కడప

జిల్లాలో 45వేల అక్రమ విద్యుత్ కనెక్షన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, ఏప్రిల్ 1: సర్కారు ఎన్ని చర్యలు చేపట్టిన జిల్లాలో విద్యుత్ చౌర్యం యథేచ్ఛగా సాగుతోంది. ఇప్పటికీ జిల్లావ్యాప్తంగా సుమారు 45వేల అక్రమ విద్యుత్ కనెక్షన్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గ్రామీణ పేదల కోసం కేంద్ర ప్రభుత్వం అన్నా దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామీణ జ్యోతి యోజన పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకంలో రూ.125లు చెల్లించి వెంటనే విద్యుత్ కనెక్షన్లు తీసుకునే అవకాశముంది. అయినా ఆ రూ.125లు కూడా చెల్లించి అధికారిక విద్యుత్ కనెక్షన్ తీసుకునేందుకు వెనుకాడుతున్నారు. అక్రమ విద్యుత్‌ను అరికట్టేందుకు పోలీసులు , విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బందిచే విజిలెన్స్ విభాగాన్ని ఏర్పాటుచేసినా నామమాత్రంగా కేసులు పెట్టి జరిమానా విధించి చేతులు దులుపుకుంటున్నారు. ఇటీవల అక్రమంగా విద్యుత్ వినియోగిస్తున్న వారిపై విజిలెన్స్ విభాగం దాడులు చేసి 350కేసులు నమోదుచేసి రూ.22లక్షలు జరిమానా విధించింది. జిల్లాలో 7,31,000 విద్యుత్ కనెక్షన్లు ఉండగా, 45వేల అక్రమ విద్యుత్ కనెక్షన్లు ఉన్నట్లు అధికారుల తనిఖీల్లో తేలింది. దీన దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ జ్యోతి యోజన పథకం కింద అధికారికంగా విద్యుత్ కనెక్షన్లు తీసుకోవాలని విద్యుత్‌శాఖ అధికారులు,సిబ్బంది అక్రమ కనెక్షన్‌దార్ల ఇళ్ల చుట్టుప్రదక్షిణలు చేసినా కేవలం 3వేల మంది మాత్రమే కనెక్షన్లు తీసుకున్నారు. విద్యుత్‌శాఖ విజిలెన్స్ విభాగం దాడులకు వెళ్లినా సంబంధిత ప్రాంతాల అధికారపార్టీ నేతలు కనె్నర్ర చేస్తుండటంతో వారు తిరుగుముఖం పడుతున్నారు. ఇలాఉండగా బడానేతలు తమ ఫ్యాక్టరీలు, కార్యాలయాలు, ఇళ్ళకు రాత్రి సమయాల్లో అనధికారికంగా విద్యుత్ ఉపయోగిస్తున్నా విజిలెన్స్ చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది.

బుగ్గవంక సుందరీకరణ పనులు షురూ!
