కథ

ఎంత పని చేశావే?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన రచన
....................................................................

‘ఎంత పని చేశావే? నీకసలు ఆ పాడు ఆలోచన ఎలా వచ్చిందే? అరచి కేకలు పెడితే ఎవరూ వచ్చేవారు కాదా? నీదే కాకుండా మా అందరి జీవితాలూ నాశనం చేసావు కదుటే! హంతకురాలి చెల్లెల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారే?’ - అంటూ కళ్లనీళ్లు పెట్టుకుంది అమ్మ.
‘ఫ్రెండ్సూ పార్టీలూ అంటూ రాత్రులు ఊరమ్మట తిరిగుండకపోతే ఇలా జరిగేదా? ఇప్పుడు నీ గతి ఏమిటి? ఆ పెళ్లివాళ్లకు నేను ఏం సమాధానం చెప్పను? వీధిలో ఎలా తల ఎత్తుకుని తిరగగలను?’ - విరుచుకుపడ్డాడు నాన్న.
అమ్మ, నాన్నల మాటలకు నిర్ఘాంతపోయాను నేను. కన్నవారి అనూహ్య స్పందన నన్ను విచలితురాలిని చేసింది. ఆపద నుండి వెంట్రుకవాసిలో తప్పించుకున్న కూతుర్ని... ఆ సందర్భంగా మరో ఆపదలో చిక్కుకున్న కూతుర్ని... కడుపులో పెట్టుకుని ఓదార్చవలసిన వారే... అలా నిష్ఠూరంగా, కఠినంగా మాట్లాడుతుంటే.. నా మది తిమ్మిరెక్కిపోయింది.
పోలీసుస్టేషన్ లాకప్‌లోంచి చూస్తూన్న నాకు - వాళ్లే కటకటాల వెనుక ఉన్నట్టు అనిపించింది. సమాజం, పిరికితనం, ఏళ్లు పైబడినా ఇసుమంతైనా మారని మనస్తత్వాలు.. అనే కటకటాలు!
‘నేను రాత్రులు పబ్‌లు పార్టీలు అంటూ విశృంఖలంగా బైట తిరగడం లేదు, నాన్నా! నా స్నేహితురాలి బర్త్‌డే పార్టీకి వెళ్లడం తప్పా? దారిలో ఎదురైన ఆపద నుండి నన్ను నేను రక్షించుకునే క్రమంలో ఓ మృగాన్ని చంపడం ఘోర నేరమా? పిరికితనంతో ప్రవర్తించి వాడి స్థానంలో నేను ఉంటే... మీరు హర్షించేవారా? అని గట్టిగా అరవాలనిపించింది నాకు. కాని, ఎదురుచూడని వారి తీరుతో అచేతనంగా మారిపోయిన నా మనసు, తనువు అందుకు సహకరించలేదు.
రాత్రంతా లాకప్‌లో మ్రగ్గుతూ ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు నా వాళ్లను చూస్తానా అని తపించిపోయాను. అమ్మ ఒళ్లో తల పెట్టుకుని మనోభారం తీరేంతవరకు తనివితీరా ఏడవాలనుకున్నాను. నాన్న చెప్పే స్వాంతన వచనాలతో వీగిపోతూన్న మనోధైర్యాన్ని పుంజుకోవాలనుకున్నాను. వారు నన్ను ఓదార్చి ధైర్యం చెబుతారనీ, ఆ విపత్కర స్థితిని ఎదుర్కొనేందుకు నాకు కొండంత బలాన్ని చేకూర్చుతారనీ ఆశించాను. కాని, ఇప్పుడు జరుగుతున్నదేమిటి? వారి పలుకులు ములుకుల్లా నా మదిలో గుచ్చుకుంటున్నాయి. నా మనోధైర్యంపైన దెబ్బ తీస్తున్నాయి. కుటుంబపు పరువు గురించి, నా చెల్లి పెళ్లి గురించీ ఆలోచిస్తున్నారే తప్ప.. నన్ను ఆ విషమ పరిస్థితి నుంచి ఎలా బైటపడవేయాలా అన్న ఆలోచన వారిలో మచ్చుకైనా కానరాకపోవడం.. నా దురదృష్టం కాక మరేమిటి?
అమ్మ, నాన్న ఇంకా ఏమేమిటో అంటున్నారు. అవేవీ నా బుర్రలోకి దూరడం లేదు. కారణం - నా మనసు గతమనే జారుడు బల్లను ఎప్పుడో ఎక్కేయడమే..
