కథ

చీమలు పెట్టిన పుట్టలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఏం రా... రాజూ.. ఇప్పుడేనా రావటం?’ అని అడిగింది అక్క.
‘ఔనక్కా..’ అంటూ ఆటోని ఇంటి ప్రక్కనున్న షెడ్‌లో పార్క్ చేశాను. వెనక సీటులో వున్న లంచ్ బాక్సూ డబ్బుల డబ్బా తీసి చైన్ లాక్ వేసి బయటకొచ్చాను. ‘ఏంటోరా.. పొద్దుననగా వెళ్లిపోతావు.. బాక్స్ పట్టుకెళ్తావు కానీ టైమ్ చూసుకొని తింటున్నావో లేదో అనుమానంగా ఉందిరా నాకు..’ అంటూ కేకేసింది అక్క.
‘శ్యామలా! మీ ఆయనొచ్చాడే.. వడ్డించేయమ్మా.. ఏ వేళప్పుడు తిన్నాడో ఏమో?’
‘అలాగే అమ్మా.. వచ్చేశారా ఆయన..’ అంటూ బయటకొచ్చింది శ్యామల.
‘ఏంటండీ.. ఈ రోజు ఇంత ఆలస్యం అయింది.. ఎప్పుడూ లేదు. ఏదైనా పెద్ద బేరం తగిలిందా’ అని అడిగింది శ్యామల.
‘లేదు శ్యామలా.. డబ్బొచ్చే బేరం కాదు.. డబ్బు పోయే బేరం తగిలింది’ అన్నాను.
‘అంటే?’ అంది శ్యామల.
‘ఆటో పంక్చరయ్యింది.. అది చేయించుకొచ్చాను. మళ్లీ పొద్దునే్న స్కూలు పిల్లల్ని తీసుకెళ్లాలి కదా! అసలే పరీక్షలు కూడానదూ పాపం వాళ్లకి’ అన్నాను.
‘సర్లెండి.. రండి త్వరగా స్నానం చేసి.. భోజనం వడ్డిస్తాను’ అంటూ లోనికెళ్లిపోయింది శ్యామల.
* * *
అనసూయమ్మ కూతురు శ్యామల. తమ్ముడు రాజుకే ఇచ్చింది కూతుర్ని. ఆ ముగ్గురూ తప్ప నా అన్నవాళ్లెవ్వరూ లేరు వారి కుటుంబంలో ఈనాడు. అనసూయమ్మ పెళ్లయిన ఏడాదికే తల్లి పోయింది. ఏడాది తిరగకుండా తండ్రి కూడా కాలం చేశాడు. అక్కాబావ వద్దే పెరిగాడు రాజు. చదువబ్బితే ఎంతయినా చదివించి పెద్ద ఉద్యోగం చేయించాలని తాపత్రయ పడ్డారు అనసూయమ్మ దంపతులు. అత్తెసరు మార్కులతోనే గటెక్కేవాడు ప్రతీ క్లాసూ. అలాగని చెడు అలవాట్లు కూడా ఏమీ ఉండేవి కావు రాజుకి. చదువు పట్ల శ్రద్ధ చూపేవాడు పాపం కాని తెలివితేటలు తక్కువ. ఇంటర్ పాసయ్యాక చదువు పట్ల శ్రద్ధ చూపుతున్నాడు కదా అని బి.ఏలో చేర్పించారు అనసూయమ్మ దంపతులు. మూడేళ్ల కోర్సు ఎలాగే అయిదేళ్లకి పూర్తి చేసి ‘రాజారావు బి.ఏ.’ అనిపించుకున్నాడు కాని తెలుగు సబ్జెక్టులో మంచి మార్కులు వచ్చేవి. అనర్గళంగా మాట్లాడేవాడు. అలాగే రాసేవాడు కూడా.. బి.టెక్కులూ ఎంటెక్కులూ చదివి మంచి ర్యాంకులతో పాసయిన వాళ్లకే సరైన ఉద్యోగాలు దొరకని ఈ రోజుల్లో, రాజులాంటి వాళ్లకి ఉద్యోగం దొరుకుతుందనుకోవడం, అందుకోసం ప్రయత్నించడం వ్యర్థమని తోచింది అనసూయమ్మ దంపతులకి. చదివిన చదువుకి సరైన ఉద్యోగం ఏదీ దొరక్క ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు రాజు. స్కూలుకి సమయానికి పిల్లల్ని తీసుకెళ్లడం తిరిగి తీసుకు రావడం, ఖాళీ సమయాల్లో షేర్ ఆటోగా నడపడటం, విసుగు లేని పని, విరామం లేని జీవితం అయింది. రోజులు సాఫీగా గడుస్తున్నాయనగా ఒక రోడ్డు ప్రమాదంలో అనసూయమ్మ భర్త పోయాడు.