ఆంధ్రభూమి బ్యూరో
కడప, ఏప్రిల్ 1. ఎట్టకేలకు కడప నగర అభివృద్ధిపై అధికారులు దృష్టిసారించారు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డి (వాసు) కడప నగరాభివృద్ధికి రూ.100కోట్లు కావాలని విజ్ఞప్తి చేయగా సిఎం సానుకూలంగా స్పందించారు. దీంతో కడప నడిబొడ్డున ఉన్న బుగ్గవంక కాలువ దాదాపు 5కి.మీ.పొడవునా అపరిశుభ్రంగా ఉండటంతో ఆ కాలువను సుందరీకరించేందుకు రూ.50కోట్లతో అధికారులు ప్రతిపాదనలు పంపగా, సిఎం కూడా పనులను వెంటనే చేపట్టాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జలవనరులశాఖ అధికారులు కాలువను సర్వేచేసి ఆ కాలువల్లో ఉన్న కంపునీరు, డ్రైనేజిల నీరు, చెత్త,చెదారం, చెడుపదార్థాలు తొలగించేందుకు చర్యలు ప్రారంభించారు. ముఖ్యంగా ఈకాలువను చింతకొమ్మదినె్న శివారు ప్రాంతాల నుంచి దేవునికడప వరకు శుభ్రంచేసి సుందరీకరించనున్నారు. అలాగే దశాబ్దాలకాలంగా పాతబస్టాండు సమీపంలోని రవీంద్రనగర్ ఓవర్‌బ్రిడ్జి మరమ్మతులకు నోచుకోగా, అందుకు కావాల్సిన నిధులు మంజూరు చేయించినట్లు తెలుస్తోంది. నగరంలో నీటిఎద్దడి నివారణ నిమిత్తం నగర పాలక సంస్థ నేతృత్వంలో నీటి సరఫరాకు కూడా చర్యలు మొదలయ్యాయి. అలాగే నగరంలో అన్ని మార్గాల్లో రోడ్ల విస్తరణ, పార్కుల అభివృద్ధి, అండర్ గ్రౌండ్ డ్రైనేజిల నిర్మాణాలు, వీధి దీపాల ఏర్పాట్లు, రోడ్ల నిర్మాణానికి మరో రూ.50కోట్లు ప్రతిపాదనలు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి ఆమోదం కోసం చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పనులన్నీ పూర్తయితే కడప నగరం కొత్త శోభ సంతరించుకోనుంది.

పిహెచ్‌సిల్లో బయోమెట్రిక్ విధానం
* డియంహెచ్‌వో సత్యనారాయణరాజు
కమలాపురం, ఏప్రిల్ 1: జిల్లాలోని అన్ని పిహెచ్‌సిల్లో ,పిహెచ్‌సిలలో బయోమెట్రిక్ విధానాన్ని త్వరగా అమలుపరచేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సత్యనారాయణరాజు ఆదేశించారు. ఆయన శుక్రవారం వైద్యాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ బయోమెట్రిక్ విధానాన్ని సోమవారం నుంచి అన్ని చోట్ల కూడా అమలుపరచాల్సి ఉండగా పలుచోట్ల సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ విధానం అమలు జరగకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేసారు. వెంటనే సాంకేతిక సమస్యను అధిగమించి అందరి వివరాలను వెంటనే రిజిస్టర్ చేయాలని తెలిపారు. ఇంకా వివరాలు పొందుపరచని వారి వివరాలు తెలుసుకుని వాటిని కూడా ఈనెల 3నాటికి పూర్తి చేసి బయోమెట్రిక్ విధానాన్ని అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్‌ఓ ఆదేశించారు..

బతుకు భారమై...్భవిత శూన్యమై...!
