కథ

సిసిటివి కెమెరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మనిషి మెదడు సిసిటివి కెమెరా లాంటిది. విశేషాల్ని నిక్షిప్తం చేసి, పదేపదే వాటిని పరిశీలించడానికి అవకాశమిస్తుంది. విశేషాల్ని విశే్లషించడానికి మెదడుని సిసిటివి కెమెరాలా ఉపయోగించుకోగల శక్తి ఉన్నవాడే గొప్ప రచయిత కాగల్గుతాడు’
ఇది నా అభిమాన రచయిత వెంకటాచలం మాట.
అమ్మ నాకు సాహిత్యాభిలాషని ఉగ్గుపాలతో రంగరించి పోసింది. చిన్నప్పుడు ఎవరు చెప్పినా కథలు తెగ వినేవాణ్ణి. చదివి అర్థం చేసుకునే వయసొచ్చినప్పట్నించీ కథలు తెగ చదివేవాణ్ణి. చదవడం మొదలెట్టిన కొన్నాళ్లకే నేను వెంకటాచలం అభిమానినయ్యాను. ఆయన అన్ని వయసుల వారి కోసం, అన్ని రకాల రచనలూ చేసేవారు. అన్నీ గొప్పగా వుండేవి. ఆ గొప్పతనాన్ని అటు ప్రభుత్వమూ, ఇటు ఇతర సాహితీ సంస్థలూ గుర్తించాయి. ఆయనకు వచ్చిన అవార్డులు లెక్కలేనన్ని.
పత్రికల్లో, దృశ్య మాధ్యమాల్లో తరుచుగా కనిపించేవారాయన. ఇంటర్వ్యూల్లో చాలా గొప్ప విషయాల్ని మనసుకి హత్తుకునేలా చెప్పేవారు. మామూలుగా సాధ్యపడని ఎన్నో కార్యాల్ని కలంతో సాధించొచ్చని చెబుతూ, మనిషి మెదడుని సిసిటివి కెమెరాతో పోల్చిన ఆయన మాటలు ననె్నంతలా ప్రభావితం చేశాయంటే - నేనూ కలం పట్టాను. ఆయనంత గొప్పగా కాకపోయినా బాగానే రాసేవాణ్ణి. పాఠక లోకంలో అంతో ఇంతో పేరూ తెచ్చుకున్నాను.
నేనుండేది హైదరాబాద్. ఆయనుండేది అనకాపల్లి. ఐతే ఆయన తరచుగానే హైదరాబాద్ వస్తూ పోతూండేవారు. చిత్రమేమిటంటే - అంత అభిమానమున్న నేనాయన్ని ముఖతః కలుసుకోవడం నా యాభై నాలుగో ఏట జరిగింది. అదీ అనుకోకుండా ఒక పెళ్లి రిసెప్షన్లో.
జనాలకి ఆయన సుపరిచితులే కదా! అక్కడ చాలామంది వెళ్లి ఆయన్ను పలకరించారు. వాళ్లకాయన పేరుతోనే తప్ప రచనలతో పరిచయం లేకపోవడం వల్ల- ఓసారి పలకరించి వెంటవెంటనే వెళ్లిపోతున్నారు. ఆయన ఒంటరిగా ఉన్న సమయం కనిపెట్టి నేను వెళ్లి పలకరించాను. ఆయన మీదున్న నా అభిమానమంతా మాటల్లో కురిపించాను. ఆ మాటల్లోనే ఆయన రచనల్నీ ప్రస్తావించాను.
ఉన్నట్లుండి ఆయన నన్ను మధ్యలో ఆపి, ‘నిజం చెప్పండి. మీరు కూడా రచయిత కదూ!’ అన్నారు.
