కథ

అతడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాంతకుమార్ జగిత్యాల జిల్లా ఏసిబి డీఎస్పీ రాజీవ్ మీనన్‌ని ఆఫీసులో పర్సనల్‌గా కలిశాడు.
చూస్తున్న ఫైలు మూసేసి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోమని సైగ చేశాడు డీఎస్పీ. ఆ అధికారితో ఏదో సంభాషిస్తున్న అసిస్టెంట్, శాంతకుమార్ రాకతో వెళ్లిపోయాడా గది నుంచి.
కళ్లద్దాల్ని సవరించుకుంటూ ‘వాట్స్ యువర్ ప్రాబ్లమ్’ ప్రశ్నించాడు డీఎస్పీ.
బట్టల వ్యాపారిగా పరిచయం చేసుకొని ‘జగిత్యాల గడియారం సెంటర్‌లోని నా షాపు షార్ట్ సర్క్యూట్ జరిగి దగ్ధమైంది’ చెప్పాడు శాంతకుమార్.
‘ఇట్సోకే!’
‘ఇన్సూరెన్స్ ఉంది. యాభై లక్షలకు క్లెయిమ్ చేయమంటే ఇన్సూరెన్స్ ఆఫీస్ అధికారి భూపతి రాజుగారు కుదర్దంటున్నారు’
‘ప్రాపర్టీ వాల్యూ అంతే కదా?’
‘అవునండీ!’
‘ఎంతడుగుతున్నాడు?’
‘లక్ష’
‘మీరెంతిస్తానన్నారు?’
‘నేను లంచం ఇవ్వజూపడమేంటండీ? అది నా కష్టార్జితం. పక్కాగా షాపులోని ప్రతి వస్తువుకి బిల్స్ ఉన్నాయి. రోజూ రాత్రి వెళ్లేటప్పుడు వీటి తాలూకు ఫైల్‌ని ఇంటికి తీసుకుపోతాను’
‘అంటే.. షార్ట్ సర్క్యూట్ జరుగుతుందని, మీకు ముందే తెలుసా?’
‘సార్ సార్! ఇది రాత్రివేళ జరిగింది. అయినా నేనే షార్ట్ సర్క్యూట్ చేయించి, అదనంగా ఇన్సూరెన్స్ డబ్బు కొట్టేద్దామని ప్లాన్ చేసేసి, దానికా అధికారి ఒప్పుకోవడం లేదని మీ చెంతకు రాలేదు. న్యాయం కోసం వచ్చాను. షార్ట్ సర్క్యూట్ జరిగిందని ఎలక్ట్రిసిటీ ఏ.ఇ సర్టిఫై చేశాడు. స్టేషన్ ఎస్సై ఎంక్వైరీ పూర్తయ్యింది’ నమ్మకంగా వివరాలు చెప్పాడు శాంతకుమార్.
‘ఓకే! ఆయనడిగిన లక్ష ఇవ్వనంటే..?’ ప్రశ్నించాడు.
‘జస్ట్.. పాతిక లక్షలకు సర్టిఫై చేస్తానన్నాడు. అన్నంతపని చేసేలాగున్నాడు. అంతటి సమర్థుడు మరి..’
‘ఐసీ...! ఏసీబీకి పట్టిస్తానని బెదిరించక పోయారా?’
‘అన్నీ అయ్యాయి. అదరడం లేదు. బెదరడం లేదు. దారులు మూసుకు పోయాయి.’
‘ఓకే! ఓకే! మళ్లీ వెళ్లి కలవండి. కొంత గడువడిగి లక్ష వాయిదాల మీద తెస్తానని నమ్మబలకండి. మిగతా తంతు నేను నడుపుతా!’
డీఎస్పీ అభయమివ్వడంతో శాంతకుమార్ మనసు స్థిమితపడింది. వినయంగా వంగి అధికారికి రెండు చేతుల్తో నమస్కరిస్తూ నిష్క్రమించాడు.
* * *
ఆఫీసర్ భూపతిరాజుకి విష్ చేసి ఎదురుగా కూర్చున్నాడు శాంతకుమార్.
రాయడం ఆపి తలెత్తుతూ ‘చెప్పండి!’ అన్నాడు చిరునవ్వుతో.
