కథ

కథలో జీవిత సత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తప్పు చేయనపుడు, తప్పు చేశావని ఎవరైనా నిందించినపుడు మనిషిలో అపరిచితుడు నిద్రలేస్తాడు. అసహనంతో, కోపంతో రగిలిపోతాడు. గోవర్థన్ మాత్రం నిగ్రహం పాటించాడు. అన్నీ సమకూర్చుతున్నా ఏమీ చేయడంలేదని వేలెత్తి చూపించేసరికి అతనిలో అసహనం పొంగిపొర్లింది. ‘‘నీ గురించి నాకు తెలుసురా! మీ నాన్నమీద నీకెంత ప్రేమో నాకు కాక ఇంకెవరికి తెలుస్తుంది చెప్పు? మనవాళ్ళను కాదని ఎక్కడ్నుంచో తెచ్చుకున్న అమ్మాయి నీఅంత ప్రేమగా, బాధ్యతగా ఉండాలనేం లేదుగా!’’ సెంటర్లో బండరాయిపైన కూర్చుని గోవర్థన్ వంకే సూటిగా చూస్తూ అన్నాడు వెంకయ్య. ‘‘ఏం జరిగిందో సూటిగా చెప్పు బాబాయ్. డొంకతిరుగుడొద్దు’’. గోవర్థన్ మాటల్లో కోపం ధ్వనించింది. ‘‘ఊరు ఊరంతా కోడై కూస్తున్నా నీకింకా తెలియదంటరా?’ వడదెబ్బలను సైతం తట్టుకుని తిరిగిన మీ నాన్న, చద్దన్నం తినలేక ఎక్కడ చచ్చిపోతాడోనని భయంగా ఉందిరా. ఎన్నడూ లేనంతగా ఈ ఏడు వర్షాలు బాగా పడ్డాయ్. రోజూ పడుతూనే ఉన్నాయ్. అస్సలు తెరిపి ఇవ్వటంలేదు. అందరికీ జ్వరాలు అంటుకుంటున్నాయి. ముసలోళ్ళ పరిస్థితి అర్థం చేసుకోరా గోవ..’’ వెంకయ్య అర్థించాడు. ‘‘చద్దన్నమా? ఆయనెందుకు తింటాడు బాబాయ్. అసలు చద్దన్నమే ఇంట్లో ఉండదు. అలాంటప్పుడు ఎలా తింటాడు? మేం పెడుతున్నామని నీకేమన్నా చెప్పాడా?’’ బండిని పక్కన పార్క్ చేసి వెంకయ్య పక్కనే కూర్చున్నాడు గోవర్థన్. ‘‘ఊర్లో అందరికీ చెప్తున్నాడురా. ఇదిగో ఇక్కడే ఈ బండరాయి దగ్గర కూర్చుని వెళ్తూ పోయేవాళ్ళతో తన గోడును చెప్పుకుంటున్నాడు’’ కిందపడిన టవల్‌ను తీసి దులిపి భుజంపై వేసుకుంటూ అన్నాడు వెంకయ్య.
గోవర్థన్‌కు సంభాషణను పోడిగించడం ఇష్టంలేకపోయింది. ఒకవేళ అదే జరిగితే ఆవేశంతో అరుస్తాడు. తండ్రిలా కుటుంబ విషయాలను బయట పెట్టుకున్నవాడినవుతానని ఆగిపోయాడు. విజ్ఞుడు, చదువుకున్నవాడు, సమస్యను త్వరగా ఆకళింపు చేసుకునే మనస్తత్వం కలిగినవాడు. ముత్తాతల దగ్గర్నుంచి తండ్రుల జీవనం దాకా ఎంత కష్టపడ్డారో తెలుసకున్నవాడు. వాటికన్నా తను చూసినవే ఎక్కువగా బాధించడంవలన మృదు స్వభావిగా మారినవాడు. ‘‘నాన్న చెప్పినట్లు ఏమీ జరిగుండదని నా అభిప్రాయం బాబాయ్. సరే నువ్వు చెప్పావ్‌గా, నేను చూసుకుంటానులే’’ అని చెప్పి ఆలోనల్లో పడ్డాడు.
