కథ

హేపీడేస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అమ్మా జయా...’
‘ఆ.. ఏంటి మామయ్యా, కాఫీ కోసమేగా. ఇది ఈ రోజుకి మూడోసారి. కొంచెం తగ్గించుకొంటే ఆరోగ్యానికి మంచిది కదా’
చేతికి కాఫీ కప్పందిస్తూ అంది కోడలు.
‘మరేం చేయనమ్మా. నీ చేతి కాఫీ రుచి అలాంటిది...’ అని కాఫీ తాగుతూ ‘నేనలా బయటి కెళ్లొస్తాను’ అని వెళ్లిపోయారు మామగారు.
వాకిట్లో ఎవరో వస్తున్నట్లు అలికిడి అయితే చూసి, వంటింట్లోకి వెళ్లి ‘అక్కయ్యగారి మనవరాలు వస్తూంది. మీరు వెళ్లండి. వంట పని నేను చూసుకొంటానే్ల’ అత్తగారితో చెప్పింది కోడలు.

అక్కయ్యగారి మనవరాలంటే పక్కింట్లో వుండే పెద్దావిడ. వాళ్ల అక్కయ్యగారి మనవరాలికి పెళ్లి కూడా అయింది. ఆవిడగారి మాటల్లో అస్తమానూ ఆ మనవరాలి గురించి గొప్పలు చెప్పనే సరిపోతుంది. అందుకనే ఆవిడగారికి జయ పెట్టిన నిక్‌నేమ్ అది.
‘అమ్మో.. ఆవిడగారి సోది భరించడం కష్టమే. అయినా తప్పదు గదా’ అంటూ హాల్లోకి వెళ్లింది అత్తగారు.
మధ్యాహ్నం భోజనం చేస్తూండగా ‘అదేంటి మామయ్యా! కూరలో ఉప్పు తక్కువైంది. గమనించలేదా? అలాగే తినేశారేంటి’ అడిగింది కోడలు.
కొడుకు బ్యాంక్‌కూ, పిల్లలు స్కూల్‌కు వెళితే అత్త, మామ, కోడలు కూర్చుని భోజనం చేయడం అలవాటు. అత్తకూ, కోడలికి ముందు పచ్చడితో తిని ఆ తర్వాతే కూర తినడం అలవాటు. కానీ మామగారికి రివర్స్. ముందు కూర తింటాడు.
‘దానిదేముందిలేమ్మా. తక్కువో ఎక్కువో గానీ రుచిగానే ఉంది. కొంచెం తక్కువైనా ఈ వయసులో ఏమీ పర్వాలేదులే’ అన్నారు మామగారు.
‘పడుకొన్నది చాలు ఇక లేవండి’ అన్న పిలుపునకు మెలకువ వచ్చింది మాధవరావుకి.
మధ్యాహ్నం మూడున్నరయింది. మనవరాలిని స్కూలు నుంచి తీసుకొని రావాలి.
అంటే తనింతవరకూ కలగన్నాడన్న మాట. దానిని కల అనడం కంటే ఓ పాతికేళ్ల క్రితం మాధవరావు ఊహించుకొన్న జీవితం.
* * *
‘తాతయ్యా రావచ్చు..’ అరిచి మరీ చెప్పాడు మనవడు కార్తీక్.
‘ఎక్కడబ్బా కార్తీక్... తలుపు వెనకాల లేడే! బీరువా ప్రక్కన కూడా లేడే?...’ అంటూ వాడెక్కడున్నాడో తెలిసినా కనపడనట్టే నటించాలి.
‘హాయ్ తాతయ్య ఓడిపోయాడు’ అంటూ కేరింతలు కొడుతూ ముందు కొస్తాడు వాడు. అది వాళ్ల ఆట.
ఇక మనవరాలు ఆరాధ్య వాళ్ల బామ్మ కొంగు పట్టుకుని తిరుగుతూ, ఏవేవో ప్రశ్నలు వేస్తూంటుంది.
వాళ్లిద్దరితో గడుపుతుంటే మాధవరావు దంపతులకి సమయమే తెలీదు.
