బాల భూమి

అర్హత నెరిగి దానం ( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూర్వం అమరేశ్వర పురంలో అమరనాథుడనే ఒక వ్యాపారి ఉండేవాడు. ఆయన తన ఆదాయంలో ఐదో వంతు దానధర్మాలకు వెచ్చించేవాడు. దానికై ప్రతిరోజూ ప్రాతఃకాలానే్న తన ఇంటి ముందుకు వచ్చిన వారికి తమ ఇలవేల్పైన ఈశ్వరుని చిత్రం ఉన్న గుర్తింపు పత్రం ఇచ్చేవాడు.
అపరాహ్నం వేళ వారిని తమ గృహానికి రమ్మని చెప్పేవాడు. వారికి స్నానాదికాలకు ఏర్పాట్లు చేసి ఆ తర్వాత నూతన వస్త్రాలు ఇచ్చి, అవి కట్టుకుని వచ్చాక కడుపారా చక్కని భోజనం ప్రేమగా పెట్టి సాగనంపేవాడు. ఆ తర్వాతే ఇంటి వారు భుజించేవారు.
కొంత కాలానికి సోమరిపోతులంతా ఇది గమనించి సూర్యోదయానికి పూర్వమే అతని ఇంటి ముందు చేరి, గుర్తింపు పత్రాలు పొంది, హాయిగా నూతన వస్త్రాలూ, నవకాయ పిండివంటలతో కమ్మని భోజనమూ చేసి వెళ్లి ఊరి చివరి ఆలయపు అరుగుల మీద విశ్రమించేవారు. తమను గుర్తుపట్టకుండా రోజుకో వేషం మార్చుకుని మరీ వెళ్లేవారు. తమకు ఇచ్చిన నూతన వస్త్రాలను సైతం అమ్ముకునేవారు. కష్టపడి ఏ పనీ చేయకుండా కడుపులు నింపుకోసాగారు.
అసలైన అన్నార్తులు అమరనాథుని ఇంటికెళ్లేసరికే గుర్తింపు పత్రాలు ఇవ్వడం పూరె్తై గవాక్షం మూసేసేవారు. ఆకలితో అలమటించే వారికి అన్నం దొరక్క ఇబ్బంది పడేవారు.
ఒక రోజు అమరనాథుని కుమారుడు వివేకుడు వారిని గమనించి ఎందుకో అనుమానించాడు. ‘తాము చేసే అన్నదానం, వస్తద్రానం అర్హులకే వెళుతున్నదా? లేక అపాత్రదానం చేస్తున్నామా?’ అనే ఆలోచనతో ఒక వారంపాటు వారి మాటతీరూ, ప్రవర్తనా గమనిస్తూ, వారు వెళ్లాక వారిని రహస్యంగా అనుసరించమని రోజుకో పనివాడిని పంపాడు.
వారి నిజ స్వరూపం తెల్సుకున్నాక తన తండ్రితో ‘నాయనగారూ! ఈ రోజు నుండీ నేనే కొన్ని ప్రాంతాలకెళ్లి అసలైన అన్నార్తులను గుర్తించి, గుర్తింపు పత్రాలు ఇచ్చి వస్తాను’ అని తండ్రిగారికి నచ్చజెప్పి, తానే ఇరుకు వీధుల్లో తిరిగి అర్హులకు గుర్తింపు పత్రాలు ఇస్తూ అన్నదానం, వస్త్రాదానం సరైన వారికే అందేలా జాగ్రత్తపడ్డాడు. దాంతో అన్నార్తులూ, వస్త్రాలు లేక ఇబ్బంది పడేవారికీ మాత్రమే అవి అంది తృప్తి పడసాగారు. అమరనాథుడు కొద్దికాలానికే ‘దాత’ అనే కీర్తినార్జించాడు.
నీతి: మనం చేసే దానం ఒక్క అరటి పండైనా సరే, ఒక్క బిస్కెట్ ఐనా సరే, ఒక పాతచొక్కా అయినా, అర్హులకే చెందేలా గమనించాలి. ధనం రూపంలో కాక వస్తు రూపంలోనే దానం చేయడం ఉత్తమం.

-ఆదూరి హైమావతి