కథ

పండుటాకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-కాకాని చక్రపాణి
----------------

మార్నింగ్ వాక్‌కి వెళ్లినప్పుడు పరమేశ్వరన్ అన్నాడు, ‘యు పుటప్ వెయిట్’ అని, రమాపతి నుద్దేశించి.
పార్కు మూలనున్న బాదం చెట్టు కొమ్మల్లో నుండి ఉదయ సూర్యుని కిరణాలు చొచ్చుకు వస్తున్నాయి. ఎప్పటిదో ఆ చెట్టు. అక్కడ పార్క్‌ని డెవలప్ చేసినప్పుడే ఆ చెట్టు అక్కడ ఉంది. దాన్ని కొట్టకుండా అలాగే ఉంచి దాని చుట్టూతా సున్నంతో దిమ్మె కట్టారు. ముసలిదయిపోయినట్లుంది అది. దాని ఆకులు తొందరగా ఎర్రబారుతున్నాయి, కింద పడుతున్నాయి. దాని వాటారిన ఆకులను చూసినప్పుడల్లా నాకు మా మిత్రబృందంలోని సభ్యులు తరచు నాతో పంచుకు వారివారి మనస్తాపాలు, బాధలు గుర్తుకు వస్తాయి. ఆ మనస్తాపాల వాటారిన ఆకులు రాలిపోతుంటాయి, కొత్త మనస్తాపాల ఆకులు వాటారుతుంటాయి.
అతనా మాటన్నప్పుడు నేను పక్కనే ఉన్నాను.
‘నిజమే. రెండు నెలలుగా లండనులో ఉండి వచ్చాను. అది వాళ్లకు ఎండాకాలమయినా ఒకటే ఈదురుగాలి. కనుక నేను సాధారణంగా బయటకు వెళ్లేవాడిని కాదు. అందువల్ల కాస్తంత బరువు పెరిగి ఉండవచ్చు’ అన్నాడతను.
అంతలోనే సుబ్రహ్మణ్యం అందుకుంటూ, ‘అది బలుపా? వాపా?’ అన్నాడు.
రమాపతి ముఖం ముడవటం చూసి, నాకు తెల్సింది. సుబ్రహ్మణ్యం వ్యాఖ్యానాన్ని అతడు స్వారస్యంగా స్వీకరించలేదని. ఆ వెంటనే ఎప్పుడో చదివిన స్వాహిల్య శాంభవి వ్యాసంలోని కొన్ని వాక్యాలు గుర్తుకు వచ్చాయి.
‘మనస్సనేది మనకిచ్చిన చాల సున్నితమైన సాధనం. మన కాళ్లనీ, చేతుల్నీ మనం చూసుకోగలం, శరీరాన్నీ చూసుకోగలం. కానీ, మన మనస్సును మాత్రం భౌతికంగా చూడలేం. అది అదృశ్యంగా మనలోనే ఉండే శక్తి; అది సరిగ్గా ప్రవర్తించేటట్లు, మనకు స్నేహితుడుగా ఉండేటట్లు దానికి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది మనకు మిత్రుడే కాదు బద్ధ శత్రువుగానూ పరిణమించవచ్చు. కారణం మీ మనస్సంటే మీ ఆలోచనలే కానీ మరేం కాదు. ఓ వ్యక్తి మీ పట్ల స్నేహంగా ఉన్నాడని మీరనుకుంటే, ఆ మనిషి మీకు మిత్రుడవుతాడు. ఓ వ్యక్తి మీ పట్ల శత్రుత్వ భావన కలిగి ఉన్నాడని మీరు అనుకుంటే - బహుశః ఆ మనిషి మీకు మిత్రుడయ్యే అవకాశం ఉండినా తను తనకు తన స్నేహాన్ని వ్యక్తం చేయటం తెలియకపోయి ఉండటంవల్ల - మీకతడు శత్రువైపోతాడు. ఎందువల్లా? తన ప్రవర్తన వల్ల కాదు, మీ ఆలోచనల వల్ల.
‘మీరో చెట్టు మీద పండు వంక చూస్తున్నారనుకోండి. అది చాలా రుచిగా ఉండొచ్చు. ఆ పండంటే మీకిష్టం. అప్పుడు మీ దృష్టి మొత్తం చెట్టెలా ఉందో గమనించదు. అలాగే ద్వేషం కూడ. ఓ మనిషిలోని ఓ లక్షణాన్ని మీరు ద్వేషిస్తే, మీ మనస్సుకు వేలాడటానికి ఓ చిలక్కొయ్య లభించినట్లే. ఆ మనిషి కాదు మిమ్మల్ని బాధించేది. మీ మనస్సే మిమ్మల్ని చిత్రహింస పెడుతుంది. ఎందుకంటే మీ మనస్సిప్పుడు మీరు ద్వేషించే దానిపైనే లగ్నమై ఉంది కనుకనే. మీరు కళ్లజోడు పెట్టుకుంటారు. మసగ్గా ఉందనిపిస్తే, దాన్ని తీసి మెత్తటి గుడ్డతో తుడిచి పెట్టుకుంటారు. అలాగే మీ మనస్సుకీ ప్రశాంతతో, శాంతితో, ప్రేమతో ప్రశాంతతను కలిగించవచ్చు. మీ మనస్సు నిశ్చలమవుతుంది. మీ దృష్టికి స్పష్టత ఏర్పడుతుంది.’
