ఈ వారం కథ

ఉత్త(మ) పురుషుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రసాద్ ఆఫీసును నుంచి ఇంటికొచ్చి తలుపుకొట్టాడు. వెంటనే అతడి ఎడమ కన్ను అదిరింది. దూరంగా ఎక్కడో తీతువు అరిచినట్టు, నక్క ఊళలు వేసినట్టు భ్రమకలిగింది.
‘‘అయ్యబాబాయ్ నాకేదో మూడింది. బతుకు బస్టాండు అయిపోతుందేమో..’’ అనుకున్నాడు.
అతడి శ్రీమతి తలుపు తీసింది. ఆమెను చూసి జడుసుకున్నాడు. కళ్ళు ఎర్రగా వున్నాయి. జుట్టు విరబోసుకుంది. నుదుటిమీద ఎర్రబొట్టు. ఏమీ మాట్లాడకుండా అక్కడనుంచి కదిలింది.
‘‘సుబ్బూ.. మైడియర్ సుబ్బు.. ఏమయింది?’’ అన్నాడు.
‘‘సుబ్బు లేదు గబ్బు లేదు.. నాతో మాట్లాడకండి’’ అంటూ వేగంగా కదిలి గదిలోకి వెళ్లి తలుపేసుకుంది.
‘‘ఏమైవుంటుందో?’’ అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు.
ఇంతలో అతడి పనె్నండేళ్ళ కొడుకు జగదీష్ ‘‘డాడీ.. మమీ ఏంటి అలా వుంది? నాకు భమయేస్తోంది. చంద్రముఖిలా అయిపోయింది’’ అన్నాడు. ప్రసాద్ వెంటనే లక.. లక.. లక అనబోయి, ఇది జోకు వేసే టైము కాదని మెల్లగా బాత్రూమ్‌లోకి దూరి తలుపేసుకున్నాడు.
స్నానం చేసి వచ్చేసరికి డైనింగ్ టేబుల్‌మీద పొగలు కక్కే కాఫీ లేదు. ఇంతలో అతడి కొడుకు, ‘‘డాడీ రేపు నాకు తెలుగు టెస్టు, కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఉత్తి పత్తి అర్థాలు’’ అన్నాడు.
‘‘వరేయ్ భడవా, ఉత్తిపత్తి అర్థాలు కాదు, వుత్పత్యర్థాలు, చెప్పు’’ అన్నాడు ప్రసాద్. ‘‘అర్థాంగి అంటే?’’ కొడుకు ప్రశ్నించాడు.
‘‘అర్ధాన్ని, అంగీలోంచి సంగ్రహించేది’’ అన్నాడు నవ్వుతూ.
‘‘అంటే.. అమ్మ’’ అన్నాడు కొడుకు, తండ్రితోపాటూ నవ్వుతూ.
‘‘మరి అర్థాంగీకారం, అంటే?’’ అన్నాడు కొడుకు. ‘‘అంటే అర్థంతో అంగీకరించడం, అంటే డబ్బు తీసుకొని పనిచెయ్యడం..’’ అంటూ అతడు ఏదో చెప్పబోతుంటే లోపలినుంచి వచ్చిన అతడి భార్య కోప్పడుతూ, ‘‘ఎందుకు వాడిని అలా తప్పుదోవ పట్టిస్తారు, మీకు తెలీకపోతే ఊరుకోండి’’.
వరేయ్ ‘‘అర్థాంగి అంటే భర్తలో సగభాగం, కష్టాలు, సుఖాలు భరించేది. అర్థాంగీకారం అంటే అసంపూర్ణంగా అంగీకరించడం, వౌనం అర్థాంగీకారం.. అన్నారు’’- అలా చెప్పి గబగబా లోపల గదిలోకి వెళ్లిపోయింది.
