కడప

సీమజిల్లాల సస్యశ్యామలమే బాబు లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,డిసెంబర్ 2: సీమ జిల్లాలకు సాగు, తాగునీరు తెప్పించి సస్యశ్యామలం చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్యేయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పరిశీలకుడు హరిబాబు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డి (వాసు) పేర్కొన్నారు. చైతన్యయాత్రలో భాగంగా బుధవారం వారు జిల్లాలోని వివిధప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. కడపలోని పలు డివిజన్లలో తెలుగుదేశం నేతలను వెంటపెట్టుకుని ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించారు. ప్రజాసమస్యలను పరిష్కరించడమే టిడిపి ప్రభుత్వ ధ్యేయమని, పట్టిసీమ నుంచి జిల్లాకు నీరు తేవడం, గండికోటను పూర్తిచేసి జిల్లాను సస్యశ్యామలం చేయడం లక్ష్యమని వారు పేర్కొన్నారు. గాలేరు-నగరి, హంద్రీ-నీవా, సుజల స్రవంతి ప్రాజెక్టులను గడువులోగా పూర్తిచేసి జిల్లాలో రైతులకు సాగు, తాగునీటి కొరత లేకుండా బాబు చర్యలు తీసుకున్నారని వారు పేర్కొన్నారు. నెలక్రితం కెసి ఆయకట్టు రైతులకు నీరు ఇస్తామని చెప్పిన బాబు...మాట తప్పకుండా నీరు ఇస్తున్నారని వారు పేర్కొన్నారు. జిల్లాకు హజ్‌హౌస్, హౌజ్ కమిటీ , వౌలానా అబ్దుల్ కలామ్ యూనివర్సిటీ విభాగం, హార్టికల్చర్ సంస్థలు వచ్చాయని, త్వరలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్లు వారు తెలిపారు. ప్రతిపక్షపార్టీ నేత ఈ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్వలేక రాష్ట్రంలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతూ అధికారదాహంతో దేనికైనా సిద్దపడుతున్నారని వారు ధ్వజమెత్తారు. రాష్టవ్రిభజన అనంతరం ఆర్థికంగా రాష్ట్రంలో అనేక కష్టాలు ఉన్నా వాటన్నింటినీ అధిగమిస్తూ రాష్ట్భ్రావృద్ధే ధ్యేయంగా బాబు కృషి చేస్తున్నారని వారు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలను సీమ జిల్లాలను సస్యశ్యామలం చేయడమే బాబు ధ్యేయం చూసి అన్ని పార్టీల నేతలు ఆకర్షితులౌతున్నారని , అభివృద్దే తమ అభిమతమని వారు స్పష్టం చేశారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఎవరు ముందుకొచ్చినా ప్రభుత్వం వెంటనే అనుమతులు మంజూరు చేస్తుందని వారు పేర్కొన్నారు. నగరంలోని ఎన్‌టిఆర్ చిత్రపటాలకు పూలమాల వేసి, పార్టీ జెండా ఎగురవేశారు. నగర వీధుల్లో పార్టీ నేతలను , కార్యకర్తలను వెంటపెట్టుకుని డివిజన్ల వారీగా తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. వీరివెంట తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.గోవర్దన్‌రెడ్డి, తెదెపా జిల్లా ప్రధానకార్యదర్శి బి.హరిప్రసాద్, నగర అధ్యక్షుడు ఎస్.హరీంద్రనాధ్, రాష్టమ్రైనార్టీ విభాగం మాజీ అధ్యక్షుడు అమీర్‌బాబు, నగర మాజీ అధ్యక్షుడు బాలకృష్ణయాదవ్, మహిళా నాయకురాళ్లు, కార్యాలయ కార్యదర్శి సి.వెంకటశివారెడ్డి, మేనేజర్ ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ముంపుగ్రామాల్లో కలెక్టర్ పర్యటన
