కథ

మేడిపండు (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథల పోటీలో ఎంపికైన రచన

ప్రభుత్వ రంగం కంటే ప్రైవేటు రంగంలో సంస్థల నిర్వహణా, పని తీరూ, పద్ధతులూ మెరుగ్గా ఉంటాయని చాలామంది అంటుంటారు. కానీ పైపై తేడాలూ పటాటోపాలు తప్ప, నిజానికి దొందూ దొందే అని ప్రైవేటు రంగంలో ఒక బహుళ దేశీయ వ్యాపార సంస్థలో పదహారేళ్లుగా పని చేస్తున్న మధ్యస్థాయి అధికారిగా నా అనుభవం. మా కంపెనీలో జోనల్ మేనేజర్‌గా ప్రమోషన్ కోసం ఈ మధ్య నేను హాజరయిన ఇంటర్వ్యూ దీనికి సాక్ష్యం...
ఉద్యోగుల బాగోగులూ, జీత బత్తేలూ, పదోన్నతి అవకాశాలూ లాంటి విషయాలలో మా కంపెనీ విధి విధానాలు పకడ్బందీగా ఉంటాయని పేరు. ప్రతి అయిదేళ్లకూ కంపెనీలో ప్రతివారికీ ప్రమోషన్‌కు అవకాశం ఉంటుంది. ప్రమోషన్‌కు కనీస అర్హత ఉన్న వాళ్లనందరినీ ఇంటర్వ్యూకు పిలిచి, ఆధునిక పద్ధతులలో ఇంటర్వ్యూలు జరిపి, ప్రతి ముగ్గురిలో కనీసం ఒకరికన్నా ప్రమోషన్ ఇస్తారు...
మొన్న హైదరాబాద్ ఆఫీసు ఉద్యోగులకు జరిగిన ఇంటర్వ్యూలలో నాతోపాటు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు తొమ్మిదిమంది మూడు ఖాళీల కోసం పోటీ పడ్డారు... ఇంటర్వ్యూ కమిటీలో దిల్లీలో పని చేసే మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గారూ, ముంబాయి కార్యాలయానికి అధిపతి అయిన చీఫ్ జనరల్ మేనేజర్‌గారూ ఉన్నారు. మూడో సభ్యుడు మనో వైజ్ఞానిక నిపుణుడు. మా కంపెనీ ఉద్యోగి కాడు. ఒక మేనేజ్‌మెంట్ శిక్షణ సంస్థలో ప్రొఫెసర్. ఆయనకు మనస్తత్వ శాస్త్రంలో బోలెడంత అనుభవం ఉంది. ఇంటర్వ్యూలో అభ్యర్థుల మనస్తత్వాలను, వ్యక్తిత్వ వికాసాన్నీ అంచనా కట్టేందుకు ఇలాంటి నిపుణులను కమిటీలో ఉంచుతారు. వీళ్లు కంపెనీ ఉద్యోగులు కారు కనక కమిటీలలో వీళ్లు ఉండటంవల్ల ప్రమోషన్లు నిష్పాక్షికంగా, నిజాయితీగా జరుగుతాయని మా కంపెనీ ఆశయం...
యథావిధిగా సూటూ బూటూ తొడుక్కొని నా వంతు వచ్చినప్పుడు ఇంటర్వ్యూ గదిలోకి వెళ్లాను... ఎంత వయసు వచ్చినా, ఇంతకు పూర్వం ఎన్ని ఇంటర్వ్యూలు చూసి ఉన్నా, ఇంటర్వ్యూ అంటే ఇప్పటికీ నాకు కడుపులో సీతాకోకచిలుకలు రెక్కలు టపటపా కొట్టుకుంటూ ఎగురుతున్న భావం కలుగుతూనే ఉంటుంది. నుదుటి మీదా, అరచేతులలో చెమటలు పడతాయి. ప్రమోషన్ రాదేమోనని భయం ఒకపక్కా, సభ్యులడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఈ వయసులో నగుబాటవుతుందేమోనని బెరుకు ఒక పక్కా...
