కథ

గమనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణ ప్రచురణకు
ఎంపికైన కథ
**
చంద్రశేఖరం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో తొమ్మిది గంటలప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చిన విమానం దిగాడు. అతడు క్రితం రోజే దిల్లీ నుంచి తమ కంపెనీ డీలర్స్ కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చి ఆ పని పూర్తి చేసుకొని ఉదయానే్న విజయవాడకు బయల్దేరాడు. గుంటూరు - విజయవాడ మధ్యలో మంగళగిరికి పక్కనున్న సాయిరాంపురం తను పుట్టిన ఊరే కాకుండా ఇప్పటికీ తన తల్లిదండ్రులు అక్కడే ఉంటున్నారు.
ఇంత దూరం వచ్చినప్పుడు ఎంత పని ఒత్తిడిలో వున్నా కొన్ని గంటలయినా వాళ్లను చూడకుండా వెళ్లటం భావ్యం కాదు. వాళ్లు తన దగ్గరకు రమ్మనమంటే రారు. తనూ తరచూ ఇక్కడకు రాలేడు. భార్య దిల్లీలోనే ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో గైనకాలజిస్ట్. ఇద్దరి పిల్లల్లో పెద్దది బిటెక్ చదువుతోంది. రెండోవాడు టెన్త్. అందరూ ఒకేసారి రావాలంటే కుదరదు. తనే రెండేళ్లకో మూడేళ్లకో ఒకసారి వీలు చూసుకుని వచ్చి వాళ్లను చూసి వెళుతుంటాడు. భార్యాపిల్లలను తీసుకువచ్చి పదేళ్లవుతోంది.
గన్నవరం నుంచి ఎంత క్యాబ్‌లో వచ్చినా పది గంటలయింది హైవేకు పక్కగా ఎండిపోయిన చెరువును ఆనుకుని వున్న సాయిరాంపురం వెళ్లే సింగిల్ తారురోడ్డు మీదకు వచ్చేటప్పటికి. సరిగ్గా అక్కడకు కిలోమీటర్ దూరంలో ఉన్నది తన తల్లిదంఅడులు స్వర్గం అనుకునే ఆ ఊరు. పాతికేళ్ల క్రితం చనిపోయిన తన తాత కట్టించిన ఆ పాత నిట్టాడి పెంకుటిల్లే వాళ్లకు దేవేంద్ర భవనం. చాదస్తులు. మారుతున్న రోజుల్లో పిల్లల మాట విని వాళ్ల దగ్గర రాజభోగాలు అనుభవించకుండా ఏ వసతులూ లేని ఈ పల్లెటూరులో ఏడుస్తుంటారు కూపస్థ మండూకాల్లా. వాళ్లకు తను ఒక్కడే కొడుకు. అయినా మాట వినరు. దానికి తోడు రెండేళ్ల బట్టి తండ్రి అల్జీమర్స్‌తో బాధపడుతున్నాడు. ఆయనకూ అరవై దాటినయి.
ఇప్పుడు వాళ్లు దిల్లీ రాకపోవటానికి ముఖ్య కారణంగా ఆయన అనారోగ్యానే్న ఎత్తి చూపిస్తుంది తల్లి. ‘ఆయన చెప్పాపెట్టకుండా అంత మహానగరంలో ఇంట్లోంచి వెళ్లిపోతే పట్టుకోవటం ఎవరి వల్లవుతుంది. మన ఊళ్లో అయితే అంతా తెలిసిన వాళ్లే. ఈయన సంగతి తెలుసు. కనబడగానే దగ్గరుండి తీసుకువచ్చి ఇంట్లో దించి వెళతారు’ అంటూ. ‘మాకూ, నీకూ కూడా ఇదే హాయి’ అని ముక్తాయింపు.