ఆంధ్రభూమి బ్యూరో
కడప,డిసెంబర్ 2: సోమశిల ప్రాజెక్టుకు భారీ ఎత్తున వరదనీరు చేరడంతో బుధవారం జిల్లా కలెక్టర్ కెవి రమణ సోమశిల ప్రాజెక్టు ముంపుగ్రామాల్లో భాగమైన అట్లూరు మండలం చింతావాండ్లపల్లెను సందర్శించారు. సోమశిలకు 72 టిఎంసిల నీరు చేరినందున గ్రామం ముంపునకు గురవుతుందని, వెంటనే గ్రామప్రజలంతా ఖాళీ చేయాలని ఆయన కోరారు. అంతేగాకుండా ముంపుగ్రామస్తులందరికీ పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేశామని, నిర్వాసితులను ఆర్డీవో, తహసీల్దార్, ఇతర శాఖాధికారులు వెంటనే తరలించాలని ఆయన ఆదేశించారు. గ్రామస్తులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని కలెక్టర్ ప్రశ్నించగా తమకు పూర్తిస్థాయి పరిహారం అందలేదని, తమకు పూర్థిస్థాయి పరిహారం అందిస్తే తాము గ్రామాలు వదిలి వెళ్తామని కలెక్టర్‌కు తెలిపారు. తాను ప్రభుత్వానికి నివేదిక పంపి వెంటనే ప్రభుత్వం నుంచి రావాల్సిన నష్టపరిహారం ఇప్పిస్తామని, పరిహారం గురించి ఎవ్వరూ భయపడాల్సిన పనిలేదని, వెంటనే గ్రామాలు ఖాళీ చేసి వెళ్లాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆ గ్రామంలో డిఎంహెచ్‌ఓ డాక్టర్ సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్‌ను ఏర్పాటుచేయగా, కలెక్టర్ వైద్యశిబిరాన్ని సందర్శించారు. కలెక్టర్‌తోపాటు స్పెషల్ కలెక్టర్ ఎస్వీ నాగేశ్వరావు, జెసి కృష్ణ్భారతి, రాజంపేట ఆర్డీవో ప్రభాకర్ పిళ్లై, అట్లూరు తహసీల్దారు ఈశ్వరయ్య, బద్వేలు మాజీ ఎమ్మెల్యే కె.విజయమ్మ తదితరులు పాల్గొన్నారు.
శిరోభారంగా మారిన 4నియోజకవర్గాలు
ఆంధ్రభూమి బ్యూరో
కడప, డిసెంబర్ 2: పదేళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి రావడంతో గత సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో ఘోరపరాజయం పాలైన టిడిపి అభ్యర్థులు ఇల్లు చక్కబెట్టుకోవడం మాని ఆధిపత్య పోరుతో గ్రూపురాజకీయాలకు దిగుతూ అధిష్టానానికి శిరోభారంగా మారారు. వారంరోజుల్లో గొడవలన్నీ పరిష్కరించుకోకపోతే తగు మూల్యం చెల్లించాల్సి వస్తుందని హైకమాండ్ ఇప్పటికే ఆయా నియోజకవర్గాల నేతలు, జిల్లా పార్టీ నాయకత్వానికి వార్నింగ్ ఇవ్వడంతో టిడిపిలో కలకలం మొదలైంది. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ హైకమాండ్‌కే కాకుండా జిల్లాపార్టీ అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డి (వాసు)కి తలనొప్పిగా మారాయి. కడప, రాయచోటి, బద్వేలు, రాజంపేట నియోజకవర్గాల్లో తెలుగుతమ్ముళ్ల మనస్పర్థలు తారాస్థాయికి చేరి పార్టీ కార్యక్రమాల్లో సైతం సంబంధిత నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. పైకి నేతలంతా ఐకమత్యంగా ఉన్నట్లు కన్పించినా... లోలోపల తమ గ్రూపులను ప్రోత్సహిస్తూ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇదిలాఉండగా గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చవిచూసిన నేతలకే ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తామని గతంలో ప్రకటించారు. కడపలో రెబల్ అభ్యర్థి, బద్వేలులో ఓటమి చవిచూసిన అభ్యర్థి ఇన్‌చార్జి పదవులు దక్కకపోవడంతో ఆయా పదవుల కోసం వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రాజంపేటలో మాజీ మంత్రి పి.