కథ

నేను సైతం (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డాక్టర్ విశాల్ తన ఛాంబర్‌లో కూర్చున్నాడు. ఆ రోజు పెద్ద గాలివాన ఉన్నందువల్ల ఛాంబర్ రూమ్‌లకు ముందున్న వెయిటింగ్ హాల్ పూర్తిగా ఖాళీగా ఉంది.
డ్రాయర్ తాళాలు తీసి అందులోంచి రెండు బంగారు గాజులు తీశాడు. వాటినే తదేకంగా చూస్తున్నాడు.
సన్నగా ఉన్నా ఒక్కో గాజు కనీసం ఇరవై ఐదు వేలైనా ఉంటుంది.
రెండు గాజులూ యాభై వేలు.
అతని కళ్లల్లో ఒక్క వెలుగు.
సరిగ్గా ఆరునెలల క్రితం...
మాధవి ఛేంబర్‌లోకి వచ్చింది. ఆమె ముఖంలో ఆతృత. ‘డాక్టర్‌గారు స్కాన్ చేయాల’ని అంది.
‘ఏంటమ్మా?’
‘ఇప్పుడు నాకు మూడో నెల’
‘అయితే’
‘రొటీన్ చెకప్ డాక్టర్’
‘ఇది ఎన్నో కాన్పు?’
‘మూడవది’
‘మొదటి రెండూ నార్మల్ డెలివరీనా?’
‘కాదు. రెండూ సిజేరియన్ ఆపరేషనే్ల’
‘ఆఖరి ఆపరేషన్ అయి ఎన్నాళ్లయింది?’
‘రెండేళ్లయింది డాక్టర్!’
‘సరే’ అంటూ నర్సుని పిలిచి విశాల్ రొటీన్‌గా చూసే బీపీలు - మామూలు చెకప్‌లు చేసి ‘రండమ్మా స్కానింగ్ చేయాలి’ అన్నాడు.
మొదట నర్సు వెళ్లి మాధవిని స్కానింగ్ రూంలో పడుకోబెట్టింది. అంతా రెడీ అయిన తర్వాత డాక్టర్ విశాల్ లోపలికి వెళ్లేడు. కడుపు మీద తెల్లబట్ట కప్పింది నర్స్. విశాల్ స్కానింగ్ మొదలుపెట్టేడు. అయిదు నిమిషాల తర్వాత ‘అంతా బాగుందమ్మా! నేను మందులు రాసిస్తాను. వాడండి’ అన్నాడు విశాల్ తృప్తిగా కుర్చీలోంచి లేస్తూ.
‘డాక్టర్! మీతో కొంచెం మాట్లాడాలి. లేవకండి’ అంది.
‘నా ఛాంబర్‌లో మాట్లాడుకుందాం’ అంటూ కుర్చీని వెనక్కి జరిపేడు విశాల్.
‘మీతో ఇక్కడే మాట్లాడాలి’ అంటూ అతని చేతిని గట్టిగా పట్టుకుంది మాధవి.
ఆమె ముఖాన్ని చూశాడు విశాల్. ఏసీ గది అయినా ముఖం మీద ఆతృత తెచ్చిన స్వేద బిందువులు ఉన్నాయి. ఆ కళ్లల్లో అలజడి. ఆ చేతుల్లో చిన్న వణుకు.
‘చెప్పండి’ అన్నాడు అది ఆతృత అని తెలుసుకున్న డాక్టర్. మాధవి డాక్టర్ పక్కనే ఉన్న నర్సుని చూస్తూ ‘మీరు బయటికి వెళ్లండి’ అంది.
విశాల్ ఆమె మాటలకు ఖంగు తిన్నవాడిలా ‘ఆమె తప్పనిసరిగా ఉండాలండీ. అది మా ఎథిక్స్’
‘డాక్టర్‌గారు నేను మీతో పర్సనల్‌గా మాట్లాడాలి’ అభ్యర్థనగా చూసింది మాధవి.
ఆమె కళ్లలోని బేలతనం గ్రహించిన విశాల్ ‘సిస్టర్! మీరు బయటికి వెళ్లండి’ అన్నాడు అధికారపూర్వకంగా.
