ఈ వారం కథ

చేతులు కాలాక! (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తమకుమార్‌కు ఉత్సాహం ఉరకలేస్తోంది. కారణం అతను రాసిన కథల్ని, పుస్తకంగా తీసుకువచ్చాడు. ఆ పుస్తకాల ఆవిష్కరణకు అతను అమితంగా ఇష్టపడే ఆముదాలవలసలో జరగడంతో ఆ ఉత్సాహం రెట్టింపయ్యింది. ఉత్తమకుమార్ సొంతపేరు కాదు కలం పేరు. అతని అసలు పేరు కుమార్. దానికి ఉత్తమ తగిలించాడు. దానికి కారణం సంఖ్య శాస్త్ర, జ్యోతిషం మీద అతనికి గల అమిత నమ్మకం.
మొదట్లో అతను పత్రికల్లో ఉత్తరాలు రాసేవాడు. అతని ఉత్తరం లేకుండా ఏ పత్రికా వచ్చేది కాదు. అతని ఉత్తరాల కోసం పాఠకులంతా వారం వారం పత్రికల్లో ఎదురుచూసేవారు. అలా అతను తపాలా శాఖ వారి దృష్టిలో పడ్డాడు. పుంఖాను పుంఖానులుగా అతను ఉత్తరాలు రాస్తుండడంతో అతడిని పిలిచి ‘ఉత్తమ’కుమార్ అనే బిరుదు ప్రదానం చేసి సన్మానం చేశారు. అయితే స్నేహితులు మాత్రం అతడిని ‘ఉత్త’రాలుగాయి అని ఏడిపించేవారు. అలా ఉత్తరాల రచయితగా పతాక స్థాయికి చేరుకున్న ఉత్తమకుమార్, ఉత్తరాల రచయితగానే ఆగిపోవడానికి ఇష్టపడలేదు. ఉత్తరోత్రా ఉత్తరాల రచయిత స్థాయి నుంచి ఉత్తమ రచయితగా ఎదగాలనుకున్నాడు. వారపత్రికలు నిర్వహించే పోటీలకు కథలు రాసి పంపేవాడు. ఏ పత్రిక పోటీ పెట్టినా అతని కథ ఆ పోటీలో నిలబడాల్సిందే!
అయితే, అతను పంపిన ఏ కథకు బహుమతి రాలేదు, కనీసం సాధారణ బహుమతికే నోచుకోలేదు. అయితే ఉత్తమకుమార్ ఏదైనా మొదలుపెడితే ఊరుకునే రకం కాదు. పట్టువదలని విక్రమార్కుడికి తమ్ముడు. తిరిగొచ్చిన తన రచనలతో తనకు తెలిసిన కొంతమంది సీనియర్ రచయితలను కలిసాడు. ఆ రచనలతోపాటు ఒక స్వీట్‌పాకెట్ జతచేసేవాడు. తను కళ్ళనీళ్ళు పెట్టుకుని ‘‘సార్ వీటిని పోటీలకు పంపేను, కనీసం సాధారణ ప్రచురణకు స్వీకరించలేదు’’ అంటూ కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యేవాడు. వాళ్ళు బాధపడుతూ, ‘‘అయ్యో.. సాధారణ ప్రచురణకు స్వీకరించక పోయినవన్నీ అసాధారణ రచనలు- తిరిగొచ్చిన రచనలను అలా వదిలెయ్యకూడదు. వాటిని తిరిగి రాయాలి, రాయగా, రాయగా తిరిగొచ్చిన రచనలు ‘తిరుగులేని రచనలు’ అవుతాయి’’ అంటూ ఓదార్చేవారు.
