కథ

పరిమితి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనోల్లాసాన్నిచ్చే కథలు ఎప్పటికీ పాతబడవు. ఎంతోకాలం నుంచీ వున్నా, వింటున్నా ప్రతీరోజూ కొత్తగానే ఉంటాయి. ఎక్కడో వెలుగునీడలమధ్య ఓ చిన్న గ్రామం. ఆ గ్రామంలోని ఒక సేఠ్ కథే ఇది. ఇతను అత్యంత ధనికుడు. చంద్రుడు లేని రాత్రి మెరిసే లెక్కలేనన్ని నక్షత్రాలన్ని ధనరాసులున్నాయి. అష్టదిక్పాలకులూ అతని యింటి రక్షకులుగా వున్నారేమోననిపిస్తుంది. అంతెందుకు, ఆయన భార్య సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారమనిపిస్తుంది. అతని ఐదుగురు కొడుకులూ ఎంతో ఆరోగ్యవంతులు, అదృష్టవంతులు. బాధ్యతలు తెలిసినవారు. ఆ వచ్చిన కోడళ్ళూ ఎంతో అందగత్తెలు, సౌమ్యులూ. ఇద్దరు కుమార్తెలూ అప్సరసలే. తాహతకు తగ్గ కుటుంబాలకే పెళ్ళిళ్ళుచేసి పంపారు. అతని ధనరాసులు కరగని పెన్నిధి. ఆనందం రోజురోజుకీ పొంగి పొర్లుతోందేగానీ తరగడంలేదు. యావత్ ఎనభై నాలుగు లక్షల జీవరాసుల్లో మానవుడే అదృష్టవంతుడు! యిలా అత్యంత ఐశ్వర్యవంతునిగా, సుఖ సంతోషాల్లో తేలేవాడిగా వుండటం మరీ అదృష్టం! ఆకాశంలో మరో చంద్రుడిలాంటివాడు. ఆ దేశ రాజుకే ఈర్ష్య కలిగించేంత ఐశ్వర్యవంతుడు. ఆ ధనరాసులు ఇచ్చిన మైకం ఎంతటిదంటే, పగలు, రాత్రీ కనురెప్పల కదలికలతోనే జరుగుతోన్నాయనే భావంతో ఉన్నాడతను!
అంతటి ధనికుడైనా, సేఠ్ ఉదార స్వభావుడు. రాబోయే జన్మ గురించి ఆలోచనే అతని దాన గుణానికి కారణమనే వారున్నారు. పేదలు, నిర్భాగ్యుల కోరిక కాదనేవాడు కాడు. నిజానికి వాళ్ల కోరికల్ని తిరస్కరించడం అతనికి తెలీదనే అనాలి.
ఒకరోజు రాజుగారు సేఠ్‌ని దర్బారుకు పిలిపించాడు. తన సింహాసనం పక్కనే ఆశీనుడు కమ్మని ఆహ్వానించాడు. ‘‘ఈ రాజ్యంలో అడుక్కుతినేవాడు ఒక్కడున్నా అందుకే నీవే బాధ్యత వహించాలి. ఎవరైనా ఆకలితో ఛస్తే నీ ధనరాసులకే అవమానం. దీన్ని గురించి నువ్వెపుడయినా ఆలోచించావా?’’ అని రాజు అడిగాడు.
సేఠ్ సన్నగా నవ్వి, ‘‘అన్నదాతా, ననె్నందుకు ఇరకాటంలో పెడతారు? ఈ పరిస్థితులను అదుపు చేయడం భగవంతుడు తప్ప మహారాజులైన తమవల్లాకాని పని. మరి నాలాంటి నిరుపయోగ వ్యక్తిపై అభాండాలు వేయడం ఎంతవరకు సబబు? మీ మాట వింటే నాదే పొరపాటు, వినకుంటే అంతకంటే దారుణం మరోటి ఉండదు. అంతకన్నా ఈ చెవులు కోసేసుకోవడమే మేలు. ఓ బీదల పెన్నిధీ, ఈ విధంగా ఇరకాటంలో పెట్టేకంటే ఉరికంబానికి వేలాడదీయడమే మేలు’’ అన్నాడు.
నిజం చెప్పాలి. రాచభాండాగారంలో కొంత వెలితి ఏర్పడింది. ఆ లోటు సేఠ్ తీరుస్తాడేమోనని రాజుగారు అతన్ని దువ్వే యత్నం చేస్తున్నాడు. అతికష్టంమీద పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు. లేకుంటే అసలు అలాంటి మాటలు రాజు పెదవులు దాటి రావు. ఇక వచ్చాయంటే వాటి శక్తిముందు కత్తులు, ఫిరంగులూ దిగదుడుపే. ఏకంగా రాజుగారే భారీ రుణాన్ని ఆశిస్తున్నాడని గ్రహించి సేఠ్ ఎంతో ఆనందించాడు. నిజమే, మహారాజుకే అప్పు ఇచ్చేవారు లక్షల్లో ఒక్కరే ఉంటారు. ఇద్దరూ ఎంతో ఆనందించారు.
సేఠ్ తన పదహారు గుర్రాల బంగారు రథంలో హవేలీకి తిరిగి వెడుతున్నాడు. లోకమంతా తన సైగతో నడుస్తోన్నట్టుందతనికి. సామాన్య రైతువలె లేదా పనివాడిలా సేఠ్ మాటకోసం ఎదురుచూస్తున్నట్టుంది ప్రకృతి. అతని కోరికకు తగ్గట్టుగా మారినట్టుంది. అతని యిచ్ఛానుసారం గాలి వీస్తోంది. మబ్బులు పరిగెడుతాయి, మెరుపులు మెరిసి వర్షం కురుస్తుంది. నేలంతా పచ్చగా కనువిందు చేస్తుంది. అతని ఒక్క సైగతో సూర్యచంద్రులు పైకి వస్తారు.
గాలికంటే వేగంగా సేఠ్ హవేలీ చేరాడు. అప్పటికే హవేలీ గేటు దగ్గర లెక్కలేనంతమంది గుమిగూడారు. సముద్రాన్ని చీల్చుకుపోతున్నట్టు జనాలమధ్య సేఠ్ రథం వెళుతోంటే ప్రజల జయ జయధ్వానాలు మిన్నంటాయి. అనేకమంది అరచేతులు అతని కళ్లముందు తెరచుకున్నాయి, గ్రహణ సమయంలో ఆకలితో చేపలు పైకి ఎగురుతోన్నట్టు, ఆ భగవంతుడు, మహారాజు దయకంటే సేఠ్ దయాగుణం మీదే వీరికి ఎక్కువ నమ్మకం. అతని రెండు చేతులకూ ఆ శక్తివుంది. ఈ జాపిన అసంఖ్యక చేతులకు ఆ నమ్మకం వుంది. అతను సూర్యుడివంక చూశాడు, చీకటి మింగేసేవరకు. సూర్యకిరణాలేవి? జీవాన్నిచ్చే ఆ వెలుగేది? మహావెలుగునిచ్చే సూర్యుడికి ఏమయింది? నల్లని గుండ్రని పెనంగా మారిపోవడంలో మాయ ఏమిటి? అతని మహోన్నత్వం ముందు బహుశా సూర్యుడే లొంగిపోయాడేమో!