బ్రహ్మయ్యకు పార్టీ ఆవిర్భావం నుంచి ఉంటున్నా గత సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ లభించలేదు. టికెట్ దక్కించుకున్న మేడా వెంకటమల్లికార్జునరెడ్డి గెలుపొంది ప్రభుత్వవిప్ పదవి కూడా పొందారు. ఆ ఇద్దరు నేతలు పైకి మామూలుగానే ఉన్నా లోపల ఇద్దరి మధ్య వర్గపోరు కొనసాగుతూనే ఉంది. అక్కడ సామాజికవర్గాల వారీగా పోరుతోపాటు నేతల మధ్య ఆధిపత్యపోరు స్పష్టంగా కన్పిస్తోంది. రాయచోటిలో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూసిన ఆర్.రమేష్‌కుమార్‌రెడ్డికి ఇన్‌చార్జ్ పదవి దక్కగా, 30సంవత్సరాలుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్ తెలుగుదేశం నేత , మాజీ ఎంపి, మాజీ ఎమ్మెల్యే ఎస్.పాలకొండ్రాయుడు, ఆయన తనయుడు ఎస్.ప్రసాద్‌బాబు (చిన్నరాయుడు)లు జీర్ణించుకోలేకపోతున్నారు. రమేష్‌కుమార్‌రెడ్డి, ప్రసాద్‌బాబులు రాయచోటి నియోజకవర్గంలో పర్యటించినపుడు సఖ్యతగా ఉన్నట్లే కన్పిస్తున్నారు. అయితే పార్టీ చేపట్టే కార్యక్రమాలు, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు ఇరువర్గాల నేతలు ఎవరికి వారే వేర్వేరుగా పాల్గొంటూ బలప్రదర్శనకు దిగుతున్నారు. ఇక బద్వేలు నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడ్ కావడంతో బ్యాంకు మేనేజర్ ఎన్‌డి విజయజ్యోతికి పార్టీ టికెట్ లభించగా, ఆమె ఓటమి పాలయ్యారు. పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్న మాజీ ఎమ్మెల్యే కె.విజయమ్మ తమ అనుచరగణంతో కార్యక్రమాలకు హాజరవుతుండటంతో ఇద్దరి మధ్య ఆధిపత్యపోరు తారాస్థాయికి చేరింది. విజయజ్యోతి తాను ఇన్‌చార్జ్ అని, తన మాటే చెల్లాలని అంటుండగా, విజయమ్మ ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న జన చైతన్య యాత్రల్లో ఇద్దరు కలిసి కార్యక్రమాల్లో పాల్గొనాలని జిల్లా అధినాయకత్వం కోరింది. విజయమ్మ తనదైన శైలిలో సదస్సుల్లో జోరుగా పాల్గొంటుండగా, విజయజ్యోతి తనను విజయమ్మ కలుపుకోవడం లేదని రెండురోజులుగా సదస్సులకు దూరంగా ఉంటున్నారు. ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డికి పౌరసరఫరాల రాష్ట్ర చైర్మన్ పీఠం దక్కడంతో, మాజీ ఎమ్మెల్యే , గత ఎన్నికల్లో ఓటమి చవిచూసిన ఎన్.వరదరాజులురెడ్డి ఇక నియోజకవర్గంలో చక్రం తిప్పనున్నారు. ఆ నాలుగు నియోజకవర్గాల్లో వారంరోజుల్లోగా పరిస్థితిని చక్కదిద్దాలని పార్టీ హైకమాండ్ జిల్లా పరిశీలకుడు దొరబాబు, అధ్యక్షుడు వాసుకు గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో ఏంచేయాలో తెలియక ఆ నేతలిద్దరూ తలలు పట్టుకుంటున్నారు. తమ మాట వినని పక్షంలో ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితి పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లి చక్కదిద్దుతామని వారంటున్నారు. మరి ఆయానేతల మధ్య వీరిద్దరి సయోధ్య యత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచిచూడాల్సి ఉంది.