నర్సు బయటికి వెళ్లింది. టేబుల్ మీద పడుకున్న మాధవిని అప్పుడు కొద్దిగా పరీక్షగా చూశాడు. ముఖం అందంగా, షార్ప్ ఫీచర్స్‌లో ఉంది. ఆమె చామనచాయ అయినా ఆకర్షణీయంగానే ఉంది. బరువైన ఆలోచనలతో ముఖం అలసటగా కనిపిస్తోంది.
ఆమెని లోగడ ఒకటి రెండుసార్లు చూశారు డాక్టర్ విశాల్.
పెద్దగా పరిచయం లేదు. అలాంటి ఇరవై ఐదేళ్ల వయసులో ఉన్న ఆమె తనతో అంత ఏకాంతంగా మాట్లాడాల్సిన దేముంది? ఊహించలేకపోయారు. నర్సు వెళ్లగానే విశాల్ ‘చెప్పండి’ అన్నాడు.
ఆమె లేచి కూర్చుని అతని రెండు చేతులూ పట్టుకుని ‘డాక్టర్! నా కడుపులో ఉన్నది బాబా? పాపా? చెప్పండి?’ అంది.
విశాల్ ఆమె ఎదురుగా ఉన్న బోర్డు చూపిస్తూ ‘అది చదవండి’ అన్నాడు ఆమె చేతుల్ని విడిపించుకునే ప్రయత్నం చేస్తూ.
‘ఆ రూల్సు నాకు తెలుసు. స్కానింగ్ అంటే తెలియనిదాన్ని కాదు. మీరు జెండర్ చెప్పకూడదని నాకు తెలుసు. మొదటి రెండుసార్లు ఏ పాప అయినా సరే అనుకున్నా. కాని ఇప్పుడు నా పరిస్థితి అది కాదు.’
‘ఎందుకు?’
‘ఇద్దరు ఆడపిల్లలు. మాకు వంశోద్ధారకుడు లేడు. ఈసారి అయినా మగపిల్లవాడు కావాలి’
‘అమ్మా! ప్రభుత్వం జెండర్ చెప్పద్దని రూల్ పెట్టకపోయినా నేను చెప్పేవాణ్ని కాదు. ఈ వివక్షత అంటే నాకు అసహ్యం’
ఆమె చేతులు నా చేతుల మీద ఇంకా గట్టిగా బిగుసుకున్నాయ్. అందులో ఆమె పట్టుదల బహిర్గతం అవుతోంది.
‘అలా వీలుకాదమ్మా’ అంటూ విశాల్ లేవబోయాడు.
‘డాక్టర్‌గారు! ఇది నా జీవన్మరణ సమస్య’
‘అలా ఎందుకంటావమ్మా?’
‘ఇప్పుడు కూడా ఆడపిల్ల అయితే... మా వంశం... మా వంశం...’ అంటూ ఆమె కళ్లవెంబడి కన్నీరు కారసాగేయి.
‘ఆడపిల్ల అయితే ఏం చేస్తావమ్మా?’
‘వెంటనే అబార్షన్ చేయించుకుంటాను’
‘నీ భర్తకి ఈ సంగతి తెలుసా?’
‘మేం ఇద్దరం చర్చించుకునే మీ దగ్గరకు వచ్చాను’
‘నువ్వు రాంగ్ డాక్టర్ దగ్గరకు వచ్చేవమ్మా’
‘మీరు రాంగో రైటో నాకు తెలియదు. నన్ను అర్థం చేసుకోండి’ ఆమె చేతుల పట్టు ఇంకా బిగిసింది. ఆ పట్టులో ఆమె మనసులో జరుగుతున్న తుఫానులు తెలుస్తున్నాయి.
‘సారీ అమ్మా!’ ఆ చేతుల్ని వెనక్కి తీసి విశాల్ లేవబోయాడు.
‘డాక్టర్ గారు ఆగండి’ అంటూ మాధవి తన చేతికున్న బంగారు గాజు ఒకటి తీసి విశాల్‌కు అందించింది.
‘ఏంటిది?’ అన్నాడు విశాల్.
