కథ

యువ చైతన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అమ్మా! నేను అజయ్‌నే చేసుకుంటాను. ఉదయ్ వాళ్ల పేరెంట్స్‌తో చెప్పేస్తే మంచిదేమో!’ అమల మాటలకు అవాక్కయింది వింధ్య. అమల అమెరికా నుండి వచ్చిన నాలుగు రోజుల తరువాత బోర్ కొడుతూన్నదంటే దూరపు బంధువులను పరిచయం చేసినట్లు కూడ ఉంటుందని నాలుగు పల్లెటూర్ల ప్రయాణం పెట్టుకుని తిరిగి వచ్చారు. ఆ తరువాత కొద్ది రోజులకే తాను అమెరికా ఇక వెళ్లనని చెప్పింది. అమెరికా సంబంధాలు చూస్తున్న వింధ్య అమల నిర్ణయంతో నివ్వెరపోయింది.
తండ్రికి అమలంటే ప్రాణం. ఉదయ్ సిటీలోనే మంచి ఉద్యోగంలో ఉన్నాడు. ఉదయ్ పేరెంట్స్ అమలను తమ కోడలిగా చేసుకోవాలన్న కోరిక తెలిపారు. ఇక ఉదయ్ అమలలు ఇష్టపడితే తన కోరిక తీరుతుంది. అందరూ ఒకే సిటీలో ఉండవచ్చనుకున్నాడు.
కానీ, వింధ్యకి ఉదయ్ సంపాదన ఆనలేదు. డాలర్ మాత్రమే జీవితాన్ని డామినేట్ చేస్తుందనుకునే వింధ్య అమలని తిరుగు ప్రయాణానికి సిద్ధం చేసే క్రమంలో ఆలోచనల్లో మునిగిపోయింది.. ‘ఈ మధ్య అమెరికా నుండి వచ్చిన అక్కయ్యగారి అమ్మాయి ఎంత అందంగా మారిపోయిందో! ‘పిల్లల తల్లి’ అంటే ఎవరూ నమ్మరు. అక్కడే పురుళ్లు పోసి వచ్చిన అక్కయ్య కూడా ఎంతగా మారిపోయిందో! ఎనె్నన్ని కబుర్లు చెప్తున్నదో! అమెరికా ఉద్యోగం వదిలేసి ఇక్కడే ఉండిపోతానంటుందేమిటో ఈ పిచ్చి తల్లి! ఎలాగయినా మళ్లీ అమెరికా పంపాలి. తండ్రీ కూతుళ్లకు డబ్బు విలువేమీ తెలీదు. నలగని చీరలు కట్టుకుని నలుగురిలో దర్పంగా తిరగాలంటే డబ్బేగా కావాలి. కట్టుకున్న చీరతోనే తాహతు తెలిసేది. నాలుగు విషయాలు మాట్లాడలేకపోయినా వస్తధ్రారణే వజ్రాయుధంగా పని చేస్తుంది. కాస్త నల్లరంగు జుట్టుకద్ది, నగలు సింపుల్‌గా పెట్టుకున్నా ఖరీదైన చీరతో నలుగురిలో నగుబాటు కాకుండా తిరగొచ్చు. డాలర్ విలువ తెలీని అమలనెలా మార్చాలి? డబ్బు పారేస్తే కొండమీది కోతి కూడా దిగి వస్తుంది. ప్రక్కింటి మామ్మగారు సీరియస్ అయినపుడు, వాళ్ల పిల్లలు ఆన్‌లైన్‌లో నర్సులను ఏర్పాటు చేస్తే జాగ్రత్తగా చూసుకున్నారు. డాలర్ల మహిమ! పక్కింటి వారికేమీ పట్టకపోయినా మామ్మగారు ఒక్కళ్లే నెట్టుకొస్తున్నారు. ‘మేమిద్దరం మాకొక్కరు’ తరహాలో ఈ ఫ్లాట్స్ వాళ్లకి ఇరుగూ పొరుగూ అక్కర్లేదు. పార్కింగ్ ప్లేస్‌లో మాత్రం ఎవరెవరు కార్లు మార్చారో గమనిస్తున్న ఖరీదైన జీవన శైలి. కొడుకు అమెరికా నుండి డబ్బు పంపాడని పక్క ఫ్లాట్ వాళ్లు హోండా సిటీ కారు కొన్నారు. మొన్న వెళ్లిన ఒక ఊళ్లో పిల్లలు పంపిన డాలర్లతో జూబ్లీ హిల్స్ లెవెల్‌లో ఇల్లు కట్టారు. ‘్ధనం మూలం ఇదం జగత్’. అమలకి అన్నీ తండ్రి బుద్ధులే. వీళ్లిద్దరినీ తన దారిలోకెలా తెచ్చుకోవాలి.. తన ఒక్కగానొక్క కూతుర్ని అందలమెక్కించాలనుకున్న ఆశలన్నీ అడియాసలయ్యాయి. భర్త ఎలాగూ మారడు. అమలతోనే సీరియస్‌గా మాట్లాడాలి..’ అనుకుంటూ బాల్కనీలోకి వచ్చి కూర్చుంది వింధ్య.