చెరువు కట్ట పక్కనున్న తార్రోడ్డు మీదుగా వెళుతూ ఎడం వైపు అద్దంలో నుంచి చూస్తే నల్లటి కొండకు తెల్లటి అట్ట అంటించినట్లుగా కనబడుతోంది పానకాలస్వామి గుడి. తను అక్కడ మిద్దె దగ్గర హైస్కూల్లో చదువుకుంటున్నప్పుడు ఆ గుడికి ఎన్నిసార్లు వెళ్లాడో. చెరువు కట్ట మీద నుంచి చూస్తే ఏనుగు పడుకున్నట్లుగా ఉంటుంది ఆ కొండ.
ఎడంపక్క స్మశానంలో కట్టెలు పేరుస్తున్నారు. అంటే ఊళ్లో ఎవరో పోయారన్న మాట. ఐదొందల గడప వున్న ఆ ఊళ్లో తన చిన్నప్పుడు మూడు నాలుగు వేల మంది ఉండేవాళ్లు. ఏ పండగొచ్చినా ఎంత హడావుడో. ముఖ్యంగా సంక్రాంతి, దసరాలప్పుడు. క్రితంసారి వచ్చి నాలుగు రోజులు ఉన్నప్పుడు గమనించాడు ఊరంతా నీళ్లు లేక ఎండిపోయిన సెలయేరులా కళావిహీనంగా వున్నది. అయినా అమ్మానాన్నా మాత్రం దీన్ని విడిచిపెట్టరు. గ్రామాల్లో పిల్లలు చదువుకుని పట్నాలకు, విదేశాలకూ వలస వెళ్లిపోతుంటే చాలావరకు పెద్దవాళ్లు మిగులుతున్నారు. ఆ పరిసరాలకు అలవాటుపడ్డ తమకు అదే తృప్తి అన్నట్లుగా.
ఇప్పుడు ఏ ముసలాయన కాలం చేశాడో.
మర్రిచెట్టు దగ్గరకు వచ్చాడు. ఆ పచ్చదనం ఏది. ఆ రోజుల్లో పది మందికి నీడనిచ్చే ఆ నిండుతనం ఏది. దాని క్రిందగా వున్న సున్నపు గానుగను ఇప్పుడు ఎవరు ఉపయోగిస్తున్నారు. గానుగరాయి చెట్టుపక్కన దీనంగా పడి వున్నది.
ముందుకెళ్లి వీధి మలుపుతిరుగుతూనే తన ఇంటి వైపు చూసిన చంద్రశేఖరం ఉలిక్కిపడ్డాడు. వాకిట్లో వేసి వున్న షామియానా కనబడింది. పదిమంది దాకా ఎవరో దాని క్రింద నిల్చుని మాట్లాడుకుంటున్నారు... వస్తున్న తన కారును చూస్తూనే వాళ్లల్లో కదలిక..
అనారోగ్యంతో ఉన్న నాన్నకు ఏమీ కాలేదు కదా... చెరువుకట్ట పక్కగా స్మశానంలో పేరుస్తున్న కట్టెలు గుర్తుకురాగా గుండె గుభేలుమన్నది. షామియానా ముందు కారు ఆపించి వడివడిగా లోపలకు నడిచాడు.
తల్లి తులశమ్మ దిగులు ముఖంతో ఎదురు వచ్చి కొడుకును చూస్తూనే చేయి పట్టుకుంటూ, ‘లచ్చుమ్మ పోయిందిరా!’ అన్నది.
ఆ మాట వింటూనే చంద్రశేఖరం మనసు ఒక్కసారిగా తేలిక పడింది. ఆదుర్దా తగ్గగా వరండాలోకి వచ్చాడు. అక్కడ కిటికీకి పక్కగా నేల మీద పొడుగ్గా, పీలగా వున్న ఎనభై సంవత్సరాల లచ్చుమ్మ విగత దేహాన్ని చూస్తూ నిల్చున్నాడు ఓ నిమిషంపాటు.