రాజంపేట,ఏప్రిల్ 1: రాజంపేట డివిజన్ రైతన్న అన్ని విధాలా నష్టపోతున్నారు. వర్షాభావంతో ఆయకట్టు రైతుల్లో బతుకు భయం, ప్రకృతి వైపరీత్యాలతో పండ్లతోటల రైతాంగం కడగండ్లు చెప్పనలవి కావడం లేదు. ఇక్కడి రైతుల కష్టాలపై ప్రజాప్రతినిధులు, మంత్రులు స్పందించడం వరకే పరిమితమవుతున్నారు. అయితే ఇక్కడి రైతులు తరచూ ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు శాశ్విత పరిష్కారం అవసరం. ఈ దిశగా అటు స్థానిక ప్రజాప్రతినిధులు, ఇటు ప్రభుత్వం దృష్టి పెడితే కాని ఇక్కడి రైతులు బాగుపడే పరిస్థితి కానరావడం లేదు. ఏదో ఒక కారణంతో ప్రతిఏడు నష్టపోతున్న రైతులను ఆదుకోమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం ఈ ప్రాంత ప్రజాప్రతినిధులకు షరామామూలు తంతుగా మారింది. కొన్ని సందర్భాల్లో రైతులను ప్రభుత్వం ఆదుకుంటున్నా మరికొన్ని సందర్భాల్లో ఎలాంటి పరిహారం చెల్లించడం లేదు. ఇలాంటి సందర్భాల్లో రైతుల కడగండ్లు అంతా ఇంతా కావు. గత ఏడాది మొదలు ఇప్పటి వరకు ఏ విధంగా చూసినా డివిజన్‌లో రైతులు భారీగా నష్టాలపాలయ్యారనే చెప్పవచ్చు. వర్షాభావంకు తోడు ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లతో అరటి, బొప్పాయి తోటలకు భారీ నష్టాలు, మామిడి లాభాలు అంతంతమాత్రంగానే రావడం తదితర కారణాలతో పండ్ల తోటల రైతాంగం పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అనేక వాణిజ్య పంటలకు సంబంధించిన చెట్లు సాగునీరు కరవై ఎండిపోతుండడం దురదృష్టకరం. ఇదేవిధమైన పరిస్థితులు నిమ్మరైతులు ఎదుర్కొన్నారు. వర్షాభావంతో మిట్టప్రాంతాల్లో నిమ్మతోటలను కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. మరోప్రక్క తెగుళ్లు కూడా నిమ్మతోటలకు భారీ నష్టాలు తెచ్చిపెట్టాయి. నిమ్మధరల్లో నిలకడ లేకపోవడం కూడా నిమ్మరైతులను బాధిస్తుంది. వర్షాభావ పరిస్థితులతో ఖరీఫ్‌తో పాటు రబీ పంటను డివిజన్ ఆయకట్టు రైతులు గత ఏడాది పండించుకోలేకపోయారు. దీంతో వరిసాగు విస్తీర్ణం కేవలం బావులు, బోర్ల క్రింద మాత్రమే సాగయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. వేల హెక్టార్లలో ఆయకట్టు భూములు బీడుగా మారాయి. డివిజన్‌లో ఏ చెరువు, కుంట చూసినా చుక్కనీరు లేకుండా ఎండిపోయి కనిపిస్తున్నాయి. వరి పంట దిగుబడి భారీగా డివిజన్‌లో వర్షాభావంతో పడిపోయిందనే చెప్పవచ్చు. వరిసాగు లేకపోవడంతో ఆయకట్టు భూములు కంపచెట్లు, రకరకాల పిచ్చిచెట్లతో నిండిపోయి కనిపిస్తున్నాయి. గత ఏడాది వర్షాభావ పరిస్థితులు రైతులను దిక్కూమొక్కు లేకుండా చేయగా, ప్రకృతి వైపరీత్యాలు వాణిజ్య పంటల రైతాంగం కొంప ముంచగా, ఈ ఏడాది అవే పరిస్థితులు పునరావృత్తమయ్యే పరిస్థితులు ఈ ఖరీఫ్ పంటలో నెలకొన్నాయి. పండ్లతోటలకు ప్రసిద్ధి చెందిన రాజంపేట డివిజన్‌లో వాణిజ్య పంటల రైతాంగాన్ని ఆదుకునేందుకు పంటల బీమా వసతిని సులభతరం చేయమని స్థానికంగా కొన్ని దశాబ్దాల నుండి రైతుల నుండి విజ్ఞప్తులు వస్తున్నా పట్టించుకునే నాధుడే కరవయ్యారు. ప్రతి ఏడు సరైన రీతిలో గిట్టుబాటు ధరలు లేకపోవడం, సరైన మార్కెటింగ్ వసతుల కరవవ్వడం, దళారుల రంగ ప్రవేశం, తెగుళ్లు ఇలా ఏదో ఒక విధంగా వాణిజ్య తోటల రైతాంగం తీవ్రంగా నష్టపోవడం జరగుతూ వస్తుంది. వాణిజ్య రైతాంగంను ఆదుకోకుంటే ఈ ప్రాంతంలో పండ్లతోటల విస్తీర్ణం బాగా దెబ్బతినే అవకాశాలున్నాయని చెపుతున్నా