అప్పటి నుండి రాజే ఆ కుటుంబానికి పెద్ద దిక్కయ్యాడు. ఖర్చులు పోగా నెలకి ఎనిమిది వేలు దాకా సంపాదిస్తూ జీవనం సాగిస్తున్నారు ఆ ముగ్గురు జీవులు.
* * *
‘ఏమండీ వచ్చేరా.. వడ్డించేసేను..’ అంది శ్యామల.
వచ్చి కూర్చున్నాను గాని ముభావంగా భోంచేస్తున్న నన్ను చూసి ఆశ్చర్యపోయింది శ్యామల.
‘ఏమయిందండీ దిగులుగా కనపడుతున్నారు? కొంపదీసి మీ కథ తిరిగొచ్చేసిందా ఏమిటి ఈసారి కూడా...’ అనడిగింది. అవాక్కయ్యాను. దీనికెలా తెలిసిందబ్బా అని అనుకున్నాను.
‘బాగానే కనిపెట్టావు కానీ.. ఈసారి కథ తిరిగి రావడానికి నేను సెల్ఫ్ అడ్రస్డ్ కవర్ స్టాంప్ అంటించి పంపితే కదా..’ అన్నాను.
‘మరెలా తెలిసిందండీ?’ అని అడిగింది.
‘ఈ పత్రిక వాళ్లు.. ఒక విధంగా చెప్పాలంటే చాలా మంచి వాళ్లు శ్యామలా... ప్రచురణకై వచ్చిన కథలను త్వరగా పరిశీలించి, ప్రచురణ కాని కథల రచయితకు పోస్టు కార్డు ద్వారా ‘మీ కథ ప్రచురణకు ఎంపిక కాలేదని తెలియబరచడానికి చింతిస్తున్నాము’ అని ఒక్క ముక్క రాసి పడేస్తారు. ఏళ్ల తరబడి వేచి వుండర్లేకుండా...’ అన్నాను.
‘మరి మిగతా పత్రిక వాళ్లు?’ అని అడిగింది.
‘ఎంపిక అయినట్టు కాని.. అవనట్టు గాని.. ఏ సంగతీ చెప్పరు కాగా పోగా ఎట్టి పరిస్థితిలోనూ కథ తిరిగి పంపడం కుదరని నిబంధనలో కూడా ఉంటుంది. ఏళ్ల తరబడి వేచి ఉండడమే.. వారం వారం పత్రిక కొనుక్కోవడం.. మన కథ పడిందీ లేనిదీ చూసుకోవడం.. పడకపోతే నిరుత్సాహ పడటం.. అలవాటయి పోయిందిలే నాకు..’ అన్నాను భోజనం ముగిస్తూ.
‘పోనీలెండి.. వెంటనే తెలిసిపోయింది కదా.. మరో పత్రికకి పంపండి..’ అంది శ్యామల.
‘ఏం పంపడమో..’ అని నిరుత్సాహంగా నిట్చూర్చి.. వాకిట్లోకి వెళ్లి నులక మంచం మీద నడుం వాల్చాను.. అక్క తన గదిలో పడుకున్నట్లుంది.. శ్యామల వంటింట్లో పని చక్కబెట్టుకుంటోంది. పున్నమి రాత్రి.. చంద్రుడు చెట్ల కొమ్మల్లోంచి తొంగి చూస్తున్నాడు. చల్లటి వెనె్నల్ని విరజల్లుతూ వాతావరణం ఆహ్లాదకరంగా వున్నా నాకు నిద్ర పట్టటం లేదు. తిరిగొచ్చిన కథ గురించి ఆలోచించసాగాను. పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి.
* * *
‘షహ్‌భాష్‌రా రాజూ.. అదరగొట్టేశావ్’ అన్నారు తెలుగు మాస్టారు.