నా పరిచయస్థుల్లో నూటికి తొంభై తొమ్మిది మందికి సాహిత్యాభిమానం లేదు. చేతిలో నా కథ ఉన్న పత్రిక పట్టుకున్న వాళ్లు కూడా ఇంకా రాస్తున్నావా అనో - నీ కథ పడితే చెప్పు తప్పక చదువుతా అనో - తన చేతిలోని పత్రిక చూపించి, రాస్తే ఇలాటి పత్రికల్లో రాయాలనో - చెప్పడం పలుమార్లు స్వానుభవం.
అందుకని నేను రచయితనని చెప్పుకోవడం క్రమంగా తగ్గించేశాను.
వెంకటాచలానికీ చెప్పేవాణ్ణి కాదేమో! ఆయనే స్వయంగా అడిగితే దాచడం బాగుండదని రచయితగా నా పేరు, కొన్ని వివరాలు చెప్పేశాను.
‘అదీ సంగతి’ అన్నాడాయన. ‘మీరు నాకు అభిమాని అయితే నేను మీకు అభిమానిని’ అంటూ తను చదివిన నా రచనలు చెప్పి, ‘మీ కథలు చదివి మీరూ నాకులా ఎనబయ్యోపడిలో ఉన్నారనుకున్నాను. నాకంటే చాలా చిన్న’ అని నవ్వేశారు. అదాయన నాకిచ్చిన గొప్ప కాంప్లిమెంట్.
నా సంతోషం అంతా ఇంతా కాదు. ‘నేను మీ ఏకలవ్య శిష్యుణ్ణి’ అంటూ నా కథల ఘనతని ఆయనకే ఇచ్చేశాను. తర్వాత ఆయన నన్ను ‘మీరు’ అనడం మానేసి, ‘ఏమోయ్’ లోకి దిగారు. ఎంతో బాగా అనిపించింది.
అలా మొదలైన మా పరిచయం మంచి స్నేహంగా మారింది. హైదరాబాద్ వచ్చినప్పుడల్లా మా ఇంట్లోనే దిగేవారాయన. మా ఆవిడ కూడా ఆయన్ని బాబాయిగారంటూ చనువు తీసుకుని ఆదరించేది.
అలా ఓ ఏడాది గడిచాక - మా అమ్మాయి పురిటి కోసం అమెరికా వెళ్లింది మా ఆవిడ. ఆ సమయంలో ఆయన హైదరాబాద్ వస్తే, మేమిద్దరం అర్ధరాత్రి దాటేదాకా కబుర్లలో పడి పలు విషయాలు చర్చించేవాళ్లం.
అప్పుడు నాకాయనలో ఓ కొత్త కోణం తెలిసింది. విషయాన్ని అన్ని కోణాల నుంచీ ఆలోచించేది ఒక్క రచనల విషయంలోనే. బయట ఆయనకి స్వదేశమంటే ఘనత. విదేశీయులంటే విముఖత. ఆ విషయమై బలంగా ఏర్పడ్డ అభిప్రాయాల్ని మార్చుకుందుకు ఆయన ఒప్పుకోరు.
ముందు కాస్త నిరుత్సాహపడ్డాను కానీ, ఆయన నా అభిమాన రచయిత కదా- ‘చాలామంది గొప్పవాళ్లలో ఇలాంటి లోపాలు సహజమేలే’ అనుకున్నాను. సమర్థించుకుందుకు నాకు తెలిసిన గొప్పవాళ్లని గుర్తు చేసుకోబోతే - ముందుగా మా ఆవిడ నాపై చేసే విమర్శలు స్ఫురణకొచ్చాయి. ‘ఓహో, అయితే నేనూ గొప్పవాణ్ణే అన్నమాట. ఈ మాట శ్రీమతికి చెప్పాలి’ అనుకున్నాను.