మా కంపెనీ పెద్దలు ఇద్దరూ, ఒకరి తరవాత ఒకరు, చెరో పది నిమిషాలు నా మీద ప్రశ్నల వర్షం సంధించారు. సమాధానాలు చెప్తూ వెళ్లిన కొద్దీ నా ఆత్మవిశ్వాసం, వాగ్ధాటీ సాధారణ స్థాయికి వచ్చేశాయి. దాన్ని కాస్తో కూస్తో దాటేశాయేమో కూడా... ఇరవై నిమిషాలు ఇట్టే గడిచిపోయాయి. నా మటుకు నాకు ఇంటర్వ్యూ నల్లేరు మీద బండి నడకలా సాగిపోయింది. తమ వంతు ప్రశ్నలు పూర్తవగానే, మా ఉన్నతాధికారులిద్దరూ చెవులలో సెల్‌ఫోన్లు పెట్టుకొని గది బయటకి నడిచారు. గదిలో నేనూ మా మనోవైజ్ఞానిక నిపుణుడూ మిగిలాం.. ఆయన పిల్లిగడ్డం సవరించుకొంటూ నా వైపు తీక్షణంగా తేరిపార చూశాడు.
‘చేతన్, ఇంతవరకూ మీ ఉన్నతాధికారులు అడిగిన ప్రశ్నలకు మీరిచ్చిన సమాధానాలు నేనూ విన్నాను. కనక మీ ఉద్యోగానికి సంబంధించి ఇక నేను మిమ్మల్ని ప్రత్యేకంగా అడగవలసిందీ, అడగ గలిగిందీ ఏమీ లేదు...’ అంటూ ఆరంభించాడు. ‘ఆ మాటకొస్తే మీ గురించి మీరుగా ఇక ఈ ఇంటర్వ్యూలో చెప్పవలసిందంటూ నాకేమీ కనిపించటంలేదు. కానీ ఎలాగూ మనం ఇక్కడ కలిశాం కనక, మీరు నాకొక చిన్న సహాయం చేయగలరనుకుంటాను..’ అంటూ ముందుకు వంగి, ‘మొన్నటిదాకా ఈ హైదరాబాద్ ఆఫీస్‌లనే టాయిలెట్ సోప్స్ విభాగంలో పనిచేసి వెళ్లిన సుమంత్ మీకు గుర్తున్నాడా?’ అని అడిగాడు.
‘గుర్తుండకపోవటమేమిటి?... వాడు నాకు కాలేజీలో నాలుగేళ్లు క్లాస్‌మేట్. కానీ కారణాంతరాల వల్ల, నాకంటే నాలుగేళ్ల తరువాత మా కంపెనీలో చేరి నాకు జూనియర్ అయ్యాడు. మా ఆఫీసులో సబ్బుల అమ్మకాల విభాగంలో పనె్నండేళ్లు పనిచేసి, ఒక నెల క్రితమే చెన్నైకి బదిలీ అయ్యాడు. మా విభాగాలు వేరు. నాది వంట నూనెల అమ్మకాల విభాగం. సుమంత్‌కు బాగా పని చేస్తాడనీ, సమర్థుడనీ మంచి పేరుండేది. కానీ వాడు, పూర్వ పరిచయం వల్ల కాబోలు, నాకు సీనియర్‌గా ఇవ్వవలసిన గౌరవం ఎప్పుడూ ఇచ్చేవాడు కాదు. వాడు ఆఫీసులో అందరి ముందు నన్ను కాలేజీలోలాగా ఏకవచనంతో సంబోధించటం, చనువుగా మాట్లాడటం, నాకు సుతరామూ నచ్చేది కాదు. ఆ మాటే అతనితో ఒకసారి చెప్పాను కూడా. ఆ తరువాత అతను నన్ను అసలే సంబోధించటం మానేశాడు. ఎదురుపడితే విష్ చేసేవాడు కానీ మా మధ్య పెద్దగా మాటలు కూడా ఉండేవి కావు...
‘గుర్తు లేకపోవటమేమిటి సర్! మేమిద్దరం ఇదే ఆఫీసులో పనె్నండేళ్లు పని చేశాం. అంతకు ముందు వాడు నాకు కాలేజీలో నాలుగేళ్లు క్లాస్‌మేట్ కూడా. అసలు జీవితంలో ఎవరినయినా ఒకసారి చూస్తేనే ఇక వాళ్లను నేను మరచిపోను. వాళ్లతో పదిహేను నిమిషాలు గడిపితే, వాళ్ల స్వభావాలను బాగా అంచనా కట్టగలను కూడా. ఈ రెండూ నాకు జన్మతః వచ్చిన గుణాలు’ అన్నాను.. అవకాశం వచ్చినప్పుడు ఆత్మస్తుతి చేసుకోకపోతే, ఈ ప్రచార యుగంలో మనిషికి విలువ ఏముంటుంది?..