వారి సలహా ప్రకారం తన కలానికి సానపట్టేడు. రెండు నవలలు తిరిగొస్తే నాలుగు, నాలుగు తిరిగొస్తే ఎనిమిది, అలా పత్రికా సంపాదకులకు అతనికీ జరిగిన యుద్ధంలో అతనే గెలిచాడు. అతని రచనలు ప్రచురణకు స్వీకరించడం మొదలయినాయి. అలా గిర్రున రెండేళ్ళు తిరిగాయి. ఒక సంపుటికి సరిపడా కథలు అచ్చయినాయి.
‘‘ఆ రచనల్ని వాటిమానన వాటిని వదిలేస్తే చరిత్ర మరుగున పడిపోతాయి. వాటిని గ్రంథస్తం చెయ్యి’’ అంటూ ఎవరో సలహా ఇచ్చారు.
అంతే ఉత్తమకుమార్ కార్యరంగంలోకి దూకాడు. పుస్తకాలు ప్రచురింపజేసి చేతులు కాల్చుకున్న చాలామంది రచయితల్ని కలిసాడు. తమలాగా ఇంకొకడు మునిగిపోతే సంతోషిద్దాం అనుకున్నవాళ్ళు అతని ఆలోచనకు భుజం తట్టి ప్రోత్సహించారు. మరికొంతమంది నిరుత్సాహపరుస్తూ-
‘‘బాబూ, రచనలు వ్రాయి. వాటిని పత్రికలకు పంపు. ప్రచురించబడితే ఆనందపడు. అంతే! కథ అంతటితో సమాప్తం! అలా కాకుండా పుస్తకాలు ప్రచురించేందుకు సాహసించావంటే నీ బతుకు బస్టాడు అవుతుంది. నీ పుస్తకాలు కొనేది ఎవరు?! తోపుడుబండిలో వేసి ‘పుస్తకాలు బాబూ పుస్తకాలు’ అంటూ చెవులు గీపెట్టేలా అరిచినా ఎవడూ తీసుకోడు’’ అన్నారు.
ఆ మాటలు ఉత్తమకుమార్ పెడచెవిని పెట్టాడు. తన కథలను సంకలనంగా వేసుకునేందుకు నడుం కట్టాడు. పత్రికల్లో పడిన ఇరవై కథల్లో తనకు బాగా నచ్చిన కథ మకుటంగా కథా సంకలనం తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి.
ప్రింటింగ్ ప్రెస్ వారిని కలిసి, వివరాలు అడిగాడు. కథా సంకలనం ప్రింట్ చేసి వెయ్యి పుస్తకాలు విడుదల చెయ్యాలంటే యాభై వేల రూపాయలదాకా అవుతుందని తేల్చారు. వెంటనే ఆ మేరకు ఋణసౌకర్యం కోసం ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. ఉత్తమకుమార్ భార్య సూర్యకళకు ఆ పుస్తక ప్రచురణ కార్యక్రమం నచ్చలేదు.
‘‘ఎందుకండీ? దండగ. ఆ యాభై వేలతో నాకు రెండు బంగారు గాజులొస్తాయి. చక్కగా రెండు చేతులకూ వేళ్ళాడుతూ ఉంటే ఆ ఆనందం వేరు’’ అంది మురిపెంగా అతడి కళ్ళలోకి చూసి.
‘‘నీ చేతులకు బంగారు గాజులు వేలాడ్డం కాదు, నా కథ సంకలనాలు పుస్తకాల షాపుల్లో వేళ్లాడాలి, అలాగే పుస్తకావిష్కరణ రోజున జరిగే సభలో నా పుస్తకం గురించిన సమీక్ష వింటుంటే ఆ కిక్కే వేరు!?’’ అన్నాడు.
అలా రెండు నెలలు అష్టకష్టాలతో అతడి కథా సంకలనాలు మొత్తం వెయ్యి అతని ఇంటికి చేరుకున్నాయి.
ఇక ఆవిష్కరించడమే తరువాయి.