‘ఇది ఉంచండి’
‘దేనికి?’ అన్నాడు విశాల్.
‘మీరు చేయబోయే ఫేవర్‌కి’
‘సారీ అమ్మా’ అంటూ లేచిన విశాల్ కుర్చీలోంచి ఒక అడుగు తలుపువైపు వేశాడు.
‘డాక్టర్‌గారు ఇది కూడా ఉంచండి’ అంటూ రెండో గాజు కూడా తీసి చేతిలో పట్టుకుంది.
తలుపు వైపు మరో అడుగు వేయబోతున్న విశాల్ అలాగే ఆగిపోయాడు.
ఆమె చేతులలోని రెండు గాజులను చూస్తున్నాడు.
మిలమిల మెరిసిపోతున్న ఆ గాజులు ఒక్కోటి కనీసం ఇరవై ఐదు వేలైనా ఉంటాయి.
అంటే యాభై వేలు. చాలా పెద్ద మొత్తం.
ఎన్ని కన్సల్టేషన్లు చేస్తే అంత వస్తుంది?
మెల్లగా అతని ముఖంలోని భావాలు మారసాగేయి. మారుతుండే ఆ ముఖ కవళికల్ని మాధవి పరీక్ష పత్రాల కోసం వేచి ఉన్న విద్యార్థిలా చూస్తూ ఉండిపోయింది.
అలా ఎదురుచూస్తున్నపుడు ఆమె ఊపిరి భారంగా కదలసాగింది.
కొన్ని క్షణాలే.
చేతుల్లోని గాజుల బంగారు వనె్న డాక్టర్ విశాల్‌ని వివక్షుణ్ణి చేసింది.
బరువుగా ఉండే అతని ముఖం తేలిక అయింది. కుర్చీలో కూర్చున్నాడు.
మాధవి ముఖంలో ఎంతో రిలీఫ్.
డాక్టర్ విశాల్ చేతిలోని ప్రోబ్ తిరిగి వేగంగా ఆమె కడుపు మీద కదలసాగింది.
ఐదు నిమిషాలు-
పది నిమిషాలు-
పదిహేను నిమిషాలు-
ఇరవై నిమిషాలు-
అంత సేపు ఊపిరి బిగబట్టినదానిలా మాధవి టెన్షన్‌తో అతని ముఖానే్న చూస్తోంది.
సరిగ్గా ఇరవై నిమిషాల తర్వాత విశాల్ మాధవి కడుపు మీద నించి ప్రోబ్ తీసేస్తూ, ఆమె ముఖం వంకే చూశాడు.
చిరునవ్వు నవ్వేడు.
‘అంటే డాక్టర్’ అంది.
‘వంశోద్ధారకుడు రాబోతున్నాడు’ అంటూ లేచాడు.
మాధవి ముఖం బంగారం కంటే ఒక వర్ణం ఎక్కువ రంగు సంతరించుకుంది. లేస్తూ డాక్టర్ రెండు చేతుల్నీ మరోసారి పట్టుకొని ‘్థంక్స్ డాక్టర్. థాంక్స్ మీరు చేసిన ఉపకారానికి మా వంశం నిలబడింది’ అంది.
విశాల్ చిరునవ్వు చిందిస్తూ ‘ఇక నించి హాయిగా ఉండండి. రాత్రిళ్లు తొందరగా నిద్రపొండి. బలమైన ఆహారం తీసుకోండి. మంచి కథలు వినండి. మంచి సంగీతం వినండి. అన్నీ మంచి మాటలే డెలివరీ టైమ్ దాకా’ అని ‘మాధవీ ఈ సంగతి ఎవరితోనూ చెప్పకండి. ఇది మనిద్దరి మధ్యే ఉండాలి’
‘నా భర్తకు చెప్తాను. ఇంకెవరికీ చెప్పను’
‘చెప్తే నాకు రిస్కు’ అన్నాడు విశాల్.
‘అలాంటిది మీకు రానీయను’
విశాల్ స్కానింగ్ రూంలోంచి వచ్చి తన ఛాంబర్‌లో కూర్చున్నాడు.
రెండు నిమిషాల తర్వాత మాధవి వచ్చి కుర్చీలో కూర్చుంది.
