Others

కొరాపుట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూర్ణిమకు కొరాపుట్ ఎప్పుడొస్తుందాని వుంది. ఆమె కొరాపుట్ మీదుగా వెళ్లే హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నది. రైలు మామూలు వేగంతోనే వెళ్తున్నా, ఎందుకో నెమ్మదిగా వెళ్తున్నట్టుగా తోచిందామెకి. ప్రశాంత్ ఆమెకు రాయగడ స్టేషన్ రాగానే మేలుకో, అక్కడ నుంచి, బయట ప్రకృతి దృశ్యాలు బాగుంటాయి, నువ్వు తప్పక చూడాలి అని చెప్పాడు. దారి కొండలూ, అడవులతో వుంది రెండువైపులా, ఆకాశ పర్యంతం. సొరంగాల లోంచి ప్రయాణం, వింతగా వుంది. రాయగడ రావడానికి ముందరే ఆమె లేచింది. గాజు కిటికీ లోంచి బయటకు చూసింది. మబ్బుగా వున్న నింగిలో కాసేపట్లో వేకువ కాబోతున్న దృశ్యం మనోహరంగా కన్పించింది. చాలామంది ప్రయాణికులు పడుకుని వున్నారు. కానీ ఆమె ఎప్పట్నుంచో మెళకువగానే వున్నది.
ఆమె కొంతకాలంగా కొరాపుట్‌కు వెళ్లాలి అనుకుంటున్నది కానీ వీలు చిక్కలేదు. ఇప్పుడు ప్రశాంత్ ఉద్యోగ రీత్యా ఇక్కడ పోస్టింగ్ రావడం వలన, ఇలా వెళ్లడం సాధ్యపడ్డది. ఆమెకు తనతో పెళ్లి నిశ్చయం అయింది. వారిమధ్య ప్రేమ ఇందుకు కారణం కాగా, వారి తల్లిదండ్రులు అంగీకరించారు. త్వరలో పెళ్లి. ప్రశాంత్ ఒడిశా స్టేట్ గవర్నమెంట్‌లో గ్రూప్ వన్ అధికారి, తనకి కొరాపుట్‌లో మూడేళ్ల కిందట పోస్టింగ్ వచ్చింది. కానీ తాను జయపూర్‌లో నివాసం వుంటున్నాడు, అందువలన కొరాపుట్ స్టేషన్ నుంచి కారు ద్వారా తీసుకువెళ్తానని చెప్పాడు. ప్రశాంత్ ఆమెకి ప్రయాణం ఎలా చేయాలన్నది ఒక డజను సార్లయినా చెప్పాడు. దాంతో ఆమెకు విసుగొచ్చింది. ఆమె ఫోన్‌లో కొరాపుట్ ఏమీ కాశ్మీర్ కాదుకదా, ఎందుకంత భయం తన భద్రతపట్ల? అని అడిగింది కూడా. ఫోన్‌లో ప్రశాంత్ కొరాపుట్ గురించి పరిసరాల గురించి చాలా చెప్పాడు. జయపూర్ కొరాపుట్ నుంచి ఇరవై రెండు కి.మీ. ఎడమవేపుకు ప్రయాణిస్తే సునబెడా కూడా అంతే దూరం. అక్కడ నుంచి పతంగి కూడా ఇరవై రెండు కి.మీ. ఏమిటీ ఇరవై రెండు విశేషం అడిగింది తను. పూర్వకాలంలో రాజులు ఏనుగుపై సవారీ వెళ్లేవారు, ఏనుగు రోజుకు ఇరవై రెండు కి.మీ ప్రయాణం చేయగలదు. రాత్రి కాగానే రాజు విశ్రాంతి కోసం ఆగేవారు. అలా ఈ జనావాసాలు ఏనుగు ఒకరోజుకు నడిచే దూరంలో ఏర్పడ్డాయి. అవే ఇప్పుడు పట్నాలుగా మారాయని వివరించాడు ప్రశాంత్.
