ఖమ్మం

తాజా, మాజీ మంత్రుల మధ్య పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మే 5: పాలేరు ఉప ఎన్నిక రాష్ట్ర మంత్రులకు, మాజీ మంత్రులకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఉప ఎన్నికల్లో గెలుపొందేందుకు అధికార పార్టీ రాష్ట్ర మంత్రులను, శాసనసభ్యులను ప్రచారం కోసం వినియోగిస్తుండగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు, ప్రస్తుత శాసనసభ్యులను వినియోగిస్తున్నారు. దీంతో ఈ ఉప ఎన్నిక తాజా, మాజీ మంత్రులకు మధ్య పోటీగా మారింది. అధికార పార్టీ తరుపున స్వయంగా రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పోటీలో ఉండగా ఆయనకు మద్దతుగా రాష్ట్ర మంత్రులు కెటిఆర్, కడియం శ్రీహరి, మహేందర్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, జగదీశ్వరరెడ్డి, ఈటెల రాజేందర్‌లతో పాటు దాదాపు 10 మందికి పైగా శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు ప్రచారంలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి సతీమణి సుచరితరెడ్డి పోటీలో ఉండగా ఆమెకు మద్దతుగా మాజీ మంత్రులు సంభాని చంద్రశేఖర్, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, సబిత ఇంద్రారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి లతో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ, రాష్ట్ర నేతలు మల్లు రవితో పాటు శాసనసభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రచారంలో పాల్గొన్నారు. ఇరు పార్టీలు తమ ప్రధాన నేతలను రంగంలోకి దింపడంతో గ్రామాల్లో వాడివేడిగా ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీ నేతలు భారీ కాన్వాయ్‌తో ప్రచారం నిర్వహిస్తుండగా కాంగ్రెస్ అభ్యర్థి కూడా అదే స్థాయిలో గ్రామాల్లోకి వెళ్తున్నారు.
ఇదిలా ఉండగా ఒకే గ్రామంలో ఒకే రోజు ఇరుపార్టీల నేతలు ప్రచారం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రజల కోసం ప్రత్యర్థులు ఏమి చేయలేదని ఆరోపణలు చేస్తూ ప్రచారం చేస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు గ్రామంలోకి వచ్చి ప్రచారం చేయడంతో ప్రజలు అయోమయానికి లోనవుతున్నారు. వీరిద్దరికి తోడు సిపిఎం అభ్యర్థి పోతినేని సుదర్శన్‌రావుకు మద్దతుగా సిపిఎం, సిపిఐ రాష్ట్ర నేతలు రెండు పార్టీల వైఖరిని ఎండగడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించారని ఆరోపిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. గత పాలకులు ఇచ్చిన హామీలను పట్టించుకోలేదని చెప్తూనే ప్రస్తుత పాలకులు మాటల గారడీ చేస్తున్నారని దుయ్యబడుతున్నారు. అయితే టిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థుల మాదిరిగా కాకుండా ఓటర్ల వద్దకే వెళ్తూ సిపిఎం నేతలు ప్రచారం నిర్వహిస్తుండడం గమనార్హం. దీంతో ఎవరు ఏమి చెప్తున్నారో తెలియక ప్రజలు అయోమయానికి లోనవుతున్నారు.