ఒంటరిగా ఉంటున్నాను కదా- నేను వెంకటాచలంగారిని మ్యూజియం, జూ, రామోజీ ఫిలింసిటీ, ఓషన్ పార్క్ వంటి ప్రదేశాలకి తీసుకెళ్లేవాణ్ణి. అక్కడ మా జంటని కొందరు ముచ్చటగా చూసినా, మా మీద జోకులేసిన వాళ్లూ ఉన్నారు. ఒకరెవరో మాకు వినిపించేలా, ‘పండు ముసలి, కాయ ముసలి’ అనడం విన్నాను. దానికి గురువుగారు బాధపడి, ‘ఇక మీద మనమిలా తిరగొద్దోయ్’ అన్నారు.
అవకాశమొచ్చింది కదా అని, ‘మన దేశంలో ఇలాగే ఉంటారు. విదేశీయులు ఎదుటి వాళ్ల మీద కామెంట్స్ చెయ్యరుట. ఐనా మీరు మహా రచయిత. ఇలాంటి మాటలు పట్టించుకోకూడదు’ అన్నాను.
ఆయన వెంటనే, ‘మధ్యలో ఆ రేసిస్టుగాళ్ల ప్రసక్తి దేనికి గానీ, ఈ కామెంట్‌ని తేలిగ్గా తీసుకోమనడం నాకు నచ్చింది. కథకి మంచి సబ్జెక్ట్ ఔతుంది కూడా!’ అని నవ్వేశారు. తర్వాత ఓ క్షణమాగి, ‘ఇన్నాళ్లూ నాకు పిల్లలు లేరని బాధ పడేవా
ణ్ణోయ్. కానీ ఇప్పుడు నాకు కలిసొచ్చే కాలమనుకుంటాను. నువ్వు నడిచొచ్చిన వాడివే కాదు, నన్ను నడిపించే కొడుకువి. నేను చాలా అదృష్టవంతుణ్ణి’ అన్నాడాయన చెమ్మగిల్లిన కళ్లతో.
నేనాయన్ని జాగ్రత్తగా చేయి పట్టుకుని నడిపిస్తున్నట్లు అప్పుడు గుర్తించాను. అప్రయత్నంగా ఆయన చేతిపై నా పట్టు బిగిసింది. దానికి స్పందనగానో ఏమో, ‘మా ఆవిడ దురదృష్టవంతురాలు ఈ కొడుకు సేవలందుకునే భాగ్యానికి నోచుకోలేదు’ అని స్వగతంగా గొణుక్కున్నప్పుడు ఆయన మొహంలో విషాదం స్పష్టంగా కనిపించడంతో నాకూ మనసు కలుక్కుమంది.
ఆ తర్వాత కూడా చాలాసార్లు నా మనసు కలుక్కుమనే సందర్భాలు వచ్చాయి. అనుబంధంతో కాదు, అమెరికాపై ఆయనకున్న ద్వేషానికి.
‘అమెరికా మహా చెత్త దేశం. అక్కడున్నంత రేసిజం మరెక్కడా లేదు. మనవాళ్లంతా అమెరికా అంటే పడి చావడం - సిగ్గుమాలినతనం’ అనేవాడాయన తరచుగా.
‘అలాగనకండి. ప్రతి చోటా మంచి, చెడు ఉంటాయి. మన వాళ్లు అక్కడి మంచిని నేర్చుకుని చెడుని తిరస్కరించొచ్చుగా’ అన్నాను.
‘ఏమిటి, అక్కడి వాళ్ల మంచి!’ అన్నారాయన అసహనంగా.
ఒకరోజు నేను ఆఫీసు నుంచి ఇంటికొస్తూంటే ఓ కారుకి యాక్సిడెంటయింది. ఇద్దరమ్మాయిలు రక్తపు మడుగులో ఉన్నారు. అది మెయిన్‌రోడ్డు కాదు. ట్రాఫిక్ చాలా తక్కువుంది. నేనది చూసి, నిర్లిప్తంగా ముందుకి వెళ్లబోతూ - నా వెనుక మరో కారు వస్తూండటం చూసి కారు స్లో చేశాను. నా వెనుక కారు ఆగింది. రియర్ వ్యూ మిర్రర్లోంచి చూస్తుండగా ఇద్దరు తెల్లవాళ్లు దిగారు. నేను వెళ్లిపోయాను. తర్వాత తెలిసింది - ఆ తెల్లవాళ్ల వల్లే ఆ అమ్మాయిలు బ్రతికారని. అప్పుడా తెల్లవాళ్లకు బదులు వరుసగా నాలాంటి మరో మనవాడు వస్తే ఆ పిల్లలకి అక్కడే చావు మూడేది’ అన్నాను.
