కథ

‘కాఫీ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణ ప్రచురణకు
ఎంపికైన కథ
*
కాస్త వణుకుతున్నా గొంతు మాత్రం పెగిలినట్టే ఉంది.
‘ఊ’ అంటూ శ్రీమతి రెస్పాండ్ అయ్యింది. అయితే ఆ రెస్పాన్సు మాట వరకే. మాట వరసకే. శరీరంలో మాత్రం ఏ కదలికా లేదు. బెడ్ దిగి వెల్లి కాఫీ కలిపే ఉద్దేశం ఏ మాత్రం కనబడలేదు.
మళ్లీ ‘కాఫీ ప్లీజ్’ అన్నాను ఇంకొంచెం గొంతు పెంచి.
ఏమిటో నలభై ఏళ్ల అలవాటు. కళ్లు నులుముకోక ముందే బెడ్ కాఫీ రుచి చూడటం.. కాఫీ పడనిదే బెడ్ దిగకపోవడం..
ఇదో ఎడిక్షన్.
పెళ్లయ్యి ముప్పై ఐదేళ్లలో కాఫీ కోసం గొంతు వణికే పరిస్థితి క్రితం నెల వరకూ నాకెదురవ్వలేదు. ఎండలొచ్చినా, హుదుద్ తుఫానులొచ్చినా నా దైనందిక అలవాట్లకు ఏ మాత్రం భంగం కలగలేదు. నా శ్రీమతి లత నా అవసరానికి, తన చిరునవ్వు జతకలిపి మరీ తీర్చే రకం. అడగక ముందే అన్నీ అమర్చే బెటర్‌హాఫ్. ఈ రెండు నెలలుగానే పరిస్థితి అంతా తారుమారైంది.
‘కాఫీ నాక్కూడా కొంచెం కలుపుకుని రండి’ నా అభ్యర్థనకి జవాబు వచ్చింది.
‘సరే’నంటూ గొంతులో పచ్చి వెలక్కాయతో బెడ్ దిగాను.
రెండు నెలలుగా ఇదే వరుస. ఏ రోజు నా కాఫీ కోరిక సఫలవౌతుందో, ఏ ఘడియలో విఫలవౌతుందో తెలియని స్థితి.
శ్రీమతికి అప్పుడప్పుడైనా కాఫీ కలిపి ఇవ్వలేని.. ఇవ్వడానికి మనస్కరించని మేల్ చావొనిస్టిక్ పిగ్‌ని కాను. అయితే నేను వంటింట్లోకి దూరి సాయం చేస్తానన్నా ససేమిరా అనే టైపు తాను. చెప్పానుగా. రెండు నెలల క్రితం దాకా నా గొంతులో సందేహంగానీ, వణుకు గానీ అవసరం పడలేదని.
* * *
వంట గది వైపు అడుగులు వేస్తూ ఆలోచించాను. మా ఆవిడ ఏమైనా శాడిస్టుగా మారిపోయిందా? అసలు ఎవరైనా కొంతకాలం మంచిగా ఉండి, తరువాత్తరువాత శాడిస్టులుగా మారిపోయే అవకాశం ఉందా? లేకపోతే మొదటి నుండే లోలోపల శాడిస్టుగా ఉండి, ఇప్పుడు బయటపడుతోందా? అయినా శాడిస్టు అంటేనే తోటి వాళ్లని హింసించడం. ఆ ప్రక్రియ లేకుండా శాడిస్టని ఎలా అంటాం? బాగా ఆలోచించినా గతంలో అలాంటి హింస, ప్రతిహింసల ఎపిసోడ్‌లు మా మధ్య దాంపత్యంలో మచ్చుకైనా లేవు. మా అమ్మాయి ఓసారి, మా అబ్బాయి ఓసారి నన్ను శాడిస్టని అన్నారు. అదీ లైటర్ వీన్‌లో. కానీ వాళ్లమ్మను ఆ మాట కలలో కూడా అనలేదు.
పిల్లలిద్దరూ పెళ్లిళ్లయ్యి వేరే ఊళ్లలో సెటిలయ్యారు. అప్పుడప్పుడూ వాళ్లమ్మ వెళ్లి చెరోచోట రెండ్రోజుల చొప్పున ఉండి వస్తుంది. నేను తనని దిగబెట్టడానికి, తీసుకురావడానికి తప్ప అక్కడ ఉండింది లేదు. దానికి ఉద్యోగం ఒప్పుకోదు. మనసూ రాదు. ఇంటికి చేరితే మరి బయటకు అడుగైనా వెయ్యాలని ఉండదు. ఇల్లు కదలని ఈ వాలకానికే పిల్లలు నన్ను శాడిస్టనేది.
* * *
కాఫీ కాయడానికి స్టవ్ వెలిగించాను. కాఫీ పౌడర్, మిల్క్ ప్యాకెట్, పంచదార డబ్బా అన్నీ పొందికగా, అందుబాటులో ఉన్నాయి. ఎంత బాగా సర్దుకొంటుందో వంటగదిని కూడా బెడ్‌రూమ్‌లా నీట్‌గా. నేనూ అదే ఫాలో అవుతున్నా. ఎందుకో సడెన్‌గా జీవితంలో మొదటిసారి స్టౌ వెలిగించిన సందర్భం గుర్తొచ్చింది.
