కథ

సన్మానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణప్రచురణకు
ఎంపికైన కథ
*
‘‘అమ్మమ్మా ఫోన్ తీయ్.. అమ్మమ్మా ఫోన్ తీయ్.. అమ్మమ్మా ఫోన్ తీయ్..’’
... నా మనవరాలి మాటల్నే ‘రింగ్‌టోన్’గా పెట్టుకున్న నా మొబైల్ ఫోన్ ఉదయానే్న రింగవుతూ నన్ను నిద్ర లేపుతూంటే కళ్ళు నులుముకుంటూ లేచాను.
‘‘ ఇంత ప్రొద్దుటే ఎవరబ్బా ఫోన్ చేస్తున్నదీ..’’ అనుకుంటూ మొబైల్ చేతిలోకి తీసుకుని చూశాను. స్క్రీన్ మీద ‘ప్రైవేట్ నంబర్’ అని డిస్‌ప్లే అవుతోంది కానీ, నంబర్ కనిపించలేదు.
రిసీవింగ్ బటన్ ప్రెస్ చేసి చెవి దగ్గర పెట్టుకొని ‘‘హలో’’ అని పలికానో, లేదో..
‘‘ప్రసన్నా టీచర్..’’ అంటూ ఎంతో ఆర్ద్రంగా, ఇంకొంచెం ఆత్రంగా వినిపించిందో స్వరం.
ఆ గొంతులో పలికిన భావాలకి మొదట నాకు ఆశ్చర్యం, ఆ వెంటనే ఆసక్తి కలిగి ‘‘ ఆఁ.. నేనే ప్రసన్ననే మాట్లాడుతున్నా!’’ అన్నాను ‘నా దగ్గర చదువుకున్న అమ్మాయిల్లో ఆ గొంతు ఎవరిదై ఉంటుందా...’ అని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ. ఎందుకంటే అది ఓ ఆడగొంతు, పైగా నన్ను ‘టీచర్’ అంటూ సంబోధించడం వల్ల.
నా ఆలోచన ఓ కొలిక్కి రాకముందే ‘‘టీచర్.. నేను గుర్తుపట్టలేదా నన్ను?!’’ అంటూ అవతలి గొంతు మరికాస్త ఉద్వేగంతో పలికేసరికి నా నిద్ర మత్తు పూర్తిగా తొలగిపోయింది
‘‘సారీ తల్లీ... పోల్చుకోలేకపోతున్నా! నువ్వే చెప్పమ్మా.. ఎవరో!?’’ రిక్వెస్టింగ్‌గా అన్నాను.
‘‘నేను టీచర్.. జుబేదాను గుర్తొచ్చానా టీచర్?’’ అంటూంటే.. లీలగా గుర్తురాసాగింది సన్నగా, పొడవుగా, రెండు జడలు వేసుకుని, చలాకీగా, స్కూల్‌డ్రెస్‌లో ఉన్న ఓ ముస్లిం అమ్మాయి.
రెండుమూడేళ్లుగా స్టూడెంట్సెవరూ నాకు ఫోన్లు చేయకపోవటంతో ఇప్పుడు ఈ అమ్మాయెందుకు కాల్ చేసిందో అర్థం కాలేదు.
‘‘ఏమిటమ్మా.. ఎలా వున్నావు? ఏం చేస్తున్నావు? ఏమిటి విషయం?’’ అన్నాను.
‘‘గురుపూజోత్సవ శుభాకాంక్షలు టీచర్!’’
అవతల్నుంచి ఆ అమ్మాయి మాటలు వినగానే ఇప్పుడిప్పుడే మరచిపోతున్న నా ఉపాధ్యాయ వృత్తికి సంబంధించిన జ్ఞాపకాలు ఒక్కసారిగా నాలో ముప్పిరిగొన్నట్లనిపించింది.
‘‘్ధన్యవాదాలు తల్లీ.. జ్ఞాపకం పెట్టుకుని మరీ విషెస్ చెప్పినందుకు!’’ అన్నాను ఆర్ద్రంగా.
‘‘అయ్యోఁ.. ఎంత మాట టీచర్..’’ నొచ్చుకున్నట్లుగా వెంటనే అంది ఆ అమ్మాయి.
‘‘జుబేదా.. ఎలా వున్నావమ్మా? ఇప్పుడెక్కడున్నావు? ఏం చేస్తున్నావూ?’’ మళ్లీ అడిగాను.
