కథ

డిటెక్టివ్ చంగల్రావ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చంగల్రావ్‌కి చిన్నప్పటినించీ డిటెక్టివ్ నవలలు చదవటమంటే చాలా ఇష్టం. స్కూలుకి సెలవు దొరికితే చాలు ఏదో ఒక డిటెక్టివ్ నవల పట్టుకుని కూర్చునేవాడు. వేసవి సెలవలైతే ఇక చెప్పనే పనిలేదు. రోజంతా అదే పని. కొమ్మూరి సాంబశివరావు నవలలంటే అతనికి చాలాఇష్టం. డిటెక్టివ్ యుగంధర్ అతని ఆదర్శ డిటెక్టివ్. స్కూల్ రోజులు దాటి కాలేజీకి వెళ్ళేటప్పటికి ఈ పుస్తకాలు చదవటానికి టైం ఉండేది కాదు. కానీ వాటి ప్రభావంతో చంగల్రావ్‌కి ఎప్పుడూ అన్నిటినీ ఒక పరిశోధనా దృక్పథంతో చూడటం అలవాటైంది. ఎలాగోలా డిగ్రీ పూర్తిచేసిన చంగల్రావ్‌కి ఉద్యోగం దొరకటానికి కొంతకాలం పట్టింది. అయినా మొత్తానికి సెంట్రల్ గవర్నమెంటు ఉద్యోగమే సంపాదించాడు. అయితే అది ఎటువంటి థ్రిల్లూ ఉండే అవకాశమే లేని పోస్టల్ డిపార్టుమెంటు. పొట్టకూటికోసం చేరకతప్పలేదు. ముక్కుతూ మూలుగుతూ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు.
రిటైర్ అయి నెల రోజులవుతోంది. ఎంత థ్రిల్లు లేని ఉద్యోగమైనా ఉదరపోషణతోపాటుగా తన టైం గడవటానికి పనికివచ్చింది. ఇపుడు రిటైర్ అయిన లగాయతు ఇంట్లో గోళ్లు గిల్లుకుంటూ కూర్చోవటమే అవుతోంది. దొరికిన డిటెక్టివ్ నవలలు చదువుతున్నాడు. కానీ ఈ వయసుకి చదవటం మాత్రమే సరిపోవటల్లేదు. అతని మనసులో ఏదో కొరత. తను ఏదో చేసి ఉండవలసిందనీ, అది కాకుండా ఈ పోస్టల్ డిపార్టుమెంట్‌లో చేరి జీవితమంతా వృధా చేసుకున్నాననీ అతని అభిప్రాయం. ఏముంది ఆ డిపార్ట్‌మెంట్లో? కార్డులు కవర్లు అమ్మటం, లేదా రిజిస్టర్డ్ పోస్టులు తీసుకుని రసీదులు ఇవ్వటం; మహా అయితే సేవింగ్స్ బ్యాంకు అకౌంట్లలో జమలు, విత్‌డ్రాయళ్ళు.. అంతే.
ఒక రోజు చంగల్రావ్‌కి సడెన్‌గా ఒక ఆలోచన వచ్చింది. ఫ్రీలాన్స్ డిటెక్టివ్ పనిచేస్తేనో! ఆలోచన రావటమేమిటి- అది విపరీతంగా నచ్చేసింది. వెంటనే అమల్లో పెట్టాలని నిశ్చయించుకున్నాడు. ఈ పనికి సీక్రెసీ చాలా అవసరం అనుకున్నాడు. అందుచేత తన ఐడియా భార్యతోకూడా షేర్ చేసుకోలేదు. మొట్టమొదట ఏ ప్రాజెక్టు చేపట్టాలో అని ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చాడు. ఈ పనిలో తనను ఎవరూ గమనించకుండా తను ఇతరులని గమనించటం ముఖ్యమైన విషయం. గుడి దగ్గర ముష్టివాడలాగా కూర్చుంటే గుడికి వచ్చేపోయేవాల్ళని గమనించవచ్చు. ముష్టివాడినివరూ తేరిపార చూడరు- డబ్బులు వేస్తున్నప్పుడు కూడా. పైగా భగవంతుడి గుడి దగ్గర తన వృత్తిని మొదలుపెట్టడం ఉత్తమం అనిపించింది.
