AADIVAVRAM - Others

ఇంకా సిద్ధపడలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక సుల్తాన్ తన సమస్త సామ్రాజ్యాన్ని వదిలిపెట్టి ఒక సుప్రసిద్ధుడయిన దర్వీష్ దగ్గరకు వచ్చి ‘నేను నా ఐశ్వర్యాన్ని, విశాల సామ్రాజ్యాన్ని వదిలిపెట్టి వచ్చాను. సత్యానే్వషణే నా లక్ష్యంగా పెట్టుకున్నాను. దయచేసి నన్ను మీ శిష్యుడుగా చేర్చుకోండి’ అన్నాడు.
గురువు సుల్తాన్‌ని కాసేపు పరీక్షించి చూశాడు. తరువాత శిష్యుడుగా చేర్చుకొనడానికి ఆమోదం తెలిపాడు. గురువు ‘మీరు రోజూ ఒక పని చేయాలి. ఇల్లంతా వూడ్చాలి. తోటలోని చెత్తంతా సంచులకెత్తాలి. తరువాత దూరంగా సంచుల్ని మోసుకెళ్లి పడేసి రావాలి’ అన్నాడు.
సుల్తాన్ ‘గురువుగారి ఆజ్ఞ’ అన్నాడు.
సుల్తాన్ చీపురు తీసుకుని గదుల్ని శుభ్రపరచడానికి వెళ్లాడు. అక్కడే వున్న శిష్యులు ఆశ్చర్యంతో ‘గురువుగారూ! అతను మహాసామ్రాజ్యాన్ని వదిలేసి మీ దగ్గర శిష్యుడుగా చేరడానికి వచ్చిన మహారాజు. అట్లాంటి గొప్ప వ్యక్తికి యింత హీనమయిన పనిని ఒప్పగించారా?’ అన్నారు.
గురువు ‘సత్యానే్వషణలో వున్న వ్యక్తికి అల్పమైంది, గొప్పది అంటూ ఏదీ వుండదు. పైగా చక్రవర్తి సత్యానే్వషణకి యింకా సంసిద్ధుడు కాలేదు’ అన్నాడు.
శిష్యులు ‘అట్లా అని మీరు ఎలా చెబుతారు?’ అన్నారు.
గురువు ‘కావాలంటే మీరే పరీక్షించండి’ అని ఒక శిష్యుణ్ణి పంపించాడు. ఆ శిష్యుడు గదులు వూడుస్తున్న సుల్తాన్‌ని తోసుకుంటూ వెళ్లాడు. సుల్తాన్ దాదాపు పడబోయాడు. అప్పుడు సుల్తాన్ శిష్యుణ్ణి చూసి ‘నేను దేశాన్ని పాలించే సుల్తాన్ స్థితి నుంచి బయటకి వచ్చాను. నేను సుల్తాన్‌గా ఉంటే నీకు ఏం జరిగేదో నీకు తెలుసు. ఇప్పుడు అన్నీ వదులుకున్నాను’ అని తన పనిలో మునిగాడు.
శిష్యుడు గురువు దగ్గరకు వచ్చి సుల్తాన్ చెప్పిన మాటలు వివరించాడు. గురువు ‘నేను చెప్పాను కదా! సుల్తాన్ ఇంకా అన్నీ వదులుకోలేదు’ అన్నాడు.
మరుసటి రోజు గురువు ఇంకో శిష్యుణ్ణి పిలిచి సుల్తాన్‌ని పరీక్షించమన్నాడు. ఆ శిష్యుడు సుల్తాన్‌ని వెతుక్కుంటూ వెళ్లాడు. సుల్తాన్ మేడ మెట్లు వూడుస్తూ కనిపించాడు. శిష్యుడు సుల్తాన్‌ని ఒరుసుకుంటూ మెట్ల మీదుగా వెళ్లాడు. సుల్తాన్ పడబోయి మెట్లు పట్టుకుని తలతిప్పి క్షణం సేపు శిష్యుణ్ణి చూశాడు. కానీ ఏమీ మాట్లాడలేదు. శిష్యుడు వచ్చి గురువుగారితో విషయం చెప్పాడు.
గురువు ‘సుల్తాన్ ఇంకా సంసిద్ధుడు కాలేదు’ అన్నాడు. ఇంకో రోజు ఇంకో శిష్యుణ్ణి పంపాడు.
శిష్యుడు తోటలో చెత్తను, ఆకుల్ని సంచిలో కూరుతున్న సుల్తాన్‌ని చూశాడు. పక్కనించి వెళుతూ చెత్త నిండిన సంచిని తన్నుకుంటూ శిష్యుడు వెళ్ళాడు. సుల్తాన్ పక్కకి చూడకుండానే కిందపడిన ఆకుల్ని ఏరి సంచిలో వేసుకున్నాడు.
శిష్యుడు వచ్చి జరిగిన అనుభవాన్ని గురించి చెప్పాడు. గురువు కళ్లలో మెరుపు మెరిసింది. ‘ఇప్పుడు సుల్తాన్ పరిపూర్ణ స్థితిలో సిద్ధంగా వున్నాడు’ అన్నాడు.

- సౌభాగ్య, 9848157909