చాల చిన్న సంఘటనలను మనం నిత్యం ఎదుర్కొంటుంటాం. కొంతమంది అనుకోకుండా అనే మాటలు కూడ మనకు అనవసరంగా రెండు మూడు రోజుల వరకు మనస్తాపం కలిగిస్తాయి. వాళ్లు మనల్ని బాధ పెట్టాలని ఉద్దేశపూర్వకంగా అనరు. మన మనస్సే మనల్ని బాధపెడుతుంది.
ఆ తర్వాత రమాపతి నాకు చెప్పాడు. ‘జగన్నాథం! వాడలా అన్నప్పుడు నాకు మండిపోయిందోయ్. ‘వీడికి బలిసిపోయింది. పొగరు’ అన్న ధోరణిలో ఆ మాటలు నాకు విన్పించాయి. ఆ మాటల్లో ఈసు కూడా ధ్వనించింది. అంతకు ముందు కూడా అతడు నన్ను గురించి చులకనగా మాట్లాడటం నాకు కష్టంగానే ఉంది. నేను సాధారణంగా ఇతరులతో వాదించను. ఇతరులతో విభేదించినప్పుడు కూడ ఎదుటి వాళ్లకు కష్టం కలుగుతుందేమో అని తర్కం చేయను. అందువల్ల నేను ఎక్కువగా మాట్లాడినట్లు కన్పించదు. ఓసారి సుబ్రహ్మణ్యం కామెంట్ చేశాడు కూడా. ‘ఆయన మాట్లాడడు. వినటం తప్ప’ అని. ఆ మాటలు ‘ఈయనేం మాట్లాడతాడు. బుల్రేని మనిషి! మాట్లాడటానికి బుర్రలో ఏమన్నా ఉండాలిగా?’ అన్నట్లు నాకు విన్పించాయి. ఆ తర్వాత, నేను పార్క్‌లో రమేష్‌బాబును ‘షెంగెన్ వీసా ఇప్పించే ఏజెన్సీ ఏదయినా ఉందా?’ అని అడిగినప్పుడు కూడా సుబ్రహ్మణ్యం ‘అసలు మీరు వెళ్లేదుందా, లేక ఎంక్వైరీలు చేయటమేనా?’ అని అన్నాడు. దాంతో నాకు మండిపోయింది. అయినా నేనేం మాట్లాడలేదు. నిన్న ‘బలుపా, వాపా?’ అని అతననేటప్పటికి నిజంగానే నా మనసుకు కష్టం వేసింది. అయినా నేను తిరుగు జవాబు చెప్పలేదు. సాధారణంగా ఇతరుల మనసులకు కష్టం కలిగించటం నాకిష్టముండదు. అందువల్లనే నేను వెంటనే రియాక్టు కాలేదు’ అని.
మావి మార్నింగ్ వాక్ మిత్రత్వాలు. అందరూ రిటైరయినవాళ్లే. మొదట్లో ఒకళ్ళకొకళ్లం పరిచయమున్న వాళ్లం కాదు. మెల్లగా మాట్లాడుకోవటం మొదలయ్యాక, స్నేహాలయ్యాయి. ఆ తర్వాత ఏవన్నా పనిబడినప్పుడు ఒకళ్లకొకళ్లు సాయం చేసుకోవటం, కలిసి బయటకు వెళ్లటం కూడ కొనసాగింది.
అతడి మాటలకు నేనేం జవాబు చెప్పలేదు. రమాపతే చెప్పసాగాడు.
‘ఆ మర్నాడు సంగీతరావు, ‘ఏందండీ ఇదీ, అందరూ ఫారెన్ కంట్రీస్‌కు వెళ్లి వస్తే తెల్లబడతారు. మీరు నల్లబడిపోయారు’ అన్నాడు. అప్పటికే నాకు సుబ్రహ్మణ్యంతో అనుభవయి ఉంది కనుక, ఆ మాటలు అసూయ నుండి జనించినవని నాకు తెల్సింది. నేనాయన మాటలు పట్టించుకోలేదు. అయితే, ఆయన మాటలు కష్టం కలిగించటానికీ చరిత్ర ఉంది. నేను 2008లో కాబోలు సౌతిండియా టూరు వెళ్లాను. ఓ మహిళ టూరు ఏజెంటు. ఒక్కో ప్రయాణీకుడి దగ్గరా ఐదు వేలు వసూలుచేసి, చెన్నయ్ దాకా ట్రయినులోనూ, అక్కడ నుండి బస్సులోనూ తీసుకు వెళ్లిందామె. తననుకున్న సంఖ్యలో ప్రయాణీకులు రాలేదు కనుక ఆమె మాకు ఏర్పాటు చేసే సౌకర్యాలను కుదించటం, నలుగురైదుగురికి ఒక రూము కేటాయించటం, హోటల్లోకాక వీధి టిఫిను సెంటర్లలో టిఫిను ఇప్పించటం, చాయ్ కాఫీలు ఇప్పించటంలోనూ పిక్కి ఆదా చేసుకోటం జరిగింది. అంతకు ముందు రాజబాబు వెళ్లినప్పుడు ఏర్పాట్లు బావున్నాయి. అతడి రికమండేషనుతోనే నేను టూరు ప్రోగ్రాం వేసుకున్నాను. తిరిగి వచ్చాక, ఆ మాటే మార్నింగ్ వాక్‌లో మిత్రులతో అంటే, ‘నేనలాంటి చౌకబారు టూర్లకెళ్లను. రాజాలా స్టేట్ టూరిజం వాళ్లు ఏర్పాటుచేసే టూరిస్టు బస్సులోనే వెళ్తాను. చౌకబారు మనిషివి’ అన్నట్లు వినపడ్డాయి. ‘మరే, నేనేం నీలా రాష్ట్ర ప్రభుత్వ శాఖలో లంచాలు పట్టి డబ్బు కూడబెట్టుకోలేదు’ అని మనసులో అనుకున్నాను కానీ, పైకనలేదు’ అని.
