ఈ వారం కథ

దీపిక (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిరు చీకటి తొలి వెలుగులో మెల్ల మెల్లగా తప్పుకొంటున్న వేళ, పక్కనే ఉన్న కోవెల స్పీకర్స్‌నుంచి మంద్రంగా వినిపిస్తున్న తిరుప్పావై. మంచు దుప్పటి కప్పుకున్న సూర్యుడు బద్ధకంగా కళ్ళు తెరుస్తోంటే కిటికీలోంచి పడుతున్న కిరణాలు నన్ను తడుపుతున్న అనుభూతి.
‘‘తల్లీ దీపికా నిద్ర లేవమ్మా, కాలేజీకి మరలా ఆలస్యవౌతుంది’’ అమ్మ మేలుకొలుపు పాట పదోసారి చెవినబడింది. ‘‘కోవెలలో పెరుమాళ్ళుకు కూడా ఇంతసేపు సుప్రభాతం పాడరే బాబు నీకులాగా’’ అమ్మ మాటలలోని వేడి నేను ఆలస్యం చేసే కొద్దీ పెరుగుతుంది.
మరో నలభై నిమిషాలలో తొమ్మిది గజాల మడి చీరలో నేను రెడీ. ఇది పూజకు సమయం. ప్రపంచమంతా బెడ్ కాఫీలు, బ్రంచ్‌లతో మునిగి తేలుతున్నా మా వూరిలో అవి పూర్తిగా నిషిద్ధం. మా వంశమంతా శ్రీరంగం కోవెల సేవకు అనేక తరాలుగా అంకితమైంది. అందులో ఎక్కువమంది ఆంధ్ర దేశం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడినవారే. అరగంట తర్వాత టిఫిన్ ప్లేట్‌తో అమ్మ, కాలేజీ డ్రెస్‌లో నేను రెడీ.
‘‘ఏమే కోడలా ఈ ప్రసాదం కూడా తిని వెళ్ళవే’’ హడావుడిగా వచ్చింది మా అత్త. ఆవిడకు డెబ్భై ఏళ్ళు ఉంటాయి. అందరూ ఆవిడని మామి అని పిలుస్తారు. ప్రతి రోజు ఉదయానే్న గుడిలో ప్రసాదం తెచ్చి నాకు పెట్టడం అలవాటు. ‘‘ఏమే నిజం చెప్పవే, నిన్ను రోజు చూడడం కోసమే భగవంతుడు నాకు చూపు ఇంకా ఉంచాడు, కాదటే, గుళ్ళోని లక్ష్మిదేవికి నీకు ఏమి తేడా లేదే’’. నన్ను చూడగానే మామి ప్రతిరోజు అనే మాటలు ఇవే. ‘‘దీపికా కోవెలకు మాత్రం వెళ్ళకే, ఆ దేవుడే నిన్ను చూసి మనసు పారేసుకోగలడు’’ మామి ఇలా మాట్లాడుతుండగానే మా అమ్మ హడావుడిగా వంట గదిలోకి వెళ్లింది. ఎవరు నన్ను చూసి ఇలా పొగిడినా మా అమ్మ వెంటనే ఉప్పు మిరపరకాయలు తీసుకొని దిష్టి తీయడానికి రెడీ అవుతుంది. మా అమ్మ ఈ సరంజామా తీసుకొని వచ్చేలోగా నేను గేటు దాటేశాను.
బస్‌స్టాప్ మా ఇంటినుంచి పది నిమిషాల నడక. నాకు మొదటినుంచి లెక్చరర్ కావాలని కోరిక. అందుకే ఇంజనీరింగ్ తప్ప మరేది కాదు చదవడానికి అర్హం అనే నేటి కాలంలో నేను బి.ఎస్సీ కెమిస్ట్రీ తీసుకున్నాను. వీధి మలుపు తిరిగాను. నాకు తెలియకుండానే ఒక్కసారిగా నా నడక వేగం తగ్గిపోయింది. అప్పటివరకు మామూలుగా ఉన్న నాలో ఏదో తెలియని భయం. ఈ రోజు ఏం జరుగుతుందో తెలీని ఆందోళన. సన్నగా కాళ్ళు వణకడం తెలుస్తోంది. తల పూర్తిగా వంచుకొని నేలను మాత్రం చూస్తూ నడవసాగాను.