ఈమధ్యకాలంలో ఎక్కువగా పుస్తకాలు ఆవిష్కరించిన సంస్థల గురించి వాకబు చేశాడు. ఆ సంస్థ నిర్వాహకుల్ని కలిసాడు. ఆ సంస్థలో ముగ్గురు సభ్యులుంటారు. ఆ ముగ్గురిలో ఒకరు కార్యక్రమాన్ని నడిపిస్తే, ఇద్దరు పుస్తకాలను సమీక్షిస్తారు. ఉత్తమకుమార్‌కు అవన్నీ కొత్త. అందుకే పూర్తి బాధ్యతను వారికి అప్పగించేశాడు. ముఖ్య అతిథిగా ఒక పుర ప్రముఖుడిని పిలుద్దాం. కారులోనే ఆయన సన్మానసభకు విచ్చేస్తారు. అందుకు కారును ఏర్పాటుచెయ్యాలి అన్నారు సన్మాన నిర్వాహకులు. అందుకు ఉత్తమకుమార్ ఒప్పుకున్నారు.
స్టేజీమీద అతిథులకు శాలువాలు కప్పి సత్కరించాలనీ దాంతోపాటూ మెమెంటోలు అందచేయడం సాంప్రదాయం అని తేల్చారు. దానికి సరేనన్నాడు ఉత్తమకుమార్. అలాగే వచ్చిన ప్రేక్షకులకు కాఫీ, టీలతోపాటు సమోసాలు, బజ్జీలు ఇవ్వాలని సూచించారు. వాటితోపాటు వారి నోరు తీపి చెయ్యడం కోసం స్వీటు కూడా పెడితే సముచితంగా ఉంటుందని నొక్కి వక్కాణించారు. అందుకు ఉత్తమకుమార్ తన సుముఖతను వ్యక్తంచేసాడు. అయితే అన్ని విషయాల గురించీ అంత వివరంగా, కూలంకషంగా చర్చించిన ఆ కమిటీ సభ్యులు తనకు చేయబోయే సన్మానం గురించి చర్చించకపోవడంతో బిక్కమొహం వేశాడు ఉత్తమకుమార్. తనను ఒక భారీ ఆసనంలో కూర్చోబెట్టి, మెడలో గజమాల వేసి ఒక కాశ్మీరు శాలువా కప్పి మేళతాళాలతో తనని సత్కరించాలని అతని ఆశ! ఆ విషయం చూచాయగానైనా ఎత్తకపోవడంతో అతను హతాశుడయ్యాడు. తనే ఆ విషయం వారి చెవిన వేద్దామనుకున్నాడు. అలా వేస్తే ‘ఏమిటీ వీడికి ఇంత యావ?!’ అంటారనుకుని భయపడ్డాడు. అయితే ఆ విషయం తను ప్రస్తావించకపోతే మొదటికే మోసం వస్తుందని భయపడ్డాడు. అందుకే ఆ విషయాన్ని వేరే మార్గంలోంచి నరుక్కొద్దామనుకున్నాడు. వెంటనే చెప్పాడు.
‘‘అయ్యా, నాదొక మనవి. నా పుస్తకావిష్కరణలో నాకు సన్మానం చేస్తానంటే నేనొప్పుకోను. నాకలాంటివి గిట్టవు. ఆ పని మాత్రం చెయ్యకండి’’ అన్నాడు నర్మగర్భంగా.
ఆ సంస్థ నిర్వాహకులు అతని వంక జాలిగా చూసారు.
‘‘అబ్బ! ఈ కాలంలో కూడా కీర్తికండూది లేనివాళ్ళను మిమ్మల్నే చూసాం. పుస్తకావిష్కరణలు చేయించుకునేది సన్మానాలకోసమే, మీకు ఇష్టం లేకపోతే మేం బలవంతం చెయ్యం. అలాగే కానిద్దాం’’ అన్నారు.
ఆ మాటలకు ఉత్తమకుమార్ మనసులోనే కుమిలి కుమిలి ఏడ్చాడు. ఇక విధిలేక దుఃఖాన్ని దిగమింగుకుని పుస్తకావిష్కరణ ఏర్పాట్లలో మునిగిపోయాడు.
