కథ

రిటర్న్ ఆన్ ఇనె్వస్ట్‌మెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ
-----------------------------------------

వారంలో ఆనంద్ ఎక్కువ ఆనందంగా వుండే రోజు శనివారం. ఎందుకంటే ఇంకా ఆదివారం ఉంది అనే ఆశ ఆనంద్‌కి చాలా ఇష్టం. ప్రతి వారంలాగానే ఈ శనివారం కూడా ఆనంద్ ఆలస్యంగా నిద్ర లేచే ఉద్దేశంతో నిద్ర పోతున్నాడు.
‘సున్ రహా హాయ్ నా.. తుమ్.. రో రహీ హు మై..’ అనే హిందీ పాప మొదట లీలగా, తరువాత మెల్లిగా ఆ తరువాత గట్టిగా వినపడి ఆనంద్ నిద్ర లేచాడు. పాడింది, ఆనంద్ భార్య అవని. వినసొంపుగా పాడటం వలన ఆనంద్ ఆనందంగానే నిద్రలేచాడు, త్రివిక్రమ్ సినిమాలతో బాగా ప్రభావితమైన ఆనంద్ కొంచెం ఎక్కువగా ప్రాసలు, పంచ్‌లు వెయ్యడానికి ప్రయత్నిస్తూంటాడు. ఆ ఉద్దేశంతోనే అవని దగ్గరకు వెళ్లి ‘ఏడిచేదేదో తనలో తాను ఏడవచ్చుగా.. వింటున్నావా అని అడగడం ఎందుకు? ఏడుపు తన తనకోసమా? పక్కవాళ్ల కోసమా?’ అన్నాడు వెటకారంగా నవ్వుతూ.. దానికి అవని ‘్భలే వారే! ప్రతి రూపాయి పెట్టుబడికి లాభం ఎలా చూసుకుంటామో, మనం చేసే ప్రతి పనికి లాభం ఉండాలి లేకపోతే ఎందుకు దండగా.. దీనినే మీ పరిభాషలో రిటర్న్ ఇన్ ఇనె్వస్ట్మెంట్ అంటారు’ అని ఠక్కున సమాధానమిచ్చి తన పనిలో తానూ నిమగ్నమైంది. అవనితో ఎందుకులే సాగతీయటం అని తను ఇచ్చిన కాఫీని ఆస్వాదిస్తూ వాట్స్ అప్, ఫేస్‌బుక్‌ల పనిలో నిమగ్నమై పోయాడు. ఆనంద్ చాలా సాయాలు వాట్స్ అప్, ఫేస్‌బుక్‌లలో చేస్తూ ఉంటాడు. ఒక గ్రూప్‌లో వొచ్చే ప్రాణాంతక విషయాలు వేరే గ్రూప్స్‌కి పంపించడం, పిల్లలకి ఎవరైనా స్కాలర్‌షిప్స్ అవీ కావాలి అంటే ఏయే ఫోన్ నెంబర్స్‌కి కాల్ చెయ్యాలో తెలిపే సందేశాలు.. ఓ రకం కోల్డ్‌డ్రింక్స్ తాగవద్దు అందులో ఎయిడ్స్ పేషెంట్ వాడి రక్తం పడింది అన్న వెంటనే మిగిలిన గ్రూప్స్‌కి మెసేజ్ పంపించడం లాంటివి చాలా సాయాలు చేస్తూ ఉంటాడు. అలాగే ఫేస్‌బుక్‌లో బాధలో వున్నవాళ్ల ఫొటోస్‌కి లైక్ కూడితే ఫేస్‌బుక్ డబ్బులిస్తుంది అంటే వెంటనే లైక్ చేయటం, షేర్ చేయటం లాంటివి చేస్తూ ఉంటాడు. అయితే ఎప్పుడూ ఆ ఫొటోలో వున్నా వ్యక్తిది నిజమైన ఫొటోనా అని గాని, ఫేస్‌బుక్ నిజంగానే డబ్బులు ఇచ్చిందా అని గాని మళ్లీ ఎక్కడా ఆరా తీయలేదు.
