బాల భూమి

సమయస్ఫూర్తి( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాము, సోము ఇద్దరూ మంచి స్నేహితులు. పరీక్షలు ఎప్పుడు వచ్చినా ఇద్దరూ ఎక్కడో ఒకచోట కలిసి కూర్చుని చదువుకునేవారు. అలా ఒకరోజు పరీక్షలు దగ్గరికి వస్తున్నాయని బడికి కాస్తంత దూరంలో కూర్చుని ఒకరితో ఒకరు చర్చించుకుంటూ చదువుకుంటున్నారు. అక్కడికి దగ్గరలోనే ఆ ఊరి రైల్వేస్టేషన్ కూడా ఉంది. చిన్నప్పటి నుంచి వాళ్లిద్దరూ అదే బడిలో చదవడం వల్ల రైలు రాకపోకల వల్ల కలిగే శబ్దం వారి చదువుకి ఆటంకం కలిగించలేదు. వాళ్లు ఇద్దరూ అలా చదువుకుంటూ వుండగా...
కొంతసేపటికి ఎవరో ఇద్దరు పెద్దమనుషులు వచ్చి వాళ్ల పక్కగా కూర్చున్నారు. ఇద్దరూ పెద్దపెద్దగా మాట్లాడుకుంటూ ఒకటే గోల చేయసాగారు. దాంతో చదువుకి భంగం కలిగిన రాము...
‘దయచేసి కొంచెం నెమ్మదిగా మాట్లాడుకుంటున్నారా?’ అన్నాడు. వాళ్లు అదేం పట్టించుకోకుండా వాళ్ల మానాన వాళ్లు మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఎన్నిసార్లు చెప్పినా వినకపోయేసరికి ఇక అక్కడ్నించి వెళ్లిపోదాం అనుకుంటూ వుండగా...
మొదటివాడు ‘ఒరేయ్! అక్కడ బడి ఉంది కదా?’ అన్నాడు రెండవ వానితో.
‘అవును. ఉంది’ అన్నాడు రెండవ వాడు.
‘మరి ఇక్కడ స్టేషను ఉంది కదా!’ అన్నాడు మళ్లీ మొదటివాడు. ‘అవును. ఉంది’ అన్నాడు రెండవవాడు మొదటి వాని వైపే చూస్తూ.
సంభాషణ ఆసక్తిగా ఉండేసరికి ఆగిపోయి వినసాగారు రాము, సోము. అప్పుడు...
‘అయితే రైళ్లు వచ్చి, పోయే సమయంలో ఆ శబ్దానికి బడిలో చదువుకునే పిల్లల చదువుకు ఆటంకం కదా?’ అన్నాడు మొదటివాడు.
‘అవును.. ఆటంకమే!’
‘... అలా ఆటంకం కలక్కుండా ఉండాలంటే ఈ స్టేషన్ని ఇక్కడి నుండి కొంచెం దూరంగా జరిపెయ్యాలన్న మాట’ అన్నాడు.
అది విని రామూ, సోము ఇద్దరూ తెల్లబోయారు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ వెళ్లబోయే వాళ్లల్లా ఆగిపోయి రెండవవాడు ఏం చెప్తాడా అని ఆత్రుతగా వినసాగారు.
అప్పుడు రెండవ వాడు.. మొదటివానిని ఉద్దేశించి
‘అబ్బే!.. స్టేషన్ని జరపాలంటే చాలా కష్టం. అది అయ్యే పని కాదు’ అన్నాడు.
‘మరేం చెయ్యాలంటావ్?’ అన్నాడు మొదటివాడు.
‘... రైళ్లు రాకుండా ఆపెయ్యాలి. అప్పుడే ఎలాంటి ఆటంకాలూ లేకుండా పిల్లలు చదువుకుంటారు’ అన్నాడు ఎంతో తెలివైన వాడిలా ముఖం పెట్టి.
వింటున్న సోమూ, రాములకి తల తిరిగిపోవటమే కాదు వాళ్లిద్దరూ పిచ్చోళ్లని కూడా అర్థమైంది.
క్షణంలో వాళ్లని అక్కడ్నించి ఎలా పంపించెయ్యాలో అర్థమైపోయిన రాము పుస్తకాలను కింద పడేసి గబుక్కున లేచి నిలబడి.. దగ్గర్లో చిన్న కర్ర ఉంటే చేతిలోకి తీసుకుని.. ‘్ఠం.. ఠాం.. టఠాం.. టఠాం..’ అంటూ గుండ్రంగా తిప్పుతూ అప్పటికప్పుడు నానా బీభత్సం చేసెయ్యసాగాడు.
పిచ్చివానిలా ప్రవర్తిస్తున్న రాముని సోముతో పాటు వాళ్లిద్దరూ కూడా భయం భయంగా చూడసాగారు.
అది గమనించిన రాము సోము వైపు చూసి కంటితో సైగ చేశాడు. దాంతో సోము...
వాళ్లిద్దరికీ వినిపించేట్టుగా ‘ఇప్పుడు ఏమి చెయ్యబోతున్నావు రామూ.. నీ మంత్రదండంతో?’ అని అడిగాడు మనసులో నవ్వుకుంటూ...
‘ఈ రైల్వేస్టేషన్ వల్ల.. బడి పిల్లల చదువుకు ఆటంకం కలుగుతున్నది. అది ఇప్పటివరకూ మనం గమనించలేదు. ఇప్పుడే ఈ పెద్ద మనుషుల మాటల వల్ల తెలిసింది. స్టేషన్ని జరపలేము. రైళ్లను ఆపలేము. అందుకని స్టేషన్ని మాయం చేసేస్తున్నాను..్ఠం ఠాం.. టఠాం?’ అన్నాడు కర్రను మరింత విసురుగా తిప్పుతూ..
అది విని భయపడుతున్నట్టుగా లేచి నిలబడ్డ సోము...
‘అయితే.. స్టేషన్‌తోపాటు మనం కూడా మాయం అయిపోతామా?’ అన్నాడు వణికిపోతూ.
‘అవును. అయిపోతాము. స్టేషన్‌తోపాటు చుట్టుపక్కలా కూర్చున్నవారంతా మాయం అయిపోతారు’ అన్నాడో లేదో పరుగు అందుకున్నారు వాళ్లిద్దరూ.
భయంతో పరుగులు తీస్తున్న వాళ్లిద్దర్నీ వెనక నించి చూస్తూ పకపకా నవ్వుకుంటూ...
‘పిచ్చి వాళ్లకు పిచ్చిగానే సమాధానం చెప్పాలి’ అనుకున్నారు రాము, సోము పుస్తకాలు చేతిలోకి తీసుకుంటూ.

-కన్నేగంటి అనసూయ 9246541249