అతని దయవల్ల చివరికి సూర్యుడు స్వేచ్ఛ పొందాడు. అంచుల్లో చీకటి పొర తొలగింది. నేలమీద సూర్యకాంతి మళ్లీ ప్రకాశించింది. అందరి ఆనంద కేరింతలు మిన్నంటాయి. ప్రతీ అణువూ వెలుగులో మెరిసింది. అరే, ఇంతటి వెలుగు చీకటి మాటున ఎలా ఉంది? ఒక్క వెలుగు రేఖా కనిపించనంతగా మొత్తం ఎలా చీకటిమాటయింది?
తను ఎంత అద్భుతమైనవాడో సేఠ్‌కు రవ్వంతయినా తెలియదు. ఇవాళ అతని కళ్ళు కొత్త వెలుగుతో వెలిగిపోతున్నాయి. నవ్వుతూ తన సేఠాని దగ్గరికివెళ్లి ‘‘నా దానగుణం ప్రభావం ఎంతటిదో చూశావా? నా గొప్పదం వల్లనే సూర్యుడు చీకటి తెరనుంచీ బయటపడ్డాడన్నమాటే అంటున్నారు వాళ్లంతా!’’ అన్నాడు ఆశ్చర్యంగా.
అతని భార్య ఒక్కమాటా అనలేదు. అతను మొహం కాళ్ళు చేతులు కడుక్కోవడానికి బంగారు గినె్నలోంచి గంగాజలం పోస్తూ నవ్వి ఊరుకుంది. రాజుగారు అతనితో ఏమన్నది చెప్పి, యిలా ముగించాడు. ‘‘నేను చనిపోతే ఈ లోకం ఏమయిపోతుందో ఏమో? ఎంతగా ఆలోచించినా సమాధానం మాత్రం దొరకడంలేదు’’ అన్నాడు.
సేఠానీ అన్నది, ‘‘అర్థంలేని విషయాల గురించి అంతగా బుర్ర బద్ధలు కొట్టుకోవడం దేనికి? ఒక మనిషి జీవితం లేదా మరణంతో ఈ లోకానికి ప్రత్యేకించి ఒరిగేదేమీ ఉండదు. కాలగర్భంలో నీకంటేముందు నీలాంటివాళ్ళు ఎంతమంది జాడలేకుండా పోయారో ఎవరికి తెలుసు? రాజులు, చక్రవర్తులు, మునులూ, రుషులూ ఎందరో ఈ భువిపైకి వచ్చి కాలగర్భంలో కలిసిపోయారు. ఎవరి మరణంతో ఏదీ ఆగలేదు. అంతటికీ అర్థం తెలిసినవాడు భగవంతుతుడు ఒక్కడే. ఈ భ్రమలనే మబ్బులు చుట్టుముడితే జీవితంలో కోరికలు ఉండవు’’.
సేఠ్ ఆశ్చర్యపోయాడు. ‘‘భ్రమా! ఇదంతా భ్రమ ఎలా అవుతుంది? నా మరణంతో ప్రజలు అల్లకల్లోలం కారా? ఎప్పటిలాగే సూర్యచంద్రుల ఉదయాస్తమయాలు జరుగుతాయా? గాలి, వర్షం నాపట్ల రవ్వంతయినా మర్యాద పాటించవా? అంటే నేను అబద్ధాలాడుతున్నానంటావా?’’
‘‘నిజాలు, అబద్ధాల గురించి నాకేమి తెలియదు. నేను భ్రమ గురించే మాట్లాడుతున్నాను. ప్రజలంతా ఆ భ్రమకే లోనవుతున్నారు. రోజూ లక్షలాదిమంది చనిపోతున్నారు. వారందరికీ ప్రకృతి గౌరవ మర్యాదలు పాటిస్తుందా? ప్రకృతి మాట అటుంచు, ఎవరి సంతానమైనా సంతాప ఆచారాలు విధిగా పాటిస్తాయి, ఆ తర్వాత వారి తల్లిదండ్రుల్ని మర్చిపోతారు. జీవితం సాగిపోతూంటుంది. అవును, నువ్వు చనిపోతే అన్ని అంతమవుతాయి. ఈ లోకం కేవలం బతికున్నవారికోసమే. చనిపోయిన వారిది స్మశానం కాదు. అదీ కాదు. నీవు చనిపోతే ప్రాణం శరీరాన్ని వదిలిపోతుంది. శవం, కట్టెలు, మంటలు, అస్తిపంజరం, బూడిద గురించి నీకు తెలియదు. అవస్థలన్నీ బతికున్నవారితోనే వుంటాయి. నీ సంగతి, నా సంగతీ మర్చిపో, భగవంతుడయినా అవతారాన్ని చాలిస్తాడు, ప్రకృతిలీల క్షణమయినా ఆగదు. ఏ ఒక్క వ్యక్తికీ వ్యత్యాసం చూపదు’’.
అతని కళ్లముందు నక్షత్రాలు నృత్యం చేస్తున్నట్టయింది. ఇదంతా కనీసం కల్లోనైనా ఊహించలేదు. సేఠానీ నోటినుంచి వస్తున్నది అతను ఎలా నమ్మగలడు? ఆమెని నమ్మితే, అతను ఇన్నాళ్ళూ ఎంతో నమ్ముతున్నవన్నీ నాశనమైపోతాయి. ఈ నమ్మకం, భ్రమ లేకుండా ఎలా జీవించడం? ఇంతటి ధనమూ మరణాన్ని నిలువరించలేదా? సూర్యుడి అంత గొప్పగా తానేదో చెప్పాలనుకున్నాడు. కానీ నాలుక సాధ్యపడనీయడంలేదు. మంచం అంచున కూచున్నాడు. ఆమె కళ్ళలోకి చూస్తూ, అన్నీ కోల్పోయిన వేదాభరిత కంఠంతో, ‘‘నువ్వు పగలు, రాత్రీ శాస్త్రాలు చదివి అంతిమంగా తెలుసుకున్న సత్యం ఇదేనా? మరి జీవించడంలో అర్థమేమిటి? నువ్వు చాలాకాలం జలమథనం చేస్తున్నావు, కనీసం రవ్వంత వెన్న వస్తుందన్నదే ఎవరైనా ఆశిస్తారు! శాస్త్రాలను పఠిస్తూ మునిగితేలావు, కానీ ఒక్క జలగని కనుగొనలేకపోయావు. నీ చదువు, నా ధనం ఏదీ పిడికెడు మట్టంత విలువైనవి కావా?’’