ఆ రోజు.. అంటే పదేళ్ల క్రితం.. లత మెడనొప్పితో విలవిల్లాడింది. చేతుల్లోకి కూడా నొప్పి పాకేది. డాక్టర్ చూసి కంప్లీట్ రెస్ట్ అవసరమన్నారు. ఎక్కువగా మెడ కదల్చకుండా ఉండేందుకు పట్టీ రాశారు.
ఆ రోజు.. లత ఎంత వారిస్తున్నా వినకుండా వంటలో సాయం చెయ్యడానికి పూనుకొన్నాను.
స్టవ్ వెలిగించగానే నా పై గయ్‌మనింది. ‘ఏమిటండీ, మీ నస వంటగదిలో. పోండి బయటకు ముందు’
‘ఏమిటి లతా, నీ చాదస్తం. నీకు నొప్పి అని కదా వచ్చాను’
‘మీరు చేస్తే నేను తినలేను.. చూడలేను’
‘తినలేనంటే ఓకే. కానీ చూడలేనంటే ఎలా?’
‘నాకు చిరాకండీ. పైగా నా కలల రాకుమారుడు కత్తి పట్టుకోవాలి గానీ గరిటె పడితే బాగోదండీ’ గోముగా అంది.
ఇంకేమంటాను. నా గొంతు మారింది. ‘అది కాదు లతా. నువ్విలా నొప్పితో బాధపడుతుంటే చూస్తూ చూస్తూ ఏమీ సాయం చెయ్యని రాక్షసుడినా నేను? పోనీ హోటల్ నుంచి తెచ్చుకొందామంటే వద్దంటావు. ఓ యంగ్ బ్యూటీఫుల్ వంటమనిషినైనా తాత్కాలికంగా పెట్టొచ్చు కదా!’ తరగడానికి ఉల్లిపాయలు తెస్తూ సలహా ఇచ్చాను.
‘ఏడ్చినట్టుంది మీ తెలివి. నాలుగు రకాల రుచులు నాలుక్కి తగలకపోతే నన్ను నంజుకు తినేస్తారు. ఏదో అదృష్టం కొద్దీ నాకు వంట బాగా వచ్చు కాబట్టి సరిపోయింది కానీ మీ టార్చర్ ఎవరికి తెలియనిది. ఉప్పు కొంచెం తగ్గితే చాలు. కూర మీ ప్లేట్లో మిగిలిపోతుంది. పైకి ఏమీ అన్నారు గానీ గొప్ప శాడిస్ట్ అండీ మీరు’ అంటూనే నా చేతిలో ఉల్లిపాయలు లాక్కొంది ‘పోండి... మీ చదువేదో చదువుకోండి.’
* * *
పాలు పొంగి కొంత దొర్లడంతో జ్ఞాపకాల నుండి వెనక్కొచ్చాను. కాఫీ పౌడర్ కలిపాను. ఘుమఘుమలు మొదలయ్యాయి. కప్పుల కోసం వెదికాను. రెండు కప్పులు - మా ఇద్దరి ఫొటోప్రింట్ చేసి ఉన్నవి - కనపడ్డాయి.
ఈ రెండూ నా పదవీ విరమణ ఫంక్షన్‌లో మా కొలీగ్ ఒకరు ప్రెజెంట్ చేసినవి.
ఎంతో ఘనంగా చేశారా ఫంక్షన్. మా భార్యాభర్తలిద్దరినీ సత్కరించారు. విశ్రాంత జీవితం సాఫీగా సాగాలని విష్ చేశారు. నాక్కూడా ఉద్యోగ విరమణ బాధనిపించలేదు. దేవుడి దయ. మా యిద్దరి ఆరోగ్యాలూ బాగున్నాయి. చీకూ చింతా లేవు. నచ్చిన పుస్తకాలు చదువుతూ, నచ్చిన వ్యాపకాలతో హాయిగా ఉండడమే కదా అనిపించింది. అయితే ఆ సంతోషం ఎక్కువ కాలం ఉండలేదు.
ఒకానొక ముహూర్తాన ఉరుముల్లేని పిడుగులా లత ఓ స్టేట్‌మెంట్ ఇచ్చింది.
‘ఇంక నాకు ఓపిక లేదు. మీరు కొంచెం కొంచెం వంట నేర్చుకోవాల్సిందే’
మొదట షాక్ అయ్యాను. తరువాత సుబ్బారావు గుర్తొచ్చాడు. వెధవ. రిటైర్మెంట్ ఫంక్షన్ వేదిక మీదే నా చెవిలో గుసగుసగా చెప్పాడు. ‘ఒరేయ్.. పదవీ విరమణ తరువాత ఎంత లేదన్నా ఇంట్లో వాళ్లకి కొంచెం లోకువౌతామురా. సిద్ధంగా ఉండు.’ ‘కుళ్ళుమోతు’ అనుకొన్నాను గానీ నిజం చెప్పిన కృష్ణ పరమాత్ముడేమో ననిపిస్తోంది ఇప్పుడు.