ఇంతలో ఆనంద్, అవనిల కూతురు ఆకాంక్ష వొచ్చి, ఆనంద్ చెయ్యి పట్టుకొంది. ‘నాన్నా.. రోడ్లు చాలా డర్టీగా ఉంటాయి కదా’ అంది. దానికి ఆనంద్ ‘అవునమ్మా చాలా అపరిశుభ్రంగా ఉంటాయి’ అన్నాడు తరువాత ప్రశ్నకి సిద్ధపడుతూ. ఇది ఆనంద్‌కి, ఆకాంక్షతో మామూలే. ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో తీసుకెళుతుంది. ఇలాగే ఓసారి, ఆనంద్ ఆకాంక్ష కార్‌లో వెడుతుంటే ప్రశ్నల వర్షం మొదలుపెట్టింది ఆకాంక్ష.
‘నాన్నా.. అప్పుడు ఎందుకు తిట్టావు?’ దానికి ఆనంద్ ‘ఎప్పుడు?’
‘అప్పుడు నాన్నా.. పిజ్జాహట్‌లో తిట్టావు కదా..’
ఆనంద్ ‘అప్పుడు అల్లరి చేసావు మరి’
‘ఇప్పుడు చెయ్యలేదు కదా’ అంది ఆకాంక్ష. దానికి ఆనంద్ ‘ఇప్పుడు తిట్టలేదు కదా’ వెంటనే ఆకాంక్ష కొంచెం గట్టిగా,
‘ఇప్పుడు అల్లరి చెయ్యలేదు కదా.. అప్పుడు ఎందుకు తిట్టావ్ అని అడుగుతున్నా’
విషయం అర్థమైన ఆనంద్ వెంటనే ‘పిజ్జా హట్‌కి వెళ్లాలా?’ అన్నాడు నవ్వుతూ.
ఆకాంక్ష ‘ఇప్పుడే వెళ్దాం నాన్నా.. ప్లీజ్’
ఇలాంటి చాలా అనుభవాలతో రాటుదేలిన ఆనంద్ తర్వాత ప్రశ్నలకి సిద్ధంగా ఉన్నాడు.
ఆకాంక్ష రెండవ ప్రశ్న అడగటం మొదలుపెట్టింది అదేమిటంటే-
‘నువ్వు రోడ్డు మీద చేతులు పెట్టకూడదు అని చెప్పావా..? పెద్దవాళ్లు అస్సలు పెట్టరు అని అన్నావా..?’ అన్నిటికి ఊ కొడుతున్నాడు ఆనంద్. ‘నిన్న రైల్వేస్టేషన్ దగ్గర ఒక అంకుల్ రోడ్ మీద చేతులు పెట్టి వెడుతున్నాడు.’
ఒక్క క్షణం ఆనంద్‌కి అర్థం కాలేదు. వెంటనే ‘ఈసారి కనిపిస్తే చెప్పు, చెపుదాం తప్పని’ అన్నాడు.
ఇంతలో అవని వచ్చింది. అవనితో ఆనంద్ ‘ఈ రోజు తొందరగా వంట చేస్తే మనం ఆకాంక్ష పుట్టినరోజు షాపింగ్ చేద్దాం’ అన్నాడు, దానికి అవని ‘అప్పుడే ఏం తొందర ఆనంద్, ఇంకా టైం ఉంది కదా’ అంది.
దానికి ఆనంద్ ‘ఆ తరువాత వారాంతం అవలేదనుకో మళ్లీ ఇబ్బంది పడాలి తేడావొస్తే ఆకాంక్ష అలుగుతుంది. ఈ మధ్య ఇదోటి నేర్చింది’ అన్నాడు నవ్వుతూ.
వెంటనే ఆకాంక్ష ‘వెళ్దాం వెళ్దాం’ అని అరవసాగింది. చేసేదేమీ లేక అవని కూడా సరే అంది.
ఆ రోజు మధ్యాహ్నం ఆనంద్, అవని, ఆకాంక్ష కారులో బయలుదేరారు.. ఏదో మాటల్లో ఉండగా ఆకాంక్ష ‘నానా.. నానా.. నే చెప్పిన అంకుల్, చూడు రోడ్ మీద ఎలా చేతులు పెట్టాడో’ అని చూపించింది. ఇద్దరు అటు వైపు చూశారు వెంటనే. అక్కడ ఒకతను కాళ్లు సరిగా లేకపోవటం వలన చేతులతో డేకుతూ వెడుతున్నాడు. ఆనంద్, అవనిలకు చాలా జాలి వేసింది. మండుటెండలో కారులో వెళ్లడమే కష్టంగా ఉంటే రోడ్ మీద అలా చేతులతో వెళ్లటం యెంత కష్టమో కదా అని అనుకున్నారు.