సంబంధిత అధికార్లు నిమ్మకు నీరెత్తిన చందంగా మిన్నకుంటుండడం విచారకరం. ప్రకృతి వైపరీత్యాలతో వాణిజ్య తోటల రైతాంగం నష్టాలకు గురైనప్పుడు ఒకోమారు ప్రభుత్వం సకాలంలో స్పందిస్తూ నష్టపరిహారం అందిస్తున్నా అధికమార్లు నష్టపరిహారం అందించని సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి. నాలుగైదు సంవత్సరాలుగా పరిస్థితులు పరిశీలిస్తే నష్టాలు ఎదురైనప్పుడు అధికమార్లు నష్టపరిహారం ఊసే ఉండదు, ఒకవేళ ఉన్నా నష్టంలో 10శాతం కూడా రైతులు పరిహారం అందుకోని సందర్భాలే ఎక్కువ. ఏడాదికేడాది ఈ ప్రాంతంలో వాణిజ్య తోటల రైతుల కష్టాలు పెరుగుతున్నాయి తప్పితే తగ్గడం లేదు. ప్రకృతి వైపరీత్యాలను ప్రభుత్వం అదుపు చేయలేకపోయినా కనీసం వర్షాభావ పరిస్థితులకు గురవుతున్న ఆయకట్టు రైతులను ఆదుకునేందుకు ఇక్కడి జలవనరులను రైతుల దరికి చేర్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాల్సి ఉంది. రైతులకు నష్టాలు ఎదురైతే తప్పనిసరిగా వారికి పరిహారం అందించేలా ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం కూడా ఉంది. లేకుంటే రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ ఏడాది నెలకొన్న వర్షాభావం, ప్రకృతి వైపరీత్యాలతో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను గుర్తెరిగి ఆదుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాల్సి ఉంది. బావులు, బోర్ల క్రింద సాగును దృష్టిలో ఉంచుకొని వారికి ప్రత్యేక రాయితీలు కల్పించాల్సి ఉంది.

ఎండుతున్న పంటలు
* కష్టాల్లో అన్నదాత
ప్రొద్దుటూరు, ఏప్రిల్ 1: ప్రొద్దుటూరు వ్యవసాయ డివిజన్ పరిధిలో రబీలో సాగైన పలు రకాల పంటలు ఎండుతున్నాయి. సాగునీరు లేకపోవడంతో పంటలు నిట్టనిలువునా ఎండుతున్నా చేసేదేమీ లేక రైతులు తలపట్టుకు కూర్చున్నారు. రోజుకు రెండుదపాలుగా విద్యుత్ సరఫరా కొనసాగుతున్నప్పటికీ బావులు, బోర్లు, ఫిల్టర్లలో నీరు లేకపోవడంతో ఏమీ చేయలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు. ప్రొద్దుటూరు, చుట్టుపక్కల గ్రామాలతోపాటు దువ్వూరు, రాజుపాళెం, చాపాడు, మైదుకూరు ప్రాంతాల్లో బోర్ల ఆధారంగా సాగైన పంటలు నీరు లేక ఎండిపోతున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల బోర్లలో నీరు అడుగంటిపోవడం వలన పంపుసెట్లకు నీరు అందక ఒకటిరెండు గంటలు మాత్రమే పంపుసెట్లు పనిచేస్తూ అవి మొరాయిస్తున్నాయి. దీంతో పూర్తి స్థాయిలో పంటలకు నీటి తడులను అందివ్వలేక రైతులు తీవ్ర ఇబ్బదులకు గురవుతున్నారు. రబీలో ఆలశ్యంగా వేరుశనగ, మినుము, నువ్వు, పొద్దుతిరుగుడు పంటలు సాగయ్యాయి. పంటలు మధ్య దశకు చేరుకున్న సమయంలో నీరు అందకపోవడంతో పంటలు నిట్టనిలువునా ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చు చేశామని, కనీసం పెట్టుబడులు కూడా చేతికందే పరిస్థితులు కనిపించడం లేదని ఎండుతున్న పంటలను చూసి రైతులు ఘొల్లుమంటున్నారు. వేరుశనగ పంట మధ్య దశకు చేరుకొని ఊడలు దిగే సమయంలో నీరు లేక పంటంతా ఎండిపోతోంది. అలాగే