వారం తర్వాత నగరంలోని ఒక ప్రముఖ మ్యారేజ్ హాల్‌లో ఉత్తమకుమార్ పుస్తకావిష్కరణ సమావేశం కార్యక్రమాన్ని ప్రార్థనాగీతంతో మొదలెట్టారు. వెంటనే ఫలహారాల పంపిణీ. సభ అంతా గోలగోలగా ఉంది. ఆ నేపథ్యంలోనే సమీక్ష మొదలయ్యింది. కథల్ని సమీక్షించే వ్యక్తి గురించి ఒక పావుగంట సేపు ఉపన్యసించాడు ఒక రచయిత. అదయిన తర్వాత ఉత్తమకుమార్ కథల గురించి సమీక్ష మొదలుపెట్టాడు ఆ కమిటీ నిర్వాహకుల్లోని రెండో సభ్యుడు. అతను సమీక్ష చెయ్యడం కోసం లేచి నించున్నాడు.
‘‘ఈ పుస్తకం నాపై చాలా ప్రభావం చూపించింది’’ అంటూ ఒక్కసారి ఆగాడు.
ఆ మాటలకు ఉత్తమకుమార్ ఆనందపడ్డాడు.
అతను క్షణం తర్వాత మళ్లీ మొదలెట్టాడు.
‘‘నాకు జలుబు పట్టుకుంది. మందేస్తే వారంరోజులు, వెయ్యకపోతే ఏడు రోజుల్లో పడిశం తగ్గిపోతుందంటారు. అది జరగలేదు. అది వైరల్ ఫీవర్‌కి దారితీసింది. అక్కడితో ఆగలేదు. టైఫాయిడ్ అని తేల్చారు. ఐసియులో వుంచారు. ఇంకా అదే నీరసం.. అందుకే అంబులెన్స్‌లో వచ్చేసాను, రచయిత మాట తీసెయ్యలేక, చూసారా! ఈ రచనల ప్రభావం ఎంత గాఢంగా వుందో...’’ అన్నాడు.
ఉత్తమకుమార్‌కు క్షణంసేపు ఏమీ అర్థంకాలేదు. ‘ఆయన పొగుడుతున్నాడా! తిడుతున్నాడా?’ అని చుట్టూ చూసాడు. ఎవరూ ఆయన మాటలు వినడంలేదు. సమోసాలు, బజ్జీలు తినడంలో మునిగిపోయారు.
‘అంతా మనమంచికే అంటే ఇదేనేమో! ఈ టైములో ఫలహారాలు ఇవ్వడం మంచిదయింది, ఈ సమీక్షకుడి మాటలు ఎవరైనా వింటే నవ్వుతారు. అది జరగలేదు’- మనసులో సమాధానపడ్డాడు. ఆ తర్వాత రెండో విశే్లషకురాలు లేచి నిలుచుంది. కథా సంకలనంలోని మరికొన్ని కథల గురించి సమీక్ష మొదలెట్టింది.
‘‘ఉత్తమకుమార్ లాంటి వర్థమాన రచయితలు ప్రవర్థమానులుగా, లబ్ధ ప్రతిష్ఠులుగా మారాలంటే విమర్శలను స్వీకరించాలి. పెద్దవాళ్ళం తిట్టేమని బాధపడకూడదు. మా తిట్లే వారికి దీవెనలు’’ అంటూ మొదలెట్టింది.
ఆ మాటలకు ఉత్తమకుమార్ పైప్రాణాలు పైనే పోయాయి. ఏం తిడుతుందోనని భయపడ్డాడు.
ఆమె కొనసాగించింది. ‘‘ఇందాక సమీక్షకులు సెలవిచ్చినట్టుగా నామీదా ఈ పుస్తకం ప్రభావం చాలా గాఢంగా చూపించింది’’ అంటూ పుస్తకాన్ని గట్టిగా బల్లమీదకు విసిరింది. క్షణం ఆగి మొదలెట్టింది.