డిగ్రీ ఫస్టియర్ చదువుతున్న రోజులవి.. ఆ రోజు ఎలొక్యుషన్.. ‘కలమా.. కత్తా - ఏది గొప్ప’ అన్న టాపిక్ మీద మాట్లాడాలి. కలమే గొప్పదన్న నా వాదనకి ప్రథమ బహుమతి వచ్చింది. అది నా జీవితంలో మొదటి అచీవ్‌మెంట్. స్నేహితులంతా పొగడ్తతో ముంచెత్తారు. ఎంత సంబర పడిపోయానో ఆ రోజు. అక్కాబావా కూడా చాలా సరదా పడ్డారు. అంతకు ముందు రోజు దాకా బి.ఏ.లో ఏవరేజ్ స్టూడెంట్‌గా క్లాస్‌లో నన్ను హేళన చేసిన వాళ్లూ.. అవమానపరిచిన వాళ్లూ ఆనాటి నుండీ నన్ను కొద్దిగా గౌరవించడం ప్రారంభించారు.. నాలోని ఆత్మవిశ్వాసం కూడా పెరగసాగింది. ఆ మరునాడు క్లాసవుతూండగా ప్యూన్ నోటీసు పట్టుకొచ్చాడు. అది చదివి వినిపించారు తెలుగు మాస్టారు.
‘ఈ సంవత్సరం ఏన్యువల్ డే సందర్భంగా ఒక సావనీర్ తీయబోతున్నామని, కథలూ, కవితలూ, వ్యాసాలూ.. రాయాలనుకున్న వారు పది రోజులలోగా తమతమ రచనలను వైస్ ప్రిన్సిపాల్ గారికి అందజేయవలసినది..’ అని ఉంది ఆ నోటీసులో. క్లాసులో అంతా ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. ఆ తరువాత ఎక్కడ చూసినా ఈ టాపిక్ మీదే చర్చ. సాయంత్రం కాలేజీ విడిచిపెట్టేక స్నేహితులమంతా కలిసి సరదాగా బీచ్‌కి వెళ్లాము.
బఠానీలు తింటూ ఇసుక దిబ్బల మీద కూర్చొని సావనీర్ గురించే చర్చించసాగాం. హఠాత్తుగా ఒక స్నేహితుడు అన్నాడు.
‘ఔనురా.. రాజూ.. నువ్వు సావనీర్‌కి కథ ఎందుకు రాయకూడదూ..’ అంతే మిగతా స్నేహితులంతా రాయాలి.. రాయాలి అని అరవసాగారు.
వాళ్ల ప్రోత్సాహాన్ని.. అభిమానాన్ని చూసి ఆశ్చర్యపోయాను. ఆనందంతో కళ్లు చెమ్మగిల్లాయి. ఎలొక్యుషన్‌లో ఒకసారి ఏదో బహుమతి వచ్చినంత మాత్రాన నాలో అంతటి ప్రావీణ్యత ఉందనుకోవద్దని వారితో అన్నాను. అయినా నన్ను ప్రోత్సహించసాగారు. విధిలేక సరే అని ఒప్పుకొని తరువాత తప్పుకుందామనుకున్నాను. కాని వాళ్లని ఎందుకు నిరుత్సాహ పరచడం అని తోచింది. ప్రయత్నించాలని అనిపించింది.. ఏవో ఊహలు రాసాగాయి. వచ్చిన ఊహలు చెదిరిపోకుండా రాయసాగాను. రాస్తున్న కొద్దీ ఊరసాగాయి.. నాకే ఆశ్చర్యం వేసింది. ప్రోత్సాహం ఎంత పనైనా చేస్తుంది అని ఆ రోజే నాకు తెలిసింది. కథ పూర్తి చేశాను. ‘స్నేహబంధం’ అని పేరు కూడా పెట్టాను.
స్నేహితులకి చదివి వినిపిస్తే, బాగుందని భుజాల కెత్తుకొని తిప్పేశారు.
సావనీర్ తయారైంది. ఏన్యువల్ డే ఫంక్షన్ నాడు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా మొట్టమొదట సావనీర్‌ని ప్రిన్సిపాల్‌గారు విడుదల చేశారు. తన ఉపన్యాసంలో సావనీర్ గురించి వర్ణిస్తూ ముఖ్యంగా చి.రాజారావు రాసిన ‘స్నేహబంధం’ కథ చాలా బాగుంది. స్నేహం విలువ తెలియాలంటే ప్రతీ ఒక్కరూ చదివి తీరాలి అన్నారు. నా ఆనందానికి అవధుల్లేవు ఆనాడు. ఇంతటి ప్రోత్సాహం లభిస్తుందని కలలో కూడా ఊహించలేదు. స్నేహితులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఆ ఆలోచనలతో నిద్రలోకి జారుకున్నాను.
