కడప

జిల్లా యంత్రాంగం పనితీరు బాగుంది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,డిసెంబర్ 3: జిల్లా యంత్రాంగం అధికారుల సమన్వయంతో చేపట్టిన ఎలక్టోరల్ రోడ్ సంతృప్తికరంగా ఉందని, జాబితాలో ఓటర్ల ఎపిక్ కార్డు, ఫోటో వంద శాతం సాధించినందుకు యంత్రాంగాన్ని రోల్ అబ్జర్వర్ జిఎస్‌ఆర్‌కెఆర్ విజయకుమార్ అభినందించారు. ఎలక్టోరల్ రోల్ 2017కు సంబంధించి జిల్లాలో చేపట్టిన స్పెషల్ సమ్మరి రివిజన్ పై వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులు, ఇఆర్‌ఓలు, ఏఇఆర్‌ఓలతో శనివారం సాయంత్రం అబ్జర్వర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గాల వారీగా ఎలక్టోరల్ రోల్‌పై సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ జిల్లాలో స్ర్తి నిష్పత్తి పురుషుల నిష్పత్తికి తక్కువగా ఉండగా ఓటరు జాబితాలో స్ర్తి నిష్పత్తి పురుషుల కంటే ఎక్కువుగా ఉన్నట్లు వివరాలు తెలుపుతున్నాయన్నారు. 2016 జనవరి 17 నాటికి జిల్లాలో 19,13,047 మంది ఓటర్లు ఉండగా, నవంబర్ 15వ తేది నాటికి 18,36,229 మంది ఓటర్లకు సంబంధించి డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేయడం జరిగిందన్నారు. ఆ విధంగా డూప్లికేట్ ఓటర్లు, వలస వెళ్లిన ఓటర్లు, చనిపోయిన ఓటర్లు 76,818 మందిని ఓటరు జాబితా నుంచి తొలగించడం జరిగిందన్నారు. తొలగించిన ఓటర్లకు సంబంధించి ఏవైనా క్లెయిమ్‌లు అందితే వాటిని పరిశీలించి ఈనెల 28లోగా పరిష్కరించాలన్నారు. ప్రస్తుతం రైల్వే కోడూరు, రాజంపేట నియోజకవర్గాల్లో పర్యటించి క్షేత్ర పరిశీలన చేశామన్నారు. బిఎల్‌ఓలకు మరో మారు శిక్షణ కల్పిస్తే బాగుంటుందని కలెక్టకు ఆయన సూచించారు. సమావేశంలో జెసి శే్వత, డిఆర్వో ఈశ్వరయ్య, కడప, రాజంపేట, జమ్మలమడుగు ఆర్డీఓలు చిన్నరాముడు, చెంగల్రావు, వినాయకం, కలెక్టర్ కార్యాలయపు పరిపాలనాధికారి శ్రీనివాసులు, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు జయరామ్, ఇఆర్‌వోలు, ఏఇఆర్‌ఓలు పాల్గొన్నారు.
జిల్లాకు ఇన్‌ఫుట్ సబ్సిడీ
రూ.200కోట్లు మంజూరు?