ఇక కాఫీ వచ్చే సూచనలు లేవని బట్టలేసుకుని ఇంట్లోంచి బయటపడ్డాడు. తమ ఇంటి దగ్గరున్న పార్కులో కూర్చుని అక్కడ వున్న కేంటీన్‌లో కాఫీ ఆర్డరిచ్చి తాగుతూ ఆలోచనలో పడ్డాడు. అసలేమయి వుంటుంది? నెల క్రితం తను పాపారావు క్లబ్బులో పేకాటాడి దసరా పండుగకు కంపెనీ వారిచ్చిన బోనస్ మొత్తం పోగొట్టుకున్న విషయం తెలిసిందా? లేక తనూ, అప్పారావు వారం క్రితం బార్‌లో సురాపానం సేవించి బిల్లు నేనిస్తానంటే నేనిస్తానని పోట్లాడుకుని ఆఖరికి ఇద్దరి జేబుల్లోనూ డబ్బులు సరిపోకపోతే మెడలో గొలుసు వాడి దగ్గర తాకట్టుపెట్టిన విషయం తెలిసిందా?
ఆలోచనలతో ప్రసాదు బుర్ర వేడెక్కిపోయింది. అప్పటికే చీకటి పడింది. పార్కులో లైట్లు ఆర్పేస్తున్నారు. అతని దగ్గరకు ఒక ముసలావిడవచ్చి నిలుచుంది. తెల్లగా పండిపోయిన జుట్టు.. తెల్లటి లాల్చీ, పైజమా, మనిషి మరీ తెల్లగా వుంది. వయసు అరవైపైనే వుంటుందేమో!
‘‘నా పేరు భారతి.. భామ సంఘం అధ్యక్షురాలిని..’’ అంది.
‘‘్భమ అంటే?’’ అన్నాడు ప్రశ్నార్థకంగా.
‘‘్భరత మహిళ’’ అంది.
‘‘మీకేం కావాలి.. డొనేషనా.. నా దగ్గర ఈడ్చి తన్నినా పైసా లేదు. జీతాలొచ్చిన తర్వాత కనపడండి’’ అన్నాడు.
‘‘నాకేమీ డొనేషన్ వద్దురా.. నీకే ఇస్తాను ఇప్పుడు డొనేషన్..’’ అంటూ పిడికిలి బిగించి, బొటనవేలు బైటకు కనబడేలా పిడికిలి మూసి అతడి మీదకు వచ్చింది.
‘‘ఏంటీ పిచ్చాసుపత్రినుంచి వచ్చిన బాపతా!’’ అన్నాడు నవ్వుతూ.
‘‘పిచ్చి నాకు కాదు.. నీకే, నలభయ్యేళ్ళు దాటాయి. చక్కటి భార్య, కొడుకు, చీట్ల పేక.. సురాపానం ఇవి సరిపోక.. ఇప్పుడు రెండో...’’
అంతవరకే ప్రసాద్‌కు ఆవిడ మాటలు వినిపించాయి. అప్పటికే వాయువేగంతో ఆవిడ పిడికిలి, పిడుగులా అతని కడుపుమీద పడింది. సీన్ కట్ చేస్తే ప్రసాదు ఆస్పత్రి బెడ్‌మీద వున్నాడు. అతని చుట్టూ భార్య, బావమరిది, మామగారు.
‘‘ఏమిటీ వీళ్ళంతా యములాళ్ళ..’’ అనుకున్నాడు మగతగా వున్న ప్రసాదు.
‘‘ఏమయ్యిందండి.. పాపిష్టిదాన్ని, ఆఫీసు నుంచి రాగానే వేడివేడి కాఫీ ఇవ్వకుండా చంద్రముఖి అవతారం ఎత్తాను..’’ అంది అతడి భార్య సుబ్బలక్ష్మి ఏడుస్తూ.
‘‘ఇంతకీ ఏమయ్యింది మీకు.. పార్కులో స్పృహ లేకుండా వుంటే ఎవరో తీసుకొచ్చారు’’ అన్నారు మామగారు.