పూర్ణిమ రైలు కిటికీ లోంచి కనిపిస్తున్న ప్రకృతి అందాలను చూస్తున్నది.. కొండల వరుస పైనంతా ఆకుపచ్చగా, అటుపై మబ్బులతో నిండి ప్రశాంతంగా వున్న ఆ ప్రాంత సహజ సౌందర్యం ఆమెనెంతగానో ఆకట్టుకున్నది. కాశ్మీర్ లాగా ఉందా అని అబ్బురపడ్డది.
కొరాపుట్ వచ్చేస్తున్నది, ప్రయాణికులు లేచి దిగడానికి సర్దుకుంటున్నారు. ఆమె కూడా దిగేందుకు సిద్ధమైంది. తల సరిచేసుకుని, ఒకసారి మొగం అద్దలో చూసుకున్నది. వాన పడుతూనే వుంది. స్టేషన్ చిన్నదిగా, అదేదో ఇంగ్లీషు నవలలో చెప్పిన రీతిన చూడముచ్చటగా వున్నది. ఆమె దిగి ప్రశాంత్ కోసం చూసింది. ఒక యువకుడు దగ్గరగా వచ్చి అడిగాడు మీరు పూర్ణిమ మేడమ్‌గారా! పూర్ణిమ పలకరింపుగా నవ్వి ‘‘ప్రశాంత్ బిజీగా వుండి రాలేకపోయారా ఏమిటి?’’ అడిగింది. రాలేదు. టాక్సీ పంపించారు మీ కోసం రండి. పూర్ణిమ తన చేతి సూట్‌కేసు అతనికిచ్చి వెనుకే వెళ్లింది. బయట నిలబడి వున్న తెల్లని కార్లో కూచోపెట్టారు. నా పేరు నాగేశ్వరరావు అన్నాడతను ముందు సీటులో కూచుంటూ. కారు బయలుదేరింది. వాన పడుతూనే వున్నది. కారు కొరాపుట్ దాటాక అరగంట తర్వాత ప్రశాంత్ ఫోన్ మోగింది. ఆమె ఫోన్‌లో ప్రశాంత్ నెంబర్ చూసి గుడ్‌మార్నింగ్. నేను కారులో వున్నాను. రైలు సరిగా సమయానికి వచ్చింది. నాగేశ్వర్ నన్ను రిసీవ్ చేసుకుని కారులో తీసుకొస్తున్నారు. ఇబ్బంది ఏమీ లేదని తెలిపింది.
ఒకింత ఆందోళన ధ్వనిస్తున్న గొంతుతో ప్రశాంత్, నాగేశ్వర్ ఎవరు? నా కారు దారి మధ్యలో రిపేరు వచ్చి ఆగిపోతే, నేను రావడానికి అరగంట ఆలస్యమైంది. నేను స్టేషన్‌లో వున్నాను నీ కోసం. నువ్వెక్కడున్నావు? ఆమె జవాబు చెప్పే లోపలే, నాగేశ్వర్ ఆమె చేతిలోంచి ఫోన్ లాగేస్కుని, సారీ మిమ్మల్ని ఫోన్‌లో మాట్లాడనివ్వలేను అన్నాడు. కానీ మీరు ప్రశాంత్ నన్ను తీసుకురమ్మన్నాడని చెప్పారుకదా- లేదు. మేము మిమ్మల్ని కిడ్నాప్ చేసాం. కిడ్నాపా? పూర్ణిమను నాగేశ్వర్‌లో వచ్చిన మార్పు కలవరపెట్టింది. కానీ మీరు చెప్పింది మా మనిషి ఆ కారులో వున్నాడు. తనకి ఆ జీపు స్టేషన్‌కి రావడం ఆలస్యం చెయమని చెప్పాము. ఇక మీరు నన్ను ఏ ప్రశ్నలూ అడగకండి. మీరీ ప్రశ్నలన్నీ కాసేపట్లో కలువబోయే సిమాంచల్‌ను అడగవచ్చును.
