ఈ వారం కథ

జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ... (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోన్ రింగవుతోంది. సూర్యారావు మెలకువ తెచ్చుకోడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మెల్లగా కళ్లు తెరిచి దిండు పక్కనున్న మొబైల్ తీసుకుని ‘‘హలో.. హలో..’’ అన్నాడు. అటు పక్కనుంచి జవాబు లేదు. కళ్ళజోడు పెట్టుకుని చూస్తే ఏదో తెలియని నంబర్. ‘‘ఇంత రాత్రిపూట ఫోనెవరు చేసారో?’’ తిరిగి పక్కమీదకి వాలాడు. కళ్ళు మూసుకున్నాడో లేదో మళ్లీ రింగయ్యింది.

‘‘సూర్యారావుజీ..!’’ హిందీలో అడిగారు. పెద్దగా హిందీ రాని సూర్యారావు ‘యస్’ అన్నాడు. అవతలి వాళ్ళ మాటలు వౌనంగా విన్నాడు. శరీరమంతా సన్నని వణుకు. తడారిపోతున్న గొంతులోని దుఃఖం గుండెల్లోకి పాకి ముల్లులా పొడుస్తున్న బాధ. దుఃఖాన్ని దిగమింగుతూ పక్కకి చూసాడు.
పక్కన విశాలాక్షి పసిపాపలా నిద్రిస్తోంది. డాక్టర్ సలహాపై రాత్రి సెడటివ్ డోసు పెంచాడు. మూడేళ్ళనుండి సెడటివ్ ఇస్తేగాని నిద్రపోని పరిస్థితి ఆమెది. తను మందలించాడని ఇల్లు విడిచివెళ్లిన కొడుకుపై బెంగ. సున్నితంగా ఆమె తల నిమిరాడు. అలసి సొలసిపోయిన ఆమె నేత్రాలు విషాదానికి నెలవుల్లా వున్నాయి. దానికి కారణం తనా? లేక తమ ఒక్కగానొక్క కొడుకా? ఎవరు? తను ఫోనులో విన్న సంగతి తెలిస్తే ఆమె తట్టుకోగలదా? లేక తనపై పెంచుకున్న ద్వేషం విషంలా మారి ఆమెను దహిస్తుందా? అసలు తనేం చేసాడు? ఆమె మనోవేదనకు తనేనా కారణం? భగవంతుడా.. నేనేం పాపం చేశాను. నాకెందుకీ శిక్ష...? గతం గాయంలా మండుతోంది. చిప్పిల్లిన కళ్ళలోంచి ఆలోచనల ప్రవాహాలు.
***
‘‘తెల్లారిందా? వేళాపాళా లేదా నీ తిరుగుళ్ళకి?’’ చెప్పులేసుకుని బయటకు వెళ్తున్న రఘుని చూసి కోపంతో రగిలిపోయాడు సూర్యారావు. ‘‘నినే్న, వినిపిస్తోందా నేనడిగేది? రాత్రి ఎన్నింటికొచ్చావు? ఇల్లు పట్టకుండా అర్థరాత్రిదాకా తిరుగుతూ చేసే రాచకార్యాలేమున్నాయో దొరగారికి? మాట్లాడకుండా రాయిలా నిలబడతావేంటి? తొందరగా డిగ్రీ పూర్తిచేసి ఏదైనా ఉద్యోగం వెతుక్కుందామనే ఆలోచనే లేదు. మమ్మల్ని ఉద్ధరించకపోయినా నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటే చాలు. అవేం పట్టనట్టు రాత్రి పగలు తిరుగుళ్ళు. కాస్త బాధ్యత గుర్తించి ప్రవర్తించు. పదిమందిలో పరువుగా బ్రతుకుతున్నా. నీవలన నాకో గుర్తింపు, గౌరవం రాకపోడం కాదుగాని, నన్ను అప్రతిష్టపాలు చేస్తున్నావు.. తండ్రిగా గర్వపడే రోజొకటి వస్తుందేమోనని నీ చిన్నప్పట్నించి ఎదురుచూస్తున్నాను. ప్చ్.. నాకా అదృష్టం లేదు. నా ప్రారబ్దం కాకపోతే నిన్ననుకుని ప్రయోజనమేమిటి?’’ ఆవేదనగా అన్నాడు.