‘అయితే ఇకనేం, మీరు అతన్ని బాగా స్టడీ చేసే ఉంటారు.. ఏమీ లేదు. నిన్న నేను కోల్కతాలో మీ కంపెనీ ఉద్యోగులనే కొందరిని ఇంటర్వ్యూ చేశాను. ఎంపికైన అభ్యర్థులకు మీ కంపెనీ లండన్, హాంకాంగ్ ఆఫీసుల్లో పోస్టింగ్ ఇస్తారట. ఈ రోజు రాత్రికో, రేపో కూర్చొని నేను ఆ ఇంటర్వ్యూ రిపోర్టులు ఫైనలైజ్ చేసి మీ హెడ్డ్ఫాసుకు పంపాలి.. ఆ ఇంటర్వ్యూలో సుమంత్ కూడా ఒక అభ్యర్థిగా వచ్చాడు. మాటలలో మీ ఆఫీసు గురించీ, ఇక్కడ తన మరువలేని అనుభవాల గురించీ ఎంతో గర్వంగా హుషారుగా చెప్పుకొచ్చాడు.. అతనితో కలిసి మీరు చాలా రోజులు పని చేశారు కదా. అతని గురించి మీ అభిప్రాయమూ, అసెస్మెంటూ ఏమిటో నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా, దాపరికం లేకుండా చెప్పగలరా..?’ అనాన్డు.
ప్రశ్న వినగానే, ‘అమ్మ వీడి అదృష్టం! ఈ టెక్కుగాడికీ, ముంగి వెధవకూ, ‘పట్టు’ పరిశ్రమ స్పెషలిస్టుకూ విదేశాలలో పోస్టింగా? ఇన్నాళ్లు విశ్వాసంగా కంపెనీకి సేవ చేసిన నాలాంటి వాళ్లకు రాని ఛాన్సు ఈ ‘వేస్ట్‌ఫెలో’కా! ఎంత అన్యాయం?.. వీడి జుట్టు ఇప్పుడు కాకతాళీయంగా నా చేతికి చిక్కింది కదా! నా ఇంటర్వ్యూ ఎలాగూ విజయవంతంగా ముగిసినట్టే కనక, ఇప్పుడు గిరీశంలా ఒక ఠస్సా వేసి నా తడాఖా చూపించాలి..’ అని ఒక ఆలోచన మనసులో మెదిలింది. మెదిలిన ఆలోచనను వెంటనే కార్యరూపంలో పెట్టాను...
‘సుమంత్ నాకు చాలా సన్నిహితుడే. నేను వాడికి సీనియర్నీ శ్రేయోభిలాషినీ. కానీ, నాకు కంపెనీ పట్ల విశ్వాసం, వ్యక్తిగత స్నేహాలనూ బాంధవ్యాలనూ మించింది. అందులోనూ మీలాంటి పెద్దలు నా మాటకు విలువ ఇచ్చి నా అభిప్రాయం కోరారు. నా దృష్టిలో సుమంత్ యోగ్యుడే కానీ అతనిలో కొన్ని లోపాలున్నాయని నేనే ఒప్పుకొంటాను. వాడు అమిత గర్విష్టి. తన మేధాశక్తి మీదా, సమర్థత మీదా అపారమైన విశ్వాసమే తప్ప సీనియర్లంటే విధేయత మాట దేవుడెరుగు, వాడు వాళ్లను ఖాతరు కూడా చేయడు. ఎక్కడిదాకానో ఎందుకు, పనె్నండేళ్లలో అతనెప్పుడూ సీనియర్నైన నాతోనే సత్సంబంధాలు పెట్టుకొనేందుకు ప్రయత్నించలేదు. నా గదిలోకి కూడా ఎప్పుడూ రాలేదు. ఎదురుపడితే నిర్లక్ష్యంగా విష్ చేసి వెళ్లిపోయేవాడు. ఆ అహంభావం వల్లనే, వాడు సమర్థుడే అయినా మానవ సంబంధాల విషయంలో ‘స్ట్రాంగ్’ కాదని మా ఆఫీసులో అందరూ అనుకొనేవారు’ అన్నాను.
‘కానీ ఈ ఆఫీసులో పని చేసేప్పుడు అతను మంచి ఫలితాలు సాధించాడట? అతని ‘టీం’ మూడేళ్లు వరసగా అమ్మకాలలో కొత్త జాతీయ స్థాయి రికార్డులు స్థాపించారట!..’