‘ఏమిటీ పరధ్యానం. చెప్పింది వినపడిందా?’
పచ్చి వెలక్కాయ మింగి ‘సరే’ అన్నాను.
అక్కణ్ణుంచీ మొదలైందండీ టార్చర్. నేనేదో వంట సాయం చేస్తున్నట్టు లేదు.. నాతో ఏదో హోటల్ పెట్టించే ముందు ఇస్తున్న మిలిటరీ ట్రైనింగులా తయారైంది వ్యవహారం. ఈ రెండు నెలల్లో బియ్యం కడగడమే రానివాణ్ని బిర్యానీ చేసే లెవెల్‌కి ఎదిగిపోయాను.
* * *
రెండు కప్పుల్లో కాఫీ నింపి, ట్రేలో తీసుకువెళ్లాను.
కాఫీ సువాసనకి లేచి కూర్చొని ‘్థంక్సండీ’ అంటూ తీసుకుంది.
నా కప్పు తీసుకొంటూ అన్నాను. ‘ఇలా అయితే నీకు విడాకులిచ్చి వేరే పెళ్లి చేసుకొంటానోయ్’
‘మళ్లీ థాంక్సండీ. అంత అదృష్టమా నాకు. అవసరమైతే చెప్పండి. గుడ్ హ్యాజ్బెండ్ అంటూ కాండక్ట్ సర్ట్ఫికెట్ కూడా మీకిస్తాను’
కాఫీ ముగించి తన పనుల్లో తాను బిజీ అయ్యింది.
ఒక నిర్ణయానికొచ్చాను. ఈ రోజు ఎలా అయినా రహస్యాన్ని ఛేదించాల్సిందే. మారిన తన ప్రవర్తన వెనక కారణమేదో ఉండే ఉంటుంది. ఐడియా, తనకి నాలాగే డైరీ రాసే అలవాటుంది. అయితే ఒకరి డైరీ మరొకరు చదివే అలవాటు లేదు. ఈ ఒక్కసారికి సభ్యతని పక్కనపెట్టి ఆ డైరీ చూసేస్తే ఏమైనా హింట్స్ దొరకొచ్చు.
ఈ ఐడియా వచ్చినప్పటి నుంచీ గుండె గాభరా పెరిగింది. కాళ్లు వణుకుతున్నాయి. ఏదైనా తప్పు చెయ్యడం కదా! అయినా తప్పదు. గుంటకాడ నక్కలా ఓపిగ్గా ఎదురుచూశాను. మధ్యాహ్నం వచ్చిందీ అవకాశం.
పక్కింటావిడ విజిట్‌కొచ్చింది. ఇద్దరూ డ్రాయింగు రూంలో మాటల్లో పడ్డారు. ఆవిడ వస్తే మినిమం గంట కదలదు. ఇదే బంగరు సమయం.
తన డైరీ దొరకబుచ్చుకొని గబగబా తిరగేశాను. నా రిటైర్మెంట్ ఫంక్షన్ తరువాత రోజున రాసుకున్న పేజీలో అక్షరాలకి నా కళ్లు అతుక్కొన్నాయి.
‘ఇంక ఈయన రిటైర్ అయ్యారు. ఎంచక్కా ఇరవై నాలుగు గంటలూ కళ్ల ముందే తచ్చాడుతుంటారు. ఎందుకోగానీ ఆరోగ్యాల వైపు మనసు పోతోంది. ప్రస్తుతానికైతే దేవుడి దయ. గుండ్రాళ్లలా ఉన్నాం. ఒకవేళ నాకేమైనా అయితే ఎక్కడికీ కదిలే రకం కాదీయన. కొడుకూ, కూతురిళ్లలో ఉండే రకం కాదు. రుచులు తగ్గితే నాలుక కట్టేసుకొనే రకం. లాభం లేదు. ఆయన కిష్టమైనవన్నీ ఆయనే వండుకునే గలిగేలా ట్రైనింగివ్వాలి. ఎప్పటికీ కడుపు మాడ్చుకోరన్న గ్యారంటీతో నిశ్చింతగా ఉండొచ్చు’ నా కళ్లు చెమర్చాయి. శాడిస్టు శ్రీమతి. ఎంత శాడిజం కాకపోతే తాను లేకుండా నేనుండడాన్ని ఊహించుకొంటుందా? ఊహలోనైనా సరే.
డైరీ యథాస్థానంలో ఉంచి పిల్లిలా వంటగదిలోకి వెళ్లాను. రెండు కప్పులు కాఫీ కలిపి వాళ్లిద్దరికీ అందించాను. ఆ క్షణం కళ్లింతవి చేసి చూస్తోన్న శాడిస్టు శ్రీమతిని చూడాల్సిందే. వర్ణించలేను.

-డా.డి.వి.జి.శంకరరావు 9440836931