ఇద్దయ్య- ఈశ్వరమ్మలకు ఒక్కడే కొడుకు గోవర్థన్. ఇద్దయ్యది ఉమ్మడి కుటుంబం. ఆ కుటుంబ పోషణకోసం తన తండ్రి తనని చదువుకోనివ్వకుండా కమతంలో పెట్టాడని, తనకొడుకు తనలా కాకూడని గోవర్థన్‌ను బాగా చదివించాడు ఇద్దయ్య. ఆవేశపరుడు కావడంతో చిన్న చిన్న విషయాలకే నిగ్రహం కోల్పోయేభర్తను వెకేసుకొస్తూ పిల్లల్ని పెంచి పెద్ద చేసింది ఈశ్వరమ్మ. ముప్ఫయ్యేళ్ళు వచ్చాక కాని పెళ్లి చేసుకోలేదు గోవర్థన్. ఆలస్యంగా పెళ్ళైనా కొడుకు గోపాల్‌ని మాత్రం సంవత్సరంలోనే ప్రపంచానికి పరిచయం చేవాడు. మనవడిని దీవిస్తూ కాలం చేసింది ఈశ్వరమ్మ. తండ్రి ఇద్దయ్య ఒక్కడే పెద్దదిక్కు కావడంతో ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాడు గోవర్థన్. ఎంతమాటపడకూడదనుకున్నా ఎవరో ఊకరు ఏదో ఒకటి తండ్రి గురించి గోవర్థన్‌కు చెప్తూనే ఉండేవారు. బయటవాళ్ళ మాటలనెప్పుడూ పట్టించుకున్న పాపాన పోలేదు. కాని ఇప్పుడు అన్నీ తెలిసిన బాబాయ్ తనను, తన భార్య రంజనిని వేలెత్తి చూపిస్తుండడంతో తట్టుకోలేకపోయాడు. బాబాయ్‌కు ఇద్దరుకొడుకులు. వాళిళద్దరూ ఆయన్ని పట్టించుకోకపోయినా, చీదరించుకుంటున్నా కుటుంబ విషయాలను మాత్రం బయటపెట్టని ఆతని వ్యక్తిత్వనికి గోవర్థన్ దాసోహమయ్యేవాడు. కానిప్పుడు తననే వేలెత్తి చూపిస్తుంటే శత్రువులా కన్పిస్తున్నాడు.
***
బ్యాగుని లోపల పెట్టేసి, వేడి వేడి నీళ్ల స్నానం చేసేసి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గరర కూర్చున్నాడు గోవర్థన్. భార్య రంజనిని పిలిచాడు. భర్త పిలుపుకి పరిగెత్తుకొచ్చింది. ‘‘మా నాన్నకు చద్దన్నం ఏమన్నా పెడుతున్నావా?’’ సాలోచనగా అడిగాడు. ‘‘చద్దన్నమా..! చద్దన్నం మనకెక్కడ ఉంటుందండీ! ఇంట్లో ఎంతమంది ఉన్నామో అంతమందికే సరిపడా వండుతానని మీకు తెలుసుగా.. ఏమైంది..?’’ సమాధాన

మిచ్చినంతలోనే ప్రశ్నను సంధించింది భార్యామణి. ‘‘నువ్వు చద్దన్నం పెడుతున్నావని, రోజూ అది తినడంకంటే చావడం నయమని అడిగినోళ్ళకు, అడగనోళ్ళకి చెప్తున్నాడంటా మా నాన్న. మా వెంకయ్య బాబాయ్ రోడ్‌మీదనే ఆపి అడుగుతున్నాడు. ఇంత బాగా చూసుకుంటున్నా మనల్నిలా రోడ్డుకీడుస్తుంటే ఎలా? చద్దన్నం పెట్టకుండానే పెట్టారని ఎందుకు చెప్తున్నాడో అర్థం కావట్లేదు. నిజం చెప్పు నువ్వు పెట్టలేదుగా’’ రూడీ చేసుకోవడానికి అడిగాడు. అతని మొహంలో నిరాశ కన్పిస్తుంది.
