కథ

ముప్పయ్ రెండు కళల ముద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మంజీ’ అన్నాడు మృదువుగా అంజి.
‘ఊఁ’ అంది మత్తుగా మంజి అతని కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తూ.
‘మంజీ’ అంటూ ఆమెను మరింత గట్టిగా దగ్గరకు లాక్కొని అన్ని అవయవాలను యవ్వన కాంక్షకు బలిచేశాడు. కామానికి కామాలూ, ఫుల్‌స్టాపులూ వుండకూడదనుకొంటూ, రబ్బరుబెండులా ఆమె శరీరాన్ని చుట్టేశాడు. కామక్రీడను క్రికెట్ మ్యాచ్‌లా ఆడాడు. కొన్ని క్షణాల వరకూ ఇద్దరూ వౌనంగా, కామంలో కరిగిపోయారు. తెలతెలవారుతుండగా ‘యవ్వనం అనేది ఎవరెడీ బ్యాటరీ! దానికి మనసుతో పనే కానీ, వయసుతో కాదు సుమా!’ అన్నాడు మంజిని మరోసారి ముద్దు చేస్తూ, మరేదో చేస్తూ.
‘నా అనుమానం పటాపంచలైంది. అందుకు కారణం ఎవరో తెలుసా?’ అంది మంజి అదోలా చూస్తూ.
‘అనుమానం ఏమిటి? పటాపంచలేమిటి?’ అన్నాడు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి, పంచ సరిచేసుకుంటూ.
* * *
ఆంజనేయ వరప్రసాద్ అంటే ఏవీపీగా అందరికీ తెలుసు. అతను కూడా వీఐపీ లలో ఒకడే. ఎక్కడికెళ్లినా ఆ మర్యాదల్ని పొందుతూనే వున్నాడు. ఒంటరివాడే కానీ, తుంటరివాడు కాడు. శీలం విషయంలో శిలావిగ్రహంలా, ఎంతో నిగ్రహంగా ఉంటాడు. అందుకే అతనంటే ఆ ఆఫీసులో ఆడస్ట్ఫాకూ, మగ స్ట్ఫాకూ ఎంతో గౌరవం.
ఆంజనేయ వరప్రసాద్ అనబడే ఈ అంజికి ఇప్పుడు యాభై అయిదేళ్లు. మరో మూడేళ్లలో రిటైర్ కాబోతున్నాడు. పెద్దలిచ్చిన ఇల్లు తప్ప ఏం లేదు. పెళ్లి చేసుకోలేదు. ఇన్నాళ్లూ ఆలోచించనే లేదు. అయితే ఈ మధ్యనే ఓ భయం పట్టుకుంది. చివరి రోజుల్లో ఒంటరిగా గడపటం ఎలా? అని. ఆ మాటే ఒకరిద్దరితో అనడం మొదలెట్టాడు.
‘మనవాళ్లు పిచ్చివాళ్లయి, ఈ పెళ్లి అనే ఆయింట్‌మెంట్‌ను మనకు అతికించలేదు. ఇప్పుడైనా మించిపోయింది లేదు. మీ చుట్టాల్లో నీ పెళ్లి గురించి ప్రకటించు. ఎవరో ఒకరు ఏదో ఒక మంచి సంబంధం తీసుకొస్తారు. చేసేసుకో’ అన్నారు కొందరు.
‘సడేలే. నేనసలే ఏజ్‌బార్‌గాణ్ణి. నాకు పిల్లనెవరిస్తారు? ఆ పిల్ల మటుకు ననె్నలా ఇష్టపడుతుంది?’ అన్నాడు సందేహంగా అంజి.
‘అయితే నీ ఏడుపేదో నువ్వేడ్చుకో. ఇంకెవర్నీ ఏ సలహా అడక్కు’ అన్నారు ఆ శ్రేయోభిలాషులంతా.