‘.. నిజమే! కానీ ఆ రికార్డు వెనక కృషి లేదూ అని నేను అనను కానీ దానికంటే అదృష్టం ఎక్కువ అని అందరూ చెప్పుకొనేవాళ్లు. అనుకోకుండా ఆ మూడేళ్లూ మంచి వర్షాలు కురిశాయి. పంటలు బాగా పండి రైతుల చేతులలో డబ్బులు బాగా ఆడాయి. సబ్బులు బాగా అమ్ముడయ్యాయి. దానికి తోడు అతనికి మెరికల లాంటి అసిస్టెంట్లు దొరికారు. చిచ్చరపిడుగులు. వాళ్లు అతని కోసం ప్రాణమైనా ఇవ్వగల విశ్వాసపాత్రులు. వాళ్ల శ్రమవల్లే తను మంచి ఫలితాలు సాధించ గలుగుతున్నానని సుమంతే ప్రతిరోజూ ప్రతి వాళ్లతోనూ అనేవాడు’
‘మానవ సంబంధాలలో ‘స్ట్రాంగ్’ కాదన్నారు. మరి అతని అసిస్టెంట్లు అతనికి అంతగా ఎందుకు సహకరించే వాళ్లో?’ సందేహం వెలిబుచ్చాడు ప్రొఫెసర్‌గారు.
‘సుమంత్ విజయ రహస్యం అదే. మా బోటి సీనియర్లతో తల బిరుసుగా, నిర్లక్ష్యంగా ఉన్నా, జూనియర్లను బాగా మంచి చేసుకొనేవాడు. రెండు మంచి పనులు చేస్తే వాళ్లను ఆకాశానికి ఎత్తేసేవాడు. వాళ్లకు ప్రమోషన్లు ఇప్పించేందుకు తానెంతో కష్టపడి, వాళ్ల విశ్వాసం సంపాదించేవాడు. మంచిదేనేమో కానీ, ఇలా అనైతిక పద్ధతులలో జూనియర్ల సహకారం కొనుక్కోటం, విలువలకు విలువ ఇచ్చే నాలాంటి వారికి మనస్కరించదు. అందుకే సుమంత్ మంచి ఫలితాలే సాధించినా, వాటి కోసం వాడు అనుసరించే మార్గాల గురించి సీనియర్ అధికారులు తరచుగా అసంతృప్తి ప్రకటిస్తూ ఉండేవారు. ఇది తప్ప సుమంత్ యోగ్యతలో వేలెత్తి చూపేందుకు లోపమేమీ లేదు. ఇదీ, దీంతో పాటు అతని గాలి మాటలు చెప్పే అలవాటూ..!’
‘అంటే?’
‘సుమంత్ దగ్గర మంచి మాటకారితనం ఉంది. దాంతో కస్టమర్లనూ, డిస్ట్రిబ్యూటర్లనూ, బాసులనూ, జూనియర్లనూ ఎవరినయినా సరే ఇట్టే బుట్టలో వేసుకొంటాడు. చెప్పదలచుకొన్న విషయం వినేవాడిని ఆకర్షించి, ఆకట్టుకొనేలా చెప్తాడు. ఏదో రకంగా మంచి ఫలితాలూ సాధిస్తాడు. తనను తాను చాకచక్యంగా ప్రొజెక్ట్ చేసుకొంటాడు. కానీ మాటలతో చేతలు సరితూగవు. ఓ ఉదాహరణ చెప్పాలంటే, తన అసిస్టెంట్‌లతో రోజూ మీటింగ్‌లు పెట్టుకొని, ‘మన కంపెనీ అయిదేళ్లలో దేశంలో మొదటి స్థానానికి చేరుతుంది, పదేళ్లలో ప్రపంచంలో మొదటి స్థానానికి చేరగలదు’ అంటూ స్వప్న ప్రపంచం చూపేవాడు. వాళ్లు నోరు తెరుచుకు వినేవాళ్లు. మా అందరిలాగా, ఈ నెల ఎంత అమ్మగలం, ఎలా అమ్మగలం అనే విషయాల మీద చర్చించేవాడు కాదు’
‘అవునా? సుమంత్ రోజుకు పనె్నండు గంటలు ఆఫీసు పనిలో గడిపేవాడట కదా?’
