కడప

గోసంరక్షణ ఓ మిథ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జూలై 17: జిల్లాలో గోసంరక్షణ ఓ మిథ్యగా మారింది. జిల్లాలో దాదాపు 20వేల ఆవులు మేతలేక అలమటిస్తున్నాయి. అటవీప్రాంతంలో, కొండప్రాంతంలో ఆవులను మేపుకునేందుకు అటవీ అధికారులు అడ్డుపడుతున్నారు. ప్రభుత్వం చెప్పేమాటలు కాగితాలమీదే తప్ప ఆచరణలో లేవు. పశుగ్రాస క్షేత్రాలను పెంచేందుకు ప్రభుత్వ భూములు, అటవీ భూములను గుర్తించామని, పశుగ్రాస క్షేత్రాలు పెంచుతున్నామని అధికారులు, అధికారపార్టీ మంత్రులు చెబుతున్న మాటలు మాటలకే పరిమితమయ్యాయి. కొన్ని మత సంస్థలు, కొన్ని రాజకీయ పార్టీలు ‘గోసంరక్షణ’ నినాదాన్ని చేపట్టి హింసను ప్రేరేపించడం మినహా, ఆవులను బతికించేందుకు వారు తీసుకుంటున్న చర్యలు శూన్యం. సంతల నుండి కొని ఆవులను తీసుకుపోతున్న వాహనాలను నిలిపి అందులోని మనుషులను ఇష్టమొచ్చినట్లు కొట్టిన సంఘటనలు జిల్లాలోనూ, చుట్టుపక్కల రాయలసీమ జిల్లాల్లోనూ అనేకం ఉన్నాయి. ఇలాంటి వారెవరూ, ఆవుల మేతపై ఇసుమంత ఆచరణ కార్యక్రమం కూడా చేపట్టడంలేదు.
కడప నగర శివారులో పాతకడప, మోడమీదపల్లి పొలాల్లో 3వేల ఆవులను తోలుకుని, మేతలేక అల్లాడుతున్న దృశ్యాలు మంగళవారం ‘ఆంధ్రభూమి’ దృష్టికి వచ్చింది. కమలాపురానికి చెందిన కొంతమంది ఆవులను మేపుకోవడమే ఒక వృత్తిగా జీవిస్తున్నారు. తమ గ్రామంలోనూ, చుట్టుపక్కల గ్రామాల్లోనూ ఉన్న రైతులు ఆవులను కొని వీరికి అప్పగిస్తారు. ఆ ఆవులకు పుట్టిన లేగ దూడల్లో సగం ఈ ఆవులు మేపిన కుటుంబాలకు, తక్కిన సగం ఆవులను ఇచ్చిన యజమానులకు చెందేలా ఒప్పందంతో వీరు ఆవులను మేపుకుంటారు. ఆ లేగదూడలు పెరిగి పెద్దవైన తర్వాత ఎవరి సగం వారు అమ్ముకుని సొమ్ము చేసుకుంటారు. ఇలా ఆవులు మేపుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్న కుటుంబాలది వలస జీవనమే. తమ చుట్టుపక్కల ప్రాంతాల్లో, పైర్లు కోసిన తర్వాత ఆ పొలాల్లో ఆవులను తోలుకుని మేపుకుంటారు. ఇందుకోసం ఆ గ్రామానికి కొంత ‘పుల్లరి’ చెల్లిస్తారు. పంటలు వేసిన కాలంలో ఈ ఆవులను కొండప్రాంతానికి, అటవీప్రాంతానికి తోలుకుపోయి మేపుకుంటారు. గతంలో కొండలూ ,అడవుల వల్ల వీరి జీవనం సాఫీగానే సాగేది.
ఇటీవల అటవీశాఖ సిబ్బంది, అధికారుల వల్ల వీరు ఎదుర్కొంటున్న కష్టాలు, అవమానాలు అంతా ఇంతాకావు. మేపుతున్న ఆవుల నుండి, గొర్లనుండి తమకు కావాల్సిన వాటిని తోలుకుపోవడం, అధిక మొత్తంలో మామూళ్లు అడగడం, అటవీశాఖ అధికారులకు సాధారణమైపోయింది. మోడమీద పల్లె పొలాల్లో విడిది చేసిన వారు ఈవిషయాలు చెప్పి తమ గోడు వెళ్లబోసుకున్నారు. గత ఏడాది సోమశిల బ్యాక్‌వాటర్ ప్రాంతంలో, అటవీ సిబ్బందికి రూ.15వేలు ఇచ్చి అక్కడే మేపుకున్నామని తెలిపారు. అక్కడ గడ్డికి, నీళ్లకు సౌకర్యంగా ఉంటుందన్నారు. ఈ ఏడాది సోమశిల బ్యాక్‌వాటర్ ప్రాంతానికి తోలుకుపోయామని, అక్కడ తమను మేపుకోనివ్వకపోవడంతో ఉసూరు మంటూ తిరిగి కడపకు తోలుకొచ్చామని చెప్పుకొచ్చారు.
మంత్రి ఇలాఖాలో కరువైన గ్రాసం
పశుసంవర్థకశాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి సొంత జిల్లాలో పశువులకు మేత కరువైంది. ఆవులు, గొర్లు మేపడమే వృత్తిగా జీవించేవారు కొండప్రాంతపల్లెల్లో చాలామంది ఉన్నారు. వీరపునాయునిపల్లె, పులివెందుల, చిట్వేలి, బద్వేలు,పోరుమామిళ్ల తదితర మండలాల్లో కొండప్రాంతాలున్న గ్రామాల్లో పశువులు, గొర్లను మేపడమే వృత్తిగా జీవించేవారు అనేకమంది ఉన్నారు. చాలామంది రైతులేగాకుండా , కొంతమంది వ్యాపార దృష్టితోకూడా ఆవులను, గొర్లను కొని వీరికి అప్పగిస్తుంటారు. ఇటువంటి వారు ఇప్పుడు తాము మేపుతున్న గొర్లకు, ఆవులకు మేత లేక అలమటిస్తున్నారు. ఈ జీవనం మానుకోవాలనే ఆలోచనలో పడ్డారు. మంత్రి జిల్లాలో పశుగ్రాసానికి కొరత ఉండదని అధికారులు ఊదరగొట్టడమే తప్ప ఆచరణలో పశుగ్రాస క్షేత్రాలు కంటికి కనిపించడం లేదు. ప్రభుత్వ భూములను, అటవీభూములను గుర్తించి పశుగ్రాస క్షేత్రాలు పెంచబోతున్నామని గత కలెక్టర్ చెప్పిన మాటలు ఆచరణలో శూన్యమయ్యాయి.