‘‘ఏవండీ’’ అదే గొంతు, అదే పిలుపు. మొదటి పిలుపు వినపడనట్లుగానే అతన్ని దాటి వెళ్లబోయాను. కాని కుదరలేదు. మరోసారి గట్టిగా పిలుస్తూ నా దగ్గరికి వచ్చేసాడు. పక్కనే బస్సు స్ట్ఫాలో చాలామంది జనం. అందరి దృష్టి ఆకర్షించడం ఇష్టంలేక తలెత్తి చూసాను అతని వంక. 35 ఏళ్ళు ఉంటాయనుకుంటాను. చూడగానే మా వూరివాడు కాదని తెలుస్తోంది. చక్కగా డ్రెస్ చేసుకొని పద్ధతిగా ఉంటాడు. తమిళం రాదు కాబోలు. నవ్వుతూ నిలుచొని నా వంకే చూస్తూ ఉన్నాడు. ఆ కళ్ళలో ఏదో తెలియని ఆరాధనా భావం. చటుక్కున తల తిప్పుకొన్నాను.
ఏదో కాగితం చేతికి అందించాడు. తమిళం తెలియదల్లే వుంది, చక్కటి ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నాడు. భయంతో నా చెవులు పనిచెయ్యడం ఎప్పుడో మానేసాయి. అతను చెప్పడం అయిపోయినట్లు ఉంది. చివరిగా సాయంకాలం రండి, మీకోసంవెయిట్ చేస్తూ ఉంటాను అంటున్నాడు. అవునని కాదని కాక మధ్యరకంగా తల ఊపి అక్కడనుండి కదిలాను. వెనుకనుంచి నన్ను ఆ చూపులు తడుముతూనే ఉంటాయన్న ఆలోచనే చాలా ఇబ్బందిగా ఉంది. దాదాపు పరిగెత్తినంత వేగంగా బస్సు స్ట్ఫాలో వచ్చిపడ్డాను.
ఈ సమస్య మూడు నెలల క్రితం మొదలైంది. ఆ రోజు బస్సు కోసం వచ్చేసరికి ఏదో కొత్త షాప్ ప్రారంభించినట్టు ఉన్నారు. బాగా హడావుడిగా వుంది. స్పీకర్స్‌లోనుంచి పాటలు పెద్దగా వినిపిస్తున్నాయి. సాయంకాలం కాలేజీ నుంచి వచ్చేటప్పుడు ఆ షాప్‌లోకి అడుగుపెట్టడంతో నా దురదృష్టం మొదలైంది. అతను ఓనర్ అనుకుంటా, నన్ను చూడగానే అతని ముఖం వెలిగిపోయింది. కౌంటర్‌లోంచి తనే వచ్చి నాకు స్వయంగా డ్రెస్సెస్ చూపించసాగాడు.
నేను కేవలం చూద్దామని వెళ్లాను. అతను నేను చెప్పేది ఏదీ వినిపించుకోవడంలేదు. అలా అని కొనమని పట్టుబట్టలేదు. నాకు ఏ డ్రెస్ నచ్చిందో చెప్పమని మాత్రం మరీ మరీ అడగసాగాడు. నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఏదో ఒకటి చెప్తేకాని వదిలేట్టు లేడనిపించి కంటికి కనిపించిన ఒక చుడిదార్‌ని చూపించాను. దాంతో నన్ను వదిలిపెట్టాడు. మరో రెండు నిమిషాల్లో నేను ఆ షాప్‌లోనించి బయటికి వచ్చాను. ఇంతలో వెనుకనుంచి ఎవరో పిలుస్తున్నట్టు అనిపించింది. షాప్‌లోని ఒక సేల్స్‌మాన్ చేతిలో ఒక కవరుతో నావంకే చూస్తున్నాడు. తను నా దగ్గరికి వచ్చి, మీకు ఇది లక్కీ డిప్‌లో వచ్చిన డ్రెస్ అని చెప్పి ఆ కవర్ నా చేతిలో పెట్టబోయాడు. నాకేమీ అర్థం కాలేదు. ‘‘సారీ మీరు పొరపాటు పడినట్టున్నారు, షాప్‌లో నేనేమీ కొనలేదు, ఏ లక్కీడ్రాలోను లేను’’ అని చెప్పబోయాను. ఇంతలోనే షాప్ ఓనర్ గబగబా మా దగ్గరికి వచ్చాడు. అతనిలో అదే వెలుగు. ‘‘లేదండి, ఇందులో పొరపాటేమీ లేదు. మేము డిస్‌ప్లేలో పెట్టిన డ్రెస్సెస్‌లో కొన్నిటిని లక్కీడ్రెస్‌గా ఉంచాం. అవి ఎవరు సెలెక్ట్ చేసుకొంటే వారికి ఉచితంగా ఇస్తాం, మీరు సెలెక్టు చేసింది లక్కీ డ్రెస్. అందుకనే ఇస్తున్నాం’’ అన్నాడు. నాకది నమ్మశక్యం కాలేదు. కాని ఎంతో ప్రాధేయపడుతున్నట్టు తీసుకోండి ప్లీజ్ తీసుకోండి అంటున్న అతని చూస్తే, తీసుకోకపోతే వదిలేటట్టు లేడనిపించింది. అయిష్టంగానే తీసుకొని బయల్దేరాను, మరిక ఎప్పుడు అక్కడ అడుగుపెట్టకూడదు అనుకుంటూ. ఆ లక్కిడ్రెస్ గురించి ఇంట్లో వాళ్ళకు అర్థమయ్యేటట్లు చెప్పడం నావల్ల కాలేదు. అది చాలా ఖరీదైన డ్రెస్ అవడంతో నా పాకెట్ మనీలోనించి కొన్నానేమోనన్న సందేహం మా అమ్మకు తీరిందో లేదో నాకైతే తెలీలేదు.