అక్కడే కూర్చుని ఉన్న అమల చూపులు సూటిగా ఉన్నాయి. పాతికేళ్ల వయసుకే ఎంతో జీవితాన్ని చదివిన అనుభవం కానవస్తూంది.
తల్లి వైపు నిశితంగా చూస్తూ.. ‘నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసమ్మా! అజయ్ నాకు తగినవాడు కాడనే గదా?.. నీ దృష్టిలో ఉదయ్ కూడా ఒక మెట్టు నాకంటే కిందే ఉన్నాడు. నా జీవితం ముందుకు సాగాలంటే నీవు వెనకడుగు వేయక తప్పదు. నేను చిన్నదాన్ని కాదు. బాగా ఆలోచించే నేనీ నిర్ణయం తీసుకున్నాను. నాకేమి కావాలో నాకు తెలుసు. ఈ రెండేళ్లలో పది మందిని కలిసి పది రకాల మనస్తత్వాలను అర్థం చేసుకున్నాను. అమెరికా అయినా అంతరిక్షం అయినా మనుషులు మారరు. మొన్న మనం వెళ్లిన పల్లెటూర్లలో చిన్న రైతులైనా వాళ్ల మనసులు పెద్దవి. కౌలుకు తీసుకున్న పొలాల్లో బిందు, తుంపర సేద్యం చేసి మనకు అన్నదానం చేస్తున్నారు. దేవుడిచ్చిన వర్షపు నీటితోనే బోర్లను రీఛార్జి చేసి కరువుకాలంలో కూడా సిటీ మనుషుల కడుపు నింపుతున్నారు. నాకు తెలిసిన ఒక జంట అమెరికా నుండి, వాళ్ల పల్లెకి వచ్చి సెటిలయ్యారు. 50 మంది రైతులు కలిసి నీటి బ్యాంక్‌లో అయిదు కోట్ల లీటర్ల నీటిని నిల్వచేసి ఇంటి అవసరాలకు, పశువులకు, మొక్కలకీ సరిపోయేలా చూస్తున్నారు. నీకెప్పుడూ నీ బ్యాంక్ బాలెన్స్ గురించిన ఆలోచనలే. ఇక నీలాంటి వాళ్లు నీటి బ్యాంకుల గురించి కూడా తెలుసుకోవాలి. అమెరికా నుండి వెనక్కి వచ్చేసిన నాకు తెలిసిన ఇంజనీర్లు గ్రామాల్లో 24 గంటల ఏటీఎంలు ఏర్పాటు చేసి ఒక్క రూపాయికి మూడు లీటర్ల తాగే నీరు అందజేస్తున్నారు. వాళ్లు నీటిని శుద్ధి చేస్తున్నట్లే నీవూ నీ అత్యాశల్ని కడిగి పారెయ్యాలమ్మా. నీ బ్యాంక్ బాలెన్స్‌తో బోలెడు బోర్లు వేయించవచ్చు కానీ ఒక్క బొట్టు నీటిని నీవు మా పిల్లలకి పుట్టించలేవు. ఇల్లు తుడిచిన నీళ్లు బయటి వేపమొక్కకి పోసి బ్రతికిస్తే నీకు రేపు ప్రాణవాయువు నందిస్తుందని తెలిసినా పట్టించుకోవు.
మన విశాలాక్షి అమ్మమ్మ పడక వేస్తే చుట్టుపక్కల వాళ్లే చూసుకున్నారు. ఇక్కడ ఆ అనుబంధాలు మరుగై పోయాయి. వీధి మొదట్లో ‘ఎవరు కావాలండీ’ అంటూ వస్తున్నామె వెనుక కుక్క కూడా తోకాడించుకుంటూ ‘మా ఊరికి చుట్టాలొస్తున్నారు’ అన్న సంబరంతో మనతో నడిచింది. అక్కడి కాలుష్యం లేని వాతావరణంలానే మర్యాదలు కూడా నిష్కల్మషంగా ఉన్నాయి. వాళ్లిచ్చిన గుమ్మపాల కమ్మని కాఫీలానే నా జీవితం పల్లెతో కమనీయంగా పెనవేసుకోవాలి. ఇదే నా నిర్ణయం.’
‘ఏంట్రా అమ్మలూ! ఏదో నిర్ణయమంటున్నావ్?’ తండ్రి నవ్వుతూ వచ్చి ప్రక్కనే కూర్చున్నాడు. వింధ్య నిస్తేజమైన చూపులు తాకుతుంటే అమల తండ్రిని గోముగా అడిగింది. ‘నాన్నా! నా నిర్ణయానికి విలువిస్తారా?’
