కడప

టమోటా రైతు కుదేలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,ఆగస్టు 8: జిల్లాలో ప్రధాన వాణిజ్యపంట అయిన టమోటా అధికంగా పండిస్తున్న రైతాంగానికి దళారుల బెడద ఓ పక్క టమోటా రైతాంగాన్ని నిలువునా ముంచేస్తున్నారు. రెండు మూడు నెలల క్రితం జిల్లాలో దాదాపు 15వేల ఎకరాలు టమోటాను రైతులు సాగుచేశారు. టమోటా అధిక దిగుబడి కావడంతో రైతుల అవసరాలను ఆసరా చేసుకుని దళారులు సిండికేట్‌గా మారి మార్కెట్‌లో దళారులు అడిగిన రేటుకే అమ్మకాలు చేయని పక్షంలో దళారులు వాటి కొనుగోలును మొండికేస్తున్నారు. దీంతో రైతులు ఏదో విధంగా వచ్చిన కాడికి సంతృప్తి వ్యక్తం చేస్తూ దళారులకు విక్రయించక తప్పడం లేదు. నిన్నా మొన్నటి వరకు కేజి టమోటా రూ.50లు ధర పలికి, ఒక దశలో రూ.100లకు కూడా ధర పలికింది. జిల్లాలోని చిన్నమండెం, గాలివీడు, రామాపురం, రాయచోటి, సంబేపల్లి, కడప, మైదుకూరు, పులివెందుల, ప్రొద్దుటూరు తదితర ప్రాంతాల్లో విస్తారంగా టమోటాను అధికసాగుబడి చేస్తున్నారు. అయితే రైతులకు సంబంధిత శాఖ అధికారులు రైతులు పండించుకున్న టమోటాను భద్రపరిచేందుకు కోల్డ్ స్టోరేజిలు ఏర్పాటుచేయలేదు. చివరకు పులివెందుల, మైదుకూరు, చిన్నమండెం, సంబేపల్లె ప్రాంతాల్లో మాత్రమే మార్కెట్ సౌకర్యం ఉంటుంది. దళారులు సంబంధిత మార్కెట్ ప్రాంతాల్లో మకాం వేసి రైతులను పిండిపిప్పిచేస్తున్నారు. జిల్లా సరిహద్దుల్లోని గుర్రంకొండ, మదనపల్లె ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయించుకునేవారు. దళారులు జిల్లా రైతులను ధరలను పతనం చేసేందుకు మదనపల్లె, ముదిగుబ్బ, కదిరి, మొలకల చెరువు, అనంతపురం ప్రాంతాలతోపాటు కర్నాటక రాష్ట్రంలోని కిలగట్టు, శ్రీనివాసపురం, చింతామణి ప్రాంతాల నుంచి టమోటా దిగుమతి చేసి జిల్లా రైతాంగాన్ని తీవ్రంగా నష్టపోయే విధంగా చేస్తామని బెదిరిస్తున్నారు. జిల్లాలోని సంబంధిత శాఖ అధికార యంత్రాంగానికి కూడా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలేదని తెలిసికూడా దళారీ వ్యవస్థను నిర్మూలించలేకపోతున్నారు. పేరుకేమో వ్యవసాయ మార్కెట్ కమిటీలు, వ్యవసాయ మార్కెట్ యార్డులు ఉన్నా సంబంధిత మార్కెట్ యార్డుల పాలకవర్గ సభ్యులు ప్రమాణస్వీకారం సమయంలో రైతు ప్రభుత్వమే తమదని , రైతులను ఆదుకోవడమే తమ ధ్యేయమని ,ప్రతి రైతుకు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని వాటిని దాచుకునేందుకు కోల్డ్ స్టోరేజ్‌లు నిర్మిస్తామని తమ ప్రసంగాల్లో ఊక దంపుడు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన వెంటనే రైతుల సంక్షేమాన్ని గాలికి వదులుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా జిల్లాలో ఐదార్లు మార్లు పర్యటించి హార్టికల్చర్ హబ్‌గా మారుస్తామని ప్రకటించారు. చివరకు సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి మాటలను అధికారులు బేఖాతరు చేసి రైతు సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదనేది జగమెరిగిన సత్యం. ఈపరిస్థితుల్లో సంబంధితశాఖ జిల్లా అధికార యంత్రాంగం మొద్దునిద్ర నుంచి మేల్కొని దళారులను అరికట్టి టమోటా రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కృష్ణా పుష్కరాలకు
166 ఆర్టీసీ బస్సులు