నేనూ అక్కడే ఉన్నా కనుక, సుబ్రహ్మణ్యం మాటలూ, సంగీతరావు మాటలూ వినకపోలేదు. నాకు రమాపతి వ్యాఖ్యానించినట్లు ఆ మాటలు ధ్వనించలేదు. సుబ్రహ్మణ్యం అలా హాస్యమనుకుని కామెంటు చేస్తుంటాడు. ఒకోసారి అవి ఇతరుల మనసులను గాయపరుస్తూ ఉండొచ్చు. సంగీతరావు వ్యవహారం అలాంటిది కాదు. రమాపతి అలా బాధపడటంలో కొంత న్యాయం ఉంది. అయితే, నేను అతనితో నా అభిప్రాయాలను పంచుకోలేదు.
‘పోనె్లండి. జనం రకరకాలు. ఎవరో ఏదో అంటే మీరు బాధపడటం సరైనది కాదు. అదీ ఈ వయసులో’ అన్నాను.
రమాపతి వయసు ఎనభై పైబడింది. అతను మా ఊరు వాడే అయినా, హైదరాబాదులో కలిశాక, పాత పరిచయాలను గుర్తు చేసుకుంటూ దగ్గర వాళ్లమయ్యాం. నేను అతనికంటే ఓ పదేళ్లు చిన్నవాడిని. అందుకే అతన్ని గౌరవంగా ‘మీరు’ అంటుంటాను.
నిజానికి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని పైకి వచ్చిన మనిషి అతను. అతని జీవితాన్ని గురించి నాకు తెలియనిదేం లేదు. రమాపతి సెకండ్ ఫారంలో ఉండగా, అతని తల్లి మరణించింది. తండ్రి మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. ఎస్‌ఎస్‌ఎల్‌సి పాసయ్యాక, ‘ఇంక నీకు పై చదువు చెప్పించే స్తోమత నాకు లేదు. ఏదైనా చిన్న ఉద్యోగం చూసుకో. నీ తమ్ముడూ, చెల్లెల్నీ కూడ నేను పైకి తీసుకురావాలి’ అన్నాడు. ఆ తమ్ముడూ, చెల్లెలూ తన సవతితల్లి పిల్లలు.
ఊరు వదలి పట్నం చేరాడు రమాపతి. వారాలు చేసుకుంటూ మూడేళ్లు ఎల్‌సఇ చదువుకున్నాడు. నాగార్జునసాగర్ డ్యాం నిర్మాణమవుతోంది ఆ కాలంలో. అందులో ఇంజనీరు కింద సహాయకుడిగా ఉద్యోగం దొరికింది. అతడు తన కాళ్ల మీద తను నిలబడటం ప్రారంభించాక బంధువులు ‘మావాడంటూ’ రాసాగారు. తండ్రి మాత్రం రాలేదు. ఆయన తన కష్టనష్టాలేమో తను పడ్డాడు తప్ప కొడుకు దగ్గరకొచ్చి సాయం చెయ్యమని అర్థించలేదు. తండ్రి తన్ను ఇంట్లో నుండి తరిమేశాక, మేనమామ ఏమైనా సాయం చేస్తాడేమోనని ఆయన దగ్గరకు వెళ్లాడు. ‘అమ్మను మింగిన నష్టజాతకుడివి! నీ దరిద్రం మాకు కూడ అంటుకుంటుంది. మా దగ్గరేం కూడబెట్టావని ఇక్కడకు వచ్చావు? వెళ్లువెళ్లు’ అంది మేనత్త. మేనమామ చూస్తూ నించున్నాడు కానీ ఏం మాట్లాడలేదు.
అది జరిగిన పదేళ్లకు మేనమామ భీమశంకరం తన దగ్గరకు వచ్చాడు.
‘నువ్వు పాత విషయాలు గుర్తుంచుకోకుంటే, నిన్నొకటి అర్థించటానికి వచ్చాను. నీకు మనసులో కోపం ఉండటం సహజమే. కాదనను. తల్లి పోయింత్తర్వాత మేనమామ తండ్రంతటి వాడు. నేను నీకప్పుడు ఏమీ చేయలేకపోయాను. నా పరిస్థితి అలాంటిది. అన్నీ చెప్పుకోలేను. నా కూతురు పద్మకు పెళ్లీడు వచ్చింది. నేను వాళ్లు అడిగినంత కట్నం ఆమెకు భర్తను తీసుకురాలేని స్థితిలో ఉన్నాను. నా వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. ఇంకా ఇద్దరు ఆడపిల్లల కూడ పెళ్లికి ఎదిగి కూర్చున్నారు. మేనల్లుడివి, నువ్వు తప్ప నాకు గత్యంతరం లేదు’ అన్నాడు.