చెత్తాచెదారంతో నిండిన బుగ్గవంక
ఆంధ్రభూమి బ్యూరో
కడప, డిసెంబర్ 2: ఇటీవల కాలంలో కురిసిన భారీవర్షాలకు బుగ్గవంకకు పెద్దఎత్తున వరదనీరు చేరగా, ఆయా గ్రామపంచాయతీ, పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థ చెత్తాచెదారాన్ని తొలగించని కారణంగా ఆ చెత్తంతా ప్రవాహానికి బుగ్గవంకకు చేరి దుర్వాసన వెదజల్లుతోంది. ఎక్కడి చెత్త అక్కడే కుళ్లిపోయి అంటువ్యాధులు విజృంభిస్తున్నాయి. అంటువ్యాధుల కారణంగా వందలాది రోగులతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు కిక్కిరిసి పోయాయి. ప్రాధమిక వైద్యశాలలు, ఏరియా ఆసుపత్రులు, రిమ్స్‌లో వివిధ రకాల జ్వరాలు, అంటువ్యాధుల రోగులతో కిక్కిరిసి పోతున్నాయి. అసలే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు అంతంతమాత్రంగానే ఉండటం, ఎగుడుదిగుడు రోడ్లలో ఇళ్లల్లోని మురుగునీరు, వర్షపునీరు, చెత్తాచెదారం ఏకమై కుళ్లుతోంది. ముఖ్యంగా మున్సిపాల్టీలు, నగరపాలక సంస్థలోని చెత్తతొట్లన్నీ నిండిపోగా, ఆ చెత్తను తొలగించలేక నగరపాలక సంఘ సిబ్బంది అవస్థలు పడుతున్నారు. లోతట్టు,మారుమూల ప్రాంతాల్లో ప్రత్యేకించి చెత్తాచెదారాన్ని తొలగించేందుకు సరిపడా సిబ్బంది లేకపోవడం, కుప్పతొట్లు అమర్చకపోవడం, ఇళ్లల్లోని చెడుపదార్థాలు, చెత్తాచెదారాన్ని రోడ్లపైనే పడవేయడంతో ఈ వర్షానికి కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతోంది. డ్రైనేజి కాలువలు, రోడ్లు సక్రమంగా లేనికారణంగా ఎక్కడి చెత్త, వ్యర్థపదార్థాలు అక్కడే పేరుకుపోయాయి. కుక్కలు, పందికొక్కులు, దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి.విషజ్వరాలు, మలేరియా, టైఫాయిడ్, మెదడువాపు, డెంగ్యూలతో గజగజ వణుకుతున్న ప్రజలు వర్షాల పుణ్యమా అని అంటువ్యాధులకు లోనై ఆందోళన చెందుతున్నారు. అలాగే కడప నగరం లోతట్టు ప్రాంతాలు, నడిబొడ్డున బుగ్గవంక ప్రాజెక్టు నీరు వదలడంతో బుగ్గవంక కింద వున్న కాలువలు, పాతబస్టాండు, జెడ్పి, ఎస్వీ డిగ్రీ కాలేజి, రవీంద్రనగర్, మరాఠివీధి, గౌస్‌నగర్, అల్మాస్‌పేట, సాయిపేట, సబ్‌జైల్ ప్రాంతాలు బురదమయంగా మారాయి. బుగ్గవంక గేట్లు ఎత్తివేయడంతో వంకలో పేరుకుపోయిన చెత్తాచెదారం, చెడు పదార్థాలు, ఏకమై నీరంతా నగరంలోకి ప్రవేశించి జనవాసాల్లోకి చేరడంతో దోమలు విజృంభించి ప్రతి ఇంటిలో ఇద్దరు,ముగ్గురు అంటువ్యాధులతో మంచానపడ్డారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే అధికారిక లెక్కల ప్రకారం 225 డెంగ్యూ కేసులు, 300 పైబడి మలేరియా కేసులు అధికారికంగా నమోదయ్యాయి. అనధికారికంగా డెంగ్యూ మృతులు 100కు పైబడే ఉన్నాయి. మలేరియా, టైఫాయిడ్ బాధితులు 10వేలకు పైబడే ఉన్నారు. ప్రస్తుతం వర్షాల పుణ్యమా అని అంటువ్యాధులు రోజురోజుకు విజృంభిస్తున్నాయి. ఈ వ్యాధులను ఆసరా చేసుకుని ప్రైవేట్ వైద్యులు రక్తపరీక్షలు, ఇతర పరీక్షల పేరుతో దోచుకుంటున్నారు. ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖ, గ్రామపంచాయతీలు, పురపాలక సంఘాలు, మలేరియా శాఖ, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు సమన్వయంతో పనిచేయాల్సి ఉంది.
