కడప

ప్రత్యేక అభివృద్ధి నిధులపై జిల్లా పరిషత్ సమావేశం రసాభాస..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,అక్టోబర్ 4: కేంద్రప్రభుత్వం వెనుకబడిన జిల్లాల అభివృద్ధికోసం కేటాయించిన నిధులు కేటాయింపుపై మంగళవారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో టిడిపి, వైకాపా మధ్య జరిగిన చర్చ రసాభాసగా తయారైంది. ఒక దశలో ప్రోటోకాలపై జరిగిన చర్చ సభ్యుల మధ్య తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీసింది. వివరాల్లోకి వెళితే....2014-15, 2015-16సంవత్సరానికిగాను జిల్లాకు రూ.100కోట్లు మంజూరైందని ఈ నిధులను ఏఏ పనులకు ఎంతెంత ఖర్చు చేశారో చెప్పాలని జిల్లా కలెక్టర్‌ను ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి ప్రశ్నించారు. అలాగే నిబంధనలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నీరు-చెట్టు పనులలో దోచిపెడుతున్నారని ఆరోపించారు. దీంతో ఆగ్రహించిన కలెక్టర్ మాట్లాడుతూ నిబంధనల ప్రకారమే పనులు చేస్తున్నట్లు తప్పులు జరిగినట్లు నిర్ధిష్టమైన ఆరోపణలు చూపిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ గూడూరు రవి అధ్యక్షతన జరిగిన ఈసమావేశంలో నిధుల కేటాయింపు, చేసిన ఖర్చు విధానాన్ని వైకాపా జెడ్పిటిసిలు చేసిన ఆరోపణలకు టిడిపి జెడ్పిటిసిలు తీవ్రంగా వ్యతిరేకించారు. నీరు-చెట్టు పథకం కింద జిల్లా అంతటా అక్రమాలు చోటుచేసుకున్నాయని ముఖ్యంగా ప్రొద్దుటూరు నియోజవర్గంలో టిడిపి నాయకుడికి కలెక్టర్ అనుకూలంగా పనులు చేసిపెడుతున్నారని రాచమల్లు ఆరోపించడంతో ఒక్కసారిగా సభ వేడెక్కింది. దీంతో తీవ్రంగా స్పందించిన కలెక్టర్ అలాంటి ఆరోపణలు నిరూపించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింహాద్రిపురం టిడిపి జెడ్పిటిసి పోరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కలుగుచేసుకుని వైకాపా నాయకులే దోపిడీ దారులని గతంలో వారు చేసిన అక్రమాలు, అన్యాయాలు ఇందుకు నిదర్శనమని ధ్వజమెత్తారు. పోరెడ్డి వ్యాఖ్యలతో ఆగ్రహం వ్యక్తంచేసిన వైకాపా సభ్యులు మూకుమ్మడిగా పోరెడ్డిపై వాగ్వివాదానికి దిగడంతో గత్యంతరం లేక సభాధ్యక్షుడు గూడూరు రవి సభను 15నిమిషాలు వాయిదా వేశారు. అనంతరం సభ తిరిగి ప్రారంభం కాగా పోరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్‌నాయుడు క్షమాపణ చెప్పాలని వైకాపా జడ్పిటిసిలు సభా ప్రాంగణం మధ్యలో బైఠాయించారు. దీంతో ఎంపి రమేష్‌నాయుడు, జెడ్పి చైర్మన్‌తో దౌర్జన్యానికి వచ్చిన సభ్యులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. చివరకు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చైర్మన్ చెప్పడంతో సభ కొనసాగింది. అనంతరం ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యేక నిధుల కేటాయింపుపై కలెక్టర్ నియోజకవర్గాల వారీగా బద్వేలు నియోజకవర్గానికి 182 పనులకు గాను రూ.17.17కోట్లు , జమ్మలమడుగు నియోజకవర్గానికి 98 పనులకు గాను రూ.20.71కోట్లు, రాజంపేటకు 63 పనులకు గాను రూ.51.63కోట్లు, రైల్వేకోడూరుకు 20 పనులకుగాను రూ.31లక్షలు, రాయచోటికి 136 పనులకుగాను రూ.7.35కోట్లు, పులివెందులకు 48 పనులకుగాను రూ.21.27కోట్లు, కమలాపురంకు 88 పనులకుగాను రూ.8.44కోట్లు, ప్రొద్దుటూరుకు 7 పనులకుగాను రూ.38లక్షలు, మైదుకూరుకు 215 పనులకుగాను రూ.2.49కోట్లు, కడపకు 3 పనులకుగాను రూ.12లక్షలుమాత్రమే కేటాయించారన్నారు. దీంతో కడప ఎమ్మెల్యే ఎస్‌బి అంజద్‌బాషా జిల్లా కేంద్రానికి ప్రత్యేక అభివృద్ధి నిధులను కేవలం రూ.12లక్షలు కేటాయించడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వేదికపై ఉన్న పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్ ఎం.లింగారెడ్డి మాట్లాడుతూ అత్యంత వెనుకబడిన నియోజకవర్గాలకు మాత్రమే ఎక్కువశాతం కేటాయించామని తెలపడంతో ఇద్దరిమధ్య వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. జిల్లానడిబొడ్డు అయిన కడప పట్టణానికి నిధులు కేటాయించకపోవడం పక్షపాతధోరణికి నిదర్శనమని విమర్శించారు. ఒక దశలో వైకాపా, టిడిపి మద్య తిరిగి వాడివేడి చర్యలతోపాటు ప్రోటోకాల్ వివాదం చోటుచేసుకుంది. అసలు లింగారెడ్డి వేదికపై కూర్చోవడం ఏమిటని వైకాపా ఎమ్మెల్యేలు పి.రవీంద్రనాధరెడ్డి, కె.శ్రీనివాసులులు ప్రశ్నించగా జెడ్పిటిసి పోరెడ్డి మాట్లాడుతూ కడప ఎమ్మెల్యే అంజద్‌బాషాకు జిల్లాపరిషత్ సమావేశానికి ఏ అర్హతతో వచ్చారని ప్రశ్నించారు. దీంతో తిరిగి వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. తనకు అర్హత ఉంది కాబట్టే జిల్లా పరిషత్ సమావేశానికి ఆహ్వానం పంపారని ఎమ్మెల్యే అన్నారు. అలాగే లింగారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకే తనకు అర్హత ఉందని సంబంధిత పత్రాన్ని చూపించారు. అనంతరం సభ సజావుగా సాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామని, అలాగే భూమిలేని నిరుపేద రైతులకు డికెటి పట్టాలు కూడా అందించేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసిందని పేర్కొన్నారు. తొలుత కాశ్మీర్‌లోని యురి సెక్టార్‌లో పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వీరజవాన్లకు రెండు నిమిషాలు పాటించిన అనంతరం సభను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపి రమేష్‌నాయుడు, ఎమ్మెల్యేలు రాచమల్లు ప్రసాదరెడ్డి, పి.రవీంద్రనాధరెడ్డి, జి.శ్రీకాంత్‌రెడ్డి, ఎస్‌బి అంజద్‌బాషా, కె.శ్రీనివాసులు, ఎమ్మెల్సీలు బి.చెంగల్రాయులు, దేవగుడి నారాయణరెడ్డి, బచ్చలపుల్లయ్య, జెడ్పిటిసిలు, జెసి శే్వతతెవతియ, జిల్లా అధికారులు , ఎంపిపిలు పాల్గొన్నారు.