‘‘చెప్తాను టీచర్.. స్వయంగా వచ్చి మీతో అన్నీ మాట్లాడతాను! మీరెక్కడ ఉన్నారో కాస్త అడ్రస్ చెప్తారా!’’ అంటూ అభిమానంగా అడిగేసరికి నేను ఉంటున్న వృద్ధాశ్రమం అడ్రస్ చెప్పాను.
ఫోన్ పెట్టేశాక మనసు గతంలోకి పరిగెడుతూంటే.. ఆ వెనకే నేనూ పయనమయ్యాను!
***
టీచర్ ఉద్యోగంలో చేరిన పదమూడేళ్లకు ‘హైస్కూల్ టీచర్’గా ప్రమోషన్ వచ్చినందుకు సంతోషించాలో, పోస్టింగొచ్చిన ఊరు దూరంగా ఉన్నందుకు దిగులుపడాలో అర్థం కాలేదు నాకు.
‘‘అడ్హాక్ ప్లేస్ కొన్నాళ్ల తర్వాత దగ్గరికి మార్పించుకోవచ్చు!’’ అని అందరూ అంటూంటే.. చేసేదేంలేక ప్రమోషన్ తీసుకున్నానుగానీ, నాకు మాత్రం మనసులో దిగులుగానే ఉంది.
స్కూల్లో చేరాల్సిన రోజు ఇంటినుంచి ఎంత తొందరగా బయల్దేరాలనుకున్నా చాలా ఆలస్యం అయిపోయింది. బైక్ వెనకాల సీట్లో కూర్చున్న నేను ‘‘స్పీడ్ పెంచండీ..’’ అంటూ మాటిమాటికీ మావారి వీపు మీద పొడుస్తూ ఆయన్ని మరింత తొందరపెట్టాను.
దాంతో విసిగిపోయి చిర్రెత్తుకొచ్చినట్లుంది ఆయనకి దారి మధ్యలోనే రోడ్డుప్రక్కన బైక్ ఆపేసి, స్టాండ్ వేసి ‘‘ ఇక బండి నువ్వు నడుపు స్పీడుగా!’’ అన్నారు కోపంగా.
‘‘బాబ్బాబు.. ప్లీజ్ నా టెన్షన్ కాస్త అర్థం చేసుకోండీ..’’ అంటూ ఆయన్ని బతిమాలి, బామాలి, బుజ్జగించాక ఆయనగారి కోపం కాస్త ఉపశమించి, మా ప్రయాణం మళ్లీ మొదలైంది.
అప్పటికే మరికాస్త లేటయిపోవడంతో భయం భయంగానే స్కూల్లోకి అడుగుపెట్టాను.
ఊరికి దూరంగా, చిన్నకొండ పైన ఉంది.. స్కూలు!
చుట్టూ పచ్చని చెట్లూ, చల్లని గాలీ, ప శాంతమైన వాతావరణం, ముచ్చటైన భవనం, చురుకైన పిల్లలూ.. ఇవన్నీ గమనించాక ‘కాస్త దూరమైనా మంచి ప్రదేశానికే చేరుకున్నాను’ అనిపించింది. అక్కడి టీచర్లందరూ నన్ను చక్కగా పలకరించారు, ఆత్మీయంగా ఆహ్వానం పలికారు. త్వరగానే వాళ్ళలో కలిసిపోగలననిపించి మనసులోని దిగులు తగ్గి, ఊరట కలిగింది.
జనవరి నెలలో డ్యూటీలో చేరాను కాబట్టి అప్పటికే పాఠాలన్నీ దాదాపుగా పూర్తిచేసేశారు అక్కడున్న టీచర్లు. నేను కొత్త కాబట్టి ఆరూ, ఏడు తరగతులు కేటాయించారు నాకు. పిల్లలు చురుకుగా ఉండటమే కాక, కొద్దిరోజుల్లోనే నాతో బాగా కలిసిపోయారు. అయితే వాళ్ళలో కాస్త క్రమశిక్షణ కొరవడిందని అనిపించడంతో ప్రేమగానే కట్టుదిట్టం చేయసాగాను. ముఖ్యంగా అమ్మాయిలలో నేను తీసుకువచ్చిన మార్పులు హెడ్‌మాస్టర్‌గారు త్వరగానే గుర్తించారు.
రెణ్ణెల్లు గడిచాయో, లేదో పిల్లలకి పరీక్షలొచ్చేశాయి. అది సాధారణ విషయమే కావొచ్చుకానీ పిల్లలతో పాటు నాకూ ఓ పరీక్ష రాబోతోందని నేను ఊహించలేదప్పుడు!
***
స్కూలుకి వేసవి సెలవులు మొదలవడానికి ముందు ఓ రోజు...