‘ఒరే అంజిగా నీకెంత కష్టమొచ్చిందిరా? ఇంటికెళ్తే ఇంత గంజి కాచి పోసేవాళ్లు లేరని, ఇనే్నళ్లొచ్చి ఇప్పుడు గుంజుకుంటే ఎలా?’ అనుకుంటూ తనేడుపేదో ఏడుస్తూ, ఆఫీసు వదిలే టైం అయిపోయి, అందరూ వెళ్లిపోయినా అంజి మాత్రం అలానే కూర్చుండిపోయాడు. ‘సార్! తాళాలు వేయమంటారా?’ అంటూ ఆఫీసు సెక్యూరిటీ వచ్చి అడిగేదాకా ఈ లోకంలోకి రాలేదు.
‘ఆ! ఆ!’ అంటూ లేచి వెళ్లాడు అంజి.
* * *
అంజికి ఆనాడెందుకో ఒళ్లంతా నొప్పులుగా వుండి ఓసారి మసాజ్ చేయించుకొందామనుకున్నాడు.
ఆ మధ్యనే వాళ్లింటి సమీపంలో ఓ మసాజ్ మజా వెలసింది. అయితే ఇనే్నళ్లలోనూ ఎప్పుడూ ఇటువంటి మజాలకు వెళ్లలేదు. ఇంటి దగ్గరకే ఆ మజా రావడం వలన పోయొద్దాములే అనిపించింది. వయసు పైబడుతున్న కొద్దీ బద్దకం కూడా ఎక్కువైంది. ఆనాడు ఆదివారం కూడా కావడాన, అనుకున్నదే తడవుగా ఇంటికి తాళం వేసి బయల్దేరాడు.
అరగంట మసాజ్‌కు అయిదు వందలన్నారు. క్షణమాలోచించాడు. పోనీలే ఈ ఒక్కరోజే చేయించుకొందామనుకున్నాడు. అయిదు వందలూ ఇచ్చుకొని లోపలి గదిలోకి వెళ్లాడు. అక్కడ మసాజ్ చేయడానికి ఓ అందమైన అమ్మాయి లోపలికి రమ్మని ఆహ్వానించింది.
‘ఇదే మొదటిసారనుకొంటాను’ అంది. అతను దగ్గరకు రావడానికి సందేహిస్తూ నిల్చుంటే.
‘మగవాళ్లు లేరా?’ అడిగాడు.
‘లేరు. ఇక్కడ మగవాళ్లకు ఆడవాళ్లు. ఆడవాళ్లకు మగవాళ్లు మసాజ్ చేస్తారు’ అంటూ అంజి చేతిని తన చేతిలోకి తీసుకొని అసభ్యంగా లాక్కొని వెళ్లి అక్కడున్న బెడ్‌పైన కూర్చోబెట్టింది. ఆమె చొరవకు నిర్ఘాంతపోయాడు. వెకిలి చేష్టలతో అతని దుస్తుల్ని తొలగించసాగింది. ఇంకా చెప్పాలంటే ఎకాయికీ వ్యభిచారానికే ప్రోత్సహించసాగింది. బాగా డబ్బు దండుకోవడానికి.
తన సత్ ప్రవర్తనా నియమావళికి భంగం కలగబోతోందన్న భయంతో ఉలిక్కిపడ్డ అంజి, వెంటనే తేరుకొని, తన దుస్తుల్ని సరిచేసుకొని, ఆమెవైపు సీరియస్‌గా చూసి, గది తలుపులు తీసుకొని విసురుగా బయటకు వచ్చేశాడు. ‘మీలాంటి వాళ్ల వల్ల మంచిగా మసాజ్ చేసేవాళ్లకు కూడా చెడు పేరొస్తోంది. ఇది మంచి పద్ధతి కాదు’ అంటూ వాళ్లకు నాలుగు చీవాట్లు పెట్టి, తన డబ్బు వాపసు తీసుకొని ఇంటి ముఖం పట్టాడు.