తెలంగాణలో కరవు ఎమర్జెన్సీని ప్రకటించాలి
ఖమ్మం, మే 5: రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల ఎమర్జెన్సీకి స్వస్తిచెప్పి కరవు ఎమర్జెన్సీని ప్రకటించి తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బివి రాఘవులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం తల్లంపాడులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కరవుతో వేలాదిమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వడదెబ్బ కారణంగా 1500 మంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. నీళ్లు, మేతలేక జీవాలు, పశువులు మృత్యువాత పడుతున్నాయని ఆరోపించారు. ఇటీవల కురిసిన వడగాడ్పులు, అకాలవర్షానికి రాష్ట్రంలో రైతులకు తీరని నష్టం వాటిల్లిందని, కరవు సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. నీటి ఎద్దడి ఉన్నచోట కనీసం ట్యాంకర్ల ద్వారానైనా నీటిని సరఫరా చేయకపోవడంతో నీటి వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రం మొత్తం కరవుతో అల్లాడిపోతుంటే ప్రభుత్వం కేవలం 235 మండలాలనే కరవు మండలాలుగా ప్రకటించడం శోచనీయమన్నారు. పాలేరు ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావును గెలిపించుకునేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు చూపిస్తున్న శ్రద్ధ కరవుపై చూపించడం లేదని ఆయన విమర్శించారు. ప్రముఖ జర్నలిస్టు సాయినాధ్ ‘కొంత మంది కరవును ప్రేమిస్తారు’ అన్న పుస్తకాన్ని రాశారని గుర్తు చేశారు. మిషన్ కాకతీయ పనులను యంత్రాలకు అప్పగించిన ప్రభుత్వం కనీసం రోజువారి కూలీ 195 రూపాయల కూలీ కల్పించడంలో కూడా ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. ఆపరేషన్ ఆకర్ష్ చాలా ప్రమాదకరమైందని, ప్రధాన ప్రతిపక్షం లేకుండా చూడాలని ప్రభుత్వం చూస్తుందని విమర్శించారు. పాలేరు ఉప ఎన్నికలు వామపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయన్నారు. రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో నిజమైన ప్రతిపక్షం అవసరంగా భావించామని, అందుకే ప్రజాస్వామ్య శక్తుల ఐక్యప్రతిపక్షాన్ని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణాలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తే ప్రభుత్వం గంగలో కలిసిపోతుందన్నారు. బంగారు తెలంగాణ సాధించాలంటే కోటి ఎకరాలకు నీరందిస్తేనే సాధ్యమవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఒంటెద్దు పోకడలతో అది సాధ్యం కాదన్నారు. అక్రమమార్గంలో పాలేరు ఉప ఎన్నికల్లో తుమ్మలను గెలిపించుకొని ఎదురులేని శక్తిగా ఎదగాలని చూస్తుందని విమర్శించారు. టిఆర్‌ఎస్ స్పీడ్‌కు త్వరలోనే బ్రేకులు వేస్తామన్నారు. పాలేరులో వామపక్షాల తరపున సిపిఎం అభ్యర్థి పోతినేని సుదర్శన్‌రావును గెలిపించుకొని బలమైన ప్రత్యామ్నాయ ప్రతిపక్షాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

వందమంది కెటిఆర్, కెసిఆర్‌లు వచ్చినా
కాంగ్రెస్ గెలుపు ఖాయం
నేలకొండపల్లి, మే 5: పాలేరు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపును ఆపలేరని, వందమంది కెటిఆర్‌లు, వందమంది కెసిఆర్‌లు వచ్చినా పాలేరు కాల్వలో కొట్టుకుపోతారని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క జోస్యం చెప్పారు. గురువారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుచరితారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా బోదులబండ, పైనంపల్లి, రామచంద్రాపురం, సుద్దేపల్లి గ్రామాల్లో వైఎస్‌ఆర్, టిడిపి, కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో భట్టి మాట్లాడుతూ టిఆర్‌ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు పాలేరు అభివృద్ధి కంటే పాలేరు ప్రజలను నాశనం చేశారని ఆరోపించారు. దళారులను, కాంట్రాక్టర్లను తుమ్మల టిఆర్‌ఎస్ పార్టీలో చేర్పించుకోవడం వల్ల జిల్లాలో రాజకీయం కలుషితం చెందిందన్నారు. తుమ్మల పాలేరులో గెలిస్తే పాలేరు ప్రజలను పెద్ద పాలేరుగా చేస్తారని, ప్రజల బలంకంటే దనబలం ఎక్కువగా ఉన్న తుమ్మలకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. పాలేరు ప్రజలకు డబ్బుకి, అధికారానికి లొంగేవారు కాదని, విశ్వాసం, నమ్మకానికి మారుపేరన్నారు. అధికార దర్పంతో తుమ్మల బెదిరిస్తే ప్రజలు చైతన్యవంతులై తిరిగి తుమ్మలకు బుద్ధి చెబుతారన్నారు. ప్రజల మనిషి స్వర్గీయ రాంరెడ్డి వెంకటరెడ్డి అని, ఆయన రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని, ఈ ఎన్నికల్లో సుచరితారెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. 2019 ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ప్రభుత్వ పథకానికి పాలేరు ఎన్నికలే నాంది పలకాలన్నారు. ఈ ఎన్నికలతో పాలేరు దిశ, దశ, ఉద్దేశిత మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా అధ్యక్షుడు తుళ్ళూరి బ్రహ్మయ్య, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, టిడిపి జిల్లా నాయకులు జీవన్, భవానిశంకర్, కెఎంసి మాజీ చైర్మన్ ఉన్నం బ్రహ్మయ్య, ముదిగొండ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్మినేని రమేష్, నేలకొండపల్లి గ్రామ సర్పంచ్ వంగవీటి నాగేశ్వరరావు, ఉప సర్పంచ్ రాజపుత్ర శ్రీనివాస్‌సింగ్, టిడిపి మండల అధ్యక్షుడు అరకట్ల కొండల్‌రావు, గోగినేని సీతారామారావు, నెల్లూరి లీలాప్రసాద్, రాఘవరావు, సూపరనేని రామకృష్ణ, వెంకన్న, గాంధీ, నాగరాజు, సత్యం, శ్రీను, ప్రసాద్ పాల్గొన్నారు.