‘మీ అమ్మాయక్కడుందని నువ్వక్కడి వాళ్లని వెనకేసుకొస్తున్నావు. మనని మనం తక్కువ చేసుకునే ఇలాంటి కబుర్లు చాలా విన్నానులే. నీ మాట వింటే, తెల్లవాళ్లు లేకపోతే మన దేశంలో ప్రతి ప్రమాదం చావుకి దారి తీస్తుందనుకోవాలి’ అని సంభాషణ త్రుంచేశారాయన.
నేను ఆరేళ్ల క్రితం అమెరికా వెళ్లి ఓ ఏడాదుండొచ్చాను. దేశం సంగతెలాగున్నా, అక్కడి పౌరుల నుంచి చాలా నేర్చుకోవాలనిపించింది. అదంతా చెప్పాలనుకున్నాను. కానీ - ఆయన నాకా అవకాశమిస్తే కదా!
అప్పుడు కాకపోయినా, అవకాశమొకటి మమ్మల్ని వెదుక్కుంటూ వచ్చింది.
అమెరికాలో అంతర్జాతీయ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. దానికి వెంకటాచలంతోపాటు నాకూ ఆహ్వానం అందింది. నిజానికి నాకంత సీను లేదు. తనకి తోడుగా ఉంటానని బహుశా వెంకటాచలమే నాకూ పిలుపొచ్చేలా చేసుండొచ్చు. ఐతే ఆ విషయం నేనాయన్నడగలేదు. నాకాయన చెప్పలేదు.
అమెరికా నుంచి నిర్వాహకులు నాతో ఫోన్‌లో మాట్లాడారు. ఇద్దరికీ రానూ పోనూ టికెట్ ఇస్తారుట. అక్కడ మాకు బంధుమిత్రులెవరూ లేకపోతే - వారం, పది రోజులకి ఎవరిళ్లలోనో వసతి ఏర్పాటు చేస్తారుట.
సభాస్థలికి దగ్గర్లోనే మా అమ్మాయుందనీ, వేరే అకామడేషన్ అక్కరలేదనీ, నేను రెండు నెలలు సెలవు మీద వస్తాననీ, నాకు మల్టిపుల్ ఎంట్రీ వీసా ఉందనీ, వెంకటాచలానికి వీసా ఏర్పాట్లు చెయ్యాలనీ చెప్పాను.
మరో విశేషమేమిటంటే - అప్పటికి మా ఆవిడ అమెరికా వెళ్లి అయిదు నెలలు గడిచాయి. బిడ్డ పుట్టడానికింకా రెండు వారాలు టైముంది. పురుడయ్యేక, ఆ బిడ్డతోనూ కొంతకాలం గడపాలని మా ఆవిడకి మహా ఇదిగా ఉంది. అందుకని అమెరికా ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకుంటే, తనకి వీసా మరో ఆరు నెలలు పొడిగించారు.
నేనొస్తున్న విషయం తెలిసి మా ఆవిడ ఆనందపడింది - తనుండగా మేమక్కడికొస్తున్నామని.