సొట్టలు పడ్డ బుగ్గలతో, తెల్లబడి, ఎండిపోయి వున్న చింపిరి జుట్టుతో గుజ్జు పిండేసిన మామిడిటెంకలా వున్నది ఆ ముసలి లచ్చుమ్మ ముఖం. శవాన్ని కొద్ది దూరంలో తలుపు పక్కగా చేతులున్న తన తాతకాలంనాటి పాత చెక్క కుర్చీలో కూర్చుని ఉన్నాడు తండ్రి శ్రీనివాసమూర్తి. రెండు సంవత్సరాల తరువాత వచ్చిన ఒక్కగానొక్క కొడుకును చూసినా ఆయనలో ఎలాంటి స్పందనా లేదు. అలాంటి ఆయనతో ఏం మాట్లాడాలో అర్థం కానట్లుగా లోపలకు వెళ్లిపోయాడు విసురుగా చంద్రశేఖరం.
వెనగ్గా వచ్చిన తల్లి వంక చికాగ్గా చూస్తూ ‘ఎప్పుడు పోయింది?’ అడిగాడు.
‘తెల్లవారుజామున నాలుగు గంటలప్పుడు... ఎలాగూ వస్తున్నావు గదా అని ఫోన్ చేసి చెప్పలేదు!’
‘దాని శవానికి వరండాలో తప్ప చోటు దొరకలేదా... వాకిట్లో బాదంచెట్టు కింద ఓ పాత చాపేసి పడుకోబెట్టాల్సింది!’ అన్నాడు ముఖమంతా వికారంగా పెట్టి గొణుగుతున్నట్లుగా.
‘అరవైయేళ్లకుపైగా ఈ ఇంటి మనిషిలా మెలిగిందిరా!’ అన్నది తల్లి అతడి మాట తీరుకు విచలిత అవుతూ.
‘ఎనే్నళ్లు ఈ ఇంట వున్నా పని మనిషి పనిమనిషే... ఇంటి మనిషి ఎలా అవుతుంది?’ గొంతు పెంచి అన్నాడు.
తల్లి అతడి మాటలకు బిత్తరపోయింది. కొడుకు అలా మాట్లాడతాడని ఆమె ఊహించలేదు.
లచ్చుమ్మ తను ఈ ఇంటి కోడలిగా రాక ముందు నుంచీ ఈ ఇంట ఇంట్లో మనిషి లాగానే వున్నది. రోజంతా ఆ ఇంట్లో వాళ్లకు సేవ చేస్తూనే జీవితాన్ని గడిపింది. దానికి పెళ్లెందుకు కాలేదో, ఒకవేళ అయినా మొగడనేవాడు చచ్చాడో, దీన్ని వదిలేసి వెళ్లాడో ఎవరికీ తెలియదు. ఎప్పుడన్నా ఆ మాట ఎత్తినా చిరునవ్వుతో కూడిన వౌనమే దాని సమాధానం.
పెళ్లయిన సంవత్సరానికి తొమ్మిది నెలలు మోసి వీడిని కన్నది తనే అయినా పెంచిందంతా లచ్చుమ్మే!
ఆమె తమ బంధువా అంటే కాదు. తన మామగారు ఎక్కడో అనాథగా దిక్కులేక పడి వున్న దాన్ని తీసుకువచ్చి తనింట్లో పనిమనిషిగా పెట్టుకున్నాడుట తనకూ భార్యకూ, కొడుక్కూ సేవ చేసేందుకు. తన సమయమంతా పొలాల్లోనూ, తోటల్లోనూ గడుపుతుంటే, ఇంట భార్యకు తోడుగా ఉంటుందని.
శ్రీరాములు బాబాయి వచ్చాడు. ‘ఏమ్మా! ఇంకా శవాన్ని బయల్దేరదీద్దామా... ఎండెక్కుతున్నది.. మన వీధిలో ఎవరింట్లోనూ ఇంకా పొయ్యిలో పిల్లి కదల్లేదు... సమయానికి అనుకోకుండా అబ్బాయి కూడా రావటం తృప్తిగా వున్నది!’