ఆమె ముఖం సంతోషంతో వెలిగిపోతోంది.
ఆనందం ఆడవాళ్లకు ఇంత అందం తెస్తుందని విశాల్‌కు తెలియదు.
ఒక్కసారి జేబు తడుముకుని అందులోని గాజులు తీసి టేబుల్ డ్రాయర్‌లో వేశాడు. మందులు రాసి ఇవ్వగానే మాధవి ఎగిరి గంతులేసే లేడి పిల్లలా వెళ్లిపోయింది.
విశాల్ కుర్చీలో కూర్చున్నాడు వెనక్కి జారగిలబడి. రోజులు దొర్లిపోయాయి.
ఈ రోజు మాధవికి సిజేరియన్.
చేతుల్లోకి తీసుకున్న గాజుల్ని ఒక్కసారి తృప్తిగా తడుముకున్నాడు. వాటిని అలా చూస్తూ తడుముతుంటే ఎంతో ఆనందమనిపించింది.
ఛాంబర్ బయట అంతా కోలాహలంగా ఉంది.
‘ఏంటి సందడి అంతా’ అని అడిగాడు నర్సుని పిలిచి.
‘డాక్టర్! మాధవి భర్త కిషోర్ ఒక ట్రాలీలో స్వీట్లు తెప్పించాడు సార్’
‘ఎందుకు?’
‘అతని భార్యకి సిజేరియన్ ఉందిగా?’
‘ప్రతీ సిజేరియన్‌కి ఇలానే ట్రాలీలో స్వీట్స్ తెప్పిస్తాడా?’
‘లేదు. ఈసారే’
‘ఈసారి ఏంటి ప్రత్యేకత?’
‘వంశోద్ధారకుడు రాబోతున్నాడట సార్’
‘ఎట్లా తెలుసు వాళ్లకు?’
‘అది మాత్రం చెప్పటంలేదు’
‘ఎవరైనా చేయి చూసి చెప్పారేమో?!’
‘ఏం చూసి చెప్పారో తెలియదు సార్!’
ఒక్కసారి విశాల్ ఖంగుతిన్నాడు. నర్సు ముఖంలోకి చూశాడు. ఆమె ముఖం మామూలుగానే ఉంది. ఆమె అన్న మాటల్లో ఏ వెటకారం లేదు.
ఛాంబర్ బయటికొచ్చాడు విశాల్.
బయట వెయిటింగ్ ఏరియాలో కుర్చీల మీద దొంతర్లుగా పెట్టి ఉన్నాయ్ మిఠాయి డబ్బాలు.
వాటి పక్కన గిఫ్ట్ పాకెట్లు.
పావు స్థలం నిండిపోయింది.
పక్కనే మాధవి భర్త.
విశాల్‌ని చూస్తూ ఒక్క నవ్వు నవ్వాడు.
విశాల్ నవ్వుతో తిరిగి బదులు ఇచ్చాడు.
విశాల్ అందర్నీ దాటుకుంటూ ఆపరేషన్ థియేటర్ వైపు నడిచాడు.
సిజేరియన్‌కి అంతా సిద్ధమైంది. అనెస్తిటిష్ నడుముకు మత్తుమందు ఇచ్చాడు.
విశాల్ సర్జన్ డ్రెస్‌లో మాధవి ముందుకు వచ్చాడు. విశాల్ కళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. అతని మాస్క్ నించి మిగిలిన శరీరం అంతా బట్టలతో కప్పి ఉంది.
మాధవి విశాల్ కళ్లని చూసింది. ఆమె ముఖం అంతా కృతజ్ఞతా భావంతో నిండి ఉంది.
మాతృత్వపు పరాకాష్టత తెచ్చిన కొత్త అంశం కనిపించింది ఆమె ముఖంలో.
విశాల్ ముఖంలో ఏ భావం లేదు.
ఆపరేషన్ మొదలయింది. సరిగ్గా ఐదు నిమిషాలకు సిజేరియన్ ద్వారా డెలివరీ అయింది.
డెలివరీ అయిన పాపని తీసి విశాల్ అసిస్టెంట్ తల్లికి చూపించేడు. ఆమె ముఖం పాలిపోయింది.