మినుముపంట సాగు వలన మంచి ఆదాయం లభిస్తుందని రైతులు ముందుచూపుతో పంటను సాగుచేసినా ఆ పంటను కాపాడలేకపోయామని రైతులు ఆంధోళన చెందుతున్నారు. కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా చేతికి వస్తాయా రావా అనే విధంగా వ్యవసాయ పరిస్థితి తయారైందని, ఎండుతున్న పంటలను చూసి రైతులు గుండెలు బాదుకుంటున్నారు. నువ్వు పంట వేసవిలో సాగుచేస్తే మంచి ఆదాయం వస్తుందని ఆశించి సాగుచేసినప్పటికీ సకాలంలో ఆ పంటకు నీరందక పూత సమయంలోనే పంట ఎండుతోందని ఫలితంగా పూర్తి నష్టాన్ని చవి చూడాల్సి వస్తోందని నువ్వు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా పొద్దుతిరుగుడు తదితర పంటలు సాగుచేసిన రైతులు కూడా తమ పరిస్థితి కూడా ఇలాగే వుందని ఆవేదన చెందుతున్నారు. ఏది ఏమైనా ఖరీఫ్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని, రబీ ఆరంభంలో కాస్త వానలు కురవడంతో ఫిబ్రవరి, మార్చి నెలల్లో కూడా వర్షాలుంటాయని ఆశించి సాగుచేసిన రైతులకు వర్షాలు లేక, నీటి వనరులు పనిచేయక, పంటలకు నీరందక తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మాడవీధుల ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్
ఒంటిమిట్ట, ఏప్రిల్ 1:మరో అయోధ్యగా పేరుగాంచిన ఏకశిలానగర కోదండ రామస్వామికి చెందిన ఆలయ ప్రాంగణంలో మాడ వీధుల ఏర్పాటుకు కేంద్ర పురావస్తు శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఉత్తర్వులు గురువారం సాయంత్రానికే టిటిడికి అందాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం నుండి ఆలయ దక్షణ భాగంలోని గార్డన్‌ను జెసిబిలతో తొలగించారు. మొన్నటికి మొన్న పురావస్తు శాఖ ఆర్‌డి సత్యభామబద్రీనాధ్ ఆలయ పరిసరాలను పరిశీలించిన విషయం విదితమే. ఆలయం చుట్టూ 3 మీటర్లు వదిలేసి మాడ వీధులకు సిమెంటు రోడ్లు వేసుకోవాలని జెఇఓ పోలా భాస్కర్‌కు ఆ సమయంలోనే సూచించారు. దీంతో ఉత్తర్వులు అందిన వెంటనే శరవేగంగా గార్డన్ తొలగింపు పనులు చేపట్టారు. ఆలయం చుట్టూ సుమారు రూ. 2 కోట్ల వ్యయంతో సిసి రోడ్లు వేసేందుకు పనులు ముమ్మరం చేశారు. ప్రస్తుతం పురావస్తు శాఖ ఏర్పాటు చేసిన గార్డన్‌లో సగ భాగాన్ని తీసేస్తున్నారు. ఎవరైనా ఆలయ ప్రాంగణంలో మృతి చెందితే స్వామివారి పూజలకు భంగం కలుగకుండా వైష్ణవ ఆగమ శాస్త్ర ప్రకారం మాడ వీధులు అవసరం. తిరుమల తరహాలోనే ఈ మాడ వీధులకు టిటిడి సమాయత్తం అయింది. స్వామివారి బ్రహ్మోత్సవాలు, పండుగ రోజులలో స్వామివారు వివిధ వాహన సేవలలో భక్తులకు దర్శనమివ్వడం ఆనవాయితీ. రానున్న రోజులలో ఆలయం చుట్టూ వాహన సేవలలో స్వామివారు కనువిందు చేసేలా టిటిడి చర్యలు తీసుకునే అవసరం ఉంది. గ్రామ ఆనవాయితీ ప్రకారం పురవీధులలోనే వాహన సేవలు నిర్వహిస్తారా, మాడ వీధులలో చేస్తారా అనేది మరి కొన్ని రోజులలో తేలనుంది. మరో ప్రదేశంలో టిటిడి ప్రత్యేక గార్డన్ ఏర్పాటుకు చర్యలు తీసుకొంటుంది. మాడ వీధుల ఏర్పాటు ఈ నెల 10వ తేదిలోపు పూర్తి చేయాలని టిటిడి కాంట్రాక్టర్‌ను ఆదేశించింది.