ఆంధ్రభూమి బ్యూరో
కడప,డిసెంబర్ 3: ఈఏడాది వర్షాభావంతో ఖరీఫ్‌లో సాగుచేసిన పంటలన్నీ నిట్టనిలువునా ఎండటంతో ఇన్‌ఫుట్ సబ్సిడీ కింద ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఎకరాకు రూ.15వేలు ప్రకటించడంతో ఈ దామాషిలో జిల్లాకు దాదాపు రూ.200కోట్లు నష్టపోయిన వేరుశెనగ రైతుకు కొంతమేరకు ఊపిరి పోసినట్లయ్యింది. జిల్లాలో లక్కిరెడ్డిపల్లె, చక్రాయపేట, గాలివీడు, రాయచోటి, చిన్నమండెం, సుండుపల్లె, సంబేపల్లె, కాశినాయన, పోరుమామిళ్ల, కలసపాడు, లింగాల, సింహాద్రిపురం, తొండూరు, పులివెందుల, బ్రహ్మంగారిమఠం, అట్లూరు, బి.కోడూరు, గోపవరం, వీరబల్లి, కమలాపురం, వేంపల్లె, చింతకొమ్మదినె్న, రామాపురం, పెద్దముడియం, రైల్వేకోడూరు, మైలవరం, వేముల, రాజుపాలెం, ముద్దనూరు, వీరపునాయునిపల్లె మండలాలతో కలిపి 32 మండలాలను ప్రభుత్వం కరవుమండలాలుగా ప్రకటించింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 700మి.మీ.వర్షపాతం నమోదుకావాల్సివుండగా జిల్లాలో కొన్ని ప్రాంతాలకు వర్షపాతం పరిమితమైంది. ఖరీఫ్‌లో సాధారణ వర్షపాతం కంటే అతి తక్కువ వర్షపాతం కురిసింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 346.6మి.మీ.వర్షపాతం అవసరం కాగా 300 మీటర్లు మాత్రమే నమోదైంది. దీంతో ఖరీఫ్ పంటలు చేతికొచ్చే సరికి రైతాంగానికి అందలేదు. జిల్లాలో ఖరీఫ్ కింద 1,15,437 హెక్టార్లలో సాగుచేయగా, ఆ దామాషిలో 2లక్షల 80వేల 864 ఎకరాల్లో పంటలు సాగైనట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అయితే ఆ మేరకు పంటలు సాగైనా పంటలు దిగుబడి సమయానికి కొన్ని పంటలు ఎండిపోగా, మరికొన్ని పంటలు నాశిరకంగా పంట వచ్చినట్లు అధికారులే సర్వేచేసి పంట ప్రయోగ కోతలు నిర్వహించి పంటంతా తీవ్రంగా నష్టపోయినట్లు ప్రభుత్వానికి నివేదికలు పంపారు. ఒక వేరుశెనగ పంటే జిల్లాలో దాదాపు లక్ష ఎకరాల్లో సాగైంది. ఖరీఫ్‌లో వేరుశెనగ పంటతోపాటు కంది 15,225 హెక్టార్లలో, పత్తి 14,124 హెక్టార్లలో, ప్రొద్దుతిరుగుడు 1000 హెక్టార్లలో, ఉల్లి 4వేల హెక్టార్లలో సాగుచేశారు. వర్షాభావంతో పంటలన్నీ నిట్టనిలువునా ఎండిపోయాయి. ఏటా రైతాంగాన్ని వరుణుడు శాపం పట్టి వరుస కరవులకు గురిచేస్తున్నాడు. ఈ ఏడాది ఖరీఫ్‌సాగు ప్రారంభంలో ఆశించిన వర్షాలు కురిసి తీరా పంట చేతికొచ్చే సమయంలో గింజ ఉత్పత్తి అయ్యే సమయంలో వర్షపుజాడ కన్పించకపోవడంతో పంటలన్నీ పొలాల్లోనే ఎండిపోయాయి. చివరకు ఆ పంటలు పశుగ్రాసానికి కూడా పనికొచ్చే పరిస్థితులు లేవు. ఈ నేపధ్యంలో రెవెన్యూ, స్టాండింగ్ అధికారులు, పంటల బీమా ఏజెన్సీలు పంట పొలాలు సర్వేచేసి భీమా కింద వర్తించే రైతులను గుర్తించి ప్రభుత్వానికి నివేదికలు పంపారు. జిల్లాలో దీంతో 32 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించింది. వేరుశెనగ రైతులను ఆదుకునేందుకు ఎకరాకు రూ.15వేలు ఇన్‌ఫుట్ సబ్సిడీ కింద అందజేస్తుండటంతో రైతుకు ఊరట కలిగించిందని చెప్పవచ్చు.