ఆంధ్రభూమి బ్యూరో
కడప,ఆగస్టు 8: కృష్ణా పుష్కరాలకు జిల్లా నుంచి కావాల్సిన ఆర్టీసీ బస్సులు ఆర్‌ఎం చెంగల్‌రెడ్డి నేతృత్వంలో సర్వం సిద్ధంచేస్తూ ఈనెల 11వ తేదీ రాత్రి నుంచి 166బస్సులను కర్నూలు, గుంటూరు, విజయవాడలకు నడపనున్నారు. జిల్లాలోని అన్ని డిపోలకు చెందిన బస్సులను కర్నూలుకు 75 బస్సులను, గుంటూరుకు 50 బస్సులను, విజయవాడకు రెగ్యులర్‌గా నడిపే 26 బస్సులతోపాటు అదనంగా 15 బస్సులను నడిపేందుకు ఆర్టీసీ యాజమాన్యం సర్వం సిద్ధం చేసింది. జిల్లాలోని అన్ని డిపోల నుంచి ఈ బస్సుల రాకపోకలు కొనసాగించనున్నారు. ప్రస్తుతం ప్రయాణీకులు చెల్లించే ధర ప్రకారమే టికెట్ ధర నిర్ణయించారు. గతంలో ప్రత్యేక బస్సులంటే చార్జీలు రెట్టింపులో ఉండేవి. ప్రస్తుతం ఆ తరహాలో కాకుండా పుష్కరాలకు వెళ్లే బస్సులకు మామూలు చార్జీల తరహాలోనే అందుబాటులోకి తెచ్చారు. పుష్కరాల్లో ఆర్టీసీ బస్సుల్లో ఎటువంటి అసౌకర్యాలు కలిగించకుండా బస్సులతోపాటు అదనపు సిబ్బందిని నియామకం చేసి 400 మంది అత్యంత అనుభవం కలిగిన డ్రైవర్లు, కండక్టర్లు, అధికారులు సిబ్బందిని నియామకం చేశారు. కర్నూలు జిల్లాకు అత్యంత సమీపంలో ఉన్నందున కృష్ణాపుష్కరాలకు భక్తులు అధికంగా వెళతారని 70 బస్సులు ఏర్పాటుచేశారు. హైదరాబాద్, కర్నూలు, కర్నూలు జిల్లా పరిధిలోని జిల్లానుంచి రెగ్యులర్‌గా తిరిగే బస్సులు యథావిధంగా నడపనున్నారు. గతంలో గోదావరి పుష్కరాలకు జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకున్నారు. అలాగే దేవాదాయశాఖ, పోలీసుశాఖ, వైద్య ఆరోగ్యశాఖ, పురపాలక శాఖ అధికారులు , వైద్యులు, సిబ్బంది కూడా ఈమారు కృష్ణాపుష్కరాలకు భక్తులతో అనుసరించనున్నారు. అత్యవసర చికిత్సలు నిమిత్తం ప్రత్యేకంగా వైద్యులను నియామకం చేశారు. కలెక్టర్ కెవి సత్యనారాయణ ఎప్పటికప్పుడు జిల్లా నుంచి వెళ్లే బస్సులకోసం సంబంధిత అధికారులకు సూచనలు సలహాలు ఇస్తూ అవసరమనుకుంటే కలెక్టరేట్‌లో ప్రత్యేక సెల్స్ ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే జిల్లా నుంచి పోలీసు అధికారులు, పోలీసులు వెళ్లి కర్నూలు, గుంటూరు, విజయవాడ, పుష్కరఘాట్ల వద్ద విధుల్లో పాల్గొన్నారు. జిల్లా నుంచి పుష్కరాలకు వెళ్లే భక్తుల కోసం ప్రైవేట్ ఏజెంట్లు, ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేసి భక్తులను తీసుకెళ్తున్నారు.