‘‘టీచర్.. పెద్దసార్ మిమ్మల్నొకసారి పిలుచుకు రమ్మన్నారు!’’
ప్రేయఠ్ తర్వాత క్లాసుకి వెళ్తూండగా.. హడావుడిగా వచ్చి చెప్పిన అటెండర్ మాటలకి ‘ ఏమైవుంటుందా..’ అని ఆలోచిస్తూ గబగబా హెడ్‌మాస్టర్‌గారి గదివైపు నడిచాను.
తొమ్మిదవ క్లాసుకి చెందిన మగపిల్లలు నలుగురైదుగురు హెచ్చెమ్‌గారి గదిముందు భయంభయంగా తచ్చాడుతూ కనిపించారు నాకు.
‘‘మే ఐ కమిన్ సర్?’’ అనడుగుతూ లోనికి అడుగుపెట్టాను.
‘‘కమిన్ మేడమ్..’’ అంటూ ఆయన తలెత్తి చూసి, ‘‘కూర్చోండి!’’ అన్నారు తన ఎదురుగా ఉన్న సీట్ చూపిస్తూ.
ఆ తర్వాత ఆయన ఎలాంటి ఉపోద్ఘాతమూ లేకుండా నేరుగా అసలు విషయానికొచ్చేస్తూ
‘‘మేడమ్! తొమ్మిదో క్లాసులోని ఓ అమ్మాయి వాళ్ళ క్లాసు అబ్బాయెవరో తన ఫోన్ నంబర్ని స్కూలు గోడపై రాశాడనీ, ఎవరెవరో తన నంబర్‌కి ఫోన్లు చేస్తున్నారనీ కంప్లయింట్ చేస్తోంది. నేను కొందరు అబ్బాయిల్ని పిలిపించి ఆరాతీస్తే వాళ్ళెవరూ ఫోన్లు చేయలేదని చెప్తున్నారు. ఇది కాస్త డెలికేట్ ఇష్యూ కాబట్టి మీకు అప్పగిస్తున్నాను మీరు వాళ్ళతో మాట్లాడి అసలు సంగతేమిటో కనుక్కోండి. విషయంగానీ సీరియస్ అయితే ఆ అమ్మాయివాళ్ళ పేరెంట్స్ తమ కూతుర్ని స్కూలు మాన్పించేస్తారు.. ఇది మర్చిపోకండి!’’ అంటూ జాగ్రత్తలు చెప్తూ బాధ్యత మొత్తం నామీద వేసేశారు.
నాకు కేటాయించిన క్లాసులు ఆరు, ఏడు తరగతులవే కాబట్టి తొమ్మిదో క్లాసు పిల్లలతో నాకు అంతగా పరిచయం లేదు. ఆ క్లాసులకి వెళ్లే సీనియర్ టీచర్ ఒకర్ని కలసి వివరాలు కనుక్కున్నాను. ‘‘అమ్మాయి మంచిదే.. బాగానే చదువుతుంది!’’ అన్న విషయం తప్ప అంతకుమించి ఇంకేమీ చెప్పలేకపోయిందావిడ.
ఇక మరోమార్గం లేక తప్పనిసరై ఆ అమ్మాయినే పిలిపించాను.. స్ట్ఫారూమ్‌కి!
అడుగులు తడబడుతూ, లోలోపలే చిన్నగా వెక్కిళ్ళు పెడుతూ వచ్చిం ది...‘జుబేదా’.
‘‘రామ్మా..’ అంటూ ఆప్యాయంగా భుజాల చుట్టూ చేతులు వేసి, బయటకి నడిపించుకుంటూ వచ్చి, స్కూలుకి కాస్త దూరంగా ఉన్న చెట్టు దగ్గరికి తీసుకుపోయాను. నా మాటలో, స్పర్శలో కోపం, అధికారం, ఆక్షేపణకి చెందిన ఛాయలు లేవని గమనించిందేమో.. కాస్త స్తిమితపడింది.
‘‘జుబేదా... అసలేం జరిగిందమ్మా?’’ అనునయంగా ప శ్నించాను.
తనలోని ఉద్వేగాన్ని అదుపుచేసుకోవడానికి అర నిముషం తీసుకొని, ఆ తర్వాత చెప్పింది ‘‘చూడండి టీచర్.. స్కూలుగోడ మీద వాడు నా ఫోన్‌నంబరు రాశాడు. అప్పటినుంచి ఎవరెవరో నాకు ఫోన్లు చేసి ఏమీ మాట్లాడకుండా కట్ చేసేస్తున్నారు...’’ అంటూ తలదించుకుంది.