మాధవరావుకి ఒక్కడే కొడుకు - శ్రీ్ధర్. కోడలు జయప్రద. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు. వాళ్లకిద్దరు పిల్లలు. మనవరాలు ఆరాధ్య, మనవడు కార్తీక్. మంచి ఏరియాలో త్రిబుల్ బెడ్‌రూం ఫ్లాట్. మూడు వైపులా రోడ్లు, రోడ్డుకిరువైపులా ఎతె్తైన చెట్లు, మంచి ఆహ్లాదకరమైన వాతావరణం. దగ్గర్లోనే షాపింగ్ మాల్స్, మంచి స్కూళ్లు.
మాధవరావు కో-ఆపరేటివ్ సొసైటీలో పనిచేసి రిటైర్‌మెంట్ తీసుకొని ఆరేళ్లయింది. భార్య రాజేశ్వరి.
కోడలు కూడా ఉద్యోగం చేస్తున్నందువల్ల మనవరాలు పుట్టగానే మాధవరావు దంపతులు కొడుకు దగ్గరకు చేరవలసి వచ్చింది. పైగా ఒక్కడే కొడుకాయె. తర్వాత రెండేళ్లకి మనవడు కూడా పుట్టాడు.
సిటీకి చేరిన కొత్తల్లో ఊరి మీద గాలిమళ్లుతుండేది మాధవరావు దంపతులకి. ఊరి వాతావరణం వేరు, సిటీ వాతావరణం వేరు.
ఊరిలో వుండే ఇల్లు నాలుకు ప్రక్కలా కాంపౌండ్‌తో రెండు పడక గదుల ఇల్లైనా విశాలంగా ఉండేది. దగ్గరుండి మరీ తన అభిరుచికి తగ్గట్టు కట్టించుకొన్నందు వలన రాజేశ్వరికి ఆ ఇల్లంటే ప్రాణం. కానీ, ఇప్పుడు పిల్లలిద్దరినీ వదిలి ఎక్కడికీ వెళ్లలేమనే పరిస్థితికి వచ్చారు.
ఉదయం లేచినప్పటి నుంచి ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోతారు.
అత్తగారు వంటింటికి, కోడలు పిల్లల్ని లేపి వారి ఆలనా పాలనా చూసి, స్కూళ్లకి రెడీ చేసి, తను ఆఫీసుకి రెడీ అయ్యేసరికి సమయం సరిపోతుంది. మధ్యమధ్యలో అత్తగారికి వంటింట్లో సహాయం చేస్తూనే ఉంటుంది.
ఇక రాత్రి ఎనిమిది గంటలకు జయప్రద, పది గంటలకు శ్రీ్ధర్ అలసిపోయి వస్తారు ఇంటికి.
ఒకరికొకరు మాట్లాడుకునే వీలు కూడా ఉండదు. ఆ ఇంట్లో మాధవరావు దంపతులతో ఎక్కువగా మాట్లాడేది మనవరాలు, మనవడే.
శని, ఆదివారాలు మాత్రమే ఆ ఇంట్లో సందడిగా ఉంటుంది.
కోడలు జయప్రదకి ‘పాకశాస్త్రం’లో కూడా మంచి ప్రావీణ్యం ఉంది. సెలవు రోజుల్లో ఏదోవొక వెరైటీ వంటకం చేస్తుంది. అందరూ కూర్చుని సరదాగా భోజనాలు చేస్తారు.
* * *
మాధవరావు పుట్టింది ఉన్నత కుటుంబంలోనే. వాళ్ల నాన్నగారికి పాతికెకరాల సుక్షేత్రమైన మాగాణి, పాడి వుండేవి. దానికి తగ్గట్టు సంతానం కూడా ఎక్కువే. పైగా అదనపు క్వాలిఫికేషన్‌గా దుబారా వుండేది.
బెంజికారులో తిరిగేవాడు. బెంజి కారంటే కారు బెంజి కంపెనీది కాదు. అదొక అంబాసిడర్ టాక్సీ. దాని ఓనర్ కమ్ డ్రైవర్ పేరు బెంజి. ఒక మనిషిని టౌనుకి పంపించి మరీ పిలిపించుకొనేవాడు. అంటే, ‘కరిమింగిన వెలగపండు’ చందాన ఆస్తంతా హరించుకు పోయింది.