సోలార్ పంపుసెట్ల ద్వారా
తాగునీటి బోర్లు

చెన్నూరు, ఆగస్టు 8: రాష్ట్ర ప్రభుత్వం సోలార్ పంపుసెట్ల ద్వారా తాగునీటి వసతి కల్పించేందుకు చెన్నూరు మండలంలో ప్రయోగాత్మకంగా తొమ్మిది గ్రామాల్లో సోలార్ పంపుసెట్ల ద్వారా తాగునీటి పథకాలు ఏర్పాటుచేశారు. మండలంలో రామనపల్లి 1, మోడాలహరిజనవాడ 1, ముండ్లపల్లె 1, దుగ్గనపల్లె 1, శివాల్‌పల్లె 1, కనుపర్తి 1, బలసింగాయపల్లె 1, కొండపేట 1, కొక్కరాయపల్లె 1 సోలార్‌నీటి పథకాలు మంజూరయ్యాయి. ఒక్కొక్క నీటి పథకానికి ప్రభుత్వం ఆర్‌డబ్ల్యుఎస్ ద్వారా రూ.4లక్షల 50వేలు ఖర్చు చేస్తోంది. ఇప్పటికే 5 సోలర్ పంపుసెట్లు ద్వారా తాగునీటి పథకాలు ఏర్పాటుచేశారు. 150 అడుగుల లోతులో బోరు ఏర్పాటుచేసి అక్కడి నుంచి పక్కన 4వేలు లేదా 5వేల లీటర్ల ట్యాంకు ఏర్పాటుచేశారు. దీంతోపాటు సోలార్ పలకలు ఏర్పాటుచేసి అక్కడ వన్ హెచ్‌పి హార్స్‌పవర్ మోటార్ ఏర్పాటు చేశారు. భూమిలో నుంచి ఏర్పాటుచేసిన మోటార్ పైభాగంలో రెండు కొళాయిలను ఏర్పాటు చేశారు. కొళాయిలను ప్రెస్‌చేస్తే నీరు వచ్చే విధంగా ఏర్పాటుచేశారు. సోలార్ పంపుసెట్ ద్వారా ట్యాంకులోకి నీరు వెళ్లే విధంగా, సోలార్ పంపుసెట్‌కు ఆన్ ఆఫ్ ఉండే విధంగా కూడా ఏర్పాటుచేశారు. ట్యాంకులో ఉన్న నీరు కూడా తిరిగి కొళాయిల్లోకి వచ్చే విధంగా అమర్చడంతో గ్రామాల్లో ప్రజలు ఈ పంపుసెట్ల ద్వారా నీటిని పట్టుకుంటున్నారు. ఈ విషయంపై ఆర్‌డబ్ల్యుఎస్ ఏఇ విజయకుమార్‌ను వివరణ కోరగా ప్రభుత్వం నదీ పరివాహక ప్రాంతాల వెంబడి, అలాగే భూగర్భజలాలు పై భాగంలో ఉన్న ప్రాంతాల్లో సోలార్ పద్ధతిలో పంపుసెట్లను ఏర్పాటుచేయడం జరుగుతోందని వీటిని మండలంలో రామనపల్లె, ముండ్లపల్లె, దుగ్గనపల్లె గ్రామాల్లో 100 నుంచి 150 అడుగుల లోతులో ఏర్పాటు చేశామన్నారు. ఎక్కువ లోతులో ఉంటే సోలార్ విద్యుత్ ద్వారా యంత్రాలు పనిచేయడం కష్టమని తెలిపారు. పెన్నానది పరివాహక ప్రాంతాల్లో వీటిని ప్రయోగాత్మకంగా ప్రభుత్వం సోలార్ పంపుసెట్ల ద్వారా ప్రజలకు తాగునీటి సౌకర్యం అందించేందుకు నిధులు మంజూరు చేయగా ఒక్కొక్క సోలార్ పంపుసెట్ నీటి పథకానికి రూ.4.50 లక్షలు మంజూరు చేసిందన్నారు. సోలార్ పలకలు, మోటార్, బోరు, ట్యాంకు కోసం ఈ నిధులు ఖర్చుచేశామన్నారు. ఇప్పటికే ఆరు సోలార్ పంపుసెట్లునీటి పథకాలు ఏర్పాటు చేశామని మరో మూడు పథకాలు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు.