‘‘నాకు ఏభై ఏళ్ళు దాటాయి. ఎప్పుడూ ఏదీ ఎరుగను. తలనొప్పి మాత్రలు వాడలేదు. జ్వరం రాదు. నా ఆరోగ్యం చూసి అందరూ ఉడుక్కుంటారు. అలాంటి నాకు చిన్నగా తలనొప్పి మొదలయ్యింది.’’
ఆ మాటలు వినలేక ఉత్తమకుమార్ ఆ సభ నుంచి బయటకు పరిగెత్తాడు.
‘‘ఏంటీ? పుస్తకావిష్కరణ మధ్యలో వెళ్లిపోతున్నారేం?’’ ఎవరో అడిగారు ఎదురుగా వచ్చి.
ఒక వేలు చూపించి బయటపడ్డాడు.
ఆ ఫంక్షన్ హాల్ బయట ఒక చెట్టు కనిపిస్తే దాని క్రింద కూర్చున్నాడు. చాలా టెన్షన్‌గా అనిపించింది. కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్లాడు. నిమిషాలు దొర్లాయి. అరగంట తర్వాత కళ్ళు తెరిచాడు.
ఎవరో వచ్చి భుజం తట్టారు.
‘‘అయ్యా! మీటింగ్ ముగింపు టైముకు వచ్చింది. మీ స్పందన కోసం పిలుస్తున్నారు’’ అన్నాడు.
వేగంగా మీటింగ్ వేదికకు చేరుకున్నాడు.
‘‘రచయితలు నానాప్రయాసలు పడి రచనలు చేస్తారు. దాంతో ఊరుకోక ఆ రచనలను పుస్తకాలుగా అచ్చువేసుకుంటారు. అప్పులు చేసి- ఆ తర్వాత ఆ కండూతి తీరక పుస్తకావిష్కరణలు మొదలుపెడతారు. సమీక్షలు, విశే్లషణల పేరుతో ఆ పుస్తకాలని చీల్చి చెండాడకండి, రచయితలను పొగడకపోతే మానీ తెగడకండి’’ అందామనుకున్నాడు.
ఆ మాటలు అతని గొంతు దాటలేదు. కారణం ఆ వేదిక వెనుకున్న బేనర్‌లోని ఆ సాహితీ సంస్థ పేరు చూసి ఒక్క క్షణం ఆగిపోయాడు.
ఆ సంస్థ పేరు ‘చించుతాం!’’
‘‘ఔను పాపం, తమ సంస్థ పేరే అది. చించక ఏం చేస్తారు? అనుకుంటూ తన మనసులోనే మాటలు బైటికి చెప్పకుండా, అందరికీ కృతజ్ఞతలు’’ అంటూ వేదిక దిగాడు.
‘‘రచయితగారికి సన్మానం లేదా?’’ ఎవరో అరిచారు.
‘‘ఈ సన్మానం చాలు’’ అంటూ ఆ సభనుంచి వేగంగా బైటికి నడిచాడు.
ఇంతలో ఎవరో ఎదురుపడి, ‘‘మీ కథా సంకలనం టైటిల్ బావుంది. మీ స్వానుభవమా!’’ అంటూ అడిగితే సమాధానం చెప్పకుండా గబగబా తన స్కూటర్ వైపు నడిచాడు. అలా నడుస్తున్న ఉత్తమకుమార్ ఆ రోజే ఆవిష్కరించిన తన పుస్తకం కేసి చూసాడు. ఆ కథా సంకలనం ముఖచిత్రం మీది ‘‘చేతులు కాలాక!’’ అనే అక్షరాలు వెక్కిరించినట్టనిపించాయి.

*
రచయిత్రి సెల్ నెం:9393129945

-డాక్టర్ ఎమ్.సుగుణరావు