కడప

అవినీతిపరుల భరతం పడతాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,(లీగల్)మార్చి 22: జిల్లా వ్యాప్తంగా కోర్టుల్లో పనిచేస్తున్న ఏ ఉద్యోగి అయినా లంచాన్ని అడిగితే అట్టివారి భరతం పడతానని జిల్లా ప్రధాన జడ్జి జి.శ్రీనివాస్ తీవ్రంగా హెచ్చరించారు. బుధవారం న్యాయవాదుల ఆహ్వానం మేరకు న్యాయవాదుల సంఘ భవనంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన న్యాయవాదులనుద్దేశించి మాట్లాడుతూ కోర్టుల్లో పనిచేసే ఏ అధికారి అయినా, ఉద్యోగి అయినా హోదాతో నిమిత్తం లేకుండా లంచగొండి తనానికి పాల్పడితే అట్టి వ్యక్తులను కఠినంగా శిక్షించి భరతం పడతానన్నారు. లంచం ఇచ్చిన, తీసుకున్న నేరమేనని అటువంటి వారిపై కఠన చర్యలు చేపడుతామన్నారు. అలాగే జిల్లాలో కోర్టుల్లో డ్రైనేజి, క్యాంటిన్ కోర్టుప్రాంగణం శుభ్రం చేయించి పాత న్యాయవాదుల భవనం స్థానంలో కొత్త భవనాన్ని నిర్మించి అలాగే న్యాయవాదులకు, కక్షిదారులకు అన్ని వసతులతో ఉండే విధంగా కోర్టు ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతానన్నారు. త్వరలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది సమస్యలను పరిష్కరిస్తానని అలాగే పరిపాలన సంబంధంగా సమన్యాయంతో పనిచేసి అందరి సహకారంతో సత్వరం కేసులను పరిష్కరించి జిల్లాను రాష్టవ్య్రాప్తంగా ప్రధమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ప్రప్రధమంగా జిల్లా జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్‌కు న్యాయవాదుల సంఘం బొకేలు, పూలమాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సమావేశానికి న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జివి రాఘవరెడ్డి, కార్యదర్శి రవిచక్రవర్తి, ఉపాధ్యక్షుడు రమేష్, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

గ్రామాల్లో జల సంరక్షణ ఉద్యమానికి
నాబార్డు శ్రీకారం

మైదుకూరు, మార్చి 22: జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ వారి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని లక్ష గ్రామాల్లో ఒక మహా జలసంరక్షణా ఉద్యమానికి శ్రీకారం చుట్టిందని నాబార్డు జిల్లా అభివృద్ధి అధికారి బి.శ్రీనివాసులు తెలిపారు. ఈ ఉద్యమాన్ని జిల్లాలో బుధవారం నుంచే ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. భూగర్భజలాన్ని అపరిమితంగా ఉపయోగించబడిన లేదా నీటికొరతకు గురికావడానికి అవకాశాలు అధికంగా ఉన్న ప్రాంతాలలోని లక్ష గ్రామాలను ఈ ఉధ్యమ అమలుకు ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు. గత ఏడాది ఇటువంటి ఉద్యమం నిర్వహించిన 40వేల గ్రామాల నుంచి మంచి స్పందన రావడంతోనే ఈ ఏడాది అధికశాతం గ్రామాల్లో ఉద్యమాన్ని నిర్వహించాలని నాబార్డు నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. జల సంరక్షణా, జల పరిరక్షణా పద్ధతులు, సూక్ష్మనీటిని సమర్థవంతంగా ఉపయోగించుకొనే పద్ధతులను అవలంబించడం సాంప్రదాయ జలసంరక్షణా పద్ధతులు, మెరుగైన సేంద్రీయ పద్ధతులను అవలంబించడం వంటివి ఈ ఉధ్యమంలో భాగంగా స్థానిక ప్రజల భాగస్వామ్యంలో జల నిర్వహణా పద్ధతులను అభివృద్ధిపరచడంపై అవగాహన కల్పిస్తారని ఆయన తెలిపారు. ఉద్యమ లక్ష్యసాధనకు గ్రామ వాలెంటీర్లను (జల ధూత)లను నియమిస్తారని తెలిపారు. జిల్లా, గ్రామ స్థాయిలో ఏప్రిల్ - జూలై నెలల్లో ప్రచారం చేయడానికి వీలుగా తగినంతమంది మాస్టర్ ప్లీనర్స్‌ను గుర్తించి వారికి శాస్ర్తియ శిక్షణను అందిస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్టస్థ్రాయి బ్యాంకర్ల కమిటీ, భాగస్వామ్య ఎన్‌జిఓలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, జల నిపుణులు, రైతుక్లబ్బుల తదితరుల సమక్షంలో ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయనున్నట్లు ఆయన వివరించారు. మన రాష్ట్రంలో కడపతోపాటు అనంతపురం, కర్నూలు, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలు ఈ జల ఉద్యమ అమలుకు ఎంపికైనట్లు ఆయన తెలిపారు. జిల్లాలో జల వనరుల పెంపొందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తామని జిల్లా అభివృద్ధి అధికారి పేర్కొన్నారు.
గెలిచి ఓడామా..
జిల్లా టిడిపిలో అంతర్మథనం!

