కడప

మా గోడు విన్నండి సారూ...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయచోటి/రామాపురం, డిసెంబర్ 6 : మా గోడు విన్నండి సారూ.. అని రాయచోటి, రామపురం మండల రైతులు కేంద్ర కరువు బృందానికి సమస్యలను ఎకరువుపెట్టారు. గురువారం రాయచోటి నియోజకవర్గంలోని రామాపురం, రాయచోటి మండలాల్లో కేంద్ర కరువు బృందం సభ్యులు రాజీవ్ సింగాల్, కరణ్ చౌదరి, సందీప్ శర్మలు పర్యటించారు. రాయచోటి మండలం శిబ్యాల పెద్దచెరువులో కేంద్ర బృందంతో రైతుల ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా నీటి పారుదల సంఘం అధ్యక్షులు గంగిరెడ్డి రైతుల సమస్యలను కేంద్ర బృందం దృష్టికి తీసుకొని వచ్చారు. వర్షాలు లేక శిబ్యాల పెద్దచెరువులో భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ చెరువు నిండితే సుమారు 250 ఎకరాలు సాగు అవుతుందని వివరించారు. 10 కిలోమీటర్ల వరకు బోర్లలో నీరుపుష్కలంగా ఉంటాయని తెలిపారు. ఈ చెరువు కింద వరి, పొద్దుతిరుగుడు పంటలు వేసేందుకు అనువుగా ఉంటుందని చెరువులో నీరులేక రైతులు ఉపాధిహామీ పనులకు వెళ్లుతున్నారని తెలిపారు. ఈ ఉపాధిహామీ పనులు లేకపోతే రైతుల జీవనం చాలా దుర్భరంగా ఉంటుందని తెలిపారు. అనంతరం రైతు శంకర్‌రెడ్డి మాట్లాడుతూ ఉపాధిహామీ పనులు 365 రోజులు పనులు కల్పించాలని కేంద్ర బృందానికి విన్నవించారు. ఉపాధి పనులులేకపోతే మా జీవనం గడవని తెలిపారు. అనంతరం కూలీ శివమాల మాట్లాడుతూ ఉపాధి పనులకు వెళ్లితేనే జీవనం గడుస్తుందని లేకపోతే గడవదని తెలిపారు. 150రోజులు కూలీ పనులు కల్పించాలని మరో 50 రోజులు కూలీ పనులు కల్పించాలని విజ్ఞప్తిచేశారు. అనంతరం రైతు రఘురామిరెడ్డి మాట్లాడుతూ శిబ్యాలలో సుమారు 300 ఎకరాల్లోవేరుశనగ పంట, 200 ఎకరాల్లో వరిపంటను సాగుచేయడం జరిగిందనితెలిపారు. వర్షాధారం లేక ఈ పంటలు పూర్తి ఎండిపోవడంతో వాటిని వదిలివేయడం జరిగిందని తెలిపారు. అలసంద, పెసలు, ఉలవల పంటలను కూడా పశువులకు వదిలివేయడం జరిగిందన్నారు. కరువువల్ల రైతులకు చాలానష్టం జరిగిందని వివరించారు. రైతుల సమస్యలువిన్న కేంద్ర కరువు బృందం నాయకుడు రాజీవ్ సింగాల్ మాట్లాడుతూ కరువు రైతుల సమస్యలపై రేపు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో చర్చించి అనంతరం కేంద్రానికి సమస్యలను విన్నవించి న్యాయం చేస్తామని చెప్పారు. ఈ ప్రాంతంలో కరువు తీవ్రంగా ఉందని ఈ కరువును అధిగమించేందుకు చర్యలు చేపడుతామని చెప్పారు. అనంతరం శిబ్యాల పెద్దూరులోని అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించి పౌష్టికాహారం సరిగా అందుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం గర్భవతులకు సీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. రామాపురం మండలంలో కేంద్ర కరవు బృందం నల్లగుట్టపల్లె, సుద్దమళ్ల, చిట్లూరు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా నల్లగుట్టపల్లెపంచాయతీ కరువువాండ్లపల్లెలో ఎండిపోయిన టమోటా, చిక్కుడు, వంకాయ పంటలను పరిశీలించారు. పంటల సాగుకు ఎంత ఖర్చు పెట్టావని రైతు బాలక్రిష్ణారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. వర్షాభావం వలన ఉపాధి పనులు చేపట్టిన భూమి గట్టిగా ఉన్నందున పని చాలాకష్టంగా ఉందని కూలీ కూడా సరిగా రావడం లేదని కూలీలు బృందం సభ్యులకు ఏకరువు పెట్టారు. అదేవిధంగా కిలోమీటర్ దూరం వెళ్లి తాగునీటిని తెచ్చుకోవాల్సి వస్తున్నదని వివరించారు. పశువులకు పశుగ్రాసంలేక చాలా ఇబ్బందులు పడుతున్నామని పాడి రైతులు విన్నవించారు. అనంతరం రాచపల్లెలో గంగులమ్మ అనే మహిళా రైతు సాగుచేసిన ఉలవ, జొన్న పంటలను పరిశీలించారు. రైతు గంగులమ్మ ఎకరానికి రూ.20 వేలు ఖర్చుచేసి వేరుశనగ పంటను సాగుచేస్తే వర్షాలులేక పూర్తిగా ఎండిపోయిందని కేంద్ర బృందం సభ్యులకు విన్నవించారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి కరవు పరిస్థితులపై కేంద్ర బృంద సభ్యులకు వివరించారు. ఈ ప్రాంతంలో వర్షాధారంపైనే రైతులు పంటలను సాగుచేస్తూ ప్రతియేటా నష్టపోతున్నారని వివరించారు. కొంత మంది రైతులు మామిడితోటల పెంపకంపై మక్కువ చూపుతున్నా వర్షాలు పడక భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో మామిడి తోటలను కాపాడుకోలేక ఎండటం చూసి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని వారిని ఆదుకోవాలని కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు. అనంతరం పాలన్నగారిపల్లె వద్ద రైతులు ఎండిపోయిన వేరుశనగ పంటను కేంద్ర బృందానికి చూపించేందుకు ఎంతోఆశతో ఎదురుచూసినా వారికి నిరాశే మిగిలింది. కరవు బృందంవచ్చి మా సమస్యలు కేంద్రానికి విన్నవిస్తారు అని రైతులు చాలాఆశతో ఉన్నప్పటికీ వారికి నిరాశే మిగిలింది. ఏ ఒక్క అధికారి కూడా వారిగోడు పట్టించుకోకుండా వెళ్లడంతో రైతులు చేసేదేమీ లేక పంటను వదిలేసి వెళ్లిపోయారు. ఈ కేంద్ర కరవు బృందం వెంట జేసీ-2 శివారెడ్డి, డ్వామా పీడీ హరిహరనాథ్, ఐసీడీఎస్ పీడీ పద్మజ, అగ్రికల్చర్ జేడీ మురళీకృష్ణ, హార్టికల్చర్ డీడీ ప్రసాద్, ఇరిగేషన్ ఈఈ వెంకట్రామయ్య, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈ సంజీవరావు, ఏపీఎంఐ పీడీ మధుసూదనరెడ్డి, తహసీల్దార్ మధుసూధన్‌రెడ్డి, ఆర్‌ఐ అజహర్‌అలీఖాన్, వ్యవసాయాధికారి వెంకటమోహన్, ఐసీడీఎస్ సీడీపీవో వసంతభాయి, ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు.