అక్రమ నిర్మాణాలపై కొరడా!

ఆంధ్రభూమి బ్యూరో
కడప,ఆగస్టు 8:కడప నగర పాలక సంస్థలు, మున్సిపాల్టీల్లోని అక్రమ నిర్మాణాలపై కొరఢా ఝళిపించేందుకు రాష్టమ్రున్సిపల్‌శాఖ రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం టాస్క్ఫోర్స్ బృందాలను నియమించింది. ఇందులో భాగంగా ఈనెల 18వ తేదీన మున్సిపల్‌శాఖ టాస్క్ఫోర్స్ బృందం కడపకు రానుంది. ఈ టాస్క్ఫోర్స్ బృందాలు 18,19,20వ తేదీల్లో మూడురోజులపాటు తనిఖీలు చేపట్టనున్నారు. ఇప్పటికే ఈ బృందాలు విశాఖపట్టణం, గుంటూరు, అనంతపురం తదితర ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహిస్తున్నారు. అలాగే కడప కార్పొరేషన్ పరిధిలో దాదాపుగా 4వేల అక్రమ భవనాలు ఉన్నట్లు కడప నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం సేకరించినట్లు తెలుస్తోంది. ఈ టాస్క్ఫోర్స్ బృందాలు నగరంలో నిర్మితమైన భవనాల్లో ఏ భవనాలు నిబంధనలకు విరుద్దంగా నిర్మాణం చేశారని, ప్రస్తుతం జరుగుతున్న భవన నిర్మాణాలను గుర్తిస్తారు. నిబంధనలు అతిక్రమించి నిర్మించినా, నిర్మిస్తున్న భవన యజమానులకు నోటీసులు జారీ చేస్తారు. 10శాతంలోపు నిబంధనలు అతిక్రమించిన భవనాలకు పెనాల్టివిధిస్తారు. దీంతోపాటు సంబంధిత యజమానులపై కేసులు పెట్టాలని కూడా నిర్ణయించినట్లుతెలుస్తోంది. ప్రభుత్వం అక్రమ భవనాలను క్రమబద్దీకరణకు అవకాశం కల్పించింది. ఇంకా అనేక భవనాలు క్రమబద్దీకరణ కోసం దరఖాస్తులు చేసుకోలేదు. దీంతో ఈ టాస్క్ఫోర్స్ బృందాలను నియమించినట్లు తెలుస్తోంది. టాస్క్ఫోర్స్ బృందాలు గుర్తించిన అక్రమభవనాలకు సంబంధించిన బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు, సర్వేయర్లపై వేటు పడనుంది. ఈ అక్రమ భవనాలను బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు, అధికారులు భవన యజమానులతో కుమ్మక్కై ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. ప్లాన్ సరిగా లేకపోయినా ఉన్నట్లుగా రికార్డుల్లో చూపి వదిలివేస్తున్నారు. ఫలితంగా విచ్చలవిడిగా నిబంధనలకు విరుద్దంగా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అయితే టాస్క్ఫోర్స్ బృందాలు వీరిపై చర్యలు తీసుకోనున్నాయి. గుర్తించిన అక్రమ నిర్మాణాలకు సంబంధించిన సర్వేయర్ లైసెన్సులు రద్దుచేయడంతోపాటు ఆ భవనాన్ని పరిశీలించిన బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లపైన కఠిన చర్యలు తీసుకోబోతున్నట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అక్రమభవనాలపైన, అవినీతి అధికారులపై చర్యలకు రంగం సిద్ధం చేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రత్యేక హోదాపై
ప్రభుత్వాల తీరు బాధాకరం