మేనమామ అలా అర్థించాక రమాపతికి పద్మను చేసుకోక తప్పలేదు. చాలాకాలం అతనికి సంతానం కలగలేదు. రకరకాల మందులిప్పించాడు. చివరకు అవకరంతో ఒక పిల్ల పుట్టింది. ఆ పిల్ల సంవత్సరం బతికింది కానీ, సంతానమున్న ఆనందం ఆ దంపతులకు కలగలేదు. దగ్గరి సంబంధం కనుక, కంజెనిటాల్ డిఫెక్టులతో పిల్ల పుట్టిందంటే ఆశ్చర్యం లేదు అన్నారు డాక్టర్లు. ఆ పిల్లను ఆసుపత్రికి తీసుకెళ్లటంలోనే ఆ సంవత్సరం గడిచింది కానీ, పిల్ల ఆరోగ్యం బాగుపడలేదు. మరణించింది. మళ్లా సంతానం కలుగలేదు అతనికి. మిగిలిన ఇద్దరి కూతుళ్లకు పెళ్లి చెయ్యలేక, మేనమామ చతికిలపడితే, ఆ భారం వహించక తప్పలేదు రమాపతికి. సంతానం లేని బాధ భార్యను పీడించింది. ఆమె ఆరోగ్యం కూడ పాడయింది. ఇలా కాదని రమాపతి అనాథాశ్రమం నుండి ఒక పిల్లను తెచ్చుకుందామని భార్యతో అన్నాడు. పద్మకు అది ఇష్టం లేదు కానీ భర్తకయినా మనశ్శాంతి కలుగుతుందేమోనని అందుకు అంగీకరించింది. పసిగుడ్డును అనాథాశ్రమం నుండి తెచ్చుకున్నారు. సుమతి అని పేరు పెట్టుకున్నారు. అయితే, అతని భార్య ఆ పిల్లను ఎప్పుడూ తన కూతురుగా చూసింది లేదు. ఎందుకొచ్చిన తద్దినమన్నట్టు పెంచింది. పిల్లకు పదేళ్ల వయసులో ఆమె కేన్సర్ వ్యాధితో మరణించింది.
అతడు మళ్లీ పెళ్లి చేసుకోలేదు. తండ్రి మరణశయ్య మీద ఉన్నాడని తెల్సి కాకరపాడు వెళ్లినప్పుడు, ‘మళ్లీ పెళ్లి చేసుకో. ఒంటరి జీవితం కష్టం. పిల్లను కూడ పెంచుకుంటున్నావు. ఆ పిల్ల ఆలనా పాలనా చూడటానికైనా ఆడతోడు ఉండాలి’ అన్నాడాయన. అయితే, రమాపతి తండ్రి మాటలు పట్టించుకోలేదు. తనకు తెల్సు, సవతి తల్లి రావటంవల్ల తనెన్ని బాధలు పడ్డాడో. కనుక మళ్లీ పెళ్లి ప్రసక్తి పెట్టుకోలేదు.
రమాపతి ఇలా జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నాడు. ఉద్యోగపరంగా ఏ ఇబ్బందులూ అతడికి కలగలేదు. అవిభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ ఇంజనీరుగా రిటైరయ్యాడు. జీతం తప్ప పైస లంచం తీసుకున్న మనిషి కాదు. పెద్దగా సంపాదించలేదు కానీ, ఉన్న డబ్బును జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవటంవల్ల ఒక ఫ్లాటు కొనుక్కుని స్థిరపడగలిగాడు. సుమతికి మంచి చదువు చెప్పించాడు. ఆమెకు పెళ్లిచేసి పంపించాడు. కూతురు, అల్లుడు లండన్‌లో ఉంటారు. అతనిది ఒంటరి బతుకు. అతనే వంట చేసుకుని గడిపేస్తున్నాడు. కూతురు ఎప్పుడో తండ్రితో మాట్లాడుతుంది. రోజూ మాట్లాడే విషయాలు మాత్రమేం ఉంటాయి? రమాపతి అప్పుడప్పుడు కూతురు దగ్గరకెళ్లి వస్తుంటాడు. వాళ్లూ అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారు. ఒంటరి జీవితం గడుపుతూ కూడ అతడు ఎంతో నిబ్బరంగా ఉండేవాడు. ఈ మధ్య లండను వెళ్లి వచ్చింతర్వాత మా వాకింగ్ మిత్రుల మాటలవల్ల తనకు కలిగిన మనస్తాపం గురించి అతనలా నాకు చెప్పాడు. ‘ఎందుకిలా చిన్న విషయాలకు కూడ విచలితుడై పోతున్నాడో’ నాకర్థం కాలేదు. నా కొడుకు విషయంలో బాధపడితే, నాకు ధైర్యం చెప్పేవాడు. ‘మనసు పాడుచేసుకోకు. ఎవరికి వారే అనుకోవాలి. మనతోపాటు వాళ్లు వచ్చారా ఈ లోకంలోకి? మనం ఒంటరిగా వచ్చాం, ఒంటరిగా పోతాం. అనివార్యమైన విషయానికి బాధపడి ప్రయోజనమేమిటి? నీకింకా ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకడు కాకపోతే, మరొకడు కనికరం చూపిస్తాడు. నాకున్నది ఒక్కతే పిల్ల. అది లండనులో ఉంటుంది. దాన్నుండి నేనేం ఆశించగలను? వదిలెయ్’ అని.
పార్కులో బాదం చెట్టు నుండి ఎన్నో పండుటాకులు రాలి పడ్డాయి. మళ్లా నాలుగు రోజుల వరకు రమాపతి నాకు కన్పడలేదు. సాయంత్రం అతని ఇంటికి వెళ్లాను. నన్ను చూడగానే అతని ముఖం వికసించింది. అల్మారాలో నుండి రకరకాల డ్రైఫ్రూట్‌లు తీసి ఒక పళ్లెంలో పోసి ఇచ్చాడు.
అవి తింటూ, ‘నాలుగు రోజుల నుండి వాకింగ్‌కు రావటం లేదేం?’ అనడిగాను.