‘‘అయ్యో రామా పిల్లలు త్వరగా తింటారని అన్నం ముందే వండేస్తన్నా. తినమని అడుగుతంటే ఆకలిలేదని, ఇప్పుడే కాదని రాత్రి ఎప్పుడో తింటున్నారు మావయ్య. వండిన తర్వాతెప్పటికో అది చల్లబడిపోతుంది కదండీ! మామయ్యకేమో వేడివేడిగా చేతివేళ్ళు కాలే ఉంటేనే తింటారాయె. ఒకప్పుడు గొడ్డు చాకిరీ చేసీ చేసీ చేతులు మొద్దుబారడంతో వున్న వేడి ఆయన చేతికి ఆనడంలేదు. దానికి నేనేం చేయను?’’ భర్తత కోప్పడకుండా సంజాయిషీ ఇచ్ది శ్రీమతి. ‘‘ఇవన్నీ నాకెందుకు చెప్పలేదు?’’ భార్య కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు. కంగారుపడిందా ఇల్లాలు.. ‘‘అంటే. అంటే.. మీరు ఆఫీస్ నుండి ఎన్నో టెన్షన్స్‌తో వస్తారు కదా! మళ్లా ఇవన్నీ చెప్పి మిమ్మల్ని బాధప్టెడం ఎందుకని?’’ గోముగ ఆతలొంచుకుని చెప్పింది. ‘‘అహా! ఎంత మహాభాగ్యం. గొప్ప ఇల్లలు దొరికిందిరా బాబు’’ అన్నాడు. అతని మాటలో వెటకారం ధ్వనించింది. ముడుచుకుపోయింది ఆమె. అదతను గమనించాడు. ‘‘సరే! నేను చసుకుంటాలే. వదిలేయ్’’ అన్నాడు. బాధపెట్టడం తన అభిమతం కాదని ఓదార్చాడు. కనిపించీ కనిపించని కన్నీళ్ళు పెట్టుకుందామె!
ఆడవాళ్ళ కన్నీళ్ళ కన్నా ఊటబావే నయం. అప్పుడప్పుడైనా నీళ్ళు బయట పడకుండా ఉంయి. ఆడవాళ్ళ కన్నీళ్ళుమాత్రం ఊరుతూనే ఉంటాయ్. ‘‘నువ్వలా బాధపడితే ఎలానే రాజీ? ఈ రోజునుండి మూడో బిడ్డకోసం పని మొదలెడదామనుకుంటుంటే ఏడుస్తున్నావేం, అబ్బో మంచంమీద అదేం కుదరదు’’ అంటూ చెంపను నిమిరాడు. భార్య రంజనిని ‘రాజీ’ అని పిలవడం అతనికి ఇష్టం. అలా ప్రేమగా పిలిపించుకోవడం ఆమెకు ఇంకా ఇష్టం. ‘‘సిగ్గులేదా మీకు? పక్క గదిలో మామయ్య ఉన్నారని కూడా లేకుండా ఏంటా మాటలు?’’ సిగ్గుపడుతూ కన్నీళ్ళలో కలిసిపోయిన ఆనంద భాష్పాలను పైటకొంగుతో తుడుచుకుంటూ ప్రేమగా గద్దించింది. ‘‘అది.. అలా నవ్వుతూ ఉండాలి. పిల్లలేరి?’’ స్థిమితపడి అటు ఇటూ చూస్తూ అడిగాడు. ‘‘పాప పడుకుంది. వాడేమో అలిగాడు. ఏంటో చూడండి..’’ చెప్పింది.
‘‘అలిగాడా? ఎందుకు? ఏమన్నా తిన్నాడా?’’ ప్రశ్నల వర్షం కురిపించాడు. ‘‘కథలు చెప్పమని విసిగిస్తుంటే మావయ్య కోప్పడ్డారు. అందుకే తినకుండా అలిగి పడుకున్నాడు. ఆ రూంలో ఉన్నాడు చూడండి’’ అంటూ భోజన సామగ్రిన డైనింగ్ టేబుల్‌పైకి సర్దిపెట్టడానికి పూనుకుంది.