ప్రారంభానికి నోచుకోని స్ర్తిశక్తి భవనాలు
ఆంధ్రభూమి బ్యూరో
కడప, ఏప్రిల్ 1: రాష్ట్రప్రభుత్వం లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన స్ర్తిశక్తి భవనాలు ప్రారంభానికి నోచుకోవడం లేదు. మహిళా సంఘాలకు సమావేశాలు నిర్వహించి తద్వారా వారిని అన్ని విధాల చేయూతనందించాలని సదాశయంతో ప్రభుత్వం స్ర్తి శక్తి భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. జిల్లావ్యాప్తంగా 50 భవనాలు మంజూరు కాగా, 47 పూర్తయ్యాయి. వాటిలో కేవలం 30 భవనాలు మాత్రమే ప్రారంభించారు. మిగిలిన భవనాలు ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. శ్రీనిధి కింద రూ.54 కోట్లు లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటి వరకు రూ.10కోట్లు అందించారు. జిల్లాలో ఆయా ప్రాంత మహిళా గ్రూపులు తరచూ సమావేశాలు నిర్వహించుకుని స్థానికంగా సమస్యలతోపాటు వారు ఆర్థికంగా బలపడాలనే లక్ష్యంతో స్ర్తి శక్తి భవనాలు నిర్మించినా సర్కారు లక్ష్యం నెరవేరడం లేదు. జిల్లావ్యాప్తంగా 29వేల 500 సంఘాలు ఉండగా, ఆ సంఘాలకు ప్రభుత్వం ఇటీవలే రూ.294.36కోట్లు రుణమాఫీ కింద మంజూరు చేస్తూ ఉత్తర్వులు చేసింది. ప్రభుత్వ శాఖల్లో ఈ శాఖకు తగినంత మంది అధికారులు, సిబ్బంది ఉన్నా ఉన్నతాధికారుల కంఠశోష తప్ప ప్రభుత్వ లక్ష్యాలను గాలికి వదిలి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కాగా, కొన్ని భవనాలు ప్రారంభోత్సవానికి నోచుకోకుండానే నిరుపయోగంగా మారే పరిస్థితులు నెలకొన్నాయి. రైల్వేకోడూరు, రాజంపేట, పులివెందుల, రాయచోటి నియోజకవర్గాల్లో ఈ భవనాలను ఇబ్బడిముబ్బడిగా నిర్మించారు. రైల్వేకోడూరు స్ర్తి శక్తి భవనంపై రాజకీయాలు చోటుచేసుకుని ఆ భవన నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. స్ర్తి శక్తి భవన నిర్మాణాలను ఊరికి సుదూర ప్రాంతాల్లో నిర్మించడం వల్ల మహిళలు ఒంటరిగా అక్కడకు వెళ్లలేకపోతున్నారు. మండల సమాఖ్యలు ఏమాత్రం చర్యలు తీసుకోవాలన్నా అడుగడుగునా రాజకీయాలు వత్తిళ్లు ఎదురౌతున్నట్లు తెలుస్తోంది. అసంపూర్తిగా ఉన్న స్ర్తి శక్తి భవనాలను వెంటనే పూర్తి చేసి, పూర్తయిన భవనాలను వెంటనే ప్రారంభించి మహిళా సాధికారిత సాధించాలన్న సర్కారు లక్ష్యాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.