తరువాతి రోజు కాలేజీకి వెళ్ళడానికి ఆ షాప్ ముందునుంచి నడుస్తూ కాజువల్‌గా షాప్ వంక చూశాను. కౌంటర్లో కూర్చున్న అతను పలకరింపుగా నవ్వాడు. తప్పనిసరై నేను కూడా నవ్వాను. సాయంకాలం బస్సు దిగేసరికి అతను షాప్ ముందు నిలుచొని ఉన్నాడు. మరలా అదే చిరునవ్వు. నేను చిన్న విషయానికి అతిగా స్పందిస్తున్నానేమో అనిపించింది. మా వీధి మలుపు తిరిగిన తర్వాత ఎందుకో వెనక్కి తిరిగి చూశాను. నా వెనుకే నడుస్తూ వస్తున్న అతను, పట్టుపడిపోయినట్టుగా కనిపించాడు. కాని వెంటనే సర్దుకొని నవ్వడానికి ప్రయత్నించాడు. నేను గిరుక్కున తల తిప్పుకొని ఇంటిలోకి వెళ్లిపోయాను.
మరుసటి రోజు నేను ఆ షాప్ వంక చూడకుండా అతను పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్లడానికి ప్రయత్నించాను. షాప్ లోపల్నించి దాదాపు పరుగెత్తుకొని వచ్చిన అతను నాతో ఏదో మాట్లాడడానికి ప్రయత్నించాడు. ఎదురుగా నించున్న అతనిని నేను తప్పించుకోలేక ఆగాను. ‘‘మీరు షాప్‌కి రావడమే లేదు. ఈ రోజు సాయంకాలం వస్తారు కదూ’’ దీనంగా అడుగుతున్న అతనిని ఏమి అనాలో తెలియలేదు. సరే సరే అంటూ ముందుకు కదిలాను. సాయంకాలం షరా మామూలుగానే మా ఇంటి వరకు నా వెనుకే తను. నాకు ఇదో తలనొప్పి వ్యవహారం నుంచి సమస్యగా తయారైంది అనిపిస్తోంది. ఎంతో పరువు కలిగిన కుటుంబం మాది. ఊరంతా ఎంతో గొప్పగా చెప్పుకునేది మా నాన్నగారి గురించి. నావల్ల ఆయనకు ఏ ఇబ్బంది రాకూడదు.
తర్వాతి రోజు నాకోసం ఒక పెద్ద షాక్‌ని దాచి ఉంచిందని నాకు తెలీదు. నేను బస్సు స్టాప్‌కెళ్ళేసరికి ఆ షాప్ మూసి ఉండడంతో చాలా రిలీఫ్‌గా అనిపించింది. కాని ఆ ఆనందం ఎక్కువసేపు నిలువలేదు. బస్సు కదలగానే దానిని వెంబడిస్తూ ఒక బైక్‌మీద అతను రావడం చూసేసరికి గుండె జల్లుమంది. తను ఎక్కువగా ననే్న చూస్తూ బైక్ నడపసాగాడు. అప్పుడే ఒక ఊహించని సంఘటన జరిగింది. వేగంగా ఎదురుగా వచ్చిన ఇన్నోవా కార్‌ని అతను చూడలేదు. మరుక్షణంలో నా కళ్ళముందే కిందపడి పోయిన అతని బైక్, ఆ వేగానికి గాల్లోకి లేచిన అతను పక్కనే ఉన్న కరెంటుపోల్‌కి కొట్టుకుని కింద పడిపోవడం చూసాను. దేవుడా ఏమిటిదంతా.