అలాంటి వాళ్లని ఆనంద్ అవని ఇదివరకు చూశారు కానీ ఇంతలా ఎప్పుడూ ఆలోచించలేదు, నిజానికి అతనినే అక్కడ చాలాసార్లు చూశారు కూడా. సముద్రం లాగానే మనసు కూడా ఎప్పుడు ఎలా స్పందిస్తుంటుందో తెలియదు.
ఆ రోజు ఆనంద్ షాపింగ్ అన్యమనస్కంగానే గడిచింది. ఆ రాత్రి ఆనంద్, అవనితో ‘పోనీ మన పిల్ల పుట్టనరోజు సందర్భంగా అతనికి సాయం చేద్దామా’ అని అన్నాడు. దానికి అవని ‘సరిగ్గా నేనూ అదే అనుకుంటున్నాను ఆనంద్, ఐతే డబ్బులు ఇవ్వొద్దు అయిపోతాయి. తనకి పనికొచ్చే సైకిల్ ఇద్దాం’ అంది. ఆనంద్ ఏదో ఆలోచిస్తున్నాడు ఇంకా. తాను చెప్పింది అర్థం కాలేదనుకొని అవని ఇంకా వివరించటం మొదలుపెట్టింది. ‘అదే ఆనంద్ కుంటివాళ్లు నడుపుతారు మూడు చక్రాల బండి’ అంది.. దానికి ఆనంద్ ‘అది అర్థం అయ్యిందిలే. ఇంతకీ అది అతనికి నిజంగానే ఉపయోగపడుతుందా లేదా అని ఆలోచిస్తున్నాను’ అన్నాడు.
దానికి అవని, ‘అవును.. తీరా కొన్నాక నాకు వొద్దు అంటే? వేస్ట్ అయిపోదూ నేను వెళ్లి రేపు అడిగి వొస్తా. అప్పుడు కొందాం’ అంది.
ఇద్దరూ త్వరలో వారు చెయ్యబోయే పనిని ఫేస్‌బుక్‌లో ఏయే ఫొటోస్‌తో పెట్టాలో ఎలాంటి క్యాప్షన్స్ పెట్టాలో అని ఆలోచిస్తూ పడుకున్నారు.
ఆనంద్ చాలా ఉత్సాహంగా పొద్దునే లేచి తాను తలపెట్టిన మహత్తర కార్యం, కార్యాచరణ మొదలుపెట్టాడు. అందులో భాగంగా చిన్ననాటి నుంచీ ఇప్పటికీ స్నేహితుడిగా నిలదొక్కుకున్న విజయగాడికి అదే విజయ్‌కి ఫోన్ చేసి ‘అరేయ్, నేను ఒకతనికి మూడు చక్రాల సైకిల్ ఇద్దామనుకుంటున్నాను రా.. అది ఎక్కడ దొరుకుతుందో తెలుసా నీకు?’ అన్నాడు. దానికి ఆ సదరు విజయ్,
‘గుడ్ రా మంచిదే. కానీ చూసుకో. మొన్నోసారి వొంట్లో బాలేదంటే 100 రూపాయలు ఇచ్చా. తీరా చూస్తే ఏ రోగం లేదని తెలిసింది. అంతా డబ్బు కోసం అలా’ అంటూ ఏదో చెప్పబోయాడు. విజయ్ మాటలని మధ్యలోనే కట్ చేస్తూ ‘కథలు ఉంటే సినిమా వాళ్లకు చెప్పు. నాకు కాదు. నువ్వు 100 రూపాయలు ఇవ్వటం కూడానా... నిన్ను అడగటం నాది బుద్ధి తక్కువ.. నా కొలీగ్, రాజ్‌ని అడుగుతా’ అని ఫోన్ పెట్టేశాడు. వెంటనే రాజ్‌కి కాల్ చేసి విషయం చెప్పాడు. దానికి రాజ్ ‘మంచిదేరా.. కానీ అతని కంటే మురికివాడల్లో ఉండే పిల్లలకి ఏమైనా పుస్తకాలూ, బట్టలు లాంటివి ఇస్తే బాగుంటుంది కదరా.. అదే డబ్బుతో ఎక్కువ మందికి సాయం చెయ్యొచ్చు ఆలోచించు’ అన్నాడు. దానికి ఆనంద్ వెంటనే ‘ఒరేయ్ నీ ఫోన్ నెంబర్ ఇదే కదా మారిస్తే వెంటనే చెప్పు రోయ్..’ అన్నాడు.