చక్కగా పెళ్లి చేసుకోనుంటే, ఈ తిప్పలుండేవి కావుగా. ఎంచక్కా ఒళ్లంతా మంచినూనె రాసి, నలుగు పెట్టి, తలంటి పోస్తుంది పెళ్లాం. చాలామంది, పక్కలో మక్కువ తీర్చడానికే అనుకొంటారు. శరీరంలోని పక్కటెముకల్ని కూడా పక్కాగా చేయగల శక్తి పెళ్లానికుందని ఎంతమందికి తెలుసు. ఇక లాభం లేదు. తను పెళ్లి చేసుకొని తీర్తాడు. తన ఆప్తుల మాటలో నిజముంది. తనకు తప్పనిసరిగా తోడు కావాలి. తన బంధువుల నోట, ఈ మాట వేయాలనే నిశ్చయానికి వచ్చాడు.
ఇంటికి రాగానే స్నానాదులు కాగానే ప్రశాంతంగా కూర్చొని ఓ నంబరుకు కాల్ చేశాడు.
‘హలో! భద్రమ్ బాబాయ్. నేనే అంజిని మాట్లాడుతున్నా’
‘హలో! అంజి. ఏమిటి విశేషం? చాలా రోజులకు పలకరింపు’
‘నీతో ఒక ముఖ్య విషయం చెబుదామని’
‘ఏమిటో?’
‘నీ ఎరికలో నాకు ఏదైనా సంబంధం ఉంటే చెప్పు’
‘చాలా సంతోషం. ఇప్పటికైనా బుద్ధి మార్చుకొని మంచి నిర్ణయానికొచ్చావ్. ఈ మధ్యనే వింటున్నాలే. ‘పెళ్లి పెళ్లి’ అని అంటున్నావని’
‘చూడు మరి. తొందరగా. నీదే ఆలస్యం’
‘నా ఆలస్యం ఏం లేదు. నీదే ఆలస్యం. నువ్వు ‘ఊ’ అంటే ఆ మూడు ముళ్లు ముచ్చటగా వేయిస్తా’
‘ఇంతకూ ఆమె ఎవరో వివరాలు చెప్పలేదు’
‘నీకు తెలిసిన అమ్మాయేలే! ఆ అమ్మాయికో మాట చెప్పి, ఆమె అభిప్రాయం తెలుసుకొన్న తరువాత, నీతో ఆమెకు పరిచయం చేస్తా. అభిప్రాయాలు కలిస్తే కలిసిపోదురుగాని కళ్యాణంతో’
‘సరే బాబాయ్. అలాగే చెయ్యి’ అంటూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు అంజి.
తనకు తెలిసిన అమ్మాయే అంటున్నాడు. ఆ అమ్మాయెవరో? అనుకొంటూ, తనకు అప్పటివరకూ తెలిసిన పెళ్లికాని అమ్మాయిలను గుర్తు చేసుకొంటూ, అలానే ఆ రోజంతా కూర్చుండిపోయాడు.
* * *
ప్రకాశంగారికీ, శాంతమ్మగారికీ ఇద్దరబ్బాయిల తర్వాత మంజులత ఒక్కతే కూతురు. అబ్బాయిలిద్దరూ మంచి ఉద్యోగాల్లో చేరి, వివాహాలు కూడా చేసుకొని స్థిరపడ్డారు.
మంజులతకు సంబంధాలు చూసీ చూసీ అలసిపోయి చివరకు ఓ పిల్లాడు నాజూకుగా చాలా అందంగా వున్నాడనీ, ఉద్యోగమే కాకుండా, మంచి ఆస్తిపాస్తులు కూడా వున్నాయనీ, అన్నింటికీ మించి తమ బంధువర్గానికి దగ్గరవాడనీ విచారించి, ఆనందపడి ఆ సంబంధాన్ని స్థిరపరచుకొని, మంజులతనిచ్చి వివాహం చేశారు.
