కడప

గడపగడపకూ వైకాపా విజయవంతమయ్యేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జూలై 5: తెలుగుదేశం ప్రభుత్వంపై వ్యతిరేకంగా వైకాపా శ్రేణులు కడప గడప పేరిట మరో మూడు రోజుల్లో చేపట్టనున్న గడప గడపకూ కార్యక్రమం విజయవంతమయ్యేవరకు అనుమానాలేనని ఆపార్టీ కేడరే తెగేసి చెబుతున్నారు. జిల్లాలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ, 2 పార్లమెంట్ సెగ్మెంట్లలోనూ అధిక స్థానాల్లో మండల పరిషత్ అధ్యక్షులు, మున్సిపల్ పురపాలక చైర్మన్లు, జెడ్పిటిసిలు, సర్పంచ్‌లు అధికంగా ఉన్నా ఐదునెలల పాటు గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం వరకు గడప గడపకూ తిరగాలని ఆపార్టీ అధిష్ఠానం ఆదేశించింది. ఈ నేపధ్యంలో సుదీర్ఘంగా ఐదునెలల పాటు పర్యటనలు జరిపితే అధికారపార్టీ నేతలు, కార్యకర్తలు అడ్డుకునే పరిస్థితులు లేకపోలేదు. ఎన్నికల అనంతరం అధికార దాహంతో తెలుగుదేశం పార్టీలోకి పలువురు వైసిపి, కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వలస వచ్చారు. వైసిపి నేతలు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లోకి వెళ్లి గడప గడపకు వెళ్లి తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శలు చేయడం, నేతలపై ఆరోపణలు చేయడం జరిగితే అధికారపార్టీ నేతలు తిరగబడక తప్పదు. అవసరమనుకుంటే వైసిపి నేతలు, కార్యకర్తలపై అధికారపార్టీ నేతలు కేసులు బనాయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కేసుల బనాయిస్తే కేసుల నుంచి బయటపడేందుకు కొన్ని సంవత్సరాల పాటు న్యాయస్థానాలు, పోలీసుస్టేషన్ల చుట్టూ తిరగక తప్పదని వైసిపి నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అధికారం లేకుండా ఏడు సంవత్సరాలు కావస్తున్న వైసిపి నేతలు, కార్యకర్తలు మరో మూడేళ్లు అధికారం ఉండదుకాబట్టి కేసులతోపాటు ఆర్థిక ఇబ్బందులు తప్పవని, ఈ పరిస్థితుల్లో గడప గడపకు వెళ్లి అధికారపార్టీపై ఆరోపణలు చేస్తే అధికారపార్టీ నేతలు దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులతోపాటు కేసులు తప్పవని వైసిపి నేతలు అంటున్నారు. అధికారపార్టీ నేతలు సైతం వైసిపి చేపట్టిన కడప గడప కార్యక్రమాన్ని విజయవంతం కాకుండా అడ్డుకోకపోతే తమ ఉనికికే ప్రమాదమని అధికారపార్టీ నేతలు భావిస్తున్నారు. తెలుగుదేశంపార్టీ అధిష్ఠానం సైతం జగన్ సొంత జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నీరుగార్చేందుకు అధికారపార్టీ నేతలకు బాధ్యతలు అప్పగించారు. వైకాపా ఎమ్మెల్యేలు మేడా వెంకట మల్లికార్జునరెడ్డి, టి.జయరాములు, సి.ఆదినారాయణరెడ్డి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డి (వాసు), రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్‌నాయుడు, పౌరసరఫరాల అభివృద్ధి సంస్థ రాష్ట్ర చైర్మన్ ఎం.లింగారెడ్డి, అన్ని నియోజకవర్గాల ఇన్‌చార్జిలు గడప గడప కార్యక్రమం వైసిపి నేతలు చేపట్టిన వెంటనే సంబంధిత ప్రాంతాల్లో పర్యటించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద గడప గడపకూ కార్యక్రమం వైసిపి అధిష్ఠానం ఐదునెలల కార్యక్రమాన్ని చేపట్టడంపై జిల్లా కేడర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మాత్రం గడప గడపను విజయవంతం చేయని పక్షంలో నేతలపై వేటువేస్తానని ఐదుమాసాలు ప్రజల్లోకి వెళ్లాలని ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించాలని ఆదేశించడంతో పార్టీ కేడర్ డీలా పడింది.

రాజంపేట మున్సిపాలిటీలో పరిష్కారం దిశగా
ఆర్థికేతర సమస్యలు..