రాజ్‌కి ఏమీ అర్థం కాలేదు.
‘నేను ఒకటి చెబుతుంటే నువ్వు ఒకటి చెబుతావేంటి రా’ అన్నాడు, దానికి ఆనంద్ ‘అదేరా నేనూ చెప్పేదీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. సలహా కావలసి వస్తే ముందు నీకే ఫోన్ చేస్తా..’ అని అన్నాడు. వెటకారం అర్థమైన రాజ్ ‘నాంపల్లి స్టేషన్ పక్కన చాలా సర్జికల్ షాప్స్ చూశా. అక్కడ ఉండొచ్చేమో ప్రయత్నించు’ అన్నాడు ముక్తసరిగా.
ఆనంద్ కూడా రెండు మూడు సార్లు చూశాడు. అక్కడ చాలా షాప్స్ ఉన్నాయి. ఇంకా ఉత్సాహంగా బయలుదేరడానికి సిద్ధపడుతూ అవనితో ‘నేను ఎంఎంటిఎస్’లో నాంపల్లి వెళ్లి ఆ బండి కొని తెస్తా’ అన్నాడు.
‘అదేంటి నన్ను విషయం కనుక్కోమన్నారుగా. ఇప్పుడేం తొందర వచ్చింది. లేడికి లేచిందే పరుగు’ అని విసుక్కుంది అవని.
‘అది కాదు అవనీ.. ఆ సైకిల్ ఎంత ఉంటుందో ఎక్కడ దొరుకుతుందో తెలియాలి. దాన్ని ఎలా తీసుకురావాలో తెలుసుకొని వీలైతే ఈ రోజే తెచ్చామనుకో. పుట్టినరోజు నాడు చిట్టితల్లి చేతుల మీదుగా ఇవ్వొచ్చు’ అన్నాడు తన ప్లానింగ్‌కి మురిసిపోతూ.
తన భర్త తెలివికి లోలోనే మురిసిపోతూ ‘సరే మీ ఇష్టం’ అంది.
అన్నట్టుగానే టిఫిన్ తిని బయలుదేరాడు ఆనంద్, ట్రైన్ ఎక్కిన ఒక అరగంటకి అవని ఫోన్ చేసి అతనికి అవసరమేనట అని చెప్పింది.
కానీ ఆనంద్ ఆలోచనలు అన్నీ పొద్దుటి నుండి జరిగిన సంభాషణల మీదనే వున్నాయి. వాళ్లు చెప్పేది కూడా ఆలోచించదగిన విషయాలే. కానీ అడుక్కోడం కోసం నటిస్తారా.. ఒకవేళ నటించినా.. అవని కనిపెట్టలేదా’ ఇలాంటి ఆలోచనలో ఉండగానే నాంపల్లి స్టేషన్ వచ్చింది. దిగి ఎదురుగా ఉన్న షాప్‌కి వెళ్లి ‘ఈ కాళ్లు సరిగ్గా లేని వాళ్లు కూర్చొని నడుపుకునే బండి ఉందా’ అని అడిగాడు.
ఆ షాప్ వాడు ‘ఉంది సార్’ అని చక్రాల కుర్చీ చూపించాడు.
‘ఇది కాదు ఫెడల్ ఉండే సైకిల్ లాంటిది’ అని వివరించాడు ఆనంద్.
షాప్ వాడు లేదు అని చెప్పాడు.
ఇదే అనుభవం వరుసగా అన్ని షాప్స్‌లో ఎదురయింది ఆనంద్‌కి.
అలా ఎండలో ఒక గంటన్నర తిరిగాక వాట్స్‌అప్ గ్రూప్‌లో ఈ మూడు చక్రాల సైకిల్ ఎక్కడ దొరుకుతుంది?’ అని మెసేజ్ పెట్టాడు.
చిన్నా చితకా వాటికి కూడా సమాధానాలు పెట్టే మెంబర్స్ కూడా ఎవరూ సమాధానం ఇవ్వలేదు. సరే అని వేట కొనసాగించాడు.