అతను పేరుకు మోహనరావే గానీ, ఎక్కడా మోహన రాగమే పలకదు. సొగసు చూడతరమా! అని మంజులత ముచ్చటపడి చేసుకొన్నందుకు తొలిరాత్రిలోని, తని మైత్రితో అసలు విషయాలు బయటపడ్డాయి. అతనికి పెళ్లంటే ఇష్టం లేదనీ, పెద్దవాళ్లను బాధపెట్టడమెందుకని చేసుకొన్నాననీ చెప్పాడు. ఎందుకిష్టం లేదో ఆ రాత్రే ఆమెకర్థమైంది. పాలగ్లాసు అతనికివ్వగానే తాగేసి, కిమ్మనకుండా బెడ్‌మీద పడుకొన్నాడు. కనీసం తన చిటికెన వేలుతో ఆమె చీరనన్నా తాకలేదు. తనను ఆటపట్టించటానికని అలా నటిస్తున్నాడేమో ననుకొని తనే చాలా చొరవ చూపించి, అతని చేయి పట్టుకొని, బెడ్‌మీంచి లేపడానికి ప్రయత్నించింది. అయినా అతనిలో ఏ మాత్రం చలనం లేదు. చెయ్యి విదిలించుకొని, మరో పక్కకు తిరిగి పడుకొన్నాడు. మగసిరి లేనివాణ్ణి, షోగ్గా వున్నాడని చేసుకోవడం చాలా పొరపాటైందని లోలోపలే కుమిలిపోయింది. ఆ రోజుల్లో మగవాడికి కావాల్సింది మగ లక్షణం కానీ, నాజూకుతనం కాదనీ, పిల్లను పోషించుకోగల మగాడైతే చాలని మాత్రమే ఆలోచించి, పిల్లనిచ్చి పెళ్లి చేసేవారు.
ఈ రోజుల్లో ఫ్యాషన్లకూ, ప్రమోషన్లకూ, బ్యాంకు బ్యాలెన్సులకూ విలువనిస్తున్నారే గానీ, దాంపత్యానికి కావాల్సిన లైసెన్సు (లైంగిక ప్రవృత్తి)ను ఎవరూ పెద్దగా చెక్ చేసుకోవడం లేదు. రాత్రంతా ఈ ఆలోచనలతోనే సొమ్మసిల్లిపోయిన మంజులత తెల్లవారుతుండగానే నిద్రలో కొరిగింది.
అప్పటిదాకా ఒళ్లు తెలియనంత నిద్రపోయిన మోహనరావు లేచి కళ్లు తుడుచుకొని, బాత్‌రూమ్ కెళ్లి కాలకృత్యాలు తీర్చుకొని, ఆమెను నిద్రలేపితే ఏం గొడవలవుతయ్యోనన్న భయంతో, ఎవరికీ తెలియకుండా, అతి మెల్లగా తన సూట్‌కేసు తీసికొని, బయటపడ్డాడు బ్రతుకుజీవుడా అనుకొంటూ.
సూర్యోదయం అయ్యాక నిద్రలేచిన ఆమెకు విషయం అర్థమైంది. ఇంట్లో వాళ్లు ఘోల్లుమన్నారు. మంజులత మాత్రం నిబ్బరంగా ఉంది. కొన్నాళ్ల తర్వాత విడాకుల కోసం ప్రయత్నించి, దక్కించుకొని స్థిమితపడింది.
అప్పట్నుంచే ఇంట్లో అసలు సమస్యలు మొదలయ్యాయి. ఇరుగు పొరుగుల ఎత్తిపొడుపులు, ఇంట్లో అన్నా వదినెల పెత్తనాలూ, చీదరించుకోవడాలూ, మంజులతకు మనస్థిమితం లేకుండా చేశాయ్. అయితే ఆమె ఉద్యోగం ఆమెకు వున్నందున, ఎవరిపైనా ఆధారపడాల్సిన పనిలేనందున, వాళ్లతో గొడవలు పడుతూ అక్కడే ఉండడమెందుకని వెంటనే వేరే ఇల్లు అద్దెకు తీసుకొని ఉండసాగింది. అప్పుడప్పుడూ తల్లిదండ్రులు మాత్రం ‘మంజీ! మంజీ!’ అంటూ ప్రేమగా పిలుస్తూ చుట్టపుచూపుగా వచ్చి చూసి వెళ్తున్నారు.
