఉత్సాహం దాన్ని మరి నిలవనివ్వలేదు. అన్నీ మరచి అతని వైపు దూసుకు వెళ్లింది. ‘అవును, సుష్మితే!’ అని ధ్రువపరుస్తున్నట్టు, శరీరం కూడా తనకు చేతనైనంత చురుగ్గా మనసును అనుసరించింది.
ఎన్నాళ్లయింది సుష్మిత్‌ని చూసి.. అయిదేళ్లు దాటిపోయాయేమో!?
సుష్మిత్ దాదాపు నా వయసువాడే. మేం ఏడెనిమిదేళ్ల క్రితం మొదటిసారి కలుసుకొన్నప్పుడు అతనూ నాలాగే పైలాపచ్చీసు ప్రాయానికి దగ్గరలో ఉండేవాడు. సుష్మిత్ ఉపసంపాదకుడుగా పనిచేసే ‘అద్దం’ పత్రిక ఆఫీసు నేను పనిచేసే పోస్ట్ఫాస్‌కు ఎదురుగా ఉండేది. మా ఇళ్లు కూడా దగ్గరగా ఉండేవి. ఉదయం ఇద్దరం ఒకే సిటీ బస్సులో ఆఫీసులకు వెళ్లేవాళ్లం.
సుష్మిత్ షోగ్గా ఉండేవాడు. తెలుగు సినిమా కుర్ర హీరోలలా గడ్డం పెంచుకొని, పొడుగు చేతుల ముతక చొక్కా జీన్స్ పాంట్‌లో కట్ చేసుకుని తిరుగుతుండేవాడు. అర మాసిన నారింజ రంగు కుర్తా, సోడా బుడ్డి కళ్లజోడూ, గుడ్డ సంచీ, ఆకు చెప్పులూ, పుస్తకాల పురుగుతనం, పల్లెటూరి వాలకం - ఇదంతా నా అవతారం. దానికి కారణం మా ఊళ్లో స్కూల్‌లో మా తెలుగు మాస్టారి ప్రభావం. ఆయనని అనుకరించే నేనొక చిన్నకారు కవిని కూడా అయ్యాను. గేయాలు, పద్యాలు రాస్తుంటాను. ‘అద్దం’ పత్రిక కొత్తగా మొదలైనప్పుడు, అన్ని పత్రికలకు పంపినట్టే దానికి కూడా నా కవితలు పంపాను, నిష్కామకర్మగా.
అలా పంపిన తరువాత మూడు వారాలకు కాబోలు సుష్మిత్ నన్ను వెతుక్కొంటూ, వనం కోసం వచ్చిన వసంతంలా, మా ఆఫీసుకి వచ్చాడు. వాళ్ల దగ్గర ఏడాదిన్నరకి సరిపడే కవితలు ఎంపికై సిద్ధంగా ఉన్నాయని మృదువుగా వివరించి నా కవితలు సగౌరవంగా తిరిగి నాకు అప్పగించిన ఉప సంపాదకులలో సుష్మిత్ మొదటివాడు, చివరి వాడు. ‘మీ చిరునామా ‘అద్దం’ ఆఫీసు ఎదురుగా అని రాశారు. సరే, ఈ రకంగా ఒక నవ కవిని పరిచయం చేసుకొన్నట్టు అవుతుందని నేనే వచ్చాను...’ అన్నాడు సుష్మిత్ నవ్వుతూ. సుష్మిత్ నవ్వు స్వచ్ఛంగా నిష్కల్మషంగా ఉంటుంది. ఆ నవ్వుతోనే ఆ క్షణమే మా స్నేహానికి బీజం పడింది.
ఆ తరువాతి ఆరు నెలల్లో ఆ స్నేహం బాగా దృఢమై పోయింది. వారానికి మూడు నాలుగు సార్లన్నా కలిసేవాళ్లం. కలిసినప్పుడల్లా రెండు మూడు గంటలు కబుర్లు చెప్పుకొనేవాళ్లం. మా అభిరుచులలో ఎన్నో భేదాలున్నా అవేవీ మా స్నేహానికి అడ్డు రాలేదు. సాహచర్యం పెరిగిన కొద్దీ సుష్మిత్ చొరవ వల్లా, ఆకర్షణ శక్తి వల్లా, ఆ భేదాలు కొన్ని తగ్గిపోసాగాయి. నా గిరజాల జుట్టూ, నలిగిన కుర్తా పోయాయి. గుడ్డ సంచీ పోయింది. కొత్త కళ్లజోడు, కాస్త ఖరీదైంది, వచ్చింది. రెండు రోజులు అతనిలా సిగరెట్లు కూడా కాల్చి చూశాను. మా ఆవిడ మాటల ప్రభావం వల్ల అనుకొంటాను, అది కొనసాగలేదు.