మరొక నాలుగు రోజులు ఏదో తెలియని బాధ, ఆందోళన అన్నీ కలిసి జ్వరం రూపంలో నన్ను బెడ్‌మీదనుంచి కదలనివ్వలేదు. ‘‘ఇది ఏమి జ్వరమే నాలుగు రోజులకే ఇలా ఐపోయావు’’ అని అమ్మ ఎన్నిసార్లు కళ్ళనీరు పెట్టుకొందో. వారం రోజుల తర్వాత నేను మరలా కాలేజీకి కదిలాను. మరలా ఏమి చూడాల్సి వస్తుందో అనుకుంటూనే కదిలాను. ఆ షాప్ తెరిచే ఉంది. అక్కడ నేను చూసిన దృశ్యం నన్ను కదిలించివేసింది. అతను అక్కడే నిలుచుని ఉన్నాడు. ఫ్రాక్చర్ అయింది అనుకుంటా, చేతికి పెద్ద కట్టు ఉంది. తలకి కూడా ఒకవైపు పెద్ద కట్టు ఉంది. కాని నన్ను చూడగానే అతని కళ్ళల్లో అదే సంతోషం. నేను ముఖం తిప్పుకొని వెళ్లిపోయాను. ఆ తర్వాత నెల రోజులు తను నన్ను ఫాలో అవలేదు.
ఇదిగో ఈ రోజు మరలా ఏదో స్కీం వంక పెట్టి మరలా తన హింస మొదలుపెట్టాడు. గడచిన రెండు నెలల్లో నాలో చాలా మార్పు వచ్చింది. ఎప్పుడూ సందడిగా వుండే నాలో తెలీని బాధ, భయం గూడుకట్టుకొనిపోవడంతో స్తబ్దుగా మారాను. నాలోని ఈ మార్పుని మొదట గమనించింది మా నాన్నగారే. కాని ఆయన నన్ను ఏమీ అడుగలేదు.
బస్సు కదిలింది. ఆలోచనల్లో మునిగి వున్న నా భుజంపై ఎవరిదో చెయ్యి పడింది. ఉలిక్కిపడి వెనక్కుచూశాను. భయం కాస్త ఏడుపుగా మారింది. అనుకోకుండా మా నాన్నగారిని చూడగానే బస్సులో అందరూ చూస్తున్నారన్న విషయం కూడా మరిచిపోయాను. ఆయన నా వెనుకే వచ్చి బస్సులో కూడా నా వెనుక కూర్చుని చూస్తున్నట్టున్నారు. కాసేపటి తర్వాత నేను మామూలు అయ్యాను. ఆయనకి అంతా అర్థం అయింది అనిపించింది. కాలేజీ గేటులో దిగపెట్టి ‘‘చిట్టి తల్లి కంగారు పడకు, సాయంకాలం నేను బస్సు స్ట్ఫాలో ఉంటాను’’ అని వెళ్లారు.
సాయంకాలం వరకు కాలేజీలో అన్యమనస్కంగా గడిపాను. బస్సు స్ట్ఫాలో దిగేసరికి నాన్న అక్కడే ఉన్నారు. ఆయన అడిగిన ఒకే ఒక విషయం ‘‘నీ బాధకి కారణం ఆ వ్యక్తేనా అమ్మా’’. నేను తలూపాను. మరేం చెప్పాలో నాకర్థం కాలేదు. ఇలాంటి సంఘటనలు మా కుటుంబంలో ఎప్పుడూ జరిగిందే లేదు.