* * *
బి.టెక్ పాసై ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో టెక్నికల్ రైటర్‌గా ఉద్యోగం చేస్తున్నాను నేను. నెలకు ముప్పైవేల జీతం. యాభయ్యో పడిలో ఉన్న నాన్న ఓ బ్యాంక్ క్లర్క్. అమ్మ గృహిణి, చెల్లి, నేనే సంతానం. మా ఇద్దరికీ పదేళ్ల తేడా ఉంది. తానిప్పుడు నైన్త్‌క్లాస్ చదువుతోంది.. మా కంపెనీ ఉన్న కాంప్లెక్స్‌లోనే వివేక్ పని చేస్తూన్న ఎమ్మెన్సీ కూడా ఉంది. వివేక్ సంపన్న కుటుంబానికి చెందినవాడు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా నెలకు అరవై వేలు తెచ్చుకుంటున్నాడు. నాది అమ్మ పోలిక కావడంతో... కలువ కన్నులతో, అందంగా, కుందనపు బొమ్మలా ఉంటానంటారంతా. వివేక్ నన్ను ఎప్పుడో చూసి మనసు పారేసుకున్నాడట. నా గురించి తెలుసుకుని ఓ శుభదినాన పెద్దల్ని తీసుకుని మా ఇంటికి వచ్చాడు, నన్ను పెళ్లి చేసుకుంటానంటూ! నాకంటే రెండు మూడేళ్లు పెద్దవాడతను. హ్యాండ్సమ్‌గా ఉంటాడు.
నాకు పై సంబంధం చూస్తున్నట్టు తెలిసి పరిగెత్తుకు వచ్చింది అత్తయ్య. నాన్న చెల్లెలు. కొడుకుతో గ్రామంలో ఉంటుంది. భర్త లేడు. వాసు బావ నాకంటే ఏడాది పెద్దవాడు. చదువును పదో తరగతితోనే అటక ఎక్కించేసి, నాగలి చేతబట్టి అరక దున్నడం ఆరంభించాడు. మొదటి నుంచీ వ్యవసాయమంటే ఇష్టం తనకు. మావయ్య సంపాదించి పెట్టిన అయిదెకరాల పొలం ఉంది.
నాకు మేనరికం చేయమని అమ్మను, నాన్నను ఎంతగానో బ్రతిమాలింది అత్తయ్య. నాన్న వౌనం వహిస్తే.. అమ్మ కుండబద్దలు కొట్టేసింది - ‘ఇంజనీరింగ్ చదివి ఉద్యోగం చేస్తున్న పిల్లను... చదువులేని, అరక దున్నుకునేవాడికిచ్చి ఎలా చేస్తామనుకున్నావు?’ అంటూ.
అత్తయ్యను చూస్తే జాలివేసింది నాకు. బావ బాగానే ఉంటాడు. తానంటే నాకిష్టమే. కాని, అది పెళ్లి చేసుకునేంతటి ఇష్టం కాదు. అమ్మ చెప్పిందే రైటనిపించింది నాకు. మట్టి పిసుక్కునేవాణ్ణి నాలాంటి సాఫ్ట్‌వేర్ గాళ్ భర్తగా కలలో కూడా ఊహించుకోలేదు మరి!
‘నిన్ను నా కోడల్ని చేసుకుని కడుపులో పెట్టుకుని చూసుకోవాలనుకున్నానే, మల్లికా! కూతురు లేని లోటు తీర్చుకోవాలనుకున్నాను. రక్త సంబంధం బలపరచుకోవాలనుకున్నాను. ప్చ్! నాకు ప్రాప్తం లేదు’ అంటూ నా దగ్గర కళ్లనీళ్లు పెట్టుకుంది అత్తయ్య వెళ్లిపోతూ.
కొడుకులేని లోటు తెలియకుండా.. కొన్నాళ్లపాటు పెళ్లి వాయిదా వేసి, నా సంపాదనతో నాన్నకు తోడుగా ఉండాలనుకున్నాను నేను. కనీసం చెల్లి కాలేలజ్ చదువులకు వచ్చేంత వరకైనా. కాని, నా ఆలోచన ఫలించలేదు. వివేక్‌తో నా నిశ్చితార్థం జరిపించేశారు నాన్న.