నేను, వెంకటాచలం ప్రయాణమయ్యాం. ఆయన చేతికర్ర ఊతంతో నడుస్తారు. వీల్‌చైర్ ఏర్పాటు చేస్తానంటే ఆయన వద్దన్నారు. నాదీ ఆయనదీ కూడా హాండ్ బ్యాగేజీ పట్టుకుని, ఆయన్ని చూసుకోవడం కొంచెం కష్టమే అయింది నాకు. చిన్నపిల్లలున్న వాళ్లనీ, ముసలి వాళ్లనీ ముందు రమ్మని ప్రకటించినా, బోర్డింగ్ సమయానికి అంతా పొలోమంటూ లేచి తోసుకోసాగారు. మన దేశంలో అది మామూలే మరి!
ఎలాగో విమానమెక్కి సద్దుకుని కూర్చున్నాక, ‘దిగేటప్పుడు వీల్ చైర్ తీసుకుందాం’ అన్నాను నేనాయనతో.
అప్పుడు మా పక్కన కూర్చున్న ఓ అమెరికన్ ‘కలవరపడకండి.
దిగేటప్పుడు నేను మీకు సాయం చేస్తాను’ అన్నాడు చక్కటి తెలుగులో.
అతడి ఆఫర్ కంటే తెలుగుకి మేమిద్దరం తెల్లబోయాం. అతడది గమనించి ‘నేను కొనే్నళ్లు తెలుగునాట ఉండి, తెలుగులో పీహెచ్‌డి చేశాను’ అన్నాడు.
మా ఆశ్చర్యం రెట్టింపయింది. ‘తెలుగులో పీహెచ్‌డి వల్ల ఏం ప్రయోజనం?’ అన్నాం ఏకకంఠంతో.
‘నేర్చుకోవాలన్న తపనకు ప్రయోజనం కావాలా? నాకు తెలుగు స్నేహితులున్నారు. వాళ్ల మాటలు విన్నప్పుడు నాకు తెలుగు భాష నచ్చింది. అమెరికాలో సైంటిస్టుగా ఉంటూ, తెలుగు మిత్రుల దగ్గర - తెలుగు వ్రాయడం, చదవడం నేర్చుకున్నాను. ఇండియా వచ్చి పీహెచ్‌డి చేశాను’ అన్నాడు.
నాకైతే స్పృహ తప్పుతోందా అనిపించింది. తెలుగులో పుట్టి తెలుగులో పెరిగిన వాళ్లు ప్రయోజనం లేదని తెలుగుకి దూరవౌతుంటే, ఓ అమెరికన్ సైంటిస్టుకి ఆ భాష నచ్చి తనకే ప్రయోజనం లేకున్నా ఆ భాషలో పీహెచ్‌డి కూడా చేశాడు.
ప్రయాణంలో ముగ్గురం తెలుగులో హాయిగా మాట్లాడుకున్నాం. ఎయిర్‌పోర్ట్‌లో దిగాక ఆ అమెరికన్ మాకు చేసిన సాయం మర్చిపోలేను. మా అల్లుడికి మమ్మల్ని అప్పగించేదాకా మా లగేజీతో సహా అతనే మోసాడు. ధన్యవాదాలు చెప్పాం కానీ, అతడికి రుణపడ్డామన్న భావన మనసుని ఆక్రమించుకుంది.
తెలుగు మహాసభలు తెలుగు నాట లాగే బాగా జరిగాయి.
మా అల్లుడు మమ్మల్ని డిస్నీలాండ్ తీసుకెళ్లాడు. అక్కడ వెంకటాచలం కంటె వయోవృద్ధులు తమకి తాముగా వీల్‌చైర్‌లో తిరుగుతున్నారు. తలిదండ్రులు చంటిపిల్లల్ని తోపుడుబండ్లలో తీసుకొస్తున్నారు. వీల్‌చైర్స్, తోపుడుబండ్లు బస్సులోకి రావడానికి వీలుగా బస్సు ఒక ప్లాట్‌ఫాం వద్ద ఆగుతోంది. ప్లాట్‌ఫాం మీంచి బస్సులోకి చెక్కవంతెన ఉంది. సందర్శకులు గుమిగూడకుండా క్యూ సిస్టం పాటిస్తూ ఒక్కొక్కరుగా, నెమ్మదిగా బస్కెక్కుతున్నారు. అంతా ఎక్కినట్లు రూఢి చేసుకున్నాకనే బస్సు కదులుతుంది. డ్రైవర్లలో ఎక్కువమంది ఆడవాళ్లు. ప్రతిచోటా విధిగా క్యూ సిస్టం పాటిస్తున్నారు. మధ్యలో ఎవరైనా ఫొటోలు తీసుకుందుకు ఆగితే, వెనుక నున్న వాళ్లు వాళ్లు ఫొటోలు తీసుకునేదాకా ఓపికగా ఉంటున్నారు.