ఇంతలో ‘‘డాక్టరుగారొస్తున్నారు. అందరూ బయటకు నడవండి..’’ అనేసరికి అంతా బయటకు కదిలారు. ఆ డాక్టరును చూడగానే ప్రసాద్ పైప్రాణాలు పైనే పోయాయి. ఆయనను ఇదివరకు చాలాసార్లు చూసాడు.. అదీ సినిమాల్లో డాక్టరు వేషంలోనే. ఎప్పుడూ ‘‘సారీ.. ఇరవై నాలుగు గంటలు దాటితేనేగాని ఏమీ చెప్పలేం’’ అనే డైలాగ్ చెప్పేవాడు. ప్రసాద్ భయం భయంగా చూస్తూ, ‘‘మీరు.. మీరు...’’ అన్నాడు.
‘‘ఔనయ్యా.. నేనే.. యాక్టరు కాబోయి డాక్టరునయ్యాను. నటనమీద మోజు తీరక అప్పుడప్పుడు ఆ డాక్టరు వేషం వేస్తూ వుంటాను, అయినా ఆ డైలాగు మీకు చెప్పను భయపడకండి’’ అంటూ ప్రసాద్ పొట్టమీద చెయ్యి వేసి ఇంకా నొప్పిగా వుందా..’’ అన్నాడు.
‘‘ఔను సార్.. ఎవరో అగంతకురాలు, ఆ సినిమాలో కమల్‌హసన్‌లా వచ్చి పొట్టలో కుమ్మేసింది, పోలీసు కంప్లయింట్ ఇద్దామనుకుంటున్నాను. బహుశా పిచ్చిదేమో...’’ అన్నాడు.
‘‘ఆవిడ మీమీద మర్మకళ ప్రయోగించింది. కేరళలోనే, ఆ టైపులో దెబ్బలు కొట్టేందుకు రకరకాల టెక్నిక్కులు నేర్పుతారట. ఈమధ్య మన నగరంలో డజనుకుపైగా కేసులు మీలాంటివే నాకు తగిలాయి, మీరు ఇంతకీ గ్రంధసాంగులా!’’ అన్నాడు డాక్టరు, ప్రసాదు వంక చూస్తూ.
‘‘అంటే మీ ఉద్దేశ్యం గ్రంధాలను సాంగులుగా పాడడమా.. అసలు గ్రంధాలే చదవను, వాటిని పాడడమా..’’ అన్నాడు ప్రసాద్ అమాయకంగా.
‘‘మీ తెలుగు తెల్లారినట్టే వుంది! గ్రంథసాంగుడంటే అర్థం అది కాదు. చక్కటి కుటుంబం వుండి వేరే తిరుగుళ్లు తిరుగుతూ గ్రంధం నడిపేవాళ్ళని గ్రంధసాంగులంటారు. అలాంటివాళ్ళని ఆవిడ కుమ్మేస్తుంది. ఆవిడకు చాలా నెట్‌వర్క్ ఉంది. ఆవిడ ఒక విధంగా సంసారాల మెకానిక్. ఆవిడ చేసేది మంచిపనే కాబట్టి పోలీసులు ఏం చెయ్యట్లేదు..’’ అన్నాడా డాక్టరు వివరంగా.
‘‘్ఛ ఛ.. నేను అలాంటివాడిని కాదు సార్, ఏదో పొరపాటు జరిగింది’’ అన్నాడు. ఇంతలో అతడి భార్య, ‘‘పొరపాటా? ఇదేమిటి?’’ అంది లావుపాటి డైరీ అతడిచేతికిస్తూ.
ఆ డైరీ చూడగానే ప్రసాద్ ఒక్కసారి ఆశ్చర్యపోయాడు. అది అతను నెలక్రితం తమ కాకినాడ బ్రాంచికి డిప్యుటేషన్ మీద వెళ్లినపుడు రాసిన డైరీ. గబగబా తీసి చదవడం మొదలుపెట్టాడు.
జూన్, 7: డిప్యుటేషన్ మీద ఈ రోజే ఆఫీసుకు చేరుకున్నాను. ఒక అమ్మాయి పరిచయం అయ్యింది. పేరు కల్పనారాయ్, కాని ఐశ్వర్యారాయ్‌లా వుంది. ‘‘ప్రసాద్‌గారూ.. మీరు ఇంకా పెళ్లికాని ప్రసాదా?’’ అంది. తన తల అడ్డంగా ఊపబోయి నిలువుగా తిప్పేడు.