సుష్మిత్ నాలాగే గ్రాడ్యుయేట్. కానీ అతను చదువుకొన్నది సైన్సు విషయాలు. నేను ‘విశేష’ తెలుగూ వగైరాలతో డిగ్రీ చేశాను. సైన్సు చదవటం వల్ల సుష్మిత్‌కు శాస్ర్తియ దృక్పథం ఒకటి అలవడి, ప్రపంచంలో వివిధ ప్రాంతాల ప్రజల సమస్యల పట్లా, వాటి పరిష్కారాల పట్లా అవగాహన ఏర్పడింది అనేవాడు. దానికి తోడు ఆంగ్ల, ఫ్రెంచ్, జర్మన్, రష్యన్ సాహిత్యాలు ఒక పట్టు పట్టాననేవాడు. ‘విశేష’ తెలుగుతో బియ్యే చదువుకొన్నా, నాకు తెలుగు సాహిత్యమే పూర్తిగా బోధ పడదు. అలాంటిది కేవలం అనువాదాల ద్వారా విదేశ భాష సాహిత్యాలు ఆపోసన పట్టటమంటే మాటలా? అతను చెప్పేది ఎంతవరకూ నిజమో పసికట్టే శక్తి నాకు లేదు. కానీ అతని మాటల్లో ఎలియట్, స్విన్బర్న్, ఆడెన్, పో, ఇబ్సెన్, ‘చెహోవ్’ లాంటి ఎవరెవవరో విదేశీ సాహిత్యకారుల పేర్లు మంచినీళ్ల ప్రాయంగా దొర్లేవి. వీళ్లందరి గురించి సుష్మిత్‌కు నిశ్చితమైన అభిప్రాయాలు ఉండేవి. వాటిని అతి నిశితంగా పరుషంగా అతను వెలిబుచ్చుతుంటే, ఆ కవుల పేర్లు కూడా తెలియని నాకు ఆశ్చర్యంగా, ఆసక్తికరంగా ఉండేది. నేనూ అలా మాట్లాడాలని ప్రయత్నించేవాడిని కానీ కృష్ణశాస్ర్తీ గారి గురించి కూడా నాలుగు ముక్కలు నొక్కి చెప్పలేక పోయేవాడిని. ఆయన రచనలు సగం కూడా సరిగా చదవకుండా ఆయన మీద ఏమి అభిప్రాయం చెప్తాను?
విచిత్రం ఏమిటంటే సుష్మిత్‌కు తెలుగు సాహిత్యంతో పరిచయం తక్కువ. పద్యమంటే అతనికి ఏవగింపు. ‘్భష బట్ట కట్టాలంటే పద్యాన్ని పాతి పెట్టాలి’ అనేవాడు. అతను మెచ్చుకొన్నా, ఈసడించుకొన్నా పదునైన భాషలోనే, తెలుగు సాహిత్యంలో చెప్పుకోదగింది ఏమన్నా ఉంటే అది ఆధునికానంతర కవిత్వం మాత్రమే అనేవాడు. అతను ఏది చెప్పినా నాకు చెవులకు ఇంపుగా ఉండేది కానీ, అతను వాడే పరిభాష తెలియక, సరిగా బోధపడేది కాదు. కానీ, అతనితో చర్చల వల్ల నాకు ఒక్క విషయం బాగా అర్థమైపోయింది. నేను రాసే లాంటి రచనలకు కాలం చెల్లి పోయిందనీ, పాఠకుల మాటేమో గానీ, సమకాలిక సంపాదకులూ, ఉపసంపాదకులూ వాటిని ఆమోదించరనీ. అంచేత నేను ఆ రోజులలోనే నా రచనా వ్యాసంగం నుంచి స్వచ్ఛందంగా విరమించుకొన్నాను. సుష్మిత్ ప్రభావం వల్ల నా జీవితంలో వచ్చిన మార్పుల్లో ఇది ఒక్కటి మాత్రమే. ఇలాగే, తెలుగు పుస్తకాలు మానేసి ఇంగ్లీషు పుస్తకాలు చదవటం మొదలెట్టాను. కానీ, సుష్మిత్ సిఫారసు చేసిన సాహిత్యం నన్నంతగా ఉర్రూతలూగించేది కాదు. క్రమంగా అసలు నేను చదవటమనేదే తగ్గిపోయింది.