ఆయన పక్కింట్లోనే ఉంటాడు.. ఆయనదీ, వీళ్లదే ఒకే కులం కాకపోయినా ఎంతో కాలంగా పక్కపక్క ఇళ్లల్లో వుంటూ ఎంతో ఆత్మీయంగా ఉంటున్నారు. వీళ్ల పొలాలు ఆయనే కౌలుకు చేస్తుంటాడు. ఆయనకు పిల్లలు లేరు. వీళ్ల సుఖాలు, దుఃఖాలే ఆ దంపతుల సుఖదుఃఖాల్లా ఆ ఇంటితో కలిసిపోయారు. ఆయన ఊళ్లో అందరికీ బాబాయే.
‘అలాగే’ అన్నట్లుగా తల ఊపింది ఆమె. ‘ఆయనకు స్నానం చేయించి తీసుకు వెళితే తల కొరివి పెడతారు!’
ఓ పనిమనిషికి అంత ప్రాముఖ్యత ఇవ్వటం చంద్రశేఖరానికి ఏ మాత్రం ఇష్టం లేకపోతోంది.
‘అనారోగ్యంతో వున్న ఆయనెందుకు బాబాయ్! బయట వాళ్లెవరన్నా ఆ పని చేస్తారేమో కనుక్కో!’ చికాగ్గా అన్నాడు చంద్రశేఖరం.
‘అదేంటిరా అలా అంటావ్! ఆ మనిషి మీ ఇంటి మనిషి కాదా... నినే్న కాదు, మీ నాన్ననూ ఎత్తుకు పెంచిన ఆమెకు ఆయనగాక మరెవరు అంత్యక్రియలు చేస్తారురా!’ అన్నాడు ఆయన తలెత్తి వింతగా అతడిని చూస్తూ.
‘లేవలేని ఆయన్తో ఆ పని చేయించటం సబబా బాబాయ్!’ అన్నాడు అసహనంగా.
‘అయితే నేను చేస్తానులేరా!’ ఆయన కోపంగా వెనక్కు తిరిగాడు.
తులశమ్మ వెంటనే అన్నది ‘అలా కాదులే బాబాయ్... ఆయనే్న చేయనీయ్... పక్కన నువ్వుంటావుగా ఇబ్బందేమున్నది!’
తన మాట చెల్లదని అర్థమయిపోయింది చంద్రశేఖరానికి. పక్కనున్న బెడ్‌రూంలోకి విసురుగా వెళ్లిపోయాడు.
‘నువ్వు కానిచ్చేయ్ బాబాయ్... వాడి కోపం ఎంతసేపు.. నేను సముదాయిస్తాలే...’ అంటూనే ఆమె కూడా స్నానం చేసి ఆ శవానికి ఇంట్లో శాస్తర్రీత్యా చేసే క్రియలప్పుడు భర్త పక్కనే ఉండటానికి తయారయ్యేందుకు వెళ్లింది.
చదువులు, సంపాదనలే కాదు మనుషులకు కావాల్సింది మమతలూ, మానవత్వాలూను...
ఇంటికి పదడుగుల దూరంలో వున్న స్కూలుకు కూడా వీడిని నడవనిచ్చేది కాదు.. పుస్తకాల సంచీ భుజాన వేసుకుని, తను ఎంత వద్దన్నా వినకుండా ఎత్తుకుని తీసుకు వెళ్లేది.
‘ఎంత దూరమనే నడవనీయ్.. మరీ గారాబం చేస్తే ఎట్లా?’ తను అరిచేది.
‘ఎంత దూరమయినా కానీయమ్మా... లేత పాదాలు కందిపోవూ!’ అంటూ నవ్వుతూ వాడి పాదాన్ని ఎత్తి అరికాల్లో ముద్దుపెట్టుకునేది.
అది తనని ఎలా పెంచిందీ గుర్తుకు తెచ్చుకునే అవసరం ఈనాడు వాడికి లేదు... పెద్దవాడయ్యాడు. రెండు చేతులా సంపాదిస్తున్నాడు... ఇప్పుడు వాడికి కన్న తల్లిదండ్రులే సరిగ్గా గుర్తుకు రావటంలేదు.. ఇంకా లచ్చుమ్మేం గుర్తుకు వస్తుంది...