ఆ అమ్మాయిని రెండు క్షణాలు నిశితంగా చూసి అసలేమిటి నీ ప్రాబ్లమ్? ఎవరెవరో నీకు ఫోన్లు చేస్తున్నారనా? లేక, నీతో ఏమీ మాట్లాడకుండా కట్ చేస్తున్నారనా?’’ అనడిగాను. నా మాటలు సూటిగా వెళ్లి ఎక్కడ తగులుతాయో నాకు తెలుసు. నేను అనుకున్నదే జరిగింది.
నా మాటలకి ఆ అమ్మాయి చివుక్కున తలెత్తి ‘‘్ఫన్లు రావడమే నా ప్రాబ్లమ్ టీచర్! ఇలా ఎవరెవవర్నుంచో ఫోన్లు వస్తున్నాయని మా అమ్మానాన్నకి తెలిస్తే.. నా చదువు ఆపేస్తారు!’’ అన్నది.
ఇక నాకు ఆ అమ్మాయి నుంచి నాన్చుతూ కాకుండా సూటిగా సమాధానాలు వస్తాయని అర్థం చేసుకున్న నేను ‘‘గోడమీద ఆ అబ్బాయే రాశాడని నీకెలా తెలుసు?’’ అనడిగాను డైరెక్ట్‌గా.
‘‘ఎలాగంటే.. అతడికొక్కడికే నా నంబర్ తెలుసు టీచర్?’’ అన్నది నిర్ధారణగా.
‘‘అదే.. అతనికొక్కడికే నీ నంబర్ ఎలా తెలుసూ?’’ సూటిగా ప్రశ్నించిన నన్ను చూసి తలదించుకుంది. నేను రెట్టించి అడిగేసరికి
తప్పు చేసినట్లుగా ‘‘నేనే ఇచ్చాను టీచర్...’’ అంది బెరుకుగా తలూపుతూ.
‘‘ఎందుకు ఇచ్చావు? ఎప్పుడిచ్చావు? అతడు ఇన్ని రోజులూ రాయకుండా ఇప్పుడే గోడమీద ఎందుకు రాశాడు? అలా రాయాల్సిన అవసమేమొచ్చింది?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించాను.
అంతే.. నా ప్రశ్నల ధాటికి బెదిరిపోయి ఒక్కసారిగా ఏడుపు మొదలెట్టింది.
నేను కాస్త నెమ్మదించి, ఆ అమ్మాయి వంక చూస్తూ ‘‘్భయపడకమ్మా! ఏం జరిగిందో వివరంగా నాకు చెప్పు.. నేను సరిచేస్తానుగా!’’ అంటూ అనునయించాను.
కాసేపటికి తేరుకున్న తను ‘‘టీచర్.. తొమ్మిదోక్లాసుకి వచ్చిన మొదట్లో మేము ప్రేమించుకున్నాము. అప్పుడే నా నంబర్ తనకి ఇచ్చాను!’’ అన్నది ‘తనకి’ అనే పదం మురిపెంగా పలుకుతూ.
‘తొమ్మిదో క్లాసులో ప్రేమేంటీ.. ఖర్మరా దేవుడా!’ అనుకుంటూ తల పట్టుకున్నాను. ప్రసార ప్రచార సాధనాలు, ఎలక్ట్రానిక్ మీడియా, వగైరాలు ఇప్పటి పిల్లల మెదళ్ళని ఎలా చెడగొడ్తున్నాయో చెప్పడానికి ఈ అమ్మాయినే రుజువుగా చూపించొచ్చనిపించింది.
తన మాటలతో కలిగిన ‘షాక్’ నుంచి తేరుకోవడానికి నాకే కొంచెం సమయం పట్టింది. ఆ కాస్త విరామాన్ని మరోలా అర్థం చేసుకున్న ఆ అమ్మాయి మరోసారి చెప్పింది అమాయకంగా
‘‘నిజమే టీచర్.. మేమిద్దరం ఒకప్పుడు లవర్స్‌మి ఇద్దరం లవ్ చేసుకున్నాం!’’
ఆ మాటలతో నాకు ‘తిక్క’ నషాళానికెక్కినట్లయింది ‘‘ ఏం.. మరిప్పుడు లవ్ చేసుకోవట్లేదా?’’ అనడిగాను వెటకారంగా.
‘‘లేదు టీచర్.. పరీక్షల్లో మార్కులెక్కువొస్తే బాగాచదువుతాడు, బాగున్నాడని ప్రేమించాను. కానీ వాడికసలు చదువే రాదనీ, అన్నీ పక్కవాళ్ళ దగ్గర చూసిరాస్తాడనీ తర్వాత తెలిసింది. పూర్తి మొద్దుగాడు. అందుకే మాట్లాడ్డం మానేశా. దాంతో వాడికి కోపం వచ్చి ఇలా చేశాడు!’’ అంటూ నిజాయితీగా ‘అసలు విషయం’ బయటపెట్టింది.