సుష్మిత్‌ను కలవక ముందు నాకు టెక్నాలజీ అన్నా, కంప్యూటర్లన్నా భయంగా ఉండేది. (మా ఆఫీస్ సాంకేతిక విషయాల్లో నాకంటే వెనుకబడి ఉండేది కనుక ఇబ్బంది ఉండేది కాదు.) క్రెడిట్ కార్డ్ కాదు గదా, ఏటీయం కార్డు కూడా వాడేందుకు జంకేవాడిని. ‘ఆన్‌లైన్’ వ్యవహారాలకు ఆమడ దూరంలో ఉండేవాడిని. ఏది కొనాలన్నా ముందు బ్యాంకుకు వెళ్లి డబ్బు తెచ్చుకొని తరువాత దుకాణానికి వెళ్లేవాడిని.
‘గురూ, ఏమిటీ పిచ్చి?’ అని ఒకరోజు సుష్మిత్ అడ్డం పడ్డాడు. ‘ప్రతీ దానికీ ఇలా కాష్ తెచ్చుకోవటం, మోసుకోటం ఏమిటి? హాయిగా క్రెడిట్ కార్డులు వాడు. ఇప్పుడు సిగరెట్ దుకాణంలో, పాన్ డబ్బాలలో కూడా క్రెడిట్ కార్డు నడుస్తుంది. రైలు టికెట్లూ బస్సు టికెట్లూ కిరాణా సరుకులూ, కూరగాయలూ సమస్తం క్రెడిట్ కార్డ్‌తో కొనచ్చు’
‘అవుననుకో..’ అని నసిగాను, నా అజ్ఞానం, భయం వెలిబుచ్చేందుకు బిడియపడుతూ.
‘ఈ రోజుల్లో పర్సులో కాష్ ఉంచుకోవటం రిస్కు. దాని బదులు ఈ చిన్న కార్డు ముక్కలులు జేబులో ఉంచుకొంటే దర్జాగా ఎప్పుడైనా ఏదైనా కొనేయచ్చు. చేతులో డబ్బు లేకపోయినా ఆటోమేటిగ్గా అరువు పుడుతుంది. పైగా క్రెడిట్ కార్డుతో కొంటే వస్తువులు చౌకా, డిస్కౌంట్లు ఎక్కువా. కాష్ బాక్‌లూ వగైరా ఉంటాయి. పైసా వడ్డీ లేదు’ అని చిటికె వేశాడు సుష్మిత్. అతనికి అదొక అలవాటు.
మొదట్లో నేను బాగానే నసిగాను. అసలు నాకు కార్డెందుకు, అన్నాను. నేను కొనేవేముంటాయి అన్నాను. బ్యాంకు కెళ్లి కార్డు కోసం అప్లై చేసేందుకు టైం లేదన్నాను. కాష్‌తో కిరాణా కొట్లలో వస్తువులు కొనుక్కుంటే ‘ఒక విధమైన హాయి’ ఉందన్నాను. తృప్తి, నీతి లాంటి విలువల గురించి కొంత ప్రస్తావించాను. మార్పు అడ్డుకొనేందుకు ఎన్ని అభ్యంతరాలు ఊహించచ్చో, కల్పించచ్చో అన్నీ ఊహించి కల్పించి చెప్పాను.
సుష్మిత్ అంతంతలో వదులుతాడా! నా అభ్యంతరాలన్నీ చిరునవ్వుతో తోసి పారేశాడు. పట్టుదలగా పదేపదే వాదించాడు. అతనిది బాగా ఆకట్టుకొనే వాదనా ధోరణి. పదునైన భాష. నా బోటి వాళ్లు అతని వాదనా పటిమకు పడిపోక తప్పదు. వారంరోజులపాటు ఊదరగొట్టి ఎలాగయితేనేం, నాకు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఇప్పించి, వాటితో షాపింగ్ అలవాటు చేశాడు. అతని వ్యక్తిత్వంలో శక్తి అలాంటిది.
