కథ

నులక మంచం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పచ్చని కొబ్బరి చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం ఆంధ్రా గోవా అనిపించే, కోనసీమలోని గోదావరి గట్టునున్న ఓ కుగ్రామం దొడ్డవరం. ఇప్పటికీ వరద వస్తే చుట్టూ మునిగిపోయి లోపలికి వెళ్లాలంటే మూడు మైళ్లు పైనే పడవ ప్రయాణం చేయవలసిందే. ఆ గ్రామంలో ఎతె్తైన అరుగులతో చుట్టూ ప్రహరీ గోడతో, వరద వచ్చినా మునగనంత ఎత్తులోనున్న విశాలమైన పెంకుటిల్లు, లోపలే ఆవులతో కళకళలాడే ఆ ఇంటి లోపలికి వెళ్లి చూస్తే గదిలో డొక్కతాడుతో నేసిన బామ్మగారి నులకమంచం, బర్మా పందిరి మంచాలు, మడత కుర్చీలు, ఇత్తడి కంచాలు, మర చెంబులతో ఆనాటి గ్రామాలు గుర్తుకు రావలసినదే.
ఎవరైనా వారింటికి వస్తే ‘ముందు దాహం తీర్చుకోండి’ అంటూ లోటాతో చల్ల ఇచ్చే మర్యాద. మనుషులను మనుషులుగానే చూస్తారు తప్ప, వారెవరన్నది ఆలోచించకుండా సహాయం చేయడం వారి ఆనవాయితీ. వరదొస్తే అందరికీ తన ఇంటిలోనే వండి, వార్చి అందరినీ తనవారిగానే చూసే కుటుంబం. ముడతలు పడిన చర్మంతో, పళ్లన్నీ రాలిపోయి, తలబోడైనా తలపులు బోడి కాలేదన్నట్లు ముసిముసి నవ్వులతో, అందరితో హాయిగా మాట్లాడే బోసినవ్వుల పెంటమ్మగారే ఆ కుటుంబ పెద్ద.
మోటీవేషనల్ స్పీకర్ కమ్ గైడెన్స్ అండ్ కౌన్సిలర్‌గా పని చేస్తున్న మనవరాలు పరిమళకి బామ్మంటే ఇష్టమే కాదు తన వృత్తిలో కూడా బామ్మ అనుభవాలను వాడుకుంటూ అనుభవాల తొందరలను ఒక్కొక్కటి బయటకు లాగుతూ, ఆలోచనలకు పదును పెడుతూ, తన స్పీచ్‌ల్లో వాడుకుంటూ, మంచి పేరు సంపాదించుకుంటుంది. ఒక రోజు సరదాగా కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో ‘నీకు పెంటమ్మ పేరు ఎందుకు పెట్టారు?’ అని అడిగింది.
‘పుట్టిన పిల్లలు కనీసం ఏడవకుండానే చనిపోతుంటే, ఆ తల్లికి పుట్టిన పసికందులను పాతచేటలో ధ్యానం వేసి దానిలో పుట్టిన బిడ్డను పడుకోబెట్టి అటూ ఇటూ దొర్లించి కొంతసేపు పెంట మీద ఉంచి, బిడ్డ ఏడ్చిన తర్వాత తీసుకొచ్చి స్నానం చేయించి లోపలికి తీసుకొచ్చేవారు’
‘అలా ఎందుకు చేసేవారు?’ పరిమళ ఆతృతగా తెలుసుకోవాలని.
‘పుట్టిన బిడ్డను పెంట మీద నింగి, నేల, నిప్పు, నీరు, వాయువు వంటి పంచభూతాలకు సమర్పించేవారు. అలా బ్రతికిన బిడ్డలను పెంటమ్మ, పెంటయ్య అని పిలిచేవారు’ అని బామ్మ అనగానే
‘అలా పుట్టి పెరిగిన దానివి కాబట్టి నీకు పెంటమ్మ అని పేరు పెట్టారు’ అని అంది పరిమళ.
‘ఔను’ అన్నట్లు తల వూపింది అమ్మ.
‘ఆంగ్లంలో పెంటా అంటే ఐదని అర్థం. పెంటమ్మ అంటే పంచభూతాలకు అందించడం కాదు. దానగుణం, మంచితనం, చిట్కా వైద్యం, సరస సంభాషణా చాతుర్యం, ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిర్వహణ వంటి ఐదు గుణాలతో, అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కాబట్టి పెంటమ్మ అని అనడం సబబే’ అని మనసుల్లోనే సమర్ధించుకుంది పరిమళ.