ఆమె, ఏదో గుహలోంచి వినవస్తున్న కంఠంతో, ‘‘అవును. యిద్దరం వేరువేరు మార్గాలు ఎంచుకుని అంతిమంగా ఒకే గమ్యాన్ని చేరుకున్నాం. నీ సొమ్ము, నా చదువు అన్నీ అంతా నిజంగా విలువలేనివి, వఠ్ఠి భ్రమ! నేను అనంత జ్ఞానకాంతిలో ప్రయాణించి చివరికి అనంత చీకటి చేరుకున్నాను. ఈ చీకటిలో మిణుకుమిణుకుమనేది కేవలం ఛేదించలేని నిత్య సత్యంవంటి మరణం మాత్రమే. ఇదే మొదటి, అంతిమంగా తెలుసుకోవలసిన సత్యం. మనిషి చదువు, అధ్యయనంతో ఎంతో తెలుసుకున్నా, అదంతా మిథ్యే. అజ్ఞానం నుంచీ భ్రమ పుడుతుంది. జీవితానికి గాలి, నీరు కంటే ఈ భ్రమ అవసరం’’.
సేఠ్‌కి ఇటువంటి భ్రమ కలిగి ఉండటమంటే బతికి ఉండీ మరణించడంతో సమానం. సేఠానీ చేతులు పట్టుకుని కదిపాడు, భిక్ష పెట్టమన్నట్టు ప్రాధేయపడ్డాడు. ‘‘చాలు! చాలు! ఆపు.. భగవంతుడి పేరుమీద ప్రాధేయపడుతున్నాను’’
అతను మరోమాట మాట్లాడలేకపోయాడు, పెదవులు రెండూ అంటుకుపోయినట్టు. స్పృహలోనికి రావడానికి ఎంతో ప్రయత్నించాడు. అన్ని దిక్కులా చీకటి. మరింత చీకటి కమ్మింది. చివరికి పరుపుమీద పడిపోయాడు.
సేఠానీ యిటువంటి క్షణం కోసమే జీవితమంతా వేచి చూస్తోంది.
ఆమెకు చాలా కాలం క్రితమే, చిన్నపిల్లగా వున్నపుడే పెళ్లయింది. తల్లికి ఎంతో యిష్టమైన కూతురు. పెళ్లికూతురై అత్తవారింటికి వెళ్లింది, మరో చెట్టు నీడలో రక్షణకు వెళ్లిన పిట్టలా! తన తల్లిండ్రుల యింట్లో ప్రతివారికీ శాస్త్రాల అధ్యయనం ఒక అలవాటు. అందుకే అత్తింటికి కట్నంగా వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ఆరు శాస్త్రాలు, గీత, రామాయణం, మహాభారతం వంటి మరికొన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు తెచ్చుకుంది. సమయం దొరికినపుడల్లా వాటి అధ్యయనంలో తలమునకలయ్యేది. నిత్యం కళ్ళు, మనసు తెరిచేంచేది. ఆ నల్లని అక్షరాలన్నీ ఆమె జ్ఞానకాంతిని మరింత విస్తరించాయి. తెలిసో, తెలియకనో కాలక్రమంలో ఆ జ్ఞానసారం ఆ అక్షరాలకు అతీతంగా దర్శనమీయడం ఆరంభమైంది. ఏకంగా సరస్వతీదేవి రూపంలో వచ్చిన కోడల్ని పొందినందుకు అత్తింటివారు ఎంతో ఆనందబరితులయ్యారు. ఆమె అదృష్టానికి తగ్గట్టు, ఆమె జీవితంలోకి ఒక అఘోరా గురువు వచ్చాడు. ఆమె జ్ఞానాకాశంలోకి నాలుగో చంద్రుడు వచ్చి చేరాడు.
ఇప్పటికే అత్తారింట ధనరాసులతో తులతూగుతోంది. అంతేగాక సంతానం లేని మేనమామ ఐశ్వర్యానికి ఆమె భర్త వారసుడయ్యాడు. చిటికెనవేలు కదపకుండానే తరతరాల ఆస్తి వచ్చి చేరింది.
ఆమె అనుకున్న నిర్ణయాలు తీసుకుంది. ఒకరోజు సాయంత్రం ఆమె గదిలో దీపం కాంతిలో సంఖ్యకారకి చదువుతోంది. అపుడు ఆమె భర్త వచ్చి ‘‘నువ్వేమీ అనుకోనంటే ఒక సంగతి అడుగుదా మనుకుంటున్నాను’’.
ఆమె చెక్కిలి తాకి ఇలా అన్నాడు. ‘‘నీ నోటినుంచి వచ్చే ఏ మాటనీ అంగీకరించనని అనకుంటే ఆశ్చర్యంగా వుంది. ఇంతకీ నువ్వేమి చెప్పదలచుకున్నావు?’’
‘‘చాలా రోజులుగా నా మనసులో ఒక ఆలోచన ఉంది. మనం ఎంతో ఆసక్తికరమైన పోటీని ఎంచుకున్నాం. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీ దగ్గర లెక్కలేనంత ధనరాశులున్నాయి. కానీ రవ్వంత ప్రశాంతత పొందలేకపోతున్నారు. మీ తెలివితేటలు, పట్టుదల ఉపయోగించి ఎంతో ఆర్జించారు. ఇక ఆ తర్వాత ఏమీ లేదన్నంత స్థాయికి చేరుకున్నారు. ఇంతకుమించిన మహదానందం, అదృష్టం లేదన్నంత సంపాదన పరిమితి వరకు. అక్కడికి చేరుకోలేకపోయినా ఆ మార్గంలో వెళుతూనే ఉన్నారు. నా మార్గంలో నేను చేరుకోవాల్సిన చోటు చేరుకోలేకపోయినా నేను వెళుతూనే ఉంటాను. జ్ఞానార్జన, అధ్యయనాలకు పరిమితి లేదు. ఈ మన ప్రయాణాల్లో విశ్రాంతి, తృప్తి, సహనం అంటే ఏమిటో అనుభవించలేము. మనకి కేవలం మన మార్గాలు, పయనం, లక్ష్యం మాత్రమే వున్నాయి. మనం అలా వెళుతూనే ఉంటాం. వాస్తవంగా అంతిమ లక్ష్యం చేరుకునేదాకా!’’