‘మన దేశంలో ఐతే - ఇంత రష్‌లో ఇప్పుడు ఫొటోలు అవసరమా, కదలండి అని వెనుకనున్న వాళ్లు అరుస్తారు. ఇంట్లో కూర్చుని కృష్ణా రామా అనుకునే వయసులో మీకు డిస్నీలాండ్ కావాల్సొచ్చిందా అంటారు’ ఆశ్చర్యమేమిటంటే ఈ మాటన్నది నేను కాదు, వెంకటాచలం.
గత అనుభవాన్నిబట్టి, తిరుగు ప్రయాణంలో వెంకటాచలానికి వీల్‌చైర్ తీసుకున్నాను. ప్రయాణం సాఫీగా జరిగిపోయింది. ఆయనకి చెన్నైలో మీటింగ్ ఉండటంవల్ల మేము చెన్నైలో దిగాం. ఎయిర్‌పోర్ట్‌లో నిర్వాహకులు మమ్మల్ని సగౌరవంగా రిసీవ్ చేసుకుని తీసుకెళ్లారు. అక్కడ సభ కూడా అమెరికాలో అంత బాగానూ జరిగింది.
మర్నాడు మేము హైదరాబాద్ ప్రయాణానికి చెన్నై రైల్వేస్టేషన్‌కి వెళ్లాం. వెంకటాచలానికి వీడ్కోలు ఇవ్వడానికి మాతో చాలామందే వచ్చారు స్టేషన్‌కి.
అంతా ప్లాట్‌ఫారం మీద నిలబడి కబుర్లు చెప్పుకుంటున్నాం.
ఉన్నట్లుండి ప్లాట్‌ఫారం మీద పెద్ద హడావిడి. ఏం జరుగుతోందో తెలుసుకునేలోగానే, చేతిలో కత్తి ఉన్న ఒక యువకుడు పరుగున మమ్మల్ని దాచుకుని వెళ్లిపోయాడు. మాలో కొంతమంది అతడి ననుసరించి వెళ్లారు. తర్వాత వచ్చి - అంతా చూస్తూండగా ఆ యువకుడు ఓ యువతిని కత్తితో పొడిచి చంపి పారిపోయాడని - సమాచారం తెచ్చారు. అంతలో మా ట్రైన్ వచ్చింది. మేము ఎక్కేశాం. మా కంపార్ట్‌మెంట్‌లో చాలామందికే ఆ విషయం తెలిసినట్లుంది. ప్లాట్‌ఫారం మీద జరిగిన ఘోరం గురించి చర్చలు మొదలయ్యాయి. మా సీట్ల దగ్గర జరిగిన చర్చలో నేను, వెంకటాచలం కూడా ఉన్నాం.
మర్నాడు హైదరాబాద్ చేరుకున్నాక, ఆ సాయంత్రం టీవీలో వార్తలు చూస్తూండగా నిన్న చెన్నై స్టేషన్‌లో మేము చూసిన దృశ్యం కనిపించింది. కుతూహలంగా శ్రద్ధగా చూశాం.
నిన్న మా కళ్ల ముందు జరిగిన హత్య సిసిటివి కెమెరాలో రికార్డయిందట. చనిపోయిన అమ్మాయిని పదేపదే చూపిస్తున్నారు.