ఆఫీసుకెళ్లి వస్తూ పుస్తకాలు చదవడం, టీవీ చూడ్డం లాంటి వ్యాపకాలతో కాలక్షేపం చేస్తోంది. మగవాడన్నా, పెళ్లన్నా పరమ అసహ్యం ఏర్పడింది. ఆఫీసులో కూడా తన పని తాను చేసుకోవడం తప్ప ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేది కూడా కాదు. అలాంటి మంజి ఉన్నట్లుండి విచిత్రంగా మారిపోయి, పెళ్లికి కూడా సిద్ధమైందంటే ఆశ్చర్యమే కదా! మంజి మనసంతా అంజినే అంటిపెట్టుకొని పోయింది. ఆది నుంచి తెలిసిన వ్యక్తినే భర్తగా స్వీకరించడం సముచిత నిర్ణయమే అయినా, వయసు ముదిరిన అతనిని చేసుకొంటే, మళ్లీ తన సమస్య మొదటికే వస్తుందేమోనన్న అనుమానం కలిగింది.
అతని ఆరోగ్యమూ, ఆదర్శ జీవితమూ, అదే సమయంలో అతను వివాహానికి ఇష్టపడుతున్నాడనే వార్త, ఆమెను మరింత ప్రోత్సహించాయి. అయితే తనది ద్వితీయ వివాహం అయినందున అతను అంగీకరిస్తాడో లేదోనన్న
అనుమానం, తన దగ్గరకు పెళ్లి పెద్దగా వచ్చిన భద్రయ్యగారి దగ్గర వెలిబుచ్చింది. అప్పుడాయన ఆ విషయం తనకు వదిలేయమని, ఆమెకు భరోసా ఇచ్చి వెళ్లాడు. ఆయన దగ్గర నుంచి ఫోన్ కోసం చూస్తూండగానే ఫోన్ రింగయింది.
ఫోను తీసి ‘హలో’ అంది.
‘నేనమ్మా పెళ్లిళ్ల భద్రయ్యను!’ అన్నాడాయన.
‘ఆ! ఆ! చెప్పండి’ అంది ఉత్సాహంగా మంజి.
‘ఇంతకు ముందే మా అంజిగాడికి, నీ సందేహాలూ, నీ ఆలోచనలూ, నీకు సంబంధించిన అన్ని విషయాలూ చెప్పాను. అతను నిన్ను చేసుకోవడానికి పూర్తిగా అంగీకరించాడు. ఈ శుభవార్త నీ చెవిన వేద్దామనే చేశా. ఇక మీ అమ్మానాన్నలతో మాట్లాడి మిగతా విషయాలన్నీ చూసుకో. శుభమస్తు’ అన్నాడు దీవిస్తున్నట్లుగా.
‘చాలా థ్యాంక్సండీ’ అంది మంజి ఫోన్ పెట్టేస్తూ.
వెంటనే వాళ్ల నాన్నగార్కి ఫోన్ చేసి, విషయమంతా చెప్పింది. ఆయన సంతోషిస్తూ, ఆ భద్రయ్యగారి మధ్యవర్తిత్వంతోనే ఈ పెళ్లి ఖాయం చేసుకొందామని చెప్పారు. ఓ మంచి రోజున మంజి తల్లిదండ్రులూ, అంజి తాలూకు ముఖ్య బంధువులూ, భద్రయ్యగారి సమక్షంలో తాంబూలాలు పుచ్చుకొన్నారు.
