ఖమ్మం

టీఆర్‌ఎస్‌తోనే తెలంగాణ సమగ్రాభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూలూరుపాడు, అక్టోబర్ 14: టిఆర్‌ఎస్ పార్టీతోనే తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమని తాజామాజీ ఎమ్మెల్యే, వైరా నియోజక వర్గ టిఆర్‌ఎస్ అభ్యర్ధి బానోతు మదన్‌లాల్ అన్నారు. వెంగన్నపాలెంలో పార్టీ జిల్లా నాయకులు యల్లంకి సత్యనారాయణ జ్వరంతో బాధపడుతుండగా ఆయనను ఆదివారం మదన్‌లాల్ పరామర్శించారు. అనంతరం పాపకొల్లుకు చెందిన పార్టీ నాయకుడు కొదుమూరి కోటేశ్వరరావు పార్టీతోపాటు మదన్‌లాల్‌పై ఉన్న అభిమానంతో ఎన్నికల ప్రచారం కోసం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మదన్‌లాల్ ఫోటోలు ఉన్న గులాబీ టీషర్టులను సొంత ఖర్చులతో అందజేయగా వాటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మదన్‌లాల్ మాట్లాడుతూ నాలుగున్నరేళ్ల టిఆర్‌ఎస్ ప్రభుత్వం హాయాంలో ముఖ్యమంత్రి కెసిఆర్ అనేక ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. మారుమూలు గ్రామాల వౌలిక సదుపాయాలకు పెద్దపీట వేసిన ఘనత కెసిఆర్‌కే దక్కిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఇతరుల నివాస ప్రాంతాల్లోని అంతర్గత రహదారులకు రూ కోట్లు వెచ్చించి సిమెంటు రోడ్లు వేయించటం జరిగిందన్నారు. మండలంలోని పడమట నర్సాపురం నుంచి బేతాళపాడు వరకు బిటి రోడ్డు నిర్మాణం, కాకర్ల పిఆర్ రోడ్డు నుంచి గురవాగుతండా మీదుగా గోపాతండా వరకు బిటి రోడ్డును నిర్మించటం జరిగిందన్నారు. ప్రస్తుతం రూ 2కోట్ల వ్యయంతో అనంతారం నుంచి మొద్దులగూడెం మీదుగా శంభునిగూడెం వరకు బిటి రోడ్డు పనులు వేగంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. పాపకొల్లు హరిజనవాడ క్రాస్‌రోడ్డు నుంచి రాజారావుపేట వరకు కూడా బిటి రోడ్డును నిర్మించినట్లు తెలిపారు. పింఛన్లు, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అర్హులకు అందించి ఆడపిల్లల వివాహాలకు ప్రభుత్వం ఆర్ధిక చేయూతను ఇచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లోని విద్యార్ధులకు సన్నబియ్యంతో ఆహారాన్ని అందిస్తున్న ఘనత కూడా టిఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. విద్య, వైద్యం, తాగు, సాగు నీటి రంగాలకు కెసిఆర్ అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చారని తెలిపారు. రైతుబంధు పథకం ద్వారా రైతులను ఆదుకోవటం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి దృష్ట్యా ప్రజలు టిఆర్‌ఎస్ పార్టీని ఆదరించి ఎన్నికల్లో తిరిగి తనను గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మచ్చా వెంకటేశ్వరరావు, ఎంపిపి మూడు చిట్టిబాబు, వైస్ ఎంపిపి సీతాకుమారి, ఏన్కూరు మార్కెట్ కమిటీ చైర్మన్ సకౄనాయక్, మండల అధ్యక్షుడు చావా వెంకట్రామారావు, ఎంపిటిసి సాయిల నాగేశ్వరరావు, దుద్దుకూరి నాగేశ్వరరావు, జగన్, స్వామి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