‘చెప్పమ్మా. నీ నిర్ణయమే మాకు సమ్మతమవుతుంది. నీవు చిన్నపిల్లవు కావు’ తండ్రి అభయ హస్తంతో అమల అంతరంగం విప్పి నాట్యం చేసింది. అజయ్‌నే ఎందుకు కోరుకుంటున్నదో చెప్పేయాలనిపించింది.
‘మేము వెళ్లిన పల్లెలు నాకెంతో నచ్చాయి నాన్నా! విశాలాక్షి అమ్మమ్మ పల్లెని విడిచి పిల్లలతో పట్నంలో ఉండనన్నదంట. బంధువులూ, ప్రక్కింటివారే ప్రేమగా చూసుకుంటున్నారు. రెండవ పల్లెలో మీ కజిన్ ఇంటికి వెళ్లాం. కొబ్బరిచెట్ల మధ్య వాళ్ల పెంకుటిల్లు ఎతె్తైన రూఫ్‌తో చల్లగా హాయిగా అనిపించింది. తాటిముంజెలు తిని కొబ్బరి నీళ్లు తాగాము. పశువుల కోసం ఉడికించిన ఉలవల్లో ఉప్పు, కారం చల్లుకుని తింటుంటే పిజ్జాలు ఎందుకూ పనికిరావనిపించింది. ఆ ఇంటిలోనే ఒక గది అంగన్వాడిగా చేసి చిన్నపిల్లల్ని మీ కజిన్ చదివిస్తున్నది. అది చూస్తే నేనూ ఒక స్కూల్ బీద పిల్లల కోసం నడపాలనిపించింది.
‘మూడవ పల్లెలో అజయ్ చేస్తున్న ప్రయత్నాలు ఆ ఊరి వారిని వ్యవసాయంలో లాభాలు గడించేలా చేశాయి. అతనూ ఇంజనీరింగ్ చదివినా తండ్రికి సాయంగా వ్యవసాయమే వృత్తిగా చేసుకుని గ్రామాభివృద్ధికి అంకితమయ్యాడు. చుట్టుపక్కల ఊరి వారు కూడా బోర్‌వెల్ రీఛార్జి పద్ధతులను అజయ్ నుండి నేర్చుకుంటున్నారు. ఆ ఊర్లల్లో, రెండున్నర లక్షలతో నీటిని శుద్ధి చేసే ప్లాంట్‌ని పెట్టి అయిదు రూపాయలకు ఇరవై లీటర్ల నీటిని ఇస్తున్నాడు. వర్మి కంపోస్ట్ యూనిట్ పెట్టి, సేంద్రియ పద్ధతుల్ని నేర్పుతున్నాడు. అందరికీ పాడి ఉండేలా రైతులను ప్రోత్సహిస్తున్నాడు. కూరగాయల సాగు కోసం తమ పొలంలోనే బీద రైతులకు వెసులుబాటు కల్పించాడు. అందుకే నేను తనతో కలిసి ఆ మండలంలోని బీద పిల్లలకు మంచి విద్యావ్యవస్థ నేర్పరిస్తే ఆ కుటుంబాలకు ఏ లోటూ ఉండదని ఆశిస్తున్నాను నాన్నా! నా నిర్ణయం మీకు బాధ కలిగించచ్చు. మీరు మన ఫ్రిజ్ మీద స్టిక్కర్‌తో పెట్టిన శ్రీశ్రీ పాట నేను మర్చిపోలేదు.
‘కడుపారఁగ కూడు లేని తలదాచగ గూడు లేని దీనుల జీవితాలు మారుటెన్నడో, కలవారలు లేనివారి కష్టాలను తీర్చు దారి కనిపెట్టి మేలు చేయగలిగినప్పుడే’
ఆ దారి నాకిప్పుడు కనపడింది నాన్నా! నన్ను ఆ పైర గాలిలో పాడి పశువులతో, సాటి మనుషుల కష్టాలతో కలిసి బతకనివ్వండి. అమ్మకెలా నచ్చచెప్తారో’
వింధ్య విస్తుపోతూ విసురుగా లేచి వెళ్లిపోయింది.
‘మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా! మా కళ్లెదుట ఇండియాలోనే ఉంటానంటే చాలా సంతోషంగా ఉంది. డబ్బు కంటే వ్యక్తిత్వమే గొప్పదని అజయ్ నిరూపించి నీ మనసు దోచుకున్నాడు. మీరు పల్లె పట్టున పది కాలాలపాటు చల్లగా బ్రతకాలని కోరుకుంటున్నాను’ తల నిమిరాడు. అమ్మ లోనికెళ్లి అమ్మ కొంగు పట్టుకుని మెల్లగా నాన్న వద్దకి నడిపించింది.
===========================================================
కథలకు ఆహ్వానం

‘ఆదివారం ఆంధ్రభూమి’కి కథలు పంపవలసిన చిరునామా:
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 500 003.
పీడీఎఫ్ ఫార్మాట్‌లో sundaymag@andhrabhoomi.net కు మెయల్‌లో పంపాలి.

-ఎం.ఛయాదేవి 9391011891