అలా ఒక చిన్నషాప్ వాడితో మాట కలిపి కొంచెం ఎక్కడ దొరుకుతుందో కనుక్కోమన్నాడు. ఏ కళన వున్నాడో ఆ షాప్ వాడు కూర్చోమని తనకు తెలిసున్న వారికి పోన్ చేసి వివరాలు అడగటం మొదలుపెట్టాడు. మధ్యమధ్యలో ఆనంద్‌తో మాట్లాడుతూ ‘ఇంతకీ ఎవరికి సార్, మీ చుట్టాలకా’ అన్నాడు. ఆనంద్ కాదని తమ ఇంటికి దగ్గర్లో వుండే ఒక అతనికి అని వివరాలు చెప్పాడు. ఇలా పాప పుట్టిన రోజుకి ఇద్దాం అనుకుంటున్నాము అని. దానికి ఆ షాప్ వాడు ఒక కాల్‌లో మాట్లాడి ‘్భలేవారే సార్. బండి ఇస్తే వదలడు సార్ ఇంకా ఏవో కావాలి.. అని వెంటపడతారు సారూ వీళ్లు’ అనేసి, కోటి ఉమెన్స్ కాలేజీ నుంచీ తిన్నగా వెడితే ఒక షాప్‌లో చేస్తారంట అని చెప్పాడు.
పొద్దునే్న ఈ మాట విని ఉంటే ఆనంద్ వేరేలా సమాధానమిచ్చేవాడు కానీ ఇప్పుడు ఆనంద్‌కి సమాధానమిచ్చే ఓపిక, ఉత్సాహం అస్సల్లేవు. థాంక్స్ చెప్పి బయల్దేరాడు.
ఆనంద్‌కి షాప్ దొరికింది. వెంటనే లోపలికి వెళ్లి అడగటం షాప్ వాడు ‘దొరుకుతుంది సార్’ అనటం వెంటనే జరిగిపోయాయి.
‘ఐతే ఆర్డర్ మీద మాత్రమే చేస్తాం సార్. చేసి పెడితే పోవు’ అన్నాడు.
మళ్లీ ఆ షాప్ వాడూ అదే ప్రశ్న ‘ఎవరికి సార్’ మళ్లీ ఆనంద్ అదే సమాధానం.
కానీ ఈసారి షాప్ వాడు చెప్పిన సమాధానంతో ఆనంద్‌కి మతి పోయింది. ‘వీళ్లు అమ్మేసుకుంటారు సార్ చూసుకోండి..’ చాలా యధాలాపంగా అనేసి తన పని తాను చేసుకుంటున్నాడు. సైకిల్ కొని వీలైతే తీసుకెళదాం అనుకున్న ఆనంద్ వౌనంగా ఆ సైకిల్ షాప్ వాడి విజిటింగ్ కార్డు తీసుకొని బయటకి నడిచాడు. అలానే ఇంటికి చేరి కుర్చీలో కూలబడ్డాడు. సాయం చేయటం ఇంత కష్టమా అని ఆనంద్‌కి అనిపించింది.
ఇంతలో అవని వచ్చి తాను ఎంత చాకచక్యంగా అతనితో మాట కలిపిందీ, ఇస్తాను అని మాట ఇవ్వకుండా ఎలా కావలసిన విషయం రాబట్టిందీ, అతని ఫొటో ఎలా చాకచక్యంగా తీసిందీ.. చెప్పుకుంటూ పోతోంది. ఆ ప్రవాహం చూస్తే ఆనంద్‌కి తన చిన్నప్పుడు టీవీలో వచ్చే ఒక మోటార్‌సైకిల్ యాడ్ గుర్తుకు వచ్చింది, సాగిపోతూనే ఉంటుంది అలా.. లీటర్‌కి 100 కిలోమీటర్లు, మామూలుగా ఐతే అనేవాడు కానీ ఇప్పుడు అనలేదు.
ఆనంద్, ముందు రోజు జరిగిన సంఘటనల హ్యాంగ్ ఓవర్‌తోనే ఆఫీస్‌కి బయలుదేరాడు. అప్రయత్నంగానే ఆనంద్ కళ్లు అతని కోసం వెతికాయి. అక్కడ అలానే అడుక్కుంటున్నాడు అతను.