ఈ ఆనందంలో ఉక్కిరిబిక్కిరైన మంజి, ఆ కార్యక్రమం ముగిశాక, తన ఇంటికి వచ్చి టీవీ ఆన్ చేసి, ఛానల్స్ మారుస్తుండగా ఒకనాడెప్పుడో ఆమె చూసిన దృశ్యం మళ్లీ కనిపించింది. పరవశంగా ఆ దృశ్యాన్ని చూస్తూ అంజితో తాననుభవించబోయే దృశ్యాన్ని ఊహించుకొంటూ కూర్చుంది.
మంజి, అంజినే వివాహమాడడానికి ఆ దృశ్యమే ఎక్కువగా తోడ్పడింది. ఆ దృశ్యము వలననే అతనంటే మనసు పడింది. అదో మహత్తరమైన శృంగార దృశ్యం.
పెద్దగా ఆర్భాటం లేకుండా, ఓ శుభ ముహూర్తాన, మంజి మెళ్లో మూడు ముళ్లు వేశాడు అంజి. పెళ్లామంటే ఏమిటో తెలుసుకొనేందుకు ముచ్చటపడుతూ ఆఫీసు వాళ్లంతా వచ్చి వాళ్లిద్దరికీ శుభాకాంక్షలు తెలిపారు.
* * *
అంజి ఎదురుచూసిన ఆ రాత్రి రానే వచ్చింది. ఒకనాడు మంజి బెదిరిపోయి, ఇక జీవితంలో తను కలకంటున్న రాత్రి రానేరాదనుకొన్న రాత్రి రానే వచ్చింది. ముదిరిన వయసులకు గర్భాదాన ముహూర్తం ఎందుకని, వాళ్లిద్దర్నీ ఏకాంతంగా వదిలేస్తే, ఆ విషయాలేవో వాళ్లిద్దరే చూసుకొంటారు లెమ్మని పెళ్లి పెద్దలు ఊరుకొన్నారు. పైగా ఆనాడు శాస్ర్తియంగా మోహనరావునూ, మంజిని గదిలోకి పంపిస్తే, ఇస్ర్తిమడతలు నలగకుండా నిద్రపోయి బయటకొచ్చారు. అందువలన మంజీ, అంజీలిద్దరూ తమలో తాము చర్చించుకొని, ఏర్పాటు చేసుకొన్న అందమైన గదిలో సుగంధ పరిమళాల చిరుజల్లులతో, ఎతె్తైన మెత్తని పాన్పుపైన, పలకరింపుల పులకరింతలతో పరవశిస్తూ, ఆశించిన యవ్వన మధురానుభూతిని ఆహ్వానిస్తూ, ఆలింగనం చేసుకొన్నారు. ఎవరి జీవితంలోనైనా ఇదే కదా తొలి తన్మయ రాత్రి.
మంజి వుంటున్న ఇంట్లోనే ఈ గదిని ఏర్పాటు చేసుకొన్నారు. అందుకని ముందుగానే పాలు త్రాగి గదిలోకొచ్చారు. పాలగ్లాసుతో లోపలికొచ్చి, ప్రేమపాఠాల క్లాసు తీసుకోవాల్సిన అవసరం లేకుండా అప్పటికే తమలపాకులు, కసాపిసా నమిలి మ్రింగి, ఉద్రేకంగా ఊగిపోతూ అంజి ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మంజిని కసిగా కౌగిలించుకున్నాడు. ఆమెలో చెప్పరాని అనుభూతి కలిగింది. ఏ పులకరింపునైతే ఆమె కోరుకుందో, ఆ పులకరింపు తొలకరి జల్లులా ఆమెను గిలిగింతలు పెట్టింది. చేత్తో ఆమె బుగ్గలను నిమిరాడు. మరోసారి ఆమె ఒళ్లు ఝల్లుమంది. ఆమె చెవులు చిలిపిగా నలిపాడు. ఆమె పాదాలపై తన పాదాలను వేసి, తన దగ్గరగా లాగి మగాడినంటూ పాన్పుపైన వాలాడు పాలపొంగులా.
* * *
‘లేవండి. కాఫీ త్రాగండి’ అన్న మాటతో ఊరట చెందాడు.