‘‘చెట్టంత కొడుకుని పట్టుకుని ఏమిటండీ ఆ మాటలు. వాడేం చెడు తిరుగుళ్ళు తిరగడంలేదు. ఆ డిగ్రీ ఏదో పూర్తిచెయ్యడానికే తంటాలు పడ్తున్నాడు. ఫ్రెండ్ రూములో చదువుకుంటున్నాడు. ఎందుకు వాడిని ఆడిపోసుకుంటున్నారు. డిగ్రీ అయితే మాత్రం ఉద్యోగాలు వెతుక్కుంటూ వస్తాయా? తండ్రిగా మీరేం బాధ్యత తీసుకున్నారు. ఆ వయసులో మీరు అలాగే ఉండేవారట మామయ్యగారు చెబ్తూండేవారు. కానీ, ఆయన మిమ్మలనెప్పుడూ ఇలా ఈసడించుకున్న దాఖలాలు లేవు. వాడికీ మంచిరోజులొస్తాయి. చదువు పూర్తవుతుంది. మంచి ఉద్యోగం తెచ్చుకుంటాడు, మీకు పేరు తీసుకొస్తాడు. మీరేం బాధపడకండి. పొద్దస్తమానం వాణ్ణి విసుక్కోకండి బావుండదు’’ కొడుకుని అన్ని మాటలంటుంటే సహించలేక అంది విశాలాక్షి.
‘‘కొడుకుని వెనకేసుకొస్తున్నావా? అలా బయటికెళ్ళు తెలుస్తుంది. మనమేమిటో మన గొప్పతనమేమిటో, నిన్నటికి నిన్న ఆ రంగనాధం స్వీట్ ప్యాకెట్ చేతిలో పెట్టి మావాడికి గూగుల్లో ఉద్యోగం వచ్చింది. పది లక్షల ప్యాకేజీ అని చెప్పాడు. రంగనాధం కొడుకు వీడు ఒకే వయసు వాళ్ళు. కానీ ఇంతలో ఎంత తేడా. వాడు పెద్ద ఉద్యోగంలో చేరుతున్నాడు, మరి వీడింకా డిగ్రీ కూడా పాసవ్వలేదు. మన తలరాత ఇలా ఏడిసింది. ఆఫీసులో రోజుకొకరు నా కొడుకిలా, నా కొడుకలా అంటూ గొప్పలు చెబ్తోంటే, చెప్పుకోడానికి నాకేం లేక ఎంత అవమానంగా ఉంటోందో నీకేం తెల్సు. ఇప్పటివరకు డిగ్రీ కంప్లీట్ చెయ్యని వీడి గురించి ఏం చెప్పమంటావు..?’’
‘‘అంతమాత్రాన కొడుకుని శత్రువులా చూస్తారా? వాణ్ణి ఎప్పుడైనా కాస్త ప్రేమగా పలకరించారా? దగ్గర కూర్చోబెట్టుకుని మంచి, చెడు చెప్పారా? వాడి బలహీనతలేమిటో, ఎందుకు చదవలేకపోతున్నాడో కనుక్కున్నారా? తండ్రిగా మీ బాధ్యత మీరు నిర్వర్తించకుండా వాణ్ణి ఆడిపోసుకుంటున్నారు. మీరన్ని మాటలంటూంటే మీకు ఎదురుచెప్పకుండా వౌనంగా ఉన్నాడు. అదే ఇంకొకళ్ళైతే తిరగబడేవాళ్ళు.’’