నాతో పాటు వస్తున్న నాన్నను చూడగానే బయట నిలుచున్న అతను గబ గబా లోపలికి వెళ్ళబోయాడు. నాన్న అతన్ని చూసి చెయ్యి ఊపారు. అతని ముఖంలో ఒక్కసారిగా రంగులు మారాయి. నాన్న ఎప్పుడూ చాలా తక్కువగా మాట్లాడుతారు. ఎప్పుడూ గంభీరంగా వుండే నాన్నను చూస్తే అందరికి ఒక జంకు వుంటుంది. షాపు ముందరికి రాగానే అతన్ని సూటిగా చూస్తూ నాన్న ‘‘ఏమిటి విషయం, ఎందుకిదంతా?’’ అన్నారు. ఆయన మాటల్లో కోపం ధ్వనించలేదు. కాని ఆయన చూపులకే అతను తట్టుకోలేకపోయాడు. రెండు చేతులెత్తి నమస్కరించి, నాతో రండి స్వామి దయచేసి అన్నాడు. ఎక్కడికని నాన్నగారు అడగలేదు. అతను పక్కనే నిలిపి ఉన్న కారుకేసి నడిచారు. నాన్నగారు, నేను అతని వెనుకే నడిచాము. కారు వెళుతూన్నంతసేపు ఎవరం ఏమీ మాట్లాడుకోలేదు. అతనిలో ఆశ్చర్యంగా ఎంతో ఉద్విగ్నత కలిసిన సంతోషం కనబడుతోంది. నాకేమి అర్థం కావడంలేదు.
మరో రెండు నిమిషాలలో కారు ఇంటిముందు నిలబడింది. చుట్టూతా మంచి గార్డెన్ మధ్యలో ఇల్లు. కొత్తగా కట్టినట్లు ఉంది ఇల్లు. అతను ముందు నడుస్తుండగా మేమిద్దరం ఇంటిలోకి ప్రవేశించాం. కాలింగ్ బెల్ చప్పుడుకు వాళ్ళమ్మ అనుకుంటా తలుపు తీశారు. నన్ను చూడగానే ఆవిడ ముఖంలో ఆశ్చర్యం, లోపలికి రమ్మని చెప్తూనే ఆవిడ కళ్ళల్లో నీళ్ళు. ఆవిడ బాధని అణచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. నాన్నగారికి కూడా ఏమీ అర్థం అయినట్టు లేదు కాని తను మామూలుగానే ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. మొదట గదిలోకి అడుగుపెట్టగానే కరెంటు షాక్ తగిలినట్లైంది. నా లైఫ్ సైజు ఫొటో ఆర్టిస్టు గీసిన చిత్రం ఆ రూపంలో తగిలించి ఉంది. హాల్లో ప్రవేశించాం. వాళ్ళు కూర్చోమని చెప్తున్నారు. కాని ఆ మాట నాన్నకు, నాకు వినపడటంలేదు. గోడలనిండా నా ఫొటోలే. రకరకాల డ్రెస్సెస్‌లో నేను ఆ గదంతా నిండి ఉన్నాను.
అతని అమ్మగారు మాటలాడటం మొదలుపెట్టారు. ‘‘మాది ఆంధ్ర దేశం బాబు, వీడు మంచి కంపెనీలో జాబు చేసేవాడు. వీడికి తోడబుట్టిన చెల్లి అంటే ప్రాణం. అది మామూలు ఇష్టం కాదు బాబు, ప్రాణం. అది 18వ ఏట కాలేజీనుండి వస్తూ ఆక్సిడెంట్‌లో మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయిం ది. పోతూ పోతూ వీడి మనసుని కూడా అది తీసుకెళ్లిపోయిందమ్మా. వీడు దాదాపు పిచ్చివాడైపోయాడు. వీడికోసం ఊరు, రాష్ట్రం విడిచి ఇదిగో ఇక్కడ పుణ్యక్షేత్రంలో ఉండే బాగుంటుందని సంవత్సరం క్రితం వచ్చామమ్మా. ఇక్కడికి వచ్చాక కూడా వీడు కొంచెం కూడా మారలేదమ్మా’’. నా కళ్ళల్లోంచి నీళ్ళు నాకు తెలీకుండానే వచ్చేస్తున్నాయి. ‘‘నువ్వు కనిపించినప్పటినుంచి వీడు మరలా మామూలు అవడం మొదలుపెట్టాడు. నీకెలా చెప్పాలో తెలీలేదు. అసలే కొత్త ఊరు. అచ్చం తన చెల్లి మరలా పుట్టినట్లున్న నిన్ను చూసి.. ’’ ఆవిడ చెప్తూనే ఉంది.
కన్నీళ్ళతో నిండిన నా కళ్ళలోంచి కూడా అతని రూపం మనసకగా కనిపిస్తున్నా కూడా అతని కన్నులలోని ప్రేమ మాత్రం స్పష్టంగానే తెలుస్తోంది. *

-జి.వి.ఉమా నాగేంద్ర రచయిత్రి సెల్ నెం:9092099952

-జి.వి.ఉమా నాగేంద్ర