నాకు తల గిర్రున తిరుగుతూంటే ‘నిజంగానే ఇంత పిచ్చిపిల్లలుంటారా!?’ అనిపించింది.
నన్ను నేను తమాయించుకున్న తర్వాత ఆ అమ్మాయితో ప్రశాంతంగా ‘‘సరే జుబేదా.. నువ్విప్పుడు క్లాసుకి వెళ్లు. లంచ్‌బ్రేకులో నా దగ్గరికి రా!’’ అని చెప్పి, అక్కడ్నుంచి కదిలాను.
‘ ఆ అబ్బాయే స్కూలుగోడపై ఫోన్ నంబర్ రాశా’డని హెడ్‌మాస్టర్‌గారికి కన్ఫర్మేషన్ ఇచ్చి, ‘పనిష్మెంట్’ సంగతి ఆయనకే వదిలేసి, స్ట్ఫారూమ్‌లోకి వెళ్లి కాసేపు రిలాక్స్ అయ్యాను.
లంచ్ అవర్‌లో జుబేదా నా దగ్గరికొచ్చింది..
ఇందాకా తనని సరిగ్గా గమనించలేదు కానీ తెల్లగా, సన్నగా, పొడవుగా, పైకి మడచికట్టిన రెండు జడలతో ముచ్చటగా ఉంది.. మూర్త్భీవించిన అమాయకత్వానికి మారుపేరులా..
‘‘జుబేదా! ఇకపై నీకు ప్రాబ్లమ్ ఏమీ రాదులే, నువ్వు హాయిగా చదువుకోవచ్చు.. సరేనా!’’ అని చెప్పాను. నా మాటలకి తన ముఖం సంతోషంతో వెలిగిపోయింది.
ఆ తర్వాత వేసవి సెలవులు రావడం, కళ్ళు మూసి తెరిచేలోగా సెలవులు ముగిసిపోయి మళ్లీ స్కూళ్లు తెరవడం కూడా జరిగిపోయింది.
ఈసారి నాకు పదవతరగతి సైన్స్‌క్లాసు కేటాయించారు. అదే.. ‘జుబేదా’ క్లాసు!!
***
పదవ తరగతి సైన్స్ పాఠాలు మొదలుపెట్టాను..
జుబేదా బాగానే చదువుతోంది కానీ, క్లాసులో సరిగ్గా పాఠాలు వినటం లేదని గమనించాను. తను ఆ అబ్బాయితో మాట్లాడకపోయినా ఏ కాస్త అవకాశం దొరికినా అతడి వంకే చూస్తూవుండేది.
ఇక చూస్తూ సహించలేక ఒకరోజు జుబేదాని స్ట్ఫారూమ్‌కి పిలిపించాను..
‘‘ ఏంటమ్మా ఇది? బాగా చదువుకుంటావని చెప్పి నీ తరఫున మాట్లాడి హెచ్చెమ్‌గారు నినే్నమీ అనకుండా నిన్ను వెనకేసుకొచ్చాను. కానీ నువ్వేమీ మారలేదనిపిస్తోంది. నీ పద్ధతి నాకేం నచ్చటం లేదు!’’ అంటూ కోప్పడ్డాను.
నా మాటలకు జుబేదా బెదిరిపోయినట్లుగా తన
ముఖకవళికలు చూస్తేనే తెలిసిపోయింది.
‘ఎంతైనా చిన్నపిల్ల మంచేదో, చెడేదో తెలియని అమాయకత్వం!’ అనిపించి జాలేసింది.
‘‘సరే.. క్లాసుకి పద!’’ అంటూ ఆ రోజు క్లాసులో ఆయా వయసు పిల్లల ఆలోచనావిధానం ఎలా వుంటుందో, వారి మనసుల్లో ఎలాంటి భావాలు కదలాడతాయో, ఆ వయసులో వారి శరీరంలో వచ్చే మార్పుల గురించీ, వాటి కారణాలూ, పరిణామాల గురించీ కూలంకషంగా వివరిస్తూ.. వాటిని ఎలా అర్థం చేసుకోవాలో, ఎలా నిభాయించుకోవాలో విపులంగా చెప్పాను.
ఆ రోజు లంచ్‌టైమ్‌లో జుబేదా నా దగ్గరికి రావడం గమనించి ఏమిటన్నట్లుగా చూశాను.