అంత సంతోషం క్షణంలో ఎగిరిపోయింది.
‘డాక్టర్! డాక్టర్!’ అంది ఆమె.
విశాల్ ముఖంలో ఏ భావం ప్రకటితం కాలేదు.
‘సేడేషన్’ అంటూ గట్టిగా అరిచేడు విశాల్.
మాధవికి నిద్రకు మందు ఇవ్వడం, ఆమె నిద్రలోకి జారిపోవడం అంతా క్షణంలో జరిగిపోయింది.
అరగంట తర్వాత విశాల్ డ్రెస్ మార్చుకుని బయటికి వచ్చేడు. అతను నిర్మానుష్యంగా ఉన్న వెయిటింగ్ హాలు చూసి ఖంగుతిన్నాడు.
అక్కడ స్వీట్స్ డబ్బాలుగాని, గిఫ్ట్ ప్యాకెట్లు గాని ఏమీ లేవు. అంతా ఖాళీ.
విశాల్ అక్కడుండే అటెండర్ని అడిగేడు. ‘ఇక్కడ ఉండే వస్తువులన్నీ ఏం అయ్యాయి’.
‘ఇప్పుడు ఆపరేషన్ అయిన పేషెంట్ భర్త ‘ఆడపిల్ల పుట్టిందని తిరిగి షాప్‌కి పంపించేసేడు సార్’
ఒక్క క్షణం విశాల్ ముఖం మ్లానమైంది. వెంటనే సర్దుకున్నాడు.
అతని హృదయం ఇప్పుడు చాలా తేలికగా ఉంది.
ఏదో జ్ఞాపకం వచ్చినవాడిలా మాధవిని షిఫ్ట్ చేసిన గదికి వెళ్లాడు. ఇప్పుడే ఆమె మత్తులోంచి బయటికి వస్తోంది.
మొద్దుబారిన మనస్సుతో ఆమె చేతులు ఎత్తింది. ‘డాక్టర్’ అంది మగతగా.
విశాల్ తన జేబులోకి చేతులు పోనిచ్చాడు. అందులో ఉన్న రెండు గాజులూ తీశాడు.
చెరో చేతికీ ఒక్కో గాజు తొడిగి, ఆమె చేతిని పాప మీద ఉంచాడు. పాప ఏ కలత లేకుండా నిదురపోతోంది. పవిత్రంగా, ఏ చీకూ చింతా లేకుండా నిదురపోతున్న పాపని చూడగానే అతని మనస్సు ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయింది.
మూడో నెలలో ఛిద్రం కావలసిన పాప - నిండా తొమ్మిది నెలలతో తల్లి పక్కన ఎంత ప్రశాంతంగా పడుకుందో.
‘యస్ నేనే కారణం. నేనే నేనే నేనే’ అని గొణుగుకుంటూ తన ఛాంబర్‌లోకి వెళ్లి కుర్చీలో కూర్చుని ఐపాడ్ ఓపెన్ చేశాడు. అందులో లిరిక్స్ రాసి, ట్యూన్ చేసి, తన గొంతుకతో పాడిన రమేష్ శ్రీరంగం గళం మంద్రస్థాయిలో వినిపిస్తోంది.
ఆడపిల్ల మాకు వద్దని
బాధ్యత మాకు తగదని
కడపులోనే నిన్ను చంపితిరి
తిరిగి నన్ను పైకి పంపితిరి
మగ పిల్లాడే కావాలని
వారసుడు వాడేనని
మా పేరు నిలిపేది వాడేనని
నమ్మితిరి నమ్మితిరి
కడుపులోన చంపితిరి
ఇంటి పేరు పెట్టుకుంటారని
ఇంటిల్లిపాదిని చూస్తారని
తోడు నీడగా ఉంటాడని
నమ్మితిరి మీరు నమ్మితిరి
కడుపులోన నన్ను చంపితిరి
మగపిల్లాడు పుట్టాడని
సంబరాలు చేసుకుని
కోట్లు పెట్టి చదివిస్తిరి
ఏదో చేస్తాడని భావిస్తిరి
చదువుకోగానే వారు యు.ఎస్. కు పోతున్నారు
నా కొడుకు యు.ఎస్.కు పోతాడని
పొంగిపోతిరి
పోయాకా, డాలర్లు వచ్చాక
తెల్లతోలు చూసి దేశాన్ని మరిచాడు
పెద్ద కారు కొన్నానని
పెద్ద ఇంట్లో వున్నానని
ఫొటోని మాత్రం పంపాడు
ఫోను చేయడం మరిచాడు
ఎప్పుడు వస్తారని అడిగితే
రానని చెప్పాడు.
