క్రీడాభూమి

పాక్‌తో క్రికెట్ తప్పుకాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయినా ప్రభుత్వ నిర్ణయమే శిరోధార్యం : సయ్యద్ కిర్మాణీ స్పష్టీకరణ

బెంగళూరు, డిసెంబర్ 29: పాకిస్తాన్‌తో భారత్ క్రికెట్ ఆటడంలో తప్పు లేదని టీమిండియా మాజీ వికెట్‌కీపర్/బ్యాట్స్‌మన్ సయ్యద్ కిర్మాణీ అభిప్రాయపడ్డాడు. అయితే ఈ విషయంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) ప్రభుత్వాన్ని పక్కకు నెట్టలేదని, ఇరు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానిని బిసిసిఐ గౌరవించి తీరాల్సిందేనని ఆయన స్పష్టం చేశాడు. భారత్, పాక్ క్రికెట్ జట్లు ఈ నెలలో ద్వైపాక్షిక సిరీస్‌లో తలపడాలని భావించినప్పటికీ భారత ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో అది కార్యరూపం దాల్చని విషయం విదితమే. బిసిసిఐ స్వయం ప్రతిపత్తి గల సంస్థే అయినప్పటికీ అది ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవించి తీరాల్సిందేనని కిర్మాణీ పేర్కొన్నాడు. ‘పాకిస్తాన్‌తో భారత్ క్రికెట్ ఆడటం తప్పు కాదన్నది నా అభిప్రాయం. అయితే ఇరు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇటు బిసిసిఐ గానీ, అటు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) గానీ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తాయని నేను భావించడం లేదు. ఈ రెండు స్వయం ప్రతిపత్తి గల సంస్థలే అయినప్పటికీ ప్రభుత్వ నిర్ణయాలను గౌరవించి తీరాల్సిందే’ అని బెంగళూరులో మంగళవారం పిటిఐ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కిర్మాణీ పేర్కొన్నాడు.
చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడేందుకు బిసిసిఐ ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తోంది. 2015-2023 మధ్య కాలంలో మొత్తం ఆరు ద్వైపాక్షిక సిరీస్‌లలో ఆడేందుకు బిసిసిఐ, పాక్ క్రికెట్ బోర్డు (పిసిబి) గత ఏడాది అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. 2008లో పాకిస్తాన్ తీవ్రవాదులు ముంబయిలో భీకర దాడులకు తెగబడి నరమేథం సృష్టించిన నాటి నుంచి భారత జట్టు పాకిస్తాన్‌తో ఒక్కసారి కూడా పూర్తిస్థాయి ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌లో ఆడని విషయం తెలిసిందే. అయితే భారత్, పాక్ మధ్య ఇకముందైనా రాజకీయ సంబంధాలు మెరుగుపడతాయని ఎదురుచూస్తున్నట్లు కిర్మాణీ చెప్పాడు. ‘ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గి రాజకీయ సంబంధాలు మెరుపడతాయని నేను ఎదురుచూస్తున్నా. సుహృద్భావంతో మెలగాల్సిన ఇరుగు పొరుగు దేశాలు ఎందుకు ఘర్షణ పడుతున్నాయో అర్థం కావడం లేదు. ఈ ఘర్షణలు ఎందుకు?, వాటి వల్ల ఒరిగేదేమిటి?’ అని ఆయన ప్రశ్నించాడు.
భారత్, పాక్ క్రికెట్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లను ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎప్పుడూ ఆస్వాదిస్తుంటారని, రాజకీయాలకు అతీతంగా ఇరు దేశాల ఆటగాళ్లు ఎప్పుడూ ఎంతో కలివిడిగా ఉంటారని, అసలు సిసలైన క్రీడా స్ఫూర్తి ఇదేనని ఈ ఏడాది కల్నల్ సికె.నాయుడు జీవిత సాఫల్య పురస్కారానికి నామినేట్ అయిన కిర్మాణీ పేర్కొన్నాడు.