గడ్డం చేసుకోవటం మానేశాడు. పెళ్ళాం అడిగితే ఏదో దురద పెడుతోందని కంటిసాకు చెప్పాడు. మంచిరోజు చూసుకున్నాడు. ఆ రోజు ఒక చిరిగిపోయిన బనీను వేసుకుని, మోకాళ్ళ వరకు హాఫ్ పాంటు పాతది ఒకటి చూసి వేసుకున్నాడు. వాటిమీద మామూలుగా ప్టా, షఊర్టు వేసుకుని ఇంట్లోనించి బయలుదేరాడు- భార్యకి తెలియకుండా ఉండాలని. దారిలో సులభ్ కాంప్లెక్స్‌లోకెళ్ళి అక్కడ పైన వేసుకున్న ప్యాంటు షర్టు తీసేసి మడిచి ఒక కవర్లో పెట్టుకుని గుడికి చేరాడు. అప్పటికేగుడి బయట ముష్టివాల్లు బారుదీరి కూర్చునిన్నారు. చంగల్రావ్ ఆ వరసలో చివరగా సెటిల్ అయ్యాడు. పక్కన కూర్చుని వున్న ముసలాడు, ‘‘నినె్నప్పుడూ చూళ్లేదు; నువ్వు యూనియన్ నెంబరువేనా?’’ అని అడిగాడు చెంగల్రావ్ వంక అనుమానంగా చూస్తూ. వాడడిగింది అర్థంకాక చెంగల్రావ్ నీళ్లు నమిలాడు. ఆ ములాడు అప్పుడు తనకి అటుప్కన వున్నవాడ్ని పిలవగా ఇద్దరూ కలిసి చెంగల్రావ్‌ని కొట్టినంత పనిచేసి తరిమేశారు. బతుకు జీవుడా అని మళ్లీ సులభ్ కాంప్లెక్స్‌కి వెళ్లి పైబట్టలు వేసుకుని ఇల్లు చేరాడు. చెంగల్రావ్ కొత్త వృత్తి ప్రారంభం అలా జరిగింది.
భోజనం చేసి ఓ కునుకు తీసి లేచిన తరువాత బట్టలేసుకుని ఒక ఇరానీ హోటల్‌కి వెళ్ళాడు. ఇరానీ హోటళ్ళలో చేబుల్స్ చాలా దగ్గరదగ్గరగా ఉంటాయి. అక్కడకూర్చుని పక్క టేబుల్ వాళ్ళ మాటలు వినచ్చు అని చెంగల్రావ్ ప్లాన్. క్రైమ్ చేసేవాళ్లుఅలాంటి చోట్లలోనే కూర్చుని ప్లాన్ చేసుకుంటారని అతని అభిప్రాయం. దగ్గర దగ్గర 2 గంటలసేపు కూర్చుని 3 కప్పుల టీ తాగాడు. ఒక న్యూస్ పేపర్ పట్టుకుని చదువుతున్నట్టు నటిస్తున్నాడు. ఇతర టేబుళ్ళదగ్గర వస్తున్నారు పోతున్నారు. ఇతను మాత్రం కూర్చునే ఉన్నాడు, వింటూనే ఉన్నాడ. ఏ ఒక్కళ్ళ సంభాషఠణా తనకి పనికివచ్చేదిలా కనపడలేదు. ఒక టేబుల్ దగ్గర నలుగురు కాలేజీ కుర్రాళ్ళు వాళ్ళ క్లాసులో అమ్మాయిని ఎలా పడెయ్యాలా అని మాట్లాడుకుంటుంటే, మరో టేబుల్ దగ్గర తీసుకున్న అప్పుని తిరిగి ఇవ్వలేడని బండబూతులు తిడుతున్నాడు తన ఎదురుగా కూర్చున్నవాడ్ని. వీళ్ళ తరువాత మరో నలుగురు కుర్రాళ్ళు వచ్చి టీ ఆర్డర్ ఇచ్చి వాళ్ళ వాళ్ళ ఫోన్లలోకి చూస్తూ మాటా మంతీ లేకుండా కూర్చుని ఉన్నారు- ఈ రోజుల్లో అలవాటు ప్రకారం. మిగతా కేసులన్నీ ఇలాంటివే. ఇక లాభం లేదని మూడు టీలకి డబ్బిచ్చి ఇల్లు చేరాడు. అలవాటు లేక మూడు టీలు తాగేటప్పటికి రాత్రి భోజనానికి ఆకలి వెయ్యలేదు. పెట్టినవి సరిగ్గా తినలేదని, ‘బయట ఏదో చెత్త తినొచ్చి ఉంటారు’ అని పెళ్ళాం చీవాట్లు పెడితే అవి తిన్నాడు నోరుమూసుకుని. అసలు విషయం చెప్పలేడయ్య; ప్రొఫెషనల్ సీక్రెసీ మరి!
