కడప

బ్రహ్మంసాగర్‌లో బయటపడ్డ అవధూత నారాయణరెడ్డిస్వామి ఆలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రొద్దుటూరు, సెప్టెంబర్ 11: బ్రహ్మంసాగర్‌లో నీటిమట్టం తగ్గడంతో అవధూత నారాయణరెడ్డిస్వామి ఆలయం బయటపడింది. ఈ ఆలయాన్ని సందర్శించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు విరివిగా తరలివస్తున్నారు. మూఢ జనులను భక్తిమార్గంలో నడిపించుటకు అవధూతలు మచ్చుకు కొన్ని మహిమలను చూపుతారు. అలాగే అవధూత యోగీంద్ర నారాయణరెడ్డి స్వాములవారు కడపజిల్లా వీరపునాయునిపల్లె మండలంలోని గంగిరెడ్డిపల్లె గ్రామంలో జన్మించి, కర్నూలుజిల్లాలో కలియతిరిగి, కవులు, యోగిపుంగవులకు నియలమైన బ్రహ్మంగారిమఠానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోవున్న పూర్వపు ఓబులరాజుపల్లెకుచేరి ఆయా ప్రాంత ప్రజలందరికీ స్వామివారు అనేక మహిమలు చూపి ఓబులరాజుపల్లెలో పరమపదించారు. అక్కడ స్వామివారికి ఆ గ్రామానికి చెందిన బొమ్ము వంశీయులు సమాధితోపాటు ఆలయాన్ని నిర్మించారు. ఆ తర్వాత బ్రహ్మంసాగర్‌లో మునకకు గురైన ఆరు గ్రామాలు ఖాళీ చేయాల్సి వచ్చింది. ఆ సందర్భంలోనే స్వామివారి దేవాలయాన్ని అలాగే వదిలివేసి ప్రాజెక్టు ఎడమకాలువ గట్టున కొత్తగా పునఃనిర్మించారు. 2006లో సోనియాగాంధీ చేతులమీదుగా ప్రాజెక్టుకు నీటిని తరలించడంతో ఆలయం నీటిలో మునిగిపోయి ఎటువంటి ఆనవాళ్లు కనిపించకుండాపోయింది. ప్రతి ఏడాదీ స్వామివారికి నూతనంగా నిర్మించిన ఆలయంలో ఉత్సవాలు జరిపేవారు. ఆ ఉత్సవాల రోజున స్వామివారి పాత ఆలయ ప్రాంగణం నీటిపైన జ్యోతి రూపంలో వెలుగు కనిపిస్తుండేదని భక్తులు ప్రతి ఏడాదీ చెబుతూ వచ్చేవారు. అందులో భాగంగానే ఈ ఏడాది బ్రహ్మంసాగర్‌లో పూర్తిగా నీరు అడుగంటిపోవడంతో ప్రాజెక్టులో ఉన్న గ్రామాలతోపాటు అవధూత యోగీంధ్ర నారాయణరెడ్డి స్వాములవారి దేవాలయం, ఆయన సమాధి, ఆనాడు ఉపయోగించిన త్రిశూలము, యోగదండము మొదలగు వస్తువులు సైతం చెక్కుచెదరకుండా అలాగే ఉన్నాయి. స్వామివారి దేవాలయం బయటపడిందనే విషయం తెలియడంతో ముంపు గ్రామాలకు చెందిన ప్రజలు వివిధ ప్రాంతాలలో స్థిరపడినప్పటికీ స్వామివారిని దర్శించుకొనేందుకు పెద్దఎత్తున రిజర్వాయర్‌లోని ఆలయానికి తండోపతండాలుగా తరలి వస్తున్నారు. అందులో భాగంగానే భాధ్రపద శుద్ధ ఏకాదశిరోజు సోమవారం నుండి మంగళవారం ఉదయం వరకు సామూహిక పూజలు, భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు బొమ్ము వంశీయులకు చెందిన వీరగోపాల్‌రెడ్డి, క్రిష్ణారెడ్డి తదితర నిర్వాహకులు పేర్కొన్నారు. ఇక్కడకు వచ్చే భక్తాదులందరికీ 24గంటలపాటు భోజన సౌకర్యాన్ని ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. సోమిరెడ్డిపల్లె, బ్రహ్మంగారిమఠం, ఓబుళరాజుపల్లె, చీపాడు గ్రామాలకు చెందిన భజన బృందాల ఆద్వర్యంలో భజన కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహిస్తున్నట్లు కూడా నిర్వాహకులు తెలిపారు. భక్తాదులు వచ్చేందుకు ప్రత్యేక వాహనాలను ఉచితంగా నడుపుతున్నట్లు నిర్వాహకులు పేర్కొంటున్నారు. కావున భక్తాదులు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామివారిని దర్శించుకొని కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.