* * *
ఆఫీస్‌లో అంతా ఔటింగ్‌కి ఎక్కడకు వెళ్లాలి అని తెగ చర్చించుకుంటున్నారు. అందరూ హైదరాబాద్‌కి దగ్గర్లో వున్న అనంతగిరి అడవులకి ట్రెక్కింగ్‌కి వెళ్లాలి అని అనుకుంటున్నారు. ఐతే వారి సమస్య అంతా వాళ్ల ప్రాజెక్ట్ మేనేజర్ ప్రసాదరావు గారికి ఎలా చెప్పాలి అని. రోజూ ఆయనతో భోజనం చేసే ఆనంద్ ఐతే మంచిది అని ఆ బాధ్యత ఆనంద్ నెత్తిన పెట్టారు మిగిలిన వాళ్లంతా. ఆనంద్‌కి తప్పలేదు. ఎలా మాట్లాడాలిరా అనుకుంటూ పక్కనే వున్న కొలీగ్‌తో ‘ఇంతకీ ప్రసాద్‌గారు వొచ్చారా’ అన్నాడు.
‘ఆ వచ్చారు పొద్దునే్న ఆయన కారు చూశా’ అని మాట కట్ చేసేసింది ఆ కొలీగ్. ఇంకా మాట్లాడితే సాయం రమ్మంటాడేమో అని. ఇంక తప్పదు. భోజనం టైంలో మాట్లాడాలి అని తన పనిలో తాను పడ్డాడు.
ఆనంద్‌కి తెలియకుండానే భోజనం టైం అయ్యింది. ‘్భజనం కూడా ముఖ్యమే ఆనంద్, పని ఒక్కటే కాదు’ అన్న మాటలకు తలఎత్తి చూసిన ఆనంద్‌కి ఎదురుగా ప్రసాద్‌గారు కనిపించారు. ‘వస్తున్నా ప్రసాద్‌గారూ’ అని కంప్యూటర్‌ని లాక్ చేసి తన లంచ్ బాక్స్ తీసుకొని బయలుదేరాడు, ప్రసాద్ గారికి రెండు కాళ్లూ పనిచేయవు. చేతి కర్రల సాయంతో నడుస్తాడు.. కానీ భోజనం పళ్లెం పట్టుకొని నడవడం కుదరదు. అందుకు ఆనంద్ లాంటి వాళ్ల సాయం తీసుకోక తప్పదు. అసలే చాలా సేవా దృక్పథం వున్న ఆనంద్, ఆయన మీద జాలితో పళ్లెం పట్టుకుని, అందరి వైపు చూస్తూ... అదే తనని చూస్తున్నారో లేదో అని కన్‌ఫర్మ్ చేసుకుంటూ ఉండేవాడు. ఎవరైనా వచ్చి గుడ్ జాబ్ ఆనంద్ అంటే చాలా మురిసిపోయేవాడు.
ప్రసాద్‌గారికి కావలసినవన్నీ పెట్టి ఇద్దరూ భోజనాలు మొదలుపెట్టారు. ఇంతలో ప్రసాద్‌గారే ‘ఇంతకీ ఔటింగ్ ఎక్కడికి ప్లాన్ చేసారు’ అని అడిగారు.
‘ఇంకా ఫైనల్ కాలేదు. కానీ అనంతగిరి అడవుల్లో ఏదో ట్రెక్కింగ్ అని అనుకుంటున్నారు.. ప్రసాద్‌గారూ’ అని నసిగాడు.
‘ఓ.. మంచి ప్లాన్. నేను రెడీ’ అన్నాడు.
ఆనంద్ ఆశ్చర్యంగా ప్రసాద్ వైపే చూస్తూ అన్నాడు.
ఆనంద్ తన లెక్క ప్రకారం ‘మీరు వెళ్లండి’ అని అంటారు అనుకున్నాడు. కానీ ఇలా ఆయనే వస్తాను’ అంటే ఆశ్చర్యం వేసింది ఆనంద్‌కి. ఆ భావం అర్థమయ్యిందో ఏంటో ప్రసాద్ గారు ‘కంగారు పడకోయ్ ఆనంద్. నేను మిమ్మల్ని ఏమీ స్లో చెయ్యను’ అని నవ్వాడు.