కమలాపురం, ఆగస్టు 8: ఎ పికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడుతున్నాయని, ఇది సరైన పద్దతి కాదని ఎమ్మెల్యే రవీంద్రనాధరెడ్డి విమర్శించారు. ఆయన సోమవారం గడప గడపకు వైసిపి కార్యక్రమంలో పాల్గొ న్నారు. అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ రాయలసీమకు ప్యాకేజి, కడపకు స్టీల్‌ప్లాంట్, రాష్ట్రానికి ప్రత్యేక హోదా వంటి వాటిని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నెరవేర్చడంలో పూర్తిగా విషలమయ్యాయన్నారు. తనపై సిబిఐ కేసులు ఎక్కడ బయట పడతాయోనని ప్రధాని వద్ద బాబు మోకరిల్లుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించి సబ్సిడీ తో కూడిన పరిశ్రమలను మంజూరు చేయాలన్నారు. రాష్ట్ర విభజన బిల్లు మేరకురాయలసీమకు ప్యాకేజి కింద ఏడాదికి లక్ష కోట్లు కేటాయించాలని ఉక్కు ప్యాక్టరీకి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం జిల్లాకు 50కోట్లు మాత్రమే నిధులు మంజూరు చేస్తున్నారని అవి ఏ మూలకు సరిపోవన్నారు. శ్రీశైలం నీటిని కెసికాలువకు విడుదల చేయాలని గండికోటకు 15 టియంసిల నీరు అందించాలని గాలే రు- నగిరి, హంద్రీనీవా, సర్వారాయప్రాజెక్టులను పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేసారు. ఇందులో జిల్లా వైసిపి రైతు విభాగం కన్వీనర్ పుత్తా ప్రసాదరెడ్డి, కొండారెడ్డి పాల్గొన్నారు.

టాస్క్ఫోర్స్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన డిఐజి
రైల్వేకోడూరు, ఆగస్టు 8: పట్టణంలోని ఎర్రచందనం టాస్క్ఫోర్స్ డిఎస్పీ కార్యాలయాన్ని సోమవారం డిఐజీ కాంతారావు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎర్రచందనం అక్రమరవాణాను పూర్తిగా అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చిత్తూరు, కడప జిల్లాల సరిహద్దులోని శేషాచలం అటవీ ప్రాంతంలో నిఘా పెట్టామన్నారు. విస్తృతంగా ప్రత్యేక పోలీస్ బలగాలతో కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గతానికి కన్నా ఈ మధ్య కాలంలో ఎర్రచందనం స్మగ్లింగ్ బాగా తగ్గిందన్నారు. సోమవారం రాత్రి శేషాచలంలో పులంకూరుపెంట ప్రాంతంలో తన సిబ్బందితో కలసి నిద్ర చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.
పోలీసులు, అటవీ, టాస్క్ఫోర్స్‌తో పాటు ఎపిఎస్పీ బెటాలియన్ పోలీసులతో కూలీల కోసం జల్లెడ పడుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కన్జర్వేటర్ డిఎన్ మూర్తి, టాస్క్ఫోర్స్ అధికారులు రమణారెడ్డి, మురళి, శ్రీనివాసరావు, అలీబాషా, ఎఫ్‌ఆర్వో రెడ్డిప్రసాద్, ప్రత్యేక పోలీస్ బలగాలు డిఐజీతో సహ ముమ్మరంగా కూంబింగ్ నిర్వహించేందుకు వెళుతున్నట్లు తెలిపారు.

రుణమాఫీపై రైతుల్లో ఆందోళన..