‘వచ్చేట్టే ఉంది నా బతుకు! మనస్సే బాగా లేదయ్యా. మొనే్నమయిందో తెల్సా? నా స్నేహితుడు విశ్వనాథరావు నుండి ఫోను వచ్చింది. నాకతను మంచి స్నేహితుడు. ‘వస్తున్నాన’ని ఫోన్ చేసి పెట్టేశాడు. అతనొక్కడే వస్తున్నాడో, భార్యతో కల్సి వస్తున్నాడో నాకు తెలియలేదు. ఎఎస్‌రావు నగర్ నుండి వస్తున్నాడు. అతనికేమయినా ఆతిథ్యమిద్దామన్నా, నా దగ్గరేం లేవు. అక్కడికీ, డ్రైఫ్రూట్‌లు తెచ్చి జాగ్రత్త పడ్తూనే ఉంటాను. ఇప్పుడు బయటికెళ్లి తెచ్చే సమయముందో లేదో! నాలుగు కప్పుల కాఫీ కలిపి ఫ్లాస్క్‌లో పోశాను. అతని కోసం నిరీక్షిస్తూ కూర్చున్నాను. సాయంత్రం నాలుగ్గంటలకు ఫోన్ చేసినవాడు అయిపులేడు. ఎనిమిదయింది. ఇక వస్తాడో రాడో తేల్చుకుందామని ఫోను చేశాను.అతను ఫోను ఎత్తలేదు. ఇంటి దగ్గరకొచ్చాడేమోలే, కాల్ ఎందుకు వేస్ట్ చెయ్యాలని రిసీవ్ చేసుకో లేదనుకున్నాను. నా ఇల్లు ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంది కదా! మనిషి బల్కీ; అతనికి సాయం చేయవచ్చని కిందకు దిగాను..’
‘వచ్చాడా విశ్వనాథరావు?’
‘విను. ఓ పావుగంటకు ఒక మోటర్‌బైక్ వచ్చింది. ఎవరా అని నేను చూస్తున్నాను. వచ్చినతను బండి పార్క్ చేసి, నా దగ్గరకు వచ్చాడు. నవ్వుతూ నమస్కారం పెట్టి, ‘నమస్కారం, అంకుల్! నేను విశ్వనాథరావుగారి అబ్బాయిని. మిమ్మల్ని కలుద్దామని వచ్చాను’ అన్నాడు. ఏం పని మీద అతను పంపించాడో అనుకుని, అతన్ని మర్యాదగా పైకి తీసుకువెళ్లాను. కూర్చోబెట్టి, కాఫీ ఇచ్చి, ‘ఎట్లా ఉన్నారు నాన్న?’ అనడిగాడు. ‘ఆయనకేం ఆయన బాగానే ఉన్నాడు. ముందివి చూడండి’ అంటూ తన బ్యాగులో నుండి రకరకాల సీడీలు, పుస్తకాలు నా ముందు పెట్టాడు. అవన్నీ ఆధ్యాత్మికతకు సంబంధించినవి. నీకు తెలియంది కాదు, నేనంత ఆధ్యాత్మిక వాదిని కాదు. పెద్దగా నమ్మకాలూ లేవు. అలా అని నాస్తికవాదినీ కాదు. ‘ఈ సీడీ నూటయాభై, అంకుల్! ఇది భగవద్గీత మీద చక్కటి ప్రవచనం. లేటెస్ట్. ఐదొందలు’ అంటూ అతడు తన సరుకును అమ్మజూపుతున్నాడు. నేను మొహమాట పడిపోయాను. విశ్వనాథరావు నాకున్న మంచి మిత్రుల్లో ఒకడు. అతడే కొడుకును పంపించి ఉంటాడు. ఏదీ తీసుకోకపోతే అతను బాధపడతాడేమో అనుకుని, ఒక వెయ్యి రూపాయల మేర పుస్తకాలు, సీడీలు తీసుకున్నాను. వాటి మీద పెద్ద ఆసక్తి ఉండి తీసుకోలేదు. ‘అదేమిటంకుల్! మీ దగ్గర కనీసం ఐదు వేల రూపాయల సరుకయినా అమ్ముడవుతుందని ఆశించాను’ అన్నాడు..’
‘్ఫనె్లండి. మిత్రుడి మాటను కాదనకుండా వెయ్యి రూపాయలకైనా కొన్నారు’ అన్నాను.
‘నేను వెయ్యి రూపాయలు ఇచ్చాక, తన పుస్తకాలు, సీడీలు తన సంచీలో సర్దుకుంటూ ‘నాన్న స్నేహితులందరికీ ఇలానే ఫోను చేసి వెళ్తున్నాను. ఈ ఫోను ఆయనే్ద. మొన్నామధ్య తన ఫోను కనిపించటం లేదని గోల పెట్టాడు. ఆ ముసలిగోల భరించలేక, నాది వాడుకోమని ఆయనకిచ్చాను. ఇంకా ఎంత రెండు, మూడు రోజుల్లో నా పని అయిపోతుంది. ఆయన ఫోను ఆయనకిచ్చేస్తాను. ఎనభై యేళ్లు పైబడ్డాయి ఆయనకి. జీవితంలో తను సంపాదించిన మిత్రులు పాతికమంది కూడ లేరు. ఖర్మ! ఏం సాధించినట్లో? ఈ వ్యాపారం లాభసాటిగానే ఉంది. మీలాంటి వాళ్లు ఎంకరేజ్ చెయ్యాలి. ఇంకా మన సంస్కృతి బతికి ఉందంటే మీలాంటి వాళ్ల వల్లే. వస్తాను, అంకుల్! థాంక్యూ!’ అని అతను వెళ్లిపోయాడు. ఆ రోజు రాత్రి నాకు చాలాసేపటి వరకు నిద్రపట్టలేదు. విశ్వనాథరావు ఇలాంటి వ్యవహారాలను ప్రోత్సహించేవాడు కాదు. ‘నువ్వే పంపావా? నీ కొడుకును?’ అని అతన్ని అడుగుదామనుకున్నా, కాల్ కొడుక్కు చేరుతుందే కానీ, తండ్రికి చేరదు. ఐ ఫెల్ట్ యూజ్డ్. ఆ పిల్లగాడు నన్ను ఉపయోగించుకున్నాడు. వాళ్ల నాయన స్నేహాన్ని ఉపయోగించుకున్నాడు. తన పేరు చెప్పుకుని వచ్చి, ‘మీరేమయినా కొనేట్టుంటే కొనండి’ అని అని ఉంటే నాకిష్టమయితే కొనేవాడిని, లేకపోతే లేదు. ఇది పచ్చి మోసం, దగా! తండ్రి పేరు ఉపయోగించుకుని, నాలాంటి వాళ్లని మోసగించటాన్ని ఏమంటారు?’ అన్నాడు.