‘చెప్పడానికేముంది సార్? మీరు పని పూర్తి చేసి పెట్టడం తప్ప’ శాంతంగా బదులిచ్చాడు శాంతకుమార్.
‘నా వల్ల కాదని చెప్పాను కదా?’
‘మీ ఆఫీసు చుట్టూ ఇంతలా ఎన్నిసార్లు తిరగమంటారు?’ నిస్సహాయంగా అడిగాడు శాంతకుమార్.
‘నిజమే. భక్తితో గుడి చుట్టూ తిరిగినా, కాస్త పుణ్యమైనా దక్కుతుంది’ భూపతిరాజు మాటల్లో వెటకారం ధ్వనించింది.
‘నాక్కావాల్సిందిప్పుడు పుణ్యం కాద్సార్? పని... పని జరగడం ముఖ్యం’ స్థిరంగా అన్నాడు.
‘మాలాంటి అధికారులంటే ఎలాగూ రవ్వంత భయం లేదు. కనీసం ఆ దైవం పట్ల భక్తి అయినా ఉండాలి కదా?’
‘దేవుడన్నా, ఆఫీసర్లన్నా భయభక్తులున్నాయి కాబట్టి ఇంత వరకు సహనంతో వ్యవహరిస్తున్నాను’ సౌమ్యంగా సమాధానమిచ్చాడు.
భూపతిరాజు స్వరం మార్చి, ‘మీరు కాదు, ఓపిక వహిస్తోంది నేను? నా సహనానికి అగ్ని పరీక్ష పెడుతున్నారు’ అన్నాడు కాస్త తీవ్రంగా.
‘సార్! కాస్త నా గురించి ఆలోచించండి. నా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే!’ తిరిగి వినయంగా బదులిచ్చాడు తనే.
‘్ధన మూల మిదమ్ జగత్! అందరూ ఆ డబ్బు చుట్టూ పరిభ్రమించాల్సిందే కదా! అంతెందుకు? మీరు కూడా ఆ డబ్బు శాంక్షన్ చేయించుకోవడానికేగా ఆఫీస్ చుట్టూ తిరుగుతోంది?’
‘నిజమే సార్! కాదనడం లేదు. కానీ నా వ్యాపారం అంత బాగా లేదు. షాపులో పెట్టనంత రేంజిలో గిరాకీ లేదు. మిల్లర్లకి డబ్బులు చెల్లించడానికి అప్పులు చేయాల్సిన గతి పట్టింది.’
‘పీత కష్టాలు పీతవి ఎంత చెట్టుకి అంత గాలి. అస్తమానం మీ వాదనే విన్పించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప, నేను చెప్పేది కూడా కాస్త చెవిన వేసుకోవాలి కదా!’ అన్నాడు భూపతిరాజు కూల్‌గా.
‘సార్! మనిషన్నాక ఇచ్చిపుచ్చుకోవడాలు హెచ్చుతగ్గులు సహజం. నా జీవితనౌక తలకిందులై నిండా మునిగిపోవాలన్నా, ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగాలన్నా మీ చేతుల్లో ఉంది. ప్లీజ్! కాదనకండి. జీవితాంతం మీకు రుణపడి ఉంటాను’ ప్రాధేయపడ్డాడు శాంతకుమార్.
‘శాంతకుమార్‌గారూ! ఈ రోజు సాయంత్రం మా ఇంటికి రండి. కడుపు నిండా భోజనం పెడతాను. అంతేగానీ ముందు మీతో చెప్పిన మాట మీదే నిలబడ్డాను. నిలబడతాను. రెండో మాటకు.. తావులేదు’ ఖరాఖండిగా చెప్పాడు భూపతిరాజు.
‘నా మొర ఆలకించి ఎలాగైనా నన్ను కరుణించండి’ దీనంగా వేడుకున్నాడు.
‘బలవంతం చేసి నన్నిబ్బంది పెట్టకండి’ ముఖం చిట్లించాడు.
‘మీరు మొండిగా మీ మాటే నెగ్గాలని చూస్తున్నారు’ అన్నాడు శాంతకుమార్.