‘‘టీచర్.. నన్ను క్షమించండి! నేను ఏం చేస్తున్నానో, ఎందుకలా చేస్తున్నానో నాకే అర్థం కావడం లేదు!’’ అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది.
అదిచూసి నా మనసు కలచివేసింది ‘‘జుబేదా.. ఏడవకు! మొదట నేను అడిగేదానికి బదులివ్వు నీకు బాగా చదవాలని ఉందా? లేదా? ఈ వయసులో నీకు ‘ప్రేమ’ అని అనిపించే భావాలేవీ నిజమైన భావాలు కావు. చక్కగా చదువుకుంటే వచ్చే లాభాలూ, చదువుకోకపోతే వచ్చే నష్టాలూ రాసి చూసుకో! అప్పుడు చదవాలో, వద్దో నీకో తెలుస్తుంది!!’’ అని, ఆయాసం తీర్చుకోవడానికి కాసేపు ఆగాను.
ఆ తర్వాత ‘‘ ఇప్పుడు నిన్ను చూసి బాగున్నావని చెప్పి వెంటబడే అబ్బాయిలు ఒకరో, ఇద్దరో! కానీ నువ్వు బాగా చదువుకుని, మంచి ఉద్యోగం సంపాదించుకున్నావంటే నిన్ను అభిమానించే అబ్బాయిలు వందలు, వేలమంది ఉంటారు. అంతేకాదు చదువు సంస్కారాన్ని నేర్పుతుంది. ఏది తప్పు ఏది ఒప్పు అన్నది తెలుసుకునే విచక్షణ కలిగిస్తుంది. ప్రేమ, పెళ్ళి గురించి ఆలోచించే వయసు ఇది కాదమ్మా! వాటి విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా నువ్వు డిగ్రీ పూర్తిచేసిన తర్వాత తీసుకో! అప్పటికి నీకు నిర్ణయాధికారం వస్తుంది. చదువుపట్ల నీకు ఏ సలహా కావాలన్నా నా సహాయం నీకు ఉంటుంది. ఆలోచించుకోమ్మా! నీకు ఇలా చెప్పటం.. ఇది మొదటిసారి మాత్రమే కాదు, ఆఖరిసారి కూడా!’’ అని చెప్పి పంపించేశాను.
ఆ తర్వాత జుబేదాలో చాలా మార్పు గమనించాను. మర్నాటి పాఠాలు ఆ ముందురోజే చదువుకోవడం, పాఠం చెప్పే సమయంలో చక్కగా వినడం, అర్థంకాని, మరిచిపోయిన విషయాలను అడిగి మరీ చెప్పించుకోవడం.. లాంటి మంచి విద్యార్థి లక్షణాలన్నీ తనలో స్పష్టంగా కనిపించాయి.
పదవ తరగతి పరీక్షల్లో జుబేదా స్కూల్ ఫస్ట్ రావటం నన్ను అన్నింటికన్నా ఆనందపరచిన విషయం. ఆ తర్వాత ‘ట్రిపుల్ ఐటీ’లో సీటు కూడా సంపాదించుకొని నా దగ్గరికి వచ్చి నమస్కరిస్తూ ‘‘టీచర్.. ఇదంతా మీవల్లే సాధించగలిగాను!’’ అని తాను చెప్తున్నప్పుడు ఓ ఉపాధ్యాయినిగా చాలా గర్వంగా అనిపించింది నాకు.
బి.టెక్.లో ఉన్నప్పుడు అనుకుంటాను ఒకట్రెండుసార్లు తను నాకు ఫోన్ చేసింది కానీ, ఆ తర్వాత ఆమె విషయాలేవీ నాకు తెలియలేదు.. మళ్లీ ఇన్నాళ్లకి గుర్తుపెట్టుకుని మరీ నాకు ఫోన్ చేసింది జుబేదా.
‘ఎలావుందో, ఏమి చేస్తుందో అడిగినా చెప్పలేదు!’ అనుకుంటూ స్నానం చేసి తయారయ్యాను.
‘తనే వస్తానంది కదా!’ అనుకుంటూ ఆ రోజంతా ఎదురుచూసినా.. రాలేదు తను. నన్ను చూసేందుకు వస్తారని నా పిల్లలకోసం ఎదురుచూడటం, వాళ్ళు రానందుకు దిగులుపడటం నాకు అలవాటే కావడంతో దీర్ఘంగా నిట్టూరుస్తూ భోజనం చేసి పడుకున్నాను.
కానీ నిద్ర పట్టలేదు. ఎంతకీ ఎడతెగని ఆలోచనలు..