పేదల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం
* కలెక్టర్ సి.హరికిరణ్
కడప, డిసెంబర్ 6: బడుగు బలహీనవర్గాల ప్రజలు ఆర్థికంగా ఎదగాలని భావించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపట్టిన చేతివృత్తుల వారికోసం పెట్టిన ఆదరణ పథకాన్ని అన్నివర్గాలు సమర్థవంతంగా వినియోగించుకుని ఆర్థికంగా ఉన్నతస్థాయికి ఎదగాలని కలెక్టర్ హరికిరణ్ పిలుపునిచ్చారు. గురువారం కడపలోని నేక్‌నామ్ కళాక్షేత్రంలో జరిగిన ఆదరణ -2 పంపిణీ పథకాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ కార్పొరేషన్ల ద్వారా ఆదరణ పథకం కింద వివిధరకాల వృత్తులమీద జీవనం సాగిస్తున్న వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచి, వారి జీవితాల్లో వెలుగునింపేందుకే ప్రభుత్వం ఈ పథకం చేపట్టిందన్నారు. 90శాతం సబ్సిడీతో వివిధ రకాల పనిముట్లను అందజేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజల ఆర్థిక, సామాజిక అభివృద్ధికోసం ఎన్నో సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు అమలుచేస్తున్నారని, అందులో ప్రతిష్టాత్మకంగా పేదరికంపై గెలుపులో భాగంగానే ఆయా కులవృత్తులను ప్రోత్సహిస్తున్నారని వెల్లడించారు. గతనెల నవంబర్‌లో 7వేల మందికి రూ.40కోట్లతో వివిధ పథకాల కింద రుణాలు, ఆదరణ పథకం కింద పనిముట్లు పంపిణీ చేశామన్నారు. తిరిగి ఇప్పుడు 5వేల మందికి రూ.37కోట్లతో ఆదరణ పనిముట్లు పంపిణీ జరుగుతుందన్నారు. మొదటగా ఈ పథకంలో 70శాతం ఉచితం , 20శాతం రుణం, 10శాతం లబ్దిదారుడు చెల్లించాల్సివుండేదన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం పేదలపై భారం లేకుండా 90శాతం సబ్సిడీతో రుణాలు, పనిముట్లు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని వివరించారు. తీసుకున్న రుణంలో మన డబ్బు వుంటే పథకానికి భద్రత ఉంటుందన్న ఉద్దేశ్యంతోనే లబ్దిదారుడి నుండి 10శాతం వసూళ్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆదరణ పథకంలో మన రాష్ట్రంలోనే కడప జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. దుల్హన్ పథకం కింద రూ.30వేల నుంచి రూ.50వేలు, ఎస్సీలకు రూ.75వేలు అందిస్తున్నామన్నారు. ఇవేగాక ఎన్‌టిఆర్ వైద్యసేవల్లో 1500 రకాల జబ్బులకు ఉచితంగా చికిత్సలు చేయించడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం పట్టణస్థాయి పేదలకు కడుపునిండా అన్నంపెట్టేందుకే అన్నక్యాంటిన్లు ఏర్పాటుచేశారని, భవిష్యత్‌లో అధిక జనాభా ఉన్న ప్రతి పంచాయతీలో వీటిని ఏర్పాటుచేయడం జరుగుతుందన్నారు. నిరుద్యోగ యువతకు ముఖ్యమంత్రి యువనేస్తం కింద నెలకు వెయ్యిరూపాయలు వంతున నిరుద్యోగభృతి అందిస్తున్నామన్నారు. అలాగే పేదలకు ఆయా వృత్తికోర్సుల్లో శిక్షణ ఇప్పించి ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు అవకాశం కల్పించిందన్నారు. ఆదరణ పథకం మైనార్టీలకు కూడా వర్తించేందుకు వీలుగా చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్థికంగా అభివృద్ధిచెందితే చుట్టుపక్కల వారు కూడా అభివృద్ధి చెందుతారన్నారు. అనంతరం డిప్యుటీ మేయర్ బి.ఆరిఫుల్లా మాట్లాడుతూ ఆదరణ పథకం పేదలకు మంచి అవకాశమని ఆదరణలో 90శాతం సబ్సిడీ, కేవలం 10శాతం మాత్రమే పేదలు చెల్లించడం వరమన్నారు. మైనార్టీలు కూడా ఆదరణ పథకం అమలుచేసేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు. అంతకుమునుపు అక్కడ ఏర్పాటుచేసిన స్టాల్స్‌ను కలెక్టర్ పరిశీలించారు. ఈకార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఇడి శ్రీలక్ష్మి, బిసి కార్పొరేషన్ ఇడి రామచంద్రారెడ్డి, ఎల్‌డిఎం ఆంజనేయ ఆచారి, నాయకులు జిలానీ బాషా, దుర్గాప్రసాద్, ద్వారకనాధ్, బాలరాజు, బాలకృష్ణయ్య యాదవ్ తదితరులు ప్రసంగించారు. కాగా ఈ ఆదరణ పథకం కింద కడప డివిజన్‌లో 1605మంది లబ్దిదారులకు రూ.12కోట్ల 27లక్షల 37వేలు చెక్కును అందజేశారు. అలాగే అత్యంత వెనుకబడిన తరగతులకు చెందిన 143మంది ఎంబీసీ లబ్దిదారులకు రూ.42లక్షలు చెక్కును, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా 149మంది లబ్దిదారులకు రూ.2కోట్ల 89లక్షల 49వేలు చెక్కును కలెక్టర్ చేతులమీదుగా ఆయావర్గాలకు అందజేశారు.