నిశ్చితార్థానికి వచ్చారు అత్తయ్య, బావాను. ‘సారీ, మల్లీ! మనసుకే తప్ప బుర్రకు పని చెప్పదు అమ్మ. పిచ్చి సెంటిమెంటుతో నిన్ను నాకిచ్చి పెళ్లి చేయమంటూ మిమ్మల్నందరినీ ఇబ్బంది పెట్టినట్లుంది. అందుకు నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను’ అన్నాడు బావ, నాతో. ‘నువ్వంటే నాకు ప్రాణం కావచ్చును, మల్లీ! కాని, చదువుల సరస్వతివి నువ్వెక్కడా? మట్టిలో పనిచేసే నేనెక్కడా?? నేను నీతో జీవితం పంచుకోవాలనుకోవడం అత్యాశే కాదు, అవివేకం కూడాను!’ అన్నాడు మళ్లీ.
‘సారీ, బావా!’ అనడం మినహా, ఇంకేమనాలో తెలియలేదు నాకు.
నా పెళ్లికి ముహూర్తం కూడా నిర్ణయింపబడింది. ఇక రెండు నెలలే ఉంది.
ఆ రోజు - నా కొలీగూ, క్లోజ్‌ఫ్రెండూ నైన జయంతి పుట్టినరోజు. ఇంట్లోనే పార్టీ ఇచ్చింది. అంతా సరదాగా సందడిగా జరిగిపోయింది. ఆ వేడుక ముగిసేసరికి రాత్రి పదకొండు గంటలయిపోయింది. స్కూటర్ మీద ఇంటికి బైలుదేరాను నేను.
రోడ్లపైన ట్రాఫిక్ తగ్గిపోయింద. కొంత దూరం వెళ్లేసరికి హఠాత్తుగా ముగ్గురు యువకులు ఓ మోటార్ బైక్ మీద నన్ను ఓవర్‌టేక్ చేసి వచ్చి నాకు అడ్డుగా నిలిచారు. ముగ్గురూ తాగి ఉన్నారు. తప్పించుకుని వెళ్లిపోబోయాను నేను. వాళ్లు బైక్ దిగి, అసభ్యంగా మాట్లాడుతూ, నన్ను స్కూటర్ మీంచి కిందికి లాగారు. పేవ్‌మెంటు పక్కనున్న చెట్లలోకి లాక్కుపోయి అత్యాచారం జరపడానికి పూనుకున్నారు. అంతకు మునుపు పత్రికలలో చదివిన గ్యాంగ్ రేప్ సంఘటనలు మదిలో మెదలడంతో క్షణకాలం నా మెదడు మొద్దుబారిపోయింది. అరుస్తూంటే నా నోరు నొక్కేశారు. నా దుస్తులు చింపేశారు. నన్ను ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఒకడు. వాడి పశుబలం ముందు నా ప్రతిఘటన వీగిపోతూంటే దుఃఖం ముంచుకు వస్తోంది నాకు. ఎలాగో 100కి ఫోన్ చేద్దామంటే, అంతకు ముందే నా సెల్‌ని లాక్కుని దూరంగా విసిరేశారు వాళ్లు. గోళ్లతో రక్కాను. పళ్లతో కసిగా కొరికాను. నాపైన పడబోతూన్న మృగాన్ని మొలపైన బలంగా తన్నాను. వెనక్కి పడిపోయాడు. దాంతో నా ముఖం మీద బలంగా కొట్టాడు ఒకడు. మరొకడు నా వక్షం మీద పిడిగుద్దులు గుద్దాడు. మూడోవాడు నా పొత్తికడుపులో కాళ్లతో తన్నాడు. వారి నోటి నుండి వెలువడుతూన్న బూతులు వింటూంటే, చచ్చిపోవాలనిపించింది నాకు. నేను బాధతో అరుస్తూంటే మరింత పైశాచికంగా ప్రవర్తించారు వాళ్లు.
ఎక్కడ సంపాదించాడో, ఓ ఇనుప గొట్టం పట్టుకు వచ్చాడు ఒకడు. ‘నీ పొగరు అణుస్తానే’ అంటూ కసిగా తిడుతూ దాన్ని నాలో చొప్పించడానికి ప్రయత్నించాడు. భయం ఆవహించుకుంది నన్ను. ఆ భయం నుంచి తెగింపు పుట్టుకొచ్చింది. అంతటి బలం ఎలా వచ్చిందో నాకే తెలియదు. శక్తినంతా కూడదీసుకుని వాడి తొడల నడుమ రెండు కాళ్లతోనూ తన్నాను. వాడు వెనక్కి పడిపోయి గిలగిల కొట్టుకుంటూంటే, చివాలున లేచి నిలుచున్నాను. కింద పడ్డ ఇనుప గొట్టాన్ని అందుకుని వారిపైన దాడి చేశాను. కింద పడ్డవాడు లేవడానికి అవకాశం ఇవ్వకుండా ఆవేశంతో పిచ్చి పట్టిందానిలా ఆగకుండా వాడి తలపైన కొడుతూనే ఉన్నాను. వాడు అచేతనంగా నేలకు వొరిగి రక్తం ధారలై పారుతున్నప్పుడు కాని స్పృహలోకి రాలేదు నేను. మిగతా ఇద్దరూ బైక్ ఎక్కి ఎప్పుడో ఉడాయించేశారు.