* * *
మరునాడు పిల్లలందరినీ సకాలంలో స్కూల్‌కి దింపాను. పరీక్ష వ్యవధి మూడు గంటలే కాబట్టి పెద్ద బేరం చూసుకోకుండా అరగంట ముందే వచ్చి స్కూలు ముందు ఓ చెట్టు కింద ఆటో పార్క్ చేసి కూర్చొని వున్నాను. ఇంతలో సెల్‌ఫోన్ మోగింది.. నా స్నేహితుడు. ‘కంగ్రాట్స్ రా.. రాజూ.. నీ కథ సాధారణ ప్రచురణకి ఎంపికయిందిరా.. ఈ రోజు విడుదలైన వార పత్రిక చూడు.. సాయంత్రం కలుద్దాం’ అని ఫోన్ కట్ చేశాడు. అప్పుడు గుర్తొచ్చింది ఆ మధ్య తిరిగొచ్చిన కథ వినాయక చవితి కథల పోటీకై ఈ పత్రికలో ప్రకటన పడితే పంపానని. సెలెక్ట్ అవుతుందని నమ్మకం ఎటూ లేదు. అందుకని ఆశ పెట్టుకోలేదు కూడాను. ఆ సంగతే మర్చిపోయాను. స్కూల్ విడిచి పెట్టాక పిల్లలందరినీ వాళ్ల ఇళ్లల్లో దింపి త్రోవలో పత్రిక కొనుక్కుని చూసుకున్నాను. చాలా ఆనందం వేసింది. ప్రథమ బహుమతి పొందిన కథా రచయిత చాలా గొప్ప రచయిత అనుకుంటాను.. ఇంతకు ముందు కూడా చాలా కథలూ నవలలూ రాసిన రచయిత అతను. కాని ఎప్పుడూ ‘సునారా’ అనే కలం పేరుతో రాస్తాడు. అంతేకాదు సాధారణ ప్రచురణకు ఎంపికయిన ఇతర కథల రచయితలలో ఒకళిద్దరు పేరు పడ్డ రచయితలే. వాళ్ల పేర్ల మధ్య నా పేరు చూసుకొని చాలా మురిసిపోయాను. స్నేహితులు పార్టీ ఇమ్మంటే.. ఆ రోజు రాత్రి ఓ హోటల్‌లో భోజనాలు చేశాం. నాలుగు వారాల తర్వాత విడుదలైన పత్రికలో నా కథ పడింది. కథ బాగుందని చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి. ఆ తరువాతి వారం పత్రికలో ఎవరో ఒక పాఠకుడి స్పందన చదివి చాలా ఆనందించాను.
‘ప్రథమ బహుమతి పొందిన కథ కంటే ద్వితీయ బహుమతి పొందిన కథ చాలా బాగుందని. అంతేకాదు సాధారణ ప్రచురణకు ఎన్నికైన శ్రీ రాజారావు గారి కథ ‘పట్టుదల’ బహుమతికి ఎంపిక కాకపోవడం ఆశ్చర్యం కలిగించిందని రాశాడు ఆ పాఠకుడు. బహుమతి రాకపోయినా బహుమతి వచ్చినంత ఆనందం కలిగింది నాకు. నేనూ నా స్నేహితులూ, నా కుటుంబ సభ్యులూ అనుకోవడం సహజం కాని ఎవరో ముక్కూ మొహం తెలియని ఒక పాఠకుడు అలా అనడం చాలా సరదా అనిపించింది.
నా చాలీ చాలని ఆదాయంతో ముగ్గురు జీవులూ ఎలాగో నెట్టుకొస్తున్నామని అనుకునే సమయాన ఒక శుభవార్త నా చెవిన పడేసింది నా భార్య. అది శుభవార్త అయినా నాకు పిడుగులాంటి వార్త అనిపించింది. నాల్గవ ప్రాణిని ఎలా పోషించాలన్న దిగులు నన్ను వేధించసాగింది. నగరంలో వున్న ఒక పెద్ద బట్టల దుకాణం వ్యాపారికి కారు డ్రైవర్ కావాలన్న ఒక ప్రకటన చూసి అతనిని సంప్రదించాను. నెలకి పనె్నండు వేలు ఇస్తామన్నారు. సమయం ఎక్కువ కేటాయించవలసి వస్తుందన్నారు.