అందుకనే పెద్ద చదువులు చదవలేకపోయిన మాధవరావు కోపరేటివ్‌లో ఉద్యోగం చేయవలసి వచ్చింది.
సంపాదన కూడా పెద్దది కానందువలన మాధవరావు పెళ్లి ఆలోచన చేసేవాడు కాదు. కానీ వాళ్ల అమ్మగారి ఆరోగ్యం దెబ్బ తినడంతో తప్పనిసరై పెళ్లి చేసుకోవలసి వచ్చింది.
రాజేశ్వరి లాంటి భార్య దొరకడం మాధవరావు అదృష్టమనే చెప్పాలి. పెళ్లైన తర్వాత చదువుకోవచ్చనుకున్న రాజేశ్వరి, ఇంటి పరిస్థితి, అత్తగారి పరిస్థితి చూసి ఆ ఆలోచనకి స్వస్తి పలికింది. ఇంటికే పరిమితమై, అత్తగారికి అన్ని రకాల సేవలు చేసింది. కొడుకు పుట్టిన తర్వాత ‘మన ఆర్థిక పరిస్థితికి ఒక్కడు చాలు’ అన్నా అంగీకరించింది.
కొడుకు శ్రీ్ధర్‌ని ఏదో డిగ్రీ దాకా చదివిస్తే ఏ బ్యాంకు ఉద్యోగమో, టీచరు ఉద్యోగమో సంపాదించుకొంటే ఇంటి పట్టున వుండే కోడల్ని తెచ్చుకోవచ్చు అనుకునేవారు మాధవరావు దంపతులు.
పరిస్థితులు మారిపోయాయి. తన తోటి పిల్ల లందరూ ఇంజనీరింగ్ వైపు మరలడం, దానికి తోడు భవిష్యత్తులో గవర్నమెంటు ఉద్యోగాలు గగనమనిపించడం, ముందంతా కంప్యూటర్లదే భవిష్యత్తు అనిపించటం చేత తను కూడా శ్రీ్ధర్‌ని ఇంజనీరింగ్ చదివించక తప్పలేదు. వెంటనే ఉద్యోగం కూడా సంపాదించుకొన్నాడు.
శ్రీ్ధర్ యోగ్యుడు, బుద్ధిమంతుడు. తల్లిదండ్రుల్ని చాలా బాగా చూసుకొంటాడు.
తను వూహించిన జీవితం దొరక్కపోయినా ప్రస్తుతం తనకు లభించిన జీవితం ఆనందంగానే ఉంది మాధవరావుకి.
* * *
బంధువుల ఇంట్లో పెళ్లికని వూరు వెళ్లారు మాధవరావు దంపతులు. వెళ్లారన్న మాటేగానీ ఎంతసేపూ పిల్లలే గుర్తుకొస్తుండేవారు. ఒక గంట వాళ్ల అల్లరి భరించడమూ కష్టమే, ఒక గంటసేపు వాళ్లను చూడకుండా వుండటమూ కష్టమే.
బయలుదేరి వచ్చేటప్పుడు వాళ్లకు తెలియకుండా వాళ్లు చూడకుండా రావల్సి వచ్చింది. తెలిస్తే కదలనిచ్చేవాళ్లు కాదు.
పెళ్లి అయిపోయిన తర్వాత, చాలారోజులయింది గదా అని మాధవరావు వాళ్ల అక్కగారింటికి చూసొద్దామని వెళ్లితే ‘రాకరాక చాలారోజులకొచ్చారు. రెండు రోజులుండి వెళ్లండి’ అని నిలిపేసింది.
అలా నాలుగు రోజుల ప్రయాణం అనుకొన్నది పది రోజులయింది.
ఇంటికి తిరిగి రాగానే ‘తాతయ్యా’ ‘బామ్మా’ అంటూ మనవడూ, మనవరాలూ బల్లుల్లా అతుక్కుపోయి చాలాసేపు వదలలేదు.
ఇంతకంటే ప్రపంచంలో ఆనందం ఏముంటుంది?
వాళ్లంతా హేపీడేసే.

-ఎన్నార్ చిలకపాటి 7416558228