ఆ రోజు, యిప్పటిలా, ఇద్దరూ వారు ఎంచుకున్న మార్గం వదిలేశామనిగాని, ఓ క్షణం ఆగామని కానీ ఊహించరు. ఆ పరిమితి లేదా స్పష్టమైన సరిహద్దుగానీ రాలేదు, బహుశా దగ్గరగా వచ్చినట్టే అయి పక్కకు జారుకుందేమో! మళ్లీ మరోసారి ఆ పరిమితి వచ్చిందని భ్రమించారు. తీరా చేరుకున్నామనుకునేసరికి దాని జాడ లేదు. మనసు యిలా పనిచేస్తుంది. లేదా దీనికి అంతం ఎక్కడో తెలిసేదెలా?

మనతో దోబూచులాడిన బంగారు క్షణాలన్నీ యిపుడు కాలయముని వద్ద చేరాయి. జారిపోయిన మధురస్వప్నంలా. అంతకాలం ఎక్కడికి పోతుంది? పగటి సూర్య వెలుగు కిందకో లేదా రేయి చీకటి ధూళి కింద దాగాయని సూచించేది. నిన్నటి కొత్త పెళ్లికూతురు ఏడుగురు పిల్లల తల్లి అవుతుంది. ఏడుగురు కోడళ్ళకి అత్తగారవుతుంది. వెళ్లిపోయిన కాలం, యవ్వనం తిరిగి రావు. ధనంగాని జ్ఞానంగాని వెళితే దూరపుకొండల్లా కవ్విస్తాయి. పగలూ, రాత్రీ నీలో కోరిక ఉరకలేస్తుంది. నిద్రలో ఉన్నా మెలకువగా ఉన్నా అదే కోరిక నిలవనీయదు. మన దగ్గర అంతులేని ధనం, జ్ఞానం ఉంది. కానీ ఇదంతా వ్యర్థం. వాటిని పొందనంతవరకే నీకు వాటి నిజమైన విలువ, అర్థం తెలిసేది. అవసరానికి మించి పోగేస్తే, అది మట్టి కావచ్చు. జ్ఞానం తెరవెనుక ఉపకరిస్తుంది. బంగారు జింక కోసం సీత మృగతృష్ణలా నిన్ను మాయంచేస్తుంది. జ్ఞానానికి సంబంధించి ఈ మిధ్యే అన్నింటికంటే భయంకర అజ్ఞానం. వ్యర్థనమ్మకం కోసం వ్యర్థ తృష్ణ!
కొద్దిసేపటి క్రితమే సేఠ్ మేల్కొన్నాడు. అతనికి తెలియలేదు, గంట గడిచిందా ఓ సంవత్సరకాలం గడిచిందా అన్నది. అంతులేని సముద్ర గర్భంలోంచి లేచినట్టుంది అతనికి. తలలో అతివేగంగా నది పరవళ్ళు తొక్కుతోన్నట్టుంది. దాంతో ఎంత చెత్తా చెదారం వుందో ఎవరికి తెలుసు. అతనికో కొత్త జీవితం లభించినట్టయింది. మూలుగుతూ ఒక్కసారిగా నిద్రనుంచీ పూర్తిగా మేల్కన్నాడు. సేఠాని వంక చూస్తున్నట్టు లేదా మొదటిసారిగా చూస్తున్నట్టు చూశాడు.
అతని కళ్ళు, పెదవులు మాట్లాడుతున్నాయి. ‘‘నీ సమయమంతా జ్ఞానతృష్ణతో పరిగెత్తావు. మరి నాకు చెప్పు, నా జీవితంలో మొట్టమొదటిసారిగా ధనరాశులతో ఏమాత్రం ఆనందంగాలేవని యివాళ అంటున్నారు. మరి ఇతరులంతా దేనికోసం బతుకుతున్నారు? వారి జీవితాలకు అర్థం ఎలా తెలుసుకుంటారు? ఈగల్లా ప్రజలు రెండింతలు పెరిగి ఎందుకు తిరుగుతున్నారు? తినడానికి తిండిలేదు, వేసుకోను దుస్తులు లేవు. ఉండేందుకు ఇల్లు లేదు. దురదృష్టవంతులకు కనీసం ధనం గురించి కలలూ ఉండవు. వారికి మరణమే గొప్పవరం. అలాంటపుడు కష్టనష్టాల్లోకి ఎందుకు చొరబడతారు? నిరంతరం అలా బార్లా చేతులు చాచి అడుక్కునే బదులు మరణించడమే మేలు.’’
ఆమెవచ్చి అతని పక్కన కూర్చుని, ‘‘నేను చెప్పే సమాధానం నీకు యిష్టం ఉండవచ్చు, లేకపోవచ్చు. కానీ, ఇదే అంతిమ సత్యమని ఖచ్చితంగా అననుగానీ, నీకు మాత్రం ఒకటి చెప్పదలచుకున్నాను. ఇపుడే నేను జ్ఞానం తాలూకు లోటుపాట్లు అర్థం చేసుకోవడం ఆరంభించాను. ఆనందం, దుఃఖాలకు ప్రతీ ఒక్కరూ అర్థం చేసుకునే తీరు వేరువేరుగా ఉంటుంది. వారి లోకాభిప్రాయం, ఇతరులతో వారి సంబంధాలు ఆధారపడి ఉంటుందది. నువ్వు చూసినట్టుగా దారిద్య్రాన్ని వారు చూడరు. సంతోషాన్ని పొందడానికి జీవిస్తున్నామనివారు అనుకుంటారు గనుక. ప్రతీ ఒక్కరూ వారి వారి ఆలోచనలు మహోన్నతమనే అనుకుంటారు. తమతో తాము సంతృప్తి పొందుతుంటారు.’’
‘‘అలాంటి సంతృప్తి ఖక్ వంటిదేమో! ఏదో పొందాలని జీవించడం నరకయాతనే కదా! కాలం ముగియకముందే మరణించలేవు. అమాయకులు, అంతకంటే ఏమీ చేయగలుగుతారు?’’