ఆవేశం తగ్గాక గాని, జరిగిందేమిటో ఆకళింపు కాలేదు నాకు. వాడు చచ్చిపోయాడు! లేదు. వాణ్ణి చంపేశాను నేను!!... ఎక్కడ లేని నిస్సత్తువా కమ్ముకు రావడంతో నేలపైన కూలబడి ముఖం చేతుల్లో కప్పుకుని భోరుమన్నాను. అదిగో, అప్పుడే వినిపించింది - దూరంలో, పోలీస్ సైరన్!
* * *
‘రోజూ నువ్వు ఇంటికి తిరిగి వచ్చేదాకా నాకు భయంగానే ఉండేది..’ - అమ్మ ఏడ్పుతో ఆలోచనల సుడిగుండంలోంచి బైటపడ్డాను నేను. ‘ఆడపిల్లల తల్లులందరూ ఇంతేనేమో!’ అనిపించింది. ఆ భయమే స్ర్తిని నిర్వీర్యం చేస్తోంది. నిర్భీతితో ముందడుగు వేయడానికి నిరోధకమవుతోంది. అమ్మ, నాన్న తమ ధోరణిలో తాము మాట్లాడుతోంటే, వారి రాక నా దిగులును అధికం చేసిందే తప్ప ఉపశమనం కలిగించలేదు. నా మది ఒంటరితనాన్ని కోరుకోసాగింది. వాళ్లను వెళ్లిపొమ్మని చెప్పి వెనుదిరిగాను.
నా మదిలో సముద్ర ఘోష. ఎగసిపడుతూన్న ఆలోచనల సునామీ... ‘నేను ఓ మనిషిని హతమార్చడమే కనిపిస్తోంది అందరికీను. కాని, మూడు క్రూరమృగాలు నాపైన పడి నన్ను పెట్టిన చిత్రహింసలు వారి ఊహకు అందడం లేదు. నేను తిరగబడకుండా ఉంటే.. వారికి లొంగిపోయుంటే... నేను నా మాన ప్రాణాలను కోల్పోతే - అప్పుడు అందరూ జాలితో, ‘అయ్యో, పాపం!’ అంటూ విపరీతమైన సానుభూతి కురిపించేవారేమో! ఇప్పుడు ఆ ముష్కరుడు ఉన్న స్థానంలో నేనుంటే - సెంటిమెంటు పండించేవారేమో!... యుద్ధ్భూమిలో ఓ సైనికుడు శత్రువులను చీల్చి చెండాడితే - అతనికి గౌరవ పతకం లభిస్తుంది. విధి నిర్వహణలో పోలీసులు ఓ కరడుగట్టిన నేరస్ణుణ్ణి కాల్చి చంపితే - అది హీరోయిజమ్. నాగరిక ప్రాంతంలో ప్రవేశించి సాధు జంతువులను చంపుతూన్న ఓ క్రూరమృగాన్ని మట్టుపెట్టడం హర్షణీయం. సినిమాలో హీరో, విలన్‌ని చంపితే ప్రేక్షకుల ప్రశంసలను పొందుతాడు. కాని, అదే - ఓ ఆడపిల్ల.. నిస్సహాయ స్థితిలో.. గౌరవం కాపాడుకునేందుకు, ఆత్మరక్షణార్థం.. ఓ మానవ మృగాన్ని సంహరిస్తే - అది ఘోర నేరమవుతుంది! ఇదెక్కడి న్యాయం..?
బిలబిలమంటూ వచ్చేసింది మీడియా.