పై ఊరు ప్రయాణాలు కూడా ఉంటాయని అన్నారు. టిఏ డిఏ లు ఉంటాయన్నారు. అన్నిటికీ ఒప్పుకున్నాను. ఇంట్లో సంప్రదించి ఒక శుభ ముహూర్తం చూసి కొత్త ఉద్యోగంలో చేరాను. చేరిన కొద్ది రోజులలోనే యజమాని చాలా మంచి వ్యక్తని గ్రహించాను. నన్ను ఒక డ్రైవర్‌గా కాకుండా సొంత మనిషిగా చూస్తూ ఉండేవారు. ‘ఏమిటోయ్.. కథలు కూడా రాస్తావటోయ్ నువ్వూ..’ అన్నారు ఆయన ఒకరోజు. నేను అవాక్కయ్యాను.
ఆయన చేతిలో వార పత్రిక చూసి ఓహో ఈయన సాహితీ ప్రియుడు కూడా... అన్న మాట అని అనుకున్నాను. కథ చివర ఫోన్ నెంబర్‌ని బట్టి పోల్చి ఉంటారని ఊహించాను. ‘ఏదో మీ ఆశీర్వచనం సార్’ అన్నాను.
‘బాగా రాసేవోయ్.. కీపిటప్’ అన్నారు.
ఆ తర్వాత కూడా ప్రముఖ వారపత్రికలలోని కథలపైన నాతో చాలాసార్లు అభిప్రాయం వ్యక్తం చేస్తూ మాట్లాడారు.
అంత పెద్ద వ్యాపారవేత్త సాహిత్య ప్రియుడవడం నన్ను ముగ్ధుణ్ణి చేసింది.
రెండు మాసాలు గడిచాయి. ఒక పత్రికలో దీపావళికి నవల పోటీ పడింది. 180 పేజీలకి మించకుండా రాసి పంపాలని ఒక నిబంధన. ప్రథమ బహుమతి యాభై వేలు. చివరి బహుమతి పదివేలు అని ఉంది. చివరి బహుమతి వచ్చినా జన్మ తరించి పోతుందనుకున్నాను. కాని అది ఊహించడానికి కూడా నేను అర్హుడను కాను అని అనుకొని సరిపెట్టుకున్నాను. వందల సంఖ్యలో నవలలొస్తాయని తెలుసు. ప్రాథమిక స్క్రూటినీలో కొన్ని చదవకుండానే కొట్టి పారేస్తారని విన్నాను. మిగిలిన వాటిలో దస్తూరీ బాగోలేనివి, పేరు పడ్డ రచయితలవి కానివీ పక్కన పడేస్తారనీ విన్నాను. అలాంటప్పుడు నా నవలకి బహుమతి ఆశించడం వ్యర్థం అని తెలుసు కాని ఈసారి స్నేహితులే కాకుండా అక్క కూడా ప్రోత్సహించడం గమనార్హం. పాఠకుల స్పందన, యజమాని మాటలు, స్నేహితుల ప్రోత్సాహం అన్నీ గుర్తొచ్చాయి. ఇంత మంది ఆశీస్సులు నాపై ఉన్నప్పుడు, ప్రయత్నించడం నా బాధ్యతగా భావించి, దేవుడిని స్మరించి రాయడం మొదలుబెట్టాను. పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతా, ఖర్దపూర్ ప్రాంతాన్ని నేపథ్యంగా ఎన్నుకున్నాను. అక్కడి తెలుగు వారి జీవితానికి సంబంధించిన కథా వస్తువును దృష్టిలో పెట్టుకుని నవల రాయడం ప్రారంభించాను. ప్రవాసాంధ్రులకు తెలుగుపై ఉన్న గౌరవం వర్ణనాతీతం అని నాకు తెలుసు. మా బావ బాల్యం ఆ ప్రాంతంలోనే గడిచిందనీ, అక్కడి తెలుగువారు ఎంతో ఐకమత్యంగా, ఎంతో అభిమానంగా ఉండేవారని చెబుతూ వుండేవాడు తను. 170 పేజీల దాకా నవలను రాయగలిగాను. దాదాపు మరో 5 లేక 6 పేజీలతో నవల ముగుస్తుంది. ముగింపు స్ఫూర్తిదాయకంగా వుండాలని, సందేశంతో కూడుకొని ఉండాలని మెదడుకు సానబెట్టసాగాను. మొత్తానికి నవల పూర్తి చేశాను. విజయం కలుగుతుందన్న ఆశ నాకు అనూహ్యమైన ఆనందాన్ని కలిగించింది.