‘‘నీవు చేయగలిగింది యిక్కడే వుంది. పేదవాడి దగ్గరకో, దారిద్య్రంలో మగ్గుతున్నవాడి దగ్గరకో వెళ్లి పీక నులిమే యత్నం చేసి చూడు! వాడు వెంటనే నీ పీక పట్టుకోలేదని నాకు చెప్పు! మనకంటే జీవితేచ్ఛ వాళ్లకే ఎక్కువ. ఆనందం కోసం పరుగులెత్తడంలోనే వారి మహదానందం దాగి వుంది. ప్రతీవారు ఈ లోకంనుంచీ ఖాళీగానే వెళతారన్న ఆలోచనతో వారేమంత తృప్తిపడరు. మరణాన్ని మించి శక్తే లేదు. రాజులు, పండితులు, కోటీశ్వరుల శక్తీ సాటిరాదు. ఏ ఒక్కరూ చిన్నరాయి కూడా వెంట తీసికెళ్లరు. నరకంలో అంతా సమానమే. గొప్ప, బీద, తారతమ్యాలు ఉండవు. బీదవాడు ఈ ఆలోచన లేకుంటే వాడి దారిద్య్రానికి అంతే లేదు’’.
అతను దీర్ఘంగా నిట్టూర్చి అన్నాడు, ‘‘ఇవాళ నీ జ్ఞానానికి అంతేలేదనుకుంటా. మనిషికి జ్ఞానానికి మించిన ఆనందాన్నిచ్చేదేమీ లేదని గ్రహించడం ఇవాళే ఆరంభించాను. నిన్ను నా గురువుగా చేసుకుంటాను. మరో ఆలోచన పెట్టుకోకు’’.
‘‘జ్ఞానంలో, ధనంలో, భక్తిమార్గంలో, లేదా కుటుంబం లోనూ ఆనందం లేదన్న నా మాటలు నమ్మితే, మనిషే ఈ భ్రాంతితో కూడిన ఆనంద పంజరాన్ని అల్లుకుంటాడు. మనకంటే ఈ పక్షులు, పశువులు, ఈగలు అన్నీ ఎంతో సంతోషంగా ఉంటాయి. అవి మనలా సంతోష మరీచికలు కల్పించుకోలేవు. ఏ జీవిగా రూపాంతరం చెందుతాడో ఆ రూపంలో సమ్మిళమవుతారు. మనిషిలా అర్థంలేని రక్షణలూ, ఆందోళనలు పట్టించుకోరు. మరోజన్మ నిర్ణయం నా చేతిలోనే ఉంటే, ఏ జీవి జీవితాన్నయినా అంగీకరిస్తాను- గాడిద, పాము, కప్ప, ఆవు, కుక్క ఏదైనా. ఒక్క మనిషి జీవితం తప్ప ఏదైనా సరే!’’
అతను ఏదో చెప్పాలనుకున్నాడు. ఇంతలో ఆవలింత కమ్మేసింది. తన ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ, ‘‘ఇవేం పిచ్చిమాటలు? ఎన్ని కష్టాలు వచ్చినా పట్టించుకోను. కానీ మనిషి జన్మకు పోలిక ఏది? నువ్వు కుంటయినా, జబ్బు మనిషివయినా మనిషివే కదా? జంతువులు వెయ్యి రెట్లు మేలు. ఏమిటీ? పందిలా, పురుగులా, జలగలా లేదా ఎలుకలాగయినా జన్మ ఎత్తడానికి అభ్యంతరం లేదా? ఛీ ఛీ! మనిషిగా కాకుండా మరి దేనిని నేను అంగీకరించను. ఏనుగు లేదా పులిలా పుట్టడానికయినా పట్టించుకోను. వచ్చే జన్మలోనూ మనిషిగా పుట్టాలన్న కోరితోనే యింతటి దానధర్మాలు చేస్తుంట. గుడ్డివాడినో, మూగవాడినో, అన్నీ అక్కడినుంచే పరిష్కరించుకుంటాను’’.
‘‘గర్వంతో కూడిన మనిషి అజ్ఞానమే యిది. కనీసం జంతువులయినా ఈ భ్రమలో ఉండవు’’.
అతను తల చేత్తో పట్టుకుని, ‘‘అలాగయితే ఈ జ్ఞానం నాకు అవసరం లేదు. నా అజ్ఞానమే మేలు’’ అన్నాడు.
ఆమె తన భర్తకు ఎంతో వివరించే ప్రయత్నంచేసింది. తనశక్తి సామర్థ్యాలన్నీ అయిపోయాయి. శక్తినంతా కూడగట్టుకుని మళ్లీ అంది- ‘‘జ్ఞానం, అజ్ఞానం అన్నీ అర్థంలేనివి. అజ్ఞానుల మనసు పొరల్లో యివన్నీ చిక్కుముళ్ళు. అవి ఎప్పుడు వెలుగు చూస్తాయో రాముడికే తెలుసు. ఈ తుచ్ఛమైన జన్మఖైదీలో భ్రమిస్తూ ఒక్క క్షణం జీవించదల్చుకోలేదు. ఎపుడో ఒకప్పుడు ఎంతో కొంత ఆనందం లభిస్తుందన్న ఆశతోనే యిన్నాళ్లూ జీవించడం ఆశ్చర్యపరుస్తోంది. నా మనసును ఓ ప్రశ్న దొలిచేస్తోంది. అసలు మనిషి ఈ అజ్ఞానంతో కూడిన ఏ మాత్రం ప్రత్యేకతలేని జీవితంలో ఎలా ఉంటున్నాడు? ఎందుకు అని.’’
అతను గమనించేలోగానే వజ్రాలతో పొదిగిన దండను మెడలోంచి తీసిపారేసింది. సేఠ్ ఏమీ చేయలేకపోయాడు. అతని అరుపులు విని ఐదుగురు కొడుకులూ పరుగున వచ్చారు. కానీ అప్పటికే సేఠానీ ముక్తిపొందింది.
అతను తన కొడుకులతోకలిసి ఎంతో రోదించాడు, కుమిలిపోయాడు. కానీ అతని రోదన వెళ్లిపోయిన ఆమె మనోహంసను తిరిగి తెచ్చిందా? కొద్ది క్షణాల క్రితం అది ఆమెలో వుంది. మనిషిలా చూడడానికి, మాట్లాడడానికి, వినడానికి, నవ్వడానికి, నిద్రించేందుకు, తినడానికి, తాగేందుకు, నవ్వడానికి, ఏడవడానికి. అదే శరీరం తన కళ్లముందు పిడికెడు మట్టయింది.
ఒక్క రెప్పపాటులో అంతా అయిపోయింది. పంజరం ఖాళీ అయిపోయింది. ప్రకృతి మందులాగే కొనసాగుతోంది. మరణించేవారితో వెళ్ళేదెవరు?