భూపతిరాజు ఇబ్బందిగా సీట్లో కదులుతూ ‘మీ స్వలాభం కోసం నన్ను అనుచితంగా వాడుకోవాలని చూస్తున్నారు’ అసహనం వ్యక్తపరిచాడు.
‘మీది ఉచిత సేవా దృక్పథం కాదంటారు అంతేగా?’ చప్పున లేచిన శాంతకుమార్ గబగబా భూపతిరాజుకు దగ్గరగా వెళ్లాడు.
వంగి భూపతిరాజు చేతులు పట్టుకొని, ఆయనేదో చెప్పబోతున్నా వినిపించుకోకుండా ‘పిల్లలు గలవాడిని. ఇవి చేతులు కావు. కాళ్లనుకోండి ప్లీజ్!’ అన్నాడు కరుణ రసాత్మకంగా.
ఈ అనూహ్య సంఘటనకు బిత్తరపోయిన భూపతిరాజు చటుక్కున లేచి నిలబడ్డాడు.
శాంతకుమార్ తన ఎడమచేత్తో భూపతిరాజు చేతుల్ని అలాగే పట్టుకుని, కుడిచేత్తో తన జేబులోంచి ఓ కట్ట తీసిపెడుతూ ‘ఈ అర్భకుడు ఇంతకంటే ఎక్కువ ఇచ్చుకోలేనందుకు మన్నించండి’ అన్నాడు ముఖంలో ఎలాంటి భావోద్వేగాలు పలికించకుండా. భూపతిరాజు అదిరిపోయాడు.
కంగారుపడుతూ ఆ నోట్లని విదిలించబోతుంటే ‘లక్ష అడిగారు కదా! ఇవి అయిదు వందల నోట్లు ఇరవై ఉన్నాయి. మిగతావి పనయ్యాక పువ్వుల్లో పెట్టి ఇస్తాను’ అన్నాడు శాంతకుమార్ నమ్మకంగా.
అతడి మాటలు పూర్తి కాకుండానే ‘ఏయ్! ఏం మాట్లాడ్తున్నావ్? నువ్వు.. అసలేం జరుగుతోందిక్కడ?’ అరిచినంత పనే్జశాడు భూపతిరాజు ఏకవచనంలోకి దిగుతూ.
ఆ గదిలోకి అప్పుడు ఎంటరయ్యాడు రాజీవ్ మీనన్.
ఇలాంటిదేదో జరుగుతుందని అస్సలూహించని భూపతిరాజు, ఎంతలా కలవరపడ్డాడంటే.. ఆ సమయంలో శాంతకుమార్ తల అటు తిప్పి వికృతంగా నవ్విన నవ్వుని పసిగట్టగలిగి ఉంటే.. తక్షణమే గుండాగిపోయేది..
మీడియా ఎంటరయ్యాక.. ఈ ఘటన అతి పెద్ద వారె్తై పోయింది.
అప్పటికే భూపతిరాజుకి ఒళ్లంతా చెమట్లు పట్టేశాయి. మనిషి నిలువెల్లా స్థాణువై పోయాడెప్పుడో!
వెన్నులోంచి ఎడమవైపు నుండి మొదలై.. ముందుకి సర్రున పాకిన అవినీతి పరుడన్న షాక్.. తీగలో ఎలక్ట్రాన్లు పరుగెడుతున్నంత అత్యంత వేగంగా జబ్బ నుండి గుండెని చేరుతోంది...
అప్పటికీ ఆఫీసులోని ఉద్యోగులంతా వచ్చి చేరారక్కడికి. మీడియా కెమెరాలు క్లిక్‌మంటున్నా ఏసిబి డీఎస్పీ.. భూపతిరాజుని ఏదో అడగడానికి సమాయత్తమవుతున్నాడు..
లీలగా మైకం కమ్ముతోంటే.. తనువంతా వణికిపోతున్న భూపతిరాజుని.. ఏదో తెలియని నొప్పి.. అసలు మునుపెన్నడూ ఎరుగని నొప్పి.. అశనిపాతంలా గుండెని కమ్మేసింది.
ఈ హఠాత్పరిణామానికి కలవరపడిన రక్తకణాలు సైతం.. రక్తనాళాల్లోంచి మూకుమ్మడిగా ముందు కెగసిపడే ప్రయత్నం చేస్తుంటే...