‘‘అదే నేను బాధపడేది. ఆ తిరగబడ్డం, పోరాడడం వాడికి రాదు. ఆ పోరాట పటిమ లేకపోడంతో వెనకబడిపోతున్నాడు. టైముకి అన్నీ అమర్చిపెడ్తోంటే దొరలా తిని తిరుగుతున్నాడు. ఒళ్లొంచి కష్టపడడం, బుర్రపెట్టి చదవడం రాదు. చూడు ఇందాకట్నించి గొంతు శోషొచ్చేలా మాట్లడుతోంటే తనను కాదన్నట్టు నిర్లిప్తంగా, ఉలుకు పలుకు లేకుండా దీపసమ్మెలా నిలబడ్డాడు. పొమ్మను.. నా ఎదురుగా ఉండొద్దని చెప్పు.. అప్పుడైనా కాస్త మనశ్శాంతిగా ఉంటుందేమో?’’ ఆవేశంతో కుర్చీలో కూలబడ్టాడు సూర్యారావు.
కళ్ళవెంబడి ధారాళంగా నీళ్ళు కారుతూంటే రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ అవమానభారంతో వడివడిగా వెళ్లిపోయాడు రఘు.
ఈ హఠాత్పరిణామానికి దిగ్భ్రమచెందిన విశాలాక్షి ఏడుస్తూ, ‘‘ఏంటండి మీ మూర్ఖత్వం. ఏం అఘాయిత్యం చేసుకుంటాతో ఏమిటో? లేచి వాణ్ణి వెనక్కి రమ్మని బతిమాలండి. లేవండి.. నా మాట వినండి. ఒక్కగానొక్క కొడుకండీ మనకు. వాడు లేకపోతే నే బతకలేను’’ హిస్టీరియా వచ్చినదానిలా ఊగిపోయింది.
‘‘నీ పిచ్చికాకపోతే వాడెక్కడికెళ్తాడు. తిరిగి తిరిగి అలసిపోయి తిండికి ఇంటికొస్తాడు. ఏ అఘాయిత్యం చేసుకునేటంత ధైర్యం వాడికి లేనేలేదు’’ కొడుకుపై ఏ మాత్రం కనికరం లేనట్టు కళ్ళు మూసుకుని సమాధానం చెప్పాడు సూర్యారావు.
ఆశగా ఎదురుచూసింది కొడుకు ఇంటికి వస్తాడేమోనని. రోజులు, వారాలు, నెలలు గడిచిపోయాయి. కొడుకు ఆచూకి తెలియలేదు. సూర్యారావు మదనపడి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. విశాలాక్షి బెంగతో మంచం పట్టింది. కొడుకెప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తూనే ఉంది. ‘‘ఎన్నాళ్లయ్యిందిరా వెళ్లి? ఒక్కసారి నే బాగానే ఉన్నానమ్మా.. నువ్వెలా ఉన్నావని అడగవా?’’ బేలగా రోదిస్తూనే ఉంది ఆ తల్లి మనసు. సూర్యారావు తప్పు చేసినట్టు బాధపడ్తూ ‘‘ఎంతసేపు వాడ్ని ఆడిపోసుకుంటున్నాననే అనుకుంది తప్ప, వాడి బాగు కోరి మందలించానని ఏనాడూ అనుకోలేదు’’ అనుకున్నాడు.
కన్నకొడుకు తనకింత శిక్ష వేస్తాడనుకోలేదు. తెల్లగా తెల్లారింది సూర్యారావు దంపతుల జీవితాల్లో చీకటిని మిగిల్చి.
***
సైనిక శకటం ఒకటి భారంగా కదులుతూ వచ్చి సూర్యారావు ఇంటిముందు ఆగింది. ఒక సైనికాధికారి సూర్యారావుని సమీపించి సెల్యూట్ చేసి ‘‘మీ కుమారుడు రఘువీర్ మూడు సంవత్సరాల క్రితం భారత సైన్యంలో చేరి, దేశానికి నిరుపమానమైన సేవలనందించాడు’’. మ్లానవదనంతో తిరిగి సంభాషణను కొనసాగిస్తూ, ‘‘పఠాన్‌కోట సైనిక స్థావరంపై పాక్ ముష్కర్ల దాడిలో అత్యంత సాహసాన్ని, పోరాట పటిమని ప్రదర్శించి సైనిక స్థావరాన్ని, విలువైన యుద్ధ సామగ్రిని రక్షించాడు. కానీ తన విలువైన ప్రాణాలు కోల్పోయాడని తెలపడానికి మిక్కిలి చింతిస్తున్నాను. రఘువీర్ నిరుపమాన త్యాగానికి, సాహసానికి యావత్ దేశం గర్విస్తూ నివాళులర్పిస్తోంది’’. సూర్యారావును అంతులేని దుఃఖం కారుమబ్బులా ఆవరించింది. కన్నీళ్ళు కుండపోతగా కురుస్తూంటే విశాలాక్షిని చూసాడు. ఆమె అప్పటికే గాలివానకు నేలకొరిగిన చెట్టులా పడి వుంది.