పూర్ణిమ కారు ఆపమన్నది. నేను మీతో రాను. ఇలా మీరు నన్ను తీసుకెళ్లలేరు. నాగేశ్వర్ ఆమె వేపు ఎర్రని కళ్లతో, జేవురించిన మొగంతో చూసాడు. ఇలా మీరు అరిస్తే మిమ్మల్ని చంపేయాల్సి వుంటుంది. నిశ్శబ్దంగా వుండండి, లేదా ఏం జరిగినా దానికి బాధ్యులు మీరే. పూర్ణిమ భయంతో ఏడవసాగింది. ఆమె తనకిలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఎన్నడూ అనుకోలేదు. ఆమెకు కొరాపుట్‌లో నక్సల్ సమస్య వున్నదని తెలుసు కానీ, తానే ఇలా ఎదుర్కోవలసి వస్తుందని తలపోయలేదు. ఇంతవరకూ కొరాపుట్ ప్రయాణంలో ఆమె ఆనందిస్తూ వచ్చింది. ఒక్క నిమిషంలో అంతా తారుమారైంది. కారు తన ప్రమాదకరమైన ప్రయాణం చేస్తూనే వున్నది. కాసేపటికి ఒక మట్టి రోడ్డులోకి, అలా అడవివేపు కారు తిరిగింది. తనెక్కడ వున్నానో ఆమెకు తెలీదు. చుట్టుపక్కల అన్నీ పెద్ద పెద్ద చెట్లే. ఆమెకు ఇక తన పని ముగిసినట్టే అనిపించింది. ఈ తెగించినవాళ్లు ఇక ఇక్కడ తనను తప్పకుండా చంపేస్తారని తోచింది.
మీరు చూడచక్కగా వున్నారు. అందువలన గుర్తుపట్టడం కష్టం కాలేదు. మేము ప్రశాంత్ దగ్గర మీ ఫొటో కూడా చూసాం. ఎంత నాగరికత లేకుండా మాట్లాడుతున్నాడు అనిపించిందామెకు. అతని ఉద్దేశం ఏమిటో అర్థంకాక, కిటికీ లోంచి కదలిపోతున్న చెట్లను చూస్తూ పూర్ణిమ ఒక బొమ్మలా కూచున్నది. ఇలా మనుషుల్ని ఎత్తుకపోవడం గురించి ఆమె విన్నది, సినిమాల్లో చూసింది కానీ అవన్నీ ఎంచక్కా తన ఇంటి భద్రతలోంచి చూడ్డమే తప్ప ఇలా ప్రత్యక్షంగా అనుభవానికి రాలేదు.
భయమేస్తున్నదామెకు. భయం వలనేమో ఆమెకు కారు బయటకు వెళ్లాల్సినట్టు తోచింది. అడిగింది నాగేశ్వర్‌ని- కారు ఆపితే తను బాత్రూమ్‌కి వెళ్లాలని. కారు ఆగింది. కానీ అదొక ఆరుబయలు ప్రదేశం. ఇద్దరు మొగాళ్లు కారులో వున్నారు. వారి కంటపడకుండా ఎలా? ‘ఇక్కడ కాదు’ అందామె చిరాగ్గా. ‘‘ఏమిటి కొరత? ఇక్కడి ఆడవాళ్లెందరో ఇలా ఆరుబయలులోనే కానిస్తారు. మీరెందుకు చేయలేరు?’’ అడిగిన తీరు ఆమెకు మరింత ఒళ్లు మండేలా చేసింది. అలా అయితే లోపలే కూచోండి. మనకు ఎక్కువ సమయం లేదు. ఆమె కారులో వెళ్లి కూచున్నది. చాలా ఇబ్బందిగా వుంది. కానీ మరే మార్గం లేదు. ఈ ప్రభుత్వాలు నడిపేవారు చక్కగా భువనేశ్వర్‌లో కూచున్నారు వారి సుఖం చూసుకుంటూ, ఇక్కడ ప్రజలకు ఈ ఇబ్బందులన్నీ మామూలే! అన్నాడు నాగేశ్వర్. అతని మాటల్లో నిజం వుందనిపించిందామెకు. ఐతే తననెందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు వీళ్లు? పది నిమిషాల తర్వాత కారు ఒక ఊరి గుడిసెముందు ఆగింది. మేడమ్ మీరిక్కడ బయలుకి వెళ్లవచ్చు. ఇంతకన్నా మంచి చోటు ఇక్కడ వుండదన్నారు వాళ్లు. ఆమె వెళ్తుంటే వెనుక వారి నవ్వులు వినిపించాయి.