జూన్, 10:కాఫిడేకు వెళ్లాం. బిల్లు తనే చెల్లించింది. మంచి సౌండ్ పార్టీ.. గలగలా గట్టిగా మాట్లాడడంతోపాటు డబ్బులు విరివిగా ఖర్చుపెడుతుంది.
జూన్, 15:సినిమాకు ప్లాన్ చేశాను. పాత ఇంగ్లీషు సినిమా, జనం రారు కదా అని మన ప్రణాళిక.
అయితే, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మమ్మని తీసుకొచ్చింది. ఇక నా పని దుబాసీలా అయిపోయింది. ప్రతీ డైలాగు తెలుగులో చెప్పలేక చచ్చాను.
చదవడం ఆపి పకపకా నవ్వేడు ప్రసాద్. ఆ తర్వాత బిగ్గరగా నవ్వేడు. వికటాట్టహాసం చేశాడు. అతని భార్య, మావగారు అతడి వంక ఆశ్చర్యంగా చూశారు. కొంపదీసి పిచ్చెక్కిందేమో అనుకున్నారు. అతడి బావమరిది కంగారుగా డాక్టరుకోసం బైటకు పరుగెత్తాడు.
‘‘కంగారు పడకండి, నాకు పిచ్చెక్కలేదు. ఈమధ్య రచనలు చేయడం మొదలుపెట్టాను. ఒక పెద్ద రచయిత ఉత్తమ పురుషలో రాయండి, చాలా తేలికగా రాయగలరు అన్నాడు. అందుకే డైరీలో అలా నా పేరుతో కల్పన జోడించి రాసాను. కల్పనారాయ్ అనేది కల్పన’’ అన్నాడు ప్రసాద్.
‘‘ఉత్తమ పురుషలో రాయడం అంటే ఏమిటి?’’ అన్నారు ప్రసాద్ మావగారు.
‘‘తాను ఉత్తమ, ఎదుట మధ్యమ, ఎక్కడో ప్రధమ. అంటే నేను నా గురించి రాసుకోవడం ఉత్తమ పురుష, ఇంగ్లీషులో ఫస్ట్ పర్సన్, సెకెండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అంటారు. ఇక ఇంకో విషయం మా కాకినాడ ఆఫీసులో అంతా మగ ఉద్యోగులే, మీరు అనుకున్నట్టు ఆడ ఉద్యోగులు లేరు’’ అన్నాడు ప్రసాద్ వివరంగా.
‘‘క్షమించండి అర్థం చేసుకున్నాను, మీరు నాకు దైవమిచ్చిన వరప్రసాదం’ అంది అతడి శ్రీమతి అతడి రెండు చేతులు పట్టుకుని.
‘‘పోనీలే కారుమబ్బులు, బస్సు మబ్బులు తొలగిపోయాయి. ఇక అంతా ఆనందమే!’’ అన్నాడు ప్రసాద్ నవ్వుతూ. ‘‘సరే మీరు రెస్టు తీసుకోండి. మేం బయట వుంటాం’’ అంటూ అతని కుటుంబ సభ్యులంతా బైటకు నడిచారు.
‘బతుకు.. జీవుడా’ అనుకుంటూ కళ్ళు మూసుకున్నాడు.
ఐదు నిమిషాల తర్వాత, ‘‘ప్రసాదూ.. పెళ్లికాని ప్రసాదు’’ అని పిలుపు వినిపించేసరికి కళ్ళు తెరిచాడు. ఎదురుగా స్టెతస్కోపు, తెల్లటి కోటుతో పార్కులో తనను చావబాదిన ముసలావిడ కనిపించింది.
‘‘మైగాడ్ మీరు మీరు మళ్లీ వచ్చారా? అనవసరంగా ప్రాణాలమీదకొచ్చింది’’ అన్నాడు కోపంగా.