ఇల్లందు న్యూడెమోక్రసీ అభ్యర్థిగా గుమ్మడి నర్సయ్య
గార్ల, అక్టోబర్ 14: సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఇల్లందు నియోజక వర్గ అభ్యర్థిగా గుమ్మడి నర్సయ్య పేరును ఖరారు చేసినట్లు పార్టీ రాష్ట్ర కమిటీ ప్రకటించింది. ఇల్లందు నియోజక వర్గ నుంచి గుమ్మడి నర్సయ్య గతంలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. నియోజక వర్గంలో ప్రజా సమస్యలు, ఆదివాసీల హక్కుల సాధనకై అనేక ఉద్యమాలు నడిపారు. నియోజక ప్రజలకు సుపరిచుతుడైన నర్సయ్య నిరాడంబరుగా పేరెన్నిక గావించిన ఆయనను న్యూడెమోక్రసీ పార్టీ నుంచి రంగంలో నిలిపింది. కాగా గుమ్మడి నర్సయ్యకు బీఎల్‌ఎఫ్ మద్దతు ప్రకటించింది. దీంతో ఇల్లందు నియోజక వర్గంలో రాజకీయ సమీకరణలు మారనున్నాయి. ఇల్లందుతో పాటు పినపాక, పాలేరు, సత్తుపల్లి, అశ్వరావుపేట, మంచిర్యాల, ములుగు, మహబూబాబాద్ నియోజక వర్గాలకు అభ్యర్థులను పార్టీ ప్రకటించింది.

కనె్నబోయిన అంజయ్యకు కీర్తి అవార్డు
చింతకాని, అక్టోబర్ 14: మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామానికి చెందిన హేతువాది, రచయిత, గాయకుడు కనె్నబోయిన అంజయ్యకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన కీర్తి అవార్డు ప్రకటించింది. ఈ నేపథ్యంలో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ యస్వీ సత్యనారాయణ అంజయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. గాయకుడు, రచయిత, హేతువాదిగా అంజయ్య చేస్తున్న సేవలను కొనియాడారు. కీర్తి అవార్డు పొందినందుకు అనందంగా ఉందన్నారు. జానపథ గీతాలు, రచనలు చేసిన అంజయ్య అవార్డు రావడం పట్ల మండల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

పార్టీ ఆదేశిస్తే వైరా నుంచి పోటీ చేస్తా
* బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి రేష్మారాథోడ్
జూలూరుపాడు, అక్టోబర్ 14: రానున్న ఎన్నికల్లో పార్టీ ఆదేశిస్తే వైరా నియోజక వర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆ పార్టీ బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి రేష్మారాథోడ్ తెలిపారు. జూలూరుపాడులోని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిలుకూరి రమేష్ నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం దేశంలో పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తుందని అన్నారు. ఇందులో భాగంగానే ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో అమలు పరచటంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని తెలిపారు. కేంద్రం విడుదల చేసే నిధులను పక్కదోవ పట్టించటంతోపాటు నిధులను రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు వినియోగిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి పథకాలను అమలు చేయటంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరధ పథకాలకు రూ కోట్ల బడ్జెట్‌ను కేటాయించి అనుచరులకు పనులను అప్పటించి కమీషన్ పథకాలుగా మార్చారని ఆమె ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ముందుస్తు ఎన్నికలకు వెళ్లిన కెసిఆర్ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కుటుంబ పాలన సాగించిన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు, టిఆర్‌ఎస్ పార్టీ పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, ఎన్నికల్లో గుణపాఠం చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని అన్నారు. నరేంద్రమోదీ పాలనను దేశ వ్యాప్తంగా ప్రజలు స్వాగతిస్తున్నారని, ఇందుకు పలు రాష్ట్రాల్లో పార్టీ విజయం సాధించటమేనని అన్నారు. రాష్ట్రంలో కూడా బిజెపి విజయం ఖాయమని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు శిరిపురపు ప్రసాద్, సుబ్బూ, జాట్ల నరేష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.