నులక మంచం బిగుస్తూ తనలో తాను నవ్వుకుంటున్న బామ్మను చూసి ‘ఏమిటే ముసలి నీలో నీవు నవ్వుకుంటున్నావు?’ అంటూ పరువాల పడతి పరిమళ నైలాన్ నైటీలో వస్తూ అంది.
‘ఏమీ లేదే పరిమళా! నీ మాటలు వింటుంటే, ఆ మాటలోని మర్మాలు చూసి నవ్వోస్తుందే’ అని నవ్వుకుంటూ ‘ఆనాడు మా అవ్వ చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చి నెమరువేసుకుంటున్నానే’ అంది.
‘ఎందుకు నవ్వుతున్నావో చెబితేకానీ కుదరదని బామ్మని ఒత్తిడి చేస్తూ, చిన్నతనం నుండి ప్రతి విషయాన్ని ఎలా అడిగి తెలుసుకునేదో వయసు పెరిగిన అలాగే పట్టుపట్టింది. పిల్లల తల్లైన మనవరాలు పరిమళ అడగడంతో తప్పనిసరై, తన ఆలోచనల సుడిగుండాన్ని ఒక్కసారిగా ఆపేసి బామ్మ నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టింది.
‘.. ఆ రోజుల్లో కోడిగుడ్డు లాంతరు వెలుతురులో నులకమంచం మీద చంటిబిడ్డతో పడుకోమంటే, నాకు మంచం పొడవు సరిపోక, కాళ్లు కిందికి పోతుంటే ముడుచుకొని బిడ్డను ఒత్తిళ్లు ఉంచుకొని, పడుకోవలసి వచ్చింది. ఈ మంచం మీద పడుకోలేను, పందిరి మంచమే కావాలని మారాం చేస్తుంటే...’
‘మారాం చేస్తుంటే...’
అప్పుడు మా అవ్వ వచ్చి ‘ఏమిటా పిచ్చిపిల్లా! చంటిబిడ్డను పక్కనేసుకుని పడుకోవడాన్ని బాధేమిటి? మెలకువగా ఉంటూ, మధ్యమధ్యలో బిడ్డకు పాలిచ్చుకుంటూ, బిడ్డ మంచం మీద నుంచి జారి కింద పడకుండా, చూసుకుంటూ, బిడ్డ తడిపిన బట్ట మార్చుకుంటూ ఉండాలంటే.. ఎలా కుదురుతుంది? రాత్రి పందిరి మంచం మీద హాయిగా మొగుడు పక్కన పడుకొని, సరసాలాడి మత్తుగా నిద్ర పోవడమేమిటే, బిడ్డను పెంచడమంటే! ఓ కునుకు తీసి కొంచెం పాలిచ్చి, మరో కునుకు తీసేలోపే బిడ్డ పక్క బట్టలు మారుస్తూ మెలకువగా ఉంటూ ఆలనా పాలనా చూడాలి. పరుపు మీద పడుకుంటే, ఆ తడికి చంటిబిడ్డకు ఆసనం దగ్గర ఎరుపు ఎక్కడంతోపాటు, జలుబు చేయడం వలన, గాలి పీల్చుకోవడం కూడా చాలా కష్టమవుతుంది? నీ బిడ్డను నీవు కాక ఇంకెవరు సాకుతారు?’ అంటూ అవ్వ సున్నితంగా మందలించిన మాటలు ఇప్పటికీ నా మనసులో మార్మోగుతున్నాయి అంది బామ్మ.
తొలిసూరి బాలింతగా తను పట్టెమంచం కాదని, డబుల్‌కాట్ మంచం కావాలనుకోవడం, ఆనాడు బామ్మలాగే పందిరి మంచం బదులు డబుల్ కాట్ మీదే పడుకుంటానన్న మాటలు గుర్తుకొచ్చి, ‘సృష్టిలో ప్రతి విషయానికి ఎంత పోలిక. కాలచక్రం తిరిగి వస్తుంద’ని బామ్మ చెప్పిన మాటలు నిజమన్నట్లు పరిమళకు మనస్సులో అనిపించింది.
‘అరచేతిలో విశ్వంలా జీవిత సత్యాలన్నింటిని, విడమరిచే వేదాంతిలా, మంచి మార్గాన్ని చూపే నిర్దేశకురాలి’గా బామ్మను తలుచుకుంది పరిమళ.