ఆ హార్ట్‌స్ట్రోక్‌కి.. ఆగిపోతున్న ఆ హార్ట్ బీట్‌కి.. ఉన్నపళంగా చెట్టంత మనిషి నిట్టనిలువునా.. తుపాను గాలి తాకిడికి బలైపోయిన మహావృక్షంలా.. కుప్పకూలిపోయాడు.
అసలక్కడ ఏం జరుగుతోందో తెలియక అయోమయంలో పడిపోయి అక్కడి వాళ్లంతా ఒక్కసారిగా ఆందోళన చెందారు. శాంతకుమార్ కూడా షాకయ్యాడు! అతడా దృశ్యానికి ఎంతలా కంపించి పోయాడంటే.. మనసంటూ ఒకటుంటే.. మానవత్వమనేది బ్రతికుంటే.. అతడి గుండె పొరల్ని.. అణువణువూ తడమాల్సిందే.. ఇప్పుడదే జరిగింది.
కట్టెలా బిగుసుకుపోయిన శాంతకుమార్ తలపట్టుకున్నాడు! అచేతనంగా కుర్చీలో కూలబడ్డాడు. అంబులెన్స్ వచ్చేలోగానే భూపతిరాజు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
* * *
కలత చెందిన శాంతకుమార్.. భూపతిరాజు శవయాత్రలో పాల్గొన్నాడు. కర్మరోజు కూడా వెళ్లి వౌనంగా శ్రద్ధాంజలి ఘటించాడు.
* * *
కాలం మనస్సులో ఎలాంటి గాయాల్ని రేపుతుందో.. మనుషుల మధ్య ఎలాంటి మార్పుల్ని తెస్తుందో.. ఎవరూహించగలరు? శాంతకుమార్ విషయంలో అలాగే జరిగింది.
గుండె గొంతుక మూగవోయి.. హృదయ వీణ లయ తప్పి.. ఎదలో వ్యథాభరిత సముద్రం కల్లోలమయమవుతోంది.
శాంతకుమార్ తీవ్ర అలజడికి లోనవుతున్నాడు. నిత్యం భూపతిరాజు చుట్టూ తిరుగుతున్న ఆలోచనలు రోజుల్ని భారంగా దొర్లిస్తున్నా.. ఏదో తెలియని అపరాధ భావం.. ఆకాశాన్ని కమ్మేసిన కారుమేఘాల్లా అతడి గుండెని ముంచెత్తుతోంది.
తన స్వార్థానికి ఆ కుటుంబం బలయ్యింది! పెద్ద దిక్కుని కోల్పోయిన భూపతిరాజు భార్యాపిల్లలు విషణ్ణ వదనాలే మాటిమాటికీ గుర్తుకు వస్తుంటే హృదయం కలుక్కుమంటోంది.
ద్వాదశ దినకర్మ రోజున భూపతిరాజు భార్య రంజిత తనని ఓదార్చడానికి వచ్చిన వారితో, మనోవ్యథను చెప్పుకుంటూ దుఃఖిస్తుంటే.. తడి ఊరని వారు లేరు..
పైగా ఆ దృశ్యం పదేపదే స్మృతిపథంలో కదలాడుతూ అతడిని క్షోభపెడుతోంది.
‘ఒక నిజాయితీ పరుడి పైన, అవినీతిపరుడనే నెపంతో ఏకంగా ఏసీబీ రైడింగ్‌జరిగిందంటే ఇప్పటికీ నేనే నమ్మలేక పోతున్నాను. అలాంటిది ఆయన గుండెలా తట్టుకుంటుంది? ఊపిరి ఆగిపోవడంతో చెప్పుకుంటూ పాపం వెక్కివెక్కి ఏడ్చింది.
ఊరడిస్తున్నా ఊరుకోలేదు. ఎలా ఊర్కుంటుంది?

అతడు (7వ పేజీ తరువాయ)
ఇపుడిపుడే శాంతకుమార్ ఆలోచనలు స్ఫటికాలవుతున్నాయి. స్వార్థం, స్వలాభం నుండి విడిపోయ.. పరుల మనోభావాలు, మనోక్షోభల్ని అర్థం చేసుకునే దిశగా సాగుతున్నాయి. కాలం విసిరిన కఠినపు ఘడియల నడుమ ప్రక్షాళనమవుతున్నాడు.