ఆమె ఒకరోజు పెళ్లికూతురై ఇంటికివచ్చింది. హెన్నాపెట్టిన పాదాలతో ద్వారాల దాటి లోపలికి వచ్చింది. ఇపుడు అదే ద్వారాలగుండా నలుగురు సాయంతో మోయబడుతోంది. అతని సంపద ప్రయోజనమేమిటి? అతని దానధర్మాలు చివరి ఫలం యిదేనా? అతనికి ఊపిరాడనంతగా ఉంది. కానీ యిదంతా భ్రమ. కుమారులు, కోడళ్ళు అంతా ఆమె మరణం పట్ల ఎంతో బాధపడుతున్నారు. కానీ లోలోపల ఆత్మలు కొట్టుకుంటున్నాయి. కాలం ఎప్పటిలా సాగిపోతోంది. కళ్లముందు అంత్యక్రియల్లో మంటలు ఉవ్వెత్తున లేవడం గమనించారు. కొయ్యలు, నెయ్యి, కొబ్బరిమట్టలు తోడయ్యేసరికి మంట చెరకుతోటను మించి ఎగిసిపడుతోంది. ఆమె బంగారు వనె్న శరీరం వారి కళ్లముందే బూడిదయింది. ఎముకలే మిగిలాయి. మిగిలినవాటిని పెద్దకొడుకు హరిద్వార్ తీసికెళ్లాడు గంగలో కలిపేందుకు. మూడో రోజు రాజ్యమంతా ఎన్నడూ లేనంతగా సంతాపం జరిపారు. తర్వాత సంతాపదినాలు ముగిశాయి. గంగానది ఘట్టం అయిపోయింది. మనస్ఫూర్తిగా పేదలకు, బ్రాహ్మణులకు దానాలు చేశారు. సంతాప కార్యక్రమానికి రాజు అతని పరివారం వచ్చారు. రాజ్యంలో ప్రతీ ఒక్కరూ సేఠ్‌ని చూసి నిర్ఘాంతపోయారు. అతని ముఖంలో వెలుగులేదు. ఈ ఊహించని కష్టం పగటికలలకంటే దారుణం. ఈ జీవితంలో జరిగేవాటికి ఎవరూ అడ్డుకోలేరన్న సేఠానీ మాట ఎంతో నిజం. ఆమె చనిపోయేముందు చెప్పిన మాటలు అతని మనసుపై గట్టి ముద్రవేశాయి. అంటే తానూ ఏదో ఒక రోజు మరణిస్తాడా? అప్పుడు? ఆ తర్వాత? ఇపుడు అతనికి జీవించడంమీద ఆసక్తి లేదు. కానీ, ఈ జనన మరణాల చట్రంలో తాను మనిషి జన్మ తప్ప దేన్ని స్వీకరించలేడు. అందుకు తన యావత్ సంపదనీ పణంగా పెట్టడానికైనా వెనుకాడడు. మనిషిగా జీవించడం అలవాటయితే మరి దేన్ని అంగీకరించలేడు. కేవలం ఎవరో మనిషిలా కాదు. యిపుడున్న రూపంలోనే ఉండాలి! ఇది లక్షల్లో ఒకటి! భగవంతుడే స్వయంగా ఈర్ష్యపడాలి. కానీ అతనికి యిప్పుడు మెల్లగా అర్థమవుతోంది. తాను ఈ సృష్టిలో ఒక్క ఆకునయినా కదల్చలేనని, సూర్యచంద్రుల్ని, గాలినీ కదల్చలేనని. అన్నింటినీ ఈ దృష్టితో చూస్తే, జీవితంలోని ఆనందమంతా పోతుంది. సంపదలకు మించిన అద్భుతం మరోటి లేదు. అసలు ప్రకృతిలో సౌందర్యమంతా మనిషి వల్లనే సాధ్యమైంది. మనిషివల్లనే భగవంతుడు ఏర్పడ్డాడు. ఇక మోక్షం అంటారా? అతనికి మోక్షం పట్ల కోరికలేదు. వచ్చే జన్మలో మనిషిగా పుట్టడం మించి మరేదీ అతను కోరుకోడు. తన ధన ధాన్యాలను పూర్తిగా అనుభవించాడు. అడుక్కోవడం తప్పుకాదు. భిక్షాటన చేసేవారు మనుషులే కదా! చెట్ల నీడలు, ఆఖాశం, నేల, తినడానికి కొన్ని మూలికలు చాలు. అంతకుమించి అతనేమీ కోరుకోడు.
చివరగా అతను రాజ్యంలోని పంతులందరినీ తన హవేలీకి ఆహ్వానించాడు. ప్రతీ ఒక్కరికీ యిరవై ఒక్క నాణాలు దక్షిణగా ఇచ్చి, ‘గ్రహణంరోజు నేను ఎన్నో దానాలు చేశాను. ఇవేనా ఫలితాలు? సేఠానీ మృతితో ఎంత బాధపడుతున్నానో నాకే తెలుసు. నేను చేసిన దానాలకు లభించాల్సిన ఫలితం ఇదేనంటారా? చెప్పండి’’ అన్నాడు.
భగవంతుడే ప్రతినిధులను పంపినట్టు ఆ వచ్చిన బ్రాహ్మణులంతా పంచాంగాలు తిరగేశారు. రాజాస్థానం నుంచి వచ్చిన జ్యోతిష్కుడు కొంతసేపటి తర్వాత తన ధ్యానం వీడి, ‘‘అయ్యా సేఠ్‌గారూ, సేఠానీ మృకి మాత్రమే దుఃఖపడుతున్నందుకు అదృష్టంగానే భావించండి. లేకుంటే మీ నలుగురు కుమారులూ ఆమెతోపాటు చనిపోయి ఉండాల్సింది. మీ దానాలు, దానగుణమే ఆ మహత్తర సమయం దాటించింది. అందుకే సేఠానీ తన జీవన మార్గాన్ని స్వయంగా ఎంచుకుంది అన్నాడు.
ఆయన అన్న మాటల అర్థాన్ని సేఠ్ ఆలోచించాడు. ‘‘వచ్చే జన్మలో నా ఆత్మ ఏ రూపాన్ని పొందుతుంది?’’ అని అడిగాడు. పండితులు అందరూ ఏకకంఠంతో సమాధానమిచ్చారు, ‘‘మీరు మోక్షాన్ని కోరుకోకుంటే మీ యిష్టం. లేకుంటే మీరు ఆశించే ఏ రూపాన్నయినా పొందవచ్చు. శక్తిమంతుడైన చక్రవర్తి, మహాబోధకుడు, మహాయోధుడు, లేదా అత్యంత ధనికుడయిన సేఠ్‌గా..’’
‘‘మనిషిగా జన్మించడం తప్ప మరో కోరికంటూ లేదు. ఈ జీవితంలో సంపాదించే అర్హత ఈలోగా సంపాదించాలి’’.