ఆమె వారిని పడరాని తిట్లన్నీ తిట్టుకుంది. కానీ బయటకి వస్తుండగా చూసింది- ఇద్దరూ తనను చూసి కాదు టేకు చెట్టుపైన ఆడుతున్న ఉడతను చూసి నవ్వుతున్నారని గ్రహించింది. ఆమెకు తన తల్లిదండ్రులూ, చిన్న తమ్ముడు లితు గుర్తొచ్చారు. ఈపాటికి ప్రశాంత్ వారికి ఇక్కడ జరిగిందేమిటో చెప్పే వుంటాడు. సాయంకాలానికల్లా ఇదంతా టీవీల్లో వస్తుంది. పేపర్లో సరేసరి. ఎందుకిలాంటి దురదృష్టంలో తాను చిక్కుకున్నానా అని తనని తానే నిందించుకున్నది. నాగేశ్వర్ ఆమెకు రెండు జామకాయలు, ఒక యాపిల్ ఇచ్చాడు. తను ఒక జామకాయను వుంచుకుని ఒకటి డ్రైవర్‌కి అందించాడు. పూర్ణిమకు వాటిని విసిరిపారేద్దామన్నంత కోపం వచ్చింది. కానీ ఆమెకి నాగేశ్వర్ ఎలా రియాక్టవుతాడో అని భయం కలిగింది.
కారు ముందుకి పోతూనే వుంది ఎక్కడకో తెలీకపోయినా. ఎక్కడున్నాం మనం? అడిగిందామె. ఒడిశాలో. అదే ఒడిశాలో ఎక్కడ? దాని గురించి మీరేమీ కంగారు పడనవసరం లేదు. మనం చేరాల్సిన చోటు పది నిమిషాల్లో వచ్చేస్తుంది. కొద్దిసేపట్లో వారొక కుగ్రామం చేరారు. ఒక గుడిసెలోనికి వెళ్లగా, అక్కడ ఒక యువకుడు, ఇద్దరు యువతులున్నారు. పూర్ణిమకు రూఢి అయింది వారు నక్సల్స్ అని. నాగేశ్వర్ వారి నాయకుడు అయినా సిమాంచల్ వీరందరికీ పెద్ద. మిమ్మల్ని కిడ్నాప్ చేయడానికి మాకు రెండు కారణాలున్నాయి. ఒకటి కిడ్నాప్‌వల్ల డబ్బు, రెండోది, అవినీతిపరుడైన ప్రశాంత్‌కు ఒక గుణపాఠం నేర్పడం అన్నాడు నాగేశ్వర్.
పూర్ణిమ అరిచిందతనిపై. అతన్ని అవినీతిపరుడనే ధైర్యమా మీకు? మీరే దొంగలు, బందిపోట్లు, తీవ్రవాదులు, పైపెచ్చు అబద్ధాలు, కపటం ద్వారా ఇతరులను మీరే తప్పుగా చిత్రిస్తుంటారు. అతనంత మంచివాడిని మీరెలా అవినీతిపరుడిగా మాట్లాడుతున్నారు, మీకు తెలుసా? తన డాక్టర్ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి, అది కూడా గాంధీ ఆదర్శాల మీద. ఆమాటలకు నవ్వేశాడు నాగేశ్వర్, ఆమె అమాయకురాలనే అర్థం తెలిసేలా. గాంధీయా? ఆ విషయం మర్చిపోవచ్చును. మీరీ ఇంట్లో ఉండవచ్చును. మాకు డబ్బు అందగానే మిమ్మల్ని మెయిన్ రోడ్డు దగ్గర్లో దించేస్తాము. మీరీ గ్రామంలో అటూ ఇటూ తిరగవచ్చు కూడా. కానీ మమ్మల్ని మోసం చేయాలని ప్రయత్నం చేయవద్దు, దానికి ఫలితం తీవ్రంగా వుంటుంది అన్నాడు నాగేశ్వర్ స్పష్టంగా, కటువుగా.