నిజానికి ఏ ఓదార్పు జీవితభాగస్వామి లేని లోటును పూడ్చగలదు? ఎన్ని గుండెలతో గూడుకడితే ఆగేను ఆమె దుఃఖం...
అప్రయత్నంగా అంతరంగపు అట్టడుగు అరల్లో దాగిన ఓ నగ్నసత్యం.. గుర్తుకొచ్చింది శాంతకుమార్‌కి.
‘తను తప్పు చేశాడు. ఇరవై అయిదు లక్షల విలువ చేసే షాపుని యాభై లక్షలకు క్లెయిమ్ చేయమని భూపతిరాజు మీద తనే ఒత్తిడి తెచ్చాడు?! తనే రాద్ధాంతం చేశాడు. లక్ష లంచమిస్తానని ఆశ చూపినా లొంగలేదాయన. దుష్టాలోచన చేసి ఏసీబీ డిఎస్పీ దగ్గర భూపతిరాజుని లంచగొండిలా చిత్రీకరించి, చివరికి అతడిని పొట్టన పెట్టుకోవాల్సి వచ్చింది. భారంగా గుండె పొరల్ని తడుముకున్నాడు.
అతడి కర్మ రోజున పసిపాపలా రోదిస్తూ వెళ్లగ్రక్కిన రంజిత మాటలు తిరిగి చెవుల్లో ప్రతిధ్వనించసాగాయి.
‘పుట్టిన ప్రతి జీవికి నిజాయితీగా బ్రతికే హక్కు ఉంది. ఆ నిజాయితీని కాలరాచే అధికారం శాంతకుమార్ లాంటి వారికి ఎవరిచ్చారు?’ ఆమె చుట్టూమూగిన బంధువర్గం జాలిగా చూశారామె వంక.
‘నిజమేనమ్మా! మనిషికి సమాజమంటే గౌరవం లేకుండా పోయింది. పరులని నమ్మించి మోసపుచ్చడం నిత్యకృత్యమైంది. నీతి, నిజాయితీ, నియమాల పట్ల నమ్మకం లేకుండా పోయింది’ బహుశా ఆమె తండ్రేమో, అనునయిస్తున్నాడో పెద్దాయన.
‘నలుగురితో నారాయణ అనలేక, అవినీతి అక్రమాల మధ్య ఇమడలేక.. నిజాయితీని బ్రతికించడానికి మీ ఆయన లాంటి వారెందరో చివరికి ఆత్మ త్యాగానికి కూడా వెనుకాడటం లేదు. ఏం చేస్తాం తల్లీ? ఖర్మ! నీ ప్రాప్తం!’ రంజిత తలని తన ఒడిలోకి తీసుకుంటూ ఓదారుస్తోందామె తల్లి కావొచ్చు.
‘అక్కా! విడిచిపెట్టేది లేదు. బావ అకారణ చావుకి కారకుడిపైన కేసు పెట్టి శిక్ష పడేలా చేయాల్సిందే..!’ ఆవేశంగా అంటున్నాడు, రంజిత సోదరుడై ఉంటాడు.
‘తండ్రిని కోల్పోయిన నా చిన్నారులదిగో తల్లడిల్లిపోతున్నారు. ఏం చేద్దాం, మీ బావగారు అల్పాయుష్కులనుకుందాం. కనీసం ఆ అవినీతిపరుడు తన పిల్లల్నైనా నిజాయితీపరులుగా తీర్చిదిద్దగలిగితే చాలు. మనిషికి కావాల్సింది డబ్బు కాదు. మానవీయ విలువతో జీవించడమని ఎప్పుడైనా అతడికి తెలిసొస్తే చాలు. చేసిన పాపం ఊరికే పోదు అంటారు. ఆ దేవుడే ఎప్పటికైనా అతడిలో పరివర్తన తీసుకువస్తాడు. మీ బావగారి లాంటి నిజాయితీపరులెందరివో ఆత్మలు శాంతిస్తాయి’ అంటూ మళ్లీ నోటికి కొంగు అడ్డం పెట్టుకుంది.