ఆ రోజు యజమాని తన ఫార్మ్‌హౌస్‌కి తీసుకెళ్లమని ఆజ్ఞాపించాడు. దాదాపు సగం దూరం వెళ్లి ఉంటాం.. నా సెల్‌ఫోన్ మ్రోగింది. నా భార్య నుండే ఆ కాల్.. అక్కకి రెండు రోజుల నుండి ఒంట్లో బాగోలేదని తెలుసు. బహుశా ఫోన్ అందుకేనేమ అని అనిపించింది. అదే జరిగింది.. నా భార్య గొంతు.. యజమాని అనుమతి తీసుకుని కారు ఆపి మాట్లాడాను. ‘ఏమండీ.. మా అమ్మకి జ్వరం తీవ్రంగా ఉంది. స్పృహ తప్పిపోయింది. పక్కింటి అబ్బాయి సాయంతో కేర్ హాస్పిటల్‌కి తీసుకెళుతున్నాను. మీరు వెంటనే అక్కడికి వచ్చేయండి..’ అని ఫోన్ కట్ చేసింది. నేను కంగారు పడసాగాను.
యజమాని అది గ్రహించి కారాపించి.. నన్ను వెంటనే వెళ్లిపొమ్మన్నారు. అక్కడ నుంచి తనే డ్రైవ్ చేసుకొని వెళిపోతానన్నారు.
హడావిడిగా నేను పరిగెత్తాను.
తరువాత మూడు రోజుల వరకు డ్యూటీకి వెళ్లలేకపోయాను. ఆసుపత్రిలో చాలా టెస్టులు చేసి రాత్రంతా వారి పర్యవేక్షణలో ఉంచారు అక్కని.
ఉదయం డాక్టర్ చెప్పిన వార్త విని నిశే్చష్టుణ్ణయ్యాను.
మూడు రోజుల అనంతరం అక్కకు పునర్జన్మ ప్రాప్తమైంది. మూత్రపిండం తీయకుండా పని జరిగింది. ముప్పై వేలకు బిల్లు వచ్చింది. నాలుగో నాడు నా యజమానిని డబ్బు సహాయం చేయమని అడుగుదామని ఆశతో వెళ్లాను. వివరాలు విని ఆయన పదివేలకు చెక్కు నా చేతికి ఇస్తూ ఓ పిడుగు లాంటి వార్త నా చెవిన వేశాడు.
తన అల్లునికి వ్యాపార విషయాల అనుభవం కల్గించాలని తన కారులోనే రోజూ తీసుకుపోవాలని, అతనికి డ్రైవింగ్ వచ్చు గనుక ప్రస్తుతం నా అవసరం లేదని.. అవసరమైనప్పుడు కబురు చేస్తానన్నారు. అంత డబ్బు సహాయం చేసినందుకు కృతజ్ఞతలు చెప్పుకున్నా.. ఉద్యోగం తాత్కాలికంగా పోయినందుకు చాలా బాధ కలిగింది.
శ్యామల మెడలో వున్న మంగళ సూత్రాల గొలుసు నుంచి మంగళసూత్రాలను విడదీసి.. పసుపు తాడుతో కట్టించి గొలుసు అమ్మగా వచ్చిన సొమ్ము, యజమాని ఇచ్చిన సొమ్ముకు జతచేసి ఆసుపత్రిలో జమ చేసి అక్కను ఇంటికి తీసుకొచ్చాను.
వారం రోజులు అక్కకు సీరియస్‌గా వున్నందున నిద్రాహారాలు లేక వేదనతో విధులు నిర్వర్తించకున్నా వీలు చిక్కని కారణం వలన నా ఉనికిని నేను మరచిపోయాను.
కొత్త జీవితం ప్రారంభించడం కోసం ఆటోను మళ్లీ తిప్పడం మొదలుపెట్టాను. రోజులు కష్టంగా గడవసాగాయి. కొద్ది రోజుల్లో తేరుకొని మామూలు మనిషిగా మారానను కోవడానికి తార్కాణం.. నా నవల గుర్తుకు రావడం.