ఇంట్లోనే కాదు, గ్రామమంతా బామ్మ మాటకు విలువ వుంది. ఎవరికైనా, ఏదైనా శారీరక రుగ్మతలు వస్తే చిటికెలో చిట్కా వైద్యం చెప్పి, ‘గుంటుగున్నాకు, మిరియాల కలిపి నూరి పట్టువేయి, నొప్పి వెంటనే పోతుంది’ అంటూ చిట్కాలిచ్చే వైద్యురాలిగా కనిపిస్తుంది.
ఈ మధ్యనే వెస్టీజ్ సంస్థ ఫుడ్ ప్రొడక్ట్స్ మరియు ఉత్పత్తులు తెలుపుతూ ఆమ్లా క్యాప్సుల్స్ గురించి చెబుతుంటే చిన్నప్పుడు బామ్మ దగ్గర కూర్చుని విన్న మాటలు గుర్తుకొస్తున్నాయి. ‘ఓ లప్పా మనవడికి జరమొచ్చి తగ్గింది. గానీ ఏమీ తినడం లేదని’ బోదె అవతల నుండి వచ్చిన కొండమ్మ మామ్మ అనగానే ‘వూరబెట్టిన వుసిరి కాయలున్నాయి. తీసుకెళ్లి పచ్చడి చేసి పెట్టు. నోటికి రుచిగా ఉంటుంది ఆకలి పుడుతుంది’ అని బామ్మ సలహా ఇచ్చి, చేసిన సహాయం గుర్తుకొచ్చింది పరిమళకు.
మానసిక రుగ్మతలొచ్చిన వారికి ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిర్వహించడంలో దిట్ట. సరసం కూడిన సలహాలు బామ్మ చిట్కాలు వూరందరికీ వేదంలా పని చేస్తాయి. ఎనిమిది పదుల వయస్సులోను, నలగని తెల్లని చీరతో, ముసిముసి నవ్వులతో ఆప్యాయంగా పలుకరించే బామ్మంటే అందరితోపాటు పరిమళకు కూడా చాలా ఇష్టం.
ఒకసారి పొలంలో పనిచేసే కోనయ్య వచ్చి ‘పెద్దమ్మగారంటూ’ పిలవగానే వసారాలోంచి బామ్మ వచ్చి ‘ఏమయ్యా! కోనయ్యా! బాగున్నావా?’ అంటూ పలుకరించింది.
‘ఏమి సెప్పనమ్మ నా కట్టాలు, మా మల్లెకు పెళ్లి చేశామా అండీ! అల్లుడూ, కూతురు వచ్చిన ప్రతిసారి చీటికీ మాటికీ గొడవలు పడుతున్నారండీ’ అంటూ చెప్పేసరికి
‘ఓసారి మల్లెను నాకు కనబడమను’ బామ్మ అంది.
‘అలాగే ఎల్లొత్తానమ్మగారండీ! చాయంత్రం పంపిత్తానండీ!’ అంటూ వెళ్లాడు కోనయ్య.
సాయంత్రం మల్లెలు సింగారించుకొని, తనకంటే ముందు మల్లెలమత్తు గుబాళింపు, చేతులు ఉన్నాయో లేవో తెలియని పొట్టి చేతుల రవికలో వయ్యారాలు వొలకబోస్తూ, నాభి కిందకు కట్టిన వయొలెట్ రంగు చీరలో నితాంబిని లాంటి మల్లెను చూస్తుంటే...
ఒక్కసారే బామ్మకు పెళ్లికి ముందు బావ కోసం ఎదురుచూసిన రోజులు జ్ఞాపకం వచ్చాయి...
‘తెల్లవారితే శ్రీరామ నవమి.. బావ చదువు కోసం పట్నమెళ్లి సంవత్సరం గడిచింది. ఒక్కసారి మావయ్య వెళ్లి రావడం తప్ప ఇంకేమీ తెలియదు. ‘దొడ్డారానికి దోవలేదు. తొండారానికి తోవలేదు’ అంటాడు సత్తిరాజు తాతయ్య.
‘బావ మహేంద్రవరం వెళ్లి సంవత్సరం గడిచింది. అక్కడ నుండి బొబ్బర్లంక రేవు దాటి జట్కా బండెక్కి మారుతూ రావాలంట! యాభై మైళ్లు పైనే ఎలా వస్తాడో!’ అన్న నయం.