కార్డులు అలవాటయిన తరవాత గానీ నాకు వాటిలో సౌలభ్యం తెలిసి రాలేదు. ఓ రకంగా చెప్పాలంటే కార్డుల వల్లే నాకు నిజమైన వ్యక్తిత్వ వికాసం కలిగింది. లోకం ఎలా ఉందో, లోకులు ఎలాటి కొత్తకొత్త వస్తువులు కొంటున్నారో తెలిసింది. జ్ఞాన నేత్రం అనలేను గానీ, ప్రపంచ జ్ఞాననేత్రం తెరుచుకొంది..
దాదాపు అయిదేళ్ల క్రితం సుష్మిత్ పెళ్లి చేసుకొని, ఉద్యోగం మారి, ఊరు మారటం వల్ల, మేం కలవటం ఆగిపోయింది. కానీ అతని ఉపదేశం పుణ్యమా అని ఇవ్వాళ నేను అన్ని రకాల వస్తువులూ కార్డుతోనే కొంటాను. నా పర్సులో ఎప్పుడూ రెండు డెబిట్ కార్డులూ, రెండు క్రెడిట్ కార్డులూ ఉంటాయి. పైసా వడ్డీ లేకుండా దాదాపు నెల రోజులు అప్పు పుట్టించుకోవటం ఇప్పుడు నాకు చేతయింది. ఏ సూపర్ బజార్‌లోనో, బట్టల కొట్టులోనో బిల్లు చెల్లించేటప్పుడు విలాసంగా నా కార్డును కాషియర్ ముందు విసురుతుంటే, వాళ్లు నాకు మునుపటి కంటే ఎక్కువ గౌరవం, మర్యాదా చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. నేనూ ఈ శతాబ్దపు పౌరుడినే అని కాలర్ ఎగరేసుకొంటాను. అలా క్రెడిట్ కార్డు వాడినప్పుడల్లా నాకు సుష్మిత్ మనసులో మెదులుతాడు. ఈ మధ్యకాలంలో ధరల పెరుగుదల వల్ల కొంతా, నా ‘జీవన శైలి’లో మార్పుల వల్ల కొంతా ఖర్చులు పెరిగి, కొద్దిపాటి అప్పుల్లో ఉన్నా నెగ్గుకొస్తున్నానంటే దానికి కారణం నా క్రెడిట్ కార్డులు, అవి అలవాటు చేసిన సుష్మిత్...
అలాంటి సుష్మిత్ ఇన్ని రోజుల తరువాత మళ్లీ ఇప్పుడే కనిపించటం...!!
దీపావళి పండుగ ముందు రోజు పెద్ద బజార్లో నేను దిక్కులు చూస్తూ నడుస్తుంటే పక్కనే ఉన్న బట్టల దుకాణంలో బిల్లు చెల్లిస్తూ కనిపించాడు. అతను దుకాణంలో నుంచి బయటకు వస్తూ ఉండగా వెళ్లి ఆప్యాయంగా కౌగిలించుకొన్నాను.
దగ్గరలో ఉన్న కాఫీ హోటల్‌కు వెళ్లి కూర్చొన్నాం. టిఫిన్ తిని, కాఫీ తాగి, కడుపు నిండా కబుర్లు చెప్పుకొన్నాం.. సుష్మిత్ గమనించాలని క్రెడిట్ కార్డు జేబులోంచి విలాసంగా తీసి, బల్ల మీద పెట్టాను. సుష్మిత్ నన్ను వారించి తన జేబులో నుంచి డబ్బు తీసి ఇచ్చాడు. బయటకి నడుస్తూ అతన్ని అడిగాను, ‘ఎప్పుడూ లేనిది ఇప్పుడు కార్డు మానేసి కాష్ వాడుతున్నావేమిటి?’ అని.
‘ఇప్పుడు నేను క్రెడిట్ కార్డులు అసలు వాడటం లేదు. అన్నీ కాష్‌తోనే కొంటున్నాను. ఇప్పుడు నా దగ్గర క్రెడిట్ కార్డులు ఏవీ లేను కూడా లేవు’ అన్నాడు సుష్మిత్.
పిడుగు పడ్డట్టు ఉలిక్కిపడ్డాను. ‘కారణం ఏమిటి? నాకీ రాజమార్గం చూపించి పుణ్యం కట్టుకొని, నువ్వు మళ్లీ కాలిబాట ఎందుకు పట్టినట్టు? అందులోనూ దేశమంతా కాష్ లెస్, కాష్ లెస్ అని ఘోషిస్తుంటే?’ అన్నాను.