‘‘ఇందులో ఏమన్నా సందేహం ఉన్నదా, అన్నదాతా?’’ అన్నాడు దర్బారు నుంచి వచ్చిన జ్యోతిష్కుడు.
‘‘ఎవరిమీద నమ్మకం ఉందో వారి తలమీద ప్రమాణం చేయండి. పంచాంగం పరిశీలించి నిజం చెప్పండి’.
పండితులు కొంతసేపు పంచాంగాన్ని పరిశీలించారు. వారి ముందు ఏమున్నదో వారికి అర్థమయిందో లేదోగానీ, కనుగొన్నది చెప్పడానికి చెప్పలేకపోతున్నారు అంతా. దర్బారు జ్యోతిష్కుడే ఇక ధైర్యం చేసి ‘‘మీ ప్రమాణాన్ని గౌరవించాలి. ఏదేమయినప్పటికీ, నేను ఎప్పుడూ అబద్ధమాడలేదు. ఉదయించే సూర్యునికాంతి అబద్ధమే అయితే, నేను చెప్పబోయేది అంతే అబద్ధం. పైకి గట్టిగా చెప్పడానికి చాలా సిగ్గుపడుతున్నాను. ఈ ఆత్మ వచ్చే జన్మలో చాలా హీనంగా ఉంటుంది’’.
అతను భయంతో వణికాడు. మొహంమీద చెమట తుడుచుకుంటూ. ‘‘అయితే ఒకటి చెప్పండి. నేను తెలుసుకోవలసింది ఏమిటి?’’ అని సేఠ్ అడిగాడు.
రాజుగారి జ్యోతిష్కుడు తప్పించుకునే యత్నం చేస్తూ, ‘‘వచ్చే జన్మలో ఏమవుతారన్నది, ఎవరయ్యేదీ తెలుసుకోవడం అంత సబబు కాదు. శాస్త్రాల్లో కూడా అదే సంగతి ఉంది’’ అన్నాడు.
కానీ వాళ్లు చెప్పిందేదీ సేఠ్ వినలేదు. కనుక అతను వచ్చే జన్మలో ఈ హవేలీలోని గుంటలో ఈగగా జన్మిస్తాడన్నది చివరికి ఎలాగో వారు చెప్పవలసి వచ్చింది.
ఆ సంగతి వినగానే అతనికి అసహ్యమేసింది. అంతటా ఈగలు తిరుగుతున్నట్టయింది. చూడ్డానికి చిరాకేసి కీటకంగానా? వచ్చే జన్మలో తాను యిలా పుడతాడా? అతని ఆరోగ్యం క్షీణించింది. మరుజన్మ గురించి అడక్కుండా ఉండవలసింది.
అతని పూర్వీకుల పండితుడు యిలా అన్నాడు. ‘‘అన్నదాతా, వాళ్లు చెప్పేదాన్ని ఎందుకు నమ్ముతారు? కాశీ నుంచి ప్రసిద్ధ పండితుడిని పిలిపించండి. అప్పటివరకూ మీరు ఎలాంటి ఆందోళనా పడనవసరంలేదు’’.
రాజుగారి దగ్గరనుంచి వచ్చిన జ్యోతిష్కుడు పంచాంగాన్ని మూసేసి అతనితో అన్నాడు, ‘‘పంచాంగాలన్నీ ఒకటే, చదివితే అదే సత్యాన్ని చెబుతారు. ఇందులో రాసి వున్నది చెరిపేయడానికి, మార్చడానికి మానవశక్తి ఏమీ ఉండదు!’’
ఆ హెచ్చరిక విన్నప్పటికీ సేట్ తన పెద్ద కొడుకును వెంటనే గుర్రంమీద కాశీకి వెళ్లమని పురమాయించాడు.
అతను కళ్లు తెరిచి ఎటుచూసినా ఈగల్నే చూశాడు. పాకుతూ, ఎక్కుతూ.. కళ్లు నుటిమి మరీ చూశాడు. ప్రయోజనం లేదు. నిద్రబోతున్నా, నడుస్తున్నా, నిలబడినా, కూర్చున్నా అంతటా ఈగలు, ఈగలు.. సమస్త లోకాన్ని అవే చుట్టేశాయి.
అతని ఐదుగురు కొడుకులు, కోడళ్లూ, అతన్ని కనిపెట్టుకోవడంలో నానా హైరానా పడుతున్నారు. కానీ అతను ఉపశమనం ఎలా పొందుతాడు? ఆహారంలోనూ ఈగలు చూశాడు. నీళ్లలోనూ చూశాడు. అతనికి వినసకర్రతో సేవలందిస్తున్న కోడళ్ల హారాలమీదా పాకుతున్నట్టు చూశాడు! అతను తన కొడుకులకు చెప్పిందే మళ్లీ చెబుతున్నాడు. ‘‘ఈ జీవితకాలంలో ఈగను అవ్వాలని లేదు! నా శరీరమంతా ఏదో పాకుతోన్నట్టుంది. చూడు, గమనిస్తున్నావా!’’
చిన్నకొడుకు తన తండ్రి సంగతి రాజుగారికి తెలియజేశాడు. రాజాస్థానం నుంచి వైద్య నిపుణుడు వెంటనే గుర్రంమీద వచ్చి వాలాడు. సేఠ్ పిచ్చివాడవకుండా కాపాడేందుకు కొన్ని మూలికలు, ఔషధాలు ఇచ్చాడు. ఆ రోజంతా అతన్ని గమనిస్తూనే ఉన్నాడు. సేఠ్ మంచంమీద నుంచి మధ్యమధ్య లేస్తూ పిచ్చాడిలా వాగుతున్నాడు. ‘‘ఈ మూలికలు, ఔషధాలు ఏమీ చేయలేవు. స్పష్టం.. ఈ జీవితంలోనే నేను ఈగను అయిపోతాను. అది ఎంత ఖర్చయినాసరే.. అందుకు ఎంత ఖర్చయినా ఆ చికిత్స కావాలి.
ఆ భావం ఎంత గొప్పదయినా, స్పష్టంగా ఉన్నప్పటికీ, మా మంచి సేఠ్‌గారికి ఎలా అర్థమవుతుంది? అతని యావదాస్తే ఉపయోగపడలేదు.