రాజంపేట, జూలై 5:రాజంపేట మున్సిపాలిటీలో ఆర్థికేతర సమస్యల పరిష్కారంలో మున్సిపల్ అధికారులు సత్వరం చర్యలు తీసుకుంటున్నారు. రోజుకొక వార్డులో పర్యటించి ప్రజల నుండి సమస్యలు అడిగి తెలుసుకుని సత్వరం పరిష్కరించాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆదేశించిన నేపథ్యంలో మున్సిపల్ అధికారులు రోజుకొక వార్డులో పర్యటిస్తున్నారు. ముందుగా ఆర్థికేతర సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తూ, ఆర్థికపరమైన సమస్యలపై నివేదికలు తయారు చేసుకుంటూ పోతున్నారు. అలాగే సంక్షేమ పథకాల అమలులో భాగంగా ప్రభుత్వం నుండి మరుగుదొడ్లు మంజూరు అడిగిన వారికందరికి ఇచ్చేలా మున్సిపల్ అధికారులు మార్నింగ్‌వాక్‌లో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం మెరుగుతో పాటు డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్తు దీపాల సమస్యలపై దృష్టి సారిస్తూ వీటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటు ముందుకెళుతున్నారు. త్వరలో రాజంపేట మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగే అవకాశాలు దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ అధికారులు మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు మెరుగైన సేవలందించే దిశగా ప్రభుత్వ ఆదేశాలు ఓ రకంగా సఫలీకృతమవుతున్నాయని చెప్పవచ్చు. మున్సిపాలిటీలో అవసరమైన అర్హులైన వారికందరికి ఫించన్లు, స్థలాలుండి ఇళ్లు కట్టుకోని వారికి పక్కా ఇళ్లు మంజూరు దిశగా స్థానిక తెలుగుదేశం నాయకులు దృష్టి సారించారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ విప్ మేడా వెంకట మల్లికార్జునరెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఫించన్లు, పక్కా గృహాల మంజూరుకు సంబంధించి ప్రత్యేక నివేదిక అందజేశారు. ఇందుకు మంత్రి కూడా సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో తదనుగుణంగా మున్సిపల్ అధికారులు కూడా దృష్టి పెట్టారు. మున్సిపాలిటీలో మున్సిపల్ అధికారులు ముమ్మర సేవలందించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల దీర్ఘకాలికంగా ప్రజలు పలు వార్డుల్లో ఎదుర్కొంటున్న సమస్యలు కొన్ని అయినా పరిష్కారానికి నోచుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాగా పట్టణంలో దరఖాస్తు చేసుకున్న అర్హులైన అందరికి ఫించన్లు, ఇంటి స్థలాలు కలిగి ఇళ్లు కట్టుకోలేని ఆర్థిక స్థోతమ లేని వారికి పక్కా ఇళ్లు మంజూరు చేసేందుకు దేశం నేతలు చేస్తున్న యత్నాలు ఏ మేరకు సఫలీకృతమవుతాయో వేచిచూడాలి.
శివారు ప్రాంతాల మాటేమిటి
రాజంపేట పట్టణం శివారు ప్రాంతాల్లో సౌకర్యాల మాట ఏమిటన్న ప్రశ్నలు స్థానికులు ప్రశ్నిస్తున్నారు. రోజురోజుకు పట్టణం విస్తరిస్తూ పోతున్నా ఇందుకు తగ్గట్టు అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పట్టణంలో రైల్వేస్టేషన్ ఆవలివైపు పదివేల పైచిలుకు జనాభా ఉంటున్నా సౌకర్యాలు కల్పించడంలో సంబంధిత అధికార్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు విఫలమవుతున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే విధమైన పరిస్థితి ఎర్రబల్లె శివారు ప్రాంతం, నూతన బైపాస్ రోడ్డులో నిర్లక్ష్యం కొనసాగుతోంది. పేరుకు రైల్వేస్టేషన్ ఉన్నా కనీసం రైల్వేస్టేషన్ అభివృద్ధి కూడా అంతంత మాత్రంగానే ఉంది. రైల్వేస్టేషన్ ఆవలివైపు రాజంపేట మున్సిపాలిటీకి చెందిన సరస్వతిపురం, తుమ్మల అగ్రహారం, జానీబాషాపురం ఉన్నాయి. అంతేకాకుండా ప్రభుత్వ ఉన్నత పాఠశాలతో పాటు జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలలనున్నాయి. ఏదిమైనా 10వేల పైచిలుకు జనాభాతో పాటు నిత్యం వేల సంఖ్యలో విద్యార్థినీ విద్యార్థులు చేరుకునే ఈప్రాంతంలో అన్ని రకాల వసతులు సమకూర్చాల్సిన అవసరముంది. ఈ విషయంలో ప్రభుత్వం దృష్టి సారించేలా స్థానిక తెలుగుదేశం నేతలు చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. ఇక్కడ బ్యాంకుల ఏర్పాటుతో పాటు మార్కెట్ వసతులు మెరుగుపరచాలంటున్నారు. ఏ చిన్న పనికైనా పట్టణంలోపలికి ఒకటిన్నర కిలోమీటరు పైగా రావాల్సి వస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో ఇక్కడి ప్రజలు పడుతున్న అవస్థలు వర్ణణాతీతం. అలాగే ఎర్రబల్లె శివారు ప్రాంతం, బైపాస్‌రోడ్డు ప్రాంతంలో సరైన రోడ్లు, డ్రైనేజీ వసతులు కల్పించాల్సి ఉంది. రాజంపేట పట్టణంలో జరిగే అభివృద్ధిలో శివారు ప్రాంతాల అభివృద్ధికి కూడా ప్రత్యేక నిధులు మంజూరుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్దం చేయించేందుకు అవసరమైన చర్యలు ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.