మొదటిరోజు అనుభవంతో మరాన్డు ఎక్కడికీ బయలుదేరలేదు. సాయంత్రం అయ్యప్పటికి వీధిలో ఏదో గంట మోగుతూ బండి వెడుతూ ఉంటే వాకిట్లోకి చూశాడు. ఒక 20-25 ఏళ్ళ కుర్రాడు ఒక బండిమీద ఒక పెద్ద గాజు సీసాలో సోన్‌పాప్డీ అమ్ముతూ వెడుతున్నాడు. చెంగల్రావ్ మెదడు పాదరసంలా పనిచేసింది. గబగబా లెక్కలు వేసాడు. ‘ఈ వ్యాపారంలో ఏమాత్రం లాభం వస్తుంది? అంత చిన్న మొత్తానికి ఈ వయసు కుర్రాడు ఎందుకు ఈ పనిచేస్తాడు? అసలు విషయం ఇంకేదో ఉండి తీరాలి అనుకున్నాడు. సోన్‌పాప్డీ ఒక ముసుగు అయి ఉండచ్చు; అసలు మరేదో అమ్ముతూ ఉండొచ్చు. డ్రగ్స్ ఎందుకు కాకూడదు?’ అనుకున్నాడు. అంతే గబాగబా బట్టలు వేసుకుని ‘నే బయటికి వెడుతున్నా’ అని పెల్ళానికి చెప్పి హడావుడిగా బయటికి పరిగెత్తాడు ఆ బండిని ఐదు అడుగుల దూరంలో ఫాలో చేస్తూ. వాడు ఎవరికన్నా డ్రగ్స్ అమ్మడం జరిగితే తను ఏం చెయ్యాలా అని అనుకుని, వాళ్ళ కంటబడకుండా తనసెల్ ఫోన్‌తోఒక ఫొటో తీద్దామనుకున్నాడు. జాగ్రత్తగా ఫాలో అవుతూ వెళ్ళాడు. దాదాపు 2 గంటల సేపు అలా వెళ్ళాడు. ఆ కుర్రాడు మాత్రం గంట కొడుతూ వెడుతూ, ఎవరన్నా పిలిస్తే సోన్‌పాప్డీ అమ్ముతూ వెడుతున్నాడు. చెంగల్రావ్‌కి కాళ్ళు పీకటం మొదలుపెట్టాయి. నీరసం కూడ ఆవస్తోంది. కేవలం నడవటమే కాదు గదా; ఆ బండివాడిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి- అందుకు ఎంతో అటెన్షన్‌తో ఉండాలి.
వాడు సోన్‌పాప్డీతోబాటు డ్రగ్ ఇస్తున్నాడేమో చూస్తూ ఉండాలి. వీటన్నిటితో ఓపిక అంతా చచిచ్పోయింది. వచ్చినంత దూరం తిరిగి వెళ్ళాలి కూడా. ఆటోలో వెళ్ళచ్చు కానీ ఈ వృత్తిలో సంపాదన మొదలవకుంకడా ఖర్చు చెయ్యకూడదనుకున్నాడు. చచ్చీచెడీ ఇల్లు చేరుకున్నాడు. ముందురోజు అనుభవంతో ఈయన ఎలాగూ బయట ఏదో చెత్త తిని వస్తాడనుకుని పెళ్ళాం కూరా గట్రా వండలేదు. వంకాయ పచ్చడి చేసి ఊరుకుంది. చెంగల్రావ్‌కి చచ్చేంత ఆకలి. కానీ ఆ రోజు అంత ఆకలి అనిగాని, అందుకుగాల కారణాలని గాని భార్యతో చెప్పలేదు. అంత దూరం నడిచానని చెప్తే పెళ్ళానికి అసలు విషయం తెలిసిపోతుంది. అమ్మో, ప్రొఫెషనల్ సీక్రెసీ మరి!