శాంతకుమార్‌కి ఇదంతా గుర్తుకొచ్చి...
ప్రాయశ్చిత్తంతో మనోఫలకం నిలువెల్లా దహించుకు పోతుంటే తనలోకి తాను కరిగిపోతున్నాడు. తన కారణంగా.. భర్త మరణించాడని తెలిసీ తనపై చట్టపరమైన ఎలాంటి చర్యకు పాల్పడని.. హిమవత్పర్వత సమమైన భూపతిరాజుగారి భార్య ఔదార్యం ముందు పిపీలకమై పోతున్నాడు. నిజమే మనిషి జీవితాన్ని ప్రేమించడం కాదు.. తనని ప్రేమించే వారిని జీవితాంతం తోడుంచుకోవాలి!!
* * *
‘నమస్కారం సార్! నా పేరు శాంతకుమార్.. నా పెండింగ్ ఫైల్ మీ సెక్షన్‌లో ఆగింది..’ అంటూ భూపతిరాజు ప్లేస్‌లోకి బదిలీపై వచ్చిన కొత్త అధికారి ముందు వినయంగా నిలబడ్డాడు శాంతకుమార్.. ఈసారి నిష్కల్మషమైన మనస్సుతో!
‘ఓహ్, మీరా! రండ్రండి.. కూర్చోండి. మీ గురించి వాకబు చేశాను. నేనే మిమ్మల్ని పిలిపిద్దామనుకున్నాను. ఇంతలో మీరే వచ్చారు. ఎనీహౌ, నాదంతా ముక్కుసూటి వ్యవహారం. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే రకం. నిజం చెప్పాలంటే.. నేనేదీ దాచను. ఓపెన్‌గా మాట్లాడ్తాను’
కాలిపోయిన మీ దుకాణం అసలు విలువ పాతిక లక్షలని తెలుసు. కానీ యాభై లక్షలకు సర్టిఫై చేస్తాను. ఎంత? జస్ట్.. ఆ భూపతిరాజుగారి కిస్తానన్న లక్ష, నాకివ్వండి చాలు! వారం తిరక్కుండా యాభై లక్షల చెక్ భద్రంగా మీ ఇంటికొస్తుంది’ అన్నాడతను విలాసంగా కాళ్లూపుతూ.
‘సార్ సార్! నేను లంచం ఇచ్చి పని జరిపించుకోవాలనుకోవడం లేదిప్పుడు. తేరగా వచ్చే ఆ పాపిష్టి డబ్బు నాకొద్దు. ఇక నుండి సమాజంలో ఒక నిజాయితీపరుడిగా మసలాలనుకుంటున్నాను. యథావిధిగా క్లెయిమ్ చేసి, నా ఫైల్‌ని మూవ్ చేయండి చాలు. వస్తా’ అంటూ వెనుదిరిగిన శాంతకుమార్ వంక షాకింగ్‌గా చూస్తుండిపోయాడా అధికారి.
ఇక నుండి ఓ నిజాయితీపరుడిగా.. ఒక భూపతిరాజులా.. బ్రతకాలనే ఆకాంక్ష ఊపిరి పోసుకుంటూ సరికొత్త ఆకృతి దాల్చుతున్నాడు...
ప్రతి ఒక్కరూ నిజాయితీతో ఒక్కడుగు ముందుకు వేస్తే, మిగతా అడుగులన్నీ వాటంతట అవే సరికొత్త సమాజ నిర్మాణం వైపు కదులుతుంటాయి... అనుకుంటూ నిలువెత్తు మార్పునకు ప్రతిరూపంలా వడివడిగా వెళ్లిపోయాడక్కడి నుంచి శాంతకుమార్.. ప్రశాంతచిత్తుడై...
*

కథలకు ఆహ్వానం
‘ఆదివారం ఆంధ్రభూమి’కి కథలు పంపవలసిన చిరునామా:
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 500 003.
పీడీఎఫ్ ఫార్మాట్‌లో sundaymag@andhrabhoomi.net కు మెయల్‌లో పంపాలి.

ఎనుగంటి వేణుగోపాల్.. 9440236055