బాల భూమి

కాంతమ్మ దూరదృష్టి (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పు ష్పగిరి దేశపు రాజు మృగయా వినోదం కోసం అడవికి వెళ్లాడు. ఒక జింకను వేటాడుతూ అడవిలో దారితప్పిపోయాడు. ధనవర్మ అడవిలో తిరుగుతూ సరిహద్దు గ్రామం తాళ్లూరు చేరుకున్నాడు. ఊరి చివర ఇంట్లో వున్న కాంతమ్మ అతన్ని ఆదరించింది. రుచికరమైన భోజనం వడ్డించి ఆకలి తీర్చింది. ధనవర్మ ఎంతో సంతోషించాడు.
‘అమ్మా! నీ ఆతిథ్యానికి కృతజ్ఞుడను. నీ సేవకు మెచ్చాను. నేను ఈ దేశపు రాజు ధనవర్మని. నీకేం కావాలో కోరుకో!’ అని అడిగాడు.
కాంతమ్మ బాగా ఆలోచించింది. ఆమె భర్త చనిపోయిన దగ్గర్నుంచి కొడుకు బలదేవుడు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నాడు. పొలం పని, ఇంటి పని అంతా ఆమే చూసుకుంటున్నది. బలదేవుడు స్నేహితులతో తిరుగుతూ భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదు. ఇట్లాగే ప్రవర్తిస్తుంటే ఎవరూ పిల్లనివ్వరనీ, నీకు పెళ్లి కాదనీ బెదిరిస్తున్నా బలదేవుడు లెక్కచేయడం లేదు. ఇప్పుడు సమయం వచ్చింది. రాజుని ఈ విధంగా కోరింది.
‘అయ్యా! నాకు ఒక్కడే కొడుకు. ఈ పల్లెలో వాడికి తగిన పని దొరకడం లేదు. వాడిని మీ పక్కన ఉంచుకోండి. అంతకంటే నాకేం కోరికలు లేవు’ అన్నది కాంతమ్మ.
ధనవర్మ అలాగేనని తలూపి వెళ్లిపోయాడు. రాజు వెళ్లగానే బలదేవుడు తల్లి మీద మండిపడ్డాడు.
‘అమ్మా! నీకేమైనా బుద్ధి ఉందా? రాజుగారు ఏదైనా కోరుకోమంటే, నా కొడుకుని మీ పక్కన ఉంచుకోమంటావేమిటి? ఒక లక్ష వరహాలు అడిగితే ఇచ్చేవాడు కదా? ఈ తాటాకుల ఇల్లు పడగొట్టి పెద్ద భవనం కట్టుకుని ఉండేవాళ్లం’ అన్నాడు.
‘రాజు ధనం ఇస్తే అది మన దగ్గర ఎంతకాలం ఉంటుంది? నువ్వు స్నేహితులతో విందులు, వినోదాలు అంటూ తిరిగి ఖర్చుపెడతావు. మన దగ్గర ధనం వుంటే మన బంధువులకి ఎక్కడలేని అవసరాలు పుట్టుకొస్తాయి. ఒకరు మా అమ్మాయి పెళ్లికి అప్పు ఇవ్వమంటారు, మరొకరు ఇల్లు కట్టుకుంటున్నాం కాస్త ధనం అవసరమైంది అంటారు. గుర్తుంచుకో నాయనా! ధనం మన చెయ్యి జారిపోతే, తిరిగి మన అవసరాలకి రాదు. అర్థమైందా?’ అన్నది కాంతమ్మ.
‘నీ మాటలు నాకేం అర్థం కావడంలేదు. రాజుని నీ పక్కన నా కొడుకుని నిలబెట్టుకో అన్నావు. ఆయన ఏం చేస్తాడు?’ అన్నాడు విసుక్కుంటూ.
‘అది నీకు త్వరలో అర్థమవుతుంది’ అన్నది కాంతమ్మ.
* * *
ఒకరోజు పుష్పగిరి నుంచి రాజభటులు వచ్చారు కాంతమ్మ ఇంటికి. రాజుగారు బలదేవుడిని వెంటబెట్టుకుని రమ్మన్నారని చెప్పారు. కాంతమ్మ సంతోషించింది. బలదేవుడికి అనేక జాగ్రత్తలు చెప్పి బుద్ధిగా నడుచుకుంటే నగరంలో స్థిరపడతావన్నది.
పుష్పగిరి చేరిన తర్వాత బలదేవుడిని సైనిక శిబిరంలో ఉంచారు. ప్రతిరోజూ తెల్లవారుజామునే నిద్ర లేవాలి. సైనిక శిక్షణా మైదానంలో గంటసేపు పరిగెత్తాలి. వ్యాయామం చేయాలి. ఖడ్గ యుద్ధం నేర్చుకోవాలి. గుర్రపు స్వామీ, విలువిద్యలు అభ్యసించాలి.
ఇంతకాలం నీడ పట్టున స్నేహితులతో వినోదించిన బలదేవుడికి సైనిక కఠిన శిక్షణ నరకప్రాయంగా తోచింది. చెమటలు కక్కుతూ పరిగెత్తలేక, రోజంతా శిక్షణలో అలసిపోతూ ఉండేవాడు. ఒక్కోసారి శిబిరం నుంచి పారిపోవాలని ఆలోచించాడు. కాని ఎక్కడికి పోతాడు. తన స్వగ్రామం వెళ్తాడు. తర్వాత సైనికులు వెతుక్కుంటూ వచ్చి తీసుకెళ్తారనీ, కారాగారంలో పడేస్తారనీ, కఠినంగా శిక్షిస్తారనీ తెలిసి భయపడ్డాడు.
సంవత్సరంపాటు శిక్షణ తీసుకోవడంతో అలవాటుపడ్డాడు. ఇప్పుడు అతనికి అంత కష్టం అనిపించడంలేదు. బలదేవుడి సైనిక శిక్షణ పూర్తయిన తర్వాత అతన్ని ధనవర్మ రక్షణ భటులలో నియమించారు. రాజుగారి పక్కనే వుంటూ ఆయన రక్షణ బాధ్యత బలదేవుడిది.
రాజు కొలువులో ఉద్యోగం చేస్తున్నాడని బలదేవుడికి తాళ్లూరు గ్రామాధికారి తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేశాడు. కాంతమ్మ పల్లె వదిలి కొడుకు, కోడలితో పుష్పగిరిలో ఆనందంగా నివసిస్తోంది. తల్లి దూరదృష్టితో వ్యవహరించడం వల్లనే తను రాజు కొలువులో ఉద్యోగం సంపాదించి సుఖంగా ఉన్నాడని సంతోషించాడు బలదేవుడు.

-వాణిశ్రీ 8309860837