మీరు నన్ను చంపేస్తారా? అడిగింది. ‘అవును’.
ఒకవేళ డబ్బు రాకపోతేనో? అప్పుడు కూడా చంపేస్తాము. రోజూ ఎందరో చనిపోతూ వుంటారు. అదొక సాధారణ విషయం.
పూర్ణిమకు భయంతో చెమటలు పోశాయి. వీళ్లకి చంపడం అంటే ఏమీ కాదు.
ఎంత డబ్బు అడిగారు? అది నేను మీకు చెప్పలేను.
నాగేశ్వర్ సంభాషణ అంతటితో ఆపుచేసాడు. ఆ ఇద్దరు యువతులను పిలిచాడు, వారికి కొన్ని జాగ్రత్తంలు చెప్పి వెళ్లిపోయాడు తన రైఫిల్ భుజాన తగిలించుకుంటూ.
ఇక ఆ గుడిసెలో మిగిలింది పూర్ణిమ. ఆమెతోపాటు ఇద్దరు యువతులే. ఆమె రెండు చేతుల్లో మొగం దాచుకుని ఏడ్వనారంభించింది. ఇక తనకు చావు తప్పదని ఆమెకు తోచింది. ఎందుకంటే ఇక్కడనుంచి ఈ గ్యాంగ్ సభ్యుల నుంచి తప్పించుకుపోవడం సాధ్యంకానిపని. వీళ్లు అడిగిన డబ్బు ఎంతో కూడా ఆమెకు తెలీదు. ఈవార్త విని ఆమె తల్లిదండ్రులెంతగా దిగ్భ్రాంతి చెందుతారో ఆమెకు తలచుకుంటేనే ఆందోళనగా వున్నది. తండ్రి గోడకు తల కొట్టుకుని ఏడిస్తే, ఇక తల్లి అయితే జగన్నాథస్వామిని తలుచుకుని సకల విధాలా ప్రార్థనలు చేస్తుంది. కాసేపు గుడిసెలో కూచుంటే ఆలోచనలు మళ్లుతాయని ఆమె ఆ గుడిసెలోకి వెళ్లింది. ఆ యువతులిద్దరూ కూడా ఆమె వెంటే లోపలికి అనుసరించారు. ఆ కుగ్రామపు మురికి, అశుభ్రత, ఆమెకు దిక్కు తోచనివ్వడంలేదు. దారి నిండా పేడ, కోసేసిన కోళ్ల ఈకలూ, గుడ్ల పెంకులూ చెల్లాచెదురుగా పడివున్నాయి. అక్కడే మూడు పందులు తిరుగాడుతున్నాయి బుదరలో ఏదన్నా తినడానికి వెదుక్కుంటూ. ఆమెకు రోత పుట్టి వాంతి వచ్చింది.
ఆమెకు దాహంగా అనిపించి ఆ యువతులకు సైగ చేసింది. వారిలో చిన్నది పరుగున వెళ్లి ఒక విరిగిపోయిన మగ్గులో నీళ్లు తెచ్చింది. ఇంతలో నాగేశ్వర్ గబుక్కున లోనికొచ్చి ఆ మగ్గు పక్కనపడేసి, ఆమెకు మినరల్ వాటర్ సీసా అందజేసాడు. ఊరంతా డయేరియాతో నిండివున్నది, ఈమెకు మనం ఏదన్నా ఇచ్చేటపుడు జాగ్రత్తగా వుండాలని ఆ యువతులపై కేకలేశాడు. అది చూసిన పూర్ణిమకు, ఈ నాగేశ్వర్ తాను అనుకున్నంత చెడ్డవాడు కాదేమో అనిపించింది. దగ్గర్లో ఒక మహిళ ఏడుస్తున్న శబ్దం. పందులు కోళ్లూ కలకలంగా పరిగెడుతున్నాయి. నాగేశ్వర్ ఆమెను గుడిసెలోనికి వెళ్లిపొమ్మని సూచించాడు.