కడప,మార్చి 22: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి ఓడమా.. అని స్థానిక టిడిపి జిల్లా నేతల్లో అంతర్మథనం మొదలైంది. కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన టిడిపి, టీచర్స్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులు భారీ ఓటమి చెందడంతో జిల్లా నేతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని చెప్పవచ్చు. కాగా టిడిపి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోందని ఇది మాకు బాగా లాభిస్తుందని స్థానిక వైకాపా నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా పరిధిలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగగా కేవలం ఒక ఎమ్మెల్సీతోనే సరిపెట్టుకుంది. దీంతో జిల్లా పార్టీలో కొన్ని మార్పులు చేపట్టేందుకు ఆ పార్టీ అధిష్ఠానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పశ్చిమ రాయలసీమకు చెందిన గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నికతోపాటు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. కేవలం స్థానిక సంస్థల ఎన్నికలనే ఇరుపార్టీలు లక్ష్యంగా పెట్టుకుని ఎత్తుకు పై ఎత్తులు వ్యూహాలు రచించి తెలుగుదేశం పార్టీ నేతలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్షనేత, వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డిని ఓడించామని సంకలు గుద్దుకుని సంబరాలు జరుపుకున్నారు. అయితే ఉపాధ్యాయ సిట్టింగ్ ఎమ్మెల్సీ టిడిపి అభ్యర్థి బచ్చల పుల్లయ్య, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి, పారిశ్రామిక వ్యాపార, విద్యావేత్త కెజె రెడ్డిలు ఘోరంగా పరాభవానికి గురయ్యారు. దీంతో ప్రజాబ్యాలెట్ అనేది తెలుగుదేశం పార్టీ అధిష్ఠానానికి అర్థమైంది. వైకాపా అభ్యర్థి, ఎన్‌జివో రాష్ట్ర మాజీ అధ్యక్షుడు వెన్నపూస గోపాల్‌రెడ్డి గెలుపొందారు. అలాగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పరోక్షంగా వైకాపా కత్తినరసింహారెడ్డికి మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయన దేశం అభ్యర్థి బచ్చల పుల్లయ్యపై భారీ మెజార్టీతో గెలుపొందారు. గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో మూడవ స్థానానికి చేరుకున్నారు. చివరికి ద్వితీయ స్థానానికి కూడా చేరుకోలేకపోవడంపై తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం అంతర్మథనంలోపడింది. జిల్లా నాయకులు కూడా కేవలం వివేకాను ఓటమికి గురిచేశామని ప్రగల్బాలు పలుకుతున్నారు తప్ప రెండు ఎమ్మెల్సీలను పోగొట్టుకున్నామని ఏ ఒక్కరికి బాధలేదు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు ఎంపిటిసిలు, జడ్పిటిసిలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను క్యాంపు రాజకీయాలకు తీసుకెళ్లి 25రోజులపాటు వారికి సకల సౌకర్యాలు కల్పించి, తర్ఫీదు ఇచ్చి ఓటు వినియోగంపై మాక్ పోలింగ్ నిర్వహించారు. కేవలం 839 ఓటర్లకోసం టిడిపి సర్వశక్తులు వడ్డి వైకాపా ప్రత్యర్థిపై 38 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ప్రజాక్షేత్రంలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ, టీచర్స్ ఎమ్మెల్సీలో పార్టీ అభ్యర్థులు చిత్తుగా ఓడిపోయారు. అలాగే తాము వైఎస్ కుటుంబం నాలుగు దశాబ్దాల రాజకీయ కంచుకోటను బద్దలు కొట్టామని పొగుడుకుంటూ సంకలు గుద్దుకుంటున్నారు తప్ప మిగిలిన రెండు ఎమ్మెల్సీ ఫలితాలపై ఏ ఒక్కరు నోరుమెదపడంలేదు. వైసిపి నేతలు మాత్రం ఇది వాపే కానీ బలుపుకాదని తేల్చిచెబుతున్నారు. 2019 ఎన్నికల నాటికి రెండు ఎంపిలు, 10 ఎమ్మెల్యేస్థానాలు గెలిపించుకుంటామని వైసిపి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. టిడిపి అధిష్ఠానం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై పోస్టుమార్టం చేసి 2019 ఎన్నికల నాటికి టిడిపి అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా పెట్టుకుని తగు చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తొంది.