రాయడం పూర్తి అయింది కాని పేరు ఇంకా పెట్టలేదని కూడా గుర్తొచ్చింది. ఎంత ఆలోచించినా ఎక్కడ వదిలేసానో గుర్తుకు రాలేదు.
శ్యామలని అడిగాను.. స్నేహితులని అడిగాను. ఎవ్వరూ చెప్పలేక పోయారు.
పోటీ పంపే గడువు ఎటూ తీరిపోయిందని బాధపడుతూ చేసేది లేక ఊరుకున్నాను.
రోజులూ.. వారాలూ గడిచాయి. నవలల పోటీల ఫలితాలు ప్రకటించబడ్డాయని తెలిసి ఆ వారం పత్రిక కొని ఆత్రుతగా చూడసాగాను. ప్రసిద్ధ రచయిత... ‘సు.. నా..రా’ కలం పేరుగల వారి నవల. ‘అందిన ద్రాక్షలు’ కు ప్రథమ బహుమతిగా యాభై వేలు ప్రకటించబడింది. అభినందనలతో ధారావాహిక నవల ప్రచురణ ప్రారంభమైంది. రచనా వ్యాసంగం పైన ఉన్న మక్కువతో నవల చదవసాగాను. రచనా శైలీ, సంభాషణ, సన్నివేవాలూ, సంఘటనలూ అన్నీ నాకు చిరపరిచితమైనట్లున్నాయి. ఆశ్చర్యంగా ముందుకు సాగాను. అది ఏదో కాదు.. నేను రాసిన నవలే.. నేను రాసి నామకరణం చేయని నవల. ప్రసిద్ధ రచయిత ...సు.. నా.. రా పేరుతో ప్రచురితవౌతోంది. కళ్లు బైర్లు కమ్మాయి. ఆనాడు పూర్తయిన నా నవలను డి.టి.పి. చేయిద్దామని నా బ్యాగులో వుంచి కారు డ్రైవ్ చేస్తూ వుండగా అక్కకు సీరియస్ అన్న మాటతో పరుగెత్తినప్పుడు దానిని కారులోనే వదిలేసానన్న విషయం గుర్తొచ్చింది. ఆ నవల సు.. నా..రా గారి రచనగా ఎన్నిక కాబడి, ప్రథమ బహుమతి యాభై వేలు గెలుచుకుంది. సునారా గారి అర్థ ప్రతిష్ఠ, లబ్ద ప్రతిష్ఠ ఒకేసారి కలిగాయి. నేను నిశే్చష్టుణ్ణయ్యాను. అంతలో మా యజమాని గారి సాహిత్యాభిలాష గుర్తుకొచ్చింది. వారు నాకు చేసిన ఆర్థిక సహాయం వెనుక అంతరార్థం అవగతమైంది. ఉద్యోగ ఉద్వాసనకు కారణం కూడా తెలిసింది.
భగవంతుడు పుట్టిన ప్రతీ జీవికీ అదృష్టాన్ని నింపుతూ ఒక కప్పు మాత్రం ఇస్తాడట. ఆ కప్పు చిన్నదైనా.. పెద్దదైనా.. ఆ జీవి అదృష్టమే. ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే ఆ కప్పులోని వైశాల్యం వుంటుంది. ఆ ప్రత్యేకత ఫలితమే నాకిప్పుడు అనుభవమైంది. అదృష్టం ఆయనకి దక్కింది. ఫోన్లు.. బొకేలూ.. విందులూ.. విలాసాలూ.. అభిమానుల అభినందనలతో యజమాని ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉంటే.. మనస్ఫూర్తితో కూడుకున్న అక్క ఆశీస్సులు నాకు దక్కాయని నేను భావించాను. ఒక విధంగా చెప్పాలంటే అవి ఎంతో హాయిని, ఆనందాన్ని నాకు అందించాయి అనడంలో అతిశయోక్తి లేదు... ‘చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరవైనట్లు..’ శతక పద్యం నా మెదడులో మెరిసింది.
**

కథలకు ఆహ్వానం

‘ఆదివారం ఆంధ్రభూమి’కి కథలు పంపవలసిన చిరునామా:

ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్,
సికిందరాబాద్- 500 003.

పీడీఎఫ్ ఫార్మాట్‌లో sundaymag@andhrabhoomi.net కు మెయిల్‌లో పంపాలి.

భాగవతుల సత్యనారాయణ మూర్తి 9440871667