ఇద్దరు యువతులు ఆమెకు తెలీని భాషలో మాట్లాడుకుంటున్నారు. ఏదో పరిణామం జరిగిందని ఆమె గ్రహించింది. దాంతోనే ఆమెకు ఆశ కూడా కలిగింది. పోలీసులు ఎవరినన్నా అరెస్టు చేసారా లేక వారి కస్టడీలో ఎవరన్నా చనిపోయారా ఏదో జరిగి వుండవచ్చు అని తోచిందామెకు. ఏమన్నా కానీ, వీరి పనులకు తగ్గట్టే జరిగి వుంటుందని కూడా ఆమె మనసులో అనిపించింది.
ఆమె అడిగింది ఆ ఇద్దరు కాపలా యువతుల్ని ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నారు వాళ్లు?
చిన్న యువతి తెలిపింది. నిన్న ఇద్దరు అమ్మాయిలు డయేరియా బారినపడ్డారు. వారిని ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు వారి తండ్రి, మామయ్య.
ఏ ఊర్లో ఆసుపత్రికి? అడిగింది పూర్ణిమ సహజంగా ఆదుర్దాగా. కానీ ఊరి పేరు చెప్పనియ్యకుండా, వయసులో పెద్దయిన కాపలా యువతి అడ్డుపడింది. ఊరి పేర్లు ఎందుకులెండి, ఇది మీ విషయం కాదు అని తోసిపుచ్చింది. వాళ్లింకా ఆసుపత్రినుంచి రాలేదు, ఇక్కడ తల్లి చనిపోయింది. అందుకే గ్రామస్తులు ఏడుస్తున్నారని చెప్పింది. పూర్ణిమ ఈ మారుమూల గ్రామాల్లో ఆటవిక గూడేల్లో జీవనం ఎంత దుర్భరంగా వుంటుందో చదివింది. అంటురోగాలవల్ల ఎలా వీరు ఎక్కువ సంఖ్యలో కన్నుమూస్తుంటారో కూడా ఆమెకు తెలుసు. ఆమెకు ఎప్పుడూ వీరి దురవస్థ గురించి మాట్లాడే తన స్నేహితురాలు సాధన గుర్తుకొచ్చింది. సాధన, వీరి జీవన స్థితిగతులపై డాక్టరేట్ చేస్తున్నది. ఆమె చెప్పగా విన్నప్పుడు ఇవే సంగతులు ఆమెకు విసుగ్గా తోచాయి. వీటికి బదులుగా ఆసక్తికరమైన వీరి సంస్కృతి, అలవాట్లు వారి ఆటపాటలూ గురించి చెప్పమని అప్పట్లో సాధనను అడిగింది కూడా.
ఒకతను చేత్తో కోడిపెట్టను పట్టుకుని తూలుతూ నడుస్తున్నాడు. తాగి వున్నాడేమో. చిన్న యువతి చెప్పింది- తాను ఆ కోడిపెట్టను దేవతకు బలివ్వడానికి తీసుకెళుతున్నాడని. ఈ మారుమూల ప్రాంతల జీవితపు కష్టాలు చుట్టూ వున్న ప్రకృతి అందాలను మించివుంటాయి. ఎక్కడా ఒక్క కాంక్రీటు భవనం లేదు. మూడు పక్కలా కొండలు, ఒక దిశగా ఒక మట్టిదారి అదే బహుశ బయట ప్రపంచానికి వెళ్లే సాధనం. విషయం మార్చి ఆమె కాస్త పెద్దగా వున్న ఆ కాపలా యువతిని అడిగింది. స్కూల్‌కు వెళ్లి చదువుకున్నావా? సమాధానం చిన్న పిల్ల చెప్పింది. తాను స్కూల్‌కు వెళ్లి చదువుకోవాలన్నా, తండ్రికి ఎక్కడ ఆ మాస్టారు ఈమెను ఎత్తుకుపోతాడో అని భయం. అందుకే స్కూల్‌కి పంపలేదు. ఇద్దరూ తమలో తాము నవ్వుకున్నారు కానీ పూర్ణిమ ఎందుకో వారితో తన మనస్థితివల్ల నవ్వు కలపలేకపోయింది.