నగదు రహిత లావాదేవీల
నిర్వహణకు శిక్షణ : కలెక్టర్

కడప,(కల్చరల్)డిసెంబర్ 3: నగదు రహిత లావాదేవీలను జరిపేందుకు అన్ని ప్రభుత్వశాఖల సిబ్బందికి, విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు శనివారం కలెక్టర్ కెవి సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానంగా నగదు రహితలావాదేవీలపై ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగ్, విశ్వవిద్యాలయాల విద్యార్థులకు, స్వయం సహాయక సంఘాల మహిళలకు, క్షేత్రస్థాయిలో ఉన్న డ్వామా, డిఆర్‌డిఏ, పౌరసరఫరాలు, వ్యవసాయ, అనుబంధశాఖలు, రవాణాశాఖతోపాటు తదితర శాఖల సిబ్బందికి మొబైల్ ఫోన్, ఈ-పాస్ మిషన్లద్వారా నగదురహిత లావాదేవీలు జరిపేందుకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. శిక్షణ పొందిన సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లి గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటుచేసి నగదు రహిత లావాదేవీలను జరిపేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. శిక్షణ పొందిన వ్యక్తి మరో 5మందికి శిక్షణ ఇచ్చే విధంగా తయారుచేయాలన్నారు. జిల్లాలో ఉన్న ప్రభుత్వ చౌకదుకాణాలను మినీ బ్యాంకులుగా చేస్తామని ఇందులో నిత్యావసర వస్తువులతోపాటు మరికొన్ని వస్తువులను ఏర్పాటుచేసి నగదు రహిత లావాదేవీలను జరుపుతామన్నారు. నగదు రహిత లావాదేవీల కోసం స్మార్ట్ ఫోన్లలో వివిధ రకాల యాప్స్‌డౌన్‌లోడ్ చేసుకోవాలని అలాగే డౌన్ లోడ్ చేసుకునే విధానం, ఆపరేటింగ్ విధానం తెలిపేందుకు కాలేజీల విద్యార్థులను గ్రామస్థాయికి తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రప్రభుత్వం, ఎస్‌బిఐ శాఖలు ఎస్‌బిఐ బుడ్డీ యాప్‌ను డౌన్‌లోడ్ చేయించినందుకు రూ.50లు నిరుద్యోగ యువతకు ఇస్తుందన్నారు. అన్ని మండల కేంద్రాల్లో హాట్ స్పాట్ వైఫేలను ఏర్పాటుచేస్తే చాలా వరకు మొబైల్ ఫోన్ ద్వారా లావాదేవీలు జరుపుకునే అవకాశం ఉందన్నారు. బిపిఎల్ కింద ఉన్న నిరుపేదకు ప్రభుత్వం రూ.10వేలు రుణంగా మంజూరు చేస్తుందని ఆ మొత్తం బ్యాంకు ఖాతాలో జమచేయడం జరుగుతుందని ఇందుకు అధికారులు దరఖాస్తులను ఆహ్వానించి, అత్యవసరమైన లబ్దిదారుడిని గుర్తించి ప్రతిపాదనలు పంపాలన్నారు. ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతాలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని బ్యాంకు ఖాతాలు లేనివారిని గుర్తించి బ్యాంకు ఖాతాలను ఓపెన్ చేయించి వారికి ఏటిఎం కార్డు, డెబిట్ కార్డు, రూపే కార్డు తదితరాలను కూడా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రాబోయే పది లేక 20రోజుల్లో ప్రతి ఒక్కరూ నగదు రహిత లావాదేవీలు జరిపే విధంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.
త్వరలో జరిగే జన్మభూమిలో
నూతన రేషన్‌కార్డులు పంపిణీ
ఆంధ్రభూమి బ్యూరో
కడప,డిసెంబర్ 3: వచ్చే నెల జనవరి 1నుంచి నాల్గవ విడత జన్మభూమి కార్యక్రమం జరుగుతున్న నేపధ్యంలో అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్‌కార్డులను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అనర్హుల కార్డు లు తీసివేసి అర్హులైన వారికి కార్డులు ఇచ్చేందుకు నాల్గవ విడత జన్మభూమి కార్యక్రమంలో పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో సుమారు 60వేల రేషన్‌కార్డులు దారిద్య్రరేఖకు ఎగువనున్న వారి కార్డులు రద్దుచేసి దారిద్రరేఖకు దిగువనున్న వారికి కార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో 6,57,788 తెల్లకార్డులు, 57046 అం త్యోదయ అన్నయోజనకార్డులు, 429 అన్నపూర్ణ కార్డులు దారిద్య్రరేఖకు దిగువనున్న వారితో కలుపుకుని 7,15,463 రేషన్‌కార్డులున్నాయి. మూడవ విడత జన్మభూమి కార్యక్రమంలో ఇప్పటి వరకు 58,123 కార్డులు పంపిణీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 1736 ప్రభుత్వ చౌకదుకాణాల్లో బియ్యం పంపిణీ చేస్తున్నారు. జనవరి 1నుంచి నాల్గవ విడత జన్మభూమి కార్యక్రమంలో గ్రామసభలు నిర్వహించి బహిరంగంగా అనర్హుల రేషన్ కార్డులు సంబంధిత మండల అధికారులు కార్డులు స్వాధీనం చేసుకుని అర్హులైన వారికే కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. గతంలో చౌకదుకాణం డీలర్లు బినామీ పేర్లతో తయారుచేసుకున్న కార్డులు ప్రస్తుతం చెల్లుబాటు కాకపోవడంతో బయోమెట్రిక్ ప్రవేశపెట్టినందున ఈపాస్ యంత్రాలు అసలు గుట్టు రట్టుచేస్తున్నాయి. దీంతో డీలర్లు కూడా స్వచ్చంధంగానే కార్డులు అధికారులకు అప్పచెప్పే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. గత కాంగ్రెస్‌పాలనలో ప్రభుత్వ ఉద్యోగులు సైతం కార్డులు దక్కించుకోవడంతో వాటిని కూడా రద్దుచేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మొత్తం మీద రేషన్‌కార్డుల నూతన ప్రక్రియతో బోగస్ కార్డులు గల్లంతై అర్హులైన వారికే రేషన్‌కార్డులు దక్కే అవకాశాలు కన్పిస్తున్నాయి. వైకాపాకు చెందిన అనర్హుల వద్ద కూడా రేషన్‌కార్డులు అధికంగా ఉండటంతో ఆపార్టీ నేతలు ఇప్పటి నుంచే ప్రభుత్వంపై రచ్చ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా అనర్హుల కార్డులు లాక్కొని అర్హులకు కార్డులు పంపిణీకి ప్రభుత్వ ప్రకటనతో పేదల్లో ఆనందానికి అవధుల్లేవు.