పరపతి ఉన్న నేతలకు
పురపాలకాల పన్నులు ఉండవా?

కడప,మార్చి 22: జిల్లాలో నగరపాలక, పురపాలక సంస్థల్లో నివాస గృహాల ప్రజలు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు ఆస్తిపన్ను, నీటి పన్ను, వినోదపు పన్ను, వృత్తిపన్ను చెల్లింపులో పరపతి కలిగిన రాజకీయ నేతల అండదండలు ఉండే బడానేతలకు పన్ను మినహాయించినట్లు తెలుస్తోంది. వారంతా కొనే్నళ్లుగా నగరపాలక సంస్థలకు, పురపాలక సంస్థలకు పన్ను చెల్లించకుండా ఎగవేస్తున్నట్లు తెలుస్తోంది. సామాన్యమానవులకు వౌలిక సదుపాయాలు కల్పించకపోయినా ముక్కుపిండి వివిధ రకాల పన్నులు వసూళ్లు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 2,15,161 నగరంలోను, పురపాలకంలో నివాసేతర గృహాలు ఉన్నాయి. వారి నుంచి రూ.6459.59 లక్షలు పన్నులు వసూళ్లు కావాల్సివుండగా, ఇంతవరకు కేవలం రూ.2,850 లక్షలు మాత్రమే వచ్చింది. ఈనెల 31లోపు పన్నులు వసూళ్లు చేసేందుకు సంబంధిత అధికారులు నానాయాతన పడుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో కడప నగరపాలకం, పులివెందుల, ఎర్రగుంట్ల, మైదుకూరు, బద్వేలు, ప్రొద్దుటూరు, రాయచోటి, రాజంపేట, జమ్మలమడుగు పురపాలక సంఘాలు ఉన్నాయి. పన్నుల వసూళ్లలో అన్ని మున్సిపాల్టీ అధికారులు పోటీపడుతున్నా కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ముఖ్యంగా అధికారపార్టీ నేతలు సిఫార్సులు, ఆదేశాలతో చాలా మంది చెల్లింపులో వెనుకాడుతున్నారు. ఇదిలా వుండగా జిల్లాలో నగర పాలకంతోపాటు అన్ని మున్సిపాల్టీల్లో సామాన్యుల నుంచి ముక్కుపిండి పన్ను వసూళ్లు చేస్తున్నారు తప్ప సౌకర్యాల కల్పనలో ఘోరంగా విఫలమయ్యారు. పారిశుద్ద్యం మెరుగుచేయడం కానీ, పందులు, కుక్కలు, కోతులు బయటకు పంపడం కానీ, వీధి దీపాలు ఏర్పాటుచేయడంలో కానీ, డ్రైనేజి కాలువల నిర్మాణంలో కానీ పురపాలక సంఘాల కమిషనర్లు, అధికారులు మామూళ్లమత్తులో జోగుతో ప్రజాసంక్షేమాన్ని గాలికి వదిలి అరకొర పన్నులు వసూళ్లు చేసుకుని అభివృద్ధి పేరిట ప్రజాధనాన్ని లూఠీ చేస్తున్నారనేది జగమెరిగిన సత్యం. ఏదేమైనా ఈనెల 31లోగా పన్నులు చెల్లించాలని అధికారులు వత్తిడి తెస్తున్నారు. అయితే పరపతి ఉన్నవారు కూడా పన్నులు చెల్లిస్తేనే మేము చెల్లిస్తామని కూడా కొంతమంది తిరగబడుతున్నట్లు తెలుస్తోంది.

పెరిగిన కూరగాయల ధరలు..