సుండుపల్లె, ఆగస్టు 8: మండలంలోని రుణమాఫీ పత్రాలు పొందిన రైతులు అధిక సంఖ్యలో ఉండటం వలన రుణమాఫీపై సరైన స్పష్టత రానందున రైతు గుండెల్లో ఆందోళనల మొదలైంది. ప్రభుత్వం అందజేసిన రుణ ఉపశమన పత్రాలు అంతా అయోమయానికి గురిచేస్తున్నాయి. అధికారులు కూడా బాండ్లపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితులలో రైతులు నిస్సహాయ స్థితిని వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లుగా ఎదురుచూసిన రైతులకు రుణమాఫీ పత్రాలు ఎలాంటి ఉపశమనం కలిగించలేదు. కేవలం బాండ్లను చూపి రొట్టెలేసుకోవడం మినహా మరెలాంటి ఫలితం లేదు. రైతు రుణ ఉపశమన పత్రాలు చూపితే డబ్బులు వస్తాయేమోనని బ్యాంకుల వైపు పరుగులు తీస్తున్నారు. బ్యాంకులు మాత్రం లోను ఇచ్చినట్లే ఇచ్చి తిరిగి వడ్డీ రూపంలో తీసుకొని రుణమాఫీ అయిన తరువాత అకౌంట్లలో డబ్బు వస్తుందని చెప్పడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. అయితే మండలంలోని సిండికేట్ బ్యాంకు, ఆంధ్రాబ్యాంకు, స్టేట్‌బ్యాంకుల నుండి సుమారు రైతులు రూ.4.50 కోట్లు రుణం పొంది ఉండటం వలన మొదట విడతలో కొంత మందికి రుణమాఫీ అయిందని చెబుతున్నారు. కానీ రెండో విడత వారికి బాండ్లు రాకపోవడంతో బ్యాంకుల చుట్టూ రైతులు బారులు తీరారు. కానీ బ్యాంకులు మాత్రం వాటిని అప్‌లోడ్ చేసుకునేందుకు సుముఖత వ్యక్తం చేయడంతో ఒకవేళ అప్‌లోడ్ చేసినా డబ్బు ఎప్పుడొస్తుందన్న ప్రశ్నకు బ్యాంకర్లు సరైన సమాధానం ఇవ్వడం లేదు. డబ్బు ఖాతాలో జమ కావడానికి నెలలు పట్టవచ్చునని కొన్ని బ్యాంకులు తేల్చి చెబుతున్నాయని రైతులు మండిపడుతున్నారు. ఇకపోతే చాలా మందికి రుణపత్రాలు అందలేదు. ఈ విషయంలో అధికారులు ఓ అడుగు ముందుకు వేసి రుణ ఉపశమనపత్రాలు రైతులు బ్యాంకుల వద్దకు వెళ్లి ఆ బ్యాంకుల మేనేజర్ ద్వారా సంబంధిత పత్రాలను చూపించి ఆ తరువాత జరిగే సమావేశాల్లో దరఖాస్తు చేసుకోండంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. కానీ రుణ ఉపశమనపత్రాలు రాకపోవడానికి కారణాలు మాత్రం చెప్పలేదు. కేవలం తాము నిమ్మితమాత్రులమేనంటూ అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని రైతులు వాపోతున్నారు. అన్ని అర్హతలు ఉన్నాయి కంప్యూటర్ ద్వారా రుణమాఫీ మంజూరైనట్లు తెలుసుకున్నారు. కానీ రుణ పత్రాలు అందకపోవడంతో మాచిరెడ్డిగారిపల్లె, ముడుంపాడు, పెద్దినేనికాల్వ 6గామాల్లోని రైతులు నిరుత్సాహానికి గురవుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, టీడీపీ నాయకులు మాత్రం రుణమాఫీ చేశామని ఇందుకు బాండ్లు కూడా పంపిణీ చేశామంటూ గొప్పలు చెప్పుకొంటున్నారు. రుణపత్రాలు అయితే పంపిణీ చేశారు కానీ ఈ పత్రాలు డబ్బు ఎప్పుడు జమ అవుతుందన్న అంశంలో స్పష్టత లేదు. అధికారులు కూడా అర్థంకాక తలలు పట్టుకొంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకం వచ్చే అవకాశం మెండుగా ఉంది. రుణపత్రాల పంపిణీలో అయోమయం నెలకొనడంతో పత్రాలు అందని రైతులు ఆ పార్టీ నాయకుల తీరుపై శాపనార్థాలు పెడుతుంటే కొంత మంది ప్రతిపక్ష పార్టీ నాయకులు దానిని చూసి ఆనంద పరవశంలో మునుగుతున్నారు. ఇప్పటికైనా రుణ ఉపశమనపత్రాలు రైతులకు ఎందుకు అందలేదో ఒక వేళ అందకపోవడంతో తదుపరి పరిస్థితి ఏంటి అన్న రైతన్న ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి ప్రభుత్వ పథకాల అమలు విషయంలో అధికార పార్టీ నాయకులు పెద్ద పాత్రను పోషించి వెంటనే రైతుల సమస్యలను తీర్చమని ప్రభుత్వాన్ని రైతులు కోరుకొంటున్నారు.