కాశీ నుంచి ప్రముఖ పండితుడు రానే వచ్చాడు. అతని ధనాశ మొదట్లో రాజాస్థాన పురోహితుడితో విభేదించేట్టుచేసింది. కానీ గంగమ్మ తల్లిపై ప్రమాణం చేసి చెప్పమనే సేట్ గట్టిగా అనేసరికి, నిజం చెప్పక తప్పలేదు. ‘‘అనవసరంగా మనసు పాడుచేసుకోవడం దేనికి? ఆందోళనపడటంవల్ల ప్రయోజనం ఉందంటే, పట్టణంలో ప్రజలంతా నీ కోసం ఆందోళన పడాలి. జరిగేదాన్ని ఎవరు నియంత్రించగలరు?’’ అన్నాడు.
మరణం లేకుండా ఉండేందుకు ఏదైనా మందు కొనగలిగేంత ధరలో లభిస్తుందా? కానీ అలాంటిదెప్పుడూ చేయలేదు. వచ్చేజన్మలో ఈగగా పుడతానన్న అతని ఆందోళనకు అంతే లేకుండాపోయింది.
వాస్తవానికి, కాలానికి మించిన వైద్యుడు ఉండడు. వచ్చే జన్మలో ఈగగా పుడతానన్న ఆలోచన క్రమేపీ సేఠ్ ఆలోచననుంచి తొలగిపోయింది. అతని భయాందోళన నెమ్మదించింది. పేదలకు దానం చేయడానికి స్వయంగా బయటికి వస్తున్నాడు. పగలు, రాత్రీ పూజలు చేస్తున్నాడు. క్రమేపీ ఈ పనులన్నీ వదిలేసి సృష్టిలోని ప్రతీ చిన్న జీవినీ పరిశీలించటంలో నిమగ్నుడయ్యాడు. సూర్యోదయాస్తమయాలు పరిశీలిస్తున్నాడు, అదే మొదటిసారి చూస్తున్నట్టు. వాస్తవాన్ని గ్రహిస్తున్నంత దీక్షగా పరిశీలిస్తున్నాడు. చంద్రుడివంక చూసి నవ్వుకున్నాడు. నృత్యం చేస్తున్నాడు, నవ్వుకుంటున్నాడు. ఆకాశంలో ప్రతి చుక్కనీ లెక్కించే యత్నం చేస్తున్నాడు. పూలవాసన ఆఘ్రాణిస్తున్నాడు. సీతాకోక చిలుకలను వేటాడుతున్నాడు. వర్షంలో తడిసి ముద్దవుతున్నాడు. పక్షుల రాగాల్లో లీనమవుతున్నాడు. కోయిల పాటల్ని అనుకరించే యత్నం చేస్తున్నాడు. మానవ జీవితంలో ప్రతీ రసాన్ని చివరంటగా తాగాలనుకుంటున్నాడు. సృష్టిలో అదృష్టం, ఆనందం కనపడుతోంది. సంపద కాదు!
ఇలా ఉండగా ఒకరోజు మళ్లీ పాత భయమే కొత్తగా పట్టింది. వచ్చే జన్మ గురించి ఆలోచన మనసులోకి రావడంతో, అతని హృది భోగిమంటలా మండింది. ఓ రోజు సూర్యోదయాన్ని చూస్తుంటే, ఉన్నట్టుండి గుండెపోటు వచ్చింది. గొంతు పెగల్లేదు, అయినా అరిచాడు. సూర్యుడు కుళ్లిన గుమ్మడిలా పాడయిపోయినట్టు తోచింది! ఈగలు దాని వెంటబడ్డాయి. త్వరలో సూర్యుడు ముక్కలై పడిపోతాడు!
కొడుకులు పరుగున వచ్చారు. సేఠ్ నేలమీద పడి పొర్లుతున్నాడు. చెమటలతో ముద్దయ్యాడు. వాళ్లు అతన్ని లేపి మంచంమీద పడుకోబెట్టారు. అతని కళ్లు తిరుగుతున్నాయి. శరీరం చల్లబడింది. అతను పీలగొంతుతో, ‘‘నేనీ లోకంలో యిక ఎంతోకాలం అతిథిగా ఉండబోను. గొయ్యిని పవిత్ర గంగాజలంతో కడగండి. శ్వాసపోగానే గొయ్యిలో చూడండి. మీకు ఈగ కనబడితే వెంటనే నలిపి చంపేయండి. నేను ఈగగగా ఒక క్షణమైనా బతకదల్చుకోలేదు’’ అన్నాడు. మాట్లాడిన వెంటనే అతని పళ్లు బిగిసిపోయాయి. కళ్లు రాళ్లలా నిలిచిపోయాయి. క్షణం తర్వాత ప్రాణం పోయింది. నేలమీద అతని శరీరం ఉంది. కొడుకుల్లో మధ్యవాడు పరుగున వెళ్లి గొయ్యి దగ్గరికి వెళ్లాడు. దానిలోకి తొంగి చూశాడు. అప్పుడే ఒక ఈగ నిజంగానే పాకుతూ కనపడింది. ఒక రాయి తీసుకుని కొట్టబోయాడు. జూన్ గట్టిగా పిలిచాడు. ‘‘అరే, నీకమైనా పిచ్చా? నేనిక్కడ చాలా సంతోషంగా ఉన్నాను. చాలా ఆనందంగా ఉన్నాను’’.
కొడుకు చేయి ఆగిపోయింది. అతనన్నాడు, ‘‘ఏదీ ఒక్కమాట చెప్పు, ఈ గోతిని బంగారంతో కప్పేస్తాను. గంగాజలంతో సువాసనలు వెదజల్లే పూలతో నింపేస్తాను. ఈ మట్టితో ఊపిరాడక ఇబ్బంది పడతావ్, ఛీఛీ!’’
ఆలోచనలో పడ్డ పురుగు సమాధానమిచ్చింది, ‘‘పూలవాసన మాటెత్తితేనే నాకు వాంతివస్తుంది. ఈ ఆనందం నీకేం తెలుస్తుంది? నా పళాన ఉండనీయ్. నీ సలహాలు నీ దగ్గరే ఉంచుకో. వెళ్లు నీ తండ్రికి అంత్యక్రియలు చెయ్యి. నా గురించీ దిగులుపడకు. నా ఆనందాన్ని ఊహించలేవు. నీ సంగతి నువ్వు చూసుకో. అదే చాలు.’’

కథలకు ఆహ్వానం
‘ఆదివారం ఆంధ్రభూమి’కి కథలు పంపవలసిన చిరునామా:
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 500 003.
పీడీఎఫ్ ఫార్మాట్‌లో sundaymag@andhrabhoomi.net కు మెయల్‌లో పంపాలి.

రాజస్థానీ: విజయదన్ దెత ‘చౌబోలీ అండ్ అదర్ స్టోరీస్’ - ఆంగ్లం: మెర్రిల్ తెలుగు: టి.లలితప్రసాద్