‘మంజీ!’ అంటూ పక్కమీంచి లేస్తూ, మళ్లీ ఏదో అలా అనబోయాడు.
‘నేను స్నానం చేశాను. పూజగదిలోకెళ్లాలి’ అంటూ వెళ్లబోయింది మంజి.
‘రాత్రి.. ఏదో అనుమానం. పటాపంచలు అన్నావ్? ఏమిటో?’ అన్నాడు కాఫీ తాగి కప్పు ఇస్తూ.
‘ఓ అదా!’ అంటూ నవ్విందే గానీ ఏం చెప్పలేదు.
‘ఆ మొదటి మొగుడికిచ్చినట్లు నాక్కూడా విడాకులిస్తావేమోనని భయమేసింది’ కంగారుగా అన్నాడు.
‘మీకు విడాకులిస్తానా, ఎప్పుడూ మీ వెంటే ఉండి మీ చేష్టల్ని మైసూరుపాకుల్లా నములుతుంటాను. టీవీలో ముద్దులు కురిపించిన ఆ ముసలాడు అచ్చు మీలాగే..’ అని ఆపింది.
‘వామ్మో వాడెవడు?’ అనుమానంతో గంజి పెట్టిన చొక్కాలా బిగుసుకు పోయాడు అంజి.
‘మీరు టీవీ ఎక్కువగా చూడరనుకొంటాను. ఆ మధ్య ఓ ఛానల్‌లో, ఓ సినీ నటిని, ఓ ముసలాడు ఓ సభలో పబ్లిగ్గా ముద్దు పెట్టుకుంటున్న దృశ్యాన్ని పదేపదే చూపించారు. గుర్తొచ్చిందా? ఈ వార్త అన్ని పేపర్లలోనూ వచ్చింది’ అంది గుర్తుచేస్తూ.
‘ఆ! అవునవును. గుర్తొచ్చింది. పేపర్లో చదివాను. దానిపైన పెద్ద గొడవే అయింది’ అన్నాడు అంజి అయోమయంగా.
‘ఆ దృశ్యం చూడ్డంవల్లనే, నేను మిమ్మల్ని ప్రేమించాను. పెళ్లాడాలనుకొన్నాను’ అంది మంజి తన మనసులోని మాటను బయటపెడ్తూ.
‘ఆ దృశ్యానికీ నాకూ సంబంధం ఏమిటీ?’ ఆదుర్దాగా అడిగాడు అంజి.
‘ముసలోడి ముద్దులో ముప్పయ్ రెండు కళలుంటాయని, అదే అసలైన ముప్పయ్ రెండు కళల ముద్దని ఆ దృశ్యం చూడ్డంవల్ల గ్రహించాను. అది నిజమని మీరు రాత్రంతా నిరూపిస్తూనే ఉన్నారు. ఇంతకన్నా నాకింకేం కావాలి?’ అంది పదేపదే అదే తలపోస్తూ.
‘అంటే నేను ముసలాణ్ణా?’ కొంచెం ఇబ్బందిగా అన్నాడు అంజి అదోలా చూస్తూ.
‘కాదు. కానీ వయసు మళ్లిన వాళ్లనలానే అంటారు! అంతే’ అంది అతని అనుమానాన్ని పూర్తిగా నివృత్తి చేస్తూ.
‘హమ్మయ్య బ్రతికిచ్చావ్. ఇంకేదోననుకొని హడలిచచ్చా’ అంటూ ఊపిరి పీల్చుకొని బాత్‌రూమ్ వైపు నడిచాడు నవ యవ్వన యువకుడిలా అంజి.

కథలకు ఆహ్వానం
‘ఆదివారం ఆంధ్రభూమి’కి కథలు పంపవలసిన చిరునామా:
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 500 003.
పీడీఎఫ్ ఫార్మాట్‌లో sundaymag@andhrabhoomi.net కు మెయల్‌లో పంపాలి.

- ములుగు కుమారస్వామి (షణ్ముఖశ్రీ) 88978 53339