ఆనంద్ తేరుకొని వెంటనే ‘అదేం లేదు ప్రసాద్‌గారూ. ఐతే టీం ట్రెక్కింగ్ ప్లాన్ ఫైనల్ అని చెప్పేస్తాను’ అని భోజనం ముగించారు ఇద్దరూ. అప్పుడే ఆనంద్‌కి ప్రసాద్ గారితో తన కన్ఫ్యూషన్‌కి ఒక దారి చూపిస్తారేమో అని, ప్రసాద్ గారి సమయం ఒక అరగంట తీసుకున్నాడు ఆ రోజు సాయంత్రం. అనుకున్నట్టుగానే ప్రసాద్ గారి కేబిల్‌లో టైంకి వెళ్లాడు. ఆయన ఏదో ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. ఆనంద్‌ని చూడగానే ‘ఒక నిమిషం.. కూర్చో’ అని సైగ చేశాడు. అటుఇటు చూస్తున్న ఆనంద్‌కి ప్రసాద్‌గారి సంభాషణ వినపడసాగింది.
‘అయినా మనిషిని మనిషి నమ్మకపోతే ఇంకెవరిని నమ్ముతాడు మాస్టారూ’
‘ఎవరూ సాయం చెయ్యకుండానే నేను ఇంతవాడిని అయ్యానా? భలేవారే...’
‘...’
‘ఎంత ఇమ్మంటారు ఒక 10వేలు సరిపోతాయా?’
‘...’
‘అంత పెద్ద మాటలెందుకు.. మాస్టారూ నేను కూడా ఈ సమాజం రుణం తీర్చుకోవాలి కదా...’
‘చెక్ రాసేసాను. ఎవరినైనా కొంచెం పంపండి. వాళ్లకి ఇస్తాను నేను కొంచెం రాలేను ఈసారికి’ అన్నాడు.
ఫోన్ పెట్టేసి, ‘చెప్పు ఆనంద్’ అన్నాడు.
ఆనంద్ తనకి కావలసిన సమాధానం దొరికిందని, ఇంకా ఈ మీటింగ్ అవసరం లేదని అనిపించింది. వెంటనే మళ్లీ తన ఉత్సాహం తనకి తిరిగి వచ్చింది. వెంటనే మాట మార్చి, ‘ఏం లేదు ప్రసాద్‌గారూ. మన ఔటింగ్ ప్లాన్ ఫైనల్ చేశాం. మీకు చెబుదామని’ అన్నాడు. ప్రసాద్‌గారి మాట కూడా వినకుండానే బయటకి పరుగుతీశాడు ఆనంద్.
వెంటనే ఫోన్ అందుకుని ఆ సైకిల్ షాప్ వాడికి ఆర్డర్ ఇచ్చేశాడు. అలానే ఆ షాప్ వాడికి అతని ఫొటో ఈమెయిల్ చేసి అతను ఎక్కడ ఉండేది చెప్పి అక్కడ డెలివరీ ఇమ్మని కూడా చెప్పేశాడు.
అప్పుడు ప్రశాంతంగా వాలాడు కుర్చీలో. కొండంత భారం తీరిన వాడిలాగా.. మన తరఫున ఎవరైనా నిర్ణయాలు తీసుకుంటే యెంత బాగుణ్ణు అని అనుకుంటూ.
అప్పుడు అర్థం అయ్యింది ఆనంద్‌కి. అనుమానంతో ఆగిపోవటంకన్నా ఆశతో అడుగేయటమే మేలు అని. అప్పటి నుండి ఆనంద్, ప్రసాద్‌గారి పళ్లెంని జాలితో కాక బాధ్యతతో పట్టుకుంటున్నాడు.
కొన్ని రోజుల తరవాత ఆనంద్ అవని, అదే దారిలో వెడుతూ అతనిని చూసారు. ఈసారి అతను మూడు చక్రాల సైకిల్ మీద వెడుతున్నాడు. అది చూసిన ఆనంద్‌కి చెప్పలేనంత ఆనందం కలిగింది. అది ఎన్ని మెసేజెస్ ఫార్వర్డ్ చేసినా.. ఎన్ని ఫొటోలకు లైక్స్ కొట్టినా కలగనంత ఆనందం, సాయం అంటే వేళ్లతో చేసేదే కాదు చేతుల్తో చేసేది అని అనిపించింది. అవని చెప్పే ‘రిటర్న్ ఆన్ ఇనె్వస్ట్‌మెంట్ ఈ తృప్తేనేమో అని అనుకుంటూ తృప్తిగా కార్‌ని ముందుకు పోనిచ్చాడు.

--కిరణ్ జమ్మలమడక