‘పోనె్లండి. పెద్ద విషయమేం కాదుగా? వెయ్యి రూపాయలు పోగొట్టుకున్నారు. అంతేగా?’ అన్నాను.
‘అంతేకాదు. నా మిత్రుడి రాక కోసం ఆత్రంగా ఎదురుచూశాను. ఒకటి కాదు,

రెండు కాదు, నాలుగు గంటలపైన. అప్పుడు అతను వచ్చినా, ఏవో పాత కబుర్లు చెప్పుకునేవాళ్లం. ఆనందపడేవాళ్లం. నా స్నేహితుడి కొడుకు వచ్చాడు. తండ్రి పంపాడు అన్న భావన నాలో కలిగించాడు. నేను మొహమాట పడిపోయాను. వాడు నన్ను మోసం చేశాడన్న భావన కంటే, నేను మోసపోయానన్న భావన ఆ రాత్రల్లా నన్ను సతాయించింది’
‘పోనె్లండి. అయిపోయిందేదో అయిపోయింది’
‘డబ్బు తీసుకునేంత వరకు వాడు తండ్రి విషయం మాట్లాడలేదు. డబ్బు ఇచ్చాక, తండ్రి విషయంలో వాడి అభిప్రాయాలు విన్న నాకు మండిపోయింది. ఇట్లాంటి వెధవ మన సంస్కృతిని గురించి నాకు చెప్తాడా అని!’
‘ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి! మనం ఆపగలమా? మీ మిత్రుడు రాక, ఆయన స్థానంలో ఆ పిల్లవాడు వచ్చాడన్న అక్కసుతో మీరు అతన్ని గురించి చెడుగా అభిప్రాయం ఏర్పరచుకుని ఉండొచ్చుగా?’
‘సరే, నాదే పొరపాటేమోలే!’ అన్నాడు. అతనా మాట అన్నప్పుడు, పచ్చటి ఆకు మీద ఎర్రదనం పాకి, ఆకు వాటారినట్లనిపించింది.
ఆ తర్వాత పదిరోజుల దాకా రమాపతి ప్రత్యేకంగా నాతో ఏం మాట్లాడలేదు. పార్కుకు వస్తున్నాడు. మిగతా మిత్రులతో మాట్లాడినట్లే నాతోనూ మాట్లాడుతున్నాడు. బాదం చెట్టు నుండి పండుటాకులు రాలిపడ్తూనే ఉన్నాయి.
ఆ తర్వాత అకస్మాత్తుగా మూడు రోజులు మానేశాడు. విషయం ఏమిటో తెలియదు. రామారావును చూడటానికి వెళ్తున్నాను. అతను కూడ వస్తాడేమోనని అతనింటికి వెళ్లాను. నన్ను చూసి, వాటారిన అతని ముఖం విచ్చుకున్నట్లయింది.
‘మొన్న రోజంతా నా మనసు పాడై పోయిందోయ్. ఇంత దీక్షలేని, పట్టుదల లేని ఆట ఆడటమెందుకూ? ఇంట్లో కూర్చుంటే సరిపోతుంది. దద్దమ్మలు!’ అని చెప్పాడతను, ఈసడించుకున్నట్లు.
2015 ఆగస్టు 15న ఇండియా శ్రీలంకతో ఆడి, గెలుస్తామన్న మాచ్ ఓడిపోయిన విషయానే్న నాకు రమాపతి విన్పించాడు. భయంకర ఒంటరితనంలో నుండి పుట్టుకు వచ్చిన ఆక్రోశం, వేదన, ఓదార్పులేనితనం అది. క్రికెట్ ఒక క్రీడ. ఆటలో గెలుపు ఓటములుంటాయి. వాటిని అలాగే స్వీకరించాలి కానీ, మనసుకు పట్టించుకోకూడదు. అదే బతుకు కాకూడదు. తననుకున్నది కాకపోతే ఏదో నిస్పృహ. ఇంతకంటే పెద్ద విపత్తులనే ఎదుర్కొన్నాడు అతను. అప్పుడు నిలబడ్డాడు. కానీ, ఈ మధ్య అతను ఊరికే చలించిపోతున్నాడు. పండబారి కింద పడుతున్న బాదమాకు గుర్తుకు వచ్చింది.
వయసులో ఉన్నప్పుడు తను ప్రేమించిన పడతితో పెళ్లికాకపోతే భగ్న హృదయుడవటం, లేకపోతే ఆమె మీద యాసిడ్ దాడి చేసి తను చచ్చిపోవటం - ఇలాంటివన్నీ ఆ నిస్పృహకు, అదే బతుకు అన్న భావానికి ప్రతిరూపాలే. ముసలితనంలోనూ, ఆ మనస్తత్వం మారదు. మనమాశించింది జరగకపోతే కుళ్లిపోతారు మనుషులు; తమ చావు తామే కొని తెచ్చుకుంటారు.