ప్రశాంత్ ఆదర్శాలకి నిలబడేవాడు కనుక వీరు అడిగిన కిడ్నాప్ డబ్బు ముట్టజెప్పడు అనుకుంది. ఇక తన తల్లిదండ్రులకు తమ ఇల్లు అమ్మి ఈ డబ్బు తేవాలేమో, కానీ అందుకు అంత సమయం ఎక్కడ వున్నది? ఇదంతా చివరికి ఏమవుతుందో తెలీక ఆమెలో భయం పెరిగింది. ఇక్కడే తన బతుకు ముగిసిపోతుందేమో అన్న బెంగ ఏర్పడ్డది. తిరిగి గుడిసెలోనికి వచ్చారు. బయట మధ్యాహ్నం ఎండ మండిపోతున్నది. చిన్న దీపం వెలుగుతోంది లోపల. అందులో చమురు కూడా కాసేపట్లో అయిపోవచ్చు. లోపలంతా దోమలు జుమ్మంటున్నాయి. తన సంచి తలకింద పెట్టుకు పడుకున్నది ఒళ్లంతా అలసటగా అనిపించగా.
ఎవరో తలుపు తడుతున్న శబ్దం రాగా, గబుక్కున లేచింది. చీర సవరించుకున్నది. ఆమెకు చనిపోవాలని లేదు. ఆమెకు పెద్దగా ఏడవాలనిపించింది.
వారిలో పెద్ద యువతి లేచి తలుపు తీసింది. నాగేశ్వర్ మరొక యువకుడితో కలిసి లోనికొచ్చాడు. పూర్ణిమ వేపు చూస్తూ అన్నాడు పదండి, ఇక్కడ నుంచి వెళ్లిపోదాము. ఎక్కడికి అడిగిందామె. అది నేను మీకు చెప్పలేను. ముందు పదండి అన్నాడు ఒత్తిడి చేస్తూ. నాకు నడిచే ఓపిక లేదింక అన్నది ఆమె నీరసంగా. అలా అయితే నేను మిమ్మల్ని ఎత్తుకుని తీసుకువెళ్లాల్సి వుంటుంది అన్నాడతను పట్టుదలగా. ఇడియట్- తనలో తానే తిట్టుకుని ఆమె గత్యంతరం లేక వారిని అనుసరించి వెళ్లింది. ఒక గంటపాటు నడిచాక ఒక నది ఒడ్డుకు వచ్చారు. తాము ఎక్కడికి వెళ్తున్నదీ, ఏమీ తెలీడంలేదు.
ఒక పాతగిల్లిన పడవలో వాళ్ళు ఆమెను నది ఆవలవైపునకు తీసుకెళ్లారు. మళ్లా నడక మొదలైంది. ఆమె వారి వెంటే వెళ్లక తప్పని పరిస్థితి. పాదాలు ఇక నడవమని మొరాయిస్తున్నాయి. అంత దూరాన నల్లగా తారు రోడ్డు కనిపించింది. ఒక ట్రక్ వెళ్తున్న శబ్దం కూడా. నాగేశ్వర్ ఆమె వేపు తిరిగి కొంతదూరం నడిచాక రోడ్ వస్తుంది. అక్కడ మీరు వెయిట్ చేయండి. బిడివో జీప్ వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తారు అన్నారు. ఆమె తన చెవులను తానే నమ్మలేకపోయింది. ఆమె ఒకే క్షణంలో బరువు తీరినట్టూ, ఆనందంగానూ తోచింది. ఉదయం నుంచి పడ్డ పాట్లన్నీ మర్చిపోయింది. ఒకవేళ వెళ్తుంటే వెనుక నుంచి కాల్చేస్తారేమో అన్న భయం కలిగింది. నిజమా, నేనింక వెళ్లిపోవచ్చునా? అడిగింది సందేహం తీరనట్టుగా. అవును, మాకు కావలసిన సొమ్ము అందింది తెలిపాడతను. ఆమె ఒక్కసారిగా బరువు దిగిపోయినట్టుగా నిట్టూర్చింది. చల్లని గాలి