10 పరీక్షల్లో సిసిఈ మోడల్‌పట్ల
విద్యార్థులకు అవగాహన కల్పించాలి

కమలాపురం, డిసెంబర్ 3: వచ్చే ఏడాది మార్చిలో జరుగనున్న ఎస్‌ఎస్‌సి పరీక్షల్లో రాష్ట్ర విద్యాశాఖ కొత్తగా అమలుపరుస్తున్న సిసిఈ మోడల్‌పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కడప డిప్యూటీ డిఈవో ప్రసన్నాంజనేయులు సూచించారు. ఆయన శనివారం స్థానిక శ్రీసత్యసాయి జడ్పీ బాలికల హైస్కూల్లో జరిగిన విద్యార్థులకు దుస్తుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్పనిసరిగా పబ్లిక్ పరీక్షల్లో 80 మార్కులకు 28మార్కులు సాధిస్తేనే ఉత్తీర్ణులవుతారన్నారు. ఉపాధ్యాయుల చేతిలో ఉండే ఇంటర్నల్‌మార్కుల్లో 20వచ్చినా ఫలితం ఉందన్నారు. ఈ విషయాన్ని ఉపాధ్యాయులు విద్యార్థులకు క్షుణ్ణంగా తెలియచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటినుంచే పరీక్షలకు మానసికంగా విద్యార్థులు సిద్ధం కావాలన్నారు. కమలాపురం మండలం నుంచి ప్రతియేడాది ట్రిపుల్ ఐటికి విద్యార్థులు ఎంపిక కావడం హర్షనీయమన్నారు. అయితే 10పాయింట్లు గ్రేడ్ సాధించేలా ఉపాధ్యాయులు విద్యార్థులను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని సూచించారు. ఎమీవో జాఫర్‌సాదిక్ మాట్లాడుతూ మండలంలో పలు పాఠశాలల్లో 10 పరీక్షల్లో 100% సాధించడం గర్వకారణమని, ఈయేడాది 10పాయింట్లు సాధించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట హెచ్‌ఎం సుబ్బలక్షుమ్మ పాల్గొన్నారు.