కడప,(కల్చరల్)మార్చి 22: జిల్లాలో తగిన వర్షాలు లేకపోవడం, భూగర్భజలాలు అంతంత మాత్రంగానే ఉండటం, ఒక వేళ కూరగాయల సాగు వేసినా చీడపీడలతో పొలాలపైనే వదులు తున్నారు. ఈ సమయంలో టమోటాతోపాటు మిగిలిన కూరగాయల ధరలన్నీ పెరిగిపోయాయి. కాగా పచ్చిమిర్చి ధర మాత్రం ఘాటెక్కిందని చెప్పవచ్చు. కూరగాయల పంటల సాగు జిల్లాలో తగ్గడంతో అన్నిరకాల కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకడంతో బజారుకెళ్లి కూరగాయల ధరలు చూసి ప్రజలు నివ్వెరపోతున్నారు. ఒకప్పుడు రూ.200లు మార్కెట్‌కు తీసుకెళితే వారానికి సరిపడే కూరగాయలు, రెండు బ్యాగుల నిండా కూరగాయలను తీసుకుని వచ్చేవారు. మార్కెట్‌కు ప్రస్తుతం రూ.500లు నోటు తీసుకెళ్లినా ఉన్న ధరల ప్రకారం కూరగాయలు రెండురోజులకు కూడా సరిపడటం లేదు. జిల్లాలో పెండ్లిమర్రి, చింతకొమ్మదినె్న, సిద్దవటం, మాచుపల్లె, చిన్నమండెం, గాలివీడు, లక్కిరెడ్డిపల్లె, సంబేపల్లి, రాయచోటి తదితర మండలాల్లో కూరగాయలు అధికంగా సాగుచేస్తారు. మరికొన్ని మండలాలైన బద్వేలు, మైదుకూరు, కడప తదితర మండల కేంద్రాల్లో ఒక మోస్తరుగా కూరగాయల పంటలు సాగుచేస్తారు. ముఖ్యంగా జిల్లా కేంద్రాల్లో కానీ, మండల కేంద్రాల్లో గానీ కూరగాయలు నిల్వవుంచేందుకు ఎక్కడ కోల్డ్ స్టోరేజిలు లేకపోవడం, జిల్లా సరిహద్దు ప్రాంతమైన చిత్తూరు జిల్లా గుర్రంకొండ, మదనపల్లె తదితర ప్రాంతాల్లో టమోటా పంటకు అనుకూలం కావడంమేగాకుండా అక్కడ పండే టమోటాలకు ఇతర రాష్ట్రాల్లో కూడా అధిక రేట్లు పలకడంతో ఇతర రాష్ట్రాల వ్యాపారులు ఇక్కడకే వచ్చి కొనుగోలు చేయడంతో అధికరేట్లకు కారణవౌతున్నాయి. అదే విధంగా పచ్చిమిర్చి, క్యారెట్, బీట్రూట్, క్యాబేజి, క్యాప్సికం, ముళ్లంగి తదితర కూరగాయలు బెంగళూరు, ఆగ్రా, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి జిల్లాకు దిగుమతి చేసుకోవడంతో రవాణా ఖర్చులు పెరగడంతో కూరగాయలు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లాలో అధిక ఎండలు మండుతుండటంతో వేసిన పంటలు కూడా దిగుబడి సక్రమంగా రాకపోవడం ధరలు పెరిగేందుకు ఒక కారణమమయ్యాయి. కూరగాయలు అధికరేట్లు పలకడంతో ఆకు కూరలు కూడా అధికరేట్లు వెచ్చించి కొనే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం ఉల్లిధరలు దిగివచ్చినా మిగతా కూరగాయల ధరలు అమాంతం పెరగడంతో కూరలు వండుకునేందుకు కష్టంగా మారింది. చాలీ చాలనీ కూలీలకు కూరగాయలు కొనాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏది ఏమైనా జిల్లా పరిధిలో కూరగాయలు నిల్వవుంచేందుకు కోల్డ్ స్టోరేజి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రెండునెలల క్రితం కిలో టమోటా రూ.10లు, పచ్చిమిర్చి రూ.10లు పలుకగా ప్రస్తుతం టమోటాలు రూ.30లు, పచ్చిమిర్చి రూ.40లు, వంకాయలు రూ.30లు, బెండకాయలు రూ.30లు తదితర కూరగాయలన్నీ పెరిగిపోయాయి. ఇప్పటికైనా జిల్లాలో కూరగాయల కోల్డ్ స్టోరేజి ఏర్పాటుచేస్తే పంటలు పండిన సమయంలో కూరగాయలు నిల్వలు వుంచుకునేందుకు అవకాశం ఉంటుందని రైతులు కోరుతున్నారు.