తిరుమలాయపాలెం, మే 5: ప్రజలను మభ్య పెడుతూ చేయని అభివృద్ధిని చేసినట్లు ప్రచారం చేసుకుంటూ ముఖ్యమంత్రి కెసిఆర్ కాలం గడిపేస్తున్నారని మాజీ ఎంపి వివేక్, పొన్నం ప్రభాకర్‌లు ఆరోపించారు. మండల పరిధిలోని కాకరవాయి గ్రామంలో గురువారం టిడిపి, వైసిపిలు బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సుచరిత విజయాన్ని కాంక్షిస్తూ విస్తృత ప్రచారం నిర్వహించారు. రెండు సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వ హయాంలో ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదని విమర్శించారు. అన్ని పాత్రలు పోషిస్తూ కెసిఆర్ పిట్టల దొరలా మాటలు చెప్తూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఇచ్చిన వాగ్దానాలను తుంగలోకి తొక్కారన్నారు. దళితులకు మూడెకరాల భూమి నీటిమాటగా మిగిలిపోయిందని ఎద్దెవా చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సుచరిత పోటీ చేస్తే ఏ మాత్రం సానుభూతి చూపించక మంత్రిని ఎన్నికల బరిలో దింపడం అన్యాయం అన్నారు. మంత్రులంతా ఎన్నికల ప్రచారం అంటూ గ్రామాల్లో తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
ఈ సందర్భంగా రాంరెడ్డి వెంకటరెడ్డి కుమార్తెలు, బంధులు ఎదుళ్ళచెరువు శివారు తాండాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఆర్ దామోదర్‌రెడ్డి, మృత్యుంజయ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బెల్లం శ్రీను, ఇజ్రాయల్ అనితారెడ్డి, లక్ష్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రజలను మభ్యపెడుతున్న కెసిఆర్

ఓటరు చైతన్య వాహనాలు ప్రారంభం
ఖానాపురం హవేలి, మే 5: ఈ నెల 16న జరిగే పాలేరు ఉప ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటరు అవగాహన కోసం ప్రత్యేకంగా ఓటరు చైతన్య వాహనాలను ప్రారంభించినట్లు జెసి దివ్య పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని గురువారం ఓటరు అవగాహన కార్యక్రమంలో భాగంగా మూడు వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాలేరు నియోజకవర్గంలో ప్రతి ఓటరుకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సాధారణ ఎన్నికల పరిశీలకులు ఆర్.పళనిస్వామి, ఎన్నికల వ్యయ పరిశీలకులు శ్రవణ్‌కుమార్, స్వీప్ నోడల్ అధికారి నగరపాలక కమిషనర్ గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

రైలు నుంచి పడి
వ్యక్తి మృతి
ఖమ్మం(క్రైం), మే 5: ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన నగరంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్ సమీపంలో గురువారం చోటుచేసుకొంది. రైల్వే ఎస్‌ఐ నరేష్ కథనం ప్రకారం రాజస్థాన్ రాష్ట్రం గోపాల్‌పూర్‌కు చెందిన బన్వర్‌లాల్(22) చిత్తూరులోని గ్రానైట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. జైపూర్ ఎక్స్‌ప్రెస్‌లో జనరల్ బోగిలో ప్రయాణిస్తూ రద్దీగా ఉండటంతో మెట్లవద్ద ఉన్న అతను ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. అతని వెంట ఉన్న బంధువులు ఖమ్మంలో రైల్ నిలిపివేసి విషయాన్ని రైల్వే పోలీసులకు తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

చోరీలకు పాల్పడుతున్న
యువకుని అరెస్ట్
ఖమ్మం(క్రైం), మే 5: నగరంలోని మూడు పోలీస్‌స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న యువకుడిని త్రీటౌన్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డిఎస్పీ సురేష్‌కుమార్ వివరాలు వెల్లడించారు. ఖిల్లా బజార్‌కు చెందిన మతీన్(20) చిన్నవయస్సు నుంచే వ్యసనాలకు బానిసై నగరంలో దొంగతనాలు చేస్తున్నాడు. ఇళ్ళతో పాటు రోడ్లపై తిరిగే మహిళల నుంచి బంగారు ఆభరణాలు, వస్తువులు దొంగిలిస్తున్నాడు. ఈ క్రమంలో నయాబజార్ సెంటర్‌లో పెట్రోలింగ్ చేస్తున్న త్రీటౌన్ పోలీసులకు అనుమానస్పదంగా తిరుగుతున్న మతీన్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా చోరీల విషయం బయటపడింది. ఇతని నుంచి రెండు లక్షల రూపాయల విలువైన వస్తువులను స్వాదీనం చేసుకొని కోర్ట్‌కు రిమాండ్ చేసినట్లు డిఎస్పీ తెలిపారు. సమావేశంలో సిఐ మొగిలి, ఎస్‌ఐ ఇంద్రాసేనారెడ్డి, మల్లయ్య, సిబ్బంది పాల్గొన్నారు.