‘ఆ హత్య ఎందుకు చేసావ్? హత్యాయుధాన్ని దగ్గర పెట్టుకుని తిరుగుతున్నావా? ఇలాంటి అవసరమేదో వస్తుందని నీకు ముందే తెలుసా? గ్యాంగ్ రేప్‌కి గురయ్యావా? ఎంతమంది ఉన్నారు? వారిలో నీ బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడా? పోలీసులకి ఎందుకు ఫోన్ చేయలేదు? అసలు అర్ధరాత్రి వేళ నీకు అక్కడ ఏం పని? అలా రాత్రులు బైట తిరగడం నీకు అలవాటా?...’- ప్రశ్నల వర్షం కురిపించారంతా. నా హృదయం భగ్గుమంది. ‘వీళ్లు మనుషులేనా? ఓ ఆడపిల్లను అడగవలసిన ప్రశ్నలేనా ఇవి!’ దుఃఖం ముంచుకు వస్తూంటే సమాధానం చెప్పకుండా సెల్‌లో మూలకు వొదిగిపోయాను.
‘ఎవడో ఆకతాయిగా మీద చేయి వేసాడని వాణ్ణి రాడ్‌తో కొట్టి చంపేసింది ఆ పిల్ల...’ - ఓ కానిస్టేబుల్ ఎవరికో చెబుతూన్నది చెవిన పడటంతో, దిగ్భ్రాంతికి గురయ్యాను నేను. ‘ఇదా లోకం..!?’ ఆ మృగాడి చేతిలో చచ్చిపోకుండా నేను పొరపాటు చేశానా?’ అనిపించింది నాకు ఆ క్షణంలో, మొదటిసారిగా.
మధ్యాహ్నం నాన్న వచ్చి, ‘హంతకురాలిని కోడలిగా చేసుకునేంతటి గొప్ప మనసు మాకు లేదంటూ, పెళ్లివారు మన సంబంధం రద్దు చేసుకున్నారు’ అని చెబుతూంటే, ఆశ్చర్యపోలేదు నేను... సాయంత్రం పోలీసులు నన్ను న్యాయస్థానంలో హాజరుపరచడము, కోర్టు నాకు పధ్నాలుగు రోజులపాటు రిమాండ్ విధించడమూ జరిగాయి.
* * *
మర్నాడు అత్తయ్య, బావ నన్ను చూడడానికి సబ్ జైలుకి వచ్చారు. అత్తయ్య నన్ను చూసి కన్నీళ్లు పెట్టుకుంటే, బావ నాకు ధైర్యం చెప్పాడు. ‘నువ్వు నా మరదలివయినందుకు నాకు గర్వంగా ఉంది, మల్లీ! ఆడపిల్లలంతా నీలాగే ధైర్యం చూపినట్లైతే, మీద చేయి వేయడానిక్కూడా సాహసించరెవరూ. ఓ ఆడపిల్ల దిక్కుతోచని స్థితిలో మానం కాపాడుకోవడానికి, ఆత్మ రక్షణ కోసం చేసిన హత్య ఇది. మన న్యాయవ్యవస్థ పైన నాకు పూర్తి విశ్వాసం ఉంది. న్యాయస్థానం తప్పక అర్థం చేసుకుంటుంది. లేకుంటే నిర్భయ చట్టంలోని ‘నిర్భయ’ అన్న పదానికి అర్థం ఉండదు. ఆ చట్టానికి విలువ ఉండదు..’ అన్నాడు బావ. నన్ను అర్థం చేసుకుని, నా మనోధైర్యానికి ఎరువు వేసిన మొదటి వ్యక్తి. ‘నాకు తెలిసిన ఓ అడ్వొకేట్‌ని వెంటబెట్టుకుని వచ్చాను. ఇవాళే నీ బెయిల్ పిటిషన్‌ని ఫైల్ చేస్తున్నాము. రెండు రోజుల్లో నువ్వు తప్పక బైటకు వస్తావు’
పెద్దగా చదువుకోలేదనీ, మట్టి పిసుక్కునేవాడనీ చిన్నచూపు చూసిన బావే, అడక్కుండానే నన్ను ఆదుకోవడానికి ముందుకు వచ్చాడు. విద్యాధికుడన్న పెళ్లికొడుకు కనీసం నా దుస్థితిని అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. చదువుకు, సంస్కారానికి సంబంధం లేదన్న సత్యం మరోసారి రుజువయింది.. కన్నీటి తెరల నడుమ బావ వంక కృతజ్ఞతా భావంతో చూస్తూ అప్రయత్నంగా చేతులు జోడించాను నేను.

‘తిరుమలశ్రీ’ పివివి.సత్యనారాయణ
ఇం.నెం.7-1-222/1, 102, సిరి ప్రైడ్, బల్కంపేట, హైదరాబాద్-500 016
9394291998/ 7569074787

‘తిరుమలశ్రీ’ పివివి.సత్యనారాయణ