పాఠశాలను తెరిపించాలని జాతీయ రహదారి దిగ్బంధం
మైదుకూరు, డిసెంబర్ 2: మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని బండివారిపల్లె ప్రాథమిక పాఠశాలను మూసివేయించి కేశలింగాయపల్లె పాఠశాలలో విలీనం చేయడానికి నిరశిస్తూ ఆగ్రహించిన ఆ గ్రామస్తులు తమ పిల్లలతో కలిసి బుధవారం మైదుకూరు పట్టణంలోని కడప - కర్నూలు జాతీయ రహదారిపై ఆంధోళనకు దిగి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. బండివారిపల్లె ప్రాథమిక పాఠశాలలో 22మంది విద్యార్థులు ఉన్నారు. దీంతో విద్యాశాఖ అధికారులు ఇటీవల పాఠశాలలో పిల్లలు తక్కువగా ఉన్నారనే కారణంతో బండివారిపల్లె పాఠశాలను మూసివేసి ఆ గ్రామానికి సమీపంలోని కేశలింగాయపల్లె పాఠశాలలో విలీనం చేశారు. దీంతో బండివారిపల్లె పాఠశాలకు చెందిన విద్యార్థులు కేశలింగాయపల్లె గ్రామానికి వెళ్లి చదువుకొని రావాల్సిన దుస్థితి ఏర్పడింది. విద్యాశాఖ అధికారుల అనాలోచిత నిర్ణయాలతో ఉన్నఫళంగా తమ పాఠశాలను మూసివేసి పక్క గ్రామాలకు పంపడం పట్ల గ్రామస్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు చేరి వారిని పక్క గ్రామాలకు, ప్రైవేటు పాఠశాలలకు పోకుండా నివారించి చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయులు విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం ఫలితంగానే పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన బాధ్యత అటు పాఠశాల ఉపాధ్యాయులపై, ఇటు విద్యాశాఖ అధికారులపై ఉన్నప్పటికీ తమకేమీ తెలియనట్లు పాఠశాలను మూసివేసి పిల్లలను ఇబ్బందికి గురిచేయడం పట్ల వారు విచారం వ్యక్తం చేశారు. తమ గ్రామానికి దూరంగా ఉన్న పాఠశాలలో రోజూ పిల్లలు వచ్చేందుకు ఎలాంటి సౌకర్యం లేదని, దీంతో పిల్లలు ఇబ్బందులకు గువుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను విద్యాశాఖ అధికారులకు తెలిపినా వారి నుంచి స్పందన లేదన్నారు. ఈ నేపద్యంలో వారు బుధవారం తమ పాఠశాల విద్యార్థులతో కలిసి పట్టణంలోన స్థానిక కడపరోడ్డులోని ఎమ్మార్పీ కార్యాలయం వద్దకు వచ్చి బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఇన్‌చార్జ్ ఎంఇఓ జయరంగారెడ్డికి తమ పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను వారి దృష్టికి తెచ్చారు. తదనంతరం వారు తమ పిల్లలతో కలిసి ఆందోళనకు దిగి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. సమాచారం తెలుసుకున్న వెంటనే అర్బన్ సిఐ వెంకటేశ్వర్లు వచ్చి ఆందోళనాకారులతో మాట్లాడి ఆంధోళన విరమింపజేశారు.