సైనిక శకటం నుంచి దించిన రఘువీర్ భౌతికకాయాన్ని పూర్తి సైనిక లాంఛనాలతో ఎతె్తైన వేదికపై అమర్చారు. ఆ వీరునికి అంజలి ఘటించడానికి గుంపులుగా జనం చేరారు. రఘువీర్ అమర్హ్రే.. భారత్ మాతాజీ జై.. అమరజీవి రఘువీర్.. ధన్యజీవి రఘువీర్.. భారత్ మాతాకి జై.. నినాదాలతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. టీవీ కెమెరాలు ఆ దృశ్యాన్ని చిత్రీకరిస్తున్నాయి.
చూడు విశాలా.. నా కొడుకుని. ఎనలేని పేరుని, ఖ్యాతిని మూటగట్టుకుని.. చూడు.. ఏమీ తెలీనట్టు అమాయకంగా ఎలా నిద్రపోతున్నాడో. వాడెప్పుడూ అంతే. నేనెన్ని మాటలన్నా నోరు మెదిపేవాడు కాదు. తనని కాదన్నట్టుగా ఉండేవాడు. పోరాట పటిమ లేదని నిందించాను. తండ్రిగా నా బాధ్యత నేను నెరవేర్చకపోయినా వాడు మాత్రం నా మాట నిలబెట్టడానికి ప్రాణాన్ని పణంగా పెట్టాడు. వీరుడిగా పోరాడి దేశం కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. నా కొడుకు ఒక వీర సైనికుడు. నాకు పేరుని, గుర్తింపుని తెచ్చిపెట్టాడు. నాకు దక్కిన ఈ గౌరవం చాలాకొద్దిమందికే దక్కుతుంది కదూ? నా రక్తం గర్వంతో ఉప్పొంగుతోంది. నేను వీరజవాను తండ్రిని’’ బాధను దిగమింగుతూ విశాలాక్షిని చేతుల్లోకి తీసుకున్నాడు.
స్పృహలోకొచ్చిన విశాల మెల్లగా కళ్ళు తెరిచి కొడుకువైపు చూసింది. సూర్యారావు ఆమెను మెల్లిగా కొడుకు దగ్గరకు తీసుకెళ్ళాడు. కడుపు తీపి గుండెను మెలిపెడ్తోంటే, కడసారిగా కొడుకు దేహాన్ని ఆప్యాయంగా తడిమింది. బలహీనమైన స్వరంతో, ‘‘నా కొడుకుని నాకు దూరం చేసారు. వాడిమీద ప్రేమతో మిమ్మల్ని నిందించాను. కానీ వాడి త్యాగం ముందు నా ప్రేమ ఓడిపోయింది. మీరూ ఓడిపోయారు. మీకు తెల్సో.. లేదో? దేశానికి ఇలాంటివీరులు మరెంతోమంది కావాలి. అందుకే మనకింకో కొడుకుంటే, అప్పుడు మనిద్దరం గెలిచేవాళ్లమండీ..’’ నిలువునా కూలబడిపోయింది.
‘‘అవును విశాలా, నువ్వన్నది నిజం. మనకింకో కొడుకుంటే బాగుండేది.. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ.. భారతమాతాకీ జై’’ అణువణువు ఆవేశంతో ఊగిపోతోంది సూర్యారావు శరీరం.
*
- అనంత పద్మనాభరావు మోచర్ల

రచయిత సెల్ నెం:9848607127

- అనంత పద్మనాభరావు మోచర్ల