‘జుబేదా ఎందుకు ఫోన్ చేసింది? తనే వస్తావని ఎందుకు చెప్పింది? వస్తానని చెప్పిన వ్యక్తి ఎందుకు రాలేదు? నేనేమైనా తనని సహాయం కోరతానని అనుకున్నదా? అందుకే రాలేదా?’
.. అర్థంకాని ప్రశ్నలతో ఎప్పటికో నిద్ర పోయాను.
***
మరుసటిరోజు..
ఉదయం నేను టిఫిన్ చేస్తూండగా ఆశ్రయం ముందు ఏదో కాఠు వచ్చి ఆగినట్లనిపించి, బయటకొచ్చి చూశాను. అయితే ఆ కారు కాస్తా ముందుకువెళ్లి ఆఫీసు వద్ద ఆగేసరికి నాకోసం కాదనుకుంటూ తిరిగి లోపలికి రాబోతూండగా..
‘‘టీచర్..’’ అంటూ వినిపించిన పిలుపుకి ఆగాను.
వెనక్కి తిరిగి కళ్ళజోడు సర్దుకుంటూ చూశాను ఎదురుగా.. ‘జుబేదా!’
చిన్నప్పటి స్కూలు స్టూడెంట్‌లాగే తెల్లగా, సన్నగా.. పొడవుగా ఉంది. కాకపోతే అప్పటి రెండు జడల స్థానంలో ఇప్పుడు ముడివేసుకుని ఉంది. అమాయకత ఉట్టిపడే అప్పటి ముఖంలో ఇప్పుడు పరిణతి సంతరించుకున్న ‘వ్యక్తిత్వం’ ఉట్టిపడుతూంటే.. మంగళగిరి నేతచీరలో హుందాగా నడిచొస్తున్న తనని చూస్తుంటే.. ‘నా స్టూడెంటేనా!’ అనిపించింది.
జుబేదా నా దగ్గరకొచ్చి ‘‘ఎలావున్నారు టీచర్?’’ అంటూ నా భుజాల చుట్టూ చేతులు వేసి నన్ను లోపలికి తీసుకొస్తూంటే.. ఆ రోజు స్కూల్లో తనని నేను అలా తీసుకెళ్లిన సంఘటన గుర్తొచ్చింది.
నా గదిలోకి వచ్చాక నన్ను కూర్చోబెట్టి తలుపు వైపు చూస్తూ ‘‘కరీం.. కాస్త లోపలికి వస్తావా?’’ అంటూ తను ఎవరినో పిలుస్తూంటే.. నా పరధ్యానానికి నొచ్చుకుంటూ లేచివెళ్లి ఆ అబ్బాయిని లోపలికి రమ్మని పిలిచాను.
అతను లోపలికి వచ్చాక ‘‘మా శ్రీవారు.. పేరు కరీం! ఇక్కడే ఇంజనీరుగా పనిచేస్తున్నారు!’’ అని పరిచయం చేశాక ‘‘మమ్మల్ని ఆశీర్వదించండి టీచర్!’’ అంటూ నా కాళ్లకి నమస్కరించారిద్దరూ.
వారి యోగక్షేమాలు అడుగుతూ టిఫిన్ ప్లేట్లలో పెట్టి ఇస్తే.. వాళ్ళు అపురూపంగా అందుకొని దేవుని ప్రసాదంలా ఆరగిస్తూంటే నా మనసు ఆర్ద్రమయింది.
ఆ తర్వాత ఇద్దరూ లేచి ‘‘టీచర్.. ఇప్పుడు మనమొక చోటుకి వెళ్తున్నాం. ఎందుకు, ఏమిటి అనకుండా దయచేసి మాతో వస్తారా?’’ అని అభిమానంగా అడిగేసరికి కాదనలేకపోయాను.
జుబేదా, కరీంలతో నేను వరండాలో నడుస్తూ వెళ్తోంటే.. మిగతా వృద్ధులంతా వింతగా చూడసాగారు. ఔను మరి మూడేళ్ల క్రి తం నేను ఆశ్రమంలో చేరిన తర్వాత బయటకి కదలటం అదే మొదటిసారి మరి!
డ్రైవర్ పరిగెత్తుకుంటూ వచ్చి కారు డోర్ తీశాడు. నేను కూర్చున్నాక జుబేదా నా ప్రక్కన కూర్చుంది. కరీం ముందుసీట్లో కూర్చోగానే డోర్లు మూసి డ్రైవర్ కారు కదిలించాడు.