‘రామారావు ఆస్పత్రిలో చేరాడు పలకరించి వద్దామా?’ అన్నాను.
‘ఏం ఏమయింది రామారావుకు?’ అనడిగాడు రమాపతి ఉద్విగ్నంగా.
రామారావు మాతో కల్సి తిరుగుతూండే మిత్రుడు. అతడు సెంట్రల్ ఎక్సైజ్‌లో కాబోలు పని చేసి రిటైరయ్యాడు. అతడి మాట వినకుండా కూతురు తను ప్రేమించిన వాడితో లేచిపోయి, పెళ్లి చేసుకుంది. నాలుగు రోజులు బాగాగనే గడిచింది. ఏమయిందో కానీ, ఒకరోజు ఆమె ఇంట్లో ఉరేసుకుని చనిపోయింది. ఆ తండ్రి దుఃఖానికి అంతం లేకుండా పోయింది. మాకు తోచిన విధంగా అతనికి మనశ్శాంతి కలిగించాలని అనునయ వాక్యాలు పలికాం కానీ, చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేసిన ఆ తండ్రి మనస్సుకు సాంత్వన లేకపోయింది. పొద్దున రామారావు బాత్‌రూంలో కాలుజారి కింద పడ్డాడట! కొడుకు ఫోన్ చేసి నాకు చెప్పాడు. అతన్ని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకువెళ్తున్నట్లు.
ఈ విషయం చెప్పి, ‘అతని భార్యకు ఫోను చేస్తే ఆమె చెప్పింది. ‘హిప్ బోను విరిగిందన్నారు డాక్టర్లు. సాయంత్రానికి ఆపరేషను చేసి కట్టుకట్టారు. పది రోజులు బెడ్ మీదే ఉండాలన్నారు. ఆ తర్వాత వాకర్ సాయంతో నడవొచ్చన్నారు’ అని చెప్పింది.’
ఇద్దరం ఆటో చేసుకుని ఆసుపత్రికి వెళ్లాం. అతను గదిలో మంచం మీద పడుకుని ఉన్నాడు. కాలుకు కట్టుకట్టి ఉంది. పక్కన బల్ల మీద భార్య కూర్చుని ఉంది.
‘ఎలా ఉన్నారు?’ అని అడిగాను.
‘పెద్ద ఇబ్బంది లేదు. ఎప్పటికి లేచి నడుస్తానో, లేక ముగింపునకు ఇదే నాందేమో? ‘కమింగ్ ఈవెంట్స్ కాస్ట్ దైర్ షాడోస్ బిఫోర్’ అని నవ్వాడు రామారావు, మా వంక చూసి. నిజానికి ఆ నవ్వు రాలిపోయే పండుటాకు దైన్యం గుర్తుకు తెచ్చేదిలా ఉంది.
‘అలా ఎందుకనుకుంటారు? పాజిటివ్ ఆటిట్యూడ్ అలవర్చుకోవాలి’ అన్నాను.
‘ఎనభైయేళ్లొచ్చి చదువుకోక మట్టికొట్టుకోనా అన్నాట్ట ఎవడో నీ బోటివాడు! ఇప్పుడా అలవర్చుకునేది?’
అవీ ఇవీ మాట్లాడి వచ్చేశాం.
రమాపతి క్రికెట్ మ్యాచ్ సంగతి చెప్పాక, నాకు అనుమానమొచ్చింది. ఇతనూ ప్రతి విషయాన్నీ తన బతుకుగా పరిగణిస్తున్నాడు. జరిగే సంఘటనలకు, మనోభావాలకు మనిషి కొంత దూరంగా బతకక తప్పదు.
‘ఒకసారి సైకియాట్రిస్టును సంప్రదిద్దాం. ఇలా ప్రతి చిన్న విషయానికీ చలించిపోవటం సరనిపించటం లేదు నాకు’ అన్నాను.
‘ఎందుకూ, నా మనస్థితి బాగానే ఉంది? ఎవరికీ చూపించుకోవాల్సిన అవసరం లేదు’ అన్నాడు రమాపతి.
‘ఎందుకైనా మంచిది కదా, ఒకసారి చూపించుకుంటే ఏంబోయె?’
‘ఏమంటావు, నాకు పిచ్చని నీకు అనుమానమా?’ అన్నాడు పెద్దగా.
అతని గొంతులోని తీవ్రతకు నాకు భయమేసింది. ఇంక ఎక్కువ మాట్లాడితే, కొట్టటానికి కూడ వెనకాడేట్లు లేడు. నేను మాట్లాడకుండా వెళ్లిపోయాను. అయితే, ఆ రాత్రి పది గంటలకు రమాపతి నాకు ఫోను చేసి ఏడ్చేశాడు.
‘సారీ, జగన్నాథం! ఉన్న మిత్రుణ్ణి ఒక్కణ్ణీ పోగొట్టుకొని దౌర్భాగ్యపు బతుకు బతకలేను. మరి నా దురదృష్టమో, ఏమో నాతో సంబంధం ఉన్న వాళ్లనందర్నీ నేను ఒక్కొక్కరుగా పోగొట్టుకున్నాను. నన్ను క్షమించు. ఐ యామ్ వెరీ సారీ. వెరీ వెరీ సారీ!’
‘మీరు అట్లా ఇదవకండి. రేప్పొద్దున మనం కలుస్తాంగా? మీరేదో అన్నారని నాకు కోపమేం లేదు. మీరన్నది కూడ ఏం లేదు. అనవసరంగా బాధపడకండి’ అని అనునయంగా చెప్పాను.