... ...
పాట మొత్తం విన్నాడు. తనలోనే గొణుగుకుంటూ నేను ఒక పాపను చంపకుండా కాపాడాను అని అనుకుంటూ రమేష్ శ్రీరంగానికి ఫోన్ చేశాడు.
అవతల నించి ‘యస్. నేను రమేష్ శ్రీరంగాన్ని మాట్లాడుతున్నాను. ఎవరు మాట్లాడేది?’ అడిగాడు.
‘నేనో డాక్టర్‌ని. ‘ఆడపిల్ల మాకు వద్దని...’ పాట నన్ను ఎంతో ప్రభావితం చేసింది. మీరు పాడి జనాన్ని చైతన్యవంతుల్ని చేస్తే, నేను ఆ చైతన్యంతోనే ఒక గర్భం విచ్ఛిన్నం కాకుండా కాపాడాను. థాంక్స్ రమేష్‌గారూ’ అంటూ మాధవి రావడం నించి గాజులు ఇచ్చి తనను ఏ విధంగా మభ్యపెట్టదలచుకుందో వివరించాడు.
‘ఒక ఆడపిల్లను కాపాడినందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ మీకు అబ్బాయి అని చెప్పవలసిన అవసరం ఏం ఉందండీ. ఏదైనా సంతోషంగా స్వీకరించే కౌన్సిలింగ్ ఇచ్చి ఉండాల్సింది’ అన్నాడు రమేష్.
‘నేను వారికి కావలసింది ఇవ్వలేకపోతే ఇచ్చేవాళ్లను వెదుకుతూనే ఉంటారు. బంగారానికి ప్రలోభపడే ఒక్కడు అయినా దొరకకపోడు. అలాంటి వాడి చేతుల్లో పడితే ఆడపిల్ల అని తెలుసుకున్న మాధవి అబార్షణ చేయించుకోకుండా ఉంటుందా?’
అవతల నుంచి నిశ్శబ్దం. ఏ మాటా లేదు. ‘రమేష్‌గారూ.. లైన్‌లో ఉన్నారా?’ అంటూ ప్రశ్నించాడు విశాల్.
‘అవన్నీ మరచిపోండి డాక్టర్! బిడ్డ కడుపులో ఉన్నంతసేపే మన రక్షణ కావాలి. ఒక్కసారి బయటికి వచ్చిన తర్వాత... కడుపుతో ఉన్న స్ర్తి తల్లి అయింత్తర్వాత ఆ మాతృత్వమే పాపకి కవచం అవుతుంది. ఆ తల్లే పిల్లని రక్షించడానికి కంకణం కట్టుకుంటుంది. ఇక నాకు ఆ పిల్ల గురించి ఏం భయంలేదు’ అన్నాడు రమేష్.
రమేష్ మాటలు విశాల్‌ని ఎంతగానో ఆకట్టుకొన్నాయి. తను రాసిన పాట ఒక్క ఆడపిల్లని ఈ భూమీది తీసుకువచ్చిందని రమేష్ ఆనందిస్తే... ఆ పాట ద్వారా ప్రభావితమై ఒక మంచి కార్యాన్ని భుజాల కెత్తుకున్నందుకు డాక్టర్ విశాల్ పులకించిపోయాడు.

డా.ఎస్.ఎస్.శాస్ర్తీ
మహాలక్ష్మి నర్సింగ్ హోమ్
3-2-320, ఎస్‌ఎస్ స్ట్రీట్
సికిందరాబాద్-500 003
040-27812840

-ఎస్.ఎస్.శాస్ర్తీ