‘ఎలా వుంటాడు? ఏమైనా మారిపోయాడా?’ రాజమండ్రిలో రంగసాన్లు వుంటారని అవ్వ, అమ్మవాళ్లు అనుకుంటుంటే విన్నాను. ఎవరైనా బావని వలలో వేసుకున్నారా వంటి ఆలోచనలన్నీ బావ మీదే.
ఎందుకంటే ‘బావ వచ్చాక వైశాఖమాసంలో పెళ్లని పెద్దోళ్లు’ అనుకుంటున్నారు. ఎప్పుడు తెల్లవారుతుందో, ఎప్పుడు బావ వస్తాడాని ఎదురుచూపుల్తో ముందు రోజు ఉదయమే గోరింటాకు పెట్టుకుని, మధ్యాహ్నమే తలంటు స్నానం చేసి, కురులు ఆరబోసుకుంటూ మురిసిపోతుంటే, అవ్వ వచ్చి సాంబ్రాణి పొగ వేస్తూ ‘మందారంలా పూస్తే మంచి మొగుడొస్తా’డన్న మాట బామ్మ చెవుల్లో గిర్రుమంటున్నాయి.
కోడికూతకు ముందే లేచి, పుష్పవతి అయినప్పుడు అమ్మమ్మ కుట్టించిన మామిడిపిందెల అంచులతో, తెల్ల గంటల పరికిణి, బుట్టచేతుల రవికేసుకుని, నీలిరంగు ఓణీతో, మువ్వల పట్టీలు పెట్టుకుని ఘల్లు ఘల్లుమంటూ బావ ముందరకెళ్ళితే బాగుంటుందేమో?ని తయారవుతుంటే అవ్వ వచ్చి ‘పెళ్లి కళ వచ్చేసిందే’ అంటుండగా, నేను సిగ్గుపడుతుంటే ‘అన్నీ ఇప్పుడే కాదు కొన్ని పెళ్లినాటికి దాచుకో మనవరాలా?’ అని గలగలా నవ్వేసింది. బావ రేవు దాటాడని, వచ్చేస్తున్నాడని పాలేరు కబురు చెప్పగానే అందరూ బయటకెళ్లి ఎదురుచూడసాగారు. నేను బయటకు వస్తుంటే చిన్నాన్న వచ్చి ‘మనువాడే మరదలు పిల్లవు. నీవెక్కడికి?’ అనేసరికి వెళ్లాలని మనసులోవున్న ఎదిరించే ధైర్యం లేక ఇంట్లోకెళ్లి గది కిటికీలోంచి తొంగి చూస్తూ...
‘అసలు బావను గుర్తుపట్టలేక పోయాను. వెళ్లేటప్పుడు పంచె కట్టుకుని వెళ్లిన బావ ముదురు ఆకుపచ్చ రంగు గొట్టం పంట్లాము, చారల చొక్కాతో, కాళ్లకు కొత్త జోళ్లు వేసుకుని దొరబాబులా నడచి రావడం...’ కళ్ల ముందు కనిపిస్తుంటే
మల్లెల సువాసనలు వెదజల్లుతూ మల్లి దగ్గరకు, వచ్చి గట్టిగా ‘అమ్మగారండీ’ అనేసరికి ఒక్కసారిగా వులిక్కిపడి ఈ లోకంలోకి వచ్చి ‘ఏమే మల్లి! ఏమిటి విశేషాలు?’ అంటూ ఆప్యాయంగా బామ్మ పలుకరించింది.
‘ఏముంది పెద్దమ్మగారండీ! మా అయ్య తాగేసి వచ్చి సాయంత్రం గోల చేతునాడండీ! అది చూసి మనువాడినోడు సిమాలు ఎత్తుతున్నాడండీ!’ అంటూ కోనసీమ యాసలో సాగదీస్తూ మాట్లాడింది మల్లె.
‘పోనీలేవే వాడికి ఎప్పటి నుంచో అలవాటుంది. అది నీకు తెలిసిందే కదా! అంత మాత్రానికే గొడవలెందుకు?’
‘అది కాదండి పెద్దమ్మగారండీ! నినే్న మా ఆయన వూరు నుంచి వచ్చాడండీ. అల్లుడొచ్చాడు కదాని అమ్మ కోడికూర, గారెలు వంటి సుస్తి భోజనం పెట్టిందండి’
‘మంచి పనే చేసిందిగా...’
‘గానండీ! అసలు సంతంతా రాత్రి కప్పుకోవడాన్కి ఇచ్చిన దుప్పటి, మంచం దగ్గర వచ్చిందండీ అమ్మగారండీ!’ అంది మల్లి.