కారు ఊరి బయట కొత్తగా కట్టిన స్కూలు బిల్డింగ్స్ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించి, అక్కడ ఏర్పాటు చేసిన సభాప్రాంగణానికి చేరుకుంది. కారు దిగి మేము నడుస్తూంటే.. జనం పక్కకి తొలగుతూ మాకు దారి వదలడం చూస్తూంటే నాకు ఏమీ అర్థం కాలేదు. నేనేదో చిన్నపాపనైనట్లు నా చేయి పట్టుకొని నడిపించుకుంటూ తీసుకెళ్లి మొదటి వరుసలో కూర్చోబెట్టి నా ప్రక్కనే కూర్చుంది జుబేదా.
చిన్నారుల స్వాగత పలుకులతో సభ ప్రారంభమైంది. అధ్యక్షులవారు జిల్లా కలెక్టర్‌గారిని సాదరంగా వేదిక పైకి ఆహ్వానించారు. అందరి కరతాళధ్వనుల మధ్య వేదికపైకి చేరుకున్నారు కలెక్టర్. తర్వాత వేదిక పైకి పిలిచినవారిలో జుబేదా, కరీం వెళ్లారు. చివరిగా నా పేరు అనౌన్స్ చేసి నన్ను వేదికపైకి రమ్మంటూంటే విస్తుబోయిన నన్ను చూసి నవ్వుతూ పైకి రమ్మంది జుబేదా.
జుబేదాకి చదువు చెప్పిన టీచర్‌గా నన్ను కలెక్టర్‌గారు పూలమాలలతో, మేళతాళాలతో చందన గంధాలతో, పట్టు శాలువాలతో సత్కరిస్తూంటే.. నేనొక టీచర్‌ని అయినందుకు గర్వపడ్డాను.
జుబేదా మైకులో మాట్లాడుతూ ‘‘శిలలా ఉన్న నన్ను శిల్పంగా మలచిన ఘనత మా ప్రసన్న టీచర్‌గారిదే! ఆవిడ కారణంగానే ఈ రోజు నేను ఈ స్థితికి చేరుకొని ఇలాంటి స్కూలుని స్థాపించగలిగాను. అలాంటి మా టీచర్‌గారిని ఈ సభాముఖంగా ఓ వరం కోరుతున్నా!’’ అంది.
అది విని ఉలిక్కిపడ్డాను.. ‘వరం’గా ఇవ్వటానికి నా దగ్గరున్నదేమిటో అర్థంకాక తికమకపడుతున్న నన్ను చూస్తూ ‘‘మేము ప్రారంభిస్తున్న ఈ నేచురల్ మోరల్ లెర్నింగ్ స్కూలుకి ప్రిన్సిపల్‌గా ఉండి మాకు నేర్పిన విలువలే మా పిల్లలకి కూడా నేర్పాలనీ, వారిని రేపటి ఉత్తమపౌరులుగా తీర్చిదిద్దాలనీ మా టీచర్‌గారిని కోరుకుంటున్నాను!’’ అంటూ నా చేతులు పట్టుకుంది.
సంభ్రమాశ్చర్యానందాలు ముంచెత్తడంతో నోటమాటరాని నేను చివర్లో మాట్లాడుతూ ‘‘ప్రతి శిలనూ శిల్పంగా మలచాలనే టీచర్లందరూ ప్రయత్నిస్తారు. అయితే ఆ శిల్పం దారిప్రక్కన అనామకంగా పడివుండాలో, లేక గుడిలోకి చేరి పూజలందుకోవాలో అన్నది ఆయా విద్యార్థుల విజ్ఞత నిర్ణయిస్తుంది. నాకు ఇష్టమైన టీచింగ్ వృత్తిలో కొనసాగుతున్న నన్ను వయసైపోయిందని ప్ర భుత్వం వారు నాకు రిటైర్మెంట్ ఇచ్చినా.. మళ్లీ నా వృత్తిని కొనసాగించే అవకాశం జుబేదా ఇస్తూండడంతో నా జన్మ సార్థకమైనట్లుగా భావిస్తున్నాను!’’ అంటూ సంతోషంతో ముగించాను.
శాలువా, పూలదండలతో ఆశ్ర మానికి చేరుకున్న నాకు నా జీవితంలో లభించిన అన్ని అవార్డుల కంటే కూడా ఈ రోజు జరిగిన సత్కారం ఉన్నతంగా అనిపించింది.
నిజమే.. టీచర్లకి విద్యార్థుల ఉన్నతికి మించిన సన్మానం ఇంకేదీ ఉండదనిపించింది.
*

-మానస (ఎస్.ప్రసన్నలక్ష్మి) 99592 53016