ప్రత్యేక హోదాకోసం
విద్యార్థి ప్రజాబ్యాలెట్

కడప,(కల్చరల్)డిసెంబర్ 3: రాష్టవ్య్రాప్తంగా కోటి మంది విద్యార్థి, యువతతో ప్రత్యేకహోదాపై అవగాహన , అభిప్రాయసేకరణ చేయాలని మహాసంకల్పంతో ఏపిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి తలపెట్టిన విద్యార్థి యువజన ప్రజాబ్యాలెట్ కడప నగర ఎన్‌ఎస్‌యుఐ కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతోందని ఎన్‌ఎస్‌యుఐ నగర అధ్యక్షుడు బి.తిరుమలేష్ అన్నారు. శనివారం నగరంలోని వెంకటసాయి కోచింగ్‌సెంటర్‌తోపాటు పలు కోచింగ్‌సెంటర్లలో ప్రత్యేక హోదా -టిడిపి ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై విద్యార్థిప్రజాబ్యాలెట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిసిసి నగర అధ్యక్షుడు బండి జక్కరయ్య, పిసిసి అధికార ప్రతినిధి నీలి శ్రీనివాసరావులు హాజరై మాట్లాడుతూ ప్రత్యేకహోదాకోసం పోరాటం చేయాలని, రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వమని కేంద్రం తెగేసి చెప్పినా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజకీయ లబ్ధికోసం పాకులాడుతున్నట్లు ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యేక హోదాతోనే పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని, అప్పుడే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యుఐ నగర కార్యదర్శి సాత్విక్, సుబ్బరాయుడు, సాయి, షణ్ముక, రాజ, హరి ఉన్నారు.

అర్హులను ఓటర్లుగా గుర్తించాలి

రాజంపేట, డిసెంబర్ 3: అర్హత కలిగిన ప్రతి ఒక్కరిని ఓటరుగా గుర్తించాల్సి ఉందని రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు జిఎస్‌ఆర్‌కెఆర్ విజయ్‌కుమార్ అన్నారు. 2017 జనవరి 1నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకునేందుకు అర్హత ఉంటుందన్నారు. శనివారం ఆయన రాజంపేట ఉర్తూ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ బూత్‌ను తనిఖీ చేశారు. అనంతరం అక్కడే ఉన్న బూత్ లెవల్ అధికారులతో మాట్లాడుతూ ఓటర్లజాబితా సవరణ కార్యక్రమం ఎలాంటి తప్పులు లేకుండా బోగస్‌ఓటర్ల ఏరివేత ప్రణాళికాబద్దంగా చేయాలన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు బూత్‌లెవల్ అధికారులు ఇసద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఓటర్ల జాబితా సవరణలో పోటోలు జాబితా సవరణలో పలుసార్లు క్షుణ్ణంగా పరిశీలించి ప్రణాళిక ప్రకారం సిద్ధం చేయాలన్నారు. చనిపోయిన వారని గుర్తించి వారిని ఓటర్ల జాబితా నుండి తొలగించడం, మైగ్రేషన్ అయిన వారిని గుర్తించి ఓటర్ల జాబితా నుండి తొలగించడం, 18 సంవత్సరాలు పూర్తయ్యినవారిని గుర్తించి వారికి ఓటుహక్కు కూడా కల్పించే బాధ్యత బూత్‌లెవల్ అధికారులదేనన్నారు. ఈనెల 8వరకు సంబంధిత బూత్‌లెవల్ అధికారులు ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఓటర్ల సవరణ జాబితా కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని ఆయన బూత్ లెవల్ అధికారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజంపేట రెవిన్యూ డివిజనల్ అధికారి చెంగల్రాయులు, తహశీల్దార్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్సీ కార్పోరేషన్ ఇ.డి. శ్రీలక్ష్మీ, మున్సిపల్ కమీషనర్ రమణారెడ్డి తదితరులు పాల్గన్నారు.