తాకింది ఆమె మొగాన విసురుగా. అయినా ఆ గాలి సేద తీరుస్తున్నట్టే తోచింది ఆమెకు. నాగేశ్వర్ ఆమెకు ఒక టార్చలైట్ ఇచ్చాడు. రోడ్ చేరాక, ఈ టార్చ్ వెలిగించి ముమ్మారు కుడి పక్కగా ఊపండి. జీప్ వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తుంది. ఆమె ఆ టార్చ్ వెలిగించి అతని మొగంమీద వేయబోయింది. తనకూడా వచ్చిన యువకుడు, యువతితో కలిసి వెనక్కు వెళ్లిపోయాడు. తారు రోడ్ చేరటానికి ఆమెకు అరగంట పైగానే పట్టింది. అక్కడ ఒక్క క్షణం తన అలసట తగ్గేందుకు కూచుని, టార్చ్ వెలుగు కుడివేపునకు మూడుమాట్లు చూపింది. నిమిషాల్లో జీప్ వచ్చింది. ఆమెకు ఇంకా భయంగానే వున్నది. అప్పుడు ఆమెకు జీప్‌లో కూచుని వున్న ప్రశాంత్ కన్పించాడు. ఆమె పరుగున వెళ్లి తన భుజంపై తల వాల్చింది చిన్నపిల్లలా. ఇప్పుడిక ఏ భయం లేదు. సర్దుకో.. స్థిమితపడు, వాళ్ళు అసలు నీకే హానీ చేసి ఉండేవారు కారు అన్నాడు ప్రశాంత్. వాళ్ళు నన్ను చంపేస్తామన్నారు అందామె కంపిస్తున్న స్వరంతో. ఏంకాదు. వారికి కావలసిన సొమ్ము అయిదు లక్షలు తీసుకెళ్లారు. డబ్బే వారికి కావాలి తప్ప నీకు హాని చేయడం కాదు. అయిదు లక్షలా? అంత డబ్బు ఎలా వచ్చింది నీకు? ప్రశాంత్ జవాబివ్వలేదు. చెప్పు ప్రశాంత్, ఎక్కడనుంచి వచ్చింది అంత డబ్బు ఉన్నట్టుండి? వారికి కావాలసిన డబ్బు వారికి అందింది. ఆ విషయంలో నువ్వేమీ కంగారు పడకు. ఈ ఏరియాలో అడ్మినిస్ట్రేటర్లుగా పనిచేసే మేము ఒక్కొక్కరం పది కోట్ల విలువ చేస్తాము అన్నాడు ప్రశాంత్- ఒకింత అహమూ, అధికారమూ నిండిన స్వరంతో. వారు జీప్ ఎక్కారు, ముందుకు కదలి వెళ్తుండగా, పూర్ణిమకు ఎందుకో విచారంగా అనిపించింది. తాను ప్రశాంత్ నీతివంతుడు అని చెప్తుండగా, నాగేశ్వర్ నవ్విన నవ్వు మనసులో మెదిలింది. నాగేశ్వర్ చెప్పిందే కరెక్ట్. ఏం జరిగింది, ఎందుకలా వౌనంగా ఉన్నావు అడిగాడు ప్రశాంత్. పూర్ణిమ జవాబు చెప్పలేదు. వారి బందీగా ఉండిపోయినా బాగుండిపోయేది, కనీసం తనకు ప్రశాంత్ నిజస్వరూపం తెలుసుకునే అవసరం తప్పేది, అనుకుందామె.
*
-గౌర హరిదాస్ (ఒడియా మూలం)
*
- రామతీర్థ (తెలుగు సేత)

(ఇరవై రెండేళ్లుగా తెలుగు కథ రచయితలకు విజయనగరంలో చాగంటి తులసి నిర్వహణలో చాసో స్ఫూర్తి పురస్కారం ప్రదానం చేస్తున్నారు. ఈ ఏడాది తొలిసారిగా తెలుగేతర కథ సాహిత్యవేత్త, గౌర హరిదాస్, ఒరియా రచయితకు, జనవరి 17న ప్రదానం చేశారు.)