తరువాత గంటకు లచ్చుమ్మ శవం ఏడుకట్ల సవారీ మీద అంతిమ యాత్రకు బయల్దేరుతుండగా శ్రీరాములు వెళ్లి పిలవటంతో ముఖాన్ని చిటపటలాడిస్తూనే తప్పక బయటకు వచ్చి, నలుగురు మనుషులు తమ భుజాలకు ఎత్తుకుంటున్న ఆ విగత శరీరం వంక ఒకసారి చూచి మళ్లా లోపలకు వెళ్లిపోయాడు. ‘వీళ్లను ఈ ప్రపంచంలో ఎవరూ బాగు చేయలేరన్నట్లుగా’ నసుక్కుంటూ.
శ్రీనివాసమూర్తి తడి గుడ్డలతో అటిక పట్టుకుని ముందు నడుస్తుండగా ఆయన చేయి పట్టుకుని పక్కన నడిచాడు శ్రీరాములు.

* * *
శవాన్ని అటు తీసుకువెళ్లగానే దొడ్లో షామియానా క్రింద శ్రీరాములు భార్య మరో ఇద్దరిని సాయంగా తీసుకుని అంత్యక్రియలకు వెళ్లిన వాళ్లు తిరిగి రాగానే భోజనాలు పెట్టటానికి వంటలు చేయసాగింది.
లోపల తులశమ్మ హడావిడిగా చిన్న గినె్నతో అన్నం ఉడకేసి కొడుకును భోజనానికి పిలిచింది.
‘నేను భోజనం చేసి బయల్దేరతాను!’ అన్నాడు మొదటి ముద్ద నోట్లో పెట్టుకుంటూ చంద్రశేఖరం.
‘అదేమిటి... పెద్ద కర్మ అయిందాకా ఉండవా?’
‘ఇంకా నయం.. దాని అస్తికలు తీసుకెళ్లి కాశీలో కలిపి రమ్మనలేదు.. మీలాగా నేనేం పనీపాటా లేకుండా కూర్చోలేదు... ఒక్కరోజు ఆఫీసుకు వెళ్లకపోతే అక్కడ అంతా అతలాకుతలం అయిపోతుంది... పదకొండు రోజులు ఇక్కడ ఉండటం అంటే నా వల్ల అయ్యే పని కాదు!’
ఇప్పుడు పదకొండు రోజుల దాకా ఎవరాగుతున్నారురా... నువ్వు నయం మన దేశంలోనే ఉన్నావ్... విదేశాల నుంచి వచ్చిన పిల్లలు ఐదో రోజు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి విమానం ఎక్కేస్తున్నారు... మనమూ అయిదో రోజునే చేద్దాంలే!’
‘నన్ను ఇబ్బంది పెట్టొద్దమ్మా... నాన్నను రంగంలోకి దింపావుగా. ఆయన చేతే చేయించేయ్ మిగతావి కూడా.. కాశీలు, రామేశ్వరాలు పెట్టబోకు... మన ఊరి పక్కన పంట కాలువలో వున్నది కృష్ణనీరేగా. అందులో
నిమజ్జనం చేయించు అంతగా చేయించాలనుకుంటే!’ కాస్తంత ఎగతాళిగా అన్నాడు. ‘లేనిపోనివి నెత్తినేసుకోవటం అంటే ఇదే.. ఇంటి యజమాని పనిమనిషికి అంత్యక్రియలు జరపటమేమిటి?’
‘లచ్చుమ్మ మన ఊళ్లో దానికున్న అరెకరం పొలం నీ పేర రాయించింది కరణంగారిచేత!’ అన్నది తలవంచుకుని.
ఉలిక్కిపడ్డట్లుగా తలెత్తాడు. ‘నాకెందుకు దాని పొలం?’ అన్నాడు నుదురు ముడివేస్తూ.