‘గవర్నమెంట్ ఆఫీసుల్లో లంచాలు తింటారని అంటారు కదా; అక్కడికి వెళ్ళి నిఘావేస్తేనో’ అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ప్రజల రోజువారీ అవసరాలకి సంబంధించిన ఒక డిపార్టుమెంటుకి వెళ్లి అక్కడ కూర్చున్నాడు- పదిగంటలకల్లా. ఒకటో రెండో సీట్లలో తప్ప ఉద్యోగులు ఎవ్వరూ వాళ్ల సీట్లలో లేరు. ఒక్కొక్కళ్ళే తీరుబడిగా వచ్చి అన్ని సీట్లూ నిండేటప్పటికి 11 అయింది. అప్పుడు వాళ్ళు మెల్లగా టీ తాగుతూ ముచ్చట్లు ఆడుకుంటున్నారు. ఆఫీస్ హడ్ గది ఖాళీగా ఉంది. ఉన్న సూపర్‌వైజర్స్‌లో కొందరు బుర్ర వంచుకుని ఏదో రాసుకుంటూండగా కొందరు సెల్‌ఫోన్‌మీద మాట్లాడుతున్నారు. ప్రజలకు అలవాటేమో- 11 వరకూ ఎవరూ రాలేదు. చంగల్రావ్ మాత్రం గమనిస్తూ కూర్చుని ఉన్నాడు. 11.30 తరవాత ఒక మనిషి వచ్చి ఒక టేబుల్ దగ్గరికి వెళ్ళి ఏదో విషయం గురించి కాసేపు చర్చించి, చివరికి జేబులోనుంచి కొన్ని నోట్లు తీసి ఆ ఉద్యోగికి ఇస్తూ ఉండడం చెంగల్రావ్ గమనించాడు.
‘దొరికాడురా!’ అని మనసలో అనుకుని చేతిలో రెడీగా వలుంచుకున్న సెల్‌ఫోన్‌తో ఫొటో తీశాడు. చంగల్రావ్ ఖర్మ కాలి సరిగ్గా ఇతను ఫోటో తీసే టైంలో ఆ ఉద్యోగి చంగల్రావ్ వంక చూడటం జరిగింది. తీసుకున్న నోట్లు చేబులో పెట్టుకుంటూ, చంగల్రావ్ వంక చెయ్యెత్తి తన దగ్గరికి రమ్మనట్టు సైగ చేశాడు. చంగల్రావ్‌కి ఏం చెయ్యాలో పాలు పోలేదు. డిటెక్టివ్ అన్న తరువాత భయపడకూడదు, భయపెట్టాలి అనుకుంటూ మెల్లగా ఆ పిలిచిన ఉద్యోగి టేబుల్ దగ్గరికి నడిచాడు- సెల్‌ఫోన్ ప్యాంటు జేబులోకి తోసుకుంటూ. ఏమో, ఆ ఉద్యోగి తన దగ్గరున్న ఎవిడెన్స్‌ని డెస్ట్రాయ్ చెయ్యటానికి తన ఫోన్ లాక్కుంటే? అందుకు ముందు జాగ్రత్త. అక్కడికి వెళ్ళగానే ఆ ఉద్యోగి అడిగాడు, ‘‘ఏం సారూ, ఫొటో మంచిగొచ్చిందా? ఒక్కతూరి చూపియ్యండి’’ అన్నాడు. కచ్చితంగా ఇది తనసెల్‌ఫఓన్ లాక్కోటానికే ప్లాన్ అనుకున్న చంగల్రావ్ సమాధానం చెప్పకుండా నుంచుని ఉండిపోయాడు. ఇది చూసి ఆ ఉద్యోగి, ‘‘లేకుంటే ఒక పని చెయ్యండి. మల్లా తీయండి’’ అంటూ తన జేబులో వున్న నోట్లు తీసి ఎదురుగా వున్న వ్యక్తికి ఇచ్చి మళ్లీ తన చేతికి అందించమని చెప్పాడు చెంగల్రావ్ వంకకి తిరిగి ఫోజు పెడుతూ. అవాక్కయిన చంగల్రావ్‌కి దీనితో అర్థం అయింది- గవర్నమెంట్ ఆఫీసులో తను ఏం పీకలేనని. ఉసూరుమంటూ ఇల్లు జేరాడు. ‘‘ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు? ఏం వెలగబెట్టారు? మార్నింగ్ షో సినిమాకి వెడదామని అన్నానుగా? చెప్పాపెట్టకుండా ఎక్కడికి జారుకున్నారు?’’’ అని పెల్ళాం తిట్ల వర్షం కురిపించింది. కిమ్మనకుండా ఉండిపోయాడు చెంగల్రావ్. సమాధానం చెప్పలేడు: ప్రొఫెషనల్ సీక్రెసీ మరి!