అతను ఓ పట్టాన ఫోను వదలలేదు. చాలాసేపు మాట్లాడాడు.
ఫ్రాక్చర్ అవటం రామారావు జీవితంలో చరమాంకమే అయింది. ఇంటికి వచ్చినవాడు మళ్లా బయటకు అడుగుపెట్టలేదు. మనస్తాపంతో తీసుకుతీసుకు పోయాడు. రామారావు మృత్యువు రమాపతిని ఎంతో కలచి వేసింది. వారం రోజులపాటు అతడు వాకింగుకు రాలేదు. ఆ తర్వాత వచ్చాడు. వాకింగు అయ్యాక, పార్క్‌లో చెట్టు చుట్టూ కట్టిన సున్నం దిమ్మె మీద కూర్చుని మేం మాట్లాడుకుంటాం. బాదం చెట్టు కొమ్మల్లోనుండి ఎప్పటిలా సూర్యకిరణాలు చొచ్చుకు రావటంలేదు. ఆకాశం మబ్బు పట్టి ఉంది.
ఆ రోజు నడుస్తూ, నడుస్తూ జారిపడ్డాడు రమాపతి పార్క్‌లో. అయితే, ఫ్రాక్చర్ అవలేదు. కొద్దిగా కాలు గీరుకుపోయింది. ‘రెండు రోజుల్లో తగ్గిపోతుంది’ అన్నాడు రఘురామ్.
‘కాదు. నాకు తల భారంగా ఉంది. బ్రెయిన్ హేమరేజేమోనని భయం వేస్తున్నది. రామారావు ఎలా పోయాడు, ఉన్నట్టుండి పోలా? ఆసుపత్రికి వెళ్దాం’ అన్నాడు రమాపతి వణికిపోతూ.
ఇంటికెళ్లి స్నానం చేసి ఆసుపత్రి కెళ్దామన్నాను. ‘నువ్వూ నాతో రా. మా ఇంట్లోనే స్నానం చెయ్యి. ఒంటరిగా ఉంటే చచ్చిపోతానేమోనని భయమేస్తున్నది’ అన్నాడు రమాపతి.
ఇంటికి ఫోను చేసి చెప్పి, రమాపతి ఇంటిలోనే స్నానం చేసి అతన్ని తీసుకుని ఆసుపత్రికి వెళ్లాను. డాక్టర్ పరీక్ష చేసి ‘ఏం లేదు మీకు. ఆరోగ్యకరంగా ఉన్నారు. హాయిగా ఇంటికి వెళ్లి రెస్టు తీసుకోండి’ అన్నాడు, కాలుకు కట్టుకట్టి.
‘లేదు డాక్టర్! నా కళ్లు తిరుగుతున్నాయి. బ్రెయిన్ హేమరేజ్ ఏమోనని నాకు భయమేస్తున్నది’ అని రమాపతి అనడంతో, ఆయన న్యూరాలజిస్టును పిలిపించాడు. ఓ గంట తర్వాత వచ్చాడు న్యూరాలజిస్టు. ‘అతడు వచ్చేవరకు నేను బతికి ఉంటానా?’ అన్నాడు రమాపతి నా వంక దీనంగా చూస్తూ.
ఆ న్యూరాజిలస్టూ రమాపతికేం లేదన్నాడు. అయితే, రమాపతి ఆశంకలను విన్న డాక్టరు, ‘రేపు ఎమ్మారై స్కానింగు చేయించుకు రండి. మీ సందేహాలన్నీ నివృత్తి అవుతాయి’ అన్నాడు.
అప్పటికే మధ్యాహ్నం రెండు గంటలయింది కనుక, ఆ రోజు స్కానింగుకు వెళ్లే అవకాశం లేదు. హోటల్లో భోజనం చేసి అతని ఇంటికి వెళ్లాం. సాయంత్రం దాకా ఏదో కబుర్లు చెప్పుకుంటూనే గడిపాం. సాయంత్రానికి కొంత ఆందోళన తగ్గినట్లు కన్పించి నన్ను ఇంటికి వెళ్లమన్నాడు రమాపతి. ‘మర్నాడు పొద్దున ఎనిమిదింటికి వస్తాను. స్కానింగ్ చేయిద్దామ’ని చెప్పి నేను ఇంటికి వెళ్లిపోయాను.
ఆ రాత్రి వాతావరణంలో పెద్ద మార్పు. గాలి, దుమారం; పెద్ద వాన కూడ లేదు. మర్నాడు వాకింగ్‌కు వెళ్లినప్పుడు, క్రితం రాత్రి వీచిన గాలికి బాదంచెట్టు కూలిపోయి కన్పించింది.
ఇంటికి వెళ్లి స్నానం చేసి రమాపతి ఇంటికి వెళ్లేటప్పటికల్లా, బయట జనం గుమిగూడి ఉన్నారు. ‘లేదు పోయాడు, మాసివ్ హార్ట్ అటాక్ వచ్చినట్లుంది’ అని పక్కవాళ్లకు చెప్తూ ఓ డాక్టర్ మెళ్లో స్టెతస్కోపుతో రమాపతి ఇంటిలోనుండి బయటకు వచ్చాడు.
రమాపతి మరణించాడు. చెట్టుకు పండుటాకులను వదిలించుకోవాల్సిన పనిలేదు, రమాపతికి చిరు వ్యధలకు మనస్తాపం చెందాల్సిన పనీ లేదు.
ప్రతి చిన్న విషయాన్నీ అతిగా ఆలోచించటం కూడ ఒక మానసిక రుగ్మతే! *