వికలాంగులను
ప్రయోజకులుగా తీర్చిదిద్దాలి

సిద్దవటం,డిసెంబర్ 3:వికలాంగత్వం కలిగివున్న పిల్లల తల్లిదండ్రులు అధైర్యపడకుండా వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిద్దవటం జూనియర్ సివిల్ జడ్జి అతిఖ్ అహ్మద్ అన్నారు. శనివారం ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఉన్న భవిత పాఠశాలలో ఎంఇఓ పాలెం నారాయణ అధ్యక్షతన, రాజీవ్‌విద్యామిషన్, సర్వశిక్ష అభియాన్, మండల లీగల్‌సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో ప్రపంచదివ్యాంగుల దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన జడ్జి మాట్లాడుతూ మానవ సమాజంలో ఒకరి సహకారం మరొకరికి లేనిదే మానవ మనుగడ సాగదన్నారు. వికలాంగత్వం కలిగిన వారికోసం ఎన్నో చట్టాలు ఉన్నాయని, వాటిని అవగాహనతో సద్వినియోగించుకోవాలన్నారు. ప్రభుత్వాలు వికలాంగులకు రిజర్వేషన్లు కూడా కల్పించామన్నారు. మానసిక స్థితి సరిగాలేనివారికోసం మెంటలీ కిన్‌హెల్త్ యాక్ట్ ఉందని, మానసికస్థితి సరిలేనివారు ఇతరులకు ఏదైనా ప్రమాదం తలపెట్టే అవకాశం ఉన్నప్పుడు తల్లిదండ్రులు తమకు అర్జీ ఇస్తే మానసికస్థితి మెరుగుపరిచేందుకు ఆసుపత్రికి పంపడం జరుగుతుందన్నారు. వికలాంగత్వం శాపం కాదని, చాలా మంది ఉన్నతస్థితిలో ఉన్నారన్నారు. వారిని ఆదర్శంగా తీసుకుని మందుకుసాగాలన్నారు. వికలాంగులపట్ల సమాజం గొప్పగా ఆలోచిస్తుందని, మండల లీగల్‌సర్వీసెస్ కమిటీ తరపున వికలాంగులకు చేయూతనిస్తామన్నారు. ఎంపిడివో జయసింహ మాట్లాడుతూ ప్రభుత్వం వికలాంగులకు ప్రతినెలా రూ.1500లు పెన్షన్ అందించి ప్రోత్సహిస్తుందన్నారు. ప్రతి రంగంలో వికలాంగులు రాణిస్తున్నారన్నారు. ఎంఇఓ మాట్లాడుతూ వికలాంగత్వం పిల్లలున్న తల్లిదండ్రులు తమకు భగవంతుడు ఇచ్చిన బాధ్యతగా గుర్తించి పిల్లలను ఉన్నత స్థానాలకు ఎదిగేలా చూసుకోవాలన్నారు. అనంతరం వికలాంగత్వం ఉన్న విద్యార్థులకు జడ్జి సర్ట్ఫికెట్లు అందజేశారు. అలాగే వ్యాసరచన, వక్తృత్వపోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుబ్బారెడ్డి, ఐవిఆర్‌పిలు విజయలక్ష్మి, పద్మావతి, న్యాయవాదులు లక్ష్మిరెడ్డి, శివరామ్, ప్రవీణ్, పిఆర్‌పిలు, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ సిబ్బంది బాబురామ్, మార్టినా, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.