చంగల్రావ్‌కి ఒక గొప్ప ఐడియావచ్చింది. ‘కుక్కలకి వాసనతో పసిగట్టే శక్తి ఉంటుంది గదా; ఒక కుక్కని పెంచితే తన ప్రొఫెషన్‌కి బాగా పనికొస్తుంది’ అనుకున్నాడు. చూస్తే మంచి బ్రీడ్ కుక్కని కొందామంటే బాగా ఖరీదు ఉంది. కాబట్టి చెంగల్రావ్‌కి ఒక ఐడియా వచ్చింది. చెంగల్రావ్‌కి ఐడియాలకి కొరతే ఉండదుగా- రోడ్డుమీద వున్న కుక్కల్లో తనకి నచ్చిదాన్ని మచ్చిక చేసుకున్నాడు. అందుకోసం దానికి బిస్కట్లు పెట్టేవాడు. ఫాస్ట్‌ట్రాక్‌లో మచ్చిక చేసుకోవటానికి 2-3సార్లు చికెన్ ముక్క తెచ్చిపెట్టాడు. తాను శాఖాహారే అయినా తన ప్రొఫెషన్ కోసం చికెన్ ముక్కని హోటల్లో కొని పట్టుకొచ్చాడు. మొత్తానికి దాన్ని ఇంటిదాకా తెచ్చి దానికో పట్టా గొలుసు కొట్టాడు. దాన్ని వాకిట్లో కిటికీకి కట్టేశాడు. రోడ్డుమీద స్వేచ్ఛగా తిరగటం అలవాటు అయిన ఆ కుక్క ఊహూ మొరగటం మొదలుపెట్టింది. ‘దీనె్నక్కడినించి తెచ్చారు, మన చావుకి?’అని పెళ్ళాం తిట్టిపోసింది. అసలు విషయం చెప్పకుండా, ‘‘నాకు ఎప్పటినించో కుక్కని పెంచుకోవాలని ఇష్టంలేవే’’ అని అబద్ధం చెప్పాడు. దానికి మిగిలిన అన్నం కాస్త పడేసింది చెంగల్రావ్ పెళ్ళాం. రోజూ ఏదోలాగా ఎక్కడనించో ఒక మాంసం ముక్క సంపాదించి తినటం అలవాటైన ఆ కుక్కకి ఈ వెధవ మజ్జిగన్నం తినటం మహావిసుగ్గా ఉంది. మాంసంగాని చికెన్ ముక్కగానీ ఇంటికి తెచ్చి పెట్టలేడయ్యె. కనీసం అది మరికాస్త చెప్పుచేతల్లోకి వచ్చేవరకూ అలా షికారు తీసికెడితే దానికి కాస్త హాయిగా అనిపిస్తుందేమోనని గొలుసు చేత్తో పట్టుకుని రోడ్డుమీదకి తీసుకెళ్ళాడు పక్క సందులోకి. ఆ సందులో ఒక కుక్క కనిపించింది. గొలుసుకి కట్టివున్న కుక్కని చూడంగానే అక్కడున్న కుక్క ఒక్కసారి వెళ్ళిపోయింది పరిగెడుతూ. 30 సెకండ్లలో 6-7 కుక్కలు మొరుగుతూ వచ్చేసాయి. అంటే అక్కడున్న కుక్క వెళ్ళి వాటి గ్యాంగ్ ఫ్రెండ్సని పిలుచుకొచ్చిందన్నమాట. వాటిల్ని చూడగానే ‘పెంపుడు’ కుక్క ఒక్కసారి అరుస్తూ చెంగల్రావ్ చేతి గొలుసుని విడిపించుకుంటూ ముందుకు పరుగెత్తింది. ఈ అకోని పరిణామానికి ఎదురుచూడని చెంగల్రావ్ ఒక్కసారి ముందుకు పడ్డాడు. అయినా గొలుసు వదలకుండా పట్టుకున్నాడు. కుక్క తన బలమంతా ఉపయోగించి ముందుకు పరిగెడుతోంది. చంగల్రావ్ మోకాళ్ళమీద ముందు లాగబడుతున్నాడు. ఇంతలో ఫ్రెండ్స్ కుక్కల్లో ఒకటి వచ్చి