పార్టీ మారే ఆలోచన లేదు
* ఎమ్మెల్యే రఘురామిరెడ్డి
ఖాజీపేట, ఏప్రిల్ 1: ఇటీవల పార్టీ మారుతున్నానని వస్తున్న పుకార్లలో వాస్తవాలు లేవని, పార్టీ మారే అవకాశం లేదని మైదుకూరు ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి అన్నారు. మండలంలోని దుంపలగట్టు గ్రామంలో నూతనంగా నిర్మించిన రామాంజనేయ స్వామి దేవాలయాల ప్రతిష్ట అనంతరం 41 రోజుల పూజలను శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈసందర్భంగా రామాంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకుని పూజలుచేశారు. అనంతరం రఘురామిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ సమీకరణల్లో తాను టిడిపిలోకి వెళ్తున్నానని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, ముఖ్యంగా పుట్టా అనుచరులే ఈ గాలి వార్తలను పుట్టిస్తున్నారని చెప్పారు.
తనకు పార్టీ మారాలని ఆలోచన లేదన్నారు. టిడిపిని స్థాపించిన దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావు ఆశయాలను ప్రస్తుతం కొనసాగించడం లేదని అన్నారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు ఎన్టీఆర్‌తోనే పోయాయని అన్నారు. సింగపూర్ ధ్యాస తప్ప చంద్రబాబుకు ప్రజాపాలనపై దృష్టి లేదన్నారు. తనపై చేస్తున్న దుష్ప్రచారాలు మానుకోవాలని ప్రత్యర్థులకు హితవుపలికారు. కడప జిల్లా అభివృద్ధి చెందాలంటే వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి దస్తగిరిబాబు, జనార్దన్‌రెడ్డి, మాజీ ఎంపిపి డి.శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రూ. 15లక్షల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం
మైదుకూరు, ఏప్రిల్ 1: వనిపెంట అటవీరేంజ్ పరిధిలోని భైరవకోనలో అక్రమంగా నరికి వుంచి తరలించడానికి సిద్ధంగావున్న రూ.15 లక్షలు విలువచేసే 25 ఎర్రచందనం దుంగలతోపాటు ఆరుమంది స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు మైదుకూరు డీఎస్పీ రామక్రిష్ణయ్య తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీసు స్టేషన్ ఆవరణలో పట్టుబడిన స్మగ్లర్లు, ఎర్రచందనం దుంగలను చూపించి తదనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా ఎస్పీకి అందిన రహశ్య సమాచారం మేరకు ఆయన ఆదేశాలతో అర్బన్ సిఐ వెంకటేశ్వర్లు, దువ్వూరు ఎస్‌ఐ మధుసూధన్‌రెడ్డి తదితరులతో కలిసి శుక్రవారం భైరవకోన అటవీ ప్రాంతంలో ముమ్మరంగా గాలింపుచర్యలు చేపట్టామని తెలిపారు. దీంతో ఎర్రచందనం దుంగలతోపాటు మైదుకూరు మండలానికి చెందిన పోలు విష్ణువర్ధన్‌రెడ్డి, ప్రకాశంజిల్లాకు చెందిన ఎస్.రత్నయ్య, కె.నారాయణ, పి.ప్రసాద్, కె.వెంకటేశ్వరరెడ్డి, ఎ.రత్నమయ్య అనే స్మగ్లర్లను కూడా అరెస్ట్ చేశామని ఆయన తెలిపారు. ఈ దాడిలో మరో 15మంది తప్పించుకొని పారిపోయారని, వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నామన్నారు. ఈ కేసులో లోతుగా విచారణ చేసి చెన్నైలో దాగివున్న బడా స్మగ్లర్లను కూడా అరెస్ట్ చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వీరితోపాటు ఒక మోటార్‌సైకిల్, ప్యాకింగ్ మిషన్లు, వయరును స్వాధీనం చేసుకున్నామని, స్మగ్లర్లపై కేసు నమోదుచేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు డీ ఎస్పీ తెలిపారు. అర్బన్ సిఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐలు మధుసూదన్‌రెడ్డి, కృష్ణమూర్తిలను డీఎస్పీ అభినందించారు.