‘ఆ మధ్యన ఇన్‌స్టాల్‌మెంట్ కట్టలేదని నా బైకును ఫైనాన్స్ కంపెనీ వాళ్లు స్వాధీనం చేసుకొని వెళ్లినప్పటి నించీ, కార్డులు వాడటం మానేశాను. వాళ్లకు డబ్బు కట్టి బైకు తిరిగి తెచ్చుకొనేసరికి తల ప్రాణం తోకకు వచ్చింది. పరువుకు పరువూ పోయింది. పెనాల్టీలకు పెనాల్టీలు తడిసి మోపెడయ్యాయి’ అన్నాడు సుష్మిత్.
మళ్లీ ఉలిక్కిపడ్డాను. ‘అదేమిటి? అదెప్పుడు జరిగింది? ఎలా జరిగింది? నువ్వు చాలా జాగ్రత్త మనిషివి కదా? ఆదాయం, ఖర్చూ జాగ్రత్తగా లెక్క వేసుకొనే వాడివి గదా?’
‘వేసుకొనేవాడినే. ఆ రోజుల్లో ఒంటరివాడిని! పెళ్లయిన తరువాత, ఖర్చుల మీద నియంత్రణ పోయింది. దానికి తోడు ఈ క్రెడిట్ కార్డుల వాడకంతో దాదాపు దివాలా తీసినంత పనైంది. నా కార్డులకు మా ఆవిడ పేరుతో యాడ్ ఆన్ కార్డులూ, ఆమె కార్డులకు నా పేరుతో యాడ్ ఆన్ కార్డులూ, మొత్తం కార్డులు ఎక్కువయిపోయి ఖర్చులూ, అప్పులూ ఎక్కువై పోయాయి.’
‘నీది ఇప్పుడు మంచి ఉద్యోగం. మీ ఆవిడకూ తన ఉద్యోగం తనకున్నది. ఇక మీకు ఆదాయం సరిపోక పోవడమేమిటి?’
‘తమ్ముడూ, వెనకటి కెవరో చెప్పినట్టు, ఆదాయం సరిపోవటం ఆదాయం మీద ఆధారపడి ఉండదు. ఖర్చుల మీద ఆధారపడి ఉంటుంది. మాది కొత్త సంసారం. ఇద్దరం ఎడాపెడా ఆదాయాన్ని మించి ఖర్చులు పెట్టేశాం. ఆమె చేత ఓహో అనిపించుకోవాలని నేను, నా చేత ఆహా అనిపించుకోవాలని ఆమె’
‘క్రెడిట్ కార్డుతో అప్పు కొంత దొరుకుతుంది గదా?’
‘అది వాడేయటమే పెద్ద ప్రమాదమై కూర్చుంది. నీకు తెలుసో తెలియదో, గడువు లోపల కట్టగలిగితే క్రెడిట్ కార్డు అప్పు వడ్డీ లేని అప్పు. కట్టలేక పోతే, నడ్డి విరిగే వడ్డీలు పడతాయి. నెల జీతాల వాళ్లు ఆ వడ్డీలు భరించలేరు. మేం క్రెడిట్ కార్డులు వాడేటప్పుడు అనవసరపు అప్పులు చేశాం. అప్పూ, వడ్డీ రెండూ స్వాధీనం తప్పాయి. వడ్డీలు కట్టటం కోసమే మళ్లీ అప్పు చేయవలసి వచ్చింది. ఆ విష వలయంలో ఇరుక్కొన్న తరువాత, తప్పు గ్రహించి, క్రెడిట్ కార్డు వాడటమే మానేశాను. నాలుగు నెలలు నానా తిప్పలూ పడి ఖర్చులు తగ్గించి, అప్పులు వదిలించుకొన్నా. ఇప్పుడిక ఏది కొన్నా కాష్ చెల్లించి కొనటమే. రెండు మూడు నెలల నించీ నా బడ్జెట్ మళ్లీ నా స్వాధీనంలోకి వచ్చింది. అందుకే నా మాట విని నువ్వు కూడా చేతులు కాలక ముందే ఈ అరువు కార్డులన్నీ అవతల పెట్టు. జేబులోనీ కాషు కన్నా సౌఖ్యమే లేదూ.. అప్పు లేనీ బతుకు కన్నా హాయియే లేదూ!’ ఆశువుగా పాట కట్టి పాడటం మొదలెట్టాడు సుష్మిత్. నాకు బుర్ర తిరిగిపోయింది.