‘దుప్పటి, మంచం దగ్గర గొడవేంటి?’
‘ఏముంది అమ్మగారండీ! మా ఆయనకు మంచం కురచగా ఉందని, దుప్పటి కాళ్ల దగ్గర కప్పుకుంటే ముఖానికి, ముఖాని కేసుకుంటే కాళ్లకి సరిపడలేదని ఒకటే నస...’
‘ఒసే పిల్లా!’ అంటూ నవ్వుతూ
‘ఈ రోజుల్లో మీరు చాలా సుకుమారులే.. ఎందుకంటే ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి, ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా చూస్తూ మదనపడుతూ ఉంటారు’ చిన్న మంచము, చిన్న దుప్పటైతే ఒకరినొకరు హత్తుకొని, తనువు, తనువు తగిలితే వచ్చే హాయిగా రసానందంలో మునిగి తేలుతూ రాత్రంతా సుఖాన్ని అనుభవిస్తుంటే, చిన్న మంచమైనా, చిరుగుల దుప్పటైనా వయసులోనున్న యువ జంటకు, మోక్ష మార్గమేర్పరుస్తుందే కానీ బాధ ఉండదు.’
‘పెద్దమంచం, పెద్ద దుప్పట్లో సంతోషమేముంది, సరసమేముంది? హాయిగా నిద్ర పోవడం తప్ప.’
‘మంచం విశాలంగా ఉంటే అటొకరు, ఇటొకరు తిరిగి, ఒకర్నొకరు పట్టించుకోకుండా ఉంటారు. నేటి తరం వారికి మంచం విశాలమైనది, మనసులు ఇరుకైనాయి. నాటితరం వారికి మంచం ఇరుకైనా మనసులు విశాలంగా ఉండేవి.’
‘గానీ మీకు అలా కాకుండా ఏదోలా వుంటుందంటే మీలో ఏదో లోపం ఉన్నట్లు తోస్తుంది’ అంటూనే
‘సర్దుబాటులేని వ్యక్తులు వారు సుఖంగా జీవించరు - తమ తోటివార్ని సుఖంగా జీవించనివ్వరు’ బామ్మ అనేసరికి మల్లికి ఒక్కసారే వృద్ధ రతీదేవి సాన మీద జీవితానుభవ గంధాన్ని రంగరించి, చల్లదనాన్ని అందిస్తున్నట్లు అనిపించిన వెంటనే
‘వత్తాను!! పెద్ద అమ్మగారండీ’ అంటూ వయసు వయ్యారాలను సర్దుకుంటూ చకచక ఇంటికి పరుగులు తీసింది మల్లి.
పక్కనే వున్న పరిమళకు భగవద్గీతను బోధిస్తున్న శ్రీకృష్ణునిలా కనిపించింది. ఎందుకంటే చిన్నప్పుడు ఓసారి ఏదో చిరాకుగా మాట్లాడుతున్నప్పుడు ‘జీవితమంటే అద్దం ముందు నిలబడి నిన్ను నీవు చూసుకోవడమే, నవ్వుతూ వుంటే నవ్వుతున్న ప్రతిబింబం, ఏడుస్తుంటే ఏడుస్తున్న ప్రతిబింబం కనిపిస్తుంది’ అని చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి.
ఈ రోజుల్లో ఉద్యోగాల పేరు చెప్పి చిన్న కుటుంబంతో అందరికీ దూరంగా బ్రతుకుతుంటే సరైన సలహాలు ఇచ్చే బామ్మ వంటి పెద్దవారు లేక చిన్నచిన్న విషయాలకే సంసారాలు రోడ్డెక్కుతున్నాయి. పెద్దవారి సేవలను వినియోగించుకోకుండా, వాళ్లను వృద్ధాశ్రమాల్లో చేరుస్తూ, నేటి యువత ఎంతో నష్టపోతుంది. ఈనాడు ఫ్యామిలీ కౌన్సిలింగ్‌ల వారు ఇచ్చే సలహాల కన్నా, ఎంతో మిన్నగా మనసులను, మనుషులను అర్థం చేసుకుని కలిపే ‘బామ్మలాంటి పెద్దవాళ్లు వుంటే, ప్రతి ఇల్లు స్వర్గసీమే కదా!’ అనుకుంటూ పరిమళ మనస్సులోనే బామ్మకు శతకోటి వందనాలు తెల్పుకుంది.

-ఎం.బాలాజీ.. 9492260018 ( బామాశ్రీ)