‘దగ్గరలోకి రాజధాని వచ్చింది గదా... ఆ అరెకరం కోటి రూపాయలు చేస్తుంది ఇప్పుడు.. నువ్వేం చేసుకుంటావో నీ యిష్టం.. అమ్ముకుంటావో, కౌలుకిచ్చుకుంటావో!’ ముఖం పక్కకు తిప్పుకుని అన్నది. పెంచి పెద్ద చేసిన ఆమెను గౌరవించటం తెలియని వాళ్లకు ఇవ్వటమే దండగ అనుకుంటూ, ‘అది పొలం ఇచ్చిందని చెప్పటం లేదు... నువ్వు పెద్ద కర్మ అయిందాకా వుంటే తృప్తిగా ఉంటుంది!... లచ్చుమ్మ ఆత్మ సంతోషిస్తుంది!’ అన్నది నీరసంగా మరోసారి.
‘నాకు కాలం ఎంతో విలువైందమ్మా... నేనయితే అది చచ్చిందని నువ్వు చేస్తున్న హడావిడి చూసి రాగానే వెళ్లిపోదామనుకున్నాను... నా అవసరం దిల్లీలో ఇంట్లోనే కాదు, ఆఫీసులోనూ ఎంతుందో నీకు తెలియదు. హైదరాబాద్ దాకా వచ్చాను గదా రెండేళ్లయింది మిమ్మల్ని చూసి, ఒక్కరోజు ఉండి వెళ్దామని వచ్చాను గాని ఇంట్లో పని మనిషి చస్తే పెద్ద కర్మ అయిందాకా ఉండమంటావని అనుకోలేదు... ముందు తెలిస్తే అసలు వచ్చేవాడినే కాదు!’
కొడుకు మాటలకు ఆమె నిర్విర్ణురాలైంది.
‘అక్కడ లత పిల్లలు నేను ఒక్కరోజు లేకపోయినా ఎంత ఒంటరితనం ఫీలవుతారో నీకు తెలియదు!’
‘కన్న తల్లిదండ్రులకు మాత్రం అలాంటి ఒంటరితనం ఉండదా?’ అనాలని నోటిదాకా వచ్చింది గాని రాకరాక వచ్చినవాడు మనసు ఎక్కడ కష్టపెట్టుకుంటాడో నన్నట్లుగా ఆ మాటల్ని గొంతులోనే దిగమింగేసుకున్నది.
ఇంత వయస్సు వచ్చి లోకంలోని విజ్ఞానాన్ని పుణికి పుచ్చుకున్న తన కొడుక్కు తాతగారికి, లచ్చుమ్మకు ఉన్న బాంధవ్యంలోని విలువల్ని ఎలా విడమర్చి చెప్పాలో అర్థం కాలేదు.
సహజీవనమనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. మానవుడు పుట్టినప్పటినుండీ వున్నదే. కొందరు నేటికాలపు యువతీ యువకులు చేతిలో అవసరానికి మించిన డబ్బులు అల్లల్లాడుతుండగా అదేదో పెద్ద ఘనకార్యం అన్నట్లుగా సహజీవనం ఏర్పర్చుకోవటం, మోజు తీరగానే విడిపోవటం, ఆ అనైతిక బాంధవ్యాలకు జీవమెక్కడున్నది?
నలభై సంవత్సరాల వయసులోనే భార్య పోయిన తన మామగారు, లచ్చుమ్మ లాంటి వాళ్లు గుంభనంగా జరిపిన సహజీవనంలో వున్న ఆత్మీయత, ఆప్యాయత వీళ్లకేం తెలుసు?
పెట్టె పట్టుకుని కనీసం తండ్రి వచ్చిందాకా కూడా ఉండటానికి ప్రయత్నించకుండా వెళుతున్న కొడుకు వైపు శూన్యంలోకి చూస్తున్నట్లుగా చూస్తూ ఉండిపోయింది తులశమ్మ కళ్లు తడుస్తుండగా.

పి.ఎస్.నారాయణ.. 9959808862