చంగల్రావ్‌ని కరిచింది. దాంతో ‘అమ్మో’ అని అరుస్తూ గొలుసుని వదలిపెట్టేశాడు. కుక్కలన్నీ వెళ్లిపోయాయి నవ్వుకుంటూ. చెంగల్రావ్ ‘బతుకు జీవుడా7 అనుకుంటూ ఇల్లు చేరాడు. విషయం విని పెళ్ళాం తిట్టిపోస్తూ డాక్టరు దగ్గరికి తీసుకెళ్ళింది ఇంజెక్షన్లు చేయించడానికి. ఆరోజంతా తిడుతూనేవుంది. ఆ తిట్ల ముందు కుక్క కరిచిన గాయం పెద్దగా నెప్పి పెట్టలేదు. పొట్ట చుట్టూ ఇంజెక్షన్లు చేయించుకుని కోలుకోడానికి పదిహేను రోజులు పట్టింది.

కుక్కకాటుతో బుద్ధి వచ్చిందనుకుంటే మనం పొరపడ్డట్టే. ఈసారి చంగల్రావ్ తన పరిశోధనకు రైల్వే స్టేషన్‌ను ఎంచుకున్నాడు. ఒకరోజు టిఫిన్ తిని నాలుగింటికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కి వెళ్ళాడు. ఫ్లాటుఫారం టిక్కెట్ కొనుక్కొనిలోపలికి వెళ్ళాడు. ఒకసారి ఒకటో నెంబరు ఫ్లాట్‌ఫారం అంతా తిరిగి వచ్చాడు. ఏవైనా అనుమానాస్పదంగా కనపడతాయేమో చూడటానికి. సాయంత్రం రైళ్లు చాలానే ఉంటాయి. మెల్ల మెల్లగా జనం కూడుతున్నారు. చెంగల్రావు ఒక బెంచీమీద కూర్చున్నాడు నాలుగువైపులా చూస్తూ. కాసేపాగి మరి కొన్ని ఫ్లాటుఫారంలు తిరిగివచ్చాడు. చెన్నైవెళ్ళే రైలు వచ్చి ఆగింది. ఊరికే ఒక స్లీపర్ కాస్ పెట్టెలో ఎక్కి పెట్టెలో చివరిదాకా నడిచి దిగాడు. మళ్లీ వచ్చి కూర్చుందామంటే అప్పటికి బెంచీలన్నీ నిండిపోయాయి. బుక్‌స్టాల్ దగ్గరికి వచ్చి స్టాల్‌లో వున్న పుస్తకాలని పరిశీలిస్తున్నాడు. పని ఏంచేస్తున్నా అతని చూపులు మాత్రం చుట్టూతా పరిశీలిస్తూనే ఉన్నాయి. అదే అతని కొంప ముంచింది. అతని భుజంమీద ఏదో తట్టినట్టు అయింది. తిరిగి చూస్తే ఎవరో తన వంక చస్తూ, ‘‘పద!’’ అన్నాడు. ‘‘ఎవరు నువ్వు?’’ అని అడిగాడు చెంగల్రావ్. అతను తన ఐడి కార్డు చూపించాడు. ఆర్‌పిఎఫ్- రైల్వే పోలీస్ ఫోర్స్. ‘ఎక్కడికి’ అని చంగల్రావ్ అడగ్గా ‘స్టేషన్‌కి’ అన్నాడు. చెంగల్రావ్ కాస్త బెంబేలు పడ్డా, చూద్దాం అని వెంటవెళ్లాడు. ఒకటో నెంబరు ఫ్లాట్‌ఫారంమీద వున్నది ఆర్‌పిఎఫ్ స్టేషన్. అందులో ఒక చిన్న లాకప్ రూమ్ కూడా వుంది- కటకటలాతో. ‘‘రెండు గంటలనుంచీ చూస్తున్నాను; స్టేషన్ అంతా తిరుగుతున్నావ్. రైలు పెట్టెలోకి ఎక్కి చివరిదాకా నడిచి దిగావ్; అసలు ఏమిటి నీ ప్లాన్? ఎక్కడన్నా బాంబు పెడదామనుకుంటున్నావా?’’ అని గదమాయించాడు. దానితో చంగల్రావ్‌కి ఒకటి అర్థం అయింది; అతను తనని మొదటినించీ ఫాలో చేసాడు. అప్పుడు అసలు విషయం చెప్పాడు. ఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్‌కి ఒక్కసారి డౌట్ వచ్చింది- వీడెవడో పిచ్చాడేమోనని. కానీ క్రిమినల్స్ అందరూ ఇలాగే కట్టుకథలు చెపుతూ ఉంటారు. అందువల్ల ఎస్‌ఐ వచ్చేవరకూ వీడని ఉంచటమే కరెక్టు అనుకుని అక్కడ ఒక స్టూల్‌మీద కూర్చోమన్నాడు; సెల్ తాళం తెరిచి లోపల పెట్టి తాళం వెయ్యటానికి బద్దకించి. బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాడు చెంగల్రావ్. ఓ గంట తరువాత వచ్చాడు ఎస్‌ఐ. కానిస్టేబుల్ చెప్పింది విని చెంగల్రావ్‌ని పిలిచాడు. ‘‘చెప్పు; ఏమిటి నీ సంగతి’’ అన్నాడు. చంగల్రావ్‌కి అనిపించింది తను ఇంగ్లీషులో మరికాస్త వివరంగా చెపితే ఉపయోగం వుంటుందని. అలాగే చేసి తాను రిటైర్ అవబోయేముందు పనిచేసిన పోస్ట్ ఆఫీస్ వివరాలు చెప్పి కావాలంటే ఫోన్ చేసి కనుక్కోమన్నాడు. ఏకళనున్నాడో ఆ సబ్ ఇన్స్‌పెక్టర్, కానిస్టేబుల్ వంక చూసి ‘వదిలేయిరా’ అని, చెంగల్రావుతో అన్నాడు, ‘‘మళ్ళీ ఎప్పుడున్నా సికింద్రాబాద్ స్టేషన్‌లో కనపడ్డావో, ఖబడ్దార్!’’ అని. వదిలింది తడవుగా స్టేషన్ బయటపడి ఆటో ఎక్కి ఇంటికొచ్చేశాడు.
డిటెక్షన్ తనకి సరిపడదని చక్కగా అర్థం చేసుకున్న చెంగల్రావు వార పత్రికలూ, ఇతర నవలలూ చదువుతూ, టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తున్నాడు.
రెండు నెలల తరవాత గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో విశాఖపట్నం వెళ్ళవలసివచ్చింది భార్యతో సహా. తమ ఇంటికి సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర అయినప్పటికీ నాంపల్లి స్టేషన్‌కి వెళ్ళి రైలు ఎక్కాడు. భార్య చంగల్రావు నానా తిట్లు తిడుతూనే వుంది దారంతా- ఈ పిచ్చిపని ఏమిటని. కానీ కారణం చెప్పాలంటే సికింద్రాబాద్ స్టేషన్‌తో తనకున్న సంబంధం గురించి చెప్పవలసి వస్తుంది. ఎలా చెప్తాడు? ప్రొఫెషనల్ సీక్రెసీ మరి!
=========================================================

కథలకు ఆహ్వానం
‘ఆదివారం ఆంధ్రభూమి’కి కథలు పంపవలసిన చిరునామా:
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 500 003.
పీడీఎఫ్ ఫార్మాట్‌లో sundaymag@andhrabhoomi.net కు మెయల్‌లో పంపాలి.

-ఆర్.మురళీకృష్ణ.. 9866071588