గ్రామీణ పశువైద్యసేవలే ప్రధానం
గాలివీడు, ఆగస్టు 8: గ్రామీణ పశువులకు సరైన వైద్యసేవలు అందించడమే ప్రధాన అంశమని రాయచోటి పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ గుణశేఖర్‌పిళ్లై పేర్కొన్నారు. సోమవారం మండలంలోని ఎగువగొట్టివీడు గ్రామం గొల్లపల్లె హరిజనవాడ, అరవీడు గ్రామం కూర్మయ్యగారిపల్లెలలో పర్యటించి పశువుల రోగాలపై పశు రైతులతో ఆరా తీశారు. అనంతరం స్థానిక పశువైద్యశాలలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 5 నుండి 12వ తేదీ వరకు నట్టలనివారణకు మందులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 5.50 లక్షల డోసులు చేయనున్నామన్నారు. నూలివీడు పశువైద్యశాలకు ఐదు టన్నులు, గాలివీడు పశువైద్యశాల పరిధిలో 3 టన్నులు మొక్కజొన్నలు 75 శాతం సబ్సిడీతో అందజేస్తున్నామన్నారు. గాలివీడుకు 8 టన్నులు ఎస్‌హెచ్‌జీ, నూలివీడుకు ఐదు టన్నుల ఎస్‌హెచ్‌జీలు కేటాయించడం జరుగుతుందన్నారు. దానామృతం కింద రెండు టన్నుల దాణాలో బెల్లం నీటితో కలిపి పశువులకు మేతగా వేయాలన్నారు. ఒక పశువుకు పది కిలోల ప్రకారం దాణా వేయడం ద్వారా పాలలో నాణ్యత పెరగడంతో పాటు పాల దిగుబడి కూడా గణనీయంగా పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి లక్ష్మీకర్‌రెడ్డి, గోపాలమిత్రలు తదితరులు పాల్గొన్నారు.