‘‘ఈసారి ప్రాణాలే పోతాయి. ఉత్తమ, మధ్య, ప్రధమ అంటూ తెలుగు గ్రామరు చెప్పి మీ వాళ్ళను నమ్మించావు. తలకు రంగేసి, గ్లామరు పెంచి ఆ కాకినాడ అమ్మాయిని నమ్మించావ్, మీ ఆఫీసులో ఆడ ఉద్యోగులు లేరు, సరే పక్క ఆఫీసులో ఉన్నారు కదా! అలాగే డైరీలో మారుపేరు రాసావ్.. ఇదంతా మోసం కదా.. నీలాంటి చీడ పురుగులకు బుద్ధి రావడానికి నేను మర్మకళ ప్రయోగించాను. ఇప్పుడూ బుద్ధి రాకపోతే నీకు ప్రేతకళ వచ్చేలా మరో కళను ఉపయోగిస్తాను మిస్టర్ పురుషోత్తమ ప్రసాద్’’ అంది ఆవిడ కోపంగా.
‘‘మైగాడ్.. నా పూర్తిపేరు మీకు ఎలా తెల్సింది?’’’ అన్నాడు ఆశ్చర్యంగా.
‘‘తెలుసు.. నీకు మీ తల్లిదండ్రులు ఎందుకు ఆ పేరు పెట్టారు?’’ అంది.
‘‘పురుషోత్తముడు, అంటే పురుషులలో ఉత్తముడుగా అవుతానని ఆ పేరుపెట్టారు, క్షమించండి. నేను ఉత్తమ పురుషుడిని కాను ‘ఉత్త’ పురుషుడిని. ఉత్తమ పురుషుడిగా మారి నా పేరు సార్థకం చేసుకుంటాను, నన్ను నమ్మండి’’ అంటూ రెండు చేతులూ జోడించాడు ప్రసాదు.
‘‘సరే జాగ్రత్త.. పెళ్ళంటే నూరేళ్ళ పంట, దాన్ని మంటగా చేసుకోకు’’ అంటూ ఆ భారతీయురాలు అక్కడనుంచి కదిలింది.
ఆవిడ వెళ్లిన వెంటనే అతడి భార్య లోపలికొచ్చి ‘‘ఏమంటోంది, ఆ ముసలి డాక్టరు?’’ అంది కంగారుగా.
‘‘ఈ ట్రీట్‌మెంట్‌కు నయం కాకపోతే షాక్ ట్రీట్‌మెంట్ ఇస్తుందట’’ అన్నాడు, వస్తున్న దుఃఖం ఆపుకుంటూ- పెళ్ళై, పనె్నండేళ్ళ కొడుకున్న ఆ ఉత్త(మ) పురుషుడు ప్రసాద్.
అరగంట తరువాత ఆసుపత్రికి దగ్గరలోని పార్కులోకి ప్రవేశించింది, పురుషోత్తమ ప్రసాద్‌కి ట్రీట్‌మెంట్ ఇచ్చి ఆసుపత్రిపాలు చేసిన ఆ ముసలావిడ.
పార్కులోని చెట్టు చాటుకు వెళ్లి తలమీద ఉన్న విగ్ తీసేసింది. ఆ అరవై ఏళ్ళ ముసలావిడ ఇప్పుడు ముప్ఫయేళ్ళ యువకుడు.
ఇంతలో అతని దగ్గరకు వచ్చాడు ఒక ముసలాయన. అతడితో ‘‘బాబూ! నా అల్లుడు చెడు తిరుగుడులు మాన్పించి మా అమ్మాయి కాపురం చక్కబెడదామని నిన్ను భారతీయురాలు పాత్రలో ఉపయోగిస్తే మరీ గట్టిగా కుమ్మేశావేం? ఇంకా నయం ప్రాణంమీదకి వచ్చేది’’ అన్నాడాయన.
‘‘క్షమించండి, నేను కరాటే నేర్చుకుంటున్నాను. అందుకే ఇలాంటి కేసులు ఒప్పుకుంటున్నాను, స్వామికార్యం, స్వకార్యం, పైగా సమాజ సేవ. ఏమైతేనేం ఆయన ఇప్పుడు పురుషోత్తముడుగా మారాడు కదా!’’ అంటూ ఆ ముసలాయనతో చేయి కలిపాడు. *

-డాక్టర్ ఎం.సుగుణరావు