ఆ సంగతి సుష్మిత్ గ్రహించాడు. నవ్వుతూ, ‘ఈ అరువు కార్డు దయ్యం జేబులో ఉంటే, మిగిలిన వాళ్ల సంగతేమో కానీ, నేను మాత్రం ఉప్పు కొనడానికి కూడా మాల్‌కే వెళతాను. రెండు వస్తువులు కొనటానికి వెళ్లి, ధర తక్కువనో, పాకింగ్ ముచ్చటగా ఉందనో, అప్పు దొరుకుతుందనో, డిస్కౌంట్ ఉన్నదనో, అత్యుత్సాహంతో పది వస్తువులు కొంటాను. వాటితో నాలుగు శుద్ధ అనవసరపు వస్తువులు. మాల్ అనేసరికి కావలసినవీ, అక్కర్లేనివీ చాలా వస్తువులుంటాయి కదా, ఖర్చు ఆగదు. ఇప్పుడు చూడు, నేను వస్తువులు హోల్‌సేల్ రేట్ల కిరాణా కొట్టులో డబ్బిచ్చి కొంటాను. పది వస్తువులు కొనాలనుకొంటే, జాబితా రాసుకొని వెళ్లి పది వస్తువులే కొంటాను. కాష్ ఖాళీ అయిందా, షాపింగ్ బంద్! ఆటోమాటిక్!!’ అంటూ తన సహజ ధోరణిలో చిటికె వేశాడు. ‘నువ్వు కూడా ఈ అరువు కార్డులన్నీ కాలవలో విసిరేయి, కలకాలం చింత లేని బతుకు బతుకు!’ అన్నాడు.
నా మనసులో తీవ్రమైన గందరగోళం...
‘దేవుడు లేడు, ఉంటే చూపించమను. అస్తిక మార్గం మూర్ఖుల మార్గం. అమాయకులను మోసగించే మార్గం. నా మాట విను’ అని తనకు ఏళ్ల తరబడి బోధించి మార్గ దర్శనం చేసిన గురువు, నాలుగేళ్ల తరువాత అకస్మాత్తుగా పరమ భాగవతుడి వేషంలో కనిపించి, ‘శిష్యా, అప్పుడు నేను చెప్పిందంతా తప్పు. ఈ మధ్య నాకు మళ్లీ జ్ఞానోదయమైంది. అంతా భగవంతుడి లీలే. ఆయననే నమ్ముకో! అంటే ఎలా ఉంటుంది?’
దురదృష్టవశాత్తూ ఇప్పుడు నేను సుష్మిత్ నాకు మొదట చూపిన మార్గం, జీవన విధానం వదలగల పరిస్థితిలో లేను. సుష్మిత్ తెలివితేటల మీద ఉన్న నమ్మకం కొద్దీ, అతను చూపిన మార్గంలో, తిరుగు ప్రయాణానికి అవకాశం లేనంత దూరం వచ్చేశాను. ఇప్పుడు నేను మళ్లీ మారాలనుకొన్నా, నా అర్ధాంగీ, సుపుత్రుడూ నన్ను మారనివ్వరు. చుట్టూ ఉన్న నలుగురిలో నవ్వుల పాలవుతాను.
‘గురువా, క్షమించు, మంచో చెడో, నేను మాత్రం నీ పాత బోధనలతోనే కాలక్షేపం చేద్దామనుకొంటున్నాను. అవే అనుసరిస్తాను. నాకు మరో దోవ లేదు’ అని చెప్పబోయి, ఏమన్నా అనుకొంటాడేమోనని సందేహించాను. అంతలోనే సంభాషణ విషయం కూడా మారింది.
ఆ తరువాత రెండు మూడు రోజులు తీవ్రంగా మథన పడ్డాను! చివరికి ఒక నిర్ణయానికి వచ్చేశాను. ఇక ముందు దేనికైనా నా సొంత బుద్ధి ఉపయోగించుకొని నా దోవ నేనే చూసుకోక తప్పదని. ఎవరి మార్గం వాళ్లు వెతుక్కోవాలనే గదా సృష్టికర్త తలకో బుర్ర ఇచ్చింది!
సుష్మిత్ ప్రభావం వల్ల నా జీవితంలో వచ్చిన మార్పులలో చిట్టచివరి మార్పు అదే. ఇప్పుడు నా మీద ఇతరుల ప్రభావం ఇదివరకంత తేలికగా, అంత బలంగా పడటంలేదు. ఇప్పుడు నేను అరువేమైనా తెచ్చుకొంటే అది క్రెడిట్ కార్డు మీదే.

-ఎం.హనుమంతరావు.. 9949340236