సమస్యల పరిష్కారానికే జనచైతన్య యాత్ర
రాజంపేట, డిసెంబర్ 2: గ్రామాల్లో, వార్డుల్లో దీర్ఘకాలంగా ఉన్న సమస్యల పరిష్కారానికి జనచైతన్య యాత్రలు దోహదపడుతున్నాయని విప్ మేడా మల్లికార్జునరెడ్డి అన్నారు. బుధవారం రాజంపేట పట్టణం ఉస్మాన్‌నగర్‌తో పాటు పలు వార్డుల్లో జరిగిన జనచైతన్యయాత్రలో మేడా పాల్గొని మాట్లాడుతూ అందరికీ సంక్షేమం.. అన్నింటా ప్రగతి ధ్యేయంగా మందుకు సాగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనా సంస్కృతిని ప్రజలకు వివరించేందుకు ఉద్దేశించిన జనచైతన్యయాత్రల్లో వివిధ వర్గాల ప్రజలు నేరుగా తమ సమస్యలను కూడా విన్నవించుకుంటున్నారన్నారు. దీంతో ఈ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకునేందుకు అవకాశం కలుగుతున్నదన్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను వివరిస్తున్నప్పుడు అన్ని వర్గాల ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారని, ఎక్కడ కూడా వ్యతిరేకభావం ప్రజల్లో లేదన్నారు. ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంలో ఉంచి రాష్ట్రాన్ని విడదీసిన సమయంలో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు అనుభవమే నేడు రాష్ట్రం అన్ని రంగాల్లో పురోభివృద్ధి దిశగా పయనించేందుకు, అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి చర్యలు తీసుకునేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. రాష్ట్రం ఎంతటి ఆర్థిక లోటులో ఉన్నా ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలన్నింటిని ఒకొక్కటిగా అమలుచేస్తూ ముందుకు సాగుతున్నారని ప్రజల నుండి కూడా రాష్ట్ర ప్రభుత్వ పాలనపై మంచి స్పందన లభిస్తున్నదన్నారు. జనచైతన్యయాత్ర వల్ల ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తుండడం వల్ల నిరక్షరాస్యులు సైతం ప్రభుత్వ పథకాలను తెలుసుకునేందుకు వీలవుతున్నదని, దీంతో నిజమైన లబ్దిదారులు పథకాలు అందుకునే అవకాశాలు మెరుగయ్యాయన్నారు. చాలా మంది అర్హులైన లబ్దిదారుల్లో చాలా మందికి ప్రభుత్వ పథకాలపై అవగాహన లేదని, ఇలాంటి వారు జనచైతన్య యాత్రతో పాటు ప్రభుత్వం రూపొందించిన కరపత్రాలు పంపిణీ వల్ల ప్రభుత్వ పథకాలపై పూర్తిస్థాయి అవగాహనకు వస్తున్నారన్నారు. జనచైతన్యయాత్రలో భాగంగా వివిధ వర్గాల ప్రజలతో మేడా మల్లికార్జునరెడ్డి ముఖాముఖి సమావేశమై వారి సమస్యలు తెలుసుకునేందుకు ఆసక్తి కనబరచడం జరిగింది. వృద్ధులు, మహిళలు, పిల్లలు ఎవరు ఎదురొచ్చినా ప్రభుత్వ పథకాలపై వారికున్న అవగాహన, స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకోవడం విశేషం.
తన దృష్టికి వచ్చిన పలు సమస్యలను అక్కడికక్కడే అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించే దిశగా మేడా చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశంపార్టీ ముస్లిం సెల్ ఉపాధ్యక్షులు గుల్జార్‌బాషా, మాజీ మార్కెటింగ్ కమిటీ ఛైర్మన్ యోగీశ్వరరెడ్డి, మైనార్టీ నేతలు యూనస్, అబ్దుల్లా, పట్టణ పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు టి.సంజీవరావు, మనుబోలు వెంకటసుబ్బయ్య, టిడిపి నేతలు తదితరులు పాల్గొన్నారు.
పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
యర్రగుంట్ల, డిసెంబర్ 2 : ఆర్టీపీపీలో 6వ యూనిట్‌లో నిర్మాణ పనుల్లో నిర్యక్షం వహిస్తే చర్యలు తప్పవని జెన్‌కో ఎండి విజయానంద అన్నారు. బుధవారం ఆయన కాంట్రాక్టర్లతో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ ఆర్టీపీపీ 6వ యూనిట్‌లో నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, నిర్లక్ష్యంచేస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. బిల్లుల చెల్లింపులో ఇబ్బందులేవైనా ఎదురైతే తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని, పరిస్థితులనుబట్టి కాంట్రాక్టర్ల ద్వారా సబ్ కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులపై తగుచర్యలు తీసుకుంటామని అన్నారు. నిర్మాణ పనులను వేగవంతంచేసి డిసెంబర్ 2016 నాటికి విద్యుత్ ఉత్పత్తికి కృషిచేయాలని ఆయన కాంట్రాక్టర్లకు పిలుపునిచ్చారు. అలాగే అధికారులు ఉత్పత్తికి కృషి చేయాలని, పనులు త్వరితగతిన పూర్తయ్యేందుకు అన్ని చర్యలు చేపట్టాలని కోరారు. సమావేశంలో జెన్‌కో డైరెక్టర్ (ప్రాజెక్ట్సు) బలరామ్‌నాయక్, ఆర్టీపీపీ సి ఇ దేవేంద్రనాయక్, ఎస్ ఇలు శేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎండిని కలిసిన యూనియన్ నాయకులు
కాంట్రాక్టు కార్మికులను అన్‌స్కిల్డ్ నుండి సెమీ స్కిల్డ్, స్కిల్డ్ వర్కర్లుగా గుర్తించాలని కోరుతూ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పలువురు యూనియన్ నాయకులు ఎండి విజయానంద్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేస్తూ భోపాల్‌పల్లి ప్రాజెక్టులో అన్‌స్కిల్డ్ కార్మికులను స్కిల్డ్‌గాను, సెమీ స్కిల్డ్‌గాను గుర్తించారని, ఆర్టీపీపీలో కూడా అలాంటి అవకాశాన్ని కల్పించాలని కోరారు. ఈ విషయంపై ఎండి విజయానంద్ సిఇని తక్షణ చర్యలు తీసుకొని ఫైళ్లు తనకు పంపాలని ఆదేశాలు జారీచేశారు. ఎండిని కలిసిన వారిలో యూనియన్ నాయకులు సుబ్బిరెడ్డి, గంగయ్య తదితరులు వున్నారు.
బస్సు సౌకర్యం కల్పించాలని ఎఐఎస్‌ఎఫ్ ఆందోళన
కడప (టౌన్), డిసెంబర్ 2: చెన్నూరు మండల పరిధిలోని గ్రామీణ విద్యార్థులకు వెంటనే బస్సు సౌకర్యం కల్పించాలని ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ఆర్టీసి డిపో వద్ద బుధవారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్ నగర అధ్యక్ష, కార్యదర్శులు పి.అంకుశం, నాయక్‌లు మాట్లాడుతూ చెన్నూరు మండల పరిధిలోని గ్రామాల నుంచి కడప నగరంలోని పాఠశాలలకు, కళాశాలలకు వందలాది మంది విద్యార్థులు వస్తున్నారన్నారు. ఆర్టీసి వారు వారికి దాదాపు 500 బస్సు పాస్‌లు ఇచ్చారని, ఇప్పుడు బస్సులు తమ స్టేజిల వద్ద ఆపకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ నాయకులు శ్రీకాంత్, శివ, రమణ, రాజ, గురుకుమార్, సురేష్ పాల్గొన్నారు.