ప్రజల ఫిర్యాదులు పరిష్కరించండి

ఆంధ్రభూమి బ్యూరో
కడప,ఆగస్టు 8: మండల స్థాయి అధికారులు ఫిర్యాదులకు ప్రజల నుంచి ఫిర్యాదులొస్తే ప్రజలను కార్యాలయాల చుట్టు తిప్పుకుంటున్నారని, అష్టకష్టాలకోర్చి అర్జీలు తీసుకుని కార్యాలయాలకు వస్తే నిర్లక్ష్యం చేస్తున్నారని, అలాంటి అధికారులపై చర్యలే పరిష్కారమని కలెక్టర్ కెవి సత్యనారాయణ హెచ్చరించారు. సోమవారం నూతన కలెక్టరేట్‌లో మీకోసం, డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాలకు వచ్చిన అర్జీదారులతో కలెక్టర్ ముఖాముఖి మాట్లాడి మండలస్థాయి అధికారులు పనిచేయని కారణంగానే ప్రజలు తనకు ఫిర్యాదు చేస్తున్నారని అధికారులతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. వయోవృద్ధులు, వితంతువులు, వికలాంగులు పెన్షన్ల కోసం వివిధ భూముల సమస్యల్లో భాగంగా ఆపాస్ పుస్తకాలు, భూమి హద్దులు, భూమి కొలతలు తదితర సమస్యలతోపాటు డికెటి పట్టాలు, సాగుచేసుకునే భూములు అన్యాక్రాంతం చేస్తున్నారని అదే ఫిర్యాదులే ప్రతి వారం తనకు రావడం బాధాకరమని ఆయన ఓ దశలో అధికారులపై అసహనం వ్యక్తం చేస్తూ వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. యురేనియం ఫ్యాక్టరీ, గండికోట, ముంపునకు గురైన ప్రాంతాలకు నష్టపరిహారం చెల్లించడం లేదని, ఒంటిమిట్ట చెయ్యేరు బ్యాక్‌వాటర్ కింద గ్రామాల్లోకి నీరు వస్తోందని అధికారులు పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. డికెటి భూములను ఆక్రమించుకుంటున్నారని, అనర్హులు తమ భూములు లాక్కొంటున్నారని తాము దశాబ్దాల కాలం నుంచి సాగుచేసుకుంటుంటే ఆ భూముల హక్కు పత్రాలు తమకు ఇవ్వకుండా పలువురు రెవెన్యూ అధికారులు లంచాలు తీసుకుని పరపతి కలిగిన వారికే తమ భూముల హక్కు పత్రాలు ఇస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఇక రోడ్ల విస్తరణకోసం భూములు తీసుకోవడమే తప్ప తమకు పరిహారం ఇవ్వలేదని కూడా ఫిర్యాదుచేశారు. ఈ సమస్యల తో కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇస్తూమండల స్థాయిలో సమస్యలు పరిష్కారం కాకుంటే సంబంధిత శాఖల జిల్లా ఉన్నతాధికారులు పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శే్వత తెవతియ, డిఆర్వో సులోచన, డ్వామా, డిఆర్‌డిఏ పిడిలు రమేష్, అనిల్‌కుమార్‌రెడ్డి, అగ్రికల్చర్ శాఖ జె డి ఠాగూర్ నాయక్, పంచాయతిరాజ్, ఆర్‌డబ్ల్యుఎస్ సూపరింటెండెంట్ ఇంజనీర్లు నాగేశ్వరరావు, సంజీవరావు, సిపిఓ తిప్పేస్వామి, సోషియల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ సరస్వతి, స్టెప్ సిఇఓ మమత పాల్గొన్నారు.

కడప కార్పొరేషన్ గ్రీవెన్స్‌సెల్
రసాభాస..

కడప,(కలెక్టరేట్)ఆగస్టు 8: కడప నగర కార్పొరేషన్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్ కార్యక్రమం రసాభాసగా మారింది. ఈ కార్యక్రమంలో వినతులు కమిషనర్ చంద్రవౌళీశ్వరరెడ్డి స్వీకరిస్తున్న సమయంలో ఇటీవల తెలుగుదేశంలో చేరిన కార్పొరేటర్లతో కలిపి మొత్తం 18 మంది సభ్యులు తెలుగుదేశంపార్టీ ఫ్లోర్‌లీడర్ విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో పలు సమస్యలపై ఫిర్యాదు చేశారు. 14వ డివిజన్‌లోనే గాకుండా మేయర్‌కు సంబంధించిన అన్ని వార్డుల్లో డిఇ శ్రీనివాసులు పనులకు అనుమతులు ఇస్తున్నారని, మిగతా వార్డుల్లో ఆ పనులకు ఆటంకం కలిగిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనితో దాదాపు అరగంటపాటు డిఇ శ్రీనివాసులుకు, తెలుగుదేశంపార్టీ కార్పొరేటర్ల మధ్య వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. అధికారులు ఒక వర్గానికి వత్తాసు పలకకూడదని కార్పొరేషన్‌లోని అన్ని డివిజన్లలో అభివృద్ధికి దోహదం చేయాలన్నారు. కొన్ని వార్డుల్లో అభివృద్ధి చేసి మిగతా వార్డుల్లో అభివృద్ధికి సహకరించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. అనంతరం కమిషనర్ చంద్రవౌళీళ్వరరెడ్డి సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం టిడిపి కార్పొరేటర్లు కార్పొరేషన్‌లోని అన్ని వార్డుల అభివృద్ధికి అధికారులు పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఆరిఫుల్లా, కార్పొరేటర్లు విశ్వనాథరెడ్డి, షంషీర్, రాజశేఖరరెడ్డి, ఎంఎల్‌ఎన్ సురేష్, ప్రజలు ల్గొన్నారు.