‘‘సరే నేను చూస్తానుండు’’ అంటూ గదిలోకి వెళ్ళాడు గోవర్థన్. తలగడ దిండుపై వెల్లకిలా పడుకుని దిక్కులు చూస్తున్నాడు గోపాల్. నెమ్మదిగా వెళ్లి చక్కిలిగింతలు పెట్టాడు గోవర్థన్. చక్కిలిగింతలకు నవ్వినా, అలక మాత్రం మానలేదు గోపాల్. ‘‘ఏంటి నాన్నా, , తాతయ్యను కథలు చెప్పమని విసిగిస్తూన్నావంట!’’ కొడుకుని ఎత్తుకుని ఒడిలో కూర్చోబెట్టుకుంటూ అడిగాడు. ఒడిలోంచి లేచి కోపంగా టైనింగ్ టేబుల్ దగ్గరకు చేరుకున్నాడు గోపాల్. పక్క రూమ్ తలుపు తీసి తండ్రి పడుకుని ఉండడం గమనించి మళ్ళా తలుపును దగ్గరగా వేసి కొడుకు దగ్గరికి చేరుకున్నాడు గోవర్థన్.
‘‘తప్పమ్మా! తాతయ్యనలా విసిగించకూడదు. నేను కథల పుస్తకాలు తెస్తానుగా. ఎంచక్కా చదువుకోవచ్చు. నువ్వెలాగో ఐదో తరగతే కదా, అర్థమవుతుందిలే’’ అంటూ ఉంగరాల జుట్టును నిమిరాడు. ‘‘ఉహూ.. నేను చదవను. ఎవరన్నా చెప్తేనే వింటాను’’ మొండికేశాడు కొడుకు. ‘‘అలా మారం చేయకూడదు. తాతయ్య ముసలివాడవుతున్నాడుగా, ఓపికగా చెప్పలేడు’’ అన్నాడు తండ్రి. ‘‘మీ తాతయ్య నీకు బోలెడన్ని కథలు చెప్పాడన్నావ్‌గా. మరి ఈ తాత నాకు చెప్పాడా? ఎప్పుడూ కోపంగానే ఉంటాడు, అమ్మను తిడుతూనే ఉంటాడు’’ అని కొడుకు చెప్తుండగా భార్యవైపు చూశాడు గోవర్థన్. ఆమెనలా చూడడంతో తలొంచుకుని వంటింట్లోకి వెల్లింది. ‘‘నాకు కథలు చెప్పనపుడు తాతయ్య ఎందుకు? రమణ వాళ్ళ తాతయ్యలాగా మన తాతయ్యను కూడా ఓల్డేజ్ హోమ్‌లో వేసేద్దాం డాడీ. అపుడు అమ్మను కూడా తిట్టలేడు కదా!’’ వాడికొచ్చిన లాజిక్‌తో అడిగాడు గోపాల్. గోవర్థన్ మనస్సు చివుక్కుమంది. ఇంత చిన్న వయసులో పెద్దలపై పిల్లలకు ఇటువంటి భావన కలగడం ఎంత మాత్రం హర్షించదగ్గది కాదు. తన తండ్రికా పరిస్థితి వస్తే రేపు తన పరిస్థితి కూడ ఆఅంతేనని గోవర్థన్‌కు తెలుసు. ఇలాగే జరిగితే ఉమ్మడి కుటుంబాలన్నీ చిన్నాభిన్నమవుతాయి.
‘‘గోపాల్ ఇలా రామ్మా! ఇక్కడ కూర్చో..’’ అని పిలిచి తొడపై కొడుకుని కూర్చోబెట్టుకున్నాడు తండ్రి. కొడుకు మాటలకు తండ్రెలా స్పందిస్తాడోనని వంటింటినుంచి డైనింగ్ టేబుల్ దగ్గరకొచ్చి దృశ్యాన్ని చూసి కూర్చుండిపోయింది తల్లి. ‘‘ఈరోజు నేనే నీకు కథ చెప్తాను. సరేనా!’’ కొడుకు మనస్తత్వం తెలుసుకోవడానికి అడిగాడు గోవర్థన్. ‘‘నిజంగానా? నువ్వు సూపర్‌గా చెప్తావ్. చెప్పు డాడీ ప్లీజ్..!’’ వెంటపడ్డాడు గోపాల్. ‘‘మా తాతయ్య చెప్పిన కథంటే ఇపుడు నీకు చెప్తాను’’ కొడుకులో ఆసక్తి గమనించిన గోవర్థన్. తానూ చెప్పాలనుకున్నది కథరూపంలో చెప్పాలని పూనుకున్నాడు. ‘‘మీ తాతయ్య చెప్పిందా? భలే.. భలే.. చెప్పు డాడీ’’ ఆనందంతో ఊగిపోయాడు కొడుకు. ‘‘అది కథే అయినా నిజంగా జరిగిన కథ. జాగ్రత్తగా వినాలి. గుర్తుపెట్టుకోవాలి మరి. తర్వాత నేను ప్రశ్నలు వేస్తాను, జవాబు చెప్పాలి..’’ అని అడిగాడు తండ్రి.. ‘‘ఓ... అలాగే డాడీ’’ మాటిచ్చాడు గోపాల్. తాననుకున్న దారిలోకే కొడుకు వచ్చాడని చిన్నగా నవ్వి కథను చెప్పడం ప్రారంభించాడు గోవర్థన్. మోచేతిని టేబుల్‌పై, అరచేతిని బుగ్గులకు ఆనించి భర్త చెప్పే కథను కూర్చొని వినసాగింది రంజని.
‘‘అనగనగా ఒక రాజు ఉన్నాడు. ఆయన రాజ్యంలో బోలెడంత మంది సైనికులున్నారు. వాళ్ళు యుద్ధంలో ఓడిపోవడంతో రాజ్యంలో కొంత భాగం వదులుకోవాల్సి వచ్చింది. అలా జరగడంతో రాజుగారు చాలా బాధపడ్డారు. అంమంది సైన్యం ఉన్నా కాని ఎంకు ఓడిపోతున్నామని తెగ మధనపడిపోతూ ఉండేవారు. లాభం లేదనుకొని ఒక రోజు సభ ఏర్పాటుచేశాడు. మంత్రులతోపాటు సామంతరాజులు కూడా వచ్చారు. ఉన్నపళంగా సభనెందుకు ఏర్పటుచేశారవో తెలియక ఎవరికివారు మొహాలు చూసుకున్నారు. ఇంతలో రాజుగారు సభలోకొచ్చారు. సింహాసనంపై దర్జాగా కూర్చుని అందరివంక చూశాడు. అందరూ ఉత్కంఠంగా ఉన్నారు. ‘‘మన రాజ్యంలో సైనికులు చాలామందే ఉన్నారు. అయినా ఓడిపోతున్నాం. ఎందుకిలా జరుగుతుంది? దీనికి పరిష్కారం ఏంటి?’’ అని అడిగాడు రాజు. ‘‘సైనికులు సరైన శిక్షణ తీసుకోవడంలో విఫలమవుతున్నార’’ని ఎవరో అన్నారు. యుద్ధంలో సైనికుల శౌర్యాన్ని కళ్ళారా చూసిన రాజవి నమ్మలేదు. ఇంకా ఏమన్నా లోపాలుంటే చెప్పమన్నాడు. ఎవరెవరో ఏవేవో చెప్తున్నా అవేవి సరైన కారణాలుగా తోచలేదాయనకి. అంతలో ఒక సామంతరాజు నిలబడ్డాడు. గొణుక్కుంటూ ఉన్న సభంతా నిశ్శబ్దమయింది.
‘‘రాజా! మన సైన్యంలో సగానికి సగం యాభై సంవత్సరాలు దాటిన వాళ్లున్నారు. వాళ్ళ వయస్సు పైబడడంతో తమని తాము రక్షించుకోలేకపోతున్నారు. ఇక మిగిలిన వాళ్లనెలా రక్షించగలరు. వాళ్ళవలన మిగిలిన సైన్యం కూడా చేజారిపోతుంది రాజా! కాబట్టి వాళ్లందరినీ తప్పిస్తే సరిపోతుంది’’ అన్నాడు. ‘‘వాళ్ళను సైన్యం నండి తప్పించి రాజ్యంలో ఉంచినా ఒకటే కదా! శక్తి కోల్పోయినోళ్ళు
అక్కడైనా ప్రమాదమేగా! తగ్గిస్తే సైన్యం బలం తగ్గిపోతుందిగా’’ సందేహాన్ని వెలిబచ్చాడు రాజు. ‘‘శత్రువులు మన సైన్యాన్ని దాటుకుని లోపలికొచ్చినా ఈ పెద్దవాళ్ళ వలన ఒరిగేదేం ఉండడం లేదు మహారాజా! కాబట్టి ఈ పెద్దోళ్ళ శిరస్సులు ఖండించేస్తే ఇబ్బందే ఉండదు మహారాజా! వీరి కోసం ఆరాటపడేవారే ఉండరు..’’ అన్నాడో సామంతరాజు.
రాజుగారు ఆలోచనల్లో పడ్డారు. యుద్ధంలో పోరాడలేకపోతున్న పెద్దవాళ్ళను కాపాడుకుంటూ, సైన్యాన్ని ప్రజలకు పోగొట్టుకోవడం కంటే పెద్దోళ్ళనే చంపేస్తేనే సమస్యుండదని రాజు తప్పుగా తలచాడు. మంచి పద్ధతి కాదని మంత్రి వారించినా మూర్ఖంగా ఆజ్ఞ వేశాడు. రాజు తలుచుకుంటే ఎంతపని? తర్వాత రోజు రాజ్యంలోకి సైనికులను పంపించి యాభై యేళ్ళు దాటిన వాళ్లనంతా చంపెయ్యమన్నాడు. దాంతో యాభై యేళ్ళు దాటిన వాడు ఒక్కడూ రాజ్యంలో మిగలలేదు.
అసలు కథ అప్పుడే మొదలైంది గోపాల్. పెద్దోళ్ళను చంపేసిన కొన్నాళ్ళకు రాజ్యంలో ఎప్పుడూ చూడని తీవ్రమైన కరువొచ్చింది. మెతుక్కు లేక జనం అల్లాడిపోయారు. వర్షాల్లేవ్! కరువువలన జనం వలసలు పోతున్నారు. అది చూసిన రాజు అల్లడిపోయాడు. గొప్ప రాజుగా చరిఅతలో నిలిచిపోదామనుకున్న తనలా చరిత్ర హీనుడిగా మిగిలిపోవాల్సి వస్తుందేమోనని తెగ బాధపడిపోయాడు. ప్రజల వలసలు ఆగడనికి, రాజ్యం సుభిక్షంగా ఉండడానికి ఏం చెయ్యాలో ఎవరూ పరిష్కారం చూపించలేకపోయారు. రాజ్యం పరిస్థితి తెలిస్తే అదును చూసుకొని శత్రువులు దండెత్తుతారు. బయటకు చెప్పుకోలేని సమస్య. కరువు పోవాలని యజ్ఞాఙలు, యాగాలు చేయించినా పరిస్థితిల మార్పు రాలేదు. ‘‘నువ్వు చెప్పినా వినిపించుకోలేదు. పెద్దోళ్ళను చంపడంవల్లనే శాపం తగిలి కరువొచ్చింది’’ అంటూ రాజుగారు మంత్రిముందు బాధపడ్డాడు. మంత్రికప్పుడే ఉపాయమొచ్చి రాజు దగ్గర రెండు రోజుల గడువు తీసుకొని గుర్రంపై ఎక్కడికో వెళ్లొచ్చి పరిష్కారం చెప్పాడు.
ఎప్పట్లానే ఋతుపవనాలు రావడం మొదలెట్టాయి. వర్షాకాలం మొదలైంది. వెంటనే మంత్రి చెప్పినట్లు రహదారుకిరువైపులా స్థలాన్ని నాగలితో దున్నించారు. అదృష్టంకొద్దీ వర్షాలు వచ్చాయి. కొద్ది రోజులకు వాళ్ళ కళ్ళన వాళ్లే నమ్మలేకపోయారు. రోడ్డుకిరువైపులా రకరకాల మొక్కలు మొలకెత్తాయి. కూరగాయల మొక్కలు, గింజలు, జొన్నలు ఇలా తినడానికి అవసరమైనవన్నీ పెరిగాయి. నలభై ఐదు రోజుల్లో పంట చేతికొచ్చింది. చాలావరకు కరువు తీరిపోయింది. గుంతలతోపాటు చెరువులను కూడా తవ్వించి వర్షం నీటిని నిల్వ చేసుకున్నారు. ప్రజలకు పంచగా మిగిలినవాటిని మళ్లీ నాటారు.
జనం కళ్ళల్లో ఆనందం విరిసింది. రాజు కళ్లల్లో మరింత సంతోషం, సంతృప్తి కన్పించాయి. ప్రజల ఆకలి కేకలను, వలసలను ఆపిన మంత్రిని సత్కరించాడు రాజు. తర్వాతి రోజు తన విశ్రాంతి మందిరంలోకి తీసుకెళ్లి మంత్రిని నిజం చెప్పమని, ఈ ఉపాయమెలా వచ్చిందని అడిగాడు. మంత్రి మనస్సులో కలవరింత మొదలై తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ‘‘మా దగ్గర రెండు రోజుల సమయం గడువు తీసుకున్నాక మీరు రాజ్యంల లేరని, గుర్రంపై ఎక్కడికో వెళ్ళొచ్చాకే పరిష్కారం చెప్పారని తెలిసింది మహామంత్రి. ఇప్పుడైనా నిజం చెప్పండి. అది ఎలాంటిదైనా క్షమిస్తా..’’నని రాజు అభయమిచ్చేసిరకి మంత్రి ఇలా చెప్పాడు.
‘‘రాజా! నన్ను క్షమించండి. మీ ఆజ్ఞను నేను పాటించలేదు. ఆ రోజు సభలో పెద్దోళ్లను చంపెయ్యమని ఆజ్ఞాపించినపుడు నాకు చాలా బాధేసింది. నేనెంత చెప్పినా వినకుండా చంపెయ్యమని ఆజ్ఞ జారీచేశారు. చేసేదిలేక మా నాన్నగారిమీద ప్రేమతో ఆ రాత్రికి రాత్రే ఆయన్ని దూరం తరలించాను’’ అంటూ ప్రారంభించారు మంత్రి. ‘‘ఎక్కడికి పంపించారు? ఇక్కడింత కరువుంటే అక్కడ ఆయనెలా బ్రతకకలిగాడు?’’ ఆశ్చర్యపోయాడు రాజు. ‘‘వెళ్తూ వెళ్తూ ఒక బస్తా గింజలు తీసుకెళ్ళరు. లోయ దగ్గరలో సాగు చేశారు మహారాజా!’’ మెల్లిగా చెప్పాడు మంత్రి. ‘‘అంటే.. ఈ ఉపాయం చెప్పింది కూడా ఆయనేనా?’’ సందేహిస్తూ అడిగాడు రాజు. ‘‘అవును మహారాజా! ఇక్కడ మన రాజ్యం పరిస్థితిని చెప్తే ఆయన చాలా బాధపడ్డారు. బండిపై వెళ్తున్నపుడు, గతుకులకు బండ్లు ఊగినప్పుడు, బస్తాల్లోని గింజలు రోడ్డుపక్కన పడతాయని, వాటిని సాగు చేస్తే కాస్త ఫలితముండొచ్చని సలహ ఆఇచ్చారు. అదే మీకు చెప్పాను. ఆయన దగ్గర్నుంచి వస్తూ వస్తూ కొన్ని గింజల్ని రోడ్డు పక్కన జల్లుకుంటూ వచ్చాను మహారాజా! నన్నూ మా నాన్నను క్షమించండి మహారాజా! ఆయన్ని చంపించొద్దు’’ అని వేడుకున్నాడు మంత్రి.
తను చేసిన తప్పేంటో రాజుగరికి స్పష్టంగా అర్థమైంది. ఎంతో అనుభవంతో మేధస్సునంతా తమలో ఉంచుకున్న పెద్దోళ్లను శక్తిలేదని, యుద్ధంలో పోరాడలేకపోతున్నారని మూర్ఖంగా ఆలోచించి చంపెయ్యడం పాపమని గ్రహించాడు. వాళ్ళు లేకపోవడంతో క్లిష్ట పరిస్థితుల్లో ఎలా నెగ్గుకురావాలో తెలీక పడిన బాధంతా గుర్తుకొచ్చింది రాజుకు. సమస్యలొచ్చిన్పపుడే కదా పెద్దోళ్ళ గొప్పదనం తెలుస్తుంది. మంత్రిని, అతని తండ్రిని రాజు క్షమించేశాడు. పెద్దోళ్ళను చంపెయ్యమని చేసిన ఆజ్ఞను రద్దుచేస్తున్నట్లు ప్రకటించాడు. బదులుగా సైన్యం పెంచుకోవడానికి ఇంటికొకరి చొప్పున ఖచ్చితంగా సైన్యంలో చేరాల్సిందేనని కొత్త ఆజ్ఞ వేశాడు. సైనిక శిక్షణను కఠినతరం చేశాడు. బందోబస్తుగా లోయదగ్గరికెళ్లి మంత్రిగారి తండ్రిని రాజ్యానికి తీసుకొచ్చారు.
****
కథను చెప్పడం పూర్తిచేసి కొడుకుతో ‘‘ఇప్పుడు నీకేం అర్థమయింది గోపాల్?’’ అడిగాడు గోవర్థన్. ‘‘హమ్..! పెద్దోళ్లు చాలా గొప్పోళ్ళనేగా’’ అన్నాడు గోపాల్. ‘‘కరెక్ట్. అందుకే పెద్దోళ్ళను మనం కించపరచకూడదు. వాళ్లకు సమస్యలపట్ల బోల్డంత అనుభవం వుంటుంది. వాళ్లున్నది కథలు చెప్పడానికే కాదు. మనమే వాళ్ల ప్రతిరూపాలం. అలాంటిది వాళ్ళను మన నుండి దూరం చేసి ఓల్డేజ్ హోమ్‌లో వేయడం తప్పు. అలా చేయడం తప్పేనా?’’అడిగాడు గోవర్థన్. ‘‘ఊ.. అవునవును దాడి’’ అర్థం చేసుకున్నట్లుగా తలూపాడు గోపాల్. ‘‘ఇపుడు తాతయ్యను ఓల్డేజ్ హోమ్‌లో వేశామనుకో, రేపు నీ పిల్లలుకూడా నిన్ను ఓల్డేజ్ హోమ్‌లో వేస్తారు. అక్కడ నేను, అమ్మ ఎవ్వరం ఉండం. నువ్వొక్కడివే ఉండాలి. ఉంటావా మరి?’’ అడిగాడు గోవర్థన్. ‘‘అమ్మో! మీరు లేకుండానా..! నేనుండను!’’ కంగారు పడ్డాడు గోపాల్. ‘‘మరి తాతయ్యకు కూడా అమ్మా, నాన్న లేరుగా! ఏం చేద్దాం చెప్పు’’ కొడుకునే పరిష్కరించమన్నట్లు చెప్పాడు గోపాల్. ‘‘తాతయ్యను ఎక్కడికీ పంపించొద్దుడాడీ! మనతోనే ఉంచుకుందాం. లేకపోతే తాతయ్య ఒక్కడే అక్కడ ఏడుస్తూ కూర్చుంటాడు. ఆ రమణగాడికి కూడా నేను చెప్తాను డాడీ’’ తనే కనిపెట్టినంత ఆనందంగా చెప్పాడు గోపాల్. తాను చెప్పాలనుకున్నది కొడుక్కి అర్థమవ్వడంతో గోవర్థన్ ఊపిరి పీల్చుకున్నాడు. తండ్రీ కొడుకుల ప్రేమను చూస్తూ మురిపెంగా ఉండిపోయింది తల్లి.
తలుపు చప్పుడవ్వడంతో అటువైపు తిరిగి చూశాడు గోవర్థన్. గడియపెట్టేసి మంచంవైపు కదులుతున్న తన తండ్రి ఇద్దయ్యను చూశాడు. ఒకే దెబ్బకి రెండు పిట్టలు! తను చెప్పిన కథ ఇద్దయ్య కూడా విన్నందుకు సంతోషపడ్డాడు గోవర్థన్. త్వరత్వరగా భోజనాన్ని ముగించి గోపాల్‌ను గదిలో పడుకోబెట్టి తన గదిలోకి వచ్చాడు గోవర్థన్.
*

-దొండపాటి కృష్ణ 90523 26864