వెనుక నుండి వ్యాఖ్యాత మాటలు వినిపిస్తున్నాయి. ‘మనసు నిండా ఆశలు నింపుకున్న ఓ లేబ్రాయపు యువతిని - ఓ రాక్షసుడు కత్తితో పొడిచి పారిపోయాడు. ఆమె ఇరవై నిమిషాలు రక్తం మడుగులో గిలగిల కొట్టుకుని చనిపోయింది. ఆ దృశ్యాన్ని ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎందరో చూశారు. వాళ్లలో ఒక్కరంటే ఒక్కరు వెంటనే పూనుకుని కనీసం అంబులెన్సుని పిలిచినా ఆమె ప్రాణాలు దక్కేవి. కానీ అలా జరగలేదు. ఇది చూస్తే ఏమనిపిస్తోంది? అడవిలో జింకల గుంపు వెడుతుంటే ఓ క్రూరమృగం వాటిలో ఓ జింకని వేటాడి చంపుతుంది. మిగతా జింకలన్నీ చెల్లాచెదరుగా పారిపోయి, కాసేపటికి మళ్లీ గుంపుగా కలిసి గడ్డి మేస్తూ ఉంటాయి. ఎక్కడున్నాం మనం? మనుషుల మధ్యనా? లేక అడవిలోనా?’
వ్యాఖ్యాత గొంతు గంభీరంగా ఉంది. కానీ అందులో విషాదం ధ్వనించడం లేదు. జాగ్రత్తగా వింటే - టిఆర్‌పి పెరుగుతుందన్న ఉత్సాహాన్ని పసికట్టొచ్చు.
ఆపైన ఆ ఘటనపై స్పందనలు. అతి త్వరలో నేరస్థుణ్ణి పట్టుకుని కటకటాల వెనక్కి పంపుతామంటున్నారు పాలకపక్ష ప్రతినిధులు. ఇది ప్రభుత్వ వైఫల్యమంటున్నారు ప్రతిపక్ష ప్రతినిధులు. ఎవరి గొంతుల్లోనూ వేదన లేదు. ఓట్ల రూపంలో ఉన్న పౌరుల్ని మభ్యపెట్టే తపన మాత్రమే ఉంది.
అంతా చూసిన దృశ్యమది. కొందరు ప్రత్యక్షంగా, కొందరు టివిలో...
చూడ్డంతో జనం పని అయిపోయింది. చూపించడంతో మీడియా పని అయిపోయింది. మ్రొక్కుబడి స్పందనతో ప్రజాప్రతినిధుల పని అయిపోయింది.
‘మనిషి మెదడు సిసిటివి కెమెరా లాంటిది. విశేషాల్ని నిక్షిప్తం చేసి, పదేపదే వాటిని పరిశీలించడానికి అవకాశమిస్తుంది. విశేషాల్ని విశే్లషించడానికి మెదడుని సిసిటివి కెమెరాలా ఉపయోగించుకోగల శక్తి ఉన్నవాడే గొప్ప రచయిత కాగల్గుతాడు’ అన్నాడు వెంకటాచలం.
ఆ మాట ఆయనకి గుర్తు చేశాను. ఆయన సాలోచనగా, ‘మన దేశంలో అంతా సిసిటివి కెమెరాలు. వాటిలో నిక్షిప్తానికే తప్ప స్పందనకి అవకాశముండదు. ఆ కెమెరాల్లో రచయితలమైన మనం కూడా ఉన్నామేమోనని అనుమానంగా ఉంది’ అన్నాడు.
నాకు కొంచెం ఆనందం కలిగింది. ఆ మాట సిసిటివి కెమెరా నుంచి వచ్చినట్లుకాక - ఓ మహా రచయిత నోటి నుంచి వచ్చినట్లే ఉంది మరి!

జొన్నలగడ్డ రామలక్ష్మి.. 9885620065