‘అది నిజమే ప్రొఫెసర్! అసలు మా ఆఫీసులో అందరం అలాంటి వాళ్లమే. అయితే సుమంతుకొక ప్రత్యేక కారణం ఉంది. అతనికి ఇంట్లో శాంతి లేదు. ఇంట్లో ముసలి తల్లి. అతని భార్య కూడా ఉద్యోగస్తురాలు. అత్తాకోడళ్లకు ఎప్పుడూ కీచులాటలే అని చెప్పేవాడు. అందుకే ఇంటి కంటే గుడి పదిలం అన్నట్టు ఎక్కువసేపు ఆఫీసులో గడిపేవాడు’
‘అలాగా? మరి అంత చురుగ్గా ఎలా ఉండేవాడో? అతను రక్తదానాల లాంటి సంఘ సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొనేవాడని అతని రికార్డులో ఉన్నది’
‘అది కూడా నిజమే. నెలకోసారి రక్తదానం చేసేవాడు. మూడు నెలలకోసారి రోటరీ వాళ్లనో, రెడ్‌క్రాస్ వాళ్లనో పట్టుకొని ఒక రక్తదాన శిబిరం నిర్వహించేవాడు. ఆ వార్త పేపర్లో వేయించి ఆ పేపర్ కటింగ్ తన సర్వీస్ రికార్డులో పెట్టించుకొనేవాడు. ఇలాంటి విషయాలలో సుమంత్ చాలా చురుకు. ఒకసారి నన్ను కూడా రక్తదానం చేయమన్నాడు. కానీ నేను చేయలేదు. నా మార్గం వేరు. నాది భగవద్గీతలో బోధించిన నిష్కామకర్మ మార్గం. కంపెనీ లాభాల కోసం అహోరాత్రాలు శ్రమించి, కంపెనీకీ, సీనియర్ అధికారులకూ మంచి పేరు వచ్చేలా చేయటం నా ధ్యేయం. నా దృష్టిలో అదే నిష్కామకర్మ. పైగా నేను సుమంత్‌లా దృఢకాయుడిని కాదు. తరచుగా రక్తదానం చేయటానికి నా వొంట్లో రక్తం చాలదు.. సుమంత్ యోగ్యుడే. కానీ.. క్షమించండి ప్రొఫెసర్, నేను ఇంకేమీ చెప్పలేను. స్నేహధర్మం కూడా పాటించాలి కదా..’ అన్నాను.
అకస్మాత్తుగా ప్రొఫెసర్ నా కళ్లలోకి సూటిగా చూశాడు. ‘మీరేమీ నొచ్చుకోనక్కర్లేదు. తరచుగా మనం ఒక మనిషి స్వభావాన్నీ, మనస్తత్వాన్నీ, మంచి చెడులను విశే్లషిస్తూ మాట్లాడే మాటలు, ఆ మనిషి గుణదోషాల కంటే, మన గుణ దోషాలను బాగా వెలిబుచ్చుతాయి అంటారు మనస్తత్వ శాస్తజ్ఞ్రులు. అందుకే మన ఎదురుగా ఉన్న వ్యక్తి మనస్తత్వం గురించీ, వ్యక్తిత్వం గురించీ తెలుసుకోవాలంటే, అతగాడిని, తనకు తెలిసిన మరో వ్యక్తి గుణగణాల గురించి అడగటం ఉత్తమ మార్గం అంటారు. మీరు మాతో పూర్తిగా సహకరించినందుకు ధన్యవాదాలు!’ అన్నాడు. నిష్కల్మషంగా నిజాయితీగా మాట్లాడటం నాకున్న పెద్ద బలహీనత!’ అన్నాను చివరి మాటగా, ప్రచార యుగం కదా!
ప్రొఫెసర్ మెల్లిగా తల ఊపాడు. అప్పుడే మళ్లీ గదిలోకి వచ్చి కూర్చొన్న మిగతా ఇద్దరు కమిటీ మెంబర్లు కూడా ‘ఇక నువ్వు వెళ్లచ్చు’ అన్నట్టు తలలు కదిలించటంతో నేను లేచి తృప్తిగా బయటికి నడిచాను.
మీరు బహుశ నమ్మలేరు.. వారం రోజుల తరువాత ఫలితాలు వెలువడ్డప్పుడు నేనే నిర్ఘాంతపోవాల్సి వచ్చింది. నాకు ప్రమోషన్ రాలదు!! కారణమేమిటో నాకు ఎంత తర్కించుకొన్నా బోధపడలేదు. నా సత్యసంధతకు మరోమారు మూల్యం చెల్లించుకొన్నానని నన్ను నేను సమాధానపరచుకొన్నాను. నాకు అంతకంటే ఎక్కువ ఆశ్చర్యం కలిగిస్తూ, ఆ పై వారం సుమంత్‌ను మా కంపెనీ లండన్ కార్యాలయానికి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
చెప్పానుగా, ప్రైవేటు రంగం ఇలాగే ఉంటుంది. మేడిపండు!

మల్లాది హనుమంతరావు
401, మై హోం రైన్‌బో, ఆరెంజ్, షేక్‌పేట నాలా, గోల్కొండ పోస్ట్
హైదరాబాద్-500 008.. 99493 40 236

-మల్లాది హనుమంతరావు