కథ

జెండా ఎగిరింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలు బడి నుంచి ఇంటికి వచ్చి పుస్తకాలు బల్లపై పెట్టి, బాత్‌రూంలోకి వెళ్లి శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి వంటింట్లో అమ్మ ఏం చేస్తోందా? అని చూశాడు. అంతలో బాలు అమ్మ భారతి వచ్చి మిరపకాయ ముక్కలు, జీలకర్ర, చిన్న అల్లం ముక్క తొక్కి పిండిలో కలిపి పెనంపై అట్లు పోస్తోంది. వాటి తాలూకు కమ్మని వాసన బాలు ముక్కు పుటాలు తాకుతోంది.
‘‘అమ్మా!’’ అంటూ వెనకాల నుంచి వెళ్ళి బాలు భారతిని చుట్టేసాడు. ‘‘వచ్చావా.. బంగారూ! అలా కుదురుగా కూర్చో! కాళ్లూ చేతులూ కడుక్కున్నావా? ఉండు.. అట్టు పెడతాను..’’ అని తల్లి అనగానే..
‘‘ఓ! కడుక్కున్నానమ్మా..’’ అని తనకి ప్రత్యేకంగా చేయించిన బుల్లి చెక్కపీటపై కూర్చున్నాడు.
తల్లి కంచంలో అట్టువేసి, కొబ్బరి చట్నీ వేసి కొడుకు ముందు ఉంచింది. బాలు లేచి గ్లాసులో నీళ్లు అక్కడన్న బిందెలోంచి జాగ్రత్తగా తీసుకుని, పక్కన పెట్టుకుని అట్టు తుంపి తింటూ ‘‘ఎంత బాగుందోనమ్మా!’’ అంటూ ఆనందంగా తింటున్న కొడుకుకేసి తృప్తిగా చూస్తూ..
‘‘ఊ... బళ్ళో పాఠాలు ఇవ్వాళ ఏం చెప్పారు?’’ అని తల్లి అడగ్గానే.. ‘‘రేపు రిపబ్లిక్ డే కదామ్మా! బళ్ళో జెండా వందనం!’’
‘‘రిపబ్లిక్ డేని తెలుగులో ఏమంటారు?’’ అంది భారతి.
‘‘గణతంత్రదినోత్సవం కదా అమ్మా!’’
‘‘అవును.. సరిగ్గా చెప్పావు కన్నా..! అసలు గణతంత్రం అంటే ఏమిటి?’’ మళ్లీ అడిగింది భారతి.
బుర్రకి పదును పెడుతున్నట్టుగా కళ్లు మూసుకుని గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడే భారతే కల్పించుకుని ‘‘మనకి స్వాతంత్య్రం ఎప్పుడు వచ్చింది?’’ అనడిగింది.
అందుకు బాలు ‘‘ ఆగస్టు 15, 1947’’ అని చెప్పాడు.
‘‘వెరీగుడ్.. తర్వాత మనం స్వపరిపాలన కోసం మనం సొంత రాజ్యాంగం రాసుకున్నామన్నమాట. అది 1950, జనవరి 26న.. అమలులోకి వచ్చింది’’ అని వివరణ ఇచ్చింది భారతి.
అందుకు బాలు ‘‘ ఓహో.. అదా! ఇప్పుడు నాకు బాగా అర్థమైంది..’’ అంటూ ఆనందంగా అతని కళ్ళు మెరిసాయి. ‘‘రేపటి ఈ పండుగకి మా క్లాసులోనూ, బయట గ్రౌండ్‌లోనూ రంగురంగుల జెండాలు అంటించాము.. పాఠాలేమీ చెప్పలేదు..’’ అన్నాడు బాలు మళ్లీ..
‘‘రంగురంగులు కాదు.. మూడు రంగులే..’’ అని సరిచేసింది భారతి.. ‘‘అవేమిటో చెప్పు?’’ అని మళ్లీ ప్రశ్నించింది.
‘‘మూడు రంగులు, కాషాయం, తెలుపు, ఆకుపచ్చ.. మధ్యలో రాట్నం.. దాన్ని తయారుచేసింది పింగళి వెంకయ్య గారుట. మా మాష్టారు చెప్పారమ్మా..’’
‘‘అవును నాన్నా! బాగా చెప్పావు బంగారు..’’ అంటూ కొడుకు బుగ్గలు నిమిరింది భారతి.
బాలు ఒక ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో నాలుగో తరగతి చదువుతున్నాడు. వాడి నాన్న సుభాష్ చిన్న ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వారి ఆర్థిక స్థోమత అంతంత మాత్రమే.. అదీకాక సుభాష్‌కి తెలుగు భాషపై అత్యంత ప్రేమ. సెలవురోజుల్లో బాలుని దగ్గర కూర్చోబెట్టుకుని పోతన పద్యాలు, సుమతీ శతకాలు నేర్పుతాడు. ముందు మాతృభాష వస్తే.. తదితర భాషలు అవతంట అవే వస్తాయి అని అతని విశ్వాసం.
‘‘రేపు పొద్దునే్న ఏడింటికి బళ్ళో ఉండాలటమ్మ! తెల్లచొక్కా, తెల్ల లాగు, జేబుకి ‘జెండా’ బ్యాడ్జిగా పెట్టుకు రమ్మన్నారు. నాన్న జెండా తెస్తారు కదా! ఆ!’’ అడిగాడు బాలు.
‘‘నాన్న ఆఫీసు నుండి వచ్చేటప్పుడు తెచ్చిపెడతానన్నారు. అట్లు త్వరగా తిను మరి! అన్నీ రెడీ చేసుకుందువు కానీ!’’
‘‘ ఓ! అలాగే..’’ అని బాలు గబగబా తిని చెయ్యి కడుక్కుని హాలులోనికి వచ్చి అన్నీ రెడీ చేసుకున్నాడు.
ఈలోపు బాలు నాన్న సుభాష్ వచ్చినట్టు స్కూటర్ చప్పుడైంది. స్టాండు వేస్తూ.. ‘‘బాలు! ఎక్కడా?’’ అనగానే.. తండ్రి మాట విన్న బాలు పరిగెత్తుకుంటూ వచ్చి నాన్న చేతిలో బ్యాగ్ అందుకున్నాడు. భారతి గ్లాసుతో మంచినీరు తెచ్చి ఇచ్చింది. సుభాష్ గటాగటా తాగి, లేచి బాత్రూమ్‌కు వెళుతుండగానే..
‘‘నాన్నగారండీ.. తువ్వాలండీ..!’’ అంటూ వెనకాలే వెళ్లి ఇచ్చి, చాపపై కూర్చుని డ్రాయింగ్ పుస్తకం తీసి కలర్ పెన్సిల్స్‌తో జెండా బొమ్మకి రంగులు అద్దుతున్నాడు.
టీవీలో హిమాలయాల్లో మన భారతీయ సైనికులు మన సరిహద్దుని ఎలా రక్షిస్తున్నారో, అత్యంత క్లిష్టమైన సియాచిన్ సరిహద్దు వద్ద వాతావరణ పరిస్థితి ఎలా ఉంటుందో వివరంగా చెబుతున్న యాంకర్ మాటల్ని చెవులప్పగించి వింటూ డ్రాయింగ్ బొమ్మల్ని క్యామిల్ కలర్ పెన్సిల్స్‌తో దిద్దుతున్నాడు. ఈలోగా సుభాష్ టిఫిన్ చేసేసి ‘‘బాలూ! గదిలో ఉన్న నా బ్యాగ్ పట్టుకు రా!’’ అనగానే.. బాలు పరిగెత్తుకుంటూ వెళ్లి తండ్రికి తెచ్చి ఇచ్చి ఆతృతగా చూస్తున్నాడు.. ‘నాన్న ఏం తెచ్చాడా?’ అని..
ఇంతలో సుభాష్ బ్యాగ్‌లోంచి చక్కని బట్టపై కుట్టిన మువ్వనె్నల జెండా.. గాంధీ టోపీ తీసి వాడికిచ్చాడు. దాన్ని చూడగానే బాలు మొహం ఆనందంతో వెలిగిపోయింది.
‘‘నాన్నా! ఇలాంటివి రేపు ఎవరూ మా క్లాసులో, కాదు కాదు.. మా స్కూల్లో కూడా ఎవ్వరూ పెట్టుకోరు.. నేనొక్కణ్ణే!’’ అని గర్వంగా కాలరెగరేసాడు. గుండుసూదితో జెండాని తన చొక్కా జేబుకి పెట్టుకుని చూసుకున్నాడు. అలాగే నిద్రలోకి జారుకున్నాడు. వాడి సంబరం చూసి నవ్వుకుంటూ భారతి, సుభాష్‌లు వాణ్ణి మంచంపై పడుకోబెట్టి దుప్పటి కప్పారు.
***
తెల్లారింది.. స్వతంత్రంగా, స్వేచ్ఛగా గాలిలో చెట్ల ఆకులు కదులుతున్నాయి. తూర్పున వెలుగు రేఖలు విచ్చుకుంటున్నాయి. దేశ రాజధానిలో రిపబ్లిక్ డే సంబరాలు మొదలవ్వడానికి ముందు ‘వందేమాతరం’ గీతం ప్రజల్ని మేలుకొలుపుతోంది. జనపథ్ వీధుల్లో సైనిక పాటవాల ప్రదర్శన, సైనికుల కవాతుల ప్రదర్శన జరుగుతోంది. దేశాధ్యక్షులవారు ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు. అమర జవాన్ల కుటుంబానికి పతకాలను ప్రెసిడెంట్ ప్రెజెంట్ చేస్తుంటే.. దేశం కోసం తమ ప్రాణాలని పోగొట్టుకుని సరిహద్దు సైనికుల ధైర్య సాహసాలని, త్యాగాన్ని ప్రశంసిస్తున్న కామెంటరీ బాలు చెవిలో పడుతోంది. బాలు అప్పటికే లేచి, స్నానాదులు ముగించి బుల్లి తువ్వాలు కట్టుకుని వీభూతి, కుంకుమ పెట్టుకుని దేముడి పటం దగ్గర నిలబడి.. ‘‘సరస్వతి నమఃస్త్భ్యుం వరదే కామరూపిణీ, శ్రీరాఘవం దశరాత్మజమప్రమేయం..’’ అనే శ్లోకాలు చదువుకుని, అమ్మ ఇచ్చిన పాలు తాగి, మల్లెపూల లాంటి తెల్లని యూనిఫాం వేసుకున్నాడు బాలు. జెండాను గుండుసూదితో పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతుంటే వాడి అమ్మ సాయం చేసి జాగ్రత్తగా పెట్టి వాడి నెత్తిన గాంధీ టోపీ పెట్టి ‘‘అద్దంలో చూసుకోరా.. ఎలా ఉన్నావో..’’ అని తల్లి అంటూంటే.. వాడి నాన్న నిద్రలేస్తూ ‘‘బాలూ.. పండూ..! ఇంద..’’ అని రెపరెపలాడుతున్న కొత్త పది రూపాయల నోటు ఇస్తూ.. ‘‘నాన్నా! దీనితో నీకిష్టమైనదేదైనా కొనుక్కో..’’ అని వాడి నిక్కర జేబులో తోసాడు.
భారతి వాడి కాళ్ళకు సాక్స్ వేసి తెల్లని కాన్వాషు షూస్ తొడిగింది.
ఇంతలో చుట్టు పక్కల ఉన్న స్నేహితులందరూ వచ్చారు. ‘‘ఒరే బాలూ.. ఎంత బావుందో రా నీ జెండా.. నీ టోపీ..’’ అంటూంటే బాలు చాలా గర్వంగా ఫీలవుతూ ‘‘మా నాన్నగారు తెచ్చారు తెలుసా!’’ అంటూ బడివైపు నడక మొదలుపెట్టారు అందరూ.. స్కూలులో అందరూ గ్రౌండ్‌లో హాజరయ్యారు. ప్రార్థనాగీతం మొదలైంది. స్కౌట్ మాష్టారైన సీతారామశాస్ర్తీగారు అందరిచేత కవాతులు చేయించాడు. కర్రకి కట్టిన జెండా కేసి అందరూ చూస్తున్నారు. ఈలోగా హెడ్మాష్టరు, మిగిలిన టీచర్స్ అందరూ బాలుకేసి చూస్తూ ఏదో మాట్లాడుకున్నారు.
బాలుని తీసుకుని వాళ్ళ క్లాస్ టీచర్ జెండ్రా కర్ర దగ్గర నిలబెట్టారు. స్కూలు హెడ్మాష్టరు అందరినీ ఉద్దేశించి ‘‘పిల్లలూ.. ఈ గణతంత్ర దినోత్సవానికి ఒక పోటీ చాలా రహస్యంగా పెట్టారు. ఈ రోజు మీ అందరిలో ఎవరు సరైన, శుభ్రమైన దుస్తులు వేసుకుని చక్కని జెండా, గాంధీ టోపీ పెట్టుకుని వస్తారో.. వాళ్ళతో ఈ జెండా ఎగరేయిద్దామని నిశ్చయించుకున్నాము. ఈ పోటీలో నాలుగో తరగతి, సెక్షన్ ఎలో చదువుతున్న బాలగంగాధర్ తిలక్ ఎంపికయ్యాడు’’ అనగానే అందరూ కొట్టిన చప్పట్లతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది. బాలుకి వెంటనే అర్థమవ్వకపోయినా, వాడే జెండా ఎగరెయ్యాలనగానే ఆనందంతో వాడి గుండె ఉప్పొంగిపోయింది.
బాలుకి అందడం కోసం జెండా తాడుని కిందకు లాగి కట్టారు డ్రిల్ మాష్టారు. అందరి సెల్యూట్ల మధ్య తన బుల్లి చేతులతో బాలు తాడు లాగగానే అందరిపై పూలు జల్లుతూ, కురులు విప్పుకున్న భారతమాతలా ‘‘మువ్వనె్నల జెండా’’ స్వేచ్ఛగా గాలిలో ఎగిరింది. అందరూ భక్తిగా సెల్యూట్ చేశారు. ‘‘్భరతమాతకు జై!’’ అని నినదించారు.
బాలు చాలాసేపు తల నుదిటి వద్దే చేతిని పెట్టుకుని మరింత భక్తిగా వందనం చేశాడు. స్కౌట్స్ పిల్లలు గట్టిగా బ్యాండు మేళం, సాక్సోఫోన్ వాయించారు. అందరూ జనగణమన.. పాడారు. చివరన ‘‘జైహింద్’’ అని గట్టిగా అరిచారు.
హెడ్మాష్టరు పిల్లలందరినీ ఉద్దేశించి దేశం గురించి, దేశభక్తి గురించి, మన రాజ్యాంగం ఎప్పుడు ఏర్పాటు అయ్యిందో, ఇతర దేశాల కన్నా మన సైనిక బలం ఎంత గొప్పదో, ఎంతో చక్కగా ఉపన్యసించారు. గాంధీ మహాత్ముని గురించి, రాజ్యాంగం రాసిన అంబేడ్కర్ గురించి, తదితర దేశ నాయకుల త్యాగాల గురించి కూడా చెప్పి.. ‘‘ప్రియమైన విద్యార్థులారా! మన దేశ సరిహద్దుల్లో అహర్నిషలూ కాపలా కాస్తున్న ఎందరో వీరసైనికులు దేశం కోసం ఎన్నో సందర్భాల్లో పోరాడి ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబ సంరక్షణార్థం వీర సైనిక నిధి ప్రభుత్వం వారు ఏర్పాటు చేశారు. ప్రజలంతా విరాళాలు సేకరిస్తున్నారు. ‘‘వీర సైనిక నిధి’’ కోసం, మన దేశం కోసం మీరు మీ తల్లిదండ్రులను, చుట్టాలని కూడా అడిగి డబ్బులు సేకరించండి. ఎంత తక్కువైనా పర్వాలేదు. మీరందరూ సెలవు రోజుల్లో గానీ, సాయంకాలాల్లోగానీ ఇంటింటికి వెళ్లి విరాళాలు సేకరించండి. దానిని మనం ప్రధానమంత్రిగారికి పంపుదాం. అదిగో అదే మీరు సేకరించిన విరాళాలు వెయ్యవలసిన బాక్స్’’ అని స్టేజిపై ఉంచి తెల్లని గుడ్డ కట్టి దానిపై ‘‘్భరతమాతాకి జై’’ అంటూ ‘‘వీరసైనిక నిధి’’ అని రాసిన పెట్టెని చూపించారు. కార్యక్రమం ముగించిన తరువాత అందరికీ చాక్లెట్స్, బిస్కెట్లు పంచి పెట్టారు.
బాలు చాలా ఆనందంగా ఉన్నాడు. వాడికి వచ్చిన జెండా ఎగరేయడం అనే అవకాశం వల్ల వాడి సంబరం అంబరమంటింది. తన ఆనందాన్ని అమ్మానాన్నకి చెప్పాలి. అమ్మ ‘బంగారు!’ అని ముద్దు పెట్టుకుంటుంది. నాన్న ‘్భలేరా బాలు!’ అని వెన్ను తట్టి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు అనుకుంటూ గాలిలో తేలిపోతున్నాడు బాలు. పిల్లలందరూ వాడి చుట్టూ చేరి అభినందిస్తుంటే వాడికి చాలా గర్వమనిపించి, నిక్కర్ జేబులో చెయ్యి పెట్టుకుని ఫోజు కొడుతున్నాడు. వాడి చేతికి నాన్న ఇచ్చిన పది రూపాయల కాగితం తగిలింది. ‘అవును కదా! నాన్న పది రూపాయలతో ఏదైనా కొనుక్కోమన్నాడు. ఢిల్లీ కోవా, ఐస్ కాండీ గుర్తుకొచ్చాయి.
అదేదో సినిమా పిల్లల కోసం టికెట్ రేట్ తగ్గించి ప్రదర్శిస్తున్నారు. దానికి వెడితే? ఇలా ఏది కొనుక్కోవాలో వాడి చిన్న బుర్రకి తోచలేదు. మిగిలిన పిల్లలు బయటకు పరుగెత్తారు సినిమా చూద్దామని.
బాలు నెమ్మదిగా నడుచుకుంటూ వెడుతూ అప్రయత్నంగా ఎగురుతున్న జెండా కేసి చూశాడు. వాడికి హఠాత్తుగా హెడ్మాష్టరు చెప్పిన విరాళం జ్ఞాపకం వచ్చింది. దేశం కోసం అనగానే అమ్మ చెప్పిన భగత్‌సింగ్ కథ, నాన్న పేరు సుభాష్ అంటే ఎవరు? అని అడిగినప్పుడు ఆయన చెప్పిన నేతాజీ కథ, గాంధీజీ స్వరాజ్యం గురించి, రాత్రి మన సైనికుల త్యాగాల గురించి వినడం, వాళ్ళ కుటుంబాలకి రాష్టప్రతి మెడల్స్ ఇవ్వడం గుర్తుకు వచ్చాయి. బాలు చిన్ని మనస్సు ఆ పక్కకే మొగ్గింది.
స్టేజీపై ఉన్న ‘సైనికనిధి కోసం’ అని ఉన్న బాక్సులో చిన్న చేతుల నుండి మొదటి విరాళంగా పది రూపాయల నోటు జాలువారింది. అక్కడే ఫొటోలో ఉన్న భరతమాత మోముపై చిరునవ్వు విరిసింది. భారతీయ జెండా